Month: January 2019

నేనూ నువ్వూ (POEM )

Posted on Updated on

నేనూ నువ్వూ

==========

నేనేమో

చిటికెడు వెలుగును కోరుకున్నాను

నువ్వేమో

పిడికెడు చల్లని వెన్నెలను మోసుకొచ్చావు

నేనేమో

దాహం తీరేందుకు దోసెడు నీళ్ళడిగాను

నువ్వేమో

వానా కాలాన్నే వెంటేసు కొచ్చావు

నేనేమో

భూమిలో నాటడానికో విత్తనాన్ని ఆశించాను

నువ్వేమో

ఏకంగా పంటనే పరిచేసావు

నేనేమో

చిన్న గెలుపు కోసం తపన పడ్డాను

నువ్వేమో

వాకిట్లో విజయ తోరణమే కట్టావు

ఇంతకూ

నేనెవరు నువ్వెవరు

నేనేమో చిన్ని ఆశను

నువ్వేమో కొండంత ఆత్మవిశ్వాసానివి

-వారాల ఆనంద్

జయాపజయాలు (ARTICLE NAMASTHE TELANGANA)

Posted on

జయాపజయాలు
( నమస్తే తెలంగాణ ఎడిట్ పేజ్)

ప్రస్తుతం భారతీయ సినిమా రంగంలో బయోపిక్ (జీవిత చిత్రాలు) సినిమాల గాలి వీస్తున్నది. హిందీ తెలుగు సినీ రంగాలతో పాటు అనేక భారతీయ భాషల్లో ఈ బయోపిక్‌ల ధోరణి కొనసాగుతున్నది. అయితే ఇప్పుడు నిర్మాణమవుతున్న బయోపిక్ సినిమాలు కేవలం సిని మా కోసమే జరుగడం లేదు. వ్యక్తి జీవిత వాస్తవాలతో పాటు ఆయా కాలపు సామాజిక చరిత్ర ను వక్రీకరణకు లోనుచేసి నిర్మాతలు దర్శకులు అపప్రధను మూటగట్టుకుంటున్నారు. అంతేకాకుండా తాము సినిమాలుగా రూపొందించిన వారి జీవితాల కూ మురికి కూడా అంటిస్తుండటం విషాదం. ప్రపంచ సినిమా చరిత్రలో కూడా బయోపిక్ సినిమాలది ప్రధాన పాత్రే. అక్కడా వాస్తవాలు వక్రీకరనలు చోటుచేసుకున్నాయి. అనేక బయోపిక్ సినిమా లు విజయాలు అపజయాలు అందుకున్నాయి. కానీ ఒక స్పష్టమైన రాజకీయ ఉద్దేశంతో ఆ వ్యక్తి జీవితంలోని ప్రతిభను విజయాలను కాకుండా ఒక నెగెటివ్ అంశాన్ని ఆధారం చేసుకొని చిత్రించాలనుకున్నప్పు డు ఫలితాలు మరింత అధ్వాన్నంగా ఉంటాయి. ఇటీవలి యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సినిమా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ జీవితం ఆధారంగా నిర్మించబడింది. ఆయనకు మీడియా సలహాదారుగా ఉన్న సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా సినిమా తీశామని నిర్మాతలు చెప్పుకున్నారు. కానీ సినిమా మొత్తంలో మన్మోహన్ జీవితానికి సంజయ్ బారు పుస్తకానికి అనేక అంశాల్లో పొంతన లేదు. రచయిత గా సంజయ్ బారూకు దర్శకుడిగా విజయ్ గుట్టేకి ఉన్న భావ స్వేచ్ఛను కాదనలేం. వారు మన్మోహన్‌ను ఆవిష్కరించాలుచుకున్న కోణం వారిష్టం. కానీ యూపీఏ మొదటి విడుత పాలన కాలం నాటి అంశం సినిమాగా తీస్తున్నప్పుడు ప్రధాన పాత్రధారి మన్మోహన్ మాట నడక నడవడిక ఇప్పటి మన్మోహన్ సిం గ్‌లా చూపించడంలో దర్శకనిర్మాతల లక్ష్యం స్పష్టం. ఆయన అకస్మాత్తు ప్రధానే కాదు బలహీనమైన ప్రధా ని అని చెప్పకనే చెప్పడం కనిపిస్తుంది.
ఇటీవల తెలుగులో విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ ఆర్థిక జయాపజయాల సంగతి పక్కనపెడితే బయోపి క్ సినిమాగా అది విఫల ప్రయత్నంగా చెప్పాలి. మొత్తం సినిమా బాలకృష్ణ సినిమాగా కనిపించింది తప్ప ఎన్టీఆర్ జీవిత సినిమాగా లేకపోవడం ఇందు లో ప్రధానమైన లోపం. మంచి బయోపిక్ సినిమాకు పాత్రకు పోలికలున్న నటుడితో పాటు మంచి వాచకం నటనా సామర్థ్యం ఉన్న నటుడు కూడా కావాలి. ఏది లోపించినా అది వైఫల్యంగానే మిగులుతుంది. అంతేకాకుండా ఎన్టీఆర్ఏ ఎన్నార్‌లతో పాటు తెలుగు సిని మారంగంలో ప్రధానమైన మరో హీరో కాంతారావు కు సినిమాలో స్థానం లేకపోవడంలాంటి ఇతర లోటుపాట్లు కూడా ఎన్టీఆర్ బయోపిక్‌ను అసంపూర్ణ అసమగ్ర సినిమాగా మిగిల్చాయి. ఇక్కడొక అంతర్జాతీ య సినిమా గురించి చెప్పుకోవాలి. 2007 లో టాడ్ హైన్స్ అనే దర్శకుడు సుప్రసిద్ధ సంగీతకారుడు బాబ్ డిలాన్ బయోపిక్ తీశాడు. ఐయాం నాట్ దేర్ అన్న ఆ సినిమాలో బాబ్ డిలాన్ వివిధ రూపాలను పోషించేందుకు కేట్ బ్లాంచెట్క్రిసియన్ బాలేహీత్ లేద్జర్ లాంటి పలువురు నటులను తీసుకున్నాడు. దాంతో మొత్తం సినిమా కు సంపూర్ణత్వం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద గుర్తింపు ను అందుకున్నది. అంటే బయోపిక్‌లో పాత్రలు ఆయా కాలాల వయసులను ప్రతిబింబించాలి. ఇది ఒక విజయవంతమైన అం శంగా ఐ యాం నాట్ దేర్ నిరూపించింది. విజయవంతమైన ప్రయత్నాలే కాకుండా చేదైన ఫలితాలను ఇచ్చి న బయోపిక్‌లు ప్రపంచ సినిమా ల్లో కూడా ఉన్నాయి. ఎంతో ఆర్భాటంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రారంభ సినిమాగా ప్రదర్శించిన గ్రేస్ ఆఫ్ మొనాకోలో నికోల్ కిడ్మాన్ లాంటి పెద్ద నటుడు నటించినప్పటికీ దాన్ని విమర్శకులు చీల్చిచెండాడా రు. ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం పొందిన వికీలీక్స్ జూలియన్ అస్సాంజేపై తీసిన ఫిఫ్త్ ఎస్టేట్ కూడా పెద్ద డిజాస్టర్.
నిజానికి కథాత్మక సినిమా నిర్మాణంతో పోలిస్తే జీవితచరిత్రల ఆధారంగా నిర్మించే సినిమాలను రూపొందించడం సులభమైనదేమీ కాదు. సాధారణం గా ఇలాంటి సినిమాల్లో కథను చెబుతాం,సినిమా లో చూపిస్తాం కాబట్టి రూపొందించదలచుకున్న వ్యక్తి జీవితంలోని సారాంశాన్ని లేదా ముఖ్యమైన ఒక అంశాన్ని తీసుకొని సినిమాను అల్లుకుంటూ పోయినప్పుడే ఆ సినిమా ఆసక్తికరంగా రూపొంది ప్రేక్షకు లను ఆకట్టుకుంటుంది. అందుకే సినిమాకు అత్యంత ప్రధానమైంది స్క్రీన్ ప్లే. దానిపైన ప్రధాన కృషి పెట్టినప్పుడే సినిమా గోప్పగా రూపొందుతుంది. బయోపిక్‌లో అతి నాటకీయత కృత్రిమంగా రూపొందే అం శాలు చరిత్రను వక్రీకరించే అంశాలు జొప్పిస్తే సిని మా అసలుకే మోసం వస్తుంది. విజయవంతమైన బయోపిక్‌ల గురించి చెప్పుకున్నప్పుడు అటెన్‌బరో రూపొందించిన గాంధీ సిని మా మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి ని ఆర్జించింది. ఆర్థిక విజయంతో పాటు అనేక ఆస్కా ర్ అవార్డులనూ గాంధీ సినిమా సొంతం చేసుకున్న ది. అందులో గాంధీగా వేసిన బెన్ కింగ్ స్లే తన అజరామరమైన నటనతో సినిమాకు జీవం పోశారు. ఆ సినిమా ఒక తరాన్ని ప్రభావితం చేసింది. ఇక ఇటీవ లికాలంలో స్పిల్బర్గ్ రూపొందించిన అబ్ర హం లింకన్ విజయవంతమైన సినిమాగా రూపొందింది. ఇక బ్రిటన్ 6 వ కింగ్ జార్జ్ జీవిత చిత్రం కిం గ్స్ స్పీచ్. ఆర్థికంగానూ ఆస్కార్ అవార్డులు అందుకోవడంలోనూ విజయం సాధించింది. అట్లే పయాని స్ట్ సినిమా కూడా బయోపిక్‌లలో విజయవంతమై నది. మనదేశంలో క్రీడాకారుల జీవితాలపైన రూపొందిన దంగల్ భాగ్ మిల్కాే మేరీ కొం ఎం.ఎస్. ధోని లాంటి సినిమాలు విజయాన్నిఅందుకున్నాయి.బయోపిక్ సినిమాలు ఇవాళ ఆర్డర్ ఆఫ్ ద డేగా నిలుస్తున్నాయి. కానీ గొప్పవాళ్ల జీవిత చరిత్రలు రూపొందిస్తున్న దర్శకనిర్మాతలు వాస్తవాలను వక్రీకరించకుండాఅవాస్తవాలను జోడించకుండా నిజాయితీగా తీయగలుగాలి. అప్పుడు వాళ్లు కూడా చరి త్రలో మిగిలిపోతారు. లేదా గొప్పవ్యక్తుల జీవితాలను వక్రీకరించిన వాళ్లుగా మకిలీ అంటుతుంది.

-వారాల ఆనంద్

MANERU THEERAM Visual Book by Varala Anand

Posted on Updated on

‘మానేరు తీరం’ కవిత్వం మొదట 1990-91 లో కరీంనగర్ నుండి మిత్రుడు పొన్నం రవిచంద్ర సంపాదకత్వంలో వెలువడ్డ వార పత్రిక మానేరు టైమ్స్ లో ఫీచర్ గా దారావాహికంగా ప్రచురించబడింది. తర్వాత 1998లో శిష్య మిత్రుడు చిత్రకారుడు ఎనిమేటర్ కళ్యాణం శ్రీనివాస్ వేసిన అర్థవంతమయిన చిత్రాలతో పుస్తకంగా వెలువడింది. అప్పుడే కరీంనగర్ నెహ్రూ యువ కేంద్ర హాలులో మిత్రులు అనంత చార్య ,మాడిశెట్టి గోపాల్ లు సమైఖ్య సాహితీ సంస్థ ద్వారా పరిచయ సభ ఏర్పాటుచేసారు.ఆత్మీయ మిత్రులు ప్రముఖ కవి శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్య, శ్రీ నలిమెల భాస్కర్ లు మాట్లాడారు. 
ఇప్పుడు విజువల్ బుక్ గా మీ ముందుకు వస్తున్నది .వీలయినప్పుడు వినండి చూడండి.

MANERU THEERAM POETRY by VARALA ANAND first appeared in Maneru Times WEEKLY in 1990-91. Finally the book published in 1998.