KARIMNAGAR FILM SOCIETY

చార్లీ చాప్లిన్

Posted on

చార్లీ చాప్లిన్

++++++++ వారాల ఆనంద్

హాస్యం వారధిగా
దుఖాన్ని
దృశ్య మానం చేశావు

చిత్రంగా
హాస్యం సమస్త లోకానికి చేరింది

దుఖం మాత్రం నీలో నిలిచిపోయింది

************************************
( చార్లీ చాప్లిన్ జయంతి నేడు )

16 ఏప్రిల్ 2024

చార్లీ చాప్లిన్

యాదోంకీ బారాత్ 2-సిరీస్, నం.4 +++++ వారాల ఆనంద్

Posted on

యాదోంకీ బారాత్ 2-సిరీస్, నం.4

+++++ వారాల ఆనంద్

అడుగులో అడుగేసుకుంటూ వచ్చి

ఎదుట నిలబడ్డది ఎవరు

మృత్యువా మిత్రుడా

మసకచీకటిలో తడి కళ్ళకు

ఎట్లా తెలిసేది

ఇన్నేళ్లుగా

బతుకే అర్థం కాలేదు 

ఎప్పుడో ఒకసారి వచ్చే

చావెట్లా అర్థం అవుతుంది

+++++

అదీ ఆనాటి నా మానసిక స్థితి. ఫిస్టులా విఫలం అయింది. లివర్ ఇన్ఫెక్షన్ అయింది. హీమో డయాలిసిస్ నుంచి పెరిటోనియాల్ డైయాలిసిస్ కి మారాను. పొట్టకు దాని కోసమే ఓ సర్జరీ. వాటర్ బ్యాగులు, ట్యూబ్స్ అంతా కొత్త. పెరిటోనియల్  ఎట్లా చేయాలో ఇందిర కు హైదరబాద్ లో టెక్నీషియన్ శ్రీకాంత్ శిక్షణ ఇచ్చాడు. కరీంనగర్ కు తిరిగి వచ్చాం. రోజూ ఉదయం 7గంటలకు, పగలు రెండు గంటలకు, రాత్రి మళ్ళీ ఎనిమిది గంటలకు పెరిటోనియల్ డయాలిసిస్ ఇందిర చేసేది. గ్లూకోస్ ఎక్కించినట్టుగా డయాలాసిస్ వాటర్ మొత్తం పొట్టలోకి ఒక పైప్ గుండా వెళ్ళి మరో పైప్ గుండా బయటకు రావడం ఆ ప్రాసెస్. అదంతా జరిగే సమయంలో నేనేమో పాటలు వింటూనో ఏదయినా చదువుకుంటూనో బెడ్ పైన పడుకునే వాణ్ని. ఇందిర పక్కనే పూర్తి అయ్యేంత వరకు ఎదురుచూస్తూ వుండేది. అయిపోయిన  తర్వాత ఆ పైపులు పడేయడం ఒక పెద్ద ప్రహసనం. మున్సిపల్ సిబ్బంది దగ్గరినుండి మొదలు చుట్టుపక్క వాళ్ళంతా ఏమిటిదంతా అని అనుమానంగా చూసేవాళ్ళు. పేరు పేరునా అందరికీ చెప్పలేం కదా. అదట్లా జరుగుతూ వుండగానే ఎప్పటికప్పుడు హాస్పిటల్ లో చేసే వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ గ్లోబల్ కి వెళ్ళాం. డాక్టర్ శ్రీధర్ గారిని కలిసి వస్తూ వుండగా ఇందిర తనతో అంది కిడ్నీ నేను డొనేట్ చేస్తాను అని అన్నాను సర్. ఏమయింది మరి అని ఆయన అడిగారు. సెకండ్ ఒపీనియన్ కోసమని ఎవరో చెబితే కిమ్స్ వెళ్ళాం. అన్ని టెస్టులూ చేశారు. చాలా డబ్బులు అయ్యాయి. కానీ “మా అమ్మకు సుగర్ వుంది కనుక నాకూ వచ్చే అవకాశం వుంది. ఆపరేషన్ వీలు కాదు” అన్నారు అని చెప్పింది. అంతేకాదు ఇప్పుడు ఆనంద్ కు సమస్య వచ్చింది కనుక మీరు వెంటవుండి తిరుగుతున్నారు. రేపు మీకూ సమస్య వస్తే ఇద్దరినీ తీసుకుని ఎవరు తిరుగుతారు అని బయపెట్టారు సర్ అని కూడా వివరంగా చెప్పింది తను. దానికి ఖంగు తిన్న డాక్టర్ శ్రీధర్ అట్లా ఎట్లా అంటారు. అమ్మకు షుగర్ వుంటే కూతురుకు తప్పకుండా రావాలని రూలేమీ లేదు, అట్లా ఖచ్చితంగా ఏముండదు. మీకు షుగర్ తప్పకుండా వస్తుందని ఎవరూ చెప్పలేరు. ప్రస్తుతం వుందా అని అడిగారు. లేదన్నాం. వాళ్ళు ఎట్లా చెప్పారో మరి. ఒక పని చేయండి నేను బుధవారం కరీంనగర్ వచ్చినప్పుడు ఆ రిపోర్ట్స్ అన్నీ తీసుకుని రండి చూద్దాం అన్నారాయన. సరే అని కరీంనగర్ తిరిగి వచ్చేశాం. తర్వాతి వారం వెళ్ళి శ్రీధర్ గారిని కలిశాం. రిపోర్ట్స్ అన్నీ సజావుగానే వున్నాయి. ఒక పని చేద్దాం ఇందిర గారూ మీరు మూడు నెలలపాటు ఎలాంటి టాబ్లెట్స్  వాడకండి, తర్వాత టెస్ట్ చేసి చూద్దాం అన్నారు. ఎంకేముంది నేను ఇంట్లో డయాలిసిస్ చేసుకుని క్రమం తప్పకుండా కాలేజీకి వెళ్ళి రావడం. అంతటా అన్నింటా జాగ్రత్తగా వుండడం నా దిన చర్య అయిపోయింది. కాలేజీలో లైబ్రరీ వర్క్ తప్ప మిగతా జర్నలిజం, ఫిల్మ్ మేకింగ్ సర్టిఫికేట్ కోర్సుల వొత్తిడి కొంత తగ్గించుకున్నాను. చాలా కార్యక్రమాలకు దూరంగా వుండడం ఆరంభించాను. సహచరులు, సిబ్బంది, విద్యార్థులు అంతా ఎంతో సహకరించారు. ముఖ్యంగా ప్రిన్సిపాల్ మురళి.

అదంతా అట్లా మూడునెలల కాలం గడవగానే డాక్టర్ గారు ఇందిరకు మళ్ళీ అన్ని పరీక్షలు చేయించారు. నో కంప్లైంట్. ఆపరేషన్ కు సిద్దం కండి అన్నారు. ఖైరతాబాద్ లో వున్న మా సోదరి  మంజుల, బావ శ్రీ శ్యామ్ సుందర్ లతో మాట్లాడాము. సరిగ్గా అప్పుడే వాళ్ళ ఇంటి సమీపంలో  ఒక పోర్షన్ ఖాళీ అవుతున్నదని తెలిసి ఇందిర వొత్తిడి చేసి అడ్వాన్స్ ఇద్దామంది. వాళ్ళకు చాలా స్నేహంగా వున్న వాళ్ళు కనుక ఇంటిని రెంట్కి ఇచ్చారు. ఆ ప్రాంతం గ్లోబల్ కి చాలా దగ్గర. ఎంతో అనుకూలమయింది. వెంటనే కరీంనగర్ లో డబ్బు సమకూర్చుకోవాలి. లక్షలు కావాలి. ఎట్లా అని ఆలోచిస్తూ వుంటే సీనియర్ జర్నలిస్ట్, ఆత్మీయుడు శ్రీ కె.చుక్కా రెడ్డి చొరవతో ప్రైవేట్ చిట్ ఫండ్ లో ఫిక్స్ అయివున్న డబ్బును మాచురిటీ కి ముందే తన పరపతితో ఇప్పించాడు. అందులో మా నరెడ్ల శ్రీనివాస్ ఎంతో చొరవ చూపించాడు. అన్నింటా మిత్రులే అప్పుడు నాకు పెద్ద అండ. నారదాసు లక్ష్మణ రావు, నమిలకొండ హరిప్రసాద్, జింబో, పీయెస్, దామోదర్, కోడం పవన్, తుమ్మేటి రఘోత్తమ రెడ్డి,లతో పాటు బాలరాజు, అర్జున్ ల వంటి అనేక మంది నా వెంటే వున్నారు. ఆనాడు మానసికంగా మిత్రులు ఇచ్చిన సపోర్ట్ ఇంతా అంతా కాదు. ఇక సహచరి  ఇందిర ధైర్యం, చొరవ, తెగింపు, నాకు అండగా వున్నాయి.ఆ సమయంలో నా ఆరోగ్యం విషయంలో తాను తన అభీష్టానికి భిన్నంగా ఎవరి మటనూ వినేందుకు ఆమె సిద్దంగా లేదు. ఎవరెన్ని రిస్కులు ఉన్నాయని చెప్పినా కిడ్నీ ఇవ్వాల్సిందే అంది. కరీంనగర్లో డాక్టర్ ఎం.విజయమోహన్ రెడ్డి గారు, నమిలకొండ హరిప్రసాద్ లు చెప్పిందే ఆమెకు ఫైనల్. హైదరాబాద్ లో డాక్టర్ శ్రీధర్ మాటే వేదం. మానసికంగా నాకు చాలా ధైర్యం వచ్చింది. ఒకటి మాత్రం నిజం..

“నేనిక్కడ కేవలం నాలుగు కాలాలు గడపడానికి రాలేదు

నాలుగు మాటలు పలకడానికి

నలుగురిని కలవడానికీ

నాలుగు పాదముద్రల్ని మిగల్చడానికి వచ్చాను

నాలుగు కన్నీటి బొట్లు తుడిచి

నాలుగు పువ్వుల్ని పంచడానికి వచ్చాను

నేనేకాదు నువ్వూ అంతే

ఇద్దరమూ వేర్వేరు కాదు

మనుషులయిన వారందరమూ అంతే

ఇక్కడ నాలుగు యుగాలు బతకడానికి రాలేదు

నాలుగు తరాలు నిలవడానికి శ్వాస నిలవదు”

******

కావలసిన కనీస వస్తువులు తీసుకుని హైదరాబాద్ వెళ్ళేందుకు సిద్దమయ్యాము. మా ప్రిన్సిపాల్ డాక్టర్ కె.మురళి పదవీ విరమణ సభలో పాల్గొన్న మర్నాడు హైదరాబాద్ బయలుదేరాము. కరీంనగర్ లో బీ.టెక్.తర్వాత అప్పటికి ఉస్మానియాలో ఎం.బిఎ. పూర్తి చేసిన మా అమ్మాయి రేలకి ప్లేస్మెంట్ వచ్చింది. జాయిన్ అయ్యేందుకు కొంత సమయం వుంది. దాంతో తాను హాస్టల్ ఖాళీ చేసి మా ఖైరతాబాద్ కిరాయి ఇంటి వచ్చేసింది. హైదరబాద్ బయలుదేరే ముందు మా నాన్న గారిని వెంట రమ్మని తనకు అండగా వుండమని ఇందిర కొరగానే ఆ వయసులో కూడా పదమ్మా అని తాను కూడా బయలు దేరాడు. గ్లోబల్ లో నెఫ్రాలజిస్ట్ టీం హెడ్ డాక్టర్ శ్రీధర్ తో పాటు, డాక్టర్ రమాశంకర్,డాక్టర్ రఘు,యురాలోజీస్ట్ డాక్టర్ మాలకొండయ్య, డాక్టర్ వెంకటేశ్వర్ లు కలిసి మళ్ళీ అన్నీ పరీక్షలు చేశారు. మొదట ఒక కిడ్నీ తీసేసి నెల తర్వాత ఇందిర కిడ్నీ తో మరో కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయాలని నిశ్చయించారు. వైద్య నిర్ణయంలో మీరే ఫైనల్ అని నేను సరేనన్నాను. కిడ్నీ రిమూవల్ సర్జరీ బాగా జరిగింది. సరిగ్గా ఆ సమయంలోనే పెరిటోనియల్ తీవ్రమయిన ఇన్ఫెక్షన్ అయి ఫెయిల్ అయింది. దాని ఫలితంగా నేను ఎదుర్కొన్న నొప్పి చాలా తీవ్రమయింది. ఇంటి కప్పు ఎగిరిపోయేంతగా అరిచాను. మళ్ళీ ఆసుపత్రిలో చేరాను. దానికి మళ్ళీ ట్రీట్ మెంట్. డ యాలిసి కోసం మెడ దగ్గర మళ్ళీ ఆపరేషన్. కిరాయి ఇంటికీ ఆసుపత్రికీ నడుమ తిరగడం. కరీంనగర్ లో రేలా బీటెక్ అప్పుడు కొన్న స్కూటీ వుంది. అది తెచ్చుకుంటే బాగుండు అనుకున్నాం.ఇందిర కజిన్ బ్రదర్ సింగరేణిలో పని చేసే శ్రీ మెట్టు సుగేందర్ రావు గోదావరిఖని నుండి వస్తూ బండిని తాను తీసుకొచ్చాడు. రేలకి అది ఎంతగానో ఉపయోగపడింది. నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లాడమే కాకుండా ఇందిరను వెంట తీసుకుని ఇతర పనులకోసం వెళ్లడానికి స్కూటీ ఎంతగానో ఉపయోగ పడింది.

అట్లా నెల రోజులపాటు

యుద్దం జరుగుతూనే వుంది

లోపలా బయటా

గెలుపును చేరుకోలేను ఓటమిని అంగీకరించనూ లేను

కొనసాగుతున్న యుద్దంలో

గెలుపోటములు ఎవరు నిర్ణయిస్తారు

కత్తులూ కటార్లూ లేవు గానీ

బతుకుతెరువు యుద్దమే

బతహకదమూ యుద్దమే

కళ్లుతెరిచింది మొదలు మూసెంతవరకూ

క్షణ క్షణం అడుగడుక్కీ

యుద్ద విన్యాసాలూ పోరు సన్నాహాలే

ముగియని యుద్దంలో

విజేతలెవరు పరాజితులెవారు

పోరు అనివార్యమయిన చోట

యుద్దమొకటే సిద్దాంతం

కాలు కదపడమే కర్తవ్యం

+++++

అదే ఆనాటి నాపరిస్థితి. అట్లా ఒక కిడ్నీ తీసేయబడి, డయాలిసిస్ కొనసాగుతూ వుండగానే అనేక సంఘటనలు జరిగాయి. ఒక్కోటి ఒక్కో అనుభవం..

ఆ వివరాలతో మళ్ళీ వారం.. కలుస్తాను

+++ వారాల ఆనంద్

4 ఫిబ్రవరి 2024

User comments
యాదోంకీ బారాత్ 2-సిరీస్, నం.4 +++++ వారాల ఆనంద్
User comments