IRUGU PORUGU

Posted on

ఏమి జంతువది
+++++++++++++++

ఏమి జంతువది
దాని ఆకలిఎంతకూతీరదు
అసలే తృప్తిచెందదు

దాని పొట్ట పరిమాణాన్ని అదే కొలవలేకున్నది

ఎంత ఆహారం కావాల్నో దానికకే తెలవదు

ఆ సర్వభక్షకుడి పేరేమిటి
భూమి ఇండ్లు వంతెనలు
చెరువులు కుంటలు చెట్లు
నదుల రెండు తీరాలు
అది వేటినీ వదల్లేదు

ఎంతకూ తృప్తి చెందని ఆకలితో వున్న
ఆ జంతువేమీటది

ఎల్లవేళలా ఆకలితోనే వుంటుంది
వార్తా పత్రికల్ని టీవీ ఛానళ్ళనీ
వారిపొలాల్ని పర్వతాల్నీ తోటల్నీ
ప్రజల కలల్నీ
చిరునవ్వుతో మింగేస్తుంది

దాని కుటుంబం మొత్తం
ఆకలితో దొర్లుతుంది

ఏమి జంతువది
ఎంతకూ తృప్తి చెందని ఆకలి దానిది
దాని కడుపులోని ఆకలి దానికే అర్థంకాదు

ప్రమాదకరమయిన దాని ఆకలి అంతం కావాలనీ

దాని కడుపులో వున్న మంట చల్లారాలనీ

అందరూ దాని కోసం ప్రార్థించండి

ఓ నిట్టూర్పు విడిచి
ఇక అందరూ ఉపశమనం పొందనీ
++++
అస్సామీ మూలం & ఆంగ్లానువాదం – నీలిమ్ కుమార్
తెలుగు – వారాల ఆనంద్


గానుగ యంత్రం+కేహ్రీ సింగ్ మధుకర్ ( డోగ్రీ కవిత)

Posted on

గానుగ యంత్రం
++++++++++ కేహ్రీ సింగ్ మధుకర్ ( డోగ్రీ కవిత)

గానుగ యంత్రం గర గరలాడుతూ పని చేస్తుంది
ఎద్దు దాని వెనకాలే క్రమం తప్పకుండా స్థిరంగా నడుస్తుంది
గుండ్రంగా నెలలూ ఏడాదులూ లెక్కించకుండా
జీవితకాల ప్రయాణాన్ని కొనసాగిస్తుంది
మెడలో గంటలు గణగణ మంటాయి
కంభాన్ని లాగుతూ విత్తనాల్ని నలగ్గొట్టుతూ నూనె తీస్తుంది

కొరడాని గట్టిగా ఝలిపించినప్పుడు
దేహం గాయాల పాలవుతుంది
కంటి రెప్పలు మూతబడతాయి
మెదడు మొద్దుబారిపోతుంది
అయినా అది అన్ని కాలాల్లోనూ నడుస్తుంది
వేగాన్ని పెంచమంటూ చిన్నాపెద్దా
తిట్టే తిట్లను భరించడం తప్ప
నిస్సహాయ చట్రానికి బంధీ అయిన దానికి
వేరే దారి లేదు

వెలకొద్ది మైళ్ళు నడుస్తుంది
అయినా వున్నచోటే వుంటుంది
వ్యాపారి నూనెను అంగట్లో అమ్ముకుంటాడు
ఎద్దుకు ఆ వ్యవహారంలో ఎలాంటి పాత్రా లేదు

ఒకరు రాత్రీ పగలూ కష్టపడితే
మరొకరు ఆనందం పొందుతారు
ఒకరు చెమటోడిస్తే
మరొకడు లబ్ది పొందుతాడు

అంతేకాదా
ఒకరిది దుఖమయితే నూనె మరొకరిది
ఈ ప్రపంచమే ఒక గానుగ యంత్రం
అది అట్లాగే నడుస్తుంది
మనిషిని ఎద్దులా మార్చేసి
మట్టి పొరల్లో కొర్చేశారు
++++++
ఆంగ్లానువాదం: కేహ్రీ సింగ్ మధుకర్
తెలుగు: వారాల ఆనంద్
******************************
11 March 2024

గానుగ యంత్రం
++++++++++ కేహ్రీ సింగ్ మధుకర్ ( డోగ్రీ కవిత)

GULZAR ARTICLE NAVA TELANGANA

Posted on

కవిత్వం సినిమాలు ఆయనకు రెండు కళ్ళు

++++++++++++++++++ వారాల ఆనంద్

‘మొర గోరా రంగ్ లైలే..’ అంటూ మొట్టమొదటిసారిగా బిమల్ రాయ్ సినిమాకు రాసినా..

‘మైనే తెరెలియే హి సాత్ రంగ్ కె సప్నే చునే’  అంటూ ఆనంద్ లో ప్రేమకి జ్ఞాపకానికీ లంకె వేసినా..

‘ముసాఫిర్ హో…యారో .. నా ఘర్ హై నా టిఖానా … ‘

అంటూ పరిచయ్ లో మనమంతా యాత్రికులమే పయనించే దారిని యాత్రని ఆనందించాల్సిందే అన్న్తాడుగుల్జార్.  

‘దిల్ హూం హూం కరే ఘబ్ రాయే.’ అని రుడాలి లో వేదన పడ్డా

‘మేర కుచ్ సామాన్ తుమ్హారే పాస్ పడా  హై..’ అంటూ ఇజాజత్ లో ప్రేమ విఫలమైన ప్రేమికురాలి దుఖం వేదన ఒంటరితనం అన్నింటిని కలగలిపి ఇజాజత్ లో రాసినా

వాటిల్లో వాడిన ఆ భాష ఆ భావసాంధ్రత గుల్జార్ కే చెల్లింది. ఇట్లా సినిమా పాటల గురించి  రాస్తూ పోతే ఎన్నో ఎన్నెన్నోపాటలు ఆయన కలం నుండి వెలువడ్డాయి.పాఠకుడి మనసుని తత్తెస్థాయి.  

ఇక సంభాషణల విషయానికి వస్తే

‘బాబూమొషై జిందగీ బడీ హోనీ చాహీయే, లంబీ నహి ‘ ,

 ‘జబ్ తక్ జిందా హూ తబ్ తక్ మరా నహీ, జబ్ మర్ గయా సాలా మై హీ నహీ’

‘మౌత్ తో ఏక్ పల్ హయ్,

(జీవతం ఉన్నత మైంది కావాలి, కాని దీర్ఘమయింది కాదు, బతికి ఉన్నంతవరకూ చావలేదు, చచ్చింతర్వాత నేనే లేను, మరణం ఒక క్షణమే)

ఇలాంటి తాత్విక సజీవమయిన సంభాషణలు ఆనంద్ సినిమాలో గుల్జార్ రాశారు.అట్లా ఆయన పాటలు సంభాషణలే కాదు గుల్జార్ గొప్ప కవి, సినీ గేయ రచయిత, రచయిత, సినీ దర్శకుడు. గుల్జార్ రచనలు, సినిమాలు, గజల్స్  అన్నీ సృజనాత్మకంగానూ తాత్వికంగానూ వుండి ఆయనలోని సున్నితత్వాన్ని సరళత్వాన్ని ఆవిష్కరిస్తాయి. ఆయన కవిత చదివే పద్ధతి కూడా శ్రోతల్ని అమితంగా ఆకట్టుకుంటుంది. ఇట్లా పలు రంగాల్లో తన ముద్రను చాటుకున్న గుల్జార్ అనువాదంలో కూడా ఉన్నతమయిన కృషి చేసాడు చేస్తున్నాడు. ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పంజాబీ, బెంగాలి భాషల్లో ప్రావీణ్యమున్న గుల్జార్ దేశంలోని ఇతర భాషల రచనల్ని చదవడానికీ ఇష్టపడతాడు. ‘మన మెదడు అన్టన్నే(antenne) ను తెరిచి వుంచాలి అప్పుడే ఇతర ప్రాంతాల్లో ఇతర భాషల్లో ఏమి జరుగుతుందో తెలిసి వస్తుంది’ అంటాడు గుల్జార్.  అట్లా భాషల్లో, సాంస్కృతిక ప్రక్రియల్లో నిరంతర కృషి కొనసాగిస్తున్న గుల్జార్ ఒక లివింగ్ లెజెండ్. దర్శకుడిగా హిందీ చలన చిత్ర సీమలో తన ముద్రను చాటుకున్నవాడు గుల్జార్. సినిమా రంగంలో విశేషమయిన్ కృషి చేసిన ఆయనకు ఆ రంగంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో అనేక పురస్కారాలు సత్కారాలు లభిచాయి. ఆస్కార్, గ్రామీ, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం, అనేక జాతీయ పురస్కారాలు వచ్చాయి. బహుశా ఆయన అందుకోని అవార్డు లేదు. కానీ సాహిత్యం లో ఆయనకు వచ్చిన ‘జ్ఞానపీఠ పురస్కారం ప్రత్యేకమయింది. ఎందుకంటే ఆయనే అనేక చోట్ల చెప్పుకున్నట్టు సాహిత్యమే తన నిజమయిన వ్యక్తీకరణ రూపం. సినిమా కూడా సృజనాత్మక కళ నే. కానీ అది రచయిత, దర్శకుడు, నటుల సమిష్టి కృషి. సాహిత్యం విషయానికి వచ్చినప్పుడు అది వ్యక్తిగతమయిన వ్యక్తీకరణ. అందులో ఇతరుల ప్రమేయం వుండదు. కవీ రచయిత తన భావాలకు తానే రూపం కల్పిస్తాడు. అందుకే సాహిత్య సృజనలో స్వేచ్చ వుంటుంది. అందుకే సాహిత్యంలో తనకు వచ్చిన ‘జ్ఞానపీఠ్’ ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అన్నారాయన. 

‘ఎక్కువ మంది నేను సినిమాల్లోనూ సినిమాల కోసమూ రాసిన వాటిని ఇష్టపడతారు, ప్రేమిస్తారు,అభిమానిస్తారు. కానీ నేను మనిషి పడే బాధ, సంఘర్షణ, దేశాన్ని ప్రేమించడం లాంటి అనేక విషయాల్నీ అభిమానిస్తాను. అంతేకాదు అందరూ జీవితంతో అనుబంధం పెట్టుకోవాలని  అందరికీ  చెబుతాను అప్పుడే ఆనందంగా వుంటారనీ చెబుతాను’ అంటాడు గుల్జార్.   

అంతే కాదు కవిత్వం ఎట్లా రాస్తారు అని అడిగితే ‘సాహిత్య సృజన చేయడానికి నువ్వు ‘గుహ’లో నివసించాలి, ఆ గుహ మరేదో కాదు అది నువ్వే’ అంటాడాయన.  

కవిత నిడివి గురించి అడిగితే ‘నువ్వు అధికంగా మాట్లాడ్డం ప్రారంభించగానే జనం నిన్ను వినడం మానేస్తారు. అధికంగా చెప్పిన ఏదయినా దాని ప్రభావాన్ని కోల్పోతుంది. క్లుప్తంగా రాసిన కొన్నిమాటలే ఎక్కువ శక్తివంతమయినవి, ఎంతో ప్రభావ వంతమయినవి. నేనయితే నా కవిత్వంలో ముఖ్యమయిన విషయాల్ని అతి తక్కువ మాటల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను అంటాడు గుల్జార్.

    గుల్జార్ గా అందరికీ పరిచయమున్న ఆయన అసలు పేరు సంపూరన్ సింగ్ కల్రా. ఆగస్ట్ 18,1936 రోజున ప్రస్తుతం పాకిస్తాన్ లో వున్న దీన పట్టణంలో సిక్కు కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటినుంచీ అంతాక్షరీ ఆడడంలో ఆసక్తిగా వుండే ఆయన అప్పటినుండే భాష పట్ల పదాల పట్ల మక్కువను పెంచుకున్నాడు. చిన్నప్పటినుండే హిందుస్తానీ సంగీతం పట్ల మక్కువ కలిగిన గుల్జార్ రవిశంకర్, అలీ అక్బర్ ఖాన్ ల కచేరీలకు వెళ్ళేవాడు.  గుల్జార్ కుటుంబం దేశ విభజనలో తీవ్రంగా ప్రభావితమయింది. సొంతవూరు విడిచి అమృత్సర్ కి వలస వచ్చింది.అప్పుడు ఆయన చూసిన హింస, దౌర్జణ్యాలు, పడ్డ వేదన దుఖం ఆయన కవిత్వంలో అంతర్లయగా ధ్వనిస్తూనే వుంటుంది. ఏం.హెచ్.సత్యు ‘ఘరమ్ హవా’ లాంటి సినిమాలు తెస్తే గుల్జార్ కవిత్వమూ కథలూ రాశాడు.

  ఇక తమ కుటుంబ వ్యాపారమయిన మెకానిక్ షాప్లో పనిచేయడంతో గుల్జార్ జీవితం ఆరంభమయింది. ప్రమాదంలో సొట్టలు పడ్డ కార్లకు కలర్ మాచ్ చేసే పని చేసేవాడు. తన పదమూడేళ్ళ వయస్సులోనే చదవడం పైన ఆసక్తి కలిగిన గుల్జార్ తమకి దగ్గరలో ఓ కాందిశీకుడు నిర్వహించే పుస్తకాలు కిరాయికిచ్చే షాప్ నుండి అపరధ పరిశోదక నవలలు, మాజిక్ ఫాంటసీ రచనల్ని లాంతరు ముందు చదవడం ఆరంభించాడు. వారానికి పావలా రుసుము చెల్లిస్తే ఎన్ని పుస్తకలయినా చదివే వీలుండేది అక్కడ. దాంతో తమ షాప్ పని అయిపోగానే రోజుకు ఒకటి అని కాకుండా రెండు మూడు పుస్తకాలు చదవడం చేసేవాడు గుల్జార్. ఒక నాటికి షాప్ లోని దాదాపు పుస్తకాలు అయిపోవడంతో షాపతను ఇట్లా ఒక్క పావలాకు ఎన్ని చదువుతావు అంటూ సజ్జ మీదవున్న పుస్తకమొకటి తీసి ఇచ్చాడు. ఆది టాగోర్ రాసిన ‘ గార్డనర్’. అది చదివింతర్వాత గుల్జార్లో చదివే దృక్పథమే మారిపోయింది. ఆ తర్వాత ప్రేంచంద్ నుంచి మొదలు అనేక మంది గొప్ప రచయితల రచనలు చదవడం మొదలుపెట్టాడు. సరిగ్గా అదే సమయంలో ఆయనకు ప్రగతిశీల రచయితలు, కళాకారులతో పరిచయం కలగడం PWA కార్యక్రమాలల్లో పాల్గొనడం మొదలయింది. అప్పుడే శైలేంద్ర పరిచయం అయ్యాడు. అదే సమయంలో బిమల్ రాయ్ ‘బందిని’ సినిమా తీయడం మొదలు పెట్టాడు ఇంతలో కవి శైలందర్ కు, సంగీత దర్శకుడు ఎస్,డి,బర్మన్ కు నడుమ ఎవో  పొరపొచ్చాలు రావడంతో ఆ ఇద్దరూ కలిసి పని చేసే స్థితి లేకపోయింది. దాంతో శైలేంద్ర గుల్జార్ ని తక్షణమే వెళ్ళి బిమల్దాను కలవమని సూచించాడు. మిత్రుడు ఆసీత్ సేన్ తోకలిసి వెళ్ళి కలిశాడు. ‘ఇతను విషయాన్ని అర్థం చేసుకుని పాట రాయగలడా అని సేన్ ను బెంగాలీలో అడిగాడు’ అప్పుడు సేన్ దాదా తనకు బెంగాలీ రాయడం చదవడం వచ్చు అనేసరికి  కంగారుపడ్డ బిమల్ రాయ్ సర్దుకుని పాట రాయమని ప్రోత్సాహించాడు. గుల్జార్ తన మొట్ట మొదటి సినిమా పాట ‘మేర గోరా అంగ లయిలే..” తో  ఆరంభమయింది. అయితే బిమల్ దా  గుల్జార్ తో మాటాడుతూ సినిమాలకు పనిచేయడం నీకిష్టం లేదని తెలుసు కానీ నువ్వు నా దగ్గర ఆసిస్టంట్ గా చేరు. అంతే కానీ ఇక ముందు తన మెకానిక్ షాప్ కు వెళ్ళకు. రచనల పైన దృష్టి పెట్టాలని సూచించాడు. దాంతో గుల్జార్ పూర్తి స్థాయిలో సృజన మీదే దృష్టి కేంద్రీకరించాడు. బిమల్ దా కి పూర్తి స్థాయి సహాయకుడిగా ఉండిపోయాడు. తర్వాత హ్రిషికేశ్ ముఖర్జీ, అసిత్ సేన్ లాంటి దర్శకుల సినిమాలకు రచనలు చేయడం ఆరంభించాడు. అట్లా గుల్జార్ ఆనంద్(1970 ), గుడ్డీ(1971), బావర్చి(197 2 ), నమక్ హరం(1973 ), హ్రిషికేశ్ ముఖర్జీకి, దో దూని చార్ (1968), ఖామోషి(1969) , సఫర్(1970) అసిత్ సేన్ కు సంభాషణలు రాసాడు.

          ఇక తర్వాత 1971 లో ‘మేరె అప్నే) సినిమాతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు గుల్జార్. జీతెంద్ర ప్రధాన పాత్రధారిగా 1972లో ‘పరిచై’ తీసాడు. 1972లో అయన రచించి దర్శకత్వం వహించిన ‘కోషిష్’ అత్యంత సున్నితమయిన మానవీయ దృక్పధంతో తీసిన సినిమాగా మిగిలి పోయింది.  సంజీవ్ కుమార్, జయాభాధురి ప్రధాన భూమికల్ని పోషించిన కోషిష్ లో ఇద్దరు మూగ చెవిటి వాళ్ళ జీవితం దాంట్లో వారు ఎదుర్కొన్న అవస్థలు హృద్యగంగా చూపిస్తాడు గుల్జార్. అందులో సంజీవ్ కుమార్, జయబాధురి లు అత్యంత సహజంగా నటించారు. అట్లా సంజీవ్ కుమార్ తో మొదదలయిన సహచర్యం అనేక సినిమాల నిర్మాణానికి దోహదపడింది. వారి కయికలో వచ్చిన ‘ ఆంధీ’, మౌసం, అంగూర్ , నమ్కీన్ సినిమాలు ఒక కల్ట్ సినిమాలుగా మిగిలిపోయాయి. సంజీవ్ కుమార్ నట జీవితంలో అత్యంత సహజ నటుడిగా పేరు తెచ్చిన సినిమాలివి. ఇక గుల్జార్  జీతేంద్ర తో పరిచై, ఖుష్బూ,కినారా, వినోద్ ఖన్నా తో అచానక్, మీరా, లేకిన్, హేమామాలిని తో ఖుష్బూ, కినారా, మీరా  లాంటి మంచి సినిమాలు రూపొందించాడు. ఇంకా దర్శకుడిగా గుల్జార్ కితాబ్, పల్కొంకీ చావ మే, శాహీరా, చత్రన్, సునేయే,ఆల్కా,ఇజాజత్,లిబాస్,మాచిస్,హు టు టు లాంటి సినిమాలు రూపొందించాడు.

    టెలివిజన్ రంగంలో ఆయన రూపొందించిన సీరియల్స్ గొప్పగా విజయవంతమయి కల్ట్ గా మిగిలిపోయాయి. రచయితగా, దర్శకుడిగా ఆయనలోని సున్నితత్వం ప్రతిభ విశేషంగా పేరు గడించింది. ఆయన రూపొందించిన ‘ మిర్జా గాలిబ్’ సీరియల్ ఆ మహాకవి కవిత్వాన్ని జీవితాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. అందులో గాలిబ్ గా  నసీరుద్దిన్ షా, గాయకుడిగా జగ్ జీత్ సింగ్ తమ అద్భుత ప్రదర్శనను అందించారు. వారి ప్రతిభను ఆవిష్కరించడంలో గుల్జార్ భావుకత, నిబద్దత ప్రధాన భూమికను పోషించాయి.

ఇక గేయ రచయితగా గుల్జార్ 100 పైగా సినిమాలకు పాటలు రాసాడు. అలనాటి బందిని తో మొదలయిన ఆయన ప్రస్తానం సలిల్ చౌదరి, ఎస్. డి.బర్మన్, ఆర్.డి.బర్మన్, మదన్మోహన్, విశాల్ భరద్వాజ్, ఎ.ఆర్. రెహమాన్ లాంటి ప్రాచీన ఆధునిక సంగీతకారులతో అవిశ్రాంతంగా సాగింది. అలనాటి మెలోడీ పాటలు గొప్పగా రాసిన గుల్జార్ ‘కజరారే..’ ( బంటీ ఆర్ బబ్లూ), చయ్య చయ్య చయ్యా….(దిల్ సే ) లాంటి ఆధునిక పాటల్ని కూడా రాసాడు. ఇవ్వాళ మెలొడీకి స్థానం లేదని బీట్ కె ప్రధాన పాత్ర అని ఆయన అంటారు. కాలానుగుణంగా సినిమాలు రచనలు వస్తాయని ఆయన అభిప్రాయ పడతారు. ఏ.ఆర్.రెహమాన్ తో కలిసి ‘జై హో..  ‘ పాటకు గుల్జార్ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. అంతే కాదు ఈ జంట గ్రామ్మీ అవార్డును కూడా అందుకుంది.

గుల్జార్ కవిత్వం, వచనం మనసుకు హత్తుకునేలా రాశారు. ఆయన రాసిన ‘GREEN POEMS’ ని నేను ఆకుపచ్చ కవితలు పేర తెలుగులోకి అనువదించాను, వర వర రావు గారు ‘SUSPECTED POEMS’ ని అనుమానిత కవితలు గా అనువదించారు.

గుల్జార్ కూడా అనేక అనువాదాలు చేశారు.‘ ఏ పోయేమ్ ఏ డే’ పేర భారీ సంకలనాన్ని తెచ్చారు. అందులో 34 భారతీయ భాషల్లోని 279 కవుల 365 కవితల్ని అనువదించి ప్రచురించారు. వాటిల్లో వర్తమాన కవుల కవితల్నిచేర్చారు. పాఠశాల కళాశాల పాఠ్యపుస్తకాల్లో చదివే కవుల కవితలు కాకుండా ఇప్పుడు వర్తమాన సామాజిక స్థితిలో ఆధునిక కవులు రాస్తున్న కవితల్ని చేర్చారు.‘ఇరుగు పొరుగు’ భాషల్లో కవులు ఏమి రాస్తున్నారు ఎట్లా రాస్తున్నారు అన్న విషయం అర్థం కావడానికి ఈ సంకలనం ఎంతో దోహద పడుతుంది.

అయన 1973 లో ప్రముఖ నటి రాఖీ ని వివాహం చేసుకున్నారు తర్వాత కొంత కాలానికి వేరై వేరుగా వుంటున్నారు వారి కూతురు మేఘన గుల్జార్. ఆమె దర్శకురాలిగా ఫిల్ హాల్, జస్ట్ మారీడ్, దస్  కహానియా, తల్వార్, రాజీ, చాపాక్, సామ్ బహదూర్ సినిమాలు రూపొందించారు. అంతేకాదు తన తండ్రి పైన ‘ బికాస్ హి ఈస్ ‘ పుస్తకం రాసారు.

  గుల్జ్జార్ బహుముఖీన ప్రతిభ లో ఆయన రాసిన రచనలు భారతీయ హిందీ ఉర్దూ సాహిత్య రంగాల్లో విలక్షణతను విశేష ఖ్యాతిని పొందాయి ఆయన రవీంద్రనాథ్ రచనల్ని అనేకం అనువాదం చేసారు. గ్రీన్ పోయెమ్స్, సస్పెక్టే డ్ పోయెమ్స్, జిందగీ నామా, హాఫ్ ఎ రూపీ, సేలేక్తేడ్ పోయెమ్స్, 100 లిరిక్స్, మేరా కుచ్ సమ్మాన్, సైలేన్సేస్, టూ లాంటి ఎన్నో రచనలు విశేష ప్రశంశాల్ని అందుకున్నాయి.

గుల్జార్ ఇప్పటికే పద్మభూషణ్, సాహిత్య అకాడెమి అవార్డు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లు అందుకున్నారు. ఇప్పుడు జ్ఞానపీఠ పురస్కారం అందుకోవడంతో ఆయన కవిత్వం మరింతగా పాఠకులకు చేరుతుంది. ఆయనకు హృదయపూర్వక అభినందనలు.

++++++++++++++++++++++++++

వారాల ఆనంద్

కవి, రచయిత,

‘ఇరుగు పొరుగు’ సమీక్ష

Posted on

మిత్రులారా! నా అనువాద సంకలనం ‘ఇరుగు పొరుగు’ పైన ఈ రోజు ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో సమీక్ష చేశారు. చూడండి, సమీక్షకులు రామా చంద్రమౌళి గారికి, సంపాదకులకు కృతజ్ఞతలు- వారాల ఆనంద్,
25 ఫిబ్రవరి 2024

‘IRUGU PORUGU’

Posted on

మిత్రులారా! ఇటీవల వెలువడ్డ నా ‘ఇరుగు పొరుగు’ అనువాద కవితా సంకలమ్ పై డా.టి.రాధాకృష్ణమాచార్యులు మొలక లో సమీక్ష చేసారు. వారికి, మొలక సంపాదకులు టి.వేదాంత సూరి గారికి ధన్యవాదాలు-ఆనంద్ వారాల

విద్యుల్లతల వెలుగుల అరుగు “ఇరుగు పొరుగు “


సాహిత్యంలో పరామర్శ ప్రక్రియ ఒక వినూత్న ఆత్మీయ ఆనంద గీతం.విశిష్ట వైవిధ్యాల పరస్పర వ్యతిరేకమైన భావోద్వేగాల నఖశిఖపర్యంత సంక్షిప్త సమగ్రత. వివిధ భాషల భిన్నవిభిన్న కోణాల ఆవిష్కృత అనుసృజనలోని వాడీ వేడి నివేదన మంచ్ పై మంచీ చెడు నాడీశోధనే.కవిత పరామర్శ విస్తృతమైన లోతైన ఆత్మీయ అధ్యయనం.సాహిత్యంలో సాధికార ప్రామాణిక ప్రక్రియలైన అభిప్రాయం సమీక్ష విమర్శ మీమాంసల సరసన పరామర్శ తోడైంది.ఇది చేతి వేళ్లతో కమ్మలను తిరిగేస్తూ కన్నుల టార్చిలైట్ తో సాగిపోయే పైపై అక్షర ఉపరితలం కాదు.కవి కలం దున్నిన పొలం ఇది.పంట పచ్చగ స్వఛ్ఛంగా ఉండి కవిత్వం బాగా పండింది.కవి చెప్పేంతవరకు ఇది అనువాద కవిత్వం అనిపించదు. అంటే అణునాదానికి సరితూగే అనువాదం ఇది.సృజన కవిత్వానికీ అనువాద కవిత్వానికీ తేడా ఏమాత్రం కనిపించదు కలం సత్తాగలదైతే. కవి నిత్య అధ్యయన పిపాసియైన నిజ అభ్యాసన దాహార్తియైనా అయి సామాజిక స్పృహతో సామాజిక చైతన్యాన్ని రగిలించి సమాజహితానికి రాచబాటగా కవిత్వాన్ని చెక్కగలదు.ఈ కోవలోనిదే వారాల ఆనంద్ కలం. ఆయన ‘ఇరుగు పొరుగు’ అనువాద కవిత్వం కూడా.ఇక కవితలను తడిమితే తడితడిగా
హృదయం ద్రవిస్తూ వాడివాడిగా పిడికిలి జ్వలిస్తూ చాలా లోతైన సాంద్రతతో విశాలమైన మైదానాల తలపించే బృహత్ కవిత్వ మంజూష.ఇందులో 29 భారతీయ భాషల్లోని 90 ప్రఖ్యాత కవుల 152 కవితలున్న అనువాద కవితలున్నయి.
ఆత్మ స్తుతి పర నింద నడకల కాలంలో కలం కదంతొక్కడం మానేసి చాలాకాలమైన నేపథ్యంలో ఒక గొప్ప సృజన మంచి ప్రయత్నం ఈ ‘ఇరుగు పొరుగు’ అనువాద కవిత్వంతో వారాల ఆనంద్ చేయడం భాషా సమైక్యత భావ సమైక్యత ద్వారా భారతీయ ఆత్మనూ జాతీయ తాత్వికతనూ చూపేందుకు చేసిన సాహిత్య కృషి ప్రశంశనీయం. మాతృభాష ఎవరికైనా అమ్మమాటే. 29భారతీయ భాషలన్నీ బంధువులు మిత్రులు కుటుంబమనే నా దేశంలో. అనువాదం ప్రపంచ భాషల వారధి.మన ఇరుగు పొరుగు భాషాసాహిత్యాల పలుకరింపుల ప్రవాహ నదీ గీతం.ఈ సంపుటిలోని కొన్ని కవితల పాదాలు మచ్చుకు మీ ముందుకు…
కె.సచ్చిదానందన్ మళయాళం మూల కవిత ‘వీడ్కోలు’ లో
“తన గొంతు/నలిగిపోక ముందు ఆలపించే/
కలలు నిండిన గీతం/మన కవిత్వం”

‘రూపీ కౌర్ కవితలు’ ఆంగ్ల మూలంలో
“అతన్ని ఎలా ప్రేమించాలో/నేర్చుకుంటున్నాను/నన్ను నేను ప్రేమించుకుంటూ”

కనిమొళి తమిళకవిత ‘అవసరం లేదు’ లో
“స్వర్గాన్ని ఆధీనంలోకి/తెచ్చుకోవలసిన అవసరం/
నాకు లేదు/
ఈ భూమే నాకు అలవాటయిపోయింది/”

డోంగ్రీ కవిత ‘బాధ’ ముగింపులో
“ఈ బాధ/
నేనివ్వాళ గానం చేయలేని/
దుఃఖం నుండి పుడుతుంది/”

ఆఘా షాహిద్ అలీ కాశ్మీరీ కవిత’ఉనికి’లో “నువ్వు వెళ్ళిపోతే/నా దుఃఖపు ఉనికిని/
ఎవరు నిరూపిస్తారు/ఉనికిలోకి రాకముందు/నేనెవర్నో చెప్పవూ/”

ఇంకా ఫైజ్ అహ్మద్ ఫైజ్ ఉర్దూ కవిత’ దుఃఖానికి మాటలొస్తే’లో
“నా దుఃఖం, నిశ్శబ్ద సంగీతం/
నా ఉనికి, పేరు లేని అణువు/”
మరోచోట
“నా ఉనికి ఆనవాళ్ళు నాకు తెలిస్తే/ ఈ లోకపు రహస్యం నాకు తెలిసేది/”

ఇలా ఎంతో వైవిధ్యమైన అనుసృజన ప్రక్రియలో అర్ధవంతమైన సాంద్ర సృజనతో ఇరుగు పొరుగు కవిత్వాన్ని తెలుగులో వెలువరించిన వారాల ఆనంద్ బహుధా అభినందనీయులు.

డా.టి.రాధాకృష్ణమాచార్యులు

IRUGU PORUGU’ జీతేంద్ర వాసవ

Posted on

‘IRUGU PORUGU’ జీతేంద్ర వాసవ
గుజరాతీ కవిత
21 JAN 2024

ఇరుగు పొరుగు

Posted on Updated on

‘ఇరుగు పొరుగు’ గుజరాతీ కవిత
“రుచి” మూలం: గోపికా జడేజా
19 JAN 2024

‘ఇరుగు పొరుగు'(అనువాద కవిత్వం)

Posted on

‘ఇరుగు పొరుగు'(అనువాద కవిత్వం)
17 JAN 2024
కాశ్మీరీ కవితలు