Month: June 2017

ముక్తకాలు( POEM)

Image Posted on Updated on

13

Advertisements

ముక్తకాలు( POEM)

Image Posted on Updated on

12

తెలంగాణ సాహిత్య అకాడెమీ- కొన్ని ఆకాంక్షలు

Posted on

ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగాఏర్పాటయిన తెలంగాణ సాహిత్య అకాడెమీ పైన ఎంతో గురుతరమయిన భాధ్యత వుంది. సాహిత్యానికి సంభందించి కొత్త రాష్ట్రం  ఏర్పాటయింతర్వాత సాహిత్య రంగానికి సంభందించిఅకాడెమీ ఏర్పాటు తో తొలి అడుగు పడినట్టయింది. అయితే ఈ అడుగు కేవలం మొదటి అడుగు దగ్గరే ఆగిపోకుండా వివిధ సాహిత్య ప్రక్రియలకు సంభందించి ప్రగతి శీలమయిన చర్యలు మొదలవుతాయని సాహిత్యకారులు ఆశిస్తున్నారు, మొదటినుంచీ ప్రజా ఉద్యమాల తోనూ, సాహిత్యోద్యమాల తోనూ విడదీయరాని అనుభందాన్ని కొనసాగిస్తున్న నందిని సిధారెడ్డి అధ్యక్షుడిగా నియమించబడడంతో ఆ ఆకాంక్షలు రెట్టింపయ్యాయనే చెప్పుకోవచ్చు. నిజానికి సాహిత్య అకాడెమీ ఏంచేస్తుంది దాని పరిధులు, పరిమితులు ఎట్లా వుంటాయన్న మాట అటుంచితే తెలంగాణ సాహితీ కారులు అకాడెమే నుంచి ఏమి కోరుకుంటున్నారన్నది ముఖ్యం. అనేక ఏళ్ల పరంపరగా జాతీయ స్థాయిలోనూ వివిధ రాష్ట్రాలస్థాయిలోనూ అకాడెమీల కృషిని పరిగణనలోకి తీసుకొని తెలంగాణ అకాడెమీ తన కార్యక్రమాలను రూపొందించుకోవాల్సి వుంటుంది. అంతే కాదు తెలంగాణ సాహిత్యానికి సాహిత్యకారులకూ వున్న విలక్షణతల్ని పరిగణనలోకి తీసుకోవాల్సి వుంది. వలసపాలనలో తెలంగాణ సాహిత్య చరిత్రలో వదిలేసిన ఖాళీల్ని పూరించుకునే  ప్రయత్నం జరగాలి. అంతేకాదు  దశాబ్దాల కాలంగా నిర్లక్ష్యానికి, నిరాదరణకూ గురయిన తెలంగాణ సాహిత్యంలోని ప్రాచీన సాహిత్యాన్ని వెలుగులోకి తేవడంతో పాటు వర్తమాన సాహిత్యానికి తగిన స్థానం  అందించాల్సి వుంది. ముఖ్యంగా  ఆధునిక సాంకేతిక తరానికి సాహిత్యాన్ని పరిచయడం చేయడం, పుస్తకాలు చదవడం పట్ల ఆసక్తిని కలిగించే ప్రయత్నాలు చేయాల్సి వుంది. కొత్త తరానికి  సృజనలోకం లో వుండే అనుభూతినీ ఆనందాన్నీ అందించాలి. సాహిత్యం చదవడమంటే మానవీయ విలువలను ప్రొదిచేసుకోవడమని నవ్య తరానికి చెప్పే కార్యక్రమాలు అకాడెమీ చేపట్టాల్సి వుంది. తెలంగాణ సాహిత్య అకాడెమీక వెంటనే పూర్తి స్థాయి వెబ్ సైట్ ఏర్పాటు చేసి తెలంగాణ సాహిత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగు తెల్సిన వాళ్ళందరికీ  అందుబాటులోకి తేవాలి. ఫలితంగా తెలంగాణ సాహిత్యకారుల సృజన విశ్య వ్యాప్తంగా మన్ననలు అందుకునే అవకాశం వుంది. తెలంగాణ సాహిత్య అకాడెమీ పక్షాన తెలంగాణ సోయిని ప్రతిబింబించే అంతర్జాల పత్రికను (INTERNET MAGAZINE)  రూపొందించాల్సి వుంది. తద్వారా సాహిత్యంలో నూతన రచనలకు  పోకడలకు సరయిన వేదిక కల్పించవచ్చు.

ఇవ్వాల్టీ యువతను చేరుకోవడానికి  అత్యంత ప్రాచుర్యం లో వున్న సామాజిక మాధ్యమాల్ని తెలంగాణ సాహిత్యం కోసం ఇతోధికంగా వినియోగించుకోవాలి. ఫెస్బుక్ పేజీ లాంటివి, వాట్సప్ గ్రూపుల్లాంటివి ఏర్పాటు చేయడం ద్వారా దీన్ని విస్తృతం చేయవచ్చు. వర్తమాన కాలం లో దృశ్య మాధ్యమం అత్యంత ప్రభావ వంతంగా పని చేస్తుంది కనుక తెలంగాణ సాహిత్యానికీ దృశ్య మాధ్యమానికీ నడుమ సమన్వయం కల్పిస్తూ ‘తెలంగాణ సాహితీ మూర్తులు’ పేర తెలంగాణ సాహిత్య కారుల visual documentation జరగాలి.  దృశ్య రూపంలో  తెలంగాణ సాహిత్య కారుల  జీవితమూ సాహిత్యాల సమ్మిళితమయిన  డాకుమెంటరీ చిత్రాల్ని తీసి అందుబాటులోకి తేవాలి, వాటిని తెలంగాణ సాహిత్య అకాడెమీ వెబ్ సైట్ లోకూడా వుంచొచ్చు. .

తెలంగాణ సాహిత్య చరిత్రకు తెలుగు సాహిత్య చరిత్రలో తీవ్రమయిన అన్యాయం జరిగిందన్నది వాస్తవం. చివరికి పోతనను కూడా వొంటిమిట్టకు తీసుకెల్లే ప్రయత్నాలు జరిగాయి ఆ ఖాళీల్ని పూరించేందుకు గాను సాహిత్య చరిత్రతో పాటు ఆయా కాలాల సాహిత్య సృజనకు సంబందించిన  అధ్యాయనానికి గాను విషయాల వారీగా  రీసర్చ్ ఫెల్లో షిప్ లు ఏర్పాటు చేసి పరిశోధనలను ప్రోత్సహించాలి. అందులో రెండు రకాలుగా జూనియర్, సీనియర్ ఫెలోషిప్ లు నిర్వహించాలి. ఫలితంగా ఇప్పటికీ వెలికి రాని  తెలంగాణ సాహిత్యాన్ని, సాహిత్య రూపాల్ని, సాహిత్య కారుల జీవితాల పైన సాధికారిక  పరిశోదనలు జరిపించి వెలుగులోకి తేవాలి. దానికోసం కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ నిర్వహించే పద్దతిని గమనించి మరింత మెరుగయిన విధానాన్ని అమలులోకి తేవడం ద్వారా మెరుగయిన ఫలితాలు సాధించ వచ్చు.  విధ్యార్థుల్లో సాహిత్య జిజ్ఞాస ను పెంపొందించడానికి డిగ్రీ మరియు యూనివర్సిటీ స్థాయిల్లో తెలంగాణ సాహిత్య అకాడెమీ  సాహిత్య క్లబ్స్ ఏర్పాటు చేసి తెలుగు శాఖల్ని చైతన్యవంతం చేయాలి. వాటి ద్వారా సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం, విద్యార్థులకు పోటీలను నిర్వహించడం లాంటివి చేయగలిగితే నూతన తరంలో సాహిత్య వాతావరణా న్ని ఏర్పాటు చేసినట్టు అవుతుంది. ఇంకా అందుబాటులో లేని ప్రాచీన తెలంగాణ సాహిత్య గ్రంధాలను పునర్ముద్రించుకోవాలి. . అనువాద రంగాన్ని ఒక ప్రాధాన్యతా రంగంగా తీసుకొని తెలంగాణ సాహిత్యాన్ని ఇరుగు పొరుగు భాషల వారికీ,ఇంగ్లీషులోకి మార్చి ప్రపంచ  దేశాలకూ అందించే ప్రయత్నం జరగాలి. తెలంగాణ తొలి , మలి దశ ఉద్యమ కాలంలో వెలువడ్డ సాహిత్యం తోపాటు ప్రగతిశీల విప్లవ సాహిత్య ప్రాధాన్యతను కూడా వెలుగులోకి తేవాలి. ముఖ్యంగా తెలంగాణ భాషకు పెద్ద పీఠ వేస్తూ వెలువడ్డ రచలను ముందుకు తేవాలి.    తెలంగాణ సాహిత్య చరిత్రను ప్రాచీన, ఆధునిక కోణాల్లో వేర్వేరుగా నిర్మించి సాధికారిక గ్రంధాల్ని ముద్రించాలి. నిఘంటువుల నిర్మాణం లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించాల్సి వుంది. నూతనంగా సాహిత్య రంగంలోకి వస్తున్న కొత్త రచయితల పుస్తకాల ముద్రణకు ఇతోధిక ఆర్థిక సహకారం అందించాలి.  తెలంగాణ సాహిత్య అకాడెమీ అవార్డులను ఏర్పాటు చేసి నిస్పక్షపాతంగా ప్రతిభ గల తెలంగాణ సాహితీ కారులను గుర్తించాలి. ఇలా తెలంగాణ సాహిత్య అకాడెమీ ముందు అనేక కార్యక్రాములున్నాయి. కవులూ రచయితలూ గొప్పగా కలలుగనే వారు, ఆకాంక్షలతో వున్న ఆశాజీవులు కనుక సాహిత్య అకాడెమీ ఎంతో చేస్తుందని చేయాలనీ కోరుకుంటున్నారు. అయితే వారి ఆకాంక్షలు అధికారిక అంచెలల మధ్య నలిగి పోకుండా చూడాల్సి వుంది. ఆకాంక్షలు ఎన్ని వున్నా అన్నీ ఒకే సారి పూర్తికావాలనుకోవడం కూడా సరికాదు కానీ ఆదిశలో పని మొదలు కావాలని ఆ చొరవను అకాడెమీ తెసుకోవాలని తెలంగాణ సాహితీ కారులు అమితంగా కోరుకుంటున్నారు.

అకాడెమీ తొలి అడుగులు స్పష్టంగానూ సాధికారికంగానూ పడాలి.6b8622ee-3ff1-4676-8fcc-0b6ae65a44f7

  వారాల ఆనంద్