AKSHARALA THERA

అధ్యయన అభ్యాసాలే మంచి కవిత్వానికి మూలాధారం

Posted on Updated on

అధ్యయన అభ్యాసాలే మంచి కవిత్వానికి మూలాధారం
+++++++++++++++++ వారాల ఆనంద్
(మిత్రులు శ్రీ వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో వెలువడిన కవితాసంకలనం ‘కవనభేరి’ కి రాసిన నాలుగు మాటలు, చదవండి)

కవిత్వం భావోద్వేగాలను వ్యక్తపరుస్తుంది. మంచి కవిత్వం మనిషిలోని భావోద్వేగాల కళాత్మక వ్యక్తీకరణగా నిలబడుతుంది. అది వ్యక్తిగత స్థాయిలోనూ సామూహిక స్థాయిలోనూ పాఠకులను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. కవులు తమ భావాలను, ఆలోచనలను వ్యక్తీకరించడానికి తమ కవితల్లో ఘనీభవించిన, ఊహాత్మక భాషను ఉపయోగిస్తారు. కవులు తమ రచనల్లో అన్వేషించే ఇతివృత్తాలు విశ్వవ్యాప్తమయినవి. నిజానికి ప్రతిభావంతుడయిన కవి సాధారణ భాషని తన కవితల్లో ఊహాతీతమైన ఎత్తులకు తీసుకెళ్తాడు.
గొప్ప భావుకుడు, ప్రతిభావంతుడయిన కవి తన కవిత్వం ద్వారా చేసే వ్యక్తీకరణ తాను చెప్పదలుచుకున్న భావాన్ని దృశ్యమానం చేస్తుంది. దాంతో కవిత ఎంతో ఎత్తుకు ఎలివేట్ అవుతుంది. ఉత్తమ కవిత్వానికి అంతటి గొప్ప సామర్థ్యం వుంది. కవిత్వ వ్యక్తీకరణ అన్ని రూపాలలో అనేక రీతుల్లో మానవ అనుభవాన్ని ప్రతిబింబిస్తుంది, ప్రతిధ్వనిస్తుంది. నిజానికి ప్రతి కవితా రచనలో ‘ధ్వని’ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అక్కడే వచనానికి కవిత్వానికి వున్న తేడా తెలిసిపోతుంది. ఆసలయిన కవిత్వం సమాజంలోని మాట్లాడని మాట్లాడలేని ఆట్టడుగు వర్గాలకు శక్తివంతమైన నిర్భయమైన స్వరాన్ని ఇస్తుంది.
అలాంటి కవిత్వానికి శతాబ్దాల చరిత్ర వుంది. అది ఇవ్వాల్టిది కాదు. అలాంటి కవిత్వాన్ని గురించి అనేక మంది మహాకవులు అనేక రకంగా నిర్వచించారు. షేక్స్పియర్, ఈలియట్, పాబ్లో నెరూడా, టాగోర్ ఇట్లా అనేకమంది కవులు ఇదీ కవిత్వమని తమ తమ భావాల్ని అనేక సందర్భాల్లో ప్రకటించారు. మన శ్రీ శ్రీ ‘ప్రపంచమొక పద్మవ్యూహం, కవిత్వ మొక తీరని దాహం’ అన్నాడు. అంతే కాదు ‘ఆధునిక కవిత్వం అర్థం కాలేదంటే, ఆధునిక జీవితం అర్థం కాలేదన్నమాటే’ అని కూడా అన్నారాయన. ఇక గుర్రం జాషువా ‘వడగాడ్పు నా జీవితం. వెన్నెల నా కవిత్వం’ అన్నారు.
అంటే కవి తనతోనూ తన చుట్టూ వున్న ప్రపంచం తోనూ పెనవేసుకుని,ఆనందపడి, సంఘర్షించి, వేదనపడి వ్యక్తం చేసే భావ పరంపర కవిత్వం అవుతుంది. అది కూడా కళాత్మకంగా వున్నప్పుడు మరింత ప్రభావవంతంగా వుంటుంది.
…..
.

మొత్తానికి కవిత్వం అనేది కవికీ పాఠకుడికీ నడుమ సాగే గొప్ప సంభాషణ. అందుకే ఆ సంభాషణ కళాత్మకంగానూ,అర్థవంతంగానూ, ప్రభావవంతంగా వుండాలి. వుండి తీరాలి అప్పుడే అది పది కాలాలపాటు మిగిలి వుంటుంది.
ఇదంతా మిత్రులు శ్రీ వైరాగ్యం ప్రభాకర్ ‘కవన భేరి’ కవితా సంకలనానికి ఓ ముందు మాట రాయండి అన్నప్పుడు కలిగిన భావ పరంపర. ఇది ప్రభాకర్ గారు తమ భవానీ సాహిత్య వేదిక ద్వారా వెలువరిస్తున్న 92వ పుస్తకం. ఆ సంఖ్య చూసి నాకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఇవ్వాళ కవిత్వం ఎవరు చదువుతారు. అసలు ప్రజలు పుస్తకాలు చదవడమే మానేశారు అన్న వాదన సర్వత్రా వినిపిస్తున్న తరుణంలో ఇన్ని పుస్తకాలు ఇంత మంది కవులు వారి రచనలు చూస్తే ఆశ్చర్యం కాక మరేముంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లోంచి కవుల్ని సమీకరించి వారి కవితల్ని ఒకచోట చేర్చి సంకలనం చేయడం గొప్ప పని. ఈ సంకలనంలో పలువురు పాత వాళ్ళూ అనేకమంది నూతనంగా రాస్తున్నావారూ వున్నారు. కవితా అంశాల విషయానికి వస్తే ప్రకృతి,పర్యావరణం నుంచి మొదలు అనేకానేక అంశాల మీద రాసిన కవితలున్నాయి. వృక్ష వ్యధ మొదలు చరవాని దాకా తమ చుట్టూ వున్న అనేక అంశాల మీదా ఈ కవులు కవితలు రాశారు. వారి ఉత్సాహాన్ని అభినందించాల్సిందే. ఎందుకంటే ఎవరికయినా ఏదయినా తన భావాన్ని వ్యక్తం చేయాలనే తపన వుండడం అందుకు ప్రయత్నం చేయడం ముదావహం. ఆధునిక కాలప్రవాహంలో, సెల్ఫోన్, ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల ఉప్పెనలో పడి కొట్టుకు పోకుండా ఒక చోట నిలబడి స్పందించి, ఆలోచించి, వాటికి అక్షర రూపమివ్వడం గొప్ప ప్రయత్నం. వారి రచనలకు శ్రీ వైరాగ్యం ప్రభాకర్ పుస్తక రూపమివ్వడం అంటే మంచి వేదిక నివ్వడమే.
అయితే కవిత్వమే కాదు ఏ కళారూపమయినా అధ్యయనం అభ్యాసం మీదనే అభివృద్ది చెందుతాయి. గాయకుడయినా, చిత్రకారుడయినా, వాయిద్యకారుడయినా నిరంతర దీక్ష అభ్యాసాలతోనే ముందుకు సాగుతాడు. ఫలితంగా ఎదుగుతాడు. బాలమురళీకృష్ణ అయినా పండిట్ రవిశంకర్, పండిట్ భీంసెన్ జోషి అయినా అంతే. వారి నిరంతర కృషే వారి విజయానికి మూలాధారం. అది కవులకు కూడా వర్తిస్తుంది. తెలుగుతో సహా వివిధ భాషల్లో అనేక మంది కవులు ఏమి రాస్తున్నారు ఎట్లా రాస్తున్నారు అన్న పరిశీలన అధ్యయనం ఎంతో అవసరం. అట్లాగే నిరంతర అభ్యాసం కూడా అంతే అవసరం. అప్పుడే మంచి కవిత్వం వస్తుంది. మంచి కవులు నిలబడతారు.
మనసులోంచి వచ్చిన ఈ నాలుగు మాటలు రాయాలనిపించింది. భవిష్యత్తులో మరింత మంచి కవిత్వం రావాలని, మరిన్ని సంకలనాలు వెలువడాలని కోరుకుంటాను.
శ్రీ వైరాగ్యం ప్రభాకర్ గారికి, సంకలనంలోని కవులందరికీ అభినందనలు
– వారాల ఆనంద్

అధ్యయన అభ్యాసాలే మంచి కవిత్వానికి మూలాధారం

బతుకు సమీకరణం కాదు-వారాల ఆనంద్

Posted on

Friends,pl read my poem published today 15 April 2024  in Andhra Prabha daily, Tq

బతుకు సమీకరణం కాదు

++++++++++++ వారాల ఆనంద్

జీవితం నడుస్తున్నాదా

పరుగెడుతున్నదా చతికిలబడ్డదా

ఓ క్షణం వెనక్కి చూస్తూ

వేగం పుంజుకుంటున్నదా

వెనక్కు చూస్తూ చూస్తూ వెన్ను చూపిస్తున్నదా!

నిటారుగా నిలబడిందా

వంగుతూ లేస్తూ

అంబాడుతూ లేస్తూ

అవతలితీరంకేసి చూస్తున్నాదా

ఏమో అద్దంలో ప్రతిబింబాన్ని చూసినట్టు

నా బతుకు నాకూ

నీ బతుకు నీకూ తెలియాలి

లేదూ కెమెరా కన్నేసుకు చూసే

నీ ముందరి వాడికి తెలియాలి

అయినా బతుకు

ఏ సూత్రమో రసాయన సమీకరణమో అయితే

దానంత విసుగయిందీ అసహజమయిందేదీ లేదు

నిజానికి  

ఫ్లై ఓవర్ లాంటి ఎత్తుపళ్లాలతో 

మెలికలు తిరిగే మలుపుల్తో  

యాదేచ్చగా అర్థవంతంగా సాగేదే జీవితం

************ 9440501281        

YADONKI BARATH 2-series,Bo-11

Posted on

యాదోంకీ బారాత్

 2- సిరీస్- నంబర్ 11 

++++++++++++++++ వారాల ఆనంద్

జీవితం సరళరేఖ కాదు. తిన్నగా సాగడానికి. జీవితం నునుపయిన రహదారీ కాదు సాఫీగా నడవడానికి.  అనేక వంకరలు, వంపులు మలుపులు అనివార్యం. వాటన్నింటినీ దాటుకుంటూ మెలకువతో ముందుకు పయనించడమే జీవితం.

ఆ ప్రయాణానికి “ఎంట్రీ-ఎగ్జిట్” రెండూ వుంటాయి. మాతృగర్భంలోంచి మొదలయిన బతుకు ప్రవేశం(ఎంట్రీ) ఉత్సాహంగా ఆశలతో కలల్తో షురూ అవుతుంది. కానీ నిష్క్రమణే (ఎగ్జిట్) ఎవరిది ఎట్లా వుంటుందో ఏమిటో ఎవరమూ ఊహించలేం. ఎంట్రీ ఎగ్జిట్ లు రెండూ బాగుండాలనుకుంటాం. ఎవరమయినా ఎగ్జిట్ సంతోషంగా వుండాలనీ ఆశిస్తాం.

అది జీవితానికే కాదు బతుకులో ఏ ఉద్యోగానికయినా, వృత్తికయినా, మరే పనికయినా అంతే. ఎంట్రీ ఎగ్జిట్ అత్యంత ప్రధానమయినవి.

 నా ఉద్యోగ జీవితం ఎంట్రీ కొంత ఇష్టాయిష్టాల మధ్య 1980లో మొదలయింది. అనేక మలుపులతో 36 ఏళ్ళు గడిచాక 2016లో ఉద్యోగవిరమణ ఎగ్జిట్ సంవత్సరంలోకి చేరాను. అప్పటికి ఆ ప్రయాణం వివిధ కాలేజీల్లో అనేక మలుపులతో సాగిగింది. కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలోకి 2000 సంవత్సరంలో ఎంట్రీ జరిగి పదహారేళ్లు కొనసాగింది. అదే కాలేజీలో డిగ్రీ చదివిన పూర్వ విద్యార్థిగా ఎంతో ఉద్వేగంగా ఆ ప్రయాణం మొదలయింది. గ్రంధాలయ నూతన భవన నిర్మాణంలోనూ, అభివృద్దిలోనూ, విద్యార్థుల బహుముఖీన ఎదుగుదలకూ కొంత కృషి చేశాననే తృప్తి తోనే కాలేజీ ప్రయాణం సాగింది. మొత్తంగా ఇటు కాలేజీలో అటు బయటా సృజనాత్మక, సామాజిక రంగాల్లో పని చేయడానికి కాలేజీ, కాలేజీ మిత్రులూ నా వెన్నంటి వున్నారు. చేయిపట్టుకు  ముందుకు నడిపించారు.    

ఆ నడకలో ఓ ‘మెరుపు’ మెరిసింది. నాలోనూ మెరిసింది. ఉత్తర తెలంగాణా సాహిత్య ప్రపంచంలోనూ మెరిసింది. ఒక రోజు హైదరాబాద్ నుంచి ఆంధ్రభూమి సంపాదకులు శ్రీ ఏం.వి.ఆర్.శాస్త్రి, కవి మిత్రుడు ఆచార్య జయధీర్ తిరుమల రావు, నిజాం వెంకటేశంలు మేమంతా వస్తున్నాము. కరీంనగర్ లో కవులు రచయితలతో ఒక సమావేశం ఏర్పాటు చేయండి అన్నారు. అది నాతో ఎందుకన్నారో నాకు తెలీదు. శాస్త్రి గారికి నాకు అంతకు ముందు పరిచయమే లేదు. నా పేరు ఎవరు చెప్పారబ్బా అని ఆలోచించాను. బహుశా జింబో అని వుంటాడు. ఏది ఎట్లా అయితేనేం. మా ఫిల్మ్ భవన్ లో ఒక సమావేశం ఏర్పాటు చేశాను. సాహితీ మిత్రులందరికీ సమాచారం ఇచ్చాను. ఎంతమంది స్పందిస్తారో తెలీదు. ఎంతమంది వస్తారో ఊహించలేను. చూద్దాం అనుకున్నాను. సమావేశం సమయానికల్లా అనేక మంది  పెద్దలు, కవులు రచయితలు వచ్చారు. సమావేశంలో ఎం.వీ.ఆర్.శాస్త్రి గారు మాట్లాడుతూ ఆంధ్రభూమి జిల్లా ఎడిషన్లో వారం వారం రెండు పేజీలు సాహిత్యానికి కేటాయిస్తున్నామన్నారు. అంతే కాదు ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన సాహిత్యకారుల రచనలకు అందులో చోటు ఇవ్వాలనుకుంటున్నా మన్నారు. ఏమయినా సూచనలు ఇవ్వమన్నారు. డాక్టర్ గండ్ర లక్ష్మణ రావుతో సహా పలువురు మాట్లాడారు. జయధీర్ తిరుమల్ రావు, నిజాం వెంకటేశం గార్లు కూడా మాట్లాడారు. చివరన ఈ సాహిత్య పేజీకి ‘మెరుపు’ అని పేరు పెడుతున్నామన్నారు. ఆ పేజీకి వారాల ఆనంద్ బాధ్యుడుగా వ్యవహరిస్తారని ప్రకటించారు. నాకు కొంత ఆశ్చర్యం, మరికొంత ఆనందం. బాధ్యత తీసుకుంటారుగా అన్నారు శాస్త్రి గారు నేను సరే నన్నారు. దానికి సంభందించిన వివరాలు మాట్లాడదామన్నారు. సాహితీ మిత్రులంతా ఉత్తర తెలంగాణా సాహిత్యానికి ఒక వేదిక లభించినందుకు సంతోపడ్డారు. నాకయితే ఉత్సాహంగానే వుంది. అప్పుడు కరీంనగర్లో ఆంధ్రభూమి ఆఫీసు మా కాలేజీ గేటుకి సరిగ్గా ముందే వుంది. అంతేకాదు దాన్లో డీటీపీ ఆపరేటర్ చంద్రమౌళి గతంలో మా తో ఈనాడు లో పనిచేస్నవాడే. అంతా ఒకే అనుకున్నాం. నెక్స్ట్ వీక్ స్టార్ట్ అంటూ హైదరాబాద్ నుంచి వచ్చినవాళ్లు బయలుదేరారు. ఆంధ్రభూమిలో ప్రకటించారు. నేను వ్యక్తిగతంగా ఉత్తర తెలంగాణ జిల్లాల సాహిత్యకారులను సంప్రదించాను. అంతా ఉత్సాహం చూపించారు. అనేక వారాలు విజయవంతంగా సాగింది. తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న కాలమది. దాంతో నేను ఉత్తర తెలంగాణ జిల్లాల కవులు రచయితల ఇంటర్వ్యూ లు ప్లాన్ చేశాను. అందరినీ సంప్రదించి ప్రశ్నలు పంపాను.చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వారం వారం వేశాను. కవితలు,కథలు, సమీక్షలు ఓహ్ అన్ని కాలమ్స్ కొనసాగాయి. ఆ ఇంటర్వ్యూ లను “మెరుపు” పేర పుస్తకంగా తెచ్చాను. ఆ ఇంటర్వ్యూల్లో జింబో, దర్భశయనం, నలిమెల భాస్కర్, చొప్పకట్ల చంద్రమౌళి, అంపశయ్య నవీన్, తుమ్మేటి, వఝల శివకుమార్ తదితర అనేక మందితో చేసిన ‘ముఖా ముఖి’ ఇంటర్వ్యూలు ప్రచురించాను. దానికి 23 ఏప్రిల్ 2016 రోజున ఫిల్మ్ భవన్ లో ఆవిష్కరణ. సాహితీ గౌతమి నిర్వహణ. ఆవిష్కర్తగా కరీంనగర్ లో కలెక్టర్ గా పనిచేసి ఫిల్మ్ భవన్ నిర్మాణం లోనూ, కాలేజీ గ్రంధాలయ భావన నిర్మాణంలోనూ నాకు ఎంతగానో సహకరించిన మంచి మనిషి శ్రీ సి.పార్థసారధి గారిని పిలిచాను. ఆయన ఎంతో ఉత్సాహంగా రావడానికి అంగీకరించాడు. వచ్చారు కూడా. కె.ఎస్. అనంతాచార్య అధ్యక్షతన సభ చాలా ఆసక్తిగా ఆనందంగా జరిగింది. నాకు మెరుపు కోసం ఇంటర్వ్యూలు ఇచ్చిన పలువురు కవులు రచయితలు పాల్గొన్నారు. కవి మిత్రులు శ్రీ వఝల శివకుమార్, జింబో, నలిమెల భాస్కర్, దాస్యం సేనాధిపతి వేదిక మీద వుండి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ‘మెరుపు’ ఆవశ్యకతను ప్రాధాన్యతను గురించి మాట్లాడారు. ఉత్తర తెలంగాణాలో సాహితీ వేత్తలు తెలంగాణ గురించి ఎట్లా ఆలోచిస్తున్నారు, ఎట్లా స్పందిస్తున్నారు అనే విషయాల్ని ఆనాటి సభ విస్తృతంగా చర్చింది. సభలో శ్రీ నమిలకొండ హరిప్రసాద్, డాక్టర్ గండ్ర లక్ష్మణ రావు, పీ.ఎస్., తోట రమేశ్, మచ్చ హరిదాస్, డాక్టర్ రామకృష్ణ,. అన్నవరం దేవేందర్, ఎం.సరస్వతి, నవీన, ఇందిర, రేల తదితరులు పాల్గొన్నారు. పార్థసారధి గారు సాహితీ వేత్తలందరికి మెరుపు పుస్తకాన్ని అందజేశారు.

ఇదంతా ఇట్లా వుండగా అంతకు ముందే నా ‘మనిషి లోపల’ కవితా సంకలనం లోని కవితల్ని మిత్రురాలు బొడ్ల అనురాధ ఇంగ్లీష్ లోకి అనువదించడం ఆరంభించారు. అనురాధ గారు మాకు అత్యంత ఆత్మీయ స్నేహితులు. కరీంనగర్ లో ప్రముఖ విద్యావేత్త కీ.శే.నాగభూషణం గారు మొట్టమొదటి ట్యుటోరియల్ ఏర్పాటు చేసిన విద్యావేత్త. 70ల్లో ఎస్వీటీసీ నోట్స్ అంటే కరీంనగర్ విద్యార్థుల్లో గొప్ప ఆదరణ. వారి కూతురు అనురాధ. తన జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. హై స్కూలు చదువు తర్వాత వివాహమై ఇద్దరు పిల్లల తర్వాత వూహించని ఒంటరి జీవితంలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత దాంతో జీవితం ముగిసిందని ఆమె అనుకోలేదు. పోరాటమే తన జీవితం అనుకుంది. కాలానికి ఎదురొడ్డింది. తన కాళ్లమీద తాను నిలబడి ఉన్నత చదువులు కొనసాగించింది. ఎదురుదెబ్బలు తనకు ఎలాంటి ఆటంకం కావని ఆమె నిరూపించారు. కొంత కాలం మాల్దీవ్స్ కు కూడా వెళ్ళి అక్కడ పనిచేశారు. ఇంగ్లీష్ లో మంచి పట్టు సాధించారు. తనతో మాకున్న దశాబ్దాల స్నేహం, అభిమానంవల్ల ఆమె నా కవితల్ని ఇష్టంగా చదివింది. తనకు నచ్చిన ఆ కవితల్నిఅందంగా అర్థవంతంగా ఇంగ్లీషులోకి అనువదించే పని పెట్టుకుంది. చాలా గొప్ప అనువాదం చేశారామె. ఆ అనువాదాలతో ‘సిగ్నేచర్ ఆఫ్ లవ్’ పేర పుస్తకం తెచ్చాను. పుస్తకం ఆవిష్కరణల విషయంలో మిత్రుడు ఎన్.బి.టి. తెలుగు సంపాదకుడు డాక్టర్ పత్తిపాక మోహన్ సహకరించారు. ఆ సమయంలో తాను హైదరబాద్ లో లేకున్నా ఉస్మానియా కాంపస్లో వున్న తమ ఆఫీసులోని హాలులో ఆవిష్కరణ ఏర్పాట్లు చేశారు. ఆవిష్కరణకు ఆత్మీయ మిత్రుడు నారదాసు లక్ష్మణ రావు ని పిలిచాను. ఆయనకుతోడు డాక్టర్ నందిని సిద్దారెడ్డి, దర్భశయనం శ్రీనివాసాచార్య తదితరులు హాజరయ్యారు. కవిత్వం గురించి సిద్దారెడ్డి, అనువాదం గురించి దర్భశయనం మాట్లాడారు. అనువాదంలో అనురాధ చూపించిన పరిపక్వతని ఆయన సోధాహరణంగా చెప్పారు. ఇంగ్లీష్ పుస్తకానికి న్యాయం చేయడానికి దర్భశయనం సరయిన వాడని సిధారెడ్డి అన్నారు. ఆ తర్వాత ‘సూర్య’ దిన పత్రికలో మిత్రుడు టీవీ9 వొడ్నాల చంద్రమౌళి మంచి సమీక్ష చేశారు. 1990ల నుంచి పరిచయమూ స్నేహమూ వున్న చంద్రమౌళి చాలా సంవత్సరాలు ఈనాడులో సబ్ ఎడిటర్ గా పని చేసారు. వయసులో నాకంటే చాలా చిన్న వాడే అయినా ఇద్దరి నడుమా దగ్గరి స్నేహం అల్లుకుపోయింది. భావుకుడు ప్రగతిశీలవాది అయిన చంద్రమౌళి సిగ్నేచర్ ఆఫ్ లవ్ గురించి రాస్తూ ‘సమాజం పైన కవి వారాల ఆనంద్ చేసిన ప్రేమ సంతకమిది. మనసు నిండా ప్రేమను నింపుకున్న కవి తన కవిత్వం నిండా ప్రేమను నింపడం సహజమే. ఆ ప్రేమ మనుషులపట్ల, సమాజం పట్ల,మనుషుల మనుగడకు ఆధారభూతమయిన భూమి గాలి నీరు పట్ల కనిపిస్తాయి. వారాల ఆనంద్ జీవితం నిండా కవిత్వం కనిపిస్తుంది’ అని రాశాడు. రోజూ కలిస్తేనే స్నేహాలు నిలుస్తాయా… ఎప్పుడో ఒకసారి కలిసే చంద్రమౌళి తో స్నేహం గత మూడు దశాబ్దాలకు పైగా కొనసాగడం లో ఆయన చూపించే ఆప్యాయత ప్రధాన కారణం. ఈనాడు తర్వాత తాను ఎలెక్ట్రానిక్ మీడియాకు వెళ్ళాడు.

ఇక సమీక్షలకు పంపించే క్రమంలో సిగ్నేచర్ ఆఫ్ లవ్ ని ఇండియన్ లిటరేచర్ కు కూడా పంపాను. అక్కడ ఆ పుస్తకాన్ని చూసిన తమిళ కవి, ప్రముఖ అనువాదకుడు చంద్ర మనోహరన్ ఒకరోజు ఫోన్ చేసారు. మీ పుస్తకాన్ని తమిళం లోకి తేవచ్చా అని అడిగాడు. నేను వెంటనే చాలా సంతోషం అన్నాను. తానే దాన్ని తమిళం లోకి అనువదించారు. కేంద్ర సాహిత్య అకాడెమికి అనేక అనువాదాలు చేసిన చంద్ర మనోహరన్ స్వచ్చందంగా ‘అన్బిన్ కైచాంది’ పేర వెలువరించారు.  ఆ అనువాద సంకలనాన్ని తమిళనాడుకు చెందిన ‘ఆర్ట్ లిటరరీ క్లబ్’ ఆవిష్కరించింది. ఆనాటి కార్యక్రమానికి నేను వెల్ల లేదు కానీ ఆ సభలో సంస్థ కార్యదర్శి బి. ఆర్. నటరాజన్,డాక్టర్ సురేష్,డాక్టర్ మీనా సుందర్,డైరెక్టర్ మని, అన్వాదకుడు చంద్రమనోహరన్ పాల్గొన్నారు. ముక్కూ మొహం తెలీని  నేను రాసిన నా కవిత్వాన్ని తమిళంలోకి అనువదించి ప్రచురించిన చంద్ర మనోహరన్ కి ఎంతని ఏమని కృతజ్ఞతలు చెప్పను. ధన్యవాదాలు అంటూ నమస్కరించడం తప్ప.

2016 నాటి మరిన్ని వివరాలతో మళ్ళీ కలుస్తాను..

+++++

వారాల ఆనంద్

24 మార్చ్ 2024   

CHUKKALA MUGGU ‘POEM’

Posted on

Friends, pl click the link below to read my poem published today in sanchika online magazine, thanks to the editor- anand Anand Varala
https://sanchika.com/chukkala-muggula-va-poem/

గానుగ యంత్రం+కేహ్రీ సింగ్ మధుకర్ ( డోగ్రీ కవిత)

Posted on

గానుగ యంత్రం
++++++++++ కేహ్రీ సింగ్ మధుకర్ ( డోగ్రీ కవిత)

గానుగ యంత్రం గర గరలాడుతూ పని చేస్తుంది
ఎద్దు దాని వెనకాలే క్రమం తప్పకుండా స్థిరంగా నడుస్తుంది
గుండ్రంగా నెలలూ ఏడాదులూ లెక్కించకుండా
జీవితకాల ప్రయాణాన్ని కొనసాగిస్తుంది
మెడలో గంటలు గణగణ మంటాయి
కంభాన్ని లాగుతూ విత్తనాల్ని నలగ్గొట్టుతూ నూనె తీస్తుంది

కొరడాని గట్టిగా ఝలిపించినప్పుడు
దేహం గాయాల పాలవుతుంది
కంటి రెప్పలు మూతబడతాయి
మెదడు మొద్దుబారిపోతుంది
అయినా అది అన్ని కాలాల్లోనూ నడుస్తుంది
వేగాన్ని పెంచమంటూ చిన్నాపెద్దా
తిట్టే తిట్లను భరించడం తప్ప
నిస్సహాయ చట్రానికి బంధీ అయిన దానికి
వేరే దారి లేదు

వెలకొద్ది మైళ్ళు నడుస్తుంది
అయినా వున్నచోటే వుంటుంది
వ్యాపారి నూనెను అంగట్లో అమ్ముకుంటాడు
ఎద్దుకు ఆ వ్యవహారంలో ఎలాంటి పాత్రా లేదు

ఒకరు రాత్రీ పగలూ కష్టపడితే
మరొకరు ఆనందం పొందుతారు
ఒకరు చెమటోడిస్తే
మరొకడు లబ్ది పొందుతాడు

అంతేకాదా
ఒకరిది దుఖమయితే నూనె మరొకరిది
ఈ ప్రపంచమే ఒక గానుగ యంత్రం
అది అట్లాగే నడుస్తుంది
మనిషిని ఎద్దులా మార్చేసి
మట్టి పొరల్లో కొర్చేశారు
++++++
ఆంగ్లానువాదం: కేహ్రీ సింగ్ మధుకర్
తెలుగు: వారాల ఆనంద్
******************************
11 March 2024

గానుగ యంత్రం
++++++++++ కేహ్రీ సింగ్ మధుకర్ ( డోగ్రీ కవిత)

YADONKI BARATH 2 SERIES,No-9

Posted on

యాదోంకీ బారాత్

2 సిరీస్- నంబర్- 9  

+++++++++++++++ వారాల ఆనంద్

ఎందుకయినా మంచిది/ కనురెప్పలు తెరిచే వుంచాలి/ ప్రకృతి ఏ అందమయిన దృశ్యాన్నో\

నీ కంటిలో వేసి పోవచ్చు/పోతూ పోతూ ఓ తుంటరి మబ్బు తునక/ఇంధ్రధనుస్సుని సాక్షాత్కరింప చేయొచ్చు

ఎందుకయినా మంచిది/ పిడికిలి తెరిచే వుంచాలి/ఎవరయినా చేతిలో చెయ్యేసి/

స్నేహ హస్తం కలిపేసి పోవచ్చు/ నడుస్తూ నడుస్తూ మనిషనేవాడు/ఓ ఆలింగనం ఇచ్చి పోవచ్చు

ఎందుకయినా మంచిది/ హృదయం తెరిచే వుంచాలి/ మనసుగల ఏ మనిషో/ తలుపు తట్టకుండానే పలకరిచి పోవచ్చు/ కదుల్తూ కదుల్తూ  ఆత్మగలవాడు/ ప్రేమ సంతకం చేసిపోవచ్చు         

ఈ కవిత నా ‘మనిషి లోపల’ కవితా సంకలనంలో రాసుకున్నాను. అవును ఎవరమయినా మనసు ఆంటెన్నాను తెరిచి వుంచితే మంచిది. కానీ ఇవ్వాళ ఆన్టెన్నా ల కాలం పోయింది. ఇప్పుడంతా చుట్టూరా అలుముకుని పరుచుకున్న ‘వై వై’.  దానికి కూడా మన లోపలి రిసీవర్ సిద్దంగా వుండాలి. అప్పుడే దేన్ననయినా స్వీకరించేందుకు మనం సిద్దంగా వుంటాం. ఓపెన్ నెస్ ని అందిపుచ్చుకుని ఈ మొత్తం సాంకేతికత సంక్లిష్టతల నేపధ్యంలో నేను నా రొటీన్ కార్యక్రమాలల్లో చేరిపోయాను. కాలేజీలో ఆక్టివ్ గా వుంటూనే సినిమాల మీద ముఖ్యంగా తెలంగాణ సినిమాల మీద వ్యాసాలు రాయడం విస్తృత పరిచాను. నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో రాస్తూ పోయాను. ఇక నా ఆరోగ్యం కొంత మెరుగు పడింది. అయినప్పటికీ ఎప్పటికప్పుడు క్రెయాటిన్ లాంటి అనేక పరీక్షలు చేయించుకుంటూనే నెఫ్రాలజిస్ట్ ను కలవడం తప్పలేదు. నా మట్టుకు నాకు డాక్టర్ గందే శ్రీధర్ హైదరాబాద్ నుండి ప్రతి బుధవారం కరీంనగర్ కు విజిటింగ్ రావడం ఎంతో ఉపయోగపడింది. లేకుంటే ప్రతి సారీ హైదరబాద్ వెళ్లాల్సిన పని బడేది. డాక్టర్ శ్రీధర్ సివిల్ ఆసుపత్రి రోడ్డులోని న్యూ శ్రీనివాస మెడికల్స్ ఆవరణలోని క్లినిక్ కి వస్తాడు. జిల్లాలోని అనేక మందికి ఆయన సేవలు ఎంతో ఉపయోగకరంగా వుంటాయి. ఇక కరీంనగర్లో  వైద్య సదుపాయాల పరిస్తితి చూస్తే అప్పటిదాకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఫిజిషియన్స్, సర్జన్స్ అందుబాటులో వుండేవాళ్లు. కానీ ఎప్పుడయితే ‘ప్రతిమ’,’ చలిమెడ ఆనందరావు’ పేర్లతో రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయో అప్పటినుండి అత్యున్నత స్థాయి డీ.ఎం. లు అందుబాటులోకి వచ్చారు. దాదాపు అన్నీ విభాగాల్లో యువ వైద్యులు వచ్చారు. కొంత ఖర్చయినా ఉత్తమ వైద్య సేవలు లభించడంతో ఒకరకంగా మంచే జరిగింది.

అట్లా నేను వారం వారం వైద్య పరీక్షలు నెలకో సారి డాక్టర్ విజిట్ కి వెళ్ళడం సాగుతూనే వుంది. పరిస్తితి మెరుగ్గా వుండడంతో రాయడం, కార్యక్రమాల నిర్వహణ కొనసాగిస్తూనే వచ్చాను. కాలేజీలో ప్రిన్సిపాల్ డాక్టర్ మధుసూధన్ రెడ్డి కూడా ఆక్టివ్ గా వుండడంతో అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. అందులో నాకు గుర్తున్నంత వరకు తెలంగాణ సినిమా ఎదగాలని, అది తన స్వీయ గొంతుకతో పలకాలని తపిస్తూ అనేక సూచనలు చేస్తూ వ్యాసాలు రాశాను. అదే సమయంలో కాలేజీలో 26 మే 2015 రోజున ‘తెలంగాణ సినిమా దశ దిశ’ పేర సదస్సు నిర్వహించాను. దానికి మేయర్ శ్రీ రవీందర్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవగా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. విద్యార్థుల్లో సినిమా చైతన్యం పెరిగేందుకు దోహదం చేసింది. ఆ తర్వాతి కాలంలో ‘తెలంగాణ సినిమా-దశ దిశ’ పేర పూర్తి స్థాయి పుస్తకమే తెచ్చాను. ఇక మా కాలేజీలోనే ‘తెలంగాణ కళ-పేరిణి నృత్యం’ మీద పక్షం రోజుల పాటు వర్క్ షాప్ నిర్వహించాము. దానికి మా కొలీగ్ శ్రీమతి ఎలిజబెత్ రాణి పూర్తిగా సహకరించారు. విద్యార్థినీ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పేరిణి మీద మా అబ్బాయి అన్వేష్ మంచి ఫోటో షూట్ చేశాడు. డాక్యుమెంటరీ కూడా ప్లాన్ చేశాం కానీ పేరిణి లో ప్రముఖుడయిన ఓ కళాకారుడి అభ్యంతరాలు వాద వివాదాల నడుమ ఆ డాక్యుమెంటరీ ప్రయత్నం నిలిచిపోయింది. నేనూ అన్వేష్ బాగా నిరుత్సాహపడ్డాం. ఇట్లా పలు కార్యక్రమాల్లో బిజీ వుంటూ అత్యంత మామూలుగా వున్నాను.అప్పుడే ప్రముఖ తెలంగాణ సినీ కథానాయకుడు టి.ఎల్.కాంతారావు జయంతి ఉత్సవాన్ని16 నవంబర్ 2015 రోజున

 శ్రీ సి.వి.ఎల్.నరసింహా రావు నిర్వహిస్తే హైదరాబాద్ వెళ్ళి వచ్చాం. సభ బాగా జరిగింది. సీవీల్ గారి దీక్ష చాలా గొప్పది.

….

ఇదంతా ఇట్లా జరుగుతుండగానే మళ్ళీ ఒకసారి అనారోగ్య బాంబు పేలింది. ఒక ఆదివారం రోజున నా పెదవి కింద కట్ అయిన విషయం గమనించిన ఇందిర అదేమిటి అంది. ఏదో షేవింగ్ లో కట్ అయివుంటుంది అని తేలిగ్గా తీసేశాను. అది కాస్తా మర్నాటికి ముక్కు పక్కకు చేరింది. ఇందిర కంగారు పడింది. నీకన్నీ అనుమానాలే అంటూ బుధవారం డాక్టర్ దగ్గరికి వెళ్దాం లే అన్నాను. అనుకున్నట్టుగానే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఏమిటి ఆనంద్ ఎట్లా వున్నారు అని ఆయన అడుగుతూ వుండగానే ఇందిర కట్ అయిన విషయం చెప్పింది. ఆయన అదేమీ వినకుండానే సీరియస్ గా ఫేస్ మాస్క్ తీయించి మొత్తం ముక్కు పక్కనుంచి ముఖమంతా పరిశీలించారు. ఆనంద్ మీరు వెంటనే హైదరాబాద్ బయలుదేరండి. నేను హాస్పిటల్ కి ఫోన్ చేస్తాను వెంటనే అడ్మిట్ కండి అన్నాడు. నాకేటూ పాలు పోలేదు. ఏమయింది సార్ అన్నాను. నేను చెబుతున్నాను కదా వెంటనే బయలుదేరండి అన్నారాయన. మేము బయటకొచ్చి అప్పటికి సాయంత్రం ఆరు దాటుతున్నది అప్పటికప్పుడు వెల్లడమెట్లా అనుకున్నాం. మెడికల్ షాప్ ముందు కూర్చుని కొంత సేపు తర్జన భర్జన పడ్డాం. ఇందిరకు ఒకటే కంగారు ఆందోళన. మళ్ళీ లోనికి వెళ్ళి డాక్టర్ణి కలిసి రేపుదయం వస్తామన్నాము. అదేమీ నాకు తెలీదు మీరు రేపుదయం 5 గంటలక్ల్లా అడ్మిట్ కావాలి మరి అన్నాడు. ఇంటికి వచ్చి ఏవో కొన్ని సర్దుకుని అర్ధరాత్రి బయలుదేరాము. గ్లోబల్ లో అడ్మిట్ అయ్యాను. వెంట వెంటనే రక్త పరీక్షలు అవీ చేశారు. అడిగితే బ్లడ్ బాంబే పంపిస్తున్నాం. రిపోర్ట్ రావడానికి రెండు రోజులు పట్టొచ్చు అన్నాడు టెక్నీసియన్. కొంత సేపటికి డాక్టర్ శ్రీధర్, డాక్టర్ రమాశంకర్, డాక్టర్ రఘు అంతా వచ్చేశారు. ఆనంద్ రిపోర్ట్ రావడం లేట్ అవుతుంది ట్రీట్మెంట్ మొదలు పెడుతున్నాం అన్నారు. అసలు ఇంతకూ ఏమయింది సార్ అని అడిగాను. ఏమీ లేదు సీరియస్ వైరల్ ఇన్ఫెక్షన్ వుంది. అయిదు రోజుల పాటు అయిదు ఇంజెక్షన్స్ ఇస్తాం. ఒక్కొక్కటి డ్రాప్ బై డ్రాప్ 7 గంటలు తీసుకుంటుంది. ఒక్కో ఇంజెక్షన్ ముప్పై అయిదు వేలు వుంటుంది అన్నారు. డబ్బు సరే విషయం అంత ప్రమాదకరమా అన్నాను. అవును అన్నారు. రిపోర్ట్ కోసం వేచి చూసే సమయం కూడా లేదు ట్రీట్ మెంట్ మొదలు పెడుతున్నాం అన్నారు శ్రీధర్. నేను బదులిచ్చే లోపలే మీరేట్లా అనుకుంటే అట్లా చేయండి సర్ అంది ఇందిర. ఐవీ ఇంజెక్షన్ మొదలయింది. ఐసీయు లో వుంచారు. టోటల్ కంటోల్డ్ వాతావరణం. అప్పుడు డాక్టర్ రమాశంకర్ వచ్చి పక్కన కూర్చుని ఆనంద్ గారు ఇది మీ ట్రాన్స్ ప్లాంట్ కంటే సీరియస్ స్థితి. బయటకేమీ కనిపించదు కానీ ప్రమాదం. మీరు వెంటనే కరీంనగర్ లో శ్రీధర్ ని కలవడం మంచిది అయింది. ఆయన కూడా వెంటనే స్పందించాడు. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వుండాలి. అయిదు ఇంజెక్షన్స్ తర్వాత మీ ఇమ్యూనిటీ, ఎనర్జీ మొత్తం జెరో కి వస్తుంది. కొద్ది రోజులు కదలడం కూడా కష్టం అవుతుంది. మీకు మీరు కప్ పట్టుకుని టీ తాగలేరు, షర్ట్ కూడా వేసుకోలేరు. ఆ స్థితిలో చాలా జాగ్రత్తగా వుండాలి. ప్రోటీస్ డోస్, సప్లిమెంట్స్ ఇస్తాం కానీ సమయం పడుతుంది అన్నారు. అప్పటికి కానీ మాకు అసలు స్థితి అర్థం కాలేదు. ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ అప్పుడు కూడా ఇందిర కళ్ళల్లో నీళ్ళు చూడలేదు. కానీ ఇప్పుడు కళ్ళు వొత్తుకోవడం గమనించాను. ఏమీ కాదు లేవోయి అంటున్నాను నేను. బాంబే రిపోర్ట్ శ్రీధర్ గారు వూహించినట్టే వచ్చింది. అప్పటికే ట్రీట్మెంట్ మొదలయింది. మూడో రోజుకి మెడిసినల్ ప్రభావం మొదలయింది. నాలో బలహీనత పుంజుకుంది. క్రమంగా సత్తువ కోల్పోసాగాను. మాట బాగానే వుంది. ఇందిరనే తినిపించడంతో సహా అన్నీ పనుల్లో సాయం చేయసాగింది. బాప్ రే. హింస అంటే ఇది కదా అనిపించింది. నా పరిస్తితి గమనించిన ఇందిర డాక్టర్ శ్రీధర్ తో మాట్లాడుతూ ఇంకా ఎవరయినా సీనియర్. మీ ప్రొఫెసర్స్ ని సంప్రదించండి అంది. మీరెక్కడికయినా వెళ్ళండి నేను మాట్లాడతాను అన్నారు శ్రీధర్. లేదు లేదు మిమ్మల్నే నమ్ముకున్నాను, నాకట్లా అనిపించింది అంది ఇందిర. మర్నాడుదయమే ఓ సీనియర్ నేప్రాలజీ ప్రొఫెసర్ ని పిలిపించారు. ఆయన చూసి ఎవ్రీ థింగ్ ఇస్ ఆన్ గుడ్ లైన్స్ అని వెళ్లారు. ఇన్ని ట్రాన్స్ ప్లాంట్స్ చూసాము మీది పెక్యులియర్ అన్నారు. అవును మరి ఆనంద్ అంటే మజాకా  పెక్యులియరే మరి అని నేనూ ఇందిరా నవ్వుకున్నాము. డాక్టర్స్ చర్చించుకుని ఏవో నిర్ణయాలు తీసుకున్నారు. 

హైదరబాద్ ఆసుపత్రిలో వుండడం ఏదో ఒకరోజు మాత్రమే అనుకున్నాం. వెంట బట్టలు అవీ ఏమీ లేవు. ఖైరతాబాద్ లో మంజు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇందిర వాషింగ్ పని ముగించుకు వచ్చింది. అయిదు రోజుల మెడికల్ డోసేజీ అయిపోయాక డాక్టర్స్ అన్ని పరీక్షలు చేసి ఒకే కరీంనగర్ వెళ్లమన్నారు. కానీ మూడు నెలలు సెలవు పెట్టండి. ఇంట్లోంచి బయటకు పోవద్దు. సాధ్యమయినంత మేర ఎవరినీ దగ్గరకు రానివ్వవద్దు అన్నారు. క్రమంగా కోలుకుంటారు అని కూడా అన్నారు. దాదాపు స్టేచ్చర్ పైననే బయటకు వచ్చి కారులో కరీంనగర్ చేరుకున్నాం. ఏముందిక 100 శాతం రెస్ట్. కదలడం కష్టం. ఆ కాలం ఎట్లా గడిచిందో ఇప్పుడు వూహించుకుంటే భయమేస్తుంది. న్యూస్ పేపర్ చదవలేను, స్వంతంగా స్నానం చేయలేను, నా కిష్టమయిన టీ నాకు నేను తాగలేను అబ్బో అదంతా పెద్ద నరకం. భరించాం తప్పదు కదా. మొత్తం మీద ఆ ఇన్ఫెక్షన్ ఎట్లా సోకిందో తెలీదు కానీ సరయిన సమయానికి శ్రీధర్ గారిని కలవడం ఆయన వెంటనే స్పందించి, రోగ నిర్ధారణ చేయడంతో బయటపడ్డాను.  

మిగతా వివరాలతో మళ్ళీ వారం…

-వారాల ఆనంద్

10 మార్చ్ 2024

GULZAR ARTICLE ANDHRA PRABHA

Posted on

 కవిత్వంలో ప్రతీకలు మనసు తట్టి చేయి పట్టుకు నడిపిస్తాయి

++++++++++++++++++ వారాల ఆనంద్ 

 ఒక కవిని గతంలో చదివినప్పటికీ ఆ కవిని మళ్ళీ మళ్ళీ  చదవడం గొప్ప అనుభవం. “REVISITING ALWAYS REJUNAVATES “. ఒక కవిని లేదా ఒక కవితని మళ్ళీ మళ్ళీ చదవడం ద్వారా కొత్త అర్థాలు స్పురిస్తాయి.కొత్త భావాలు ధ్వనిస్తాయి.సరికొత్త అనుభవాలు ఆవిష్కృతమవుతాయి. ఆ కవి సరికొత్తగా దర్శనమిస్తాడు. ప్రేమగా ఆసక్తిగా వింటే ’Between the lines’ లోంచి ఆ కవి మనతో మరింత ఆర్తిగా, వేదనగా, సంతోషంగా మాట్లాడతాడు. ఒకింత లోతుగానూ మరింత విస్తృతంగానూ ఆ సృజనకారుడు మనముందు ఆవిష్కృత మవుతాడు. మనల్ని మనం తరచి చూసుకునేలా చేస్తాడు. ఎప్పుడూ ఇష్టంగా చదువుతూ వుండే గుల్జార్ ని ఆయనకు ‘జ్ఞాన్ పీఠ్’ ప్రకటించిన తర్వాత మళ్ళీ మళ్ళీ చదవడం సరికొత్త అనుభవమే. గుల్జార్ కవిత్వాన్నీ వచనాన్నీ మొత్తంగా ఆయన సృజనని చదవడంలో అందుకున్న ఆనందం రెట్టింపులు అయింది.  

ఆయన కవిత్వం తాను  పాఠకుడితో మాట్లాడుతున్నట్లే ఉంటుంది. ఆ కవిత్వం నిండా ప్రతీకలు (ఇమేజేశ్) పరుచుకుని వుంటాయి. సాధారణంగా ఎప్పుడూ మనం చూసే చిత్రాల్ని, దృశ్యాలనే ప్రతీకలుగా చేసుకుని అతి సున్నితమయిన అంశాల్ని కవిత్వం చేస్తాడు. ఆయన కవితల నిండా మనిషి, మనసు, ప్రకృతి, మానవత్వం కనిపిస్తాయి. ఇట్లా గుల్జార్ కి జ్ఞానపీఠ్ అవార్డు వచ్చిన సందర్భంగా మరోసారి చదువుతూ వుంటే అనేక కోణాల్లో గుల్జార్ ని అర్థం చేసుకునే అవకాశం కలిగింది. నన్ను నేను, నాలోకి నేను తరచి, తరచి చూసుకునే అవకాశమూ లభించిది. ఓ గొప్ప కవిని తిరిగి దర్శించడం అంటే ఇదేనేమో.

     భారత దేశభజనలో జరిగిన హింసకు గురయిన కుటుంబం ఆయనది. పాకిస్తాన్ నుంచి సరిహద్దును దాటి ఈ పక్కకు వచ్చారు. అప్పుడు జరిగిన దుర్మార్గాలను స్వయంగా చూసిన గుల్జార్ ఆనాటి అనుభవాల్ని కవితలుగా కథలుగా రాశారు… ’ఫుట్ ప్రింట్ ఆన్ జీరో లైన్’ పుస్తకంగా వచ్చింది.

“అది ఇప్పటికీ నా మాతృభూమే

కానీ ఇకపై ఎప్పటికీ నా దేశం కాదు

అక్కడికి వెళ్లాలంటే రెండు ప్రభుత్వాల్లోని ఎన్నో కార్యాలయాల చుట్టూ తిరగాలి

నా కలలకు ఆధారాల్ని చూపుతూ

నా ముఖం మీద ముద్రలు వేయించుకోవాలి” 

అంతేకాదు ‘నెగ్లెక్టెడ్ పోయెమ్స్’ లో

‘కళ్ళకు వీసా అవసరం లేదు

కలలకు సరిహద్దులు లేవు

నేను నా కళ్లను మూసుకుని

సరిహద్దును దాటి వెళ్తాను

మెహెంది హాసన్ ని కలవడానికి’ అంటూ తన వేదనని చెబుతాడు. 

     కవిగా రచయితగా గుల్జార్ అనేక భిన్నమయిన వైవిధ్యమయిన ప్రక్రియల్లో రాశారు. విభిన్న కళారూపాల్లో కృషి చేశారు. దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా దృశ్య మాధ్యమంలో, సినీ గేయరచయితగా సంగీత ప్రపంచంలో గుల్జార్ ఆవిష్కరించిన కళాత్మకత ఎంతో విశాలమయింది, విలక్ష్ణమయింది. అయితే “ఎన్ని రూపాల్లో తన భావాల్ని వ్యక్తం చేసినప్పటికీ తనకు  ‘అక్షరమే’ ఆలంబన అని, రచనే తన మౌలిక వ్యక్తీకరణ రూపమని” ఆయన అంటారు. సాహిత్యం విషయానికి వస్తే ఆయన కవిత్వం, కథలు, జ్ణాపకాలు, పిల్లలకోసం కథలు పాటలు, కవితానువాదాలు, త్రివేణి పేర మూడు లైన్ల చిన్న కవితలు, ‘టూ’ పేర ఒక ఇంగ్లీష్ నవల, కామిక్స్ , ‘చక్కర్ చలాయే ఘన్ చక్కర్’ నాటకం, ఇట్లా అనేక ప్రక్రియల్లో రాసారు.  ఆయన ప్రధానంగా ఉర్దూ లో రాస్తారు. ఉర్దూ ఎంతమంది చదువుతున్నారు అది అంతరించి పోతున్న భాష అని ఎవరయినా అంటే గుల్జార్ అందుకు అంగీకరించడు. భాష ఎప్పటికీ అంతం కాదు. లిపి మారితే మారొచ్చు. కానీ భాష కు మరణం లేదు అంటాడాయన, మన దేశంలో పంజాబీ భాషను ఇప్పుడు గుర్ముఖీ లిపిలో రాస్తున్నారు, అదే పాకిస్తాన్లో వున్న పంజాబ్ లో ఉర్దూ లో రాస్తారు అంటాడాయన, మన దేశంలో ఉర్దూ పార్శీ ప్రభావంతోనూ, హిందీ సంస్కృత ప్రభావంతోనూ వుంది. కానీ ఇప్పుడు హిందీ ఉర్దూ ల్లో పెద్ద తేడా లేదు. సినిమాల్లో చూసినా బయట చూసినా వాడే హిందీలో అధిక శాతం ఉర్దూ మాటలే.  అందుకే మనం దాన్ని హిందూస్థానీ అనాలి అంటాడు గుల్జార్. అయితే ఆయన రచనలు ఇంగ్లీష్, పంజాబీ, బెంగాలీ, బ్రిజ్, ఖరీబౌలి, హర్యాన్వి, మార్వారి భాషల్లో కూడా విశేష ప్రాచుర్యం పొందాయి.గుల్జార్ తన సృజాత్మక వ్యక్తీకరణల్లో ఇంత వైవిధ్యాన్ని విలక్షణతను సాధించడానికి ఆయన తన 90 ఏండ్ల వయసులో కూడా తనలోని సున్నితత్వాన్ని పోగొట్టుకోక పోవడమే ప్రధాన కారణం. ఆయన ఇప్పటికీ క్రమం తప్పకుండా, క్షణం వృధా చేయకుండా చదువుతూనో రాస్తూనో మాట్లాడుతూనో వుంటారు. అదే ఆయన బలం. మరో వైపు చూస్తే గుల్జార్ తన రచనల్లో వివిధ భారతీయ, భారతీయేతర భాషల్ని, ఆయా భాషల్లోని మాండలికాల్ని, జాతీయాల్ని ఆలవోకగా ఉపయోగిస్తాడు. దానికి ఆయన చేసే వివిధ భాషల అధ్యయనమే ప్రధానమయిన భూమిక. గుల్జార్ రాసిన తొలి సినిమా పాట ‘బందిని’ లోని మేర గోరా అంగ్ లయ్లే.. పాట పూర్తిగా అవధ్. ఇక ఆయనకు ఆస్కార్ తెచ్చిన ‘జయ్ హొ.’లో పంజాబీ తో పాటు కొంత స్పానిష్ కూడా ధ్వనిస్తుంది. ఇక ఆయన కవిత్వంలో ఆయన పలికించే ప్రతీకలు ప్రధాన బలం. గుల్జార్ కవితలు, గజల్స్ లో జానపదుల ఒరవడి, అమీర్ ఖౌస్రో, గాలిబ్, బాబా బుల్లే షా లాంటి కవుల అధ్యయన  ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆయన రచనల్లోని మరో ముఖ్యాంశం ఆయన కవిత్వంలోనూ జీవితంలోనూ వున్న ‘డౌన్ టు ఎర్త్, డౌన్ టు హార్ట్’ లక్షణం.అది ఎళ్ళ వేళల్లా ఆయన రచనల్లో ధ్వనిస్తూనే వుంటుంది. ‘కబీ రూహ్ దేఖీ హై.. ‘  అని ఆయన అన్నప్పుడు గుల్జార్ లోని తాత్వికత ఆవిష్కృతమవుతుంది.

చాలా విస్తృతంగా రాసిన  గుల్జార్ కవితా సంకలనాల వివరాల్లోకి వెళ్తే ఆయన రచనల్లో ప్రధానమయినవి సెలెక్టెడ్ పోయెమ్స్, నేగ్లెక్టెడ్ పోయెమ్స్, గ్రీన్ పోయెమ్స్, సైలెన్సెస్, ఫుట్ ప్రింట్ ఆన్ జీరో లైన్, ప్లూటో, ఇలాంటివెన్నో ఉన్నాయి. ఇటీవలే గుల్జార్ కవిత్వం లోంచి సేకరించిన కవితలతో కూడిన సమగ్ర సంకలనం ‘బాలో-పార్:..కలెక్టెడ్ పోయెమ్స్” వెలువడింది. రక్షందా జలీల్ ఆ కవితల్ని ఇంగ్లీష్ లోకి అనువదించారు. మొత్తం 1400 పేజీల ఈ సంకలనంలో గుల్జార్ మూల కవితలు వాటి అనువాదాలతో కూడిన ఈ సంకలనంలో చాంద్ పుఖ్ రాజ్ కా, రాత్ పాశ్మీనేకీ, పంద్రా పాచ్ పచత్తర్, కూచ్ ఔర్ నజ్మే, ప్లూటో, త్రివేణి సంకలనాల్లోంచి తీసుకున్న కవితలున్నాయి.

++++

గుల్జార్ కవిత్వాన్ని గురించి మరింతగా చెప్పుకుంటే ఆయన ‘ఆకుపచ్చ కవితలు’తో సహా గొప్ప భావుకుడయిన ఆయన సాహిత్యంలో అంతర్లీనంగా ఒక సామాజిక కామెంట్‌ వుంటుంది. ఇక ఆయన భాష,,రచనా శైలి కూడా చాలా సున్నితంగావుండి హృదయానికి హత్తుకునేలా వుంటాయి. ఆయన కవిత్వం చదువుతూ వుంటే ఆయన వాడిన  ఇమేజెస్‌లో వున్న ఒక తాజాదనం మనల్ని కదిలిస్తుంది. పాఠకుడి మనసు కదిలిపోతుంది.

ఈ కవిత చూడండి…

‘గగన సీమలో ఆకాశం

అతుకులు అతుకులుగా విడిపోతున్నది,

ఎన్ని ప్రాంతాల్నుంచి

ఈ గుడారం విడిపోతున్నదో

నా కవిత్వంతో రోజంతా ఒక్కో కుట్టూ కుడుతూ

మెలికల కుట్లేస్తున్నా’ లాంటి సున్నితమయిన భావాల్ని చదివిన తర్వాత ఆయన కవిత్వం పాఠకుడిపై గొప్ప ప్రభావాన్ని కలిగిస్తుంది..

ఇంకో కవిత:

‘భయపడకు నేనున్నాను

భయపడకు నేనున్నాను

ఆ ఒంటరి ఆకు

చెట్టుకు ధైర్యాన్నిస్తూ

చెబుతూనే వుంది’

ఎంత నిబ్బరమయిన మాట’

ఇక ఆయనే రాసిన మరో  కవిత…

మబ్బు-

నిన్న ఉదయం వర్షం విసురుగా వచ్చి

నా కిటికీని తాకింది

అప్పటికి నేనింకా నిద్దర్లోనే వున్నా

బయటంతా  చీకటి

లేచి వెళ్ళి బయట వర్షాన్ని

పలకరించే సమయం కాదిది

కెటికీ పరదాల్ని వేశాను

అయినా చల్ల గాలి విసురుగా నా ముఖాన్ని తాకి

తడి తడి చేసింది

నా హాస్య చతురత మూగవోయింది

లేచి కిటికీల్ని దడాల్న మూసేశా

తిరిగి ముసుగేసుకొని పడకేసా

మనస్తాపం చెందిన వాన కోపంతో

కిటికీ అద్దాల్ని కొట్టేసి వెళ్లిపోయింది

మళ్ళీ తిరిగి రాలేదు

కిటికీ అద్దం పగుళ్లు మాత్రం

అట్లాగే వుండిపోయాయి

** * ఎంత భావుకతో కదా

ఇక మరో కవిత ఇట్లా సాగుతుంది

           —

మేల్కొను మేల్కొను మెలకువగా వుండు

‘రాత్రులు’

దాడి చేయడానికి సిద్ధపడ్డాయి

అది ఓ సాలెగూడు

చీకటిని కొంతమంది పెంచి పోషిస్తున్నారు

మేల్కొను మేల్కొను మెలకువగా వుండు  

మనుషులూ వాళ్ళ విశ్వాసాలూ

అగ్ని కీలల్లో చిక్కుకున్నాయి

అగ్నికోరలు గర్జించినప్పుడు- భయమేస్తుంది  

అవి ప్రజల్ని రెచ్చగొట్టినప్పుడు

మరింత భయంతో వణుకొస్తుంది  

‘జాతి’

కొందరి పదఘట్టనల క్రింద

నలిగిపోతున్నది

మేల్కొను మేల్కొను మెలకువగా వుండు  

మరోసారి మెడలు వంచబడ్డాయి

తలలు తెగి రాలిపడ్డాయి

ప్రజలూ వాళ్ళ దేవుళ్ళు కూడా

విభజించబడ్డారు  

ఎవరయినా పేరేమిటని అడిగితే.. భయమేస్తుంది

ఏ దేవుణ్ణి పూజిస్తావంటే.. మరింత భయమేస్తున్నది

కొందరు చాలాసార్లు  నన్ను

మంచెకు వేలాడదీసారు

మేల్కొను మేల్కొను మెలకువగా వుండు  

*********************

పర్యావరణం గురించి అధికంగా మదన పడే గుల్జార్ రాసిన ఈ కవితను చూడండి

“ దళిత మొక్క”

ఈ అడవి మొక్కల కొమ్మల మీద

ఏవో కొన్ని పదాలు కనిపిస్తాయి

పూర్తి కవిత అయితే కాదు

భూమి పొరల్ని చీల్చుకుని బలంగా నిలబడడానికి

ఈ మొక్కల కెప్పుడూ పోషకాలుండవు

వాటికి పూల కుండీలుండవు

వేర్లకు పోషకాలు లభించడానికి

అవి రోడ్లపైకి విసిరేయబడతాయి

దుమ్ములో ఆకలితో ధర్మంతో బతుకుతాయి

కొన్ని సార్లు మరిన్ని చేట్లేమో

బురద నీటిలోకి ఊడ్చేయబడతాయి 

ఆ బురద నీటిలోనే మురికి మట్టిలోనే

ఎదగడం మొదలెడతాయి

మళ్ళీ ఇంకో రోడ్డు మళ్ళీ ఇంకో తన్ను

ఇంకో దళిత మొక్క

 **** మొక్క గురించి చెబుతున్నట్టే వున్నా దళిత మొక్కను ప్రతీకగా చేసి మొత్తం కవిత కోణాన్నే మార్చేశాడు.

కవిత్వం సంగతి ఇట్లా వుంటే వచనం విషయంలో కూడా కథలు, ఒక నవల, ఒక నాటకం రాసిన గుల్జార్ తన జ్ఞాపకాల్నీ రాశాడు. అవి పుస్తకంగా వచ్చాయి.

ACTUALLY …  I MET THEM MEMOIR BY GULZAR (నిజంగా.. వాళ్ళని నేను కలిసాను- ఓ జ్ఞాపకం = గుల్జార్ ) ఇవన్నీ అద్భుతమయిన జ్ఞాపకాలు. ఏకబిగిన చదివిస్తాయి. గుల్జార్ తన ఇన్నేళ్ళ జీవితంలో ఎంతో మందిని కలిసాడు. కవులు, రచయితలు,దర్శకులు, నటీనటులు, గాయకులూ, సంగీత దర్శకులు వొహ్ గొప్ప జ్ఞాపకాలు, మరెన్నోగొప్ప అనుభవాలు. ఈ పుస్తకంలో తాను తన నిత్య జీవితంలో కలిసిన వాళ్ళ గురించి ప్రస్తావించారు. తన వృత్తి జీవితంలో తాను కలిసి పనిచేసిన వారి గురించీ  రాసారు, అంతే కాదు తన పై వాళ్ళ ప్రభావాన్ని కూడా గుల్జార్ ఈ పుస్తకం లో సవివరంగా చెప్పారు. పుస్తకం శీర్షిక “నిజంగా.. వాళ్ళని నేను కలిసాను”లో నిజంగా అనడంలోనే గుల్జార్ కవితాత్మ కనిపిస్తున్నది. వాళ్ళని ఊరికే కలిసాను అని కాకుండా  నిజంగా కలిసాను అంటే మనసు లోతుల్లోంచి కలిసి రాసాను అంటున్నాడు గుల్జార్. ఇదొక మంచి జ్ఞాపకాల తోరణం.

నిజానికి ఇది గుల్జార్ జీవిత చరిత్ర కాదు, ఎందుకంటే జీవితచరిత్ర రచనకు, జ్ఞాపకాలకు తేడా వుంటుంది. జీవితచరిత్రలో సమగ్ర జీవితం వుంటే జ్ఞాపకాల్లో కొన్ని ముఖ్యమయిన సందర్భాలు సంఘటనలు వుంటాయి. ఈ పుస్తకం నిండా జ్ఞాపకాలున్నాయి.

++++++++

నిజానికి మనిషి జీవితంలో జ్ఞాపకాలు మరుగున పడవు. చేతనా అంతఃచేతనల్లో ఎక్కడో ఒక చోట సజీవంగా నిక్షిప్తమయ్యే వుంటాయి. అందునా కవీ కళాకారుడి జీవితాల్లో జ్ఞాపకాలు హృద్యంగానూ సాంద్రంగానూ వుంటాయి. కావలసిందల్లా ఆ జ్ఞాపకాలని రాయాలనుకున్నప్పుడు మనసు, ఆలోచనలు తిరిగి ఆ కాలంలోకి వెళ్ళాలి. ఆ కాలాన్ని పునర్ దర్శించాలి. వున్నది వున్నట్టు కల్పనారహితంగా రచన లో ప్రబిబింప జేయాలి. అప్పుడే ఆ జ్ఞాపకాలకు సాహిత్యంలో స్థానంతో పాటు గౌరవమూ లభిస్తాయి. ACTUALLY …  I MET THEM MEMOIR BY GULZAR పుస్తకం అలాంటి గౌరవం ఇవ్వాల్సిన రచన. ఈ పుస్తకం ఫస్ట్ పర్సన్ లో సాగుతుంది. తొలుత బెంగాలీ పత్రిక ఆదివారం సంచిక కోసం గుల్జార్ ఇవి రాసారు. అవన్నీ కలిపి “పంటా భాటే” పేరున బంగాలీ లో పుస్తకంగా వచ్చింది. మహార్గ్య చక్రవర్తి ఇంగ్లీషులోకి చేసారు. పెన్గ్విన్ వాళ్ళు ప్రచురించారు.

…………. ఈ ACTUALLY …  I MET THEM MEMOIR BY GULZAR  లో గుల్జార్ తన గురువు మెంటార్ అయిన బిమల్ రాయ్ నుంచి మొదలు పెట్టాడు. తాను తన మొదటి పాట కోసం బిమల్ రాయ్ దగ్గరికి ఎట్లా ఏ పరిస్థితుల్లో వెళ్లిందీ ఆసక్తికరంగా రాసాడు. అనేక సంఘటనలను కథాత్మకంగా రాసారు గుల్జార్. ఈ పుస్తకంలో బిమల్ రాయ్ తో మొదలయిన ఈ జ్ఞాపకాల పరంపర సంగీతదర్శకులు సలిల్ చౌదరి, హేమంత్ కుమార్, ఆర్ డీ బర్మన్, ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు సత్యజిత్ రే, రిత్విక్ ఘటక్, బెంగాలీ సూపర్ స్టార్ ఉత్తమ కుమార్, గాయకుడు కిషోర్ కుమార్, సంజీవ్ కుమార్, హ్రిషికేశ్ ముఖర్జీ, పండిట్ రవి శంకర్, భీంసేన్ జోషి, నటీమణులు సుచిత్ర సేన్, షర్మిళా టాగోర్, రచయిత్రి మహాశ్వేతా దేవి లాంటి అనేక మందితో తన పరిచయం, తనపై వారి ప్రభావం రాసారు. గుల్జార్ రాసిన విధానం మనతో మాట్లాడుతున్నట్టు వుండి చక చకా చదివిస్తుంది. అనేక విషయాల్ని ఆలవోకగా చెప్పినట్టు అనిపిస్తుంది.

అట్లా కవిత్వమే కాదు వచనంలో కూడా గుల్జార్ పాఠకులని చేయి పట్టుకుని తన వెంట తీసుకెళ్తాడు, పాఠకుని చేయిపట్టుకుని వెంట నడుస్తాడు.

 అనేక సృజన రూపాలు, అనేక రచనలు, సినిమాలు, పాటలు, పిల్లల కథలు పిల్లల పాటలు ఎన్నో ఎన్నెన్నో గుల్జార్ కలం నుండి వెలువడ్డాయి.  ఆయన్ని ఎంత చదివితే అంతగా సున్నితమయిపోతుంది పాఠకుడి మనసు. ఆయన సాహిత్యమే కాదు ‘ఖోశిష్’ లాంటి ఆయన సినిమాలూ అంతే. 

ఆయనకు జ్ఞానపీఠ్ పురస్కారం రావడం అభినందనీయం. గుల్జార్ తో ఆ పురస్కారానికీ  గౌరవం పెరిగింది.

+++++++++++++++++++++++++++++++

వారాల ఆనంద్

9440501281

GULZAR

Posted on

మిత్రులారా! గుల్జార్ మీద ప్రేమతో, అభిమానంతో రెండు వ్యాసాలు రాసాను. ఈరోజు ‘నవతెలంగాణ’, ‘ఆంధ్రప్రభ’ సాహిత్య పేజీల్లో వచ్చాయి. ఆనందచారి గారికి, వసంత గారికి ధన్యవాదాలు
-వారాల ఆనంద్,
26 ఫిబ్రవరి 2024