Month: March 2022

Posted on

//24 ఫ్రేమ్స్//

కోట్లు కొల్ల గొట్టడమే పరమావధి

-వారాల ఆనంద్

కోట్లు పెట్టు… కొల్ల గొట్టు… తగ్గేదే లే … ఇదీ ఇవ్వాల్టి సినిమా నినాదం. ఒక రకంగా తెలుగు సినిమాకు అది బజ్ వర్డ్. సినిమ సర్వకళా మిశ్రమం, 24 కళల సంగమం, కళాత్మక సినిమా..ప్రజల సినిమా లాంటి మాటలకు నేడు అర్థం లేకుండా పోయింది. అవన్నీ అంతరించి పోయిన మాటలు. మరో రకంగా చెప్పాలంటే అర్థం లేని ‘పురావస్తు’ మాటలు. ఇప్పుడు సినిమా వ్యాపారత్మక కళ కూడా కాదు అది కేవలం ఒక ‘పరిశ్రమ’, ఒక వ్యాపారం. పెట్టుబడి లాభాలు ప్రచారం ప్రాభవం వున్న రంగం.అంతేకాదు ఇవ్వాల్టి సినిమాకు కేవలం మార్కెట్ ఒక్కటే భూమిక. ఈ రోజుల్లో కథేమిటి, సబ్జేక్టేమిటి, తీసే సరళి ఏమిటి అన్న విషయాల కంటే ఎంత పెట్టుబడి ఎంతమంది స్టార్లు అన్నదే ప్రధానమయిన అంశంగా మారి పోయింది. అంతే కాదు ఎన్ని వందల వేల సినిమా హాల్లల్లో విడుదల అన్నదీ లక్ష్యమే. హిందీతో సహా దాదాపు అన్ని భారతీయ భాషాసినిమాల స్థితీ ఇదే. అయితే ఆ దిశలో మన తెలుగు సినిమా “పాన్ ఇండియా” ప్రాభవాన్ని కలిగి వుంది. అంటే అన్ని భాషలకూ ఈ విషయంలో దాదాపు మార్గదర్హకంగా వుంది.

వర్తమాన సినిమాకు సంబంధించిన ఒక కొత్త ఒరవడిని మనం గమనించవచ్చు. తెలుగులో ఒక సినిమా నిర్మాణానికి పూనుకుంటే మొదట స్టార్లు స్టార్ డైరెక్టర్లు కావాలి. కోట్ల పెట్టుబడి కావాలి. ఆ విషయాలని షూటింగ్ మొదటి రోజుల్నించే విస్తృత ప్రచారం లోకి తేవాలి. నిర్మాణానికి రెండు మూడేళ్ళు తీసుకోవాలి. ఇక అప్పటినుండి అన్ని రోజులూ ప్రచారమే. షూటింగ్ కాలంలో ప్రతి చిన్నా పెద్దా సంఘటన ఒక ఈవెంటే. దాంతో జనాల్లో ఎంత గొప్ప సినిమా తయారవుతున్నదో అన్న భ్రమ ఏర్పడిపోతుంది. స్టార్ల అభిమానులూ వాళ్ళ సందడీ ఈ రెండు మూడేళ్ళు ఎట్లాగూ వుంటుంది. ఫస్ట్ లుక్ అవుట్ అనీ… సెకండ్ లుక్ అనీ రక రకాలుగా ప్రచార వ్యుహాలు ఉండనే వున్నాయి. దేశ విదేశాల్లో చమటలు కక్కి నిర్మాణం పూర్తి అయ్యాక విడుదల మరో గొప్ప ఈవెంట్ అవుతుంది. రిలీజ్ బహుశా ఇప్పుడూ అప్పుడూ అంటూ ఊదరగొట్టేస్తారు.ఇంక ఏముంది ప్రజల్లో ఒక ఉత్కంట పెరిగి పోతుంది. తాము ఆఈవెంట్ లో పాల్గొనక పోతే ఎట్లా అన్న “మాస్ హిస్టీరియా’ స్థితి ఏర్పడుతుంది. వందలాది థియేటర్ల లలో విడుదలకు ఏర్పాట్లు జరుగుతాయి. అడ్వాన్స్ బుకింగులూ అవీ ఉండనే వున్నాయి. మొదటి మూడు రోజులూ జనం క్రిక్కిరిసి పోతారు( తర్వాతి రోజులు ఆ సినిమా భవిష్యత్తును తెలుస్తంది అది వేరే సంగతి). ఇటీవలి కాలంలో మరో ఒరవడి మొదలయింది. ప్రతి కోట్లాది రూపాయల సినిమానీ అనేక భాషల్లోకి డబ్ (అనువాదం) చేసి దేశ విదేశాల్లో ఒకే సారి విడుదల చేయడం. దాన్నే “పాన్ ఇండియన్ సినిమా” అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు ఆ రిలీజ్ ఈవెంట్లో భాగస్వాములు అవుతారు.

ఇటీవల ఈ రకంగా విడుదల అయిన తెలుగు సినిమాలు రెండు భిన్నమయిన అనుభవాల్ని ఎదుర్కొన్నాయి. అల్లు అర్జున్ “పుష్ప”ది మొదటి అనుభవం. పుష్ప కొంత భిన్నంగా వుండడం మార్కెటింగ్ చాలా ప్లాన్గా చేయడం తో విజయవంతమయిన సినిమాగా నిలిచి నిర్మాతలకు ఆర్థికంగా గొప్ప లాభాల్ని అందించిందని టాక్.

కానీ తర్వాత విడుదల అయిన పవన్ కళ్యాణ్ సినిమా”భీమ్లా నాయాక్” టికెట్ రేట్ల వివాదాన్నీ, రాజకీయ వొత్తిడి నీ ఎదుర్కొంది. కానీ జనం ఆ సినిమా అంటే పడి చచ్చారని పవన్ కళ్యాణ్ వెంటే వున్నారని ప్రచారమూదర గొట్టారు.. కానీ సినిమా రెండవ వారం తర్వాత స్లో అయిందని ఆశించిన స్థాయిలో ఆర్థికంగా నిలబడలేదని కథనాలు వేలువడ్డాయి. లోగుట్టు పెరుమాల్లకు ఎరుక. ఇక బాహుబలి తర్వాత ఎంతో ప్రాచార ఆడంబరం తో వెలువడ్డ సినిమా “ రాధే శ్యాం” . సినిమాకు ఖర్చు ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని ప్రచారం చేసిన ఆ సినిమా కుప్పకూలిపోవడం తెలుగు సినిమా రంగానికి విషాదమే. బాహుబలి తో దేశ వ్యాప్త పేరు ప్రచారం పొందిన ప్రభాస్ కు కూడా ఇది ఊహించని దెబ్బే అనిపిస్తున్నది. ఇక ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో తేలాల్సింది ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా భవిష్యత్తు. దాని ఫలితం తెలుగు సినిమా రంగ బవిష్యత్తు నిర్దేశిష్టుంది. చూద్దాం. మార్కెటింగ్ తో తెలుగు సినిమా రంగం ఎ మేరకు నిలబడుతుందా చూడాలి.

++++++++

నంది అవార్డులు లేవు ఫిలిం ఫెస్టివల్స్ లేవు

——

ఇంతగా పెట్టుబడీ ప్రచారమూ అన్న ఉప్పెనలో కొట్టుకు పోతున్న తెలుగు సినిమా రంగం గుర్తింపుని గౌరవాన్ని గురించిన సోయిని కోల్పోయిందనే చెప్పుకోవాలి. 2014లో రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలూ సినిమా రంగం పైన దృష్టి పెట్టలేదనే చెప్పాలి. రెండు రాష్త్రాలు థియేటర్ల లో టికెట్ రెట్లు తగ్గించడమా పెంచడమా.. అయిదవ శో కు అనుమతి ఇవ్వడమా లేదా.. బెనిఫిట్ శో ల సంగతేమిటి అన్న విషయాల మీద మాత్రమే దృష్టి పెట్టాయి. ఆంద్ర ప్రభుత్వం రెట్లు తగ్గిస్తే తెలంగాణా ప్రభుత్వం సినిమా వాళ్ళకు అనుకూలంగా చర్యలు తీసుకుంది.

కానీ రెండు రాష్ట్రాల్లో కూడా సినిమాలకు ఏటా ఇచ్చే అవార్డులు, నిర్వహించే ఫిలిం ఫెస్టివల్స్ గురించిన ఊసేలేకుండా పోయింది. ప్రభుత్వాలు ఫిలిం డెవెలప్మెంట్ గురించి ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదన్నది నిజం. సినిమా వాళ్ళకు ఆ వాటి పట్టింపే లేదు.

నిజానికి అవార్డు ఒక గుర్తింపు. సాహితీ సాంస్కృతిక సామాజిక రంగాల్లో ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ చేసిన విశ్టిష్ట మయిన కృషికి గుర్తింపుగా ఇచ్చే ప్రశంస. అది హార్దికంగానూ లేదా ఆర్థిక ప్రోత్సాహకంగానూ వుండొచ్చు. లేదా బిరుదులాంటిది కూడా కావొచ్చు. ప్రపంచ వాప్తంగా పలు సంస్థలూ, వ్యక్తులూ, ప్రభుత్వాలూ అనేక అవార్డులు ఇచ్చే సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి. అవార్డులు స్వీకర్తల కృషికి గుర్తింపునూ, మునుముందు మరింత కృషి చేసేందుకు దోహదం చేస్తాయి. ఆస్కార్ అవార్డులు అందుకు ఉదాహరణ. ఇక ఫిలిం ఫెస్టివల్స్ నిర్వహించడం వలన ప్రపంచ వ్యాప్త సినిమాను వీక్షించే అవకాశం కలుగుతుంది. మనమెట్లా అభివృద్ది చెందాలో తెలుస్తుంది. నేర్చుకునే అవకాశం కలుగుతుంది.ఈ విషయం లో కేంద్రం పై ఎన్ని వివాదాలున్నా ఏటా క్రమం తప్పకుండా మంచి సినిమాలకు అవార్డులు ఇవ్వడం ఫిలిం ఫెస్టివల్స్ నిర్వహించడం చేస్తున్నది. ఆ సోయి తెలుగు ప్రభుత్వాలకు లేకపోవడం ఆశ్చర్యం. 2014 దాకా క్రమం తప్పకుండా ఇస్తూ వచ్చిన “నంది” అవార్డులు మూలన పడ్డాయి.

ఇక అంతర్జాతీయ బాల చలన చిత్రోత్సవాల్ని2003 నుంచీ హైదరాబాద్ లో శాశ్వత కేంద్రం గా నిర్వహించేవారు. అందుకు అప్పుడు కేంద్ర మంత్రిగా వున్న జైపాల్ రెడ్డి కృషిని గుర్తు చేసుకోవాలి. కానీ 2017 తర్వాత దాని ఊసే లేకుండా పోయింది.

పురస్కారాలూ, ఫిలిం ఫెస్టివల్స్ ఫిషయం లో ‘పాన్ ఇండియన్ సినిమా’ అని చెప్పుంటున్న తెలుగు సినిమా రంగం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చర్యలు తీసుకోవాల్సి వుంది. చూద్దాం.

++++++++++++

విజువల్ ఎడ్యుకేషన్ కావాలి

Posted on Updated on

PUBLISHED TODAY IN ‘DISHA’ DAILY (24 FRAMES )

+++++++++++

విజువల్ ఎడ్యుకేషన్ కావాలి

*****************

ఆధునిక తరం చదివే సంస్కృతి నుంచి వెరై పోతూ చూసే సంస్కృతికి దగ్గరవుతున్నారు. లుక్ కల్చర్ పెరిగి బుక్ కల్చర్ కనుమరుగవుతున్నది. గత కొన్ని దశాబ్దాలుగా చదివే అలవాటు తగ్గిపోతున్నది. అంతా చూడడమే టీవి చూస్తారు, సినిమా చూస్తారు, కంప్యూటర్ చూస్తారు ,స్మార్ట్ ఫోన్ మాట్లాడానికంటే బొమ్మలు వీడియోలు చూడ్డానికే ఎక్కువగా ఉప యోగిస్తున్నారు. ఇట్లా పెల్లుబుకుతున్న ‘దృశ్య సంస్కృతి’ గురించి తీవ్రంగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమయింది. వర్తమాన తరంలో పెల్లుబుతున్న చెడు దొరణులకు మౌలిక కారణాల్ని తరచి చూడాల్సి వుంది. ఇంటా,బయటా, విద్యాలయాల్లోనూ ఉపయోగిస్తున్న దృశ్య మాధ్యమాన్ని గురించి శాస్త్రీయంగా పరిశీలించాలి. సినిమాలతో సహా సమస్త “దృశ్య మాధ్యమం” వల్ల కలిగే దుష్ప్రభావాల్ని నిరోధించగలగాలి. అమానవీయ దుష్ట సంస్కృతిని పెపొందించే దృశ్యాల మంచి చెడుల విచక్షణ చేయాలి. సమాజంలో అర్థవంతమయిన దృశ్య సంస్కృతిని ( VISUAL CULTURE) ని పెపొందించే కృషి ప్రారంభం కావాలి.

ఇటీవల దేశ వ్యాప్తంగా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచే ‘కళ’ల విద్యను (ART EDUCATION) పాఠశాల కళాశాల స్థాయిలో ప్రవేశపెట్టాలని విద్యపై పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. దాంతో ఇప్పటికయినా విద్యార్థుల్లో దృశ్య సాక్షరతపైనా కళల పైనా ప్రభుత్వ పెద్దల్లో ఆలోచన మొదలయిందని అర్థమవుతున్నది. ప్రధానంగా నాట్యం, సంగీతం, విజువల్ ఆర్ట్స్, ఫిల్మ్ మేకింగ్ పై కోర్సులు పెట్టాలని స్థాయీ సంఘం సూచించింది. “అఖిల భారత సృజనాత్మక కళల విద్యామండలి” (COUNCIL FOR CREATIVE ARTS) సైతం ఏర్పాటు చేయాలని కూడా స్థాయీ సంఘం సూచించింది. ఇంకా జాతీయ స్థాయిలో కళల కోసం కేంద్రీయ విద్యాలయాన్ని( CENTRAL UNIVERSITY for Arts ) కూడా ఏర్పాటు చేయాలని సూచించింది. కమిటీ సూచనలని కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు స్వీకరిస్తుందో తెలీదు. ఎంతవరకు అమలు చేస్తుందో కూడా ఊహించలేము. కానీ కళల పట్ల, విద్యార్థుల్లో దృశ్య చైతన్యం పట్ల జాతీయ స్థాయిలో ఆలోచనయితే మొదలయింది. అది సంతోషకర విషయమే. నిజానికి ఇవ్వాళ డ్రగ్స్ కల్లోలం, ఆత్మహత్యలు, హత్యలు, ప్రమాదాలు ఒకటేమిటి సమాజం యావత్తూ సంక్షోభ పూరితమయిన పరిస్థితిలోకి నెట్టి వేయబడుతున్నది. హేతుబద్దంగా లేని దగాకోరు అభివృధ్ధి ప్రతిఫలనాలే ఇవన్నీ. మానవీయ కోణం లేకుండా కేవలం డబ్బు తాత్కాలిక సుఖ సౌకర్యాల కోసం అభివృధ్ధి పేర జరుగుతున్న కార్యక్రమాల ఫలితాలే ఇవన్నీ. అయితే ఈ స్థితి ముఖ్యంగా యువకుల్లో, విద్యార్థుల్లో పెచ్చరిల్లడం అత్యంత ప్రమాదకరం. వర్తమానానికే కాదు భవిష్యత్తు సమాజానికీ కూడా అభిలషణీయం కాదు.

చిన్న పిల్లల్నుంచీ మొదలు అందరూ ఇలా చూసేందుకు అలవాటు పడిపోయి అక్షరాలు రాయడానికీ, చదవడానికీ కూడా ఇమేజ్ లనే వాడే సంస్కృతిని మనం చూస్తున్నాం. అయితే ఈ చూడడం అనే ప్రక్రియలో అంతా సరిగ్గానే వుందా, చూస్తూ వున్న వాళ్ళపైన ఈ ఇమేజెస్, మూవింగ్ ఇమేజెస్ కు సంభందించిన ప్రభావాలు ఎలా వుంటున్నాయి వాటి ప్రతిఫలనాలు సమాజం పైన ఎట్లా వుంటున్నాయనే అవగాహన ఇన్నాళ్ళుగా కొరవడడం విచారకరం. దృశ్య సంస్కృతికి, దృశ్య సాక్షారతకు సంబందించిన కనీస పరిజ్ఞానం లేకపోవడం వల్ల టీవీలూ,ఇంటర్నెట్లూ నట్టింట్లో కుమ్మరిస్తున్న చెత్త నంతా చూస్తూ పిల్లలూ పెద్దలనే కాదు మొత్తం సమాజమే గాడి తప్పి కనీస విలువలు లేని ఒక విష సంస్కృతికి అలవాటు పడి పోతున్నారు. వాళ్ళు చూపిస్తున్నాదాన్ని గుడ్డిగా చూస్తూ మంచెదో చెడేదో భేదం గుర్తించగలిగే పరిస్తితి లేక పోవడంతో పరిస్థితి దారుణంగా తాయారవుతున్నది.

ముఖ్యంగా భావి సమాజానికి ప్రతినిధులుగా వుండాల్సిన విద్యార్థులకు విజువల్ లిటరసీ కి సంబందించిన మౌలిక విషయాలేమయినా అందుతున్నాయా లేదా అన్నవిషయాన్ని ఇవ్వాళ ప్రభుత్వాలూ, మేధావులూ, విద్యావేత్తలూ ఆలోచించాల్సిన అవసరం వుంది. ఒక వైపు ప్రభుత్వాలు డిజిటల్ తరగతి గదులూ, స్కిల్ డెవలప్మెంట్ అంటూవుంటే మరో పక్క ప్రైవేటు విద్యాసంస్థలు ఈ స్కూల్స్, డీజి స్కూల్స్ అంటూ విద్యను మొత్తంగా వ్యాపారం చేసి తరగతి గదుల్లో ప్రొజెక్టర్లు, కంప్యూటర్లు అంటూ ఊదరగొడుతున్నాయి.

నిజానికి ఒక బొమ్మ వేయి పదాలకు సమానం. ఇక వీడియో లేదా సినిమానయితే ఎన్నో భావాల్ని నేరుగా ప్రేక్షకుని మనసులోకి తీసుకెళ్తుంది. అంతగా ప్రభావం చూపించగల విజువల్ మాధ్యమాన్ని గురించి సమాజం కనీసం ఆలోచన చేస్తున్నదా అంటే జవాబు నిరాశాజనకంగానే వుంది.అసలు మంచి విజువల్ ఏదో చెడు విజువల్ ఏదో, మంచి సినిమాను లేదా మంచి వీడియోను ఎట్లా అర్థం చేసుకోవాలో నేర్పించే వ్యవస్థ నిర్మించుకోలేక పోవడం ఇవాల్టి విషాదం. ఆ స్థితిలో అర్థం లేని చెత్త దృశ్యాల్ని చూస్తూ పిల్లలు పాడయి పోతున్నారని బాధ పడడంలో అర్థం లేదు. చూసే దృశ్యాలకు సంబందించి దృశ్య సాక్షారత (విజువల్ లిటరేసి )ను అందించ లేనపుడు పిల్లలే కాదు పెద్దలు కూడా విలువలు లేని బొమ్మలకూ, సీనిమాలకూ వీడియో లకూ అలవాటు పడిపోతారు. అందుకు వాళ్ళని కాకుండా పాలకుల్నీ, ప్రణాళికా నిర్మాతల్ని మేధావుల్నీ నిందించాల్సి వుంటుంది. నిజానికి వర్తమాన సమాజం ప్రసార మాధ్యమాల ప్రభావంలో పడి కొట్టుకు పోతున్నది. అంతే కాదు పూర్తిగా ఇమేజ్ చట్రంలో కూరుకుపోతున్నది. ఇటీవల జరిపిన ఒక సర్వే ప్రకారం వర్తమాన తరం అత్యధిక ఫోటోలు దిగిన తరంగా తేలింది. అంతే కాదు విద్యార్థుల్లో రోజుకు ఏడు గంటలకు పైగా బొమ్మలో వీడియోలో చూస్తున్నట్టుగా తేలింది. అప్పటికే దృశ్య ప్రపంచంలో కూరుకుపోయిన సమాజం 1991లో మొట్టమొదటి సారిగా అందుబాటులోకి వచ్చిన వరల్డ్ వైడ్ వెబ్(www ) ఒక సాలీడు లాగా మానవాళిని కప్పెసింది. అయితే దీనివల్ల సమాచార వ్యాప్తికి, జ్ఞాన విస్తృతికీ అమితమయిన వుపయోగం కలిగింది దాంతో పాటు దృశ్యానికి సంబందించి దృశ్య సాక్షారత (VISUAL EDUCATION) లేక పోవడం వల్ల విద్యార్థుల్నుంచీ మొదలు అందరూ ఆ ప్రవాహం లో పడి కొట్టుకు పోతున్నారు.

ఈ స్థితి నుంచి బయట పడాలనుకుంటే పాఠశాల స్థాయి నుంచే విజువల్స్ కు సంబందించి కార్యక్రమాల్ని రూపొందించాలి. ఇప్పటికే దాదాపు అన్నీ పాఠశాలలు,కళాశాలల్లో వీడియో ప్రదర్శనలు చెందిన సాకేతిక వసతులు సమకూడి వున్నాయి. వాటిని మంచి చెడుల నడుమ తేడాని అర్థం చేసే విధంగా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలి. మానవీయ విలువల ప్రోత్సాహం కోసం సాహిత్యం తో పాటు అర్థవంతమయిన దృశ్య మాధ్యమాన్ని పరిచయం చేసే కృషి కొన సాగాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యా విషయక అవసరాలతో పాటు బాలలకోసం ప్రథ్య్కంగా నిర్మించిన (ఇరాన్ సినిమాల్లాంటివి) చూపించాలి. చిన్న సినిమాల్ని ప్రదర్శించి ఆయా సినిమాల పైన view and review పేర విద్యార్హ్తులకు విశ్లేషించే కార్యక్రమాల్ని రూపొందించగలిగితే మంచి దృశ్యాలు అర్థవంతమయిన కార్యక్రామాల గురించి చిన్న తనం నుండే విలువలు,సృజన రెండూ అలవాడుతాయి. ఇలా మంచిని పరిచయం చేసి మానవీయ విలువల్ని ప్రోత్సహించడం ద్వారా ఉత్తమ లక్షణాల్ని ప్రోది చేయవచ్చు. చీకటిని నిందిస్తూ కూర్చోవడం కన్నా చిరు దీపాన్ని వెలిగించడం మంచిది. నేనే ఒక కవిత లో ఇలా రాసుకున్నాను….

‘చీకటికి ఉనికి లేదు

వెళ్తురు క్షీణించడమే చీకటి’

అందుకే చిన్న వయసులోనే మనస్సుల్లో వెలుగులు నింపే ప్రయత్నం జరగాలి. విజువల్ లిటరసీ ని పెంపొందించాలి. పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సుల్ని కేంద్రం అమలు చేయాలి.

-వారాల ఆనంద్

గ్రీన్ చాలెంజ్

Posted on

గ్రీన్ చాలెంజ్

++++++ వారాల ఆనంద్

అలా తోటలోకి వెళ్తానా

ఆకులన్నీ చిరునవ్వుతో పలకరిస్తాయి

కొమ్మలన్నీ వంగి వంగి సలాము చేస్తాయి

పువ్వులేమో విరిసి విచ్చుకుని

స్వాగతం చెబుతాయి

. . .

వెనక్కి తిరిగి రోడ్డెక్కుతానా

ఎవరో తరుముతున్నట్టు

అందరూ తమ ముఖాల్ని

జేబుల్లో వేసుకుని

ఒకటే పరుగు

నే తిరిగి తోటలోకెల్దామంటే

నాకూ ముఖం లేదు

కాలుష్యం రద్దీలో

ఎక్కడో పారేసుకున్నా….

*****

గ్రీన్ చాలెంజ్

Posted on

నా మానేరు నది

++++++++ వారాల ఆనంద్

ఈ నదేమిటిలా

రిహార్సల్ లేని నృత్యం చేస్తున్నది

ఈ నది కథేమిటి ఎవర్రాసారు

స్క్రిప్ట్ ను ఎవరు కూర్చారు

స్క్రీన్ ప్లే ఎవరు రూపొందించారు

దర్శించిన ప్రతిసారీ

ఎగిసి ఎగిసి

నా లోకి ప్రవహించి

నన్ను చైతన్య పరుస్తున్నది

రక్త నాళాల్లో ఉరకలెత్తి

పరవశింప చేస్తున్నది

గతాన్ని తడుముతూ

సమస్త కలల్నీ రాగాల్నీ

శృతి చేస్తున్నది

అద్భుతమయిన బాల్యాన్నీ

అమాయకపు యవ్వనాన్నీ

ఆలపిస్తూ స్వరాన్ని సవరిస్తున్నది

చెదిరిపోయిన నా చిరునామాని

తిరిగి లిఖిస్తున్నది

ఈ నది గడుసైంది

ఓటముల్ని నిమురుతున్నది

గెలుపుల్ని పొంగిస్తున్నది

దుఖాన్ని కరిగిస్తున్నది

సంతోషాల్ని స్వాగతిస్తున్నది

ఈ నది మామూలుదేమీ కాదు

నా దేహాన్నీ ఆత్మనీ ముంచెత్తి

చెత్తనంతా కడిగేసి

నాకు పునస్పర్శనిస్తున్నది

పునర్జీవితాన్నిస్తున్నది

నది నా లోనే కాదు

నా బుజం మీద చెయ్యేసి

కొత్త దారంట నడిపిస్తున్నది

నేనో గొప్ప ప్రవాహాన్నయి

ఉరకలెత్తుతున్నాను

అవును ఈ నది నా ఉనికి…నా ఊపిరి

నా నేస్తం..నా సమస్తం.