Month: September 2022

‘అనువాదమే ప్రపంచ వారధి’

Posted on

VARALA ANAND TALK SHOW

‘అనువాదమే ప్రపంచ వారధి’

VARALA ANAND TALK SHOW

pl click the link

గొప్ప ప్రేమికురాలు భావుకురాలు- అమృతా ప్రీతం

Posted on

+++++++++++ వారాల ఆనంద్

         భారతీయ చరిత్రలలోనే కాదు యావత్ ప్రపంచ మానవ చరిత్రలో భారత స్వాతంత్రానంతరం జరిగిన దేశ విభజన అత్యంత విషాదకర మయింది. హీనమయింది, ఇరు ప్రాంతాల్లో లక్ష లాది  మంది ప్రజలు నిర్వాసుతులు అయ్యారు. వేలాది మంది హత్యలకు మారణ హోమాలకు గురయ్యారు..

PL CLICK THE LINK AND VIEW

కవిత్వానికి కొత్త దారి కున్వర్ నారాయణ్

Posted on

కవిత్వానికి కొత్త దారి కున్వర్ నారాయణ్

++++++++ వారాల ఆనంద్

“నేను ప్రకృతిని అనుసరించను..నేనే ప్రకృతిని”  నంటారు కున్వర్ నారాయణ్.

అంతేకాదు మనం రెండు ప్రపంచాల్లో బతుకుతాం..ఒకటి తాను సృష్టించిన ప్రపంచం.. మరోటి ఇతరులు సృష్టించింది..

నా ప్రపంచం మన ప్రపంచానికి భిన్నమయింది కావచ్చు కాకపోనూ వచ్చు.. అంటాడు 

***********

Pl click the link for video

********

వర్తమాన హిందీ సాహిత్యాన్ని ముఖ్యంగా కవిత్వాన్ని గొప్పగా ప్రభావితం చేసారు కున్వర్ నారాయణ్.

    హిందీ సాహిత్య ప్రపంచంలో తనదయిన సృజనాత్మక నైపుణ్యాన్ని సాధించాడు. ఆయన సృజనాత్మక వ్యక్తీకరణలో సరళత, పదునయిన తాదాత్మ్యత కనిపిస్తాయి. మొత్తంగా సమతావాద దృక్పధం లో ఆయన రచనలన్నీ సాగాయి. 

కున్వర్ నారాయణ్ రచనల్లో   ‘జీవితం..కవిత్వం తో రూపొందింది’అన్న BORGES మాటల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.

కున్వర్ నారాయణ్ ఒక చోట  ఇట్లా అంటాడు

‘నేను జీవితాన్నుంచి 
తప్పించుకోవాలుకోవడం లేదు 
అందులో భాగమవ్వాలనుకుంటున్నాను’… 

హిందీ నవ్య కవిత్యోద్యమం తో మమేకమయిన కున్వర్ నారాయణ్ తన సరళమయిన భాష వ్యక్తీకరణలతో హిందీ సాహిత్యం లో ప్రత్యేక ముద్ర వేసాడు.

కున్వర్ నారాయణ్ దాదాపు ఆరు దశాబ్దాల పాటు సాహితీ రంగంలో వున్నారు.

ఆయన వివిధ సాహిత్య ప్రక్రియల్లో రాసారు. కవిత్వం, కథలు,ఎపిక్, విమర్శ, వ్యాసాలూ, అనువాదాలు చేసారు. వాటితో పాటు సినిమా,సంగీతం, కళలు, మ్యూజింగ్స్ కూడా రాసారు.

++++

19 సెప్టెంబర్ 1927న జన్మించిన కున్వర్ నారాయణ్ తన బాల్యాన్ని ఉత్తర ప్రదేశ్లోని అయోధ్య-ఫైజాబాద్ నగరాల్లో గడిపారు. ఆ కాలంలో ఆయన కుటుంబాన్ని టీబీ తీవ్రంగా కలిచివేసింది. అనేక మంది మృత్యు వాత పడ్డారు. చివరికి తనకు అత్యంత ప్రియతములయిన  తల్లి, సోదరి కూడా టీబీ వ్యాధికి బలయ్యారు.   

అనంతరం కున్వర్ పెద్దన్నయ్యతో కలిసి లక్నో నగరానికి చేరుకున్నాడు. అప్పుడు దేశమంతా గాంధీగారి ప్రభావం పెల్లుబుకుతున్న సమయం. లక్నో లో వాళ్ళిల్లు అనేక మంది రాజకీయ నాయకుఅకు వేదిక గా వుండేది. ఆక్రమం లోనే  కున్వర్ నారాయణ్  జీవితంలో తొలి రోజుల్ని, ఆలోచనల్ని ఆచార్య నరేంద్ర దేవ్, ఆచార్య కృపలానీ తీవ్రంగా ప్రభావితంచేసారు. ఒక సంవత్సరం బాంబే లో నరేంద్ర దేవ్ తో వున్న కున్వర్ తర్వాత

ఆచార్య కృపలానీ తో ‘విజిల్’ పత్రికలో పని చేసాడు. ఆ అనుభవం తన ఆలోచననీ దృష్టి కోణాన్నీ విస్తారం చేసింది. 

కున్వర్ నారాయణ్ లక్నో విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ లో ఎం.ఎ. పూర్తి చేసారు. అప్పుడే ‘లేఖ్ సంఘ్’ అన్న సంస్థ తో మమేకమయి పని చేసారు. తర్వాత విదేశాలకు వెళ్ళిన కున్వర్ కవిత్వం పైన పాబ్లో నెరుడా, నాజిమ్ హిక్మాట్ లాంటి అనేక విదేశీ సృజనకారుల ప్రభావం పడింది. పోలాండ్, జెకోస్లోవేకియా, చైనా, రష్యా లాంటి దేశాల పర్యటన కున్వర్ ఆలోచనా పరిధిని విస్తృతం చేసాయి.  1956 లో విదేశాలనుంచి తిరిగి రాగానే కున్వర్ నారాయణ్ తొలి కవితా సంకలనం ‘చక్రవ్యూహ్’  వెలువడింది. ఆ  కాలంలోనే ఆయన ‘యుగ చేతన’ అన్న పత్రిక కు సహా సంపాదకుడిగా పని చేసారు. తర్వాతి కాలంలో ‘నయా పత్రిక్’, ‘చాయానాత్’ అన్న పత్రికలకు కూడా సహసంపాదక బాధ్యతల్ని నిర్వహించారు. ఎ పనిలో వున్నా ఎక్కడున్నా ఆయన తన రచనా వ్యాసంగాన్ని వదులుకోలేదు. తన సృజనని నిరంతరం నిలుపుకున్నారు. కవిత్వంతో పాటు అనేక కథల్నీ రాసారు కున్వర్.  తర్వాత వెలువడింది ‘తీస్రా సప్తక్’. ప్రసిద్ధ కవి ఆగ్గేయ సంపాదకత్వం లో వెలువడిన ఆ సంకలనం లో వున్న ఏడుగురు కవుల్లో కున్వర్ నారాయణ్ ఒకరు.

తర్వాత కున్వర్ కవితా సంకలనం ‘పర్వేష్-హం తుమ్’

ఆ తర్వాత వచ్చిన “ ఆత్మజాయి” ఉపనిషత్తులలో వున్న నచికేతుని పాత్ర ఆధారంగా రాసిన రచన అది. అందులో జీవితము,మరణమూ, సంఘర్షణ లని మూలన్గాతీసుకుని చేసిన ఈ రచన తాత్వికంగా వుంటుంది. అందులో తమ కుటుంబ సభుల మరణాలూ వాటి ప్రభావాలూ అంతర్లీనంగా కనిపిస్తాయి.

70 వ దశకం వచ్చేసరికి కున్వర్ నారాయణ్ పై సినిమా, సంగీతం, నాటకం, చిత్రకళా ప్రభావాలు అధికమయ్యాయి. ఆ కాలంలోనే ‘నయా ప్రతీక్’, ‘చాయానాత్’ పత్రికలకు సహా సంపాదకత్వం వహించాడు. కొన్ని సాహితీ సంస్థల నిర్వహణ బాధ్యతా స్వీకరించాడు. 71 లో ఆయన వెలువరించిన ‘ఆమ్నే సామ్నే’ అన్న కథల పుస్తకం ఆనాటి సామాజిక రాజకీయాల పైన సంధించిన వ్యంగ్యాత్మక రచన గా వినుతికెక్కింది 

     అయితే ఆయనకు గొప్ప పేరుని అనేక అవార్డుల్నీ ఇచ్చిన పుస్తకం 1979 లోవచ్చిన “ కోయి దూస్రా నహీ’లో జీవితానుభవాల విస్తృతి కనిపిస్తుంది. 1999 కున్వర్ నారాయణ్ ‘ఆజ్ అవుర్ ఆజ్ సే పహలే’ అన్న సాహిత్య విమర్శ పుస్తకం వెలువరించారు. తర్వాత తన ఇంటర్వ్యూ ల తో కూడిన ‘మేరె సాక్షాత్కర్’ వచ్చింది. కున్వ నారాయణ్ అనేక సంవత్సరాల పాటు సినిమా, శాస్త్రీయ సంగీతాలను విశ్లేషిస్తూ విరివిగా రాసారు. పలు అనువాదాలు కూడా చేసారు. 

2002లో ఆయన ‘ఇన్ దినో’ అన్న కవితా సంకలనం వెలువరించారు. తర్వాత ‘వాజస్రావాకే బహానే’ అన్న ఒతిహాసిక గ్రంధం ప్రచురించారు.       

హిందీ సాహిత్య ప్రపంచంలో విలక్షణ కవిగా పేరుగడించిన కున్వర్ నారాయణ్ సృజనాత్మక ప్రభావం మొత్తం హిందీ బెల్ట్ లో స్పష్టంగా కనిపిస్తుంది.

ఆయనకు సాహిత్యంలో అనేక జాతీయ అంతర్జాతీయ విశిష్ట అవార్డులు లభించాయి. అందులో కెనడా హాహిత్య అకాడెమీ అవార్డు, జ్ఞానాపీఠ్ పురస్కారం, కబీర్ సమ్మాన్, వ్యాస్ సమ్మాన్, లోహియ సమ్మాన్, సలఖ్ సమ్మాన్, వార్శా విశ్యవిద్యాలయ గోల్డ్ మెడల్, ఇటలీ ప్రెమియో ఫెరోనియా లు కొన్ని మాత్రమే.

++++++

ఇట్లా హిందీ సాహితీ ప్రపంచంలో తనదయిన గొప్ప స్థానాన్ని పొందిన కున్వర్ నారాయణ్ ఎంపిక చేసిన కవితల్ని ఆయన కుమారుడు అపూర్వ నారాయణ్ ఇంగ్లీష్ లోకి ప్రతిభావంతంగా అనువదించారు. మూల రచనని యధాతతదంగా కాకుండా, భావం చెడకుండా చాలా గొప్పగా ఇంగ్లీష్ లోకి అనువాదం చేసారు. అనువాదంలో అనేక మంది లాగా అకాడెమిక్ ఇంగ్లీష్ భాషను కాకుండా సృజనాత్మక ఆంగ్ల భాషను ఉపయోగించి ఈస్తేటిక్ ఫీల్ ని చివరంటా కొనసాగించారు. అది అనువాదకుని ప్రతిభకు నిదర్శనం. ఈ సంకలనంలో అనువాదకుడు అపూర్వ మూల కవిత్వాన్ని “ EARLY MEDITATIONS, ROUGH ROADS OF HISTORY, JOURNEYS,THE RIVER DOES NOT GROW OLD, TREES, MITTORS AND SHADOWS,REMEMBERANCES, HUMANESQUE” విభాగాలుగా ఎంపిక చేసి కూర్చారు. చాలా గొప్ప కూర్పు.

1927లో జన్మించిన కున్వర్ నారాయణ్ తన 90 ఎల్ల వయసులో 15 నవంబర్ 2017 న పరమపదించారు.

ఆయన కవిత్వం అందరూ ముఖ్యంగా కవులూ సాహిత్యకారులూ తప్పకుండ చదవాలని నేను అభిలషిస్తున్నాను. ఈ సందర్భంగా కున్వర్ నారాయణ్ స్మృతికి నివాళులు అర్పించుకుంటూ, అనువాదాన్ని అందించిన అపూర్వ నారాయణ్ కి ధన్యవాదాలు 

….. మీకోసం నేను చేసిన కున్వర్ నారాయణ్ కవిత్వ అనువాదాలు కొన్ని…… 

1) కొత్త మార్గం 
———————— 
నేను జీవితాన్నుంచి 
తప్పించుకోవాలుకోవడం లేదు 
అందులో భాగమవ్వాలనుకుంటున్నాను

జీవితపు ఊహాత్మక ఇరుసుపైన 
కవిత్వానికి 
అనుమానాస్పదంగా వున్న 
స్థలాన్ని ఓ కుదుపు కుదపాలి

అందుకు మొదట 
జీవితపు శక్తి మూలాల్ని 
క్రియాశీలం చేయాలి

తర్వాత ఆ శక్తిని 
బతుకు కక్షకున్న ఇరుసుకు 
జత చేయాలి

అప్పుడు 
గతంలో లాగా
యాంత్రికత’ లేని 
మానవత్వం’ వైపు మరలిన

కొత్త మార్గం ఆరంభమవుతుంది.
——————————– 
ఓ వింతయిన రోజు 
————— 
నేను రోజంతా గాయి గాయిగా తిరిగాను 
ఎలాంటి ప్రమాదమూ సంభవించ లేదు

అనేకమంది మనుషుల్ని కలిసాను 
ఎక్కడా అవమానం ఎదురుకాలేదు

నేను రోజంతా సత్యమే మాట్లాడాను 
ఎవరూ తప్పుగా స్వీకరించలేదు

నేనివాళ అందరినీ విశ్వసించాను 
ఎక్కడా మోసగింప బడలేదు

అద్భుతమయిన విషయమేమిటంటే

నేను ఇంటికి చేరుకోగానే 
తిరిగొచ్చింది ఇంకెవరో కాదు 
నేనే అని కనుగొన్నాను 
================ 
ఎనిమిదవ అంతస్తు పైన

+++++++++

నేను ఎనిమిదవ  అంతస్తులోని

ఓ చిన్న ఫ్లాట్ లో

ఒంటరిగా నివసిస్తున్నాను

ఆ ఫ్లాట్ కు బయటకు తెరుచుకునే

రెండు కిటికీ లున్నాయి

అవి నన్ను తీవ్రంగా భయపెడతాయి

కిటికీలకు బందోబస్తుగా

గట్టి  గ్రిల్స్ బిగించాను

బయటనుంచి ఏదో ఉపద్రవం

ముంచు కొస్తుందని కాదు

ఇంత ఎత్తులోకి చొచ్చుకొచ్చే

ధైర్యం ఎవడు మాత్రం చేస్తాడు

ప్రమాదమల్లా నా లోపలే వుంది

చుట్టూ ఈ ఒంటరితనం ఈ విసుగూ

భయ భ్రాంతులని చేసే ఆ  అంశాలు

ఏదో ఒక రోజు నన్ను

ఈ కిటికీల్లోంచి బయటకు దూకే

ఒత్తిడి చేస్తాయేమో

====

ఆధునిక మళయాళ కవి కే.సచ్చిదానందన్

Posted on

వారాల ఆనంద్

PL CLICK THE LINK FOR THE VIDEO

ఇవాళ మళయాళ కవిత్వంలో ఆధునికతకు పాదులు వేసిన కవుల్లో ముందు వరుసలో వున్న కవి కే.సచ్చిదానందన్. ఆయన మలయాళం లోనే 60 కి పైగా పుస్తకాలు వెలువరించారు. వాటిలో 21 స్వీయ కవితా సంకలనాలు, 20 కి పైగా అనువాద సంకలనాలు, పలు నాటకాలు, వ్యాసాలూ, యాత్రా రచనలు, ఆంగ్లంలో పలు విమర్శనా గ్రంధాలు వెలువరించారు. అంతే కాదు ఆయన సమగ్ర కవితా సంకలనం కూడా వెలువడింది.

ఆధునిక కవిత్వం మరాఠీ లో మర్దేకర్, కన్నడలో ఆడిగ, హిందీలో ముక్తిబోద్ ల తర్వాత చాలా కాలానికి మలయాళంలో 1960ల్లో ఆరంభమయింది. అదునికత ఎన్.వి.కృష్ణా వారియర్ రచనల్లో మొదట ధ్వనించి నప్పటికీ ముఖ్యంగా అయ్యప్ప ఫనిక్కర్, కక్కడ్, అత్తూర్ రవివర్మలతో ఆధునికత విస్తరించిందని చెప్పుకోవచ్చు. వారి రచనల ప్రభావం సచ్చిదానందన్ పైన ఆయన తరం పైన గొప్పగా వుంది అనవచ్చు.

“Poetry as I conceive it is no mere combinatorial game; it rises up from the ocean of the unsayable, tries to say what it cannot stay, to name the nameless and to give a voice to the voiceless” అన్నాడు సచ్చిదానందన్.

కవి అనేవాడికి కవిత్వం మినహా మరే మతమూ ఉండాల్సిన అవసరం లేదంటాడు సచ్చిదా. అంతే కాదు ‘I can be spiritual without being religious’ అనికూడా అన్నాడు

అంతే కాదు కవిత్వమంటే తాజాదనం. తాజాదనం అంటే సృజనాత్మకత, పునరావృతం కాని సృజన. రాసిందే రాయడం చెప్పిందే చెప్పడం కవిత్వం కాదు. కవిత్వం లో సత్యం వుండాలి. కవి అనేవాడు కవిత్వ వాస్థవాన్ని విశ్వసించాలి.

ప్రపంచీకరణ ను నిలువరించడానికి కేవలం కవిత్వం శక్తి చాలదు. కాని సాంస్కృతిక ప్రతిఘటన సాధ్యమవుతుంది. అదనుకు కవులు తమ మాతృభాషలో రాయాలి. ప్రపంచీకరణ ఎ విషయాలనయితే మరుగున పరచాలను కుంటున్నదో ఆ అంశాల పైననే దృష్టి సారించాలి.

ఇవాళ ప్రపంచీకరణ ప్రతి అంశాన్నీ సరుకు గా మారుస్తుంది. వినియోగ వస్తువుగా చూస్తుంది. కవిత్వం దాన్ని వ్యతిరేకించాలి. ఇప్పటికి కేవలం కవిత్వమే ఇంకా వినియోగ సరుకుగా మారలేదు.

కవి ప్రజల్లో ప్రజలతో వుండాలి. ఆలోచించాలి, విశ్లేషించాలి నిరంతరం రాస్తూ వుండాలి. ఎక్కడయితే అణచివేత అరాచకం వుంటుందో గమనింఛి వాటి పైన రాయాలి.

కవిత్వానికి ప్రత్యేకంగా కోడ్ ఉండదు కానీ నీతి వుంటుంది. అదేమిటంటే కవి తనకు తాను నిష్కప టాంగానూ నిజాయితీగానూ వుండాలి.

సచ్చిదానందన్ కవిత్వంలో ఆధునికతతో పాటు,సరళత, సూటిదనం,ప్రతీకాత్మకత,వ్యంగం ముఖ్యంగా కనిపిస్తాయి.ఆయన కవిత్వం నిండా న్యాయం,స్వేచ్చ, ప్రేమ, ప్రకృతి, భాష, మరణం ప్రధాన అంశాలు. సచ్చిదానండకి కేవలం కవిత్వమే కాదు సంగీతం, పెయింటింగ్, సినిమాల పట్ల గొప్ప ఆసక్తి వుంది. వాటిని అధ్యయనం చేసి అనుభూతించే తత్వమూ వుంది. కేరళలో ఫిలిం సొసైటీ ఉద్యమం ఉదృతంగా వున్న 70 లలో అంటే అదూర్ గోపాలక్రిష్ణన్ చిత్రలేఖ ఫిలిం సహకార సంఘం ఏర్పాటు చేసి ‘స్వయంవరం’ రూపొందించి గొప్ప విజయాన్ని సాధించిన కాలం అది. అప్పుడే సచ్చిదానందన్ తాను అధ్యాపకుడిగా పని చేసిన ఇరింజలకుడా లో ఫిల్మ్ సొసైటీ స్థాపించి ఐసెన్ స్టీన్, గోడార్డ్, టార్కోవిస్కి, కురుసోవా, ఆన్జేలోపోలస్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దర్శకుల సినిమాలతో రిట్రోస్పెక్తివ్ లను నిర్వహించాడు.

1946 లో త్రిస్సూర్ ప్రాంతం లోని పుల్లూట్ లో జన్మించిన సచ్చిదానందన్ ఆంగ్ల సాహిత్యం లో కేరళ విశ్వవిద్యాలయంలోనూ, డాక్టరేట్ ను కాలికట్ విశ్వవిద్యాలయం లోనూ పూర్తి చేసారు.సచ్చిదానందన్ మొదటి రచన కవిత్వం పై రాసిన వ్యాస సంకలనం ‘కురుక్షేత్రం’. తన తొలి కవితా సంకలనం ‘అంచు సూర్యన్’(అయిదుగురు సూర్యుళ్ళు)ను 1970 వెలువరించారు. అప్పటినుంచి అవిశ్రాంతంగా రచనలు చేస్తూ ఫనిక్కర్ సూచనల మేరకు అధ్యాపకత్వాన్ని వదిలి ధిల్లీ లో సాహిత్య అకాడెమి పత్రిక ఇండియన్ లిటరేచర్ కు సంపాదకుడిగా చేరిపోయారు అనంతరం అకాడెమి కార్యదర్శిగా పదేళ్ళు పనిచేసారు. ఆ తర్వాత ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్సిటీ లో స్కూల్ అఫ్ ట్రాన్స్లేషన్ లో ఆచార్యుడిగా పనిచేసి పదవీ విరమణ పొందారు.

అనేక భారతీయ భాషా కవులతో పాటు అనేక మంది అంతర్జాతీయ కవుల రచనల్ని మలయాళీ భాషలోకి అనువదించారు. పోలాండ్, ఇటలీ తో సహా పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్న సచ్చిదానందన్ పైన దర్శకుడు బాలూ మీనన్ బయోపిక్ రూపొందించి విడుదల చేసారు.

ఇట్లా కేరళనే కాదు మొత్తంగా దేశం గర్వించదగ్గ కవి సచ్చిదానందన్. సచ్చిదానందన్ కవిత్వం ఇప్పటికే అరబిక్, అస్సామీ,బెంగాలీ, ఇంగ్లిష్, ఫ్రెంచ్,ఇటాలియన్, జర్మన్,గుజరాతీ,మరాఠీ, కన్నడ, తెలుగు, లాత్వియన్, ఉర్దూ భాషల్లోకి అనువదించబడింది.

కే.సచ్చిదానందన్ అందుకున్న పురస్కారాల విషయానికి వస్తే ఒక్క కేరళ సాహిత్యాకాదేమీ నుంచే కవిత్వానికి, వచన రచనకు,అనువాదానికి, నాటకానికి, పర్యాటక రచన లకు వేర్వేరుగా అవార్డులు అందుకున్నారు. కేరళ సాహిత్య అకాడమీ వారి ఫెల్లోశిప్ కూడా అందుకున్నారాయాన. ఇక కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని తన ‘మరన్ను వెచ్చ వస్తుకల్’ కు స్వీకరించారు.

సృజనరంగంలో ఆయన చేసిన కృషి దాదాపు అనితర సాధ్యం అనిపిస్తుంది. ఆయన మలయాళం లో ప్రధానంగా కవిత్వం, వచనం, నాటకాలు, పర్యాటక రచనలు చేసారు. ఆయన రచనలు అనేకం ఇతర భారతీయభాషల్లోకి అనువదించబడ్డాయి.ఆయనా ఇతర భాషలలోని రచనల్ని మలయాళం లోకి అనేకం చేసారు. నేరుగా ఇంగ్లీషులో రాసారు. ఆయన అనేక జాతీయ అంతర్జాతీయ సాహిత్య వేదికల పైన మన దేశానికి ప్రాతినిథ్యం వహించాడు, లండన్,రష్యా, మాన్ట్రియల్, రొట్టార్ డాం, లాటి అమెరికా,లాహోర్లాంటి అనేక చోట్ల తన కవిత్వాన్ని వినిపించారు.

ఆయన రాసిన ‘నేను రాసేటప్పుడు’ WHILE I WRITE లోంచి కొన్ని కవితల అనువాదాలు మీకోసం…..

మూలం : కే.సచ్చిదానందన్

తెలుగు స్వేచ్చానువాదం: వారాల ఆనంద్

++++++++++

‘నడవ’ కారిడార్

————-

చాలాకాలంగా ఈ దారెంబడి

నడుస్తూనే వున్నా

కానీ

నా గదికి చేర లేకపోతున్నా

ఈ దారేమో

భూమధ్య రేఖలా

గుండ్రంగా సాగుతూనే వుంది

నిప్పుల కుంపటి లాంటి ‘సహారా’ను

ఈ పాదాలతో దాటడం కష్టం

గడ్డకట్టిన ఆర్కిటిక్ సముద్రం

ఈతకొట్టడాన్ని అనుమతించదు

నాకు తెలుసు

నా గది ఎక్కడో ఒక చోట వుంది

. . .

ఎప్పుడూ కలవని

ఓ నిజమయిన మిత్రుడు

ఎప్పుడూ రాయని

ఓ నిజమయిన కవిత

ఆ గదిలో నాకోసం ఎదురు చూస్తున్నారు

. . .

ఆ దారెంబడి వెళ్తున్న వాళ్ళని అడిగాను

ఈ దారెటు వెళ్తుందని

పాపం

వాళ్ళకూ తెలియదు

గది తెరవడానికి తమ వద్ద

తాళం చెవులు లేకున్నా

వాళ్ళు కూడా తమ తమ గదులకోసం

వెతుకుతూనే వున్నారు.

————————–

వీడ్కోలు

———

పట్టాల మీద ఆన్చిన

తల

పరుగు పరుగున సమీపిస్తున్న రైలు చేసే

దడ దడ శబ్దాన్ని వింటూ

ఇనుప చక్రాల కింద

తన గొంతు

నలిగిపోక ముందు ఆలపించే

కలలు నిండిన గీతం

మన కవిత్వం

—————————————

నేను రాసేటప్పుడు

===========

నేను దుఖంతో రాస్తాను.

నదులేమైనా పొంగి పొర్లుతాయా ?

లేదు, నా చెక్కిళ్ళు

తడుస్తాయంతే.

నేను ద్వేషం తో రాస్తాను.

భూమేమైనా వణుకుతుందా, కంపిస్తుందా ?

లేదు, నా దంతాలు విరుగుతాయంతే.

నేను కోపంతో రాస్తాను.

అగ్నిపర్వతాలేమైనా బద్దలవుతాయా?

లేదు, నా కళ్ళు ఎరుపెక్కుతాయంతే.

నేను వ్యంగ్యంగా రాస్తాను.

ఆకాశాన రాలుతోన్న ఉల్కలేమైనా తళుక్కుమంటాయా ?

లేదు,నా పెదాలపై

విరుపు కన్పిస్తుందంతే

నేను ప్రేమతో రాస్తాను

నా భుజాలపై పక్షులు గూళ్లు కట్టేస్తాయి

పూలూ పళ్లతో చెట్లు వంగిపోతాయి

పొట్లాడుకుంటున్న మనుషులు పరస్పరం

ఆలింగనం చేసుకుంటారు

స్పటికమంతటి స్వచ్ఛ ప్రవాహంలా

భాష తనెంత లోతైనదో వెల్లడిస్తుంది

నా దుఃఖం, ద్వేషం, కోపం, వ్యంగ్యం —

సమస్తం అర్థాన్ని సంతరించుకుంటాయి

నేనేమో

కెవ్వుమంటాను సిలువ పై నుండి

+++++++++++++++++

బామ్మ

——————–

మా బామ్మకు మనో వైకల్యం

ఆ పిచ్చి ముదిరి మరణానికి దారి తీసింది

పిసినారివాదయినా మా మేన మామ

ఆమెను సామాన్ల గదిలో

గడ్డిలో చుట్టి పెట్టేసాడు

మా బామ్మ పొడిబారి పగిలింది

ఆమె విత్తనాలు

కిటికీ అవతలికి ఎగిరి పడ్డాయి

ఎండా కాసింది, వాన కురిసింది

ఓ విత్తనం ఎదిగి చెట్టైంది

ఆమె కోరిక నన్ను తొలిచి వేస్తున్నది

బంగారు పళ్ళ కోతులను గురించి

కవితలు రాయడానికి

నేనేమయినా సాయం చేయగలనా

++++++++++++++

ఇల్లూ జైలూ

——————-

నువ్వు పొద్దు తిరుగుడు విత్తనాలు తెచ్చావు

నేను పగటి వెలుగు పత్రాన్ని తెచ్చాను

నువ్వు పిడికెడు చంద్ర కాంతిని తెచ్చావు

నేను రాత్రి నృత్యాన్ని తెచ్చాను

నువ్వు పావురం కన్నీళ్లు తెచ్చావు

నేను అడవి కందిరీగ తేనెను తెచ్చాను

నువ్వు స్వర్గం నుంచి ఈకను తెచ్చావు

నేను దేవుని వాక్యాన్ని తెచ్చాను

శ్వేత వర్ణం గలది మన ఇల్లు

పిల్లలేమో నల్లని వారు

వాళ్ళు ఏడ్చారు

నువ్వు భరించ లేదు

వరిధాన్యం కోసం నేను సూర్యుని వైపు ఎగిరాను

ఇప్పుడు నా రెక్కలూ పాటలూ

మబ్బుల్లో బంధించ బడ్డాయి

నా ఏకాంతం ఉరుమై మాట్లాడుతున్నది

నేనేమో మెరుపుల ఆసరాతో మనింటిని వెతుకుతున్నాను

నా పాట నీటి జల్లులా కరిగిపోయి చల్లబడి

మన శ్వేత గృహం పైనా

మనిద్దరి నడుమా వున్న చీకటి శూన్యం పైనా

పడిపోయింది

+++++

గాంధీ మరియు కవిత్వం

ఓ బక్క పలుచని కవిత

ఆ మహానుభావున్ని దర్శిద్దామని

గాంధీ గారి ఆశ్రమాన్ని చేరింది

దూది వడుకుతూ వాడుకుతూ

రాముని ధ్యానం లో నిమగ్నమయి వున్న

ఆయన ద్వారం వద్ద వేచి వున్న

కవితను గమనించ లేదు

తాను భజనను కానందుకు కవిత

సిగ్గుపడుతూ నిలబడింది

తన గొంతును సవరిస్తూ

కవిత చిన్న శబ్దం చేసింది

గాంధీ తన కళ్ళద్దాల పక్క సందుల్లోంచి

నరకాన్ని చూసినట్టు చూసి

‘నువ్వెప్పుడయినా దూది వడి కావా’

అని అడిగాడు

పాకీ వాడి బండి లాగావా

ఎప్పుడయినా ఉదయాన్నే

వంట గది పొగలో నిలబడ్డావా

ఆకలితో అలమటించావా

అని ప్రశ్నించాడు

నేను ఓ అడవిలో

ఓ వేటగాడి నోటిలోంచి పుట్టాను

ఓ బెస్తవాడు నన్ను ప్రేమించాడు

అయినా నాకు గానం చేయడం తప్ప

ఏ పని చేయడమూ రాదు

మొదట నేను రాజాస్థానాల్లో పాడాను

అప్పుడు అందంగా బలంగానే వుండేదాన్ని

కానీ

ఇప్పుడు నేను వీధుల్లో

సగం ఆకలి తో వున్నాను

అంది కవిత

అది మంచిదే

కానీ నువ్వు సంస్కృతం మాట్లాడే

అలవాటు మానుకో

పొలాల్లోకి వెళ్ళు

రైతు కూలీల భాష విను

అన్నాడు గాంధీ నవ్వుతూ

దాంతో కవిత విత్తనంగా మారి

పొలాన్ని చేరింది

భూమిని దుక్కి దున్నే రైతు కోసం

బీడును సస్య శ్యామలం చేసే

చినుకు కోసం

ఎదురు చూస్తున్నది

*****************

59=యాదొంకీ బారాత్

Posted on Updated on

ప్రతి పగలూ పొద్దు గూకుతుంది/ ప్రతి రాత్రీ  తెల్లవారుతుంది 

కారినవో ఇంకినవో కొన్ని కన్నీటి ఛాయలుంటాయి / కలిసినవో వీడినవో కొన్ని అనుభూతి క్షణాలు మిగిలే ఉంటాయి *****

మనసుండీ మనసుతో గడిపిన కాలంలో ఎన్నో అనుభవాలు అనుభూతులు.

జ్ఞాపకాలయి మిగిలిన ఆ రోజుల్ని తలుచుకుంటే కొన్ని వేదనని మిగిలిస్తే మరికొన్ని సంతోషాన్ని పంచుతాయి. నాకే కాదు గతాన్ని నెమరేసుకున్న ప్రతి వారికీ ఇది అనుభవమే. 90వ దశకం మొదటి సంవత్సరాలు నా మట్టుకు నాకు క్షణం తీరిక లేకుండానే గడిచాయి. అవి అర్థవంతమయినవా ఫలవంతమయినవా అంటే చెప్పలేను. కాని గడిపిన ఆ రోజుల్ని ఇష్టంగానే గడిపాను. ఎవరి బలవంతమూ లేదు. కొన్ని రోజులు ప్రవాహంలా సాగిపోతే మరికొన్ని ఎత్తుపల్లాలతో మలుపులతో గడిచాయి.

90వ దశకం మొదటి సంవత్సరాలల్లో ఇవాళ నేను యాద్కి చేసుకుంటున్నవి రెండు అంశాలు. ఒకటి ఆత్మీయ కవి మిత్రుడు అలిశెట్టి ప్రభాకర్, రెండవది నేను ఈనాడుతో గడిపిన సంవత్సరాలు.

అలిశెట్టి గురించి గుర్తు చేసుకుంటే అనేక అంశాలు ముప్పిరి గొంటున్నాయి. మొట్టమొదటిసారి  జగిత్యాల జైత్రయాత్ర తర్వాత సాహిత్య రంగంలో విన్న పేరు అలిశెట్టి ప్రభాకర్. తర్వాత ఒక రోజు నేనూ వెంకటేష్ జగిత్యాల వెళ్లి తనని స్టూడియో పూర్ణిమలో కలిసాం. తర్వాత మేము అయిదుగురం కలిసి వెలువరించిన “లయ’ కవితా సంకలనంతో మా స్నేహం మరింత బలపడింది. తను కరీంనగర్ మంకమ్మతోటలో స్టూడియో శిల్పి పెట్టిన తర్వాత దగ్గర తనం మరింతగా పెరిగింది. అలిశెట్టి స్నేహాన్ని గురించి ఇప్పుడు అన్నీ చెప్పలేను కానీ తన చివరి సంవత్సరాలు మాత్రం చెప్పకుండా ఉండలేను. అనివార్యమయిన పరిస్థితుల్లో సొంత ఇంటిని అమ్మేసి, స్టూడియో శిల్పి తీసేసి భాగ్యం పిల్లలతో హైదరాబాద్ చేరిన అలిశెట్టి విద్యానగర్ మెయిన్ రోడ్డు మీద ‘స్టూడియో చిత్రలేఖ’ ప్రారంభించాడు. మొదట రామ్నగర్ లో నివాసం. తర్వాతా చిక్కడ్పల్లికి మార్చాడు. స్టూడియో వచ్చేపోయే మిత్రులు కవులు అభిమానులతో జాతరలా వుండేది. స్టూడియో వ్యాపారం అంతంత మాత్రమే. అప్పుడే ఆంద్రజ్యోతి లో ఎడిటర్ శ్రీ ఏ.బీ.కే. ప్రసాద్ గారి సహకారం తో రోజూ సిటీ లైఫ్ రాయడం ఆరంభించాడు. అవి సూపర్ హిట్. తానే ఫోటోలు తీసి బొమ్మలు వేసి రాసేవాడు. అదొక కొత్త వొరవడికి దారి తీసింది. తీవ్రంగా కష్టపడేవాడు. క్రమంగా ఆరోగ్యం క్షీణించ సాగింది. శరీరం దాదాపు ఎముకల గూడులాగా తయారయింది. తనకేమి అనిపించిందో ఏమో ఒక రోజు నేను కరీంనగర్ కు భాగ్యం తో కలిసి వస్తున్నాము. మూడు నాలుగు రోజులుంటాము. మన దగ్గరి మిత్రులందరి ఫోటోలు ఫామిలీలతో కలిపి తీస్తాను అన్నాడు. అదేసమయంలో కరీంనగర్ లో ‘కవితా చిత్ర ప్రదర్శన’ కూడా ఏర్పాటు చేసాం. అప్పుడు మేము గెస్ట్ హౌస్ ముందరి ఇంట్లో వున్నాం. కరీంనగర్ చేరుకున్నంక మా ఇంట్లో, చంద్ర ప్రభాకర్, శ్రీనివాస్, లక్ష్మి ప్రింటింగ్ ప్రెస్ విద్యాసాగర్, ఇంకా కొంత మంది దగ్గరి స్నేహితుల ఇండ్లల్లో అద్భుతమయిన ఫోటోలు తీసాడు. అందరూ తన గుర్తుగా ఇవి భద్రంగా దగ్గర ఉంచుకోవాలని కోరుకున్నాడు. మా ఇంట్లో రేల చిన్న పిల్ల. ఉదయం లేవగానే కెమెరా అందుకుని ఆమెవి ఎన్ని ఫోటోలు తీసాడో. ఒక్కొక్కటీ ఒక్కో ఆర్ట్ పీస్. అట్లే నన్నూ ఇందిరనూ జంటగా తీసినవీ అంతే గొప్ప ఫోటోలు. దాదాపుగా అందరు మిత్రుల ఇళ్లల్లో అదీ తీరు, మిత్రులందరికీ అపుడు అలిశెట్టి తీసిన ఫోటోలు గొప్ప బహుమతులు. తర్వాత జిల్లా పరిషద్ ఆవరణలో కవితా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు గుర్తు. అప్పుడే బీ.ఎస్.రాములు రహస్య జేవితం నుండి బయటకు వచ్చాడు. ఆ నాటి కవితా చిత్ర ప్రదర్శన గొప్పగా విజయవంతమయింది. ప్రభాకర్ కూడా ఎంతో ఆనందించాడు.రెండు రోజుల పాటు (13,14 నవంబర్ 1992) ఆ కార్యక్రమంలో జర్నలిస్ట్ ఎస్.కే.జాకీర్, పిన్నింటి అశోక్, కే.దామోదర్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్ రావు, వావిలాల విద్యా సాగర్ రెడ్డి, చంద్ర ప్రభాకర్, సురేందర్,జగదీశ్ తదితర అనేక మంది మిత్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభాకర్, భాగ్య లు ఇద్దరూ ఎంతో సంతోషంగా తిరిగ హైదరాబాద్ వెళ్ళారు. కాని ప్రభాకర్ ఆరోగ్యం మరింత క్షీణించి జనవరి 12 న తనువు చాలించాడు. ఆ రోజు తన పుట్టిన రోజు కూడా కావడం అత్యంత విషాదం. విషయం తెలిసి కరీంనగర్ మిత్రులమంతా మబ్బులనే బయలుదేరి చిక్కడపెల్లి వెళ్లాం. ప్రభాకర్ చివరిశ్వాస విడిచిన క్షణం భాగ్య పిలలతో పాటు పద్మజ కూడా వున్నారు. ఆ రోజు సాయంత్రం వరకు అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. లెక్కలేనంత మంది కవులు, రచయితలు, కళాకారులు, జర్నలిస్టులు అలిశెట్టి అమర్ రహే అంటూ తనని సాగనంపారు. వీ.వీ సార్ తో సహా చాలా మంది అంత్యక్రియల తర్వాత ప్రభాకర్ ఇంటికి వచ్చారు. నేను, శ్రీనివాస్, నారదాసు ‘ప్రభాకర్’ పేరున ఒక ట్రస్ట్ పెట్టాలని భాగ్య పిల్లలకోసం ఏమయినా చేయాలని వుంది అన్నాము. వీ.వీ. సార్ జాగ్రత్తగా చేయండి అని మాకు సూచించారు. బి.నరసింగ రావు అలిశెట్టి పిల్లలకు ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఉచిత విద్య అందించేందుకు ఏర్పాట్లు చేసారు. ఏది ఏమయినా ఆరోజు తెలుగు సాహితీ లోకానికి అత్యంత విషాద కరమైన రోజు. కరీంనగర్ తిరిగి వచ్చాక మిత్రులమంతా అలిశెట్టి మెమోరియల్ ట్రస్ట్ ప్రారంభించాం. దానికి ప్రత్యేక రిజిస్ట్రేషన్ కానీ, కార్యనిర్వాహక బాడి కానీ వద్దనుకున్నాం. అలిశెట్టి మిత్రులంతా అందులో బాగా స్వాములే అన్నాం. ఎన్.శ్రీనివాస్, కే.దామోదర్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్ రావు, డాక్టర్ పి.రాజన్న,నేను ఇంకా పలువురు మిత్రులం ట్రస్ట్ కోసం విరాళాలు సేకరించాం. కొన్ని రోజులు రోజూ ఉదయాన్నే కల్సి పరిచయం, అభిమానం వున్న వాళ్ళందరినీ కలిసి నిధి సేకరించాం. మొత్తం యాభైవేలు సమకూరినట్టు జ్ఞాపకం. శ్రెనివాస్ తమ యునియన్ బాంక్ లో డిపాజిట్ చేసాడు. ఒక రోజు భాగ్య కరీంనగర్ వచ్చి నరాల వెంకటేశం గారిని వెంట తీసుకునివచ్చి తనకోసం సేకరించిన డబ్బును తీసుకెళ్ళింది.

 తర్వాత అనేక ఏండ్ల పాటు అలిశెట్టి మెమోరియల్ ట్రస్ట్ పక్షాన ప్రతి జనవరి 12 న సాహిత్య కార్యక్రమాల్ని నిర్వహించాం. అల్లం రాజయ్య, రఘోత్తం రెడ్డి, దర్భశయనం శ్రీనివాసాచార్య, వజ్జలశివ కుమార్ తదితరులు అనేకమంది సాహితీ వేత్తలు ఆయా సంవత్సరాలల్లో గొప్ప ప్రసంగాలు చేసారు. అలిశెట్టి మిత్రులుగా కరీంనగర్ లో నెహ్రు యువక కేంద్ర, మహిళా డిగ్రీ కళాశాల, జన చైతన్య వేదిక పైన జరిపిన సమావేశాల్లో ప్రభాకర్నీ వ్యక్తిగతంగానూ కవిత్వ పరంగానూ ఇష్టపడ్డ అనేక మంది విరివిగా పాల్గొన్నారు. ఒక రోజు సంఘటన మదిలో మేదుల్తూ వుంది. ఒక 12 జనవరి రోజున కరీంనగర్ లో అలిశెట్టి సభ పెట్టాం. సరిగ్గా అదే రోజు సిరిసిల్లాలో ఒక పోలీసు అధికారి జిల్లా కవులకు సన్మాన కార్యక్రమం పెట్టాడు. దాంతో అనేక మంది ప్రముఖ కవులు ప్రగతిశీల సాహితీవేత్తలు పొలోమంటూ సన్మానానికి వెళ్ళారు. కరీంనగర్ జన చైతన్య వేదిక లో వజ్జల శివ కుమార్ ఉపన్యాసం తో అలిశెట్టి సభ ఘనంగా జరిగింది.

+++++

ఇక ఈ వారం నేను గుర్తు చేసుకుంటున్న మరో అంశం’ ఈనాడు’ తో నా ప్రయాణం. ఈనాడులో సాహితీ సాంస్కృతిక అంశాల్ని రాయడం ఆరంభించాక చాలా మేరకు బిజీ అయినట్టే అయింది. ‘నాడు ఎలగందుల ఖిల్లా-నేడు కరీంనగర్ జిల్లా’అంటూ కూడా అనేక చారిత్రక అంశాల పైన కథనాలు రాసాను. అప్పుడు ఈనాడు సారా వ్యతిరేక ఉద్యమాన్ని తలకెత్తుకుంది. ప్రత్యేక పేజీలని కేటాయించింది. అప్పుడు సిద్ధిపేట నుంచి ఉద్యమాన్ని బేస్ చేసుకుని మంజీరా రచయితల సంఘం ఓ సంకలనాన్ని వేలువరించంది. అది నాకు చేరింది. దాని పైన మంఛి కథనం రాస్తే జనరల్ పేజీ లో ప్రముఖంగా వేసారు. అప్పటికి నేను రాస్తున్న విషయం నందిని సిద్దారెడ్డి తదితరులకు తెలీదు. ఈనాడులో కవిత్వం మీద అంత స్పేస్ ఇవ్వడం తో ఆశ్చర్య పోయి రాసిందెవర అని సిద్దిపేట ఈనాడు మిత్రుడు కే.అంజయ్య ద్వారా తెలుసుకున్నారు. అట్లే పురణాల్లోంచి కూడా మద్యం వ్యతిరేక కథల్ని సాహితీ మిత్రుడు డింగరి నరహరి చారి ద్వారా తెలుసుకుని ఈనాడులో రాసాను. అప్పుడే ధిల్లీ, కలకత్తా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పాల్గొని పత్రికలకు రాసిన అనుభవం గమనించి డాక్టర్ రామకృష్ణ, న్యూస్ టుడే ఎం.డీ.రమేష్ బాబులు చైర్మన్ రామోజీ రావు తో మాట్లాడి బెంగళూరు అంతర్జాతీయ తెలుగు మహా సభలను కవర్ చేసేందుకు నన్ను ఈనాడు పక్షాన పంపారు. నాతో పాటు సాయిప్రసాద్ అనే రెగ్యులర్ రిపోర్టర్ కూడా వచ్చారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా మర్రి చెన్నా రెడ్డి వున్నారు. ఆయన బెంగళూరు మహాసభలను ప్రారంభించాల్సి వుంది. కానీ   ప్రపంచంలోనే ఎత్తైన గౌతమ బుద్ధుని ఏకశిలా విగ్రహాన్ని  టాంక్‌బండ్ ప్రక్కనున్న హుస్సేన్ సాగర్‌లో ‘జిబ్రాల్టర్ రాక్’ అనబడే రాతిపైన ఈ పెద్ద బుద్ధ విగ్రహాన్నిప్రతిష్టించే కార్యక్రమం అదే రోజు ఉండింది. ఒకే రాతిలో మలచబడిన ఈ విగ్రహం 17.5 అడుగుల ఎత్తు ఉండి 350 టన్నుల బరువుంటుంది. హైదరాబాదుకు 60 కి.మీ. దూరంలో ఉన్న రాయగిరి గుట్టల్లోని రాతితో గణపతి స్థపతి నేతృత్వంలో 40 మంది శిల్పులు రెండు సంవత్సరాలు శ్రమించి ఈ శిల్పాన్ని మలచారు. ఈ శిల్పం 192 చక్రాలు గల వాహనంపై హుసేన్ సాగర్ కు తీసుకొచ్చారు. దాన్ని నిలబెట్టే క్రమంలో ప్రమాద వశాత్తు నీళ్ళల్లో పడిపోయింది. ఆ ప్రమాదంలో దాదాపు పది మంది కార్మికులు చనిపోయారు. ఆ సంఘటన సరిగ్గా బెంగళూరు సభకు ముఖ్యమంత్రి బయలు దేరుతున్న సమయంలో జరిగింది. దాంతో ఆయన కార్యక్రమం రద్దు చేసుకున్నారు. బెంగళూరు సభా ప్రాంగణంలో ఒక విషాద వాతావరణం ఏర్పడింది. అయినా అన్ని ఏర్పాట్లు జరిగాయి కనుక మొక్కుబడిగా ప్రారంభోత్సవం చేసారు. కార్యక్రమాలు కొనసాగాయి. ఈనాడులో వార్తల ప్రాధాన్యత మారిపోయింది. సమాంతరంగా జరిగిన సభలు సమావేశాల గురించి వివరాలతో సహా శ్రీ వరదా చారి ప్రెస్కు బ్రీఫ్ చేసారు. కానీ నేను రాసిన రిపోర్ట్స్ కు అంతగా ప్రాధాన్యత రాలేదు. కానీ అంతర్జాతీయ తెలుగు సభల్ని కవర్ చేసిన అనుభవం మాత్రం మిగిలిపోయింది. 

ఇక ఈనాడులో అప్పుడు ఎం,డీ. రమేష్ బాబు హవా కోన సాగుతూ వుండేది. ఆయన ప్రతి జిల్లా లో కొంత మంది రిపోర్తర్లతో సన్నిహితంగా ఉండేవాడు. కరీంనగర్ విషయానికి వస్తే నాకు తెలిసి హుస్నాబాద్ లక్ష్మన్, జగిత్యాల రంగా రావు, గోదావరిఖని రాజేందర్ లు  ఆయనకు సన్నిహితంగా వుండేవాళ్ళు. వీ.పీ.ఎస్. రాజు కరీంనగర్ ను విడిచి వెళ్ళిన తర్వాత డెస్క్ ఇంచార్జ్ డాక్టర్ రామకృష్ణ కరీంనగర్ లో మీటింగ్ పెట్టారు. హైదరాబాద్ లో పని చేస్తున్న డి.ఎన్.ప్రసాద్ ను కరీంనగర్ స్టాఫ్ రిపోర్టర్ గా నియమించామని మా అందరికీ పరిచయం చేసారు. అప్పటి నుండి ప్రసాద్ జర్నలిస్టు గానూ, మేనేజర్ గానూ ఈనాడుకు చేసిన సేవలు అనితర సాధ్యమయినవి. కరీంనగర్ ఎడిషన్ బిల్డింగ్ నిర్మాణం నుంచి మొదలు అన్నింటికీ తన శక్తినంతా ధార పోసారు. ఆయనిప్పుడు ఈనాడు తెలంగాణా ఎడిటర్. అప్పుడు కరీంనగర్ ఎడిషన్ జెనరల్ పేజీ ఇంచార్జ్ ఎం.నాగేశ్వర్ రావు ఇప్పుడు ఏపీ ఈనాడు ఎడిటర్. నాకు తనతో కూడా మంచి అనుబంధం వుండేది. ఇంకా ఈనాడులో సబ్ ఎడిటర్లు రావికంటి శ్రీనివాస్, సుబ్బారావు, చౌదరి, సలీం తదితరులు ఎంతో స్నేహంగా వుండే వాళ్ళు. ఇప్పటికీ స్నేహం కొనసాగుతూనే వుంది. ఇక నేను ఈనాడుకు పరిచయం చేసిన కొందరు మిత్రులున్నారు. సిరిసిల్లానుంచి కవిమిత్రుడు జూకంటి జగన్నాధం ఒక రోజు తవుటు నాగభూషణం ను వెంట తీసుకొచ్చాడు. సాహిత్యం బా గా చదువుకున్నవాడు, భీవండిలో పని చేసాడు. ఏదయినా చేయాలి అన్నాడు. విద్యార్హతలు పెద్దగా లేకున్నా డాక్టర్ రామకృష్ణ కు చెప్పి హైదరాబాద్ కు పంపించాను. తాను మాట్లాడి సిరిసిల్లా నుంచి రిపోర్టింగ్ చేయిపో అన్నాడు. ఇక గంగాధర నుంచి ఆయిలు రమేష్ కూడా అంతే,ఇవ్వాళ తను ఫిలిం ఫీల్డ్ లో సినిమాలు చేస్తూ నిలదొక్కుకుంటున్నాడు, ఇక ఫిలిం సొసైటీ  మిత్రుడు కిరణ్ను  వేములవాడ ఈనాడుకు పరిచయం చేసాను. ముఖ్యంగా అంకం శ్రినివాస్. మొదట తను మా కరీంనగర్ ఫిలిం సొసైటీ లో క్లరికల్ వర్క్ చేసేవాడు. డిగ్రీ అయిన తర్వాత ఈనాడు టౌన్ రిపోర్టర్ గా పరిచయం చేసాను. తన ప్రతిభతో దీక్షతో ఎదిగి సీనియర్ సబ్ ఎడిటర్ అయి జిల్లా ఇంచార్జ్ స్థాయిలో వున్నాడు. అట్లే చొప్పదండి లో మా విద్యార్థి  కల్యాణం  శ్రీనివాస్ ను కూడా స్టాఫ్ రిపోర్టర్ కు పరిచయం చేస్తే  విలేఖరిగా చేరిపోయాడు. తర్వాత క్రమంగా ఎదిగి అనిమేటర్ అయి ఇవ్వాళ హైదరాబాద్లో స్థిరపడ్డాడు. తర్వాత మనికొండ నాగేశ్వర్ రావు కరీంనగర్ నుంచి బదిలీ పై వెళ్తున్నప్పుడు మున్సిపల్ గెస్ట్ హౌస్ లో జరిగిన వీడ్కోలు సమావేశం ఇప్పటికీ గుర్తుంది. ఇట్లా ఈనాడుతో.. ఈనాడులో.. నా అనుభవం సాగింది. 

సోయి 

ప్రతి పగలూ పొద్దు గూకుతుంది/ ప్రతి రాత్రీ  తెల్లవారుతుంది 

కారినవో ఇంకినవో కొన్ని కన్నీటి ఛాయలుంటాయి / కలిసినవో వీడినవో కొన్ని అనుభూతి క్షణాలు మిగిలే ఉంటాయి 

నడిచినవో నిలిచినవో కొన్ని దారులు ఏర్పడేవుంటాయి / మంచివో చెడ్డవో  రోజూ కొన్ని అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి 

గెలిచినవో ఓడినవో  కొన్ని సంఘటనలు గుర్తుంటాయి / విజయులో అమరులో కొందరు యోధులు నిలిచే వుంటారు 

ఏ ఒక్క రోజూ మాయ కాదు మిధ్యా కాదు కొంచెం ‘సోయి’ఉండాలి /మెత్తటిదో గట్టిదో నీకో మనసుండాలి ఇవ్వడానికయినా పుచ్చుకోవడానికయినా 

అవును జీవితంలో ఏ ఒక్క రోజూ వృధా కాదు 

—————————-

మిగతా మళ్ళీ వారం…

-వారాల ఆనంద్

11 సెప్టెంబర్.2022                  

59=యాదొంకీ బారాత్

బతుకు తెరచాప రెపరెపలాడుతోంది

Posted on

బతుకు తెరచాప రెపరెపలాడుతోంది

+++++++ వారాల ఆనంద్

(నమస్తే తెలంగాణ దిన పత్రిక September 7, 2022)

బతుకు తెరచాప రెపరెపలాడుతోంది

విన్నావా ఎపుడైనా

గొంతులో తారట్లాడే శబ్దాల అర్థాల్ని

మాటల అర్థాల కోసం వెతికే మౌనాన్ని

చూసావా ఎపుడయినా

తెల్లని కాగితంపై బారులుతీరిన అక్షరాల్ని

వంపులు తిరిగిన అక్షరాల సోయగాల్ని

అవి మోస్తున్న భావాల సరాగాల్ని

కన్నావా ఎపుడయినా

నిన్నటి అనుభవ సముద్రాల్ని మోస్తున్న

ఇవ్వాల్టి సూర్యోదయాల్ని

అనుభవించావా ఎపుడయినా

పగటి పరిమళాల్ని నింపుకొని

వెచ్చటి గాలిలో చల్లని హొయలు

పోతున్న సాయం కాలాన్ని

చూసావా ఎపుడయినా

ఒంటరితనం గుంపులోకి పరిణామం చెందడాన్ని

గుంపు ఒంటరితనంలోకి ఘనీభవించడాన్ని

తెలిసిందా ఎపుడయినా

రాత్రి నిద్ర ఉదయపు మెలకువలోకి

పగటి శ్రమ రాత్రి నిద్రలోకి పరివర్తన చెందడం

గమనించావా ఎపుడయినా

కవితలో అర్థం లేనితనాన్ని

వెతికావా ఎపుడయినా

అర్థం లేనితనంలో కవిత్వాన్ని

ఎక్కడ మొదలయ్యామో మరిచిపోయాం కావాలనే

ఎక్కడికి వెళ్ళాలో దారి తప్పిపోయాం తెలియకనే

చౌరాస్తాలో కాటగల్సిపోయాం

చూసావా చిత్రంగా

ముందు నిలుచున్న అద్దం

అబద్ధం చూపుతోంది

లోన వెలిగించుకున్న దీపం కొడిగట్టుతోంది

గమనించావా

చీకటి వెలుగుల నిరంతర యానంలో

బతుకు తెరచాప రెపరెపలాడుతోంది

అయినా కన్నీటి అలలపై

పడవింకా పరుగెత్తాల్సే వుంది

వారాల ఆనంద్‌

58= యాదోంకీ బారాత్

Posted on

 (8 సెప్టెంబర్ 2022, అక్షరాస్యతా దినోత్సవం ) 

   +++++ వారాల ఆనంద్

సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమం- ‘అక్షరఉజ్వల’- సామాజిక సాంస్కృతిక కార్యక్రమం

************

దేశంలో అత్యధిక శాతం ప్రజలు నిరక్షరాస్యులుగా వుండడం దేశాభివృద్ధికి పెద్ద లోటు.  ఆ లోటును భర్తీ చేయడం కోసం లక్షలాది మందిని చైతన్య వంతులను చేసేందుకు చేపట్టిన కార్యక్రమం సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమం. దేశంలోని అనేక జిల్లాల్లో ఆ కార్యక్రమాన్ని ఆనాటి కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. అందుకోసం ఎంపిక చేసిన జిల్లాల్లో మా కరీంనగర్ కూడా వుంది. దాంతో ఆనాటి జిల్లా  కలెక్టర్ భన్వర్ లాల్ నేతృత్వంలో విస్త్రుత కార్యక్రమం 1990 లో మొదలయింది.

నిజానికి “గుర్తించడం (identify), అర్థం చేసుకోవడం (understand), పాల్గొనడం (interpret), సృష్టించడం (create), విషయప్రసారం (communicate), లెక్కించడం (compute), ముద్రించిన లేదా రాసిన అనేక విషయాలను గ్రహించే నైపుణ్యాలు కలిగివుండడాన్ని  “అక్షరాస్యత” అన్నారు. అప్పటికే మురార్జీ దేశాయ్ ప్రభుత్వం చేపట్టిన జాతీయ వయోజన విద్య  కార్యక్రమం ఆశించిన ఫలితాల్ని ఇవ్వలేదు. అందుకు గాను కేంద్రం నేషనల్ లిటరసీ మిషన్ పేరకొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజల్ని అక్షరాస్యత విషయం లో చైతన్యవంతం చేయడానికి సృజకారుల, రచయితల, కళాకారుల, విద్యావేత్తల సేవల్ని వినియోగించుకోవాలని కేంద్రం తలపోసింది. అందుకుగాను జిల్లాల్ని ఎంపిక చేసి స్వచ్చంద సంస్థగా ఈ కార్యక్రమాన్ని చేయాలని సూచించింది. 1990-95 సంవత్సరాల మధ్య 50 మిలియన్ల ప్రజల్ని అక్షరాస్యులను చేయాలని నిర్దేశించారు, అందులో భాగంగా ఆనాటి ఆంధ్రప్రదేశ్ లో నెల్లూర్ మొట్ట మొదటి సంపూర్ణ అక్షరాస్యత సాధించిన జిల్లాగా పేరు గడించింది. అదే క్రమంలో కరీంనగర్ జిల్లాలో కూడా ఆ కార్యక్రమం మొదలయింది.

అప్పటికి అనేక సాహితీ సాంస్కృతిక కార్యకమాలను నిర్వహిస్తూ వివిధ పత్రికల్లో రాస్తూ వున్న మమ్మల్ని ఒక రోజు కలెక్టర్ భన్వర్ లాల్ పిలిచారు. ఆయనకు మా ఫిలిం సొసైటీ కార్యక్రమాలు, సాహితీ గౌతమీ కార్యక్రమాలలో పాల్గొన్న అవగాహన వుంది.

సంపూర్ణ అక్షరాస్యత కోసం ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అన్నారు. తన ఆలోచనలు చెప్పారు. ఒకసారి  నెల్లూరు జిల్లాలో జరిగిన కార్యక్రమాల్ని చూసి వస్తే మనమూ అంతకంటే మెరుగ్గా చేయొచ్చని మేమన్నాం. ఆయన వెంటనే స్పందించారు. ఒక టీం ఏర్పాటు చేసారు. నేనూ, శ్రీనివాస్, గోపులింగా రెడ్డి, పొన్నం రవిచంద్ర, చాడ వెంకట్ రెడ్డి, ప్రేమ్చంద్ ఇట్లా మరికొందరు అంటే విభిన్న రంగాలనుండి కొందరిని ఎంపిక చేసారు. ప్రయాణానికి ఏర్పాట్లు చేయడం లాంటి పనుల్ని జిల్లా సమాచార శాఖ అధికారి కే.నరసింహా చారి కి అప్పగించారు. అప్పుడొక గమ్మత్తయిన విషయం జరిగింది. కరీంనగర్ లయన్స్ క్లబ్ వాళ్ళ దగ్గర మంచి వ్యాను వుంది అది తీసుకుంటే ప్రయణానికి సరిపోతుంది అని ఎవరో సూచించారు. కాని డాక్టర్ భాస్కర్ మాదేకర్ వాన్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. మాది స్వచ్చంద సంస్థ వ్యాన్ పాడయితే తర్వాత ఎవరూ పట్టించుకోరు అన్నారు. కలెక్టర్ అది వదిలేసి రెండు కార్లల్లో ప్లాన్ చేసుకోండి అన్నారు  నెల్లూరు చిత్తూరు జిల్లాల కలెక్టర్లకు నేను చెబుతాను బయలు దేరండి అన్నారు, ఇంకేముంది చలో నెల్లూరు. అక్కడ కలెక్టర్ రాజు గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. తాము చేపట్టిన అన్ని కార్యక్రమాల గురించి వివరంగా చెప్పారు. అన్నీ మేము నోట్ చేసుకున్నాం. He was very inspiring. తర్వాత చిత్తూరు. అక్కడ కలెక్టర్ మా అందరికీ పరిచయం వున్న ఐ.వీ.సుబ్బారావు. కరీంనగర్ లో పనిచేసి వెళ్ళారు. ఏముంది. చాలా విషయాలు వివరించారు. తిరుమల కొండమీద అన్ని ఏర్పాట్లు చేసి దర్శనానికి పంపించారు. పనిలో పనిగా అందరికీ స్వామికార్యం స్వకార్యం పూర్తి అయ్యాయి.

     రెండు జిల్లాల పర్యటన ముగించుకుని ఎంతో ఉత్సాహంతో స్పూర్తితో కరీంనగర్ చేరుకున్నాం. కలెక్టర్ భన్వర్ లాల్ కి అన్ని విషయాలు చెప్పాం. సంపూర్ణ అక్షరాస్యత ఆవశ్యకత గురించి అనేక కార్యక్రమాలతో పాటు ఒక వార పత్రిక తేవాలని సూచించాము. దానికి ‘అక్షర ఉజ్వల” అని పేరు పెట్టాం. ఆయన వెంటనే ఒప్పుకున్నారు. ముఖ్య సంపాదకుడిగా కలెక్టర్ ఉండాలన్నాం. మౌనంగా విని ఒక సంపాదక వర్గం కావాలన్నారు. అందులో వారాల ఆనంద్, నరెడ్ల శ్రీనివాస్, డాక్టర్ గోపు లింగారెడ్డి, డాక్టర్ గండ్ర లక్ష్మణ్ రావు, డాక్టర్ బి.దామోదర్ రావు, పొన్నం రవిచంద్ర లు సభ్యులుగా నియమించారు. డీపీఆర్వొ కన్వీనర్ గా వుంటారు అన్నారు. పత్రిక ఎట్లా వుండాలి.  శీర్షికలు ఏమేమి వుండాలి అనే విషయాల్లో విస్తారంగా చర్చించాం. ప్రతిసారీ సంపాదకీయం వుండాలన్నాం. మొదటి సంచిక 8 సెప్టెంబర్ అక్షరాస్యత దినోత్సవం రోజున తేవాలని కలెక్టర్ సూచించారు.అందుకు సిద్ధం కావాలని ఆయన చెప్పారు. అప్పటికే తన మానేర్ టైమ్స్ పత్రిక ద్వారా రవిచంద్రకు ఓంసాయి ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్రెస్ తో పరిచయం వుంది. అందులోనే  ప్రింట్ చేయాలని కలర్ పేజెస్ తేవాలని అనుకున్నాం. నిధుల విషయమ తనకు వదిలి వేయమని కలెక్టర్ అన్నారు. దాదాపు ప్రతి రోజూ కలెక్టర్ కాంప్ ఆఫీసులో మీటింగ్స్. మొదటి సంచిక కు మాటర్  తయారయింది. సంపాదకీయం కావాలి సర్ అన్నాను. నేను ఇట్లా అనుకుంటున్నాను అంటూ కొన్ని పాయింట్స్ ఇంగ్లీష్ లో చెప్పారు. ఒక్క క్షణం సార్ అని అని నేను వేగంగా తాను చెప్పిన అంశాల్ని స్పృశిస్తూ తెలుగులో వివరంగా రాసాను. అది చూసి బాగుంది, వేయండి అన్నారు. అప్పటి నుండి వారం వారం నేను నా అభిప్రాయాలు చెబుతాను మీరు రాయండి అన్నారాయన. మర్నాడు ఉదయం నేనూ రవిచంద్ర డీపీఆర్వో నరసింహా చారి          

సంచార శాఖ వాన్ లో బయలుదేరాం.  ఓం సాయి రామి రెడ్డి పూర్తిగా సహకరించాడు. చంద్రావతి గారని కంపోసిటర్ వేగంగా టైప్ చేసారు. రికార్డ్ టీం లో ‘అక్షర ఉజ్వల’ ఫస్ట్ ఎడిషన్ రంగులో సిద్ధమయింది. మేము ఆర్టీసీ చౌరస్టాలోని ASTORIA లో బిర్యానీలు తినడం కంపోసింగ్ ప్రూఫ్ రీడింగ్ ప్రింటింగ్ చూడడం సరదాగా గడిపాం. 7 సెప్టెంబర్ రాత్రి ప్రింటింగ్ మొదలయి ఉదయానికి పూర్తి అయింది. మబ్బులనే కాపీలతో బయలు దేరాం. ఇక్కడ కరీంనగర్ లో ఎస్ ఎస్ ఆర్ ఆర్ కాలేజీ ఆవరణలో పెద్ద సభ. మంత్రి ఎం.ఎల్.ఎ లు అతిథులు. దానికి ముందు రోజు ప్రెస్ మీట్ లో పత్రిక తెస్తున్న విషయం కలెక్టర్ చెబితే ఇప్పుడు కాదు పత్రికాలో చూడదండి అని ఆయన సస్పెన్స్ లో వుంచాడట. సభా ప్రాంగణం లోకి సీదా పత్రిక తెహ్చాం. మంత్రి చేతులమీదుగా ఆవిష్కరణ జరిగింది. జీవగడ్డ విజయ కుమార్ తదితర జర్నలిస్టులు పత్రిక బాగుంది.. మీరున్నారు కదా అని అభినందించారు. భన్వర్ లాల్ కూడా సంతోషించారు.

తర్వాత జిల్లాలోని అన్ని రెవెన్యు డివిజన్ లల్లో కార్యక్రమాల ఉధృతి పెరిగింది. ఫోక్ ఆర్ట్స్ అకాడెమి మొదలు అనేక సాంస్కృతిక సంస్థల్ని చైతన్య వంతం చేసారు. ప్రతివూర్లో ఎదో ఒక అక్షరాస్యతా చైతన్య కార్యక్రమం రోజూ జరిగేలా ఏర్పాట్లుచేశారు. ప్రతి డివిజన్ కు ఒక జిల్లా అధికారిని బాధ్యున్ని చేసారు. ఆయావార్తల్ని విశేషాల్ని సేకరించడానికి మా సంపాదక వర్గ సభ్యులని కేటాయించారు. నేను మంథని డివిజన్ కు వెళ్లాను. సోషల్ వెల్ఫేర్ డీడీ శర్మ గారు మా ఇంచార్జ్ అధికారి. ఆయన ప్రతి రోజూ నన్ను తోడుగా తీసుకుని మంథని మారు మూల గ్రామానికి తీసుకెళ్ళారు. అట్లా అనేక మారుమూల గ్రామాల్ని చూసే అవకాశం నాకు కలిగింది. అయితే సంపాదక వర్గంలోవున్న ప్రభుత్వ కాలేజీ అధ్యాపకుల్ని డిప్యుటేషన్ పై పంపమని కలెక్టర్ ఆదేశాల్ని జారీ చేసారు. మిగతా వాళ్లనుఆయా కాలేజీ ప్రిన్సిపాల్స్ వదిలేసారు. కానీ మా చొప్పదండి ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి మాత్రం రిలీవ్ చేయలేదు. విషయం తెలిసిన భన్వర్ లాల్ గారు వెంకట్ రెడ్డి గారిని ఫోన్ చేసి పిలిచారు. ఎందుకు రిలీవ్ చేయలేదని అడిగితే కాలేజీ లో కష్టం అవుతుంది అని ఎదో సంధానం చెబితే కోపం తో ఒక్క జూనియర్ కాలేజీ నిర్వహనే కష్టమయితే మొత్తం జిల్లాను ఎట్లా నడుపాలి అన్నారు. ఆనంద్ ఇక్కడ ఎంత పని చేస్తున్నాడో తెలుసా..వెంటనే రిలీవ్ చేయండి అని కోపంగా అన్నాడని కలెక్టర్ పీ ఏ చెప్పాడు. మర్నాడు ఎంతో గులుక్కుంటూ నన్ను రిలీవ్ చేసారు. ఇక అప్పటినుండి పూర్తి స్థాయిలో అక్షరాస్యతా కార్యక్రమంలో మునిగి పోయాను. ఈ కార్యక్రమాల్లో హరికథలు, ఒగ్గుకథలు, బంజారా నృత్యాలతో సహా అన్నిరకాల సాంస్కృతిక కార్యక్రమాలతో జిల్లా బిజీ బిజీ అయిపొయింది. బానర్లు,పోస్టర్లు,కరపత్రాలు ఒకటేమిటి సర్వ్ సర్వత్రా ఒకటే నినాదం సంపూర్ణ అక్షరాస్యత. అదొక పెద్ద ఊపు.

   ఇదంతా ఇట్లా జరుగుతుండగానే జిల్లా మంత్రికి కలెక్టర్ భాన్వర్ లాల్ కీ నడుమ ఏవొ పొరపొచ్చాలు వచ్చాయి. ఏముంది కలెక్టర్ ఆకస్మిక బదిలీ. ఇదేమిటి సార్ అని నేను అడిగితే ఏముంది ఆనంద్ THE GAME IS OVER అన్నాడాయన. హైదరాబాద్ కలెక్టర్ గా చేరిపోయాడు. తర్వాతి సంవత్సరాలల్లో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా పని చేసారు.

కరీంనగర్ కు కొత్త కలెక్టర్ గా వినోద్ కుమార్ అగర్వాల్ వచ్చారు. మంచివాడే కానీ కొంత తొందర ఆవేశం పాలు ఎక్కువ. మాటల్ని సులభంగా వదిలేసే వాడు. అక్షర ఉజ్వల టీం తో బాగానే వున్నాడు. కానీ పొసగని తనమేదో వుండేది. అదట్లా వుంటే జిల్లా వయోజనవిద్యా శాఖ డీడీ మొదటినుండీ కొంత అప్పర్ హాండ్ చూపించే ప్రయత్నం చేసేవాడు. కానీ భాన్వర్  లాల్ దగ్గర సైలెంట్ గా ఉండేవాడు. ఒక రోజు ఎదో ఇష్యూ మీద అక్షర ఉజ్వల కార్యదర్శి పదవి నుండి ఆయన్ను తొలగించి PD DRDA ను నియమించారు. అందులో నా ప్రమేయం వుందని ఆ డీడీ అపోహపడ్డాడు. వ్యతిరేకతను పెంచుకున్నాడు. వినోద కుమార్ కలెక్టర్ గా వచ్చాక నా CAMMOUNICATION LAPSE వలన ఒక సంఘటన జరిగింది. పత్రిక కోసం నేనూ రవిచంద్ర హైదరాబాద్ వెళ్లాం. ప్రింటింగ్ కొంత ఆలస్యం అయింది. ట్రాన్స్ పోర్ట్ లో వెసాము. కలెక్టర్ అడిగితే పత్రిక వచ్చేస్తుంది అన్నాను. కానే మర్నాడు జరిగిన సమావేశం సమయానికి రాలేదు. వచ్చిందన్నారు అంటూ బిగ్గరగా అరిచాడు. మా టీంలో ఎవరూ నాకు తోడుగా రాలేదు. నేను మౌనంగా మీటింగ్ నుంచి వెళ్లి పోయాను. బాగా అవమానంగా ఫీలయ్యాను. నా డిప్యుటేషన్ వద్దనుకుని మర్నాడు నేరుగా కాలేజీకి వెళ్లి జాయిన్ అయిపోయాను. మళ్ళీ అక్షర ఉజ్వల వైపు పోలేదు. కానీ తరవాతి కొద్ది రోజులకు కొత్త కార్యదర్శి అయిన సహకార శాఖ అధికారి శ్రీ మోహన్ రావు మా ఇంటికి వచ్చి జరిగింది మర్చిపొండి. నేనున్నాను కదా కలెక్టర్ తో మాట్లాడుతాను రమ్మన్నాడు. నేను అంగీకరించలేదు. వద్దులెండి..జరిగింది చాలు అని మర్యాదగా తిరస్కరించాను.

     “మీ ప్రతిభే మీకు ఒక రోజు ఆటంకమవుతుంది…మీ సంపూర్ణ ప్రమేయం మీ చుట్టూ వున్న అనేకమందికి కంటకింపు అవుతుంది” అన్న విషయమ అప్పుడు నాకు బాగా అర్థం అయింది.. అయినా తత్వం ఎక్కడికి పోతుంది..ఆ స్థితి తర్వాత కూడా అనేక సార్లు జీవిత పాఠంగా ఎదుర్కొన్నాను.

అదే సమయంలో జూనియర్ కాలేజీ నుంచి డిగ్రీ కాలేజీకి ప్రొమోషన్ ప్రక్రియ మొదలయింది. నేను అందులో బిజీ అయిపోయాను..

ఫిర్ మిలేంగే యాదొంకే సాత్..

-వారాల ఆనంద్

8 సెప్టెంబర్ 2022, అక్షరాస్యతా దినోత్సవం  

సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమం- ‘అక్షరఉజ్వల’- సామాజిక సాంస్కృతిక కార్యక్రమం

************