SAHITHI SRAVANTHI

బతుకు సమీకరణం కాదు-వారాల ఆనంద్

Posted on

Friends,pl read my poem published today 15 April 2024  in Andhra Prabha daily, Tq

బతుకు సమీకరణం కాదు

++++++++++++ వారాల ఆనంద్

జీవితం నడుస్తున్నాదా

పరుగెడుతున్నదా చతికిలబడ్డదా

ఓ క్షణం వెనక్కి చూస్తూ

వేగం పుంజుకుంటున్నదా

వెనక్కు చూస్తూ చూస్తూ వెన్ను చూపిస్తున్నదా!

నిటారుగా నిలబడిందా

వంగుతూ లేస్తూ

అంబాడుతూ లేస్తూ

అవతలితీరంకేసి చూస్తున్నాదా

ఏమో అద్దంలో ప్రతిబింబాన్ని చూసినట్టు

నా బతుకు నాకూ

నీ బతుకు నీకూ తెలియాలి

లేదూ కెమెరా కన్నేసుకు చూసే

నీ ముందరి వాడికి తెలియాలి

అయినా బతుకు

ఏ సూత్రమో రసాయన సమీకరణమో అయితే

దానంత విసుగయిందీ అసహజమయిందేదీ లేదు

నిజానికి  

ఫ్లై ఓవర్ లాంటి ఎత్తుపళ్లాలతో 

మెలికలు తిరిగే మలుపుల్తో  

యాదేచ్చగా అర్థవంతంగా సాగేదే జీవితం

************ 9440501281        

‘జ్ఞానం’ కవిత

Posted on

మిత్రులారా! ఈ రోజు ‘నమస్తే తెలంగాణ’ లో అచ్చయిన కవిత చదవండి- ఆనంద్

‘జ్ఞానం’
+++++ వారాల ఆనంద్

ఈ మనిషినెక్కడో చూసాను
చిరపరిచితమయిన ముఖమే
బస్టాండ్లో, మెట్రోలో, ఫుట్ పాత్ పైనా చూసాను
పాతబజార్ గల్లీల్లో లైబ్రరీ పుస్తకాల నడుమా చూసాను

చాలా దగ్గరగానూ దూరంగానూ
దట్టమయిన అడవిలో, విశాల మైదానంలో చూసాను

సురసుర మండే ఎండలో చిటపట కురిసే వానలో
గజ గజ వణికే చలిలో
తడుస్తూనో ముడుచుకునో ఉసూరుమంటూనో వుంటే చూసాను

కానీ మబ్బులు కమ్మిన చంద్రుడిలా
పొగమంచు కమ్ముకున్న రహదారిలా
రూపం స్పష్టంగా కనిపించడం లేదు
ఆ ముఖం అందమయిందా కురూపా

చూసిన మనిషే తెలిసిన ముఖమే
ఎటూ పాలుపోక ఊరంతా తిరిగీ తిరిగీ
ఉసూరుమంటూ ఇల్లు చేరాను
ఎవరతను?
మెదట్లో పురుగు తొలుస్తూనే వుంది

అకస్మాత్తుగా నిలువుటద్దంలోకి చూసాను
అరె నేను చూసిన ముఖమీదే
చిరపరిచితమయిన మనిషితనే

నన్ను నేను తెలుసుకున్నా
నాలాంటివాళ్లూ అర్థమయ్యారు

పొరలు పొరలుగా తెరలుగా
‘జ్ఞానం’ వికసించింది

******************** 24-03-2024

SRIBHASHYAM VIJAYASARATHI

Posted on

మిత్రులారా! సాహితీస్రవంతి కార్యక్రమంలో ఈ వారం సంస్కృత కవి పండితుడు శ్రీ శ్రీభాష్యం విజయసారధి గారి గురించి నా PODCAST వినండి. లింక్ క్లిక్ చేసి చూడండి -వారాల ఆనంద్, 9 మార్చ్ 2024

YADONKI BARATH, 2nd SEREES No.8

Posted on

యాదోంకీ బారాత్

సెరీస్-2, నం.8

+++++++++++++++ వారాల ఆనంద్

సంతోషం అగ్గిపుల్లలా సర్రున వెలిగి ఆరిపోతుంది

దుఃఖం ఆగరొత్తీలా కాల్తూ మనల్నీ మన పరిసరాల్నీ

చాలాసేపు అంటిపెట్టుకునే వుంటుంది.

…….

దుఃఖ వ్యక్తీకరణ మాధ్యమం కేవలం కన్నీళ్లు కాదు, నా మట్టుకు నాకు కవిత్వం కూడా. అందుకే 2013-2014 సంవత్సరాల సంక్షోభ కాలంలో కవిత్వం నాకు పెద్ద అవుట్ లెట్ అయింది.

చికిత్స విజయవంతమయి నిలకడయిన ఆరోగ్య స్థితి లో కరీంనగర్ చేరుకున్న నేను యధావిధిగా కాలేజీ బాధ్యతలు కొనసాగించసాగాను. ఆ స్థితిలో మా ఎస్.ఆర్.ఆర్.కాలేజీ మిత్రులు చూపిన అభిమానం అందించిన సహకారం గొప్పది. అప్పుడే నేను ఆగస్ట్ 2014 లో ‘మానేరు గల గల’, ‘బంగారు తెలంగాణా లో చలన చిత్రం’ పుస్తకాల్ని తెచ్చాను.

దాని తర్వాత వెంటనే కవిత్వ పుస్తకమూ తేవాలనిపించింది. ఆ విషయం చెప్పగానే మిత్రుడు అనంతాచార్య ఇంత వెంటనేనా సార్ అన్నాడు “సమయం లేదు మిత్రమా” అని సినిమా ఫక్కీలో సమాధానం ఇచ్చాను ఇద్దరమూ బిగ్గరగా నవ్వుకున్నాం.

 ఇంకేముంది రాసిన కవితల్ని ఒక చోట చేర్చి అమర్ కిచ్చాను డీటీపీ చేయమని. మరో వైపు ఆత్మీయ మిత్రుడు ప్రముఖ కవి దర్భశయనం శ్రీనివాసాచార్యను ముందు మాట రాయండి సార్ అని కోరాను. ఆయన మరోక్షణం ఆలోచించకుండా నేను రాయకుంటే ఎట్లా అన్నాడు. ఆయనతో నా తొలి పరిచయం 1998 నాటిది. తాను కరీంనగర్ ఆంధ్రా బ్యాంక్ లో చేరినప్పటిది. అప్పటినుండీ మా రెండు కుటుంబాలూ స్నేహంగా ఆత్మీయంగా కలిసిపోయాయి. 1998లో నేను నా ‘మానేరు తీరం’ ప్రచురించాను. దాని ఆవిష్కరణ సభ కరీంనగర్ నెహ్రూ యువ కేంద్ర హాలు లో జరిగింది. సమైఖ్య సాహితి సంస్థ ఆధ్వర్యంలో కె.ఎస్.అనంతాచార్య, మాడిశెట్టి గోపాల్ నిర్వహించారు. ఆనాటి సభలో మిత్రులు నలిమెల భాస్కర్ అధ్యక్షులు, దర్భశయనం ముఖ్య అతిథి. నా రచన మీద ఆ రోజు దర్భశయనం చాలా గొప్పగా స్నేహంగా సాధికారికంగా మాట్లాడారు. వివరంగా విశ్లేషణాత్మకంగా ఆయన చేసిన ప్రసంగం నాకో పెద్ద ప్రేరణ. సభ తర్వాత హాలు చిన్నదయిపోయింది సర్ అని అనంతా చార్య అంటే జీవగడ్డ విజయకుమార్ ‘చారీ నిర్వాహకులుగా మీరు ఆనంద్ ను తక్కువ అంచనా వేశారు’ అన్నాడు. అంతా నవ్వుకున్నాం. ఆ తర్వాత ‘నవ్యచిత్ర వైతాళికులు’, ‘సినీ సుమాలు’, ‘24 ఫ్రేమ్స్’ ఇట్లా నా సమాంతర సినిమా పుస్తకాల మీద జరిగిన సభలల్లో దర్భశయనం విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు. మా ఇద్దరి నడుమా అంతటి దగ్గరితనం అభిమానం పెనవేసుకున్నాయి.

ఆ చనువుతో అడగ్గానే ’మనిషి లోపల’ కవిత్వానికి మనిషిలోపలి చింతన పేరుతో ముందు మాట రాశారు. రాయడమంటే అట్లా ఇట్లాకాదు. నన్నూ, అప్పటి నా స్థితినీ, నా కవిత్వాన్నీ కలగలిపి వడబోసి ఆవిష్కరిస్తూ రాశారాయన.

“ఒక సంక్లిష్ట సందర్భానికి ఆనంద్ ఇచ్చిన అక్షర రూపమీ సంపుటి. దుఃఖమూ కవిత్వమూ కవలలని తాను తెలుసుకున్నాడు. అనుభవంతో తాత్విక స్థాయికెళ్లి దుఃఖపు జీర లేకుండా ఏదయినా ఆనందమెలా అవుతుంది అని వ్యాఖనించాడు ఆనంద్. ఈ సంపుటిలో దుఃఖం కనిపించినంతగా మారే మాటా కన్పించదు.‘ధైర్యం’ అనే భావం పలికినంతగా మరే భావం పలకలేదు” అన్నాడు దర్భశయనం శ్రీనివాసాచార్య. అట్లా ఆయన ముందుమాటతో నా మనిషి లోపల సిద్దమయింది. ఈ సారి ఆవిష్కరణ హైదరబాద్ లో చేయాలనుకున్నాను. అనుకూలమయిన హాలు దొరికితే సరే అనుకున్నాము. జింబో ఎమెస్కో బుక్స్ వారి హాలు ఏర్పాటు చేశాడు. 16 నవంబర్ 2014 న సభకు సిద్దమయ్యాము. ఆవిష్కర్త గా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు శ్రీ కె.వి.రమణా చారి గారిని, విశిష్ట అతిథులుగా మిత్రుడు అల్లం నారాయణ, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్, ఆత్మీయ అతిథిగా దర్భశయనం శ్రీనివాసాచార్య, అధ్యక్షుడుగా జింబో లను ఆహ్వానించాను. సభ నిర్వహణ భాధ్యతల్ని ఆత్మీయ మిత్రుడు వఝల శివకుమార్ కి అప్పగించాను. రెండు రోజుల ముందు నమస్తే తెలంగాణ పత్రిక నుండి కాల్. మీ పుస్తకం ముందుమాట ను మాకు పంపండి ఆదివారం సంచికలో వేస్తామని. ఆ రెస్పాన్స్ ఊహించనిది. సరే డీటీపీ పంపాను. నమస్తే తెలంగాణలో 14న  రానే వచ్చింది. సభ కోసం నేనూ ఇందిరా ఉదయాన్నే బయలుదేరాం. అతిథులందరూ సమయానికి వచ్చేశారు. రమణా చారి గారు వస్తూనే ఆనంద్ నేనీ మీటింగ్ అని కాదు కేవలం  మీ ఇద్దరినీ ఇందిరనూ నిన్నూ చూద్దామని వచ్చాను అన్నారు. సభకు ఆత్మీయులు నందిని సిధారెడ్డి, ప్రొఫెసర్ మనోహర్ రావు, ప్రొఫెసర్ ఉషాదేవి. నిజాం వెంకటేశం, అయోధ్యా రెడ్డి, వఝల శారద, హిమజ, పవన్, నందిగం కృష్ణారావు, మహంతి, కోడూరి విజయ్ కుమార్, నిజామాబాద్ ఫిల్మ్ క్లబ్ నుంచి పెద్దాయన రామస్వామి కవి సూర్యప్రకాశ్  ఇంకా తమ్ముడు అర్జున్,ఉష లతో సహా అనేక మంది హాజరయ్యారు. రఘోత్తమ్ రెడ్డి రాలేదు. ఏమయింది అని అడిగితే పుస్తకంలో నేనున్నాను కదా అన్నారు. సభ ఫోటోల్ని వీడియో ని రేల తన కెమెరాలో బంధించింది. తర్వాత అంతా నారాయణగుడా తాజ్ లో లంచ్ అదీ పూర్తి చేసి. హమ్మయ్య అనుకుని కరీంనగర్ బయలు దేరాము. ఒకటి రెండు రోజులు అలసట తేర్చుకుని ‘మనిషి లోపల’ పుస్తకాన్ని మిత్రులకూ సమీక్షలకూ పంపించడం మొదలు పెట్టాను. క్రమం తప్పకుండా కాలేజీకి వెళ్తూనే వున్నాను.

ఇంతలో ఒక రోజు మధ్యాహ్నం లంచ్ తర్వాత లైబ్రరీలో సిస్టమ్ ముందు కూర్చున్నాను. ఫోన్ మోగింది. ఎవరా అనుకుంటూ లిఫ్ట్ చేశాను. ఆనంద్ అన్నారెవరో ఆపక్కనుంచి. ఏమరుపాటుగా వున్ననేమో గొంతు ఎక్కడో తగులుతోంది. దీపం వెలగలేదు. నేను వరవర రావుని అన్నారు. ఒక్కసారిగా మనసు స్విచ్ ఆఫ్ అండ్ ఆన్…ఆశ్చర్యం ఆనందం. సార్ సార్ అన్నాను. ఎట్లున్నవ్ బాగున్నావా అన్నారాయన. బాగున్నాను సర్ అన్న. ఇప్పుడే నీ మనిషి లోపల చదివి, కదిలిపోయాం ఇద్దరమూ అన్నారాయన. నేనేదో అనే లోపలే కూర్మానాథ్ తెచ్చి ఇచ్చాడు ఆయనకు పంపావట కదా అన్నారు. నా ఆనందానికి హద్దే లేదు. మరికొంత సేపు మాట్లాడారు. ఆసుపత్రి ఆపరేషన్ తదితర వివరాలడిగారు. ఎక్కడున్నావు అంటే కాలేజీలో అన్నాను. ఇందిరకు థాంక్స్ చెప్పు అని ఫోన్ పెట్టేశారు. సార్ నా కవిత్వం చదవడమే కాకుండా బాగుంది అనడం ఓహ్! నేను మళ్ళీ నా లైబ్రరీలోకి యధా స్థితి లోకి రావడానికి చాలా సమయమే పట్టింది. ఒక లెజెండరీ పొయెట్, నేను బాగా అభినించే వారు నన్ను పలకరించడం నా కవిత్వాన్ని గురించి మాట్లాడ్డం ఎంత ఆనందాన్నిచ్చిందో మాటల్లో చెప్పలేను. రాయడానికి భాష చాలదు. ఇంటికెళ్ళిన తర్వాత ఇందిరకు చెబితే తన సంతోషానికీ అవధుల్లేవు.

ఇదిట్లా వుంటే మర్నాడు మరో కాల్ అది కూడా వూహించనిదే. ‘ఆనంద్.. నేను నవీన్ ని’ అన్నారు ఆపక్క నుంచి, గొంతు గుర్తుపట్టాను అంశయ్య నవీన్ గారు. నమస్తే సార్. ఆనంద్ ఎట్లా వున్నావు విషయం ఎవరూ చెప్పలేదు, నాకు తెలీదు, నీ పుస్తకం వచ్చింది. చదివేశాను మూవ్ అయ్యాను. గొప్పగా రాసావు. అంత సంక్షోభంలో అట్లా నిబ్బరంగా వుండి రాయడం నిజంగా మూవ్ అయ్యాను. దర్భశయనం ముందు మాట కర్టైన్ రైజర్. నిన్ను బాగా పట్టుకున్నాడాయన అన్నారు నవీన్.‘అంపశయ్య’ తోనూ కఫిసో స్థాపకుడిగానూ ఆయనంటే ఎంతో అభిమానం నాకు. ఈ రెండు ఫోన్ కాల్స్ నన్ను నిలువనీయలేదు.

ఇదంతా ఇట్లా వుండగానే కరీంనగర్ లో నాకు ఆత్మీయ సాహిత్య మిత్రుడు గండ్ర లక్ష్మణ రావు ఒక ప్రతిపాదన తెచ్చాడు. మనిషిలోపల పైన సభ పెడదామని. మీరు అవసరమంటే పెడదాం సార్ అన్నాను. సభ ‘సాహితి గౌతమి’ నిర్వహిస్తుంది అన్నారు. ఆయనే శ్రీ నాళేశ్వరం శంకరం ని పిలిచాడు. ఉస్మానియా కాంపస్ కాలం నుంచి నాకు దగ్గరి మిత్రుడయిన శంకరం నాకే కాదు అందరికీ మిత్రుడే. అజాత శత్రువు.  హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చారు. ఫిల్మ్ భవన్ లో సభ విజయవంతంగా జరిగింది.

ఇదంతా ఇట్లా వుండగానే నిజామాబాద్ క్లాసికల్ ఫిల్మ్ సొసైటి బాధ్యుడు మేకా రామ స్వామి గారు ఫోన్ చేశారు. ఎట్లా వున్నారు? నిజామాబాద్ 14 డిసెంబర్ నా వందేళ్ల సినిమా పండుగ చేస్తున్నాం మీరూ ఇందిర గారు రావాలి అన్నారు. నేను సమాధానం చెప్పేలోగానే ఏ కొంచెం మీ ఆరోగ్యం తప్పకుండా రావాలి అన్నారు. అంతా పెద్దాయన పిలిస్తే కాదని ఎట్లా అనడం సరే అన్నాను. ఆనాటి సభలో అమృతలత గారితో సహా పలువురు పాల్గొన్నారు. సభ సంతోషంగా జరిగింది. అందరికీ ధన్యవాదాలు చెప్పి బయలుదేరాము.

అట్లా తిరగడం పట్ల మిత్రులు వద్దంటూ అభ్యతర పెడుతూనే వున్నారు. కానీ తీరిగిన కాలు కదా నిలువలేకపోతోంది అంటూ సమాధానం చెప్పాను. వారం వారం కరీంనగర్ సందర్శించే మా డాక్టర్ గందే శ్రీధర్ గారిని క్రమం తప్పకుండా కలుస్తూనే వున్నాను.

ఇంకోవైపు మనిషి లోపల పుస్తకం పై సమీక్షలూ రావడం మొదలయ్యాయి ఆ వివరాలతో మళ్ళీ వారం కలుస్తాను

సెలవ్

==== వారాల ఆనంద్

03 మార్చ్ 2024 

GULZAR ARTICLE NAVA TELANGANA

Posted on

కవిత్వం సినిమాలు ఆయనకు రెండు కళ్ళు

++++++++++++++++++ వారాల ఆనంద్

‘మొర గోరా రంగ్ లైలే..’ అంటూ మొట్టమొదటిసారిగా బిమల్ రాయ్ సినిమాకు రాసినా..

‘మైనే తెరెలియే హి సాత్ రంగ్ కె సప్నే చునే’  అంటూ ఆనంద్ లో ప్రేమకి జ్ఞాపకానికీ లంకె వేసినా..

‘ముసాఫిర్ హో…యారో .. నా ఘర్ హై నా టిఖానా … ‘

అంటూ పరిచయ్ లో మనమంతా యాత్రికులమే పయనించే దారిని యాత్రని ఆనందించాల్సిందే అన్న్తాడుగుల్జార్.  

‘దిల్ హూం హూం కరే ఘబ్ రాయే.’ అని రుడాలి లో వేదన పడ్డా

‘మేర కుచ్ సామాన్ తుమ్హారే పాస్ పడా  హై..’ అంటూ ఇజాజత్ లో ప్రేమ విఫలమైన ప్రేమికురాలి దుఖం వేదన ఒంటరితనం అన్నింటిని కలగలిపి ఇజాజత్ లో రాసినా

వాటిల్లో వాడిన ఆ భాష ఆ భావసాంధ్రత గుల్జార్ కే చెల్లింది. ఇట్లా సినిమా పాటల గురించి  రాస్తూ పోతే ఎన్నో ఎన్నెన్నోపాటలు ఆయన కలం నుండి వెలువడ్డాయి.పాఠకుడి మనసుని తత్తెస్థాయి.  

ఇక సంభాషణల విషయానికి వస్తే

‘బాబూమొషై జిందగీ బడీ హోనీ చాహీయే, లంబీ నహి ‘ ,

 ‘జబ్ తక్ జిందా హూ తబ్ తక్ మరా నహీ, జబ్ మర్ గయా సాలా మై హీ నహీ’

‘మౌత్ తో ఏక్ పల్ హయ్,

(జీవతం ఉన్నత మైంది కావాలి, కాని దీర్ఘమయింది కాదు, బతికి ఉన్నంతవరకూ చావలేదు, చచ్చింతర్వాత నేనే లేను, మరణం ఒక క్షణమే)

ఇలాంటి తాత్విక సజీవమయిన సంభాషణలు ఆనంద్ సినిమాలో గుల్జార్ రాశారు.అట్లా ఆయన పాటలు సంభాషణలే కాదు గుల్జార్ గొప్ప కవి, సినీ గేయ రచయిత, రచయిత, సినీ దర్శకుడు. గుల్జార్ రచనలు, సినిమాలు, గజల్స్  అన్నీ సృజనాత్మకంగానూ తాత్వికంగానూ వుండి ఆయనలోని సున్నితత్వాన్ని సరళత్వాన్ని ఆవిష్కరిస్తాయి. ఆయన కవిత చదివే పద్ధతి కూడా శ్రోతల్ని అమితంగా ఆకట్టుకుంటుంది. ఇట్లా పలు రంగాల్లో తన ముద్రను చాటుకున్న గుల్జార్ అనువాదంలో కూడా ఉన్నతమయిన కృషి చేసాడు చేస్తున్నాడు. ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పంజాబీ, బెంగాలి భాషల్లో ప్రావీణ్యమున్న గుల్జార్ దేశంలోని ఇతర భాషల రచనల్ని చదవడానికీ ఇష్టపడతాడు. ‘మన మెదడు అన్టన్నే(antenne) ను తెరిచి వుంచాలి అప్పుడే ఇతర ప్రాంతాల్లో ఇతర భాషల్లో ఏమి జరుగుతుందో తెలిసి వస్తుంది’ అంటాడు గుల్జార్.  అట్లా భాషల్లో, సాంస్కృతిక ప్రక్రియల్లో నిరంతర కృషి కొనసాగిస్తున్న గుల్జార్ ఒక లివింగ్ లెజెండ్. దర్శకుడిగా హిందీ చలన చిత్ర సీమలో తన ముద్రను చాటుకున్నవాడు గుల్జార్. సినిమా రంగంలో విశేషమయిన్ కృషి చేసిన ఆయనకు ఆ రంగంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో అనేక పురస్కారాలు సత్కారాలు లభిచాయి. ఆస్కార్, గ్రామీ, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం, అనేక జాతీయ పురస్కారాలు వచ్చాయి. బహుశా ఆయన అందుకోని అవార్డు లేదు. కానీ సాహిత్యం లో ఆయనకు వచ్చిన ‘జ్ఞానపీఠ పురస్కారం ప్రత్యేకమయింది. ఎందుకంటే ఆయనే అనేక చోట్ల చెప్పుకున్నట్టు సాహిత్యమే తన నిజమయిన వ్యక్తీకరణ రూపం. సినిమా కూడా సృజనాత్మక కళ నే. కానీ అది రచయిత, దర్శకుడు, నటుల సమిష్టి కృషి. సాహిత్యం విషయానికి వచ్చినప్పుడు అది వ్యక్తిగతమయిన వ్యక్తీకరణ. అందులో ఇతరుల ప్రమేయం వుండదు. కవీ రచయిత తన భావాలకు తానే రూపం కల్పిస్తాడు. అందుకే సాహిత్య సృజనలో స్వేచ్చ వుంటుంది. అందుకే సాహిత్యంలో తనకు వచ్చిన ‘జ్ఞానపీఠ్’ ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అన్నారాయన. 

‘ఎక్కువ మంది నేను సినిమాల్లోనూ సినిమాల కోసమూ రాసిన వాటిని ఇష్టపడతారు, ప్రేమిస్తారు,అభిమానిస్తారు. కానీ నేను మనిషి పడే బాధ, సంఘర్షణ, దేశాన్ని ప్రేమించడం లాంటి అనేక విషయాల్నీ అభిమానిస్తాను. అంతేకాదు అందరూ జీవితంతో అనుబంధం పెట్టుకోవాలని  అందరికీ  చెబుతాను అప్పుడే ఆనందంగా వుంటారనీ చెబుతాను’ అంటాడు గుల్జార్.   

అంతే కాదు కవిత్వం ఎట్లా రాస్తారు అని అడిగితే ‘సాహిత్య సృజన చేయడానికి నువ్వు ‘గుహ’లో నివసించాలి, ఆ గుహ మరేదో కాదు అది నువ్వే’ అంటాడాయన.  

కవిత నిడివి గురించి అడిగితే ‘నువ్వు అధికంగా మాట్లాడ్డం ప్రారంభించగానే జనం నిన్ను వినడం మానేస్తారు. అధికంగా చెప్పిన ఏదయినా దాని ప్రభావాన్ని కోల్పోతుంది. క్లుప్తంగా రాసిన కొన్నిమాటలే ఎక్కువ శక్తివంతమయినవి, ఎంతో ప్రభావ వంతమయినవి. నేనయితే నా కవిత్వంలో ముఖ్యమయిన విషయాల్ని అతి తక్కువ మాటల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను అంటాడు గుల్జార్.

    గుల్జార్ గా అందరికీ పరిచయమున్న ఆయన అసలు పేరు సంపూరన్ సింగ్ కల్రా. ఆగస్ట్ 18,1936 రోజున ప్రస్తుతం పాకిస్తాన్ లో వున్న దీన పట్టణంలో సిక్కు కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటినుంచీ అంతాక్షరీ ఆడడంలో ఆసక్తిగా వుండే ఆయన అప్పటినుండే భాష పట్ల పదాల పట్ల మక్కువను పెంచుకున్నాడు. చిన్నప్పటినుండే హిందుస్తానీ సంగీతం పట్ల మక్కువ కలిగిన గుల్జార్ రవిశంకర్, అలీ అక్బర్ ఖాన్ ల కచేరీలకు వెళ్ళేవాడు.  గుల్జార్ కుటుంబం దేశ విభజనలో తీవ్రంగా ప్రభావితమయింది. సొంతవూరు విడిచి అమృత్సర్ కి వలస వచ్చింది.అప్పుడు ఆయన చూసిన హింస, దౌర్జణ్యాలు, పడ్డ వేదన దుఖం ఆయన కవిత్వంలో అంతర్లయగా ధ్వనిస్తూనే వుంటుంది. ఏం.హెచ్.సత్యు ‘ఘరమ్ హవా’ లాంటి సినిమాలు తెస్తే గుల్జార్ కవిత్వమూ కథలూ రాశాడు.

  ఇక తమ కుటుంబ వ్యాపారమయిన మెకానిక్ షాప్లో పనిచేయడంతో గుల్జార్ జీవితం ఆరంభమయింది. ప్రమాదంలో సొట్టలు పడ్డ కార్లకు కలర్ మాచ్ చేసే పని చేసేవాడు. తన పదమూడేళ్ళ వయస్సులోనే చదవడం పైన ఆసక్తి కలిగిన గుల్జార్ తమకి దగ్గరలో ఓ కాందిశీకుడు నిర్వహించే పుస్తకాలు కిరాయికిచ్చే షాప్ నుండి అపరధ పరిశోదక నవలలు, మాజిక్ ఫాంటసీ రచనల్ని లాంతరు ముందు చదవడం ఆరంభించాడు. వారానికి పావలా రుసుము చెల్లిస్తే ఎన్ని పుస్తకలయినా చదివే వీలుండేది అక్కడ. దాంతో తమ షాప్ పని అయిపోగానే రోజుకు ఒకటి అని కాకుండా రెండు మూడు పుస్తకాలు చదవడం చేసేవాడు గుల్జార్. ఒక నాటికి షాప్ లోని దాదాపు పుస్తకాలు అయిపోవడంతో షాపతను ఇట్లా ఒక్క పావలాకు ఎన్ని చదువుతావు అంటూ సజ్జ మీదవున్న పుస్తకమొకటి తీసి ఇచ్చాడు. ఆది టాగోర్ రాసిన ‘ గార్డనర్’. అది చదివింతర్వాత గుల్జార్లో చదివే దృక్పథమే మారిపోయింది. ఆ తర్వాత ప్రేంచంద్ నుంచి మొదలు అనేక మంది గొప్ప రచయితల రచనలు చదవడం మొదలుపెట్టాడు. సరిగ్గా అదే సమయంలో ఆయనకు ప్రగతిశీల రచయితలు, కళాకారులతో పరిచయం కలగడం PWA కార్యక్రమాలల్లో పాల్గొనడం మొదలయింది. అప్పుడే శైలేంద్ర పరిచయం అయ్యాడు. అదే సమయంలో బిమల్ రాయ్ ‘బందిని’ సినిమా తీయడం మొదలు పెట్టాడు ఇంతలో కవి శైలందర్ కు, సంగీత దర్శకుడు ఎస్,డి,బర్మన్ కు నడుమ ఎవో  పొరపొచ్చాలు రావడంతో ఆ ఇద్దరూ కలిసి పని చేసే స్థితి లేకపోయింది. దాంతో శైలేంద్ర గుల్జార్ ని తక్షణమే వెళ్ళి బిమల్దాను కలవమని సూచించాడు. మిత్రుడు ఆసీత్ సేన్ తోకలిసి వెళ్ళి కలిశాడు. ‘ఇతను విషయాన్ని అర్థం చేసుకుని పాట రాయగలడా అని సేన్ ను బెంగాలీలో అడిగాడు’ అప్పుడు సేన్ దాదా తనకు బెంగాలీ రాయడం చదవడం వచ్చు అనేసరికి  కంగారుపడ్డ బిమల్ రాయ్ సర్దుకుని పాట రాయమని ప్రోత్సాహించాడు. గుల్జార్ తన మొట్ట మొదటి సినిమా పాట ‘మేర గోరా అంగ లయిలే..” తో  ఆరంభమయింది. అయితే బిమల్ దా  గుల్జార్ తో మాటాడుతూ సినిమాలకు పనిచేయడం నీకిష్టం లేదని తెలుసు కానీ నువ్వు నా దగ్గర ఆసిస్టంట్ గా చేరు. అంతే కానీ ఇక ముందు తన మెకానిక్ షాప్ కు వెళ్ళకు. రచనల పైన దృష్టి పెట్టాలని సూచించాడు. దాంతో గుల్జార్ పూర్తి స్థాయిలో సృజన మీదే దృష్టి కేంద్రీకరించాడు. బిమల్ దా కి పూర్తి స్థాయి సహాయకుడిగా ఉండిపోయాడు. తర్వాత హ్రిషికేశ్ ముఖర్జీ, అసిత్ సేన్ లాంటి దర్శకుల సినిమాలకు రచనలు చేయడం ఆరంభించాడు. అట్లా గుల్జార్ ఆనంద్(1970 ), గుడ్డీ(1971), బావర్చి(197 2 ), నమక్ హరం(1973 ), హ్రిషికేశ్ ముఖర్జీకి, దో దూని చార్ (1968), ఖామోషి(1969) , సఫర్(1970) అసిత్ సేన్ కు సంభాషణలు రాసాడు.

          ఇక తర్వాత 1971 లో ‘మేరె అప్నే) సినిమాతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు గుల్జార్. జీతెంద్ర ప్రధాన పాత్రధారిగా 1972లో ‘పరిచై’ తీసాడు. 1972లో అయన రచించి దర్శకత్వం వహించిన ‘కోషిష్’ అత్యంత సున్నితమయిన మానవీయ దృక్పధంతో తీసిన సినిమాగా మిగిలి పోయింది.  సంజీవ్ కుమార్, జయాభాధురి ప్రధాన భూమికల్ని పోషించిన కోషిష్ లో ఇద్దరు మూగ చెవిటి వాళ్ళ జీవితం దాంట్లో వారు ఎదుర్కొన్న అవస్థలు హృద్యగంగా చూపిస్తాడు గుల్జార్. అందులో సంజీవ్ కుమార్, జయబాధురి లు అత్యంత సహజంగా నటించారు. అట్లా సంజీవ్ కుమార్ తో మొదదలయిన సహచర్యం అనేక సినిమాల నిర్మాణానికి దోహదపడింది. వారి కయికలో వచ్చిన ‘ ఆంధీ’, మౌసం, అంగూర్ , నమ్కీన్ సినిమాలు ఒక కల్ట్ సినిమాలుగా మిగిలిపోయాయి. సంజీవ్ కుమార్ నట జీవితంలో అత్యంత సహజ నటుడిగా పేరు తెచ్చిన సినిమాలివి. ఇక గుల్జార్  జీతేంద్ర తో పరిచై, ఖుష్బూ,కినారా, వినోద్ ఖన్నా తో అచానక్, మీరా, లేకిన్, హేమామాలిని తో ఖుష్బూ, కినారా, మీరా  లాంటి మంచి సినిమాలు రూపొందించాడు. ఇంకా దర్శకుడిగా గుల్జార్ కితాబ్, పల్కొంకీ చావ మే, శాహీరా, చత్రన్, సునేయే,ఆల్కా,ఇజాజత్,లిబాస్,మాచిస్,హు టు టు లాంటి సినిమాలు రూపొందించాడు.

    టెలివిజన్ రంగంలో ఆయన రూపొందించిన సీరియల్స్ గొప్పగా విజయవంతమయి కల్ట్ గా మిగిలిపోయాయి. రచయితగా, దర్శకుడిగా ఆయనలోని సున్నితత్వం ప్రతిభ విశేషంగా పేరు గడించింది. ఆయన రూపొందించిన ‘ మిర్జా గాలిబ్’ సీరియల్ ఆ మహాకవి కవిత్వాన్ని జీవితాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. అందులో గాలిబ్ గా  నసీరుద్దిన్ షా, గాయకుడిగా జగ్ జీత్ సింగ్ తమ అద్భుత ప్రదర్శనను అందించారు. వారి ప్రతిభను ఆవిష్కరించడంలో గుల్జార్ భావుకత, నిబద్దత ప్రధాన భూమికను పోషించాయి.

ఇక గేయ రచయితగా గుల్జార్ 100 పైగా సినిమాలకు పాటలు రాసాడు. అలనాటి బందిని తో మొదలయిన ఆయన ప్రస్తానం సలిల్ చౌదరి, ఎస్. డి.బర్మన్, ఆర్.డి.బర్మన్, మదన్మోహన్, విశాల్ భరద్వాజ్, ఎ.ఆర్. రెహమాన్ లాంటి ప్రాచీన ఆధునిక సంగీతకారులతో అవిశ్రాంతంగా సాగింది. అలనాటి మెలోడీ పాటలు గొప్పగా రాసిన గుల్జార్ ‘కజరారే..’ ( బంటీ ఆర్ బబ్లూ), చయ్య చయ్య చయ్యా….(దిల్ సే ) లాంటి ఆధునిక పాటల్ని కూడా రాసాడు. ఇవ్వాళ మెలొడీకి స్థానం లేదని బీట్ కె ప్రధాన పాత్ర అని ఆయన అంటారు. కాలానుగుణంగా సినిమాలు రచనలు వస్తాయని ఆయన అభిప్రాయ పడతారు. ఏ.ఆర్.రెహమాన్ తో కలిసి ‘జై హో..  ‘ పాటకు గుల్జార్ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. అంతే కాదు ఈ జంట గ్రామ్మీ అవార్డును కూడా అందుకుంది.

గుల్జార్ కవిత్వం, వచనం మనసుకు హత్తుకునేలా రాశారు. ఆయన రాసిన ‘GREEN POEMS’ ని నేను ఆకుపచ్చ కవితలు పేర తెలుగులోకి అనువదించాను, వర వర రావు గారు ‘SUSPECTED POEMS’ ని అనుమానిత కవితలు గా అనువదించారు.

గుల్జార్ కూడా అనేక అనువాదాలు చేశారు.‘ ఏ పోయేమ్ ఏ డే’ పేర భారీ సంకలనాన్ని తెచ్చారు. అందులో 34 భారతీయ భాషల్లోని 279 కవుల 365 కవితల్ని అనువదించి ప్రచురించారు. వాటిల్లో వర్తమాన కవుల కవితల్నిచేర్చారు. పాఠశాల కళాశాల పాఠ్యపుస్తకాల్లో చదివే కవుల కవితలు కాకుండా ఇప్పుడు వర్తమాన సామాజిక స్థితిలో ఆధునిక కవులు రాస్తున్న కవితల్ని చేర్చారు.‘ఇరుగు పొరుగు’ భాషల్లో కవులు ఏమి రాస్తున్నారు ఎట్లా రాస్తున్నారు అన్న విషయం అర్థం కావడానికి ఈ సంకలనం ఎంతో దోహద పడుతుంది.

అయన 1973 లో ప్రముఖ నటి రాఖీ ని వివాహం చేసుకున్నారు తర్వాత కొంత కాలానికి వేరై వేరుగా వుంటున్నారు వారి కూతురు మేఘన గుల్జార్. ఆమె దర్శకురాలిగా ఫిల్ హాల్, జస్ట్ మారీడ్, దస్  కహానియా, తల్వార్, రాజీ, చాపాక్, సామ్ బహదూర్ సినిమాలు రూపొందించారు. అంతేకాదు తన తండ్రి పైన ‘ బికాస్ హి ఈస్ ‘ పుస్తకం రాసారు.

  గుల్జ్జార్ బహుముఖీన ప్రతిభ లో ఆయన రాసిన రచనలు భారతీయ హిందీ ఉర్దూ సాహిత్య రంగాల్లో విలక్షణతను విశేష ఖ్యాతిని పొందాయి ఆయన రవీంద్రనాథ్ రచనల్ని అనేకం అనువాదం చేసారు. గ్రీన్ పోయెమ్స్, సస్పెక్టే డ్ పోయెమ్స్, జిందగీ నామా, హాఫ్ ఎ రూపీ, సేలేక్తేడ్ పోయెమ్స్, 100 లిరిక్స్, మేరా కుచ్ సమ్మాన్, సైలేన్సేస్, టూ లాంటి ఎన్నో రచనలు విశేష ప్రశంశాల్ని అందుకున్నాయి.

గుల్జార్ ఇప్పటికే పద్మభూషణ్, సాహిత్య అకాడెమి అవార్డు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లు అందుకున్నారు. ఇప్పుడు జ్ఞానపీఠ పురస్కారం అందుకోవడంతో ఆయన కవిత్వం మరింతగా పాఠకులకు చేరుతుంది. ఆయనకు హృదయపూర్వక అభినందనలు.

++++++++++++++++++++++++++

వారాల ఆనంద్

కవి, రచయిత,

GULZAR

Posted on

మిత్రులారా! గుల్జార్ మీద ప్రేమతో, అభిమానంతో రెండు వ్యాసాలు రాసాను. ఈరోజు ‘నవతెలంగాణ’, ‘ఆంధ్రప్రభ’ సాహిత్య పేజీల్లో వచ్చాయి. ఆనందచారి గారికి, వసంత గారికి ధన్యవాదాలు
-వారాల ఆనంద్,
26 ఫిబ్రవరి 2024

‘ఇరుగు పొరుగు’ సమీక్ష

Posted on

మిత్రులారా! నా అనువాద సంకలనం ‘ఇరుగు పొరుగు’ పైన ఈ రోజు ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో సమీక్ష చేశారు. చూడండి, సమీక్షకులు రామా చంద్రమౌళి గారికి, సంపాదకులకు కృతజ్ఞతలు- వారాల ఆనంద్,
25 ఫిబ్రవరి 2024

DASHARATHI

Posted on

మిత్రులారా! సాహితీ స్రవంతి కార్యక్రమంలో ‘దాశరథి’ గురించి వినండి.
Pl. click the link for my podcast on DASHARATHI