Month: July 2021

“యాదొంకీ బారాత్ “వేములవాడ=కొన్ని వెంటాడే దృశ్యాలు= 3

Posted on Updated on

================

“యా దొంకీ బారాత్ “

================

వేములవాడ=కొన్ని వెంటాడే దృశ్యాలు= 3

————-

“ఒక ప్రాంతం అక్కడి మనుషులు తన కేమిచ్చారు వారినుంచి ఏమి స్వీకరించాం అన్న విషయంలో మనుషులందరికీ సోయి స్పష్టత వుండాలి , అంతేకాదు దానికి బదులుగా ఆ ప్రాంతానికి ఆ ప్రజలకు తిరిగి ఏమిచ్చామన్న బాధ్యతకూడా తెలిసి వుండాలని” నేననుకుంటాను. అది కూడా ఎలాంటి స్వార్థ రాజకీయ లాభాపేక్ష లేకుండా. 

ఖచ్చితంగా అలాంటి సోయి తో భాద్యతతో వున్న మహానుభావుడు మా తాతయ్య డాక్టర్ సుబ్రహ్మణ్యం అని నేను విశ్వసిస్తాను. దానికి ఆయన జీవిత కాలం లో చేసిన అనేక పనులు సాక్షీబూతంగా నిలుస్తాయి. వాటికి  సంభందించి  ఓ మూడు అంశాల్ని ఈ వారం మీతో పంచుకుంటాను.

+ + +

ఇటీవల వేములవాడ గురించి ముఖ్యంగా డాక్టర్ మంగారి సుబ్రహ్మణ్యం గురించి నాకు తెలిసిన నాలుగు అనుభవాలు నాలుగు మాటలు రాయడం మొదలు పెట్టాక ఎంతో మంది మిత్రులు ఆత్మీయులు ఆయనతో తమ అనుభవాల్ని మాధ్యమాల్లోనూ వ్యక్తిగతంగా నాతోనూ పంచుకుంటున్నారు. అద్భుతంగా వుంది. ఒక మనిషి ఈ లోకం నిండి వెళ్ళిపోయి దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఆయన్ని గుర్తు చేసుకుంటూ వుంటే ఆతరం మనుషులు తమ నిబద్దతతో తమ సమకాలీన సమాజాన్ని, వ్యక్తుల్ని ఎంతగా ప్రభావితం చేసారో తెలుస్తుంటే నిజంగా మనసు ఆనందంతో ఉరకలు వేస్తున్నది. అలాంటి వారు ఈ లోకం లో తిరుగాడి నప్పుడే వారి చరిత్రను నిక్షిప్తం చేయాల్సి వుండే. నిజం మాట్లాడుకుంటే మనకు ఆ స్పృహ తక్కువే.

   కొల్లాపూర్ మూలాలున్న కవి శ్రీ ప్రేమ సాగర్ రావు మాట్లాడుతూ కొల్లాపూర్ ఆ రోజుల్లో పెద్ద సంస్థానమని రాజా వారి కోటలో ఏనుగలు గుర్రాలు ఉండేవని  అన్నారు. రాజా వారికి మంచివారనే పేరే వుండేది, కాని రాజవ్యవస్థ ఒకటి వుంటుంది కదా బహుశా అది నచ్చకే డాక్టర్ గారు కొల్లాపూర్ వదిలి వచ్చి వేములవాడలో స్థిరపడి ఉంటారన్నారు. ఇంకా వివరాలు తెలుకోవాలి అని ఆయన ఉత్సాహపడ్డారు.

ఇక ప్రముఖ సామాజిక కార్యకర్త అధ్యాపక సంఘాల్లో విశేషంగా కృషి చేసిన మిత్రుడు శ్రీ ఆర్.చంద్రప్రభాకర్ మాట్లాడుతూ మీకు గుర్తుందో లేదో మా చిన్న చెల్లెలు సుబ్రమణ్యం గారింట్లోనే పుట్టింది అన్నారు. తాము అప్పుడు శాత్రాజుపల్లె లో ఉండేవారమని ప్రసూతికోసం డాక్టర్ గారి దగ్గరికి వస్తే ఇంట్లోనే గది ఇచ్చారన్నారు. చెల్లెలు అక్కడే పుట్టిందని అన్నారు. అంతే కాదు అప్పుడు అందరమూ చిన్న వాళ్ళమే కదా మీ గుణక్క మీరు కలిసి నాకూ నా పెద్ద చెల్లెకు వేములవాడలోని నగరేశ్వరాలయం, పోచమ్మ గుడి మొదలు అన్నీ తిప్పి చూపించారని ప్రభాకర్ చెబితే చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగింది. మరిచిపోయిన అందమయిన అనుభవాలు తిరిగి మననం లోకివస్తే ఉరకలు వేసే మానసిక స్థితి వర్ణించలేనిది. ఇట్లా ఎందరో ఎన్నో అనుభవాలు చెబుతున్నారు.

++++++

ఇక ఇప్పుడు వేములవాడ లో డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఆవూరికోసం చేసిన ఎన్నో పనుల్లో నాకు తెలిసిన మూడు అంశాల్ని మీతో పంచుకుంటాను.

1) వేములవాడ హై స్కూల్:

    పిల్లలు చదువు కుంటేనే ఎదుగుతారని భద్రయ్య బడి తర్వాత వేములవాడలో ఉన్నత పాఠశాల లేక పోవడంతో పై చదువులకోసం సిరిసిల్లా, కరీంనగర్ వెళ్ళడం గమనించిన తాతయ్య వూర్లో పెద్దల్ని సమీకరించి వేములవాడలో హై స్కూల్ ఏర్పాటుకు నడుం  బిగించారు. ఆ కృషి ఫలితంగా స్కూల్ ఏర్పాటు కావడం తర్వాత అది కాలక్రమంలో ఎదిగి జూనియర్ కళాశాల కావడంతో వేములవాడనే కాకుండా చుట్టు పక్కల గ్రామాల పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా మారింది.

2)

సత్రం: వేములవాడ పోలీస్ స్టేషన్ దగ్గరలో శామ్కుంట చేరువలో తాను స్వయంగా నిర్మించిన సత్రం ఎంతో మంది అనాధలకు ఎనో ఏళ్ళపాటు నీడనిచ్చింది. మా ఇంటి ముందే వుండేది చిన్నప్పటినుంచీ చూసాను ఎంతమందికి అది గూడులాగా  ఉండిందో అని ప్రముఖ కవి జర్నలిస్టు శ్రీ పి.ఎస్.రవీంద్ర తన అనుభవాలని వివరించారు

౩)

ప్రజాబావి: ఇక శాంకుంట పక్కన తాతయ్య తవ్వించిన బావి అనేక దశాబ్దాలపాటు యాత్రికులకు చట్టుపక్కల నుంచి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చిందో చెప్పలేం.

ఇట్లా ఇవ్వాళ చూస్తే ఎవరికయినా అవి చిన్న పనులే అనిపించవచ్చు కాని అయిదు/ఆరు దశాబ్దాల క్రితం ఆయన ఎలాంటి రాజకేయ ఆర్ధిక లాభాపేక్ష లేకుండా చేసిన సేవలు విశేషమయినవి. ఆయనెప్పుడూ సర్పంచ్ కావాలనో ఎం.ఎల్.ఎ కావాలనో అనుకోలేదు. అది ఆయన గొప్పతనం.

ఆయన వెళ్లి పోయింతర్వాత ఆయన ఇంటి ప్రాంతాన్ని ‘సుబ్రహ్మణ్యం నగర్’ అని నామకరణం చేసి ఆ వూరు ఆయన్ని గౌరవించుకుందనే చెప్పుకోవాలి. 

వైద్యుడిగా ఆయన అందించిన సేవలు సామాజికంగా చేసిన కృషి డాక్టర్ సుబ్రహ్మణ్యం తాతయ్యను చిరస్థాయిగా నిలబెడతాయి.

ఇప్పుడు నేను ఆయనకు ఏమివ్వగలను తలవంచి నివాళి అర్పించడం తప్ప.

-వారాల ఆనంద్ 

 27 జూలై 2021             

SINGING IN THE DARK   ‘చీకటి కాలం లో గానం’ 

Posted on Updated on

https://telugu.asianetnews.com/literature/varala-anand-reciews-singing-in-the-dark-edited-by-sachidanand-qwuhqf

PUBLISHED IN ASIANET NEWS.COM

అందుకున్నాను

==================

మిత్రులారా ,

కొన్ని రోజుల క్రితం  నాకిష్టమయిన కవి సచ్చిదానందన్ సహసంపాదకుడుగా వున్న SINGING IN THE DARK   ‘చీకటి కాలం లో గానం’  సంకలన వివరాలు ఆన్ లైన్ లో చూసి ఆర్డర్ చేసాను. ఆ గ్లోబల్ సంకలనాన్ని అందుకోగానే ప్రపంచం లో కవులు రచయితలూ అంతా దుఃఖ కాలంలో దాదాపుగా ఒకే గొంతుకతో ఎట్లా స్పందిస్తారో చూసి మనసంతా తడి తడి అయిపోయింది. కొందరి అనుభవాలు  వ్యక్తిగతమయినవి, మరి కొందరివి విన్నవి, చూసినవీ కావచ్చు కాని స్పందన మాత్రమే ఒకే స్థాయిలో వుండడం ఇంకా మనుషుల్లో కదిలే గుణం బతికే వుంది అనిపించింది. కే. సచ్చిదానందన్, నిశి చావ్లా ల సంయుక్త సంపాదకత్వంలో వచ్చిన ఈ 360 పేజీల సంకలనం కవిత్వపరంగా ఎంత గాఢంగా వుందో ప్రచురించిన తీరు కూడా అంత ఈస్తేతిక్ గా వుంది. అతి తక్కువ సమయంలో అనేక దేశాల కవుల కరోనా కాలపు కవితల్ని సేకరించి  కూర్చిన సంపాదకుల్ని మనసారా అభినందించాల్సిందే.

+++

ఏమి కాలమిది…

భయం పరిణామం చెంది

దుఖం గా రూపుదాల్చుతోంది

బతుకు వేదనై  రోదనై

స్మశానం వైపు చూస్తున్నది …

ఎన్నడూ ఊహించని అలాంటి కాలంలో ఎలాంటి అనుభవాల్ని చూసాం. లాక్ డౌన్, సాంఘిక దూరం, మాస్క్, సానిటైసర్ లాంటి అనేక కొత్త మాటల్ని విన్నాం. ఇంట్లో స్వీయ నిర్బంధంలోకి వెళ్లాం. ఆప్తుల్ని,ఆత్మీయుల్నీ, తెలిసినవాల్లనీ, మంగలేష్ డబ్రాల్ లాంటి కవుల్నీ, బాలసుబ్రహ్మణ్యం లాంటి కళాకారుల్నీ కోల్పోయాం. పోగొట్టుకున్న వాళ్ళ చివరి చూపునకూ దూరంయ్యాం…కార్మికుల వందలాది మైళ్ళ కాలి నడకల్నీ చూసాం..ఎంత ఘోరమయిన కాలాన్ని అనుభవించామో చెప్పలేము. 

    ఈ నాణేనికి మరో వైపు గంగానది పరిశుభ్రమయిందనీ, ఢిల్లీలో  వెన్నెల ప్రకాశ వంతమయిందనీ, రోడ్లమ్మట జంతువులు స్వేచ్చగా సంచరించగలుగుతున్నాయనీ విన్నాం.

వీటన్నింటి నేపధ్యం లో సామాజిక దూరం ఇప్పటికే దూరమవుతున్న మనల్ని మరింత దూరం చేసింది. ఇలాంటి స్థితిలో గ్లోబల్ స్థాయిలో కవుల కవితలతో కూడిన ఈ SINGING IN THE DARK లో వివిధ దేశాలకు చెందిన 112 మంది కవుల కవితలున్నాయి. కొందరు కవులు దుఖం తో రాస్తే, కొందరు కోపం తోనూ మరికొందరు ధైర్యాన్ని ప్రోది చేస్తూనూ రాసారు. తప్పకుండా చదవాల్సిన సంకలనమిది.  

+++

ఈ సంకలనం లోంచి ఒకటి రెండు కవితలకు నేను చేసిన స్వేచ్చానువాదం చదవండి….

రైలు –కే. సచ్చిదానందన్

రైలు మా వూరికి వెళ్తోంది

నేనందులో లేను కానీ

రైలు పట్టాలు నాలోపలున్నాయి

రైలు చక్రాలు నా చాతీపై నున్నాయి

రైలు కూత నా అరుపు

నన్ను తీసుకెళ్ళడానికి రైలు తిరిగి వచ్చినప్పుడు

నేనక్కడ ఉండను కానీ

నా శవాన్ని కాపలా కాస్తూ నా శ్వాస

రైలుపై కప్పు మీద ప్రయాణం చేస్తుంది

మా వూళ్ళో రైలు ఆగగానే

నా ప్రాణం నా దేహంలోకి చేరుతుంది

అక్కడ వేచి చూస్తున్న నా సైకిలెక్కి

తెలిసిన దారులెంత చక్కర్లు కొడుతుంది

సైకిలు గంట విని నా పిల్లలు

నాన్నొచ్చాడు నాన్నొచ్చాడు

అంటూ పరుగెత్తు కొస్తారు

తిరిగొచ్చింది నా మృత దేహమని

వాళ్లకి నేనే భాషలో చెప్పను

వచ్చింది స్వర్గం నుంచా నరకం నుంచా

నేనెక్కడో ఆరెంటి మధ్యా వున్నాను

బావినో కుంటనొ మాట్లాడ నివ్వండి

ఒక వేళ నీళ్ళు మాట్లాడానికి నిరాక రిస్తే

నా ప్రాణం ఇంటి ప్రాంగణం లోని

మునగ చెట్టు మీది కాకిలా  మారి

వాళ్లకు నిజం చెప్పేస్తుంది

=====

ఈ కాలం –కీ .శే. మంగలేష్ డబ్రాల్

కంటి చూపు కరువైన వాళ్ళు

తమ దారిని ఏర్పరుచు కోలేరు

అంగ వికల్యం వున్న వాళ్ళు

ఎక్కడికీ చేరుకోలేరు

బధిరులు

జీవితపు ప్రతిధ్వనుల్ని వినలేరు

ఇల్లు లేని వాళ్ళు

తమ ఇంటిని నిర్మించుకోలేరు

పిచ్చి వాళ్ళు

తమకేం కావాలో తెల్సుకోలేరు

ఇవ్వాల్టి కాలంలో

ఎవరయినా గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, 

చెవిటి వాళ్ళు, ఇల్లులేని వాళ్ళుగా

మారి పోవచ్చు

=======

చివరిగా ఓ హైకూ

The invisible crown

Makes everything

Vacant

  • BAN’YA NATSUISHI (JAPANESE POET)

ఈ అనువాదాలు కేవలం మచ్చుకు మాత్రమే ఎన్నో దేశాల నుండి ఎంతో మంది రాసిన ఎంతో మంచి కవితలు ఈ సంకలనం నిండా వున్నాయి. తప్పకుండా చదివి భధ్రపరుచుకోవాల్సిన సంకలనమిది. సంపాదకులకు మరోసారి  ధన్యవాదాలు.

========================

తెలుగులో కూడా కరోనా నేపధ్యం లో అనేక మంది కవులు వీటికి దీటయిన గొప్ప కవితలు రాసారు. కాని ఇంగ్లీషులోకి, ఇతర భాషలలోకి  వెళ్ళక పోవడంతో ఆ కవితల రీచ్ పరిమితమయి పోయింది. నిజానికి అది గొప్ప విషాదమే. 

  • వారాల ఆనంద్

==============================================