Month: December 2022

 ‘అనువాదమే ప్రపంచ వారధి’

Posted on

    ***** వారాల ఆనంద్ 

      ‘ఇచ్చి పుచ్చు కోవడం’ అన్న భావనే మనిషి మనుగడకు  మూలాధార మయింది. అంతే కాదు ‘ తెలియంది తెలుసుకోవడం తెలిసింది పంచుకోవడం’ అన్నది  మానవ సంస్కృతిలో అంతర్భాగమయిన జీవనమార్గం. వేలాది లక్షలాది సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా భిన్న  భాషలు సంస్కృతులతో కొనసాగుతున్న మానవాళి ఈ భాషా,సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, అభివృద్ది రంగాల్లో కొనసాగుతున్న ఈ ‘ఆదాన్ ప్రాధాన్’ భావనతోనే ముందుకు సాగుతున్నది. మనిషి తనను తాను వ్యక్తం చేసుకోవడానికి కాలక్రమంలో భాషను గొప్ప మాధ్యమంగా రూపుదిద్దుకున్నాడు. అయితే ఆ భాష అన్నిప్రాంతాలకూ ఏక రూపకంగా కాకుండా భిన్న రూపాల్లో వ్యక్తమయి ఎదుగుతూ వచ్చింది. కేవలం మన దేశవిషయం చూసినా భారత  రాజ్యాగం మొదట 14 భాషల్ని అధికార భాషలుగా గుర్తించి తర్వాత ఆ సంఖ్యను 22 వరకు పెంచింది. కానీ నిజానికి మన  దేశంలోనే ఇంకా ఎన్నో లెక్క లేనన్ని భాషలున్నాయి. వాటిల్లో లిపి ఉన్నవీ లిపి లేనివీ కూడా  వున్నాయి.మరయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎన్ని భాషలున్నాయో. చెప్పడం కష్టం. 

 ఆ స్థితిలో ఒక ప్రాంతంలో ఒక భాషలో జరిగిన  విషయాలు, విజయాలూ, పెల్లుబికిన భావాలూ, తాత్వికతలూ  ఇతర ప్రాంతాలకు చేరడానికి, వాటిని ఒక భాష నుంచి మరో భాషలోకి చేరవేయడానికి తర్జుమా అవసరమయింది.దాన్నే ‘అనువాదం’ అన్నారు.    

      ఈ అనువాదం ఇవ్వాలో నిన్ననో మొదలయింది కాదు. క్లాసికల్ సాహిత్య కాలం నుంచి వుంది. ఇట్లా భావాలని పంచుకోవడం పెంచుకోవడంలో ప్రధాన భూమికను పోషిస్తున్న అనువాదం కోసం ఐక్య రాజ్య సమితి 30 సెప్టెంబర్ ను ప్రపంచ అనువాద దినోత్సవంగా కూడా  నిర్వహిస్తున్నది. మానవ జీవన గమనంలో  అనువాదానికి వున్న ప్రాధాన్యతను ముందుకు తేవాలన్నది దాని ముఖ్య ఉద్దేశ్యం. నిజానికి ఇవ్వాళ అనువాదానికి అంత ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉందా.. వుంటే అనువాద అభివృద్ధికి ఏ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది అందరూ ఆలోచించాల్సి వుంది.

అసలీ అనువాద ప్రక్రియ ఎట్లా వుంటుంది అంటే ఏ భాష లోంచి అనువాదం చేయాలను కుంటామో దాన్ని మూల భాష అనీ, ఎందులోకి  చేయాలనుకుంటామో దాన్ని లక్ష్య భాష అనీ అంటున్నాం. అనువాదం చేయాలనుకున్న అనువాదకునికి మూల భాష, లక్ష్య భాషలు రెండింటిలో మంచి ప్రవేశం వుండాలి. ఆయా భాషల గ్రామర్  సింటాక్స్ తెలిసి వుండాలి. అంటే అనువాదకుడు ద్విభాషా పరిజ్ఞానం కలిగి వుండాలి. కేవలం భాషలే కాకుండా అనువాదకునికి ఆ రెండు సంస్కృతుల విషయ పరిజ్ఞానం కూడా వుండి  తీరాలి. అప్పుడే మూల భాష తో పాటు ఆ భాషా ప్రాంతపు వాతావరణం కూడా లక్ష్య భాషలోకి సమర్థవంతంగా అనువదించబడుతుంది. ఈ అనువాదాన్ని ముఖ్యంగా రెండు రకాలుగా చెబుతారు. ఒకటి యధాతతానువాదం, రెండవది స్వేచ్చానువాదం. యధాతతానువాదంలో మూలంలో  వున్నది ఉన్నట్టుగా అనువదించడం కాగా స్వేచ్చానువాదంలో మూలం లోని మౌలిక అంశాలు చెడకుండా అనువాదకుడు కొంత సృజనాత్మక స్వేచ్చ తీసుకోవడం. ఇక్కడ యధాతతానువాదానికి నిఘంటువుల అవసరం వుంటుంది, స్వేచ్చానువాదానికి సృజనాత్మకమయిన మనసు కూడా అవసరమవుతుంది. అయితే శాస్త్ర సాంకేతిక అంశాల అనువాదానికి యధాతతానువాదమే  అనువయింది. సాహిత్య సృజనాత్మక అంశాలకు స్వేచ్చానువాదం అభిలశనీయమయింది. ఇక్కడ అనువాదంలో విశ్వసనీయత, పారదర్శకత అన్న అంశాలు కూడా  ప్రదానమయినవే.

   ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రసాంకేతికత పెరిగిన తర్వాత అనువాద రంగం లో యంత్రాల ప్రమేయం కూడా పెరిగింది. ఫలితంగా మెషిన్ ట్రాన్స్లేషన్ కూడా వచ్చింది. ఇక 1990 తర్వాత పెల్లుబికిన ప్రపంచీకరణ నేపధ్యంలో అనువాద ప్రక్రియ విస్తృతంగా జరుగుతున్నది, దానికి  ప్రాముఖ్యతా పెరిగింది. అంతా అన్నీ ఇంగ్లీష్ మయం అయిపోయిన స్థితిలో దాదాపు అన్ని రంగాల్లో అనువాద అవసరం పెరిగింది. ఇవ్వాళ ముఖ్యంగా అయిదు రంగాల్లో అనువాదం జరుగుతున్నది. అవి సాహిత్యానువాదం, సాంకేతికానువాదం, కార్యనిర్వాహకానువాదం, ఆర్థికానువాదం, చట్టాల అనువాదం, వీటికి తోడు వెబ్ సైట్ ల అనువాదం, మెడికల్, జీవ శాస్త్ర, పేటెంట్, క్రీడా రంగాలల్లో  కూడా అనువాదాల ప్రాముఖ్యత చాలా పెరిగిందనే చెప్పాలి.

   ఇదంతా ఇట్లా వుంచి  సాహిత్యానువాద విషయమే  తీసుకుందాం. అసలు అనువాదమనేదే లేకుంటే సంస్కృతం,లాటిన్ అరబిక్ లాంటి భాషల్లో వున్న క్లాసికల్ సాహిత్యం మనకు  అందేదే కాదు. కేవలం ప్రాచీన సాహిత్యమే కాదు ఆధునిక కాలంలో కూడా వివిధ భాషల్లో వస్తున్న అద్భుత సాహిత్యం అనువాదాల ద్వారానే అందరికీ అందుబాటులోకి  వస్తున్నది. అయితే మన తెలుగు భాషా సాహిత్యాల విషయానికి వస్తే అధిక శాతం నేరుగా మూల భాషల నుంచి కాకుండా మధ్యలో ఇంగ్లీషును మాధ్యమంగా చేసుకున్న అనువాదాలే ఎక్కువ. అయినప్పటికీ మన ‘ఇరుగు పొరుగు’ భాషల తో పాటు వివిధ దేశాల సాహిత్యం కూడా మనకు అందుబాటులోకి వస్తున్నది. చాలా మంది కవులు రచయితలు విమర్శకులు అనువాదాలు చేస్తున్నారు. కానీ తెలుగులో పూర్తి స్థాయి అనువాదకుల కొరత ఇంకా వుంది. అంతే కాదు వివిధ భాషల్లోంచి తెలుగులోకి సాహిత్యం వస్తున్నది కానీ మన సాహిత్యం ఇంగ్లీషుతో సహా ఇతర భాషల్లోకి వెళ్తున్నది చాలా  తక్కువే. పలితంగా తెలుగులో వస్తున్న గొప్ప సాహిత్యం ప్రపంచానికి అంతగా అందడం లేదన్నది వాస్తవం.  ఈ స్థితిలో మార్పు రావాల్సిన అవసరం వుంది. వివిధ భాషల్లోంచి సాహిత్యాన్ని తెలుగులోకి తేవడంతో పాటు మన  సాహిత్యాన్ని వివిధ భాషల్లోకి తీసుకు వెళ్ళే కృషి జరగాల్సి వుంది. అందుకోసం అధికారంలో వున్న తెలుగు తెలంగాణా సాహిత్యఅకాడెమీలు, విశ్వవిద్యాలయాలూ చొరవ చూపాల్సి వుంది. వాటిని మించి స్వచ్చంద సంస్థల కృషీ అవసరమయిందే. వ్యక్తులుగా చేస్తున్న కృషీ తక్కువేమీ కాదు.

   సాహిత్యానువాదాలు ఏమేరకు జరిగినా.. ఆహ్వానించ దగ్గవే.. అభినందిన్చాల్సినవే.. 

-వారాల ఆనంద్         

Clipping of Disha Daily Telugu Newspaper – TS- Main      

 ‘అనువాదమే ప్రపంచ వారధి’ 
    ***** వారాల ఆనంద్  
      ‘ఇచ్చి పుచ్చు కోవడం’ అన్న భావనే మనిషి మనుగడకు  మూలాధార మయింది. అంతే కాదు ‘ తెలియంది తెలుసుకోవడం తెలిసింది పంచుకోవడం’ అన్నది  మానవ సంస్కృతిలో అంతర్భాగమయిన జీవనమార్గం.

‘లోక్ కబి’ పద్మశ్రీ హల్దార్ నాగ్ +++ వారాల ఆనంద్

Posted on Updated on

‘లోక్ కబి’ పద్మశ్రీ హల్దార్ నాగ్
కోసలి భాషా కవిత్వానికి పట్టాభిషేఖం
+++++ వారాల ఆనంద్

‘హల్దార్ నీకో లేఖ రాస్తున్నాను
సాయంకాలపు వెలుగు పురిటి నొప్పులు పడుతున్నది
సృజనాత్మక కవిత్వాన్ని ప్రసవించు
ఇగో
హల్దార్ నీకో లేఖ రాస్తున్నాను ‘
…. అంటూ సాగే ఆయన కవిత్వం ఆయనలాగే నేల మీద నడుస్తుంది.
ఆయన కవిత్వంలోని మాటలు సాధారణ ప్రజలు మాట్లాడే మాటల్లాగే వుంటాయి..
అయినా వాటిల్లో జీవన వాస్తవికత తొణికిస లాడుతుంది.
ఆయన కవిత్వం వాహికగా ‘ప్రకృతి’ తో మాట్లాడుతాడు.
రోజు వారీ దినచర్యలాగే ఆయన కవిత్వం మనల్ని పలకరిస్తుంది.
అయినా అందులో తాత్వికత ధ్వనిస్తుంది.
సులభ శైలితో చదువరుల్ని జల్దీ జల్దీ పట్టేసుకుంటుంది.
ఆయన్ని“లోక్ కబి”, ప్రజా కవి అంటారు. ఆయన భాష కోసలి. దాన్నే సంబల్పూరి అనికూడా అంటారు. ఆయన హల్దార్ నాగ్.
“తనకు ‘పద్మశ్రీ’ అవార్డు వచ్చిన దానికంటే నా భాషకు రాజ్యాంగ గుర్తింపు వచ్చినప్పుడే తనకు ఎక్కువ సంతోషం” అంటాడు ఆ భాషా ప్రేమికుడు.
ఒరిస్సాలో ఆయన్ని ప్రకృతి కవి గా పేరెన్నికగన్న కవి గంగాధర్ మెహెర్ తో పోలుస్తారు. కానీ వాస్తవానికి ఆయన జీవితానికీ కవిత్వానికి మరెవరితో పోలిక లేదు. పోల్చే అవకాశమూ లేదు. ఎందుకంటే ఆయన జీవితం అష్టకష్టాలతో మొదలయింది. హల్దర్‌ నాగ్‌ ది పశ్చిమ ఒరిస్సాలోని బార్‌గర్హ్‌ జిల్లాలోని ఘెన్స్‌ అనే చిన్న గ్రామం. ఎగువ ఊళ్ళల్లో కలరా సోకితే అతడి కుటుంబం ఆ ఊళ్లోకి వచ్చి స్థిరపడింది. అక్కడే అమ్మా నాన్నలకు ఆఖరి సంతానంగా హల్దర్‌ నాగ్‌ 1950లో జన్మించాడు. చర్మకార వృత్తి చేసే తండ్రి పాముకాటుకు చనిపోయాడు. అప్పుడు హల్దార్ నాగ్ కి కేవలం పదేళ్ళ వయసు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడం తో హల్దార్ నాగ్ మూడో తరగతిలోనే తన చదువు ఆపేశాడు. అతని కంటే ముందు పుట్టిన వాళ్లు పెళ్లిళ్లు చేసుకొని వెళ్లిపోవడంతో ఇంటికి దిక్కుగా ఒక్కడు మిగిలి పోయాడు. మొదట ఊళ్లో ఉన్న మిఠాయి దుకాణంలో గిన్నెలూ, వంట పాత్రలు కడిగే పనికి కుదిరాడు హల్దర్‌. అక్కడే వంట కూడా నేర్చుకున్నాడు. ఆ ఊరిలోని ఒక పెద్దమనిషి అతణ్ణి స్కూల్లో వంటవాడిగా పెట్టాడు. దాదాపు పదహారెండ్లు అక్కడే వంటవాడిగానే బతికాడు. చాకిరీ చేస్తూ కాలం గడిపాడు. హల్దార్ ఆ సమయంలో స్కూల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం గమనించాడు. తను పనిచేసే స్కూలుతో పాటు ఆ ప్రాంతంలో స్కూళ్ళ సంఖ్య పెరగడం చూసిన హల్దార్ వెయ్యి రూపాయలు అప్పు తీసుకుని స్కూల్‌ ఎదురుగానే చిన్న స్టేషనరీ షాపు, పిల్లలు తినే తినుబండారాల చిన్న దుకాణం పెట్టుకున్నాడు. చిన్నప్పటినుండే హల్దార్ కి జానపద పాటలు వినడం పాడడం అలవాటుగా వుండేది. ఎంతో అవంటే ఇష్టంగా కూడా వుండేది. ఆయనకు ‘కృష్ణా గురు భజన్’ , ‘దాల్కాయీ’, రసరేకలీ, మయేలా జాదా లాంటి అనేక జానపద గీతాలు పాడేవాడు. తనపైన బినోద్ నాయక్ కవిత్వం తొలి రోజుల్లో బాగా ప్రభావితం చేసిందని నాగ ఒక చోట చెప్పుకున్నాడు. ‘గ్రామ పద’ అన్న కవిత తనని కవిత రాసే దిశగా నడిపించిందని కూడా చెప్పాడు. అనంతర కాలంలో గంగాధర్ మెహెర్, రాదా నాథ్ రాయ్ ల కవిత్వం ఎక్కువ ప్రభావితం చేసిన్నాడు నాగ్,
ఆ సమయంలోనే అతనిలో ఏవేవో భావాలు పెల్లుబుక సాగాయి. అవి కవిత్వ రూపంలో వెలికి వచ్చాయి. కోసలి భాషలో తనకు తోచింది ఆశువుగా చెప్పడం మొదలు పెట్టాడు. హల్దార్ కి మామూలు బడి చదువు లేకపోవడం పెద్ద ఇబ్బందేమీ కాలేదు కానీ మొదట్లో ఆయన ఆశువుగా చెబుతూ ఇతరులతో రాయించే వాడు. ఆ సమయంలోనే ఆ ప్రాంతంలోని ‘అభిమన్యు సాహిత్య సన్సద్‌’ అనే గ్రూప్‌తో హల్దార్ కు పరిచయమయ్యింది. దాంతో ఆయనకు ఒరియా సాహిత్యం పరిచయం అయింది. క్రమంగా ఒరియా చదవడం నేర్చుకున్నాడు. కోసలి వివరంగా రాయడమూ అబ్బింది. దాంతో ఒరియా సాహిత్యం చదువుతూనే హల్దర్‌ తన కోసలి భాషలో కవిత్వసృష్టి సాగించాడు.1990లో అతని తొలి కవిత ‘ధోడో బగ్గాచ్‌’ (పాత మర్రిచెట్టు) ఒక స్థానిక పత్రికలో అచ్చయ్యింది. హల్దార్ కి గొప్ప జ్ఞాపకశక్తి ఉంది. ఏ పుస్తకంలోని ఏ కవితనైనా విని, చదివి గుర్తు పెట్టుకోగలిగే జ్ఞాపకం ఆయనది. అంతేకాదు తన స్వీయ కవిత్వాన్ని కాగితం చూడకుండా ఆలవోకగా చెప్పగలడు. అందుకే ప్రజలు అతణ్ణి ‘ఆశు కబి’ అని, ‘లోక కబి రత్న’ అని పిలుస్తారు. తొలి కవితతో ఆయన అందరి దృష్టిలో పడ్డాడు. అప్పటినుండి ఆయన పలు కవితలు అనేక పత్రికల్లో అచ్చయ్యాయి. దాంతో పాపులారిటీ పెరిగింది. “అప్పుడు నాకు చాలా ప్రశంసలు, సన్మానాలు లభించాయి. దాంతో మరింతగా రాయడానికి ఉత్సాహం పెరిగింది” అని ఒక చోట హల్దార్ చెప్పుకున్నాడు. ఇక తన చుట్టు పక్కల గ్రామాల్లోకి వెళ్ళడం కవిత్వం చదవడం ఆరంభించాడు. ఆయన తన కవిత్వం నిండా అట్టడుగు వర్గాల స్థితి, అణచివేతకు గురయిన వాళ్ళ పరిస్థితి పైననే రాసాడు.
భాష పట్ల హల్దార్ నాగ్ కి స్పష్టమయిన అభిప్రాయాలున్నాయి. ‘భాషలెన్ని వున్నా సాహిత్యం ఒక్కటే అంటాడాయన. అంతే కవిత్వం సాహిత్యం మానవ ఆలోచనల్ని మనసుల్నీ అత్యంత గాఢం ప్రభావితం చేస్తుంది అని కూడా ఆయన ఒక ముఖాముఖిలో అభిప్రాయపడ్డాడు.
ఆయన కవిత్వం ఇప్పటికే హిందీలోకీ, కొంత ఇంగ్లీశులోకీ అనువాదం అయింది.. 1916లో పద్మ శ్రీ వచ్చిన తర్వాత హల్దార్ నాగ్ కవిత్వం మరింతగా వివిధ భాషల్లోకి అనువదించబడుతున్నది.
ఆయన కోసిలి భాషలో రాసిన కవితల్లోంచి ఎంపిక చేసిన 24 కవితలతో మొదటి కవితా సంకలనం “కావ్యాంజలి” వచ్చింది. దాన్ని సురేంద్రనాథ్ ఇంగ్లీషులోకి అనువాదం చేసారు.2016 వెలువడ్డ ఈ పుస్తకానికి సుప్రసిద్ధ ఒరియా కవి మనోజ్ దాస్ ముందుమాట రాసాడు. ఈ సంకలనంలోని కవితల నిండా ప్రాంతీయత, పౌరానికత, సర్వదేవతావాదం, ప్రకృతితో మనిషికున్న అనుబంధం, సామాజిక అంతరాలూ ఇట్లా ఎన్నో అంశాల్ని ఆయన ఆవిష్కరించారు.
“కావ్యాంజలి” హల్దార్ నాగ్ ఎంపిక చేసిన కవితలు
ఈ సంకలనం లోని మొట్ట మొదటి కవిత దీర్ఘ కవిత ‘గ్రేట్ సతి ఊర్మిళ’( గొప్ప మహిళ ఊర్మిళ). రామాయణం లోని ఊర్మిళ పాత్రను ఉన్నతీకరిస్తూ ఈ కవితసాగుతుంది. అనేక రామాయణ కావ్యాల్లో ఊర్మిళ పాత్రకు పెద్ద ప్రాముఖ్యతను ఇవ్వలేదు. కాని హల్దార్ ఊర్మిళ గొప్ప మహిళా అని ఆమె స్థానం సీత, మండోదరి లతో సమానమయిందని అంటాడు. నాగ్ తమ ప్రాంతంలో వున్న ప్రాంతీయ రామాయణ కావ్యాలను ప్రేరణగా తీసుకుని ఈ కవిత రాసాడు. ఒరిస్సా లో 15 వ శతాబ్దానికి చెందిన ‘విలంకా రామాయణ’ చాల ప్రసిద్ది పొందిన కావ్యం. దాన్ని సరళాదాస్ రాసారు. వేర్వేరు రామాయణాల్లో అనేక వైవిధ్యాలు కనిపిస్తాయి. కైకేయి పాత్రను ఇక్కడ ఉదాత్తమయినదిగా సూచిస్తారు. రాముడు కనుక పట్టాభిషిక్తుడు అయితే జాతక రీత్యా చనిపోతాడని తెలిసిన కైకేయి రామున్ని వనవాసానికి పంపిందని ఇక్కడ రాసారు. అట్లే 14 సంవత్సరాలు నిద్రలో ఉన్నట్టుగా చెప్పిన ఊర్మిళ పాత్రకు కూడా అనేక రామాయణాల్లో అంత ప్రాముఖ్యత నివ్వలేదు. కానీ ఆమె చేసిన త్యాగం, ఆమె జ్ఞానం, స్వచ్చత చాలా గొప్పదని హల్దార్ రాసాడు.
“ఏడు రామాయణాల్లో
ఎక్కడా ఉటంకించని ప్రస్తుతించని
స్త్రీ ఆమె
నాలోని కవికి ఆమె గొప్ప మహిళ
సీత కంటే కూడా స్వచ్చమయిన సతి ఆమె’ అంటాడు హల్దార్ తన కవితలో.

ఇక హల్దార్ నాగ్ రాసిన కవితల్లో స్థానిక పత్రికలో ప్రచురితమయిన మొదటి కవిత “ ముసలి మర్రిచెట్టు”. ఈ కవిత విశేష ప్రాచుర్యం పొందింది. అనేక ఏళ్ళుగా నిలబడి వున్న ఆ చెట్టు తన జీవిత కాలంలో ఏమేమి చూసిందో చెబితే ఎట్లా వుంటుందో ఆయా అంశాల్ని ఈ కవితలో చెబుతాడు హల్దార్.
ఆ మర్రి చెట్టు తమ తాతల కాలం నుంచీ వుంది. దాని ఊడలలూగుతూ ఎంతో మంది పిల్లలూ పెద్ద వాళ్ళు అయివుంటారు. ఎందరో ప్రయానికులకూ,యాత్రికలకూ ఆ చెట్టు నీడనిచ్చి వుంటుంది. ఎంతోమంది పెళ్లి కొడుకులు ఈ చెట్టు కింది నీడ కింద ఎదురు చూస్తున్న తమ పెళ్లి కూతుళ్ళను తీసుకెళ్ళి ఉండొచ్చు. అంతేకాదు చనిపోయిన ఎంతో మందిని చివరి యాత్రకు ముందు ఈ చెట్టు నీడనే కొంత సేపు పడుకో బెట్టి వుంటారు. ఈ మర్రి చెట్టు ఇంకా ఎంతో మంది దొంగలనీ వాళ్ళు దోచుకున్న సొమ్ముని పంచుకున్న రీతినీ చూసి ఉండొచ్చు. అంతేనా యువ ప్రేమికులెందరో ఈ మర్రి చెట్టు కిందే రహస్యంగా కలుసుకుని ఉండొచ్చు. ఇవన్నింటినీ చెప్పే సువర్ణావకాశం ఈ మర్రి చెట్టుకు వచ్చింది… గ్రామీణ
జీవితాల్ని ఆవిష్కరిస్తూ ఈ కవిత ఆద్యంతం ఆసక్తిగా కొనసాగుతుంది. చెట్టును వ్యక్తిగా చేసి భావాల్ని పలికిస్తుంది.
“ అది చూస్తుంది, అది వింటుంది,
దానికి తెలుసు, అది కనుక్కొంటుంది
కానీ ఒక్క మాటా పలుకదు
అది తన బాహువుల్ని బయటకు విశాలంగా విస్తరించుకుని
ఓ మౌన సాక్షిగా నిలుచుంటుంది”
ఇక హల్దార్ నాగ్ కవిత “ ఘన్సాలి నది” కూడా మనిషి జీవితాన్ని పరిశీలిస్తుంది.
నది పయనమయి సముద్రాన్ని చేరే క్రమాన్ని ప్రతీకాత్మకంగా మనిషి తన ఆధ్యాత్మిక జీవన యానాన్ని ఈ కవిత చెబుతుంది. పుటుక నుంచి మరణం దాకా మనిషి పయనించి ఆత్మ పరమాత్మలో కలిసి పోయే భావనని ఇందులో కవి ఉటంకిస్తాడు.
ఇక ‘కావ్యాంజలి’ లో జల్దార్ మరో కవిత ‘మంత్రి- బిచ్చగాడు’
ఇది ఒక రాజకీయ వ్యంగ్యాత్మక కవిత. ఇది సంభాషణ తీరులో సాగుతుంది. మంత్రికి బిచ్కగాడికి నడుమ సాగే మాటల సమాహారం ఇది. ఒక మంత్రి ఓ బిచ్చగాడికి ఒక సూచనచేస్తాడు. బిచ్చ మెత్తుకోవడం ఆపేసి కస్టపడి పని చేసుకుని డబ్బు సంపాదిచుకోమని.. దానికి బదులుగా ఆ బిచ్చగాడు సామాన్య ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును దోచేయకుండా ప్రజావసరాలకు వాడమని మంత్రికి బిచ్చగాడు ఎదురు సూచిస్తాడు…
“ నా కడుపులో ఆకలి కోసం నేను అడుక్కుంటాను,
కానీ నేను నా స్వార్థం కోసం కాదు..
నువ్వు స్వార్థపరుడివి,
అడుక్కోవడం మంచిది. ఇల్లు దగ్గరో గుడిసె దగ్గరో..” అంటాడు.
హల్దార్ రాసిన మరో చిన్న కవిత ‘వెలుతురు-మట్టి దీపం’ లో చాలా ముఖ్యమయిన అంశాన్ని తీసుకున్నాడు. తమ భాష కనుమరుగయితే ఆ ప్రాంత ప్రజలు తమ మాటలని మర్చిపోతారు. చివరికి వాళ్ళు తమ ఉనికినే కోల్పోతారు అంటాడు నాగ్… ఇందులో మాతృభాష పట్ల మనుషులకు ఉండాల్సిన ప్రేమా, అభిమానాలను నొక్కి చెబుతాడు కవి. అంతరించిపోతున్న ప్రాంతీయ భాషల పట్ల హల్దార్ కవిగా పడ్డ వేదన ఈ కవితలో స్పష్టంగా కనిపిస్తుంది.
“వారసుల్లేని బంధువుల్లో
నూతనంగా పుట్టిన వాడు దీపం వెలిగించినట్టు,
ఒరిస్సా ఉత్తర ప్రాంత భాష
దీపంలో వత్తిలా కాలి విస్తరించనీ..”
….
ఇక హల్దార్ నాగ్ రాసిన మరో ప్రతిభావంతమయిన కవిత “ అంతను ఇల్లు ఎందుకు వదిలేసాడు”.
వ్యంగంగా వున్న ఈ కవితలో సామాజిక అవలక్షణాన్ని చెబుతాడు. ప్రజలు సాధారనంగా నిందలు బలహీనుల పైనే వేస్తారు. కవిత బలవంతుల ఎదుట బలహీనులు తల వంచడాన్ని చెబుతుంది.
“ అందరి పెదాల పై ఒకే వాదన
గెలుపు బలహీనులకు సాధ్యం కాదు
నీళ్ళు ఎప్పుడూ పల్లానికే ప్రవహిస్తాయి
తప్పు ఎప్పుడూ బలహీనునలవైపే..”

ఇట్లా సాగిన హల్దార్ నాగ్ కవిత్వం మొదట ‘కావ్యాంజలి’ పండిత, పామరుల ఆదరణ పొందింది
అతని రెండవ సంపుటం ‘కావ్యాంజలి2’ను సంబల్‌పూర్‌ యూనివర్సిటీ విద్యార్థులకు పాఠ్యాంశాలుగా పెట్టింది. అతడి అనేక కవితలు ఇప్పుడు పాఠశాల స్థాయిలో పాఠ్యాంశాలు అయ్యాయి. దేశీయ జానపద శైలి, పురాణ సంకేతాలు, కల్తీ లేని భాష, అప్రయత్న ధాటి హల్దర్‌ నాగ్‌ కవిత్వాన్ని జీవంతో, ఆకర్షణతో నింపుతాయి. అతడి రచనలు ఇప్పటి వరకూ దాదాపు 22 పుస్తకాలుగా వచ్చాయి. పాటలూ రాశాడు. సంబల్పూర్‌ యూనివర్సిటీ అతనికి డాక్టోరల్‌ డిగ్రీ ఇచ్చి సత్కరించింది.
2020 లో పాండిచేరీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ జై శంకర్ బాబు రెండు రోజుల అంతర్జాతీయ సెమినార్ నిర్వహించారు వైస్ చాన్సెలర్ గురు మీత్ సింగ్ ఆధ్వర్యంలో జరిగన ఈ సెమినార్లో “హల్దార్ నాగ్ కా కావ్య సంసార్’ అన్న పుస్తకాన్ని విడుదల చేసారు. దినేష్ కుమార్మాలి సంబల్ పూరి భాషనుంచి హిందీ లోకి అనువాదం చేసిన హల్దార్ పుస్తకమది. ఆ సెమినార్లో నాగ్ కవిత్వం మీద విస్తృతంగా చర్చ జరిగింది. ఇంకా హల్దార్ కే లోక్ సాహిత్య పర విమర్శ, రామాయణ్ ప్రసంగొన్ పర్ హాల్దార్ కే కావ్య అవుర్ యుగిన్ విమర్శ’ అన్న పుస్తకాలూ వెలువడ్డాయి . ఇంకా ఇందిరా గాంధీ ఓపెన్ యునివర్సిటీ తో సహా అనేక విశ్వవిద్యాలయాల్లో హల్దార్ కవిత్వం మీద పాఠాలున్నాయి. పరిశోధనలూ చేస్తున్నారు.
ఒకప్పుడు వంట కాంట్రాక్టు కోసం ఎదురు చూసే హల్దర్‌ నేడు ఒరిస్సా రాష్ట్రంలో దేశంలో ప్రతిరోజూ సాహిత్య కార్యక్రమాలకు ఆహ్వానింపబడే కవిగా గౌరవం పొందుతున్నాడు. అంతే కాదు 2015లో వచ్చిన ‘కౌన్‌ కిత్నే పానీ మే’ అనే లఘు చిత్రంలో రాధికా ఆఫ్టే, సౌరభ్‌ శుక్లా వంటి నటులతో కలిసి నటించాడు.
హల్దర్‌ నాగ్‌ కవిత్వాన్ని కవి గుల్జార్‌ అమితంగా అభిమానించాడు. ఆయన హల్దర్‌ నాగ్ కవిత్వం చదివి 50 వేల రూపాయల తన సొంత డబ్బును కానుకగా పంపాడు. అంతేకాదు, బాలీవుడ్‌ దర్శకుడు ‘భరత్‌బాల’ తన ‘వర్చువల్‌ భారత్‌’ ఫీచర్‌ కింద హల్దర్‌ పై తీసిన షార్ట్‌ ఫిల్మ్‌ కు వ్యాఖ్యానం కూడా అందించాడు. హల్దర్‌ కవిత్వం భారీగా ఇంగ్లిష్‌లోకి అనువాదం అవుతోంది. ఇప్పటికి 350 సంస్థలు హల్దర్‌ను సత్కరించాయి. ఇంత పేరు వచ్చినా ఇప్పటికీ చెప్పుల్లేకుండా నడుస్తాడు హల్దర్‌. నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా ‘పద్మశ్రీ’ అందుకునేటప్పుడు కూడా నాగ్ చెప్పులు తొడుక్కోలేదు.
‘ఈ మట్టి మీద నడిచేటప్పుడు మొత్తం భూగోళం మీద నడుస్తున్నట్టుగా భావించు’ అంటాడు హల్దర్‌
అంతే ఈ భూమి మనందరిది. అంటే ప్రతి మనిషి మరో మనిషి కోసమే అని భావిస్తూ ‘మనం’ అనే భావనతో బతకాలని హల్దర్‌ కోరుతాడు.
అనేక రకాల దుర్గుణాలు ప్రతి మనిషిలో ఉండేవే. కాకుంటే వాటిని వదిలించుకోవడానికి అప్పుడప్పుడు హల్దర్‌ వంటి మహాకవి పిలుపు అవసరం. ఇప్పుడా పిలుపు వినిపిస్తూ తిరుగుతున్నాడు హల్దర్‌ నాగ్‌. హల్దార్ నాగ్ “ సినిమా లాంటి ఇతర కళా రూపాల కంటే సాహిత్యం అమరమయిందని, అది ఎ భాషలోనిదయినా సమాజానికి దారి చూపే టార్చ్ లైట్ లాంటిదని యువకులతో అంటాడు. అందుకే యువత సాహిత్యాన్ని ఎక్కువగా అధ్యయనం చేయాలని సూచిస్తాడు.
హల్దార్ నాగ రాసిన రెండు కవితలకు నేను చేసిన స్వేచ్చానువాదం—-
అమృతం
—– హల్దార్ నాగ్
లోకంలోని సప్త సముద్రాలనుండీ
అమృతం జనించనీ

ఆకాశంలోంచి చంద్రుడూ
అమృతాన్నే కురవనీ

మనిషికి ప్రాణాధారమయిన అమృతమే
మాతృమూర్తి స్థనాలనుండి
బొట్లు బొట్లుగా రాలనీ

మానవత్వంతో మంచి మనుషులు చేసే
మంచి కార్యాలనుంచీ
అమృతమే పారనీ

ఇంకా
కవిగారు రాసే సున్నితమయిన పదాలనుంచీ
అమృతమే ప్రవహించనీ
********************
హల్దార్ నీకో లేఖ రాస్తున్నాను
————-
హల్దార్ నీకో లేఖ రాస్తున్నాను
సాయంకాలపు వెలుగు పురిటి నొప్పులు పడుతున్నది
సృజనాత్మక కవిత్వాన్ని ప్రసవించు
ఇగో
హల్దార్ నీకో లేఖ రాస్తున్నాను

సమాజాన్ని శుభ్రం చేయాలనుకుంటే
మొదట నిన్ను నువ్వు శుభ్రం చేసుకో

ఇతరులను చేయి పట్టి పైకి లాగాలనుకుంటే
ముందు నువ్వు రెండడుగులు పైకెక్కు

లోకం ఆకర్షణలకు మొహితుడవు కాబోకు
అత్యాశకు గురి కాకు
ఇదో
హల్దార్ నీకో లేఖ రాస్తున్నాను

సృష్టి సమస్తంలో మహోన్నతుడయిన మనిషి
చీకట్లో మగ్గుతున్నాడు
తన సుఖం కోసం అందరినీ దుఖం పాలు చేస్తున్నాడు

ధర్మ ఖర్మ అవమానాల్ని త్యజించాడు
నరకం వైపు మరింత దగ్గరవుతున్నాడు
ఇగో
హల్దార్ నీకో లేఖ రాస్తున్నాను

అమ్మ ఆశీర్వాదం తీసుకో
దుఖాన్ని సంతోషంగా భావించు
విశామున్న చోటే అమృతమూ లభిస్తుంది
వెతుకు ప్రేమతో ఉద్రేకంతో వెతుకులాడు

నువ్వు విషం తాగాల్సివచ్చినా
ఇతరులకు అమృతమే పంచు
అవసరమయితే తలపై గంగా నదిని ధరించు
ఇగో
హల్దార్ నీకో లేఖ రాస్తున్నాను

మంచి మాటలతో లోకంలోని
అందరినీ నీ వాళ్ళని చేసుకో
సమస్త ప్రపంచాన్నీ ఒకే చూరు కిందికి తీసుకురా
అందులో నువ్వూ నివాసముండు
నీ సమస్త రచనా శక్తినీ
ఈ లోకాన్ని సరి చేసేందుకు వాడు
****************
-వారాల ఆనంద్
9440501281

73= యాదొంకి బారాత్

Posted on

++++++ వారాల ఆనంద్

THE waterfall sings, “I find my song, when I find my freedom.” అన్నాడు రవీంద్ర నాథ్ టాగోర్. స్వేచ్చా స్వాతంత్ర్యాలు లభించిన వేళ నా పాటను కనుగొన్నాను అని. నా పరిస్థితి అదే ఎస్.ఆర్.ఆర్.కాలేజీలో చేరిన తర్వాత నాకో పెద్ద మైదానం దొరికింది. ఇక ఆడుకున్నంత మాఫ్. అంటే చేసినంత పని. చేతినిండా పని. మాట మంచిది నీతివంతమయింది అయినప్పుడు అందరూ మన వెంటే వుంటారు. ముందుకు నడిపిస్తారు. అది నా అనుభవం. ఎస్.ఆర్.ఆర్. కాలేజీ లైబ్రరీ చాలా పెద్దది. నిర్వహణ చాలా కష్టమయంది. కానీ కాలేజీ అంతకంటే పెద్దది. వ్యక్తిగా సృజనకారుడిగా కాలేజీ కోసం ఎంతయినా చేయొచ్చు. విద్యార్థులకోసం ఎంత కొత్తదనాన్నయినా ప్రోదిచేయచ్చు. కాలేజీ విస్తారం ముందు లైబ్రరి పరిధి అక్కడ శ్రమ చాలా చిన్నదే అనిపించింది. దానికి సహచరులు ముఖ్యంగా ప్రిన్సిపాల్స్ సహకారం చాలా గొప్పది. ఆ ఒరవడి బహుశా ఆ కాలేజీ పునాదుల్లోనే ఉందేమో.

…..

కాలేజీ లో చేరిన సమయంలో ప్రిన్సిపాల్ గా వున్న శ్రీ రాజిరెడ్డి గారు సౌమ్యులు. మంచి అకాడమిక్. సిలబస్ క్లాసుల పైన ఎక్కువ దృష్టి పెట్టేవాడు. ప్రిన్సిపాల్ గా అదనపు బాధ్యతలు వున్నా తన క్లాసులని యధావిధిగా తీసుకునేవాడు. ఆయన నెమ్మదితనం కమిట్మెంట్  నాకు బాగా నఃచ్చాయి. ఆయనంటే గౌరవం కలిగింది. కొన్ని రోజులకే ప్రభుత్వం కొత్తగా ప్రిన్సిపాల్ల ప్రమోషన్స్ ఇచ్చింది. దాంతో రాజిరెడ్డి గారు జగిత్యాల కాలేజీకి బదిలీ అయి వెళ్ళారు. హైదరాబాద్ సిటీ కాలేజీ నుంఛి శ్రీ బి.దామోదర్ మా కాలేజీకి పూర్తి స్థాయి ప్రిన్సిపాల్ గా వచ్చారు. చాలా అనుభవజ్ఞుడు. వేములవాడ రూట్స్ వున్నవాడు. ఆధ్యాత్మికత, కాలేజీ నిర్వహణ పట్ల మంచి అవగాహన వున్నవాడాయాన. అంతేకాదు హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో వున్న అష్టలక్ష్మి దేవాలయ నిర్వాహకుల్లో ముఖ్యుడు. అట్లా కార్యనిర్వాహక రంగంలో మంచి పట్టు వున్నవాడు. అంతేకాకుండా మంచిని మంచిగానూ, చెడును చెడుగానూ చూసే లక్షణమున్న వాడు. ఎస్.ఆర్.ఆర్. లో వున్న లోటు పాటలను సరిదిద్దాలనే భావనతో పని చేసారు. అప్పటికి కాలేజీలో ఎన్.ఎస్.ఎస్., ఎన్.సి.సి. విభాగాలు బాగా పనిచేసేవి. ఎన్.ఎస్.ఎస్.కు డాక్టర్ కోట మురళి, కామర్స్ బి.రాజమౌళి, ఫిజిక్స్ రాజమణి, సి.సత్యనారాయణ తదితరులు ఇంచార్జిలుగా వుండేవాళ్ళు.  రాజనీతి శాస్త్రంలో అధ్యాపకుడయిన సి.సత్యనారాయణ ను అందరం  సరదాగా ‘తూగోజీ’ అనేవాళ్ళం. ఆయన తూర్పు గోదావరి జిల్లా నుంచి వచ్చాడు. చాలా సరదాగా ఉండేవాడు. దామోదర్ సార్  ప్రిన్సిపాల్ గా చేరిన తర్వాత రేకుర్తి గ్రామంలో ఎస్.ఎస్.ఎస్. క్యాంప్ పెట్టారు. రెండో రోజో మూడో రోజో సాయంత్రం ప్రిన్సిపాల్ నన్ను పిలిచి మీ ఇల్లెక్కడ అని అడిగాడు. కాలేజీకి ఎదురుగానే బ్యాంక్ కాలనీలో అన్నాను. రేపుదయం బండి తీసుకుని మా ఇంటికి వస్తావా అన్నాడు. సరే సార్. ఎందుకు అన్నాను. నువ్వు 7 లోపు రావయ్యా అన్నాడు. మరేమీ మాట్లాడకుండా సరే అని తెల్లారి వెళ్లాను. సార్ వొంటరిగా వున్నాడు. ఫామిలీ హైదరాబాద్ లో వున్నారు. తాను రెడీగా వున్నాడు. నా బండి వెనకాల కూర్చుని నీకు రేకుర్తి తెలుసు కదా కాంప్ కు వెళ్దాం అన్నాడు. సరే నన్నాను. అక్కడికి వెళ్ళే సరికి పిల్లలంతా టిఫిన్ చేస్తున్నారు. ఎస్.ఎస్.ఎస్. అధికార్లు అంతా వున్నారు. మమ్మల్నీ టిఫిన్ చేయమన్నారు. అంతా బాగుంది పిల్లలంతా ఉత్సాహంగా వున్నారు. టిఫిన్స్ తర్వాత పిల్లలతో మాట్లాడి, గంటకు పైగా అక్కడే గడిపి తిరిగి వచ్చేసాం. వస్తూ వస్తూ అడిగాను ఇన్స్పెక్షన్ కోసమా సార్ అన్నాను. నువ్వు భలే వున్నావ్ ఆనంద్. మా దగ్గర హైదరాబాద్లో ఇంత కమిట్మెంట్ వుండదు. అందుకే చూడాలనుకున్నాను. కానీ చాలా హాప్పీగా వుంది. అంతా సవ్యంగా వుంది అన్నాడు. తనని ఇంటి దగ్గర దించి నేను వెళ్లి రెడీ అయి కాలేజీకి యదావిధిగా చేరుకున్నాను.

ఆ తర్వాత దామోదర్ సార్ వున్న కాలంలోనే ఎన్.ఎస్.ఎస్. విద్యార్థులతో కాలేజీ మొత్తానికి సున్నాలు వేసే పని చేపట్టారు. అంతా విజయవంతంగా గొప్పగా జరిగింది. అదో పెద్ద ఉత్సవం. నీ నా అనకుండా యువకులంతా చొరవగా కాలేజీకి సున్నాలు రంగులు వేయడం నిజంగా ఒక ఉద్యమమే. ప్రోగ్రాం అధికారులు, మురళి, రాజమౌళి, రాజమణి, సి.సత్యనారాయణ ల కమిట్మెంట్ సాధారణమయింది కాదు. వాళ్లకు వెనకాల పీ.డీ. కే.లక్ష్మీరాజం, ఎన్ .సి.సి.మధుసూధన్ రెడ్డి  పరిశీలన పర్యవేక్షణ లు ఎంతో తోడయ్యాయి. అప్పటిదాకా చాలా మందికి వున్న అనేకాభిప్రాయాలు మార్చుకోవాల్సే వచ్చింది. దామోదర్ సార్ ప్రిన్సిపాల్ గా పని చేసిన 8 నెలలు ఎంతో త్వరగా ముగిసి పోయినట్టు అనిపించింది.. లైబ్రరీ లో పాత పాడయిన పుస్తకాలు ఏమయినా వుంటే లిస్టు చేయమని, స్టాక్ లోంచి తీసేద్దామని అన్నాడు. లైబ్రరీ ఆరోమేషణ్ కోసం ఒక కంప్యుటర్ ఏర్పాటు చేసారు. అట్లా చాలా విషయాల్లో ఆయన అందరిపట్లా అండదండగా వున్నాడు. ఆయన పీరియడ్ లోనే కాలేజీలో మొట్టమొదటి వినూత్న జాతీయ సెమినార్ జరిగింది. తెలుగు లెక్చరర్ మిత్రుడు డాక్టర్ గోపు లింగా రెడ్డి ప్రతిపాదించిన ఆ సెమినార్ కు యూ.జీ.సి. అనుమతి తో పాటు కొన్ని నిధులు కూడా ఇచ్చింది. “తెలంగాణా మాండలిక సాహిత్యం”  అన్న అంశం పై జరిగిన ఆ సదస్సు మొత్తంగా తెలంగాణా అంతట తెలంగాణా స్పృహను పెంచింది. తెలంగాణా భాష పైన జీవితం పైన కొత్త ఆలోచనలకు దారితీసింది. అంతే కాదు ఆ రెండు రోజుల సదస్సు రచయితల్ని, కవుల్ని, కళాకారుల్నీ ఒకే వేదిక పైకి వచ్చేలా చేసింది. అప్పటికే రగులుతున్న తెలంగాణా భావనకు ఈ సదస్సు పెద్ద ఊతం ఇచ్చింది.  గోపు లింగారెడ్డి ఎప్పుడయినా సభల ఆలోచనలకు ముందుండేవాడు. ఎవరేమనుకున్నా తనని ఏమన్నా ఆయనకు పెద్ద పట్టింపు వుండేది కాదు. పనిముఖ్యం అనే వాడు. అది ఆయనకున్న గొప్ప లక్షణం. యూజీసీ ఆమోదం వచ్చాక ప్రిన్సిపాల్ గారు తెలుగు శాఖను పిలిచి మీ శాఖ హెడ్ డాక్టర్ మచ్చ హరిదాస్ ఈ సదస్సు కు సంబదించి అన్నింటా పర్యవేక్షణ చేస్తాడు అన్నాడు. గోపు లింగారెడ్డి తో సహా అందరూ అంగీకరించారు. నేనూ పూర్తి స్థాయిలో పాల్గొన్నాను. ఏర్పాట్లు మొదలయ్యాయి ఇంగ్లీష్ శాఖకు చెందిన ఆర్.వినయ సాగర్ తో సహా అంతా ఇన్ వాల్వ్ అయ్యారు. రెండు రోజుల సదస్సును కథ, నవల, జానపద విజ్ఞానం, పాట, కవిత్వం, కవిసమ్మేలనం ఇట్లా వివిధ అంశాల పైన విభజించాం. 7 డిసెంబర్, 2001న ఉదయం కాలేజీ ఆడిటోరియం లో సదస్సు ఆరంభమయింది. ఆనాటి ముఖ్య అతిథి కాళోజీ, సదస్సు ప్రారంభకులు దాశరధి రంగాచార్యలు. వారు కాలేజీ ఆవరణలో అడుగు పెట్టగానే విద్యార్థులంతా డప్పు వాయిద్యాలతో చెప్పిన స్వాగతం దద్దరిల్లిపోయింది. కాలేజీ ప్రాంగణమంతా గొప్ప ఉద్వేగం. ఎక్కడ లేని ఉత్సాహం. మేట్లేక్కేందుకు కాళోజీ రాగా విద్యార్థులు ఆయన్ను తమ బుజాలపైన ఎక్కించుకునేందుకు వచ్చారు. ‘వారీ నన్ను మోసే కాలం ముందుంది రా.. ఆగున్రి..’ అంటూ కాళోజీ తానే మెల్లిగా పైకి వచ్చాడు . అక్కడ స్టాఫ్ లో మురళి, మధు, లక్ష్మీరాజం, నాగరాజు తదితరుల ఉత్సాహం నాకిప్పటికీ జ్ఞాపకమే. మొత్తంగా తెలంగాణా ప్రాణ వాయువు అక్కడే వున్నట్టు తోచింది. వేదిక మీంచి కాళోజీ ‘కేవలం రెండు జిల్లాల భాషను ప్రామాణికత పేరిట మన మీద రుద్దారని, దాన్నితిప్పి కొట్టాలని అంటూ అనేక విషయాల్ని ఉద్రేకంగా చెప్పారు. సభ ఊగిపోయింది. తర్వాత దాశరధి తెలంగాణా మాండలికాన్ని వాడడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదన్నారు. మన భాషను మనం రక్షించుకోవాలని, ఉద్యమాల ద్వారా సాంస్కృతిక తెలంగాణాను సాధించుకోవాలన్నారు. ప్రారంభ సమావేశానికి ప్రిన్సిపాల్ బందం దామోదర్ అధ్యక్షత వహించగా, కాకతీయ విశ్వవిద్యాలయ రిజిస్త్రార్ భాస్కర్ రావు పాల్గొన్నారు. మొదటి సమవేశంలో అల్లం రాజయ్య మాట్లాడుతూ ‘తెలంగాణా కథా సాహిత్యమంతా ఈ నేల కన్నబిడ్డల సాహిత్యమే అన్నారు. ఈ సమావేశం లో కాత్యాయనీ విద్మహే, కాసుల ప్రతాప్ రెడ్డి లు ప్రసంగించారు. రెండవ సమావేశం లో నవలా సాహిత్యం మీద శ్రీ కాలువ మల్లయ్య ప్రధాన ప్రసంగం చేయగా, వసంతరావు దేశ్పాండే, బన్న ఐలయ్య లు మాట్లాడారు. మూడవ సమావేశం లో జానపద కళారూపాల పై రావి ప్రేమలత, మలయశ్రీ లు మాట్లాడారు. చివరన మిద్దె రాములు ఒగ్గు కథ గొప్ప ఆకర్షణ. ఇక రెండవ రోజు ‘పాట’ అన్న అంశంపైన సదస్సుకు శ్రీ బి.నరసింగ రావు తెలంగాణా జీవన చిత్రాన్ని మన పాటలు ప్రతిబింబిస్తాయన్నారు. తెలంగాణా పాట పైన అందెశ్రీ సోదాహరణ ప్రసంగం చేసారు. ఆనాటి సదస్సుకు రావాల్సిన శ్రీ సుద్దాల అశోక్ తేజ అనివార్య  కారణాల వలన రాలేకపోయారు. దాంతో నేనే వెళ్లి సిద్దిపేట  నుంచి విచ్చేసిన నందిని సిధారెడ్డి ని సంప్రదించాను. దేశపతి శ్రీనివాస్ ని పిలుస్తానని ఒక మాట చేప్పమని అడిగాను. అదేంది నువ్వే అడుగు భై అన్నాడు. నేను దేశపతి ని అడిగాను.. ప్రిపేర్ కాకుండా ఎట్లా సార్ అన్నాడు. మీరు పాట గురించి చెప్పగలరు.. మంచి పాటలు పాడండి అన్నాను. సరే నన్నాడు. ఇక ఏముంది పాటల సెషన్ అందెశ్రీ, దేశపతి పాటలతో హోరెత్తిపోయింది. తర్వాత కవిత్వం పైన జరిగిన సభలో డాక్టర్ నాళేశ్వరం శంకరం, డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, డాక్టర్ నలిమెల భాస్కర్ లు మాట్లాడారు. ఇక ఆ తర్వాతి కవిసమ్మేళనానికి  డాక్టర్ నందిని సిధారెడ్డి అధ్యక్షత వహించగా డాక్టర్ దేవరాజు మహారాజు అతిథిగా హాజరయ్యారు. సాయంత్రం ముగింపు సమావేశానికి శ్రీ బి. నరసింగ రావు అతిథి. మొత్తం మీద రెండు రోజులపాటు  ‘తెలంగాణా మాండలిక సాహిత్యం’ అన్న అంశం పైన జరిగిన సదస్సు గొప్ప ప్రేరణాత్మకంగా  జరిగింది. కొత్త ఆలోచనలకు, సరికొత్త ఉద్వేగాలకూ పాదులు వేసింది. మొత్తం తెలంగాణా కవుల్ని రచయితల్నీ కళాకారుల్నీ ఒక్క వేదిక మీదికి తెచ్చి భావిష్యత్తు లో తెలంగాణా ఉద్యమంలో భావనాత్మక మయిన  భూమికను పోషించేందుకు దోహదం చేసింది. గోపు లింగారెడ్డి చొరవ, మచ్చ హరిదాస్ నిబద్దత మిగతా అధ్యాపకుల సహకారం ఎన్నదగింది. అట్లా ఎస్.ఆర్.ఆర్. కాలేజీ నూతన తెలంగాణా సాహిత్యోద్యమానికి దారులు వేసింది. అందులో నేనూ భాగం కావడం ఒక స్ఫూర్తి, ఒక  యాది.            

   ఫెబ్రవరి 2002లో దామోదర్ సార్ పదవీ విరమణ విజయవంతంగా జరిగింది. ఆయన స్థానంలో భౌతిక శాస్త్ర విభాగం హెడ్ శ్రీ వై.వామన్ గారు పూర్తి అదనపు బాధ్యతలతో ప్రిన్సిపాల్ అయ్యారు. చాల సౌమ్యుడు. సరదాగా  వుండే వాడు. కామర్స్ ఏ.ఆనందరావు, పీ.డీ. లక్ష్మిరాజం అన్నా, మొత్తంగా బాగా కమిట్టేడ్ గా పని చేసేవాల్లంటే చాలా అభిమానంగా చూసేవాడు వామన్ సార్. ఎలాంటి వాదాలకూ వివాదాలకూ తావు లేకుండా గడించింది ప్రిన్సిపాల్ గా ఆయన పదవీకాలం. ఆయన పాలన గురించి చెప్పుకుంటే ఒక విషయం గుర్తొస్తుంది. వార్షిక పరీక్షలప్పుడు పరీక్షల ఇన్విజిలేటర్లు అందరికీ చాయ్ బిస్కిట్ ఏర్పాటు చేసాడు. అదెట్లా సార్ అంటే పైసలు మిగుల్తాయి భై  ఏం జేసుకుంటాం. బిస్కిట్ ఖావో చాయ్ పీవో అన్నాడా ఆదిలాబాద్ బిడ్డ. అంతకు ముందు ఆతర్వాత ఆ ఆనవాయితీ లేదు.

***

ఆ ఏడు ఎస్.ఆర్.ఆర్. కాలేజీ ఆవరణలో జరిగిన ఒక మహాసభ ఇప్పటికీ నా ఒక్కడికే కాదు సమస్త తెలంగాణా వాసుల మనస్సుల్లో స్థిరంగా వుంది. అదొక ‘యాద్గారీ సభ’. అదే కరీంనగర్ ‘సింహగర్జన’. 17 మే 2001 రోజున కాలేజీ భవనం వెనకాల వున్న స్పోర్ట్స్ మైదానంలో ఆ సభ ఏర్పాటయింది. అప్పుడప్పుడే తెలంగాణా మొత్తం మీద ప్రత్యేక తెలంగాణా భావన, కోరిక ఉద్యమ స్ఫూర్తి రగులుతున్నది. ఆనేపధ్యం లో కే.చంద్రశేఖర రావు టీ.ఆర్.ఎస్. రాజకీయ పార్టీని స్థాపించాడు.  ఆ నాటి సభకు హైదరాబాద్ జలదృశ్యం నుండి రెండు వందల వాహనాలతో కే.సి.ఆర్., ఇతర నాయకులు బయలుదేరారు. దారి పొడుగునా ప్రజలు వారికి నీరాజనాలు పలికారు. ఆ నాటి సభలో ఆచార్య జయశంకర్, జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు శిబూ సోరెన్ తదితరులు హాజయ్యారు. ఆ సభ ప్రారంభం నుండి ఒక ఊపుతో సాగింది. హైదరాబాద్ నుంచి అనేక మంది ప్రొఫెసర్లు, రచయితలు కళాకారులు స్వచ్చందంగా పాల్గొన్నారు. మా మిత్రులు డాక్టర్ జే. మనోహర్ రావు, కే.దామోదర్ రెడ్డి, నారదాసు లక్ష్మన్ రావు సంతోష్ ఇట్లా అనేక మంది సభలో వున్నారు. సభ తర్వాత సెయింట్ జాన్స్ స్కూలు పక్కనే నివాసముంటున్న కవి మిత్రుడు దర్భశయనం ఇంట్లో చాలా రాత్రివరకు వుంది ఇల్లు చేరుకున్నాను. తెలంగాణా ఉద్యమానికి ఎస్.ఆర్.ఆర్.కాలేజీ అందించిన భూమికలు ఈ సదస్సు, సభలు.

……

కాలేజీ విషయాలిట్లా వుండగా నాకు వ్యక్తిగతంగా ఒక డాక్యుమెంటరీ ఫిలిం చేసే అవకాశం దాదాపు అదే సమయంలో లభించింది. కరీంనగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యం లో పక్కనే వున్న రేకుర్తి గ్రామంలో చారిటబుల్ కంటి దవాఖానా నిర్వహిస్తున్నారు. దానికి మౌలిక ఆలోచనతో పాటు ఆసుపత్రి ఏర్పాటు దాకా అన్నీ డాక్టర్ డాక్టర్ భాస్కర్ మాఢేకర్ గారే. ఆయన కరీంనగర్ లో సేనియర్ ఫిజిషియన్. అత్యంత నిబద్దత తో ఆ ఆసుపత్రిని నిలబెట్టారు. దాని పైన నేను ఈనాడుకు రాస్తున్న సమయం లో “చీట్లోంచి… వెల్తురు లోకి” అన్న మంచి వివరణాత్మకమైన వార్తా కథనం రాసాను. నాకు ఆ ఆసుపత్రి అన్నా డాక్టర్ భాస్కర్ మాఢేకర్ అన్నా ఎనలేని గౌరవం. ఎక్కడి నుంచో కరీంనగర్ కు వచ్చి నిస్వార్థ వైద్యసేవలు అందించడం తో పాటు పేద ప్రజానీకం కోసం ఉచిత కంటి ఆసుపత్రిని నెలకొల్పి నిర్వహించడం మామూలు మాట కాదు.అదీ ఆకాలం లో.  అలాంటి డాక్టర్ భాస్కర్ మాఢేకర్ ఒక రోజు నన్ను పిలిచి ఆసుపత్రి పైన ఒక డాక్యుమెంటరీ లాంటిది తీయాలి. చేయగలరా అన్నాడు. ఏముంది ఎగిరి గంతేసాను. మనమే చేద్దాం సార్ అన్నాను. మా మిత్రుడు కఫిసో అధ్యక్షుడు ఎడమ నారాయణ రెడ్డి షాప్ పక్కనే వున్న రాజు ఆర్ట్స్ రాజును సంప్రదించి ఆయన్ను ఫోటోగ్రాఫర్ గా ఎంచుకున్నాను. టీ.వీ.నారాయణ, రాజేశ్వర్ రావు ఇలా పలువురి సహకారం తీసుకున్నాను. మా కాలేజీ కామర్స్ అధ్యాపకుడు డాక్టర్ దామోదరస్వామి స్వరం చాలా బాగుంటుంది. ఆయనను వాయిస్ ఓవర్ కు వినియోగించుకున్నాను. అతి తక్కువ ఖర్చుతో ఆ ఫిలిం చేసాను. ఆసుపత్రిలో కంటి వైద్యులు డాక్టర్ శ్రీకృష్ణ ఇంగ్లే, డాక్టర్ శ్రీధర్ లు చాలా బాగా సహకరించారు. టెస్టింగ్ నుంచి ఆపరేషన్ దాకా మొత్తం షూట్ చేసాం. చాలా బాగా వచ్చింది. డాక్టర్ భాస్కర్ మాఢేకర్ గారు కూడా ఎంతో సంబర పడ్డారు. దేశంలోని ఇతర క్లబ్స్ కి హాస్పిటల్స్ కి సేమినార్స్ కి పంపించారు. నాకూ అదొక మంచి అనుభవం గా మిగిలింది.

అట్లా ఆ ఏడు పలు కార్యక్రమాలతో సాగింది…

మిగతా మళ్ళీ వారం..

-వారాల ఆనంద్           

 18 డిసెంబర్ 2022                  

జావేద్ అఖ్తర్- ఓ లౌకిక స్వరం

Posted on

++++++ వారాల ఆనంద్

జావేద్ అఖ్తర్- ఓ లౌకిక స్వరం

++++++ వారాల ఆనంద్

జావేద్ అఖ్తర్ ప్రతిభావంతమయిన కవి.

సూటిగా తన భావాల్ని ఎలాంటి వెరపూ, బెదురూ లేకుండా ప్రకటిస్తున్నసామాజిక గొంతుక ఆయనది. 

ఇవ్వాళ మన దేశంలో అత్యంత ప్రభావవంతమయిన స్వతంత్ర లౌకిక స్వరం జావేద్ అఖ్తర్.  

భావుకుడూ, ప్రగతిశీల వాది అయిన జావేద్ అఖ్తర్  ఏడు తరాల సాహిత్య చైతన్యమున్న కుటుంబంలో జన్మించాడు. జావేద్ తండ్రి జాన్ నిసార్ అక్తర్ ప్రముఖ ఉర్దూ కవి సినీ గీత రచయిత. జావేద్ అఖ్తర్ తాత ముజఫర్ ఖరబాది కవిత్వం ఉర్దూ సాహిత్య ప్రపంచంలో మైలురాయి లాంటిదని భావిస్తారు. ఇంకా జావేద్ మేనమామ మజాజ్ కవిత్వం కూడా ఉర్దూ లో ప్రముఖ మయిందే. జావేద్ అక్తర్ తన కవిత్వం మత తత్వానికి, సామాజిక అన్యాయాలకూ వ్యతిరేకంగా రాసాడు. జాతీయ సమక్యత, స్త్రీల హక్కులకోసం మాట్లాడాడు రాసాడు. తప్పు దోవ పట్టిన యువతనుద్దేశించి జావేద్ రాసిన గీతాన్ని 1995 లో కేండ్ర మానవ వనరుల శాఖ యువతకోసం ‘జాతీయ గీతం’గా ప్రకటించింది.

   జావేద్ అఖ్తర్ 1980లో సీరియస్ గా కవిత్వం రాయడం ఆరంభించాడు. ఆయన 1995 లో ఆయన మొట్ట మొదటి కవితా సంకలనం ‘టార్ఖాష్’ వెలువడింది. మొదటి సంకలనమే కవిత్వాభిమానుల్నుంచి విమర్శకులనుంచి  ప్రశంసల్ని అందుకుంది.ఇప్పటికే అది హిందీలో 10, ఉర్దూలో అయిదు ముద్రణలు పొందింది. అంతేకాదు మన దేశంలో మొదటి ఆడియో బుక్ గా కూడా ప్రాచుర్యం పొందింది.

    గ్వాలియర్ లో పుట్టిన జావేద్ లక్నో అలిఘర్, భూపాల్ లలో ఎదిగారు. బాంబే చేరిన తర్వాత ఆయన పరిది  బాగా విస్తారమయింది. చిన్నప్పుడు ఆయన జీవితం చాలా చిత్రంగా గడిచింది. తండ్రి బాంబే లో ఉండేవాడు. తల్లి అప్పటికే మరణించింది. జావేద్ తన అమ్మమ్మ తాతయ్యల దగ్గర లక్నోలో పెరిగాడు. నెలకు 15 రూపాయల జీతం మీద చదువు చెప్పే ట్యూషన్ మాస్టర్ వద్ద చదువు నేర్చుకోవడం మొదలు పెట్టాడు. తనకు రోజూ ఉదయం ఆఠాణ, సాయంత్రం ఒక అణా ఇచ్చేవారని వాటితో ఉదయమే రాంజీ లాల్ షాపులో రంగుల మిఠాఈలు సాయంత్రం భగవతీ షాపులో చాట్ తినేవాన్నని జావేద్ ఒక చోట రాసుకున్నాడు. కనీసం మెట్రిక్ అన్నా పూర్తిచేయి పోస్ట్ ఆఫీసులో చిన్న ఉద్యోగామయినా దొరుకుతుంది అనేవాడు జావేద్ తాత. తర్వాత జావేద్ ను ఆయన అత్తగారి వూరయిన అలిఘర్  పంపించారు. ‘ వీడిని జాగ్రత్తగా చూడండి..వీడికి చదువుకంటే సినిమా పాటలంటే ఎక్కువ ఇష్టం’ అక్కడ స్కూల్లో చేర్పిస్తూ మామ టీచర్ తో అన్నాడంట. ఎందుకంటే అప్పటికే జావే కి  ‘ఉరన్కా ఠోళా’, ‘శ్రీ 420’ లాంటి సినిమాల పాటలతో పాటు అనేక పాటలు నోటికి వచ్చేవంట.  తర్వాత కొంత కాలం భూపాల్ లో తన సవతి తల్లి ఇంట్లో వున్నాడు. కాని అక్కడ ఆ ఇంట్లో ఎక్కువ కాలం ఉండలేక మిత్రులతో కలిసి ఉంటూ కాలేజీ చదువుని పూర్తి చేసాడు. అప్పుడే మిత్రుడు ముస్తాక్ ద్వారా దేశ విభజన గురించీ అప్పుడు జరిగిన అరాచకాల గురించీ విన్నాడు.

తర్వాత అక్టోబర్ 1964 బాంబే చేరుకుని తండ్రి వద్ద వున్నాడు. కానీ కేవలం వారం తిరగ కుండానే ఇల్లు వదలాల్సి వచ్చింది. జేబులో 25 పైసలున్నాయి రెండేళ్ళ పాటు అష్ట కస్తాలు పడ్డాడు ఒక చిన్న సినిమాకు మాటలు రాసి వంద రూపాయలు సంపాదించాడు. అనేక సార్లు పలువురికి సహాయకుడిగానూ, ఘోస్ట్ రచయితగానూ పనిచేసాడు. సంవత్సరానికి పైగా కమల్ స్టూడియో లో వున్నాడు జావేద్. అందులో ఎక్కడ పడితే అక్కడ పడుకునేవాడు. అప్పుడే అంధేరీ లో వున్న ఒక సెకండ్ హాండ్ బుక్ స్టాల్ వాడి పరిచయం తో జావేద్ చదివెందుకు పుస్తకాలకు కొదువ లేకుండా పోయింది.తర్వాత కొంతకాలం మిత్రుడు జగదీష్ తో కలిసి బాంద్రాలో మహాకాళి కేవ్స్ లో వున్నాడు. అప్పుడే తన విజయవంతమయిన పార్టనర్ సలీం ఖాన్ తో స్నేహం ఏర్పడింది. ప్రధాన స్రవంతి హిందీ సినిమాలకు ఒక సరికొత్త దారి చూపిన వాడు జావేద్. ఆయన తన మిత్రుడు సలీం ఖాన్ తో కలిసి రాసిన స్క్రీన్ ప్లే లు 70వ దశకం మధ్య నుండి ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి. దాంతో వారికి మొట్ట మొదటి విజయవంతమయిన సినిమా రాసే అవకాశం వచ్చింది.దాన్నే సినిమా భాషలో ‘బ్రేక్ ‘ అంటారు. ఆ జంట రాసిన మొట్ట మొదటి సినిమా ‘హాతీ మేరె సాథీ’. ఒక రోజు రాజేష్ ఖన్నా వారి దగ్గరికి వెళ్లి దక్షినాది సినీ నిర్మాత అయిన దేవన్ ఒక స్క్రిప్ట్ ఇచ్చాడు..మంచి అడ్వాన్స్ కూడా ఇచ్చాడు.. దాంతో నేను హీరో రాజ్ కుమార్ కు చెందిన బిల్డింగ్ అమ్మకానికి వస్తే అడ్వాన్స్ ఇచ్చేసాను.. కానీ స్క్రిప్ట్ చూస్తే ఘోరంగా వుంది.. అది చేస్తే ఇక దాంతో నా ఫిలిం కారీర్ అంతే  సంగతులు..అందుకే దాన్ని సరిచేయండి.. ఇంటికిచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వరు. ఎట్లాగయినా చేసి ఈ స్క్రిప్ట్ ను మెరుగు పరచండి లేదా తిరగ రాయండి అని కోరుకున్నాడు. వాళ్ళు రాసిన స్క్రిప్ట్ ఆధారంగా తీసిన ‘హాతీ మేరె సాథీ’  సూపర్ హిట్ అయింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో  సలీం జావేద్ ల జంట హిందీ సినీ రంగంలో హాట్ కేక్ గా మారింది.

    ఆ తర్వాత సీతా అవుర్ గేత  సమయంలో జావేద్ అఖ్తర్ కి హనీ ఇరానీ తో పరిచయం కావడం అది పెళ్లిదాకా వెళ్ళింది. ఇద్దరు ఒకటయ్యారు. వారిద్దరికీ జోయా, ఫర్హాన్ లు జన్మించారు.

    జావేద్ అఖ్తర్ తండ్రి జాన్ నిసార్ 18 ఆగస్ట్ 1976న మరణించాడు. చనిపోతూ తన చివరి పుస్తకాన్ని జావేద్ కి ఇస్తూ దాని పై ఇట్లా రాసాడు’నేను వెళ్లి పోయిన తర్వాత నన్ను గుర్తు చేసుకుంటావు..’ అప్పటిదాకా తండ్రి పట్ల సానుకూలంగా లేని జావేద్ కన్నీటి పర్యంతం అయ్యాడు. 1979 తన మొదటి కవిత రాసాడు. అప్పుడే జావేద్ కి షబానా ఆజ్మీ తో పరిచయం ఏర్పడింది. కైఫీ ఆజ్మీ కూతురు అయిన షబానా కు కూడా అప్పుడే జీవితం పట్ల అనేక ప్రశ్నలు, అనుమానాలూ వస్తున్న సమయం అది. అప్పుడే వారిద్దరి నడుమా సాన్నిహిత్యం పెరిగింది. 1983లో హనీ ఇరానీ, జావేద్ లు విడిపోయారు. కానీ స్నేహంగానే వున్నారు పిల్లలు ఇద్దరు కూడా తల్లిదండ్రుల పట్ల వ్యతిరేకత పెంచుకోలేదు. జావేద్ షబానా ల జీవితం సాఫీగానే సాగుతున్నది.

జావేద్ అందుకున్న అవార్డులకు లెక్కేలేదు. ఆయన సినిమా పాటలకు అయిదు సార్లు జాతీయ అవార్డులు వచ్చాయి. నాలుగు సార్లు ఫిలిం ఫేర్, జీ,ఐఫా అవార్డులు లభించాయి. జాతీయస్థాయిలో పద్మభూషణ్,అవధ రత్న, జాతీయ సమగ్రత లో ఇందిరా గాంధీ అవార్డు లభించాయి.ఆయన హార్వార్డ్, కొలంబియా,బర్కిలీ, మేరీ లాండ్, కేంబ్రిడ్జ్, ఆక్స్ ఫర్డ్, జే.ఎన్.యు., అలీ ఘర్, విశ్వభారతి లాంటి అనేక విశ్వవిద్యాలయాల్లో ప్రసంగించారు.          

     అట్లా జావేద్ కారీర్ కవిగానూ, సినిమా పాటల రచయితగానూ, స్క్రిప్ట్ రైటర్ గానూ ఎదుగుతూ వచ్చింది.

ఫలితంగా సలీం-జావేద్ లు జంట గా అందాజ్, సీతా అవుర్ గీతా, యాదోన్కీ బారాత్, జంజీర్,దీవార్, షోలే..డాన్, త్రిశూల్ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అంతేకాదు హిందీ సినిమాలకు ‘ఆంగ్రీ యంగ్ మాన్’ అన్న పాత్రను అందించింది. అప్పటి ఆ విజయాల మీద అంగ్రీ యంగ్ మాన్ కారెక్టర్ మీద పరిశోదనలు కూడా జరిగాయి. వాళ్ళు రాసిన 24 సినిమా  స్క్రిప్తుల్లో 20 హిట్లు. ఆ తర్వాత ఆజంట విడిపోయింది. 1981 సలీం జావేద్ ల జంట విడిపోయాక జావేద్ అఖ్తర్ చాలా సినిమాలకు స్క్రిప్ట్ రచన చేసాడు. వాటిల్లో సాగర్, మిస్టర్ ఇండియా, బెతాబ్, లక్ష్య లాంటి విజయవంతమయిన సినిమాలకు రాసాడు.    

 తర్వాత జావేద్ అఖ్తర్ ఫిలిం లిరిక్స్ వైపు కదిలాడు.ఆయన రాసిన సినీ గీతాలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. అయితే కైఫీ ఆజ్మీ ఒక చోట ఇట్లా అంటాడు..’మొదట సమాధి తవ్వి తర్వాత దానికి సరిపడే శరీరాన్ని వెతకడం సినీ గేయ రచయితల పని’ అయితే జావేద్ అఖ్తర్ తనసినీ గీతాలతో అద్భుతమయిన రూపాల్ని చిత్రించాడు. సినీ గీత రచయితగానే కాకుండా జావేద్ అఖ్తర్ గొప్ప కవి. ఆయనరాసిన కవితలు గజల్ సూటిగా స్పష్టంగా మనసుకు హత్తుకుంటాయి. ఆయన కవితా సంకలనాలు ‘టర్కష్’ 1995 లో వచ్చింది, తర్వాత ‘లావా’ 2012 లో వెలువడింది. లావా కు ఆయనకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది. ఈ రెండు సంకలనాల్లోంచి ఎంపిక చేసిన కవితల సమాహారమే ‘ఇన్ ఆదర్ వర్డ్స్’

 అందులో ఆయన కాలాన్ని గురించి..

కాలమంటే ఏమిటి,

అలుపూ విరామమూ లేకుండా

సాగిపోతున్నది

అడట్లా ప్రయానిన్చాకుండా వుంది వుంటే

అదేక్కడుండేది

ఎక్కడో ఒక చోట వుండేది కదా… అంటూ గొప్ప తాత్వికత తో రాస్తాడు.

…..

జావేద్ అఖ్తర్ దుఖం గురించి కేవలం తన దుఖం గురించే అందరి దుఖాల గురించీ స్పందిస్తాడు. దుఖం అమ్మడాన్ని గురించి చెబుతూ…

మ్మకానికి దుఖాలు

అంగట్లో దుఖాలు అమ్ముతారు

వ్యాపారం హాయిగా సాగితే

దుఖాలు మంచి ధరకే అమ్ముడవుతాయి

వినియోగదార్లు ఉద్వేగంలో

చిన్నవో పెద్దవో దుఖ బొమ్మల్ని

ఏ ధరకయినా కొంటారు

నేనెప్పుడూ నా దుఖాల్ని

మంచి ధరకే అమ్మాను

కానీ ఇవ్వాళ

నాకు కలిగిన దుఖాన్ని

ఏ దుఖానపు షో కేసులో వుంచలేను

నా దుఖాల్ని అమ్మలేక పోతున్నందుకు

మొట్టమొదటి సారిగా

సిగ్గుపడుతున్నాను.. అంటాడు

….

ఇట్లా ఆయన కవిత్వమంతా ఆయన ఆత్మనుండి ఒక ప్రవాహంలా సాగుతుంది. హృదయపు లోతుల్నుండి పెల్లుబుకుతుంది.

ఈ సంకలనం నిండా వర్తమాన అవ్యవస్థ గురింఛి తనకోపమూ, తన తాత్వికత, వేదన దుఖం, ప్రశ్న జవాబు ఇట్లా అనేకానేక స్థితులు ఆవిష్కరించాడు జావేద్ అఖ్తర్. తన కవిత్వం నిండా వర్తమాన మత చాందస వాదం గురించీ ఖండిస్తూ రాసాడు. మాట్లాడాడు. ప్రశించడమే తన తత్వమని అనేక సందర్భాల్లో నిరూపించాడు జావేద్.

ఇక పార్లమెంట్ సభ్యుడిగా ముందుండి మేధో హక్కుల గురించి,కాపీ రైట్ చట్టం గురించీ పోరాడి సాధించాడు.

ఆయన ‘ఇన్ ఆదర్ వర్డ్స్’ లోంచి కొన్ని కవితలకు నేను చేసిన స్వేచ్చానువాదాలు కొన్ని….

నా ప్రాంగణం – నా చెట్టు

————

మా ప్రాంగణం

ఎంతో పెద్దగా మరెంతో విశాలంగా వుండేది  

అప్పుడు నేను నా ఆటలన్నీ అందులోనే  ఆడేవాణ్ణి

ఆ ప్రాంగణానికి ఎదురుగా

నా కంటే ఎంతో ఎత్తుగా

ఓ చేట్టుండేది

నేను పెద్దవాడినయ్యాక

ఎప్పటికయినా

ఆ చెట్టు చివరి అంచును తాకుతానని

నాకెంతో నమ్మకం వుండేది

ఏళ్ళు గడిచాక

ఇంటికి తిరిగొచ్చి చూస్తే

మా ప్రాంగణం ఎంతో చిన్నగా అనిపించింది

కాని

ప్రాంగణం ఎదురుగా వున్న చెట్టు మాత్రం

అప్పటికంటే మరెంతో పెరిగి పెద్దదయింది

*****

ఉదయపు కన్య

—————-

నల్లటి రాత్రి దుప్పట్లో

ముఖం కప్పుకొని

ఉదయపు కన్య

దీర్ఘ నిద్రలో వుంది

ఆమె తన దుప్పటి కంతల్లోంచి

తొంగి చూడదు

ఒక మాటా పలుకదు

సూర్యుణ్ణి ఎవరో దొంగిలించుకు

పోయినప్పటినుండీ

ఆమె విసుగు విసుగ్గా వుంది

రండి మనం

సూర్యుణ్ణి వెతుకుదాం

సూర్యుడు దొరకకుంటే

ఒక్కో కిరణాన్నీ జమ చేసి

మరో కొత్త సూర్యుణ్ణి నిర్మిద్దాం

చాలా సేపటినుండీ

ఉదయపు కన్య

అలిగి నిద్రపోతున్నది

రండి

ఆమెను మేల్కొల్పుదాం

ఊరడిద్దాం

******

పజిల్

——-

ఒకప్పుడు

మనిద్దరం కేవలం రెండక్షరాలం

ఒకరోజు ఇద్దరం కలిసాక

పదంగా రూపొందాం

దానికి మనమో అర్థాన్ని కనుగొన్నాం

అప్పుడు ఎదో జరిగింది

ఇప్పుడు

ఓ చతురస్రం లో

నువ్వో అక్షరానివి

మరో చతురస్రం లో

నేను ఇంకో అక్షరాన్ని

ఇద్దరి నడుమ 

ఎన్ని చతురస్రాల క్షణాలు

ఖాళీగా వున్నాయో

మళ్ళీ ఓ పదం రూపొందవచ్చు

దానికి మనం ఓ అర్థాన్నీ కనుగొనవచ్చు

కానీ

ఈ ఖాళీ చతురస్రాల్ని ఎట్లా పూరించాలో

ఆలోచించాలి

******

ప్రకీర్ణకం (మొంతేజ్)

——————————–

నిద్ర మబ్బుల వెనకాల

ఓ నవ్వుతున్న ముఖం

ఆ ముఖం మీద జాలువారిన

పట్టు దారాల్లాంటి ముంగురులు

మంద్రంగా శబ్దించే వస్త్రాలు

కలవరపడుతున్న రెండు కళ్ళు

ఓ సమావేశం

ఓ ఆహ్లాద క్షణం

నిలకడగా సరస్సులో నీరు

చెట్టుపై కిచ కిచలాడుతున్న పక్షి

గడ్డిపై విచ్చుకుంటున్న చిన్న మొగ్గ

అందమయిన పెదాల పై సున్నితమయిన మాటలు

పసుపువర్ణపు పగలు

మంచు లాంటి చల్లని స్వరం

పగిలిన అద్దం

గాలిలో తేలుతున్న కాగితం ముక్కలు

కూలిన వంతెన

పూర్తికాని రహదారి

విచ్ఛిన్నమయి చీలిపోతున్న దృశ్యం

కనురెప్పలపై మెరుస్తున్న కన్నీళ్లు

నిద్ర మబ్బుల వెనకాల

లోతయిన నిశ్శబ్దం ధ్వనిస్తున్నది

*********

విరహం

—————

నేనో కవిత రాసినప్పుడు

లేదా

కొత్తగా ఏదయినా చదివినప్పుడు

ఏదయినా అసాధారణ విషయం విన్నప్పుడు

నవ్వొచ్చినప్పుడు

ఏదయినా మాట ఆసక్తి కలిగించినప్పుడు

లేదూ 

ఓ అసలయిన భావం స్పురించినప్పుడు

ఏదయినా ఓ అద్భుత దృశ్యం

నా హృదయాన్ని తాకినప్పుడు 

వాటిని

నా మనసంతరాలల్లో దాచుకుంటాను

మనం కలుసుకున్నప్పుడు

నీతో పంచుకోవాలనుకుంటాను

************

వారాల ఆనంద్

జావేద్ అఖ్తర్- ఓ లౌకిక స్వరం

++++++ వారాల ఆనంద్

72= యాదొంకి బారత్++++++వారాల ఆనంద్

Posted on

72= యాదొంకి బారత్
++++++++++++
-వారాల ఆనంద్

ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కాలేజీలో ఉద్యోగంలో చేరడం నా జీవితం లో పెద్ద మార్పు. అప్పటికి రెండు దశాబ్దాలపాటు బస్సులు ఎక్కి దిగి ఉద్యోగం కోసం పరుగులు పెట్టిన శరీరానికి పొతంగా ఒక చోట వుండి నిలబడి పని చేయడం పెద్ద ఊరటే మరి. 1980లో మంథని జూనియర్ కాలేజీలో కొంత అయిష్టంగానే చేరినప్పటి నుండీ కరీంనగర్ కేంద్రంగానే ఉంటూ ఉద్యోగం చేసాను. మంథని. సిరిసిల్లా, గోదావరిఖని, చొప్పదండి, అగ్రహారం ఇవీ నేను పనిచేసిన వూర్లు. సిరిసిల్లాలో వున్న కొంతకాలం వేములవాడలో బస. అంతే తప్ప మిగతా అన్ని రోజులూ అప్ అండ్ డౌన్…బాఘ్..దౌడ్. బస్సుల్లో లారీల్లో జీపుల్లో కొన్ని సార్లు మిత్రుల కార్లల్లో ఉరుకులూ పరుగులూ.. ఉద్యోగం ఏం చేసానో ఏం చేయలేదో అంచనా వేయలేను.. ఎందుకంటే దానికి దాఖలాలూ అస్సెస్మెంట్ సూత్రాలూ లేవు. మొత్తం మీద రెండు దశాబ్దాల ఉద్యోగజీవితం గడిచిపోయింది. కొంత సంతృప్తి మరికొంత అసంతృప్తి. జానే దేవో, బేఫికర్.
ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కాలేజీ ఉద్యోగానికి కొత్త. ఎంతగా నేను చదువుకున్న కాలేజీ అయినప్పటికీ పాత భవనం, ఆనాటి స్మృతులు పాతవే. కానీ 1977 నుంచి 2000 సంవత్సరం నాటికి ఎన్నో మార్పులు. కొత్త మనుషులు. కొత్త సిలబస్. చదువుల్లో కొత్త ఒరవడి. కొత్త వాతావరణంలో ఇమిడిపోవడం అంత సులభమేమీ కాదు. అది అతి త్వరలోనే నాకు అర్థం అయింది. నేను నాకున్న అనుభవం వేరు, నా ఆలోచనలు భిన్నం. అప్పటికి ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కాలేజీలో వున్న పద్దతులు వేరు. నేను మారిపోయి అప్పటికి వున్న పద్దతులతో సర్దుకుపోయే మానసికస్థితి కాదు నాది. అట్లని తొందరగా మార్పులు తేవచ్చుననే భ్రమలూ లేని వాణ్ని. అందులోనూ లైబ్రరీ అంటే పుస్తకాల చార్జ్ తీసుకోవడం పెద్ద గగనం. లెక్చరర్ అయితే టెక్స్ట్ పుస్తకం తీసుకుని క్లాస్ కు వెళ్ళడమే. కానీ లైబ్రరీ అనేసరికి పుస్తకాల లెక్క పక్కా చూసుకోవాలి. నిజానికి లైబ్రరీ చార్జ్ తీసుకోవడం ఇవ్వడం ఓ నరకం లాంటి పని. నేనయితే బదిలీ అయిన ప్రతిసారీ ఎదుర్కొన్న అనుభవాలు గుర్తు చేసుకుంటేనే వణుకు పుడుతుంది. చాలా కాలేజేల్లో ప్రిన్సిపాళ్లు సహకరిచారు. కానీ పలు సార్లు పోయిన పుస్తకాలకు డబ్బులు కట్టి వచ్చాను. బుక్స్ అన్నంక పోక తప్పదు. విద్యార్థులు ఎగ్గోట్టేవి కొన్ని, స్టాఫ్ వి కొన్ని, మనం ఉదారంగా మిత్రులకు ఇచ్చినవి కొన్ని అనేక కారణాలుంటాయి. అట్లాంటి స్థితి లో ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కాలేజీ లైబ్రరీ చాలా పెద్ద కలెక్షన్. డాక్టర్ వెల్చాల కొండల రావు గారు ప్రిన్సిపాల్గా వున్నప్పటి నుండీ కాలేజీ లైబ్రరీ పట్ల ఇక్కడ ప్రత్యేక శ్రద్ధ. నాకంటే ముందు దశాబ్దాలుగా పని చేసిన రెహమాన్, నారాయణ, నర్సయ్య సార్లు ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కాలేజీ లైబ్రరీ ని బాగా చూసుకున్నారు. కాపాడారు. నిలబెట్టారు. అయితే అక్కడ పుస్తకాలకు భిన్న అకౌంట్లు భిన్న రిజిస్టర్లు. సాధారణం ఒకటయితే, యుజీసీ, బుక్ బాంక్, ఎస్సీ కోటా ఇట్లా ఎన్నో. మేము చదివిన శాస్త్రమేమో ఒక లైబ్రరీకి ఒకే అక్సేస్సన్ రిజిస్టర్ అని చెప్పింది కాని అమలులో అట్లా లేదు. ఎట్లా అయితేనేం చార్జ్ తీసుకునే పని శురూ చేసినం. అది ఒక రోజుకో ఒక వారానికో తెమిలేట్టు లేదు. నాకు అసిస్టంట్ గా గోపయ్య, జయభారతి, తర్వాత సంజీవయ్య వున్నారు.
ఇదిట్లా ఉండగానే మొదట ‘రీడింగ్ రూమ్’ పని పట్టాలనుకున్నాను. నేను వెళ్లేసరికి విశ్వనాథ మందిరంలో ఉదయాన్నే అటెండర్ పేపర్లు వేసి వచ్చేవాడు. సాయంత్రానికి పిల్లలు చింపి, కొట్టుకుపోగా మిగిలినవి లైబ్రరీకి తెచ్చేవాళ్ళు. వచ్చే పేపర్లు ఎన్ని, మాగజైన్స్ ఏవీ అని ఆరా తీసాను. ఆఫీసు లో కొన్ని తీసుకుంటారని వాటికి ఎలాంటి లెక్కా పక్కా లేదని తెలిసి ఆశ్చర్య పోయాను. మోయిజ్ బుక్ స్టాల్ భాయికి చెప్పాను ఇట్లా కుదరదు. పేపర్ వేసే అబ్బాయికి చెప్పి కాలేజీ ఎంట్రన్స్ లో ఉంచిన బాక్స్ లో వేయాల్సిందేనని. దానికి వేసిన తాళం తీసి లైబ్రరీ అటెండర్ తీసుకురావాలి, రీడింగ్ రూమ్ గా ఉన్న విశ్వనాథ మందిరానికి వెళ్లి కూర్చోవాలి అని చెప్పాను. దానికి వెంటనే ఆఫీస్ ప్రసాద్ రావు నుంచి ప్రతికూలత రానే వచ్చింది. ఆఫీసుకు పేపర్ ఇచ్చిన తర్వాతే రీడింగ్ రూమ్ అంటాడు. ఆయన బిగ్గరగా మాట్లాడే సరికి నేను వెళ్లి అప్పటి ప్రిన్సిపాల్ వద్ద చెప్పాను. ఇదేమీ బాగా లేదు సర్. పిల్లల డబ్బులు సర్విస్ మొదట పిల్లలకే చెందాలి అన్నాను. అనుకోకుండా అప్పుడు అక్కడ మాజీ ప్రిన్సిపాల్ నర్సింగా రావు గారున్నారు. నొ ఆనంద్ అది నీ ప్రిరోగేటివ్ అన్నాడాయన. రాజిరెడ్డి గారు కూడా నేను చెబుతాను అది పద్ధతి కాదు అన్నారు. అది నా మొదటి విజయం. ప్రసాద్ రావు మాటను కాదన్నావా ఎదురులేదు పొ అన్న వారూ వున్నారు. అదేమీ లేదు మన బాధ్యత మనది అన్నాను. మరోసారి నేను ఎదో పనిమీద ఆఫీసుకు వెళ్తే అదే ప్రసాద్ రావు ఏం సార్ ఆఫీసు దిక్కు వస్తలేవు..రావాలి కూర్చోవాలి.. ఏదయినా పని చేయాలి అన్నాడు. నాకు అరికాలి మంట నెత్తికెక్కింది. అదేమీ కుదరదు. నా పని నాది మరోసారి ఇట్లా మాట్లాడితే బాగుండదు అన్నాను. వీడికి తల బిరుసు అనుకున్నాడో లేక నాకు ఎక్కడయినా దొరక్క పోతాడా అనుకున్నాడో ఏమో మౌనంగా వున్నాడు. అట్లా ఆఫీసుతో కొంత ఫ్రిక్షన్. వొద్దు సర్దుకు పొ అన్నవాళ్ళూ వున్నారు. నవ్వేసి ఊరుకున్నాను.కానీ ఆ ఆతర్వాత ప్రసాద్ రావు నాతోఎంతో బాగున్నాడు. స్నేహన్గానూ అభిమానంగానూ. కొద్ది రోజుల్లో మొత్తం మీద లైబ్రరీ చార్జ్ తీసుకోవడం అయిందనిపించి నరసయ్య సారును విముక్తున్ని చేసాం. క్రమంగా కాలేజీలోని అన్ని డిపార్ట్ మెంట్స్ లోకి వెళ్ళడం అందరినీ కలవడం ఆరంభించాను. అంతా ఆత్మీయంగా వున్న వాళ్ళే.
ఇదిట్లా ఉండగానే ఒక రోజు అనుకోని విధంగా నా జీవితంలో పెద్ద మార్పుకు దోహదం చేసే సంఘటన జరిగింది. నేను 80 ల్లో ఉస్యోగం లో చేరినప్పటి నుండీ ఎంతో స్నేహంగా ఆత్మీయంగా ఉన్నవాడు జంతు శాస్త్ర అధ్యాపకుడు శ్రీ యాద కిషన్. ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కాలేజీలో కూడా సహోద్యోగి అయ్యాడు. ఆయన కేవలం మిత్రుడిగానో సహచరుడిగానో మాత్రమే కాదు. ఎల్లప్పుడూ నా ఉన్నతిని కోరేవాడుగా వున్నాడు. ఆయన నా కెంతో అండా దండా. నా ఆసక్తులు బాగా తెలిసిన వాడు. అంతే కాకుండా ఇల్లూ ముంగిలీ అనకుండా సినిమాలూ, సాహిత్యమూ అంటూ తిరిగే నా గుణం బాగా చూసినవాడు. ఒక రోజు ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కాలేజీలో రికార్డ్ అసిస్టంట్ గా పని చేస్తున్న చంద్రశేఖర్ ఇంట్లో ఎదో చిన్న ఫంక్షన్ కోసం వావిలాలపల్లి లోని వాళ్ళ ఇంటికి వెళ్లాం. అక్కడ భోజనాలకు కొంత సమయముందని తెలిసి బ్యాంక్ కాలనీ లో వున్న మా ఇంటికి నేనూ కిషన్ సార్ వెళ్లాం. మేమప్పుడు పార్క్ పక్కన వున్న కిష్టా రెడ్డి వాళ్ళింట్లో కిరాయికి వున్నాం. ఇంట్లో ఆ మాటా ఈ మాటా కాగానే ‘ఏమమ్మా ఇంకా మీ ఆయనతో ఇల్లు కట్టించవా.. ఎన్ని రోజులు మంది ఇండ్లల్లో కిరాయిలకు వుంటారు’ అని కిషన్ సార్ మా ఇందిరతో అన్నాడు. ఆ మాట కోసమే ఎదురుచూస్తున్నట్టు ఎన్ని సార్లో చేప్పాను సార్. మీ ఫ్రెండ్ వింట లేడు అని తన వంతు ఫిర్యాదు చేసింది. నా ప్రాణానికి ఇల్లు విషయంలో ఒకరికి ఇద్దరయ్యారు. దాంతో కిషన్ లేదు ఆనంద్ చిన్నదో పెద్దదో ఇల్లంటూ వుండాలి గణేష్ నగర్ లో ఎప్పుడో తీసుకున్న స్థలం వుంది కదా మొదలు పెట్టు అన్నాడు. ‘భలే చెబుతారు పైసలెక్కడున్నాయి’ అన్నాను. ‘లోన్ ఇస్తారు కదా ఇంకేమీ చెప్పొద్దు కాగితాలు తీసుకుని రా, చారి అని ఒక ఇంజనీరు వున్నాడు, ప్లాన్ గీయిద్దాం’ అన్నాడు. ఇంకేముంది ఇందిర వెంట పడింది. దానికి ముందు అత్యంత ఆత్మీయుడు పండితుడు శ్రీ నమిలకొండ హరిప్రసాద్ దగ్గరికి వెళ్లాం. ఆయన మా ప్రతిపాదన వినగానే ఇంకేమీ ఆలస్యం చేయొద్దు ఆనంద్ వెంటనే ముందడుగు వెయి. నేనున్నాను అన్నాడు. వెంట వెంటనే ప్లాన్ గీయడం జరిగిపోయింది. మొదట గ్రౌండ్ ఫ్లోర్ లో నాలుగు షట్టర్లు వాటి వెనకాల ఒక్కోగదీ నిర్మించాలని ప్లాన్. ఇంజినీర్ ఎదో ప్లాన్ వేస్తే హరిప్రసాద్ వెళ్లి అట్లా కాదు అని బలవంతంగా మార్పించాడు. మా వాడికి ఇట్లాగే వుండాలి అని అటు రెండు ఇటు రెండు షటర్స్ నడుమ దారి. నాకేమో పెద్దగా ఏ ఆలోచనా లేదు. ప్లాన్, మున్సిపల్ పర్మిషన్ వచ్చేసింది. కిషన్ సారే ఒక మంచి సుతారిని చూపిస్తానని మేకల నర్సయ్య ను పరిచయం చేసాడు. స్థలమంతా తుమ్మలు తుప్పలతో నిండి వుంది మొదట శుభ్రం చేయాలి అని చెప్పాను. ఒక స్థలాన్ని చూపించాను. నర్సయ్య లేబర్ను పెట్టి శుభ్రం చేయించడం ఆరంభించాడు. ఆరోజు సాయంత్రానికి ఆ స్థలం యజమాని వచ్చి నా స్థలం ఎందుకు శుభ్రం చేస్తున్నారు అని అడిగేసరికి మేస్త్రి నర్సయ్య నా దగ్గరికి పరుగెత్తుకు వచ్చాడు.’ సార్ అది మీ ప్లేస్ కాదంట. గొడవగా వుంది’ అన్నాడు. ఏముంది ఇందిరలో ఆదుర్దా.. కాలేజీనుంచి రాగానే కాగితాలతో అక్కడికి వెళ్దాం ఆనాడు కిషన్. వెళ్లాం. ఆ స్థల యజమాని రాజి రెడ్డి కూడా వచ్చాడు. లోన ఎంతో కంగారు. మొత్తం ఆ ప్లేస్ అంతా తిరిగి చూస్తే నా స్థలం ఇంకొంచెం ముందు క్షేమంగా వుంది. హమ్మయ్య అనుకున్నాం. అరె జాగా తెలువకుండా ఎట్లా కొన్నావు.. ఇన్ని రోజులు ఎట్లున్నావ్ అని కిషన్ తో సహా మిత్రులంతా నా అమాయకత్వాన్ని చూసి జోకులేసారు… నిర్మాణ ఆటంకమేదయినా వుంటే దీంతో పోయింది పొ అన్నాడు హరిప్రసాద్. ఇక లోన్ ప్రాసెస్ జరగాలి.. అదే రోజు కరీంనగర్ ఫిలిం సొసైటీ కార్యవర్గ సమావేశం మానేర్ హోటల్ లో వుంది. అందరూ వచ్చారు. మీటింగ్ తర్వాత భోజనాలు కూడా అయ్యాయి. నరెడ్ల శ్రీనివాస్ అడిగాడు ఏమి సంగతని. ఏముంది ఇల్లు కడుదామని ప్లాన్. బ్యాంక్ లోన్ కోసం చూడాలి అన్నాను. ఎందుకు మేమియ్యమా అన్నాడు శ్రీనివాస్. నువ్వు మానకొండూరు లో బాంక్ మేనేజర్ వి కదా అన్నాను. అయితే ఏందీ నేనిస్తాను అంటున్నా కదా అన్నాడు. అంతేకాదు రేపు కాగితాలు తీసుకుని ఇందిరా నువ్వు మానకొండూరు బ్యాంక్ కు రండి అన్నాడు.
గొప్ప ఉత్సాహం కలిగింది. మర్నాడుదయం ఇద్దరం కాగితాలు తీసుకుని వెళ్లాం. రండి కూర్చోండి అంటూ ఆహ్వానించాడు శ్రీనివాస్. ఆయన కాగితాల్ని అట్లా తిరగేసాడు ఇంతలో టీ వచ్చింది. ఇక్కడ సతకం పెట్టు, ఇక్కడ నువ్వు అంటూ ఇందిరా చేత పెట్టించాడు. ఆ మాటా ఈమాట చెబుతూ ఇప్పుడు ఎన్ని డబ్బులు తీసుకేల్తావ్ అన్నాడు. ఏమిటీ అన్నాను ఆశ్చర్యంగా.. లోన్ సాంక్షన్ చేసాను నీ అకౌంట్ లో వేసాము.. డబ్బు మొత్తం తీసుకెళ్లడం కంటే ఎంత అవసరమో అంత తీసుకెళ్ళు అన్నాడు. మిగతా ఎప్పుడు అవసమయితే అప్పుడు చెప్పు నువ్వు వచ్చినా సరే, నన్ను తెమ్మన్నా సరే అన్నాడు. నా ఆశ్చర్యానికి అంతే లేదు. స్థలం చూడలేదు లోన్ ఇచ్చావా అన్నాను. నువ్వు భలే వున్నావు..నువ్వు ఎక్కడికీ పోవు నీ ఇల్లూ ఎక్కడికీ పోదు లోన్ ఇవ్వడానికి ఏముంది అన్నాడు శ్రీనివాస్. ముప్పైవేలు తీసుకుని తిరుగు ముఖం పట్టాము. అంతా కలలో జరిగినట్టు జరిగి పోయింది. అంటే ఒక కార్యాచరణ, కలిసి నిబద్దతతో చేసే ప్రయాణం మనుషుల్లో ఎంత విశ్వాసం కలిగిస్తుందో ఎంత మేలు చేస్తుందో అనుభవంలో తెలుసుకున్నాను. ఇంకేముంది ఇంటి పని వసంత పంచమి రోజున ముగ్గు పోసి ఆరంభించాం. మూడు నాలుగు ట్రాక్టర్ల మట్టి నింపి చదును చేసి చిన్న ఈవెంట్ లాగా చేసాం. ఆ రోజు నాన్న, తమ్ముడు అర్జున్,చెల్లెలు మంజు, మా పెదనాన్న కొడుకు వారాల మహేష్, నవీన వదిన, మిత్రులు కిషన్, కామర్స్ నారాయణ సార్, విభీషణ్ రెడ్డి వచ్చి అభినందించారు. అట్లా ఇంటికి ముగ్గు పోసే కార్యక్రమం పూర్తయింది.
.—
ఇదంతా వ్యక్తి గత విషయాలు ఇట్లా వుంటే కరీంనగర్ లో ఫిలిం సోసైటీ, సాహితీ గౌతమి కార్యక్రమాలు విశేషంగా జరుగుతూనే వున్నాయి. అప్పుడు జిల్లా కలెక్టర్ గా శ్రీమతి సుమిత్రా దావ్రా వున్నారు. తనకు సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలంటే అమితంగా ఇష్టం వుండేది. అప్పుడే ప్రెస్ భవన్ లో గౌతమి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి అన్న అంశం పైన కవిసమ్మేలనం జరిగింది. సుమితా దావ్రా ముఖ్య అతిథి. ప్రముఖ కవి శ్రీ ధర్భాశయనం శ్రీనివాసాచార్య అతిథి, కాగా గోపు లింగా రెడ్డి, కందుకూరి అంజయ్య లు వేదిక మీద వున్నారు. ఆ కవిసంమేలనంలో నాకూ ఒక జ్ఞాపికను ఇచ్చారు.
ఇక కరీంనగర్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యం లో జనవరి 4-10 వారం రోజుల పాటు జర్మన్ చలచిత్రోత్సవం నిర్వహించాం. ఆ ఉత్సవాన్ని యువక కేంద్ర సమనవ్యకర్త శ్రీ టీ.వీ.విద్యాసాగర్ రావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఆ ఉత్సవం లో ‘ ఆం ఐ బ్యూటిఫుల్’ ,‘లైఫ్ ఇస్ అల్ యు గెట్’, ‘ట్రైన్ అండ్ రోజెస్’, ‘నైట్ షేప్స్’, ‘వింటర్ స్లేపర్స్’, ‘బ్రేక్ ఈవెన్’ మొదలయిన సినిమాల్ని ప్రదర్శించాం. ఆ సినిమాలు సభ్యులని విశేషంగా ఆకర్షించాయి. ఆ ఉత్సవ ప్రారంభ సభలో టి. రాజ మౌళి, కోలా రామ చంద్ర రెడ్డి, నరేడ్ల శ్రీనివాస్,నేనూ మాట్లాడాం. జర్మన్ సినిమాల ఒరవడి గురించి నేను వివరించాను. వారం పాటు జరిగిన ఉత్సవం ఉత్సాహంగా ముగిసింది.
‘జాన్ అబ్రహం’ అవార్డు
దక్షిణ బారత ఫిలిం సొసైటీల సమాఖ్య ప్రతి ఏటా ఉత్తమ ఫిలిం సొసైటీకి ఇచ్చే జాన్ అబ్రహం అవార్డు 2000- 20001 సంవత్సరానికి గాను కరీంనగర్ ఫిలిం సొసైటీ ఎంపికయింది. ఆ ఏడు కఫిసో నిర్వహించిన గ్రామీణ ఫిలిం ఫెసివల్స్, చిల్ద్రెన్ ఫిలిం ఫెస్టివల్స్ తదితర కార్యక్రమాల ప్రాతిపకన ఆ ఎంపిక జరిగింది. ఆ అవార్డును అప్పటి FFSI VICE-PRESIDENT శ్రీమతి సాయి కుమారి చేతుల మీదుగా నేను, ఎడమ నారాయణ రెడ్డి, టి.రాజమౌళి, కోల రామ చంద్రా రెడ్డి కఫిసో పక్షాన స్వీకరించాము. ఆ సందర్భంగా నా విజ్ఞప్తి మేరకు దక్షిణ భారత ఫిలిం సొసైటీల సమాఖ్య వార్షిక సమవేశం కరీంనగర్ లో ఏర్పాటు చేసారు. అవార్డు అందించిన తర్వాత సభ విజవంతంగా జరిగింది. సభలో ప్రాంతీయ కార్యదర్శి చెన్నై కి చెందిన కళ్యాణ రామన్, మదురై కి చెందిన ఆర్.ఎస్.రాజన్, తిర్పూర్ కు చెందిన వీ.టీ. సుబ్రహ్మణ్యం, చేన్నైకే చెందిన కోదండ రామన్, హైదరాబాద్ కు చెందిన బి.హెచ్.ఎస్.ఎస్.ప్రకాష్ రెడ్డి తితరులు అనేక మంది పాల్గొన్నారు. సభ తర్వాత రాత్రి డిన్నర్ మా ఇంట్లో జరిగింది. అంతా ఇందిర చేసిన వంటలని SAMPTUOUS FOOD అంటూ కరీంనగర్ స్పెషల్ అంటూ ఎంజాయ్ చేసారు.
చాలా ఏళ్ల పాటు వారంతా ఎప్పుడు ఎక్కడ ఏ ఫిలిం ఫెస్టివల్ లో కలిసినా ఇందిరను ఆమె హోమ్లీ వంటకాల్నీ గుర్తు చేసేవాళ్ళు. అట్లా ఆ సంవత్సరం కరీంనగర్ ఫిలిం సోసైటీ కార్యక్రమాలు ఉత్సాహంగా ఫలవంతంగా జరిగాయి..
మిగతా వివరాలతో మళ్ళీ వారంకలుస్తాను
-వారాల ఆనంద్
11-12-2022

72= యాదొంకి బారత్
++++++++++++
-వారాల ఆనంద్