STORIES by VARALA ANAND

నాలుగు ద్వారాలు** వారాల ఆనంద్

Posted on

https://telugu.asianetnews.com/literature/varala-anand-poem-bsb-opk-s3fsy0

నాలుగు ద్వారాలు
** వారాల ఆనంద్

నేనో చతురస్రం
నా లోపల నాలుగు గోడలు
గొడగొడకో మూసిన తలుపు

ఓ తలుపు తెరిస్తే
గతం లోకి దారి తీస్తుంది
బారులు తీరిన జ్ఞాపకాలు
సంతోష తరంగాలు విషాదపు ఉప్పెనలు
అన్నీ ఉతికి పిండి ఆరేస్తాయి

అప్పుడప్పుడూ నేను ఆ తలుపు తెరిచి
అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను


  • రెండో తలుపు
    భవిష్యత్తులోకి దారి తీస్తుంది
    అంతా స్పష్టా స్పష్టం
    కాలం తన వెంట తోసుకెళ్తుంది

ఆ తలుపు తెరిచే వుంటుంది
అలసట ఎరుగని పాదాలు
ఆ దారెంట నడుస్తూనే వుంటాయి


  • మూడో తలుపు
    నాలోకి నా లోతుల్లోకి దారితీస్తుంది
    అక్కడున్న పెద్ద అద్దంలో నాకు నేనే కనిపిస్తాను

అద్దం అబద్దం చెప్పదు
అబద్దం చెప్పడం దానికింకా ఎవరూ నేర్పలేదు
అందులో నన్ను నేను చూసుకుంటాను
పొరలు పొరలుగా ముఖం మీది
ముసుగులన్నీ తొలగి నగ్నంగా
ఉన్నదున్నట్టు నాకు నేను దర్శనమిస్తాను
నాలోని చీకటీ వెలుగూ తెరలు తెరలుగా ముందుకొస్తాయి

ఒంటరితనం ఆవహించినప్పుడూ దుఖం కమ్మేసినప్పుడూ
మౌనంగా ఆ తలులోంచి అలా వెళ్ళి
నన్ను నేను పుటం బెట్టుకుని ఇలా తిరిగి వస్తాను


  • ఇక నాలుగో తలుపు తెరిస్తే
    ఎటు దారితీస్తుందో ఏమి వినిపిస్తుందో ఏమి కనిపిస్తుందో తెలీదు

స్తబ్దమయ లోకం లోకి దారితీస్తుందా
కాలమే తెలీని స్థబ్దతలోకి తీసుకెళ్తుందో తెలీదు
నేనెప్పుడూ ఆ తలుపు తెరవలేదు
తెరిచే ప్రయత్నమూ చేయలేదు
ఏమయినా ఎప్పటికయినా
ఆ తలుపు తెరవాల్సిందే
ఆ దారిగుండా వెళ్ళాల్సిందే

బతుకు నాలుగు గోడల చౌరాస్తా మరి
++++++++++++++++++++++++

100=యాదోంకీ బారాత్++++ వారాల ఆనంద్

Posted on

100=యాదోంకీ బారాత్

++++++ వారాల ఆనంద్

“నిన్ను తక్కువ చేసి చూసేవాడూ 

కించపరిచేవాడూ ఉన్నంత కాలం

ఎదుగుదలకు ఎరువు , పరుగుకు వేగం కొరత వుండదు…”.

నా బాల్యంలో మాటలు సరిగ్గా పలుకలేని స్థితిలో ఉమ్మడి కుటుంబంలో ఎదుర్కొన్న అవమానాలూ వెక్కిరింతలూ ఎంతో తీవ్రమయి ఒంటరితనానికి గురిచేశాయి. ఎంతగా అంటే ఏది మాట్లాడాలన్నా ఏది కావాలన్నా అమ్మా, నాన్నే. వారితోడిదే లోకంగా బతికాను. ఇక స్కూల్లో కూడా దామోదర్, వెంకటేశ్వర్ రావు, అయ్యగారి వెంకన్న, చింతకింది వేణు లాంటి ఏ ఒక్కరిద్దరో తప్ప దగ్గరి స్నేహాలు తక్కువే. అయితే చదువులో కొంత మెరుగ్గా వుండడంతో మరి కొంత మంది స్నేహంగా వుండేవాళ్లు. అదే స్థితి కాలేజీ దాకా సాగింది. సెలవుల్లో వేములవాడ వెళ్లినప్పుడు అక్కడి  మిత్రులు నాకెంతో అండగా తోడుగా వున్నారు. ఇక పోతే ఎస్.ఆర్.ఆర్.కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు ప్రిన్సిపాల్ శ్రీ కె.వై.ఎల్. నరసింహా రావు గారి హయాంలో జరిగిన కవిసమ్మేళనాలు వంటివి నాకు గొప్ప వూరటనిచ్చాయి. అప్పుడు నాకు సీనియర్ మా అమ్మ తమ్ముడు మేనమామ మంగారి రాజేందర్ సాహచర్యం అప్పుడు వెయ్యేనుగుల బలం. ఇదంతా ఇట్లా వుండగానే నాలో పెరుగుతున్న గుర్తింపు సంక్షోభం (ఐడెంటిటీ క్రైసిస్) లోంచి బయట పడేందుకు నాకు కథలు, కవిత్వంతో పాటు జర్నలిజం కూడా ఎంతో సాయపడింది. అంటే పత్రికలు వాటిల్లో కాలమ్స్ రాయడం, రచనలు చేయడంతో పాటు వార్తలు ప్రత్యేక కథనాలు రాయడం ఇవన్నీ నన్ను నా బలహీనతల్లోంచి ఒడ్డున పడేసాయి.

   అట్లా నాజీవితంలోకి వచ్చిన మొట్టమొదటి పత్రిక “చిత్రిక”. వేములవాడకు చెందిన శ్రీ పురాణం రామచంద్ర ఆ పత్రికను కరీంనగర్ లో ప్రారాభించాడు. అంతకు ముందు తాను ఈనాడుకు రిపోర్టర్ గా చేశాడు. వార పత్రికగా ప్రారంభమయిన ‘చిత్రిక’ కరీంనగర్ లో శాస్త్రీ రోడ్డులోని నాగభూషణం గారి ప్రింటింగ్ ప్రెస్ లో అచ్చయ్యేది. నా మూలాలు కూడా వేములవాడ కనుక పురాణం తో కనెక్ట్ అయ్యాను. నా మొట్టమొదటి కథను ఆయనే  చిత్రికలో వేశాడు. తర్వాత కొన్ని వ్యాసాలు అవీ రాశాను. దాదాపు అప్పుడే వేములవాడలో నటరాజ కళానికేతన్ ఏర్పాటు దాని ఆధ్వర్యంలో ‘నవత’ పత్రిక అలా పత్రికల్తో నాకు సాహచర్యం సన్నిహితత్వం పెరిగింది. సినిమాలు సాహిత్యం కొనసాగుతూనే వుండగానే లైబ్రరీ సైన్స్ చదివి సిరిసిల్లా కాలేజీలో లైబ్రెరియన్ గా ఉద్యోగంలో చేరాను. ఆ ఉద్యోగం మరీ నిరాదరణ కలిగింది. అప్పుడు కాలేజీల్లో లెక్చరర్లదే హవా. లైబ్రెరియన్, ఫిజికల్ డైరెక్టర్స్ అంటే ఒకింత తక్కువ చూపే వుండేది. జీతాలూ అధ్యాపకులకంటే తక్కువే. దాంతో కాలేజీల్లో ద్వితీయ పౌరసత్వమే ఇచ్చేవాళ్లు. అక్కడా నాకు పోరాటమే. నా రచనలు, సినిమాలు, ఫిల్మ్ సొసైటీ కార్యక్రమాలూ నన్ను నిలబెట్టాయి. ఎంతయినా సృజనకున్న గౌరవం గొప్పది కదా. అదంతా అట్లా సాగుతూ వుండగానే కరీంనగర్ లో శ్రీ బి.విజయకుమార్ నేతృత్వంలో “జీవగడ్డ” సాయంకాలం దిన పత్రిక ఆరంభమయింది. Birds of a feather flock together అన్నట్టు ఒకే ఆలోచనలున్న వాళ్ళం అందరం జీవగడ్డ గూటికి చేరాం. పత్రికలో పనిచేస్తున్న కె.ఎన్.చారి, అల్లం నారాయణ లకు తోడు నేనూ, గోపు లింగా రెడ్డి, నరెడ్ల శ్రీనివాస్ పత్రికలో భాగం పంచుకున్నాం. అందరం వారానికి ఒకరోజు కాలం రాయడం ఆరంభించాం. నేనట్లా రాసిందే ‘మానేరు తీరం’. అక్కడికి నారదాసు లక్ష్మణ రావు, పెండ్యాల సంతోష్, ఎడమ నారాయణ రెడ్డి, కోమటిరెడ్డి దామోదర్ రెడ్డి లతో పాటు ఫిల్మ్ సొసైటీ మిత్రులు సాహితీ మిత్రులంతా క్రమం తప్పకుండా వచ్చేవాళ్లు. అట్లా జర్నలిజంలో జీవగడ్డ నాకు ముఖ్యవేదిక అయింది. దానికి తోడు మా  కఫిసో ‘ఉత్తమచిత్ర’ ప్రచురణ కూడా జర్నలిజంలో భాగంగానే చూశాను.

ఇంతలో ‘ఈనాడు’ దినపత్రికలో జిల్లా స్థాయిలో కల్చరల్ కంట్రీబ్యూటర్ అంటూ సాహితీ సాంస్కృతిక అంశాల్ని కవర్ చేసేందుకు ప్రత్యేకంగా విలేఖరులను తీసుకున్నారు. అప్పుడు శ్రీ ఏ.ఎన్.రాజు జిల్లా విలేఖరి, హైదరబాద్  డెస్క్ లో డాక్టర్ రామకృష్ణ లు వున్నారు. నన్ను రాయమన్నారు. వీలు కాదేమోనన్నాకూడా రాజు గారు ఏముంది సార్ ఖాళీ సమయంలో రాయండి అన్నారు. మనమేదీ దేన్నీ ఆషామాషీగా చూడం, తీసుకోం కదా. అందుకే సీరియస్ గానే రాశాను. అనేక అంశాలు రాశాను. డెస్క్ కూడా సంపూర్ణ సహకారం ఇచ్చింది. డెస్క్ లో సుబ్బారావు లాంటి వాళ్ళు అప్పుడు కరీంనగర్ స్టాఫర్ గా వున్న శ్రీ డి.ఎన్.ప్రసాద్ (ఇప్పుడు ఈనాడు తెలంగాణ సంపాదకులు) ఎంతో స్నేహంగా వున్నారు. దాదాపు 4-5 సంవత్సరాలు రిపోర్టింగ్ చేశాను. ఆ క్రమంలో జిల్లా సాహితీ సాంస్కృతిక రంగంలోని వాళ్లందరి స్నేహం, క్రిటికల్ గా రాసినప్పుడు విమర్శలూ ఎదుర్కొన్నాను. ఒకసారి బెంగళూరు లో జరిగిన తెలుగు మహాసభలకు ప్రత్యేక విలేఖరిగా ఈనాడు నన్ను పంపించింది. ప్రారంభోత్సవం రోజే హైదరబాద్ హుస్సేన్సాగర్ లో బుడ్డా విగ్రహం పది పోయి అనేక మంది చనిపోయారు. దాంతో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ మర్రి చెన్నా రెడ్డి మెంగలూరు రాలేదు.ఆ ఉత్సవాల్లో పెద్దాయన శ్రీ వరదాచారి అందరికీ బాగా సహకరించారు. ఇంతలో నాకు ప్రమోషన్ వచ్చి అగ్రహారం డిగ్రీ కాలేజీకి బదిలీ అయింది. టైమ్ ఇవ్వలేక ఈనాడుకు రాయడం మానేశాను.

అప్పటివరకూ చేసిన జూనియర్ కాలేజీ లైబ్రెరియన్ ఉద్యోగం చాలా లిమిటెడ్. కొత్త పుస్తకాలకు బడ్జెట్ వుండేది కాదు, విద్యార్హులతో సహా ఎవరికీ అంతగా రీడింగ్ పట్ల ఆసక్తి ఉత్సాహం వుండేది కాదు. అగ్రహారం డిగ్రీ కాలేజీ ది మరింత దీన స్థితి. సొంత భవనం లేదు తరగతి గదులే లేవు. ఇక లైబ్రరీకి వసతి ఎక్కడిది. అప్పుడే ‘సుప్రభాతం’ వారపత్రిక ప్రకటన వెలువడింది. కరీంనగర్ అగ్రహారం ల మధ్య తిరుగుతూ ఖాళీగానే వున్నాం కదా అని దరఖాస్తు చేశాను. వాసుదేవరావు గారు రాయమన్నారు. ఏముంది ఉత్తర తెలంగా జిల్లాల నుంచి విరివిగా రాశాను. అప్పుడు చాలా  ఉద్రిక్త పరిస్థితులు. ఎన్నో ఎంకౌంటర్లు, మందుపాతర్లు అన్నీ రాశాను. ఉద్యోగం వుంది ఎట్లా అన్నారు. ఏమో ఎవరూ పట్టించుకోలేదు. సొంత పేరుతోటే రాశాను. నేను రాస్తూ పోయాను. వాసు గారి తర్వాత శ్రీ కాసుల ప్రతాప రెడ్డి సంపాదకుడిగా వున్నంతవరకు చేశాను. తర్వాత ఏ.బి.కే.ప్రసాద్, వాసుదేవ రావు గార్ల సారధ్యం లో వచ్చిన ‘మా భూమి’ కి కొంత కాలం రాశాను. ఇంతలో నాకు కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్.డిగ్రీ కాలేజీకి బదిలీ అయింది. అప్పుడు ఆ కాలేజీలో అసలు ఉద్యోగ జీవితం మొదలయింది. పైగా నేను చదువుకున్న కాలేజీ. పూర్తి సమయం నిబద్దతతో పని చేయాలి అనుకున్నాను. పెద్ద కాలేజీ చాలా పెద్ద గ్రంధాలయం. వందలాది మంది విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపకులు. పూర్తి సమయం వృత్తి లో అంకితమయిపోయాను. కానీ ఫిల్మ్స్ ఫిల్మ్ సొసైటీ, సాహిత్యం వీటికి కాలేజీని కూడా వేదిక చేశాను. జర్నలిజం కోరిక వుండనే వుంది. కాలేజీకి నాక్ అక్రెడిటేషన్ వచ్చిన తర్వాత పోలిటికల్ సైన్స్ అధ్యాపకుడు శ్రీ ఎల్.కే.బి.ఎం.శర్మ తో అన్నాను మనం జర్నలిజంలో సర్టిఫికేట్ కోర్స్ పెడదామని. దానికి గోపు లింగా రెడ్డి కూడా సపోర్ట్ చేశాడు. కానీ అప్పటి ప్రిన్సిపాల్ డాక్టర్ విజయకుమార్ తలూపలేదు పైగా ఎందుకొచ్చిన గోల అన్నాడు. కానీ నేనూ శర్మా పట్టు వదలలేదు. సార్ దానికి మనం అన్నీ విధాలా న్యాయం చేయొచ్చు. ఫీజులు కూడా వస్తాయి అన్నాం. ఎట్లాగో ప్రిన్సిపాల్ ని ఒప్పించాం. ఇంకేముంది ప్రవేశాల కోసం ఇచ్చిన ప్రకటనకు చాలా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.

  నేనే ‘సర్టిఫికేట్ కోర్స్ ఇన్ జర్నలిజం’ కోసం సెలబస్ రోపొందించాను. పత్రికా రచన, జర్నలిజం దాని పుట్టుపూర్వోథ్తారాలు, పత్రికలు భాష,, వర్తమాన అంశాలు అని నాలుగు పేపర్లు, చివరగా ప్రాజెక్ట్ వర్క్ ఒకపేపర్ మొత్తం అయిదు పేపర్లు. నేను పత్రికా రచన పేపర్ తీసుకున్నాను. మిగతా వాటికి గోపు లింగా రెడ్డి, డాక్టర్  కే.మల్లారెడ్డి. ఎల్కే.బి ఏం శర్మ, తోట రమేశ్, సత్యప్రకాశ్, సుబ్బిరామి రెడ్డి ఇట్లా పలువురు లెక్చరర్లలని ఇన్వాల్వ్ చేశాను. ఆర్నెళ్ళకు ఒక బాచ్ చొప్పున నేను మొత్తం మీద 13 బ్యాచులు నిర్వహించాను. అంటే ఆరున్నరేళ్లు. దానికోసం ‘రచన’ కళాశాల వారి కోర్సు మెటీరియల్, ఓపెన్ యూనివర్సిటీ వారి బుక్స్ ఇందిరా గాంధీ ఓపెన్ వర్శిటీ వారి మెటీరీయల్ అన్నీ ఉపయోగించాము. మగ పిల్లలు, ఆడపిల్లలు అనేక మంది కోర్సు పట్ల అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు.    

ఈ మొత్తం కోర్సు నిర్వహణలో ఆయా కాలాల్లో పని చేసిన ప్రిన్సిపాల్స్ డాక్టర్ విజయకుమార్, పి.కొండల్ రెడ్డి, డాక్టర్ కె.మురళి, డాక్టర్ మడుసూదన్ రెడ్డి, పి.నితిన్ లు ఎంతగానో సహకరించారు. ఆఫీసు అకౌంట్స్ నిర్వహణలో ఆర్.రాజమౌళి. సభల నిర్వహణలో నాగరాజు, నరేందర్ ల సహకారం మరువలేనిది. ఇంకా లైబ్రరీ ఆసిస్టంట్ నాగరాజు కూడా ఎంతగానో పనిచేశాడు.

ముఖ్యంగా ప్రిన్సిపాల్ నా ఆత్మీయ మిత్రుడు డాక్టర్ కోట మురళి అందించిన సహకారం చాలా గొప్పది.   

++++

“కాంక్ష ఎంత ప్రగాఢ మయిందయినా

కృషి కొరవడితే

విచారమే మిగుల్తుంది”

అందుకే నాకెంత కాంక్ష వున్నా కోర్సు నడపడానికి ఎంతో సమయాన్ని వెచ్చించాల్సి వచ్చింది. ఫలితంగా కాలేజీలో లైబ్రెరియన్ అంటే కేవలం గ్రంధాలయాన్ని ఆధునికంగా మెరుగులు దిద్ది సెర్వీస్ ఇవ్వడమే కాదు అదనంగా కోర్సులు నిర్వహించడంతో మంచి అభిమానం అగౌరవం పొందాను. ఇక కోర్సు ప్రారంభించిన నాటినుండీ ప్రతి బ్యాచ్ కూ వ్యాలిడిక్టరీ ముగింపు సమావేశం నిర్వహించాం. అందులో జిల్లా, రాష్ట్ర స్థాయిల్లోని  జర్నలిస్టులను పిలిచి ప్రేరణాత్మక ఉపన్యాసాల్ని ఇప్పించాము. వాళ్ళతోనే ఆ సభల్లోనే విద్యార్థులకు సెర్టిఫికెట్స్ ప్రధానం చేశాం. అట్లా మా జర్నలిజం కోర్సుకు అతిథులుగా వచ్చినవాళ్ళల్లో శ్రీయుతులు అల్లం నారాయణ, నమస్తే తెలంగాణ అస్సోసియేట్ ఎడిటర్ శ్రీ వేణుగోపాల స్వామి, చిల్ల మల్లేశం, దుర్గం రవిందర్, ఇండియన్ ఎక్స్ ప్రెస్ నవీన్, హిందూ దయాశంకర్, పీ.ఎస్.రవీంద్ర, వేదాంత సూరి ఇట్లా అనేక మంది నాకు సలహాలిచ్చారు, సహకరించారు. అంతే కాదు ఎంతో అభిమానంతో ఆయా సభల్లో అతిథులుగా పాల్గొన్నారు. ఎంతో ప్రేరణాత్మక ఉపన్యాసాలు చేశారు. అప్పటి మా జర్నలిజం కోర్సుల్లో చదివిన విద్యార్థుల్లో పలువురు రాస్త్ర స్థాయిలో పలు వార్తా పత్రికల్లో, డిజిటల్ పత్రికల్లో, టీవీల్లో పనిచేస్తున్నారు. జర్నలిజం లో చేరని వాళ్ళు వివిధ రంగాల్లో వున్నారు. ఎప్పుడయినా ఎక్కడయినా కలిస్తే వృత్తి రీత్యా జర్నలిస్టులం కాకున్నా అప్పుడు కోర్సులో నేర్చుకున్న వాటితో మా భాష అవగాహన మెరుగు పడింది సార్, అంతేకాదు పత్రికల పట్ల సమాజం పట్లా మా అవగాహన పెరిగింది సార్ అంటారు. అది నాకెంతో సంతోషాన్నీ సంతృప్తిని కలిగిస్తుంది. రిటైర్ అయిన తర్వాత కరీంనగర్ లోనే వున్నప్పటికీ ఆ కోర్సు గురించి వివరాలు తెలీదు. నిర్వాహకులు పిలవలేదు. పిలవాలనీ లేదు. కోర్సు నడిస్తే చాలు ఏ కొందరు కొత్త జర్నలిస్టులను తయారు చేసినా చాలు అనిపిస్తుంది.

జర్నలిజం కోర్సుతో పాటు నేను ఎస్.ఆర్.ఆర్.కాలేజీలో కొంత కాలం ఫిల్మ్ మేకింగ్ కోర్సు కూడా నడిపించాను.’మేక్ అప్ టూ ప్యాక్ అప్’ పేర ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్ కూడా నిర్వహించాను. ఆ వివరాలతో మళ్ళీ వారం కలుస్తాను.

-వారాల ఆనంద్

23 జూలై 2023

100=యాదోంకీ బారాత్ 
++++++ వారాల ఆనంద్

99= యాదోంకీ బారాత్

Posted on Updated on

99= యాదోంకీ బారాత్

+++++ వారాల ఆనంద్

వేములవాడ

మా అమ్మను కన్న వూరు ననుకన్న పేగు

మా అమ్మనే కాదు మా నాన్న మూలాల్ని, మా వారాల వంశాన్ని కన్న వూరది. 

మిఠాయోళ్ళ జోరు ఛిలుకల పేరు, బత్తీసలదండ ఆ వూరో గొప్ప జ్ఞాపకాల ఊరేగింపు. నిజానికి మా మిఠాయి సత్తెమ్మ కుటుంబం వేములవాడ నుంచి కరీంనగర్ కు తరలి వచ్చింది.

అలాంటి

వేములవాడకు తెలంగాణా మొత్తం కదిలొచ్చి

తడి బట్టలతో ప్రదక్షిణలు చేసి పోతది.  

 ఈ ఊర్ల కొచ్చిన ముత్తయిదువల

చెంపల మీద పసుపు పచ్చని గులాబీలు వికసిస్తయి.

నొసల్ల మీద ఎర్రటి సూర్యుళ్ళు మెరుస్తరు. అందుకే ఆ వూరన్నా ఆ పేరన్నా నాకెంతో ఇష్టం.   ఆ వూరు నా పుట్టుకలోనే కాదు నా సృజనాత్మక జీవన గమనంలో గట్టి పునాదులు వేసింది. చిన్నప్పటినుండీ అక్కడి గుడి, జాతర నా అనుభవంలోనూ జ్ఞాపకాల్లోనూ సజీవంగా పెనవేసుకుపోయింది. వేములవాడ శైవ క్షేత్రమయినప్పటికి 

“ఇదేమి చిత్రమో అక్కడ రాముని లగ్గంనాడు

శివున్ని పెళ్లి జేసుకుంటరు

అడ్డ బొట్టూ నిలువు బొట్టు అంతా సమానమే”

ఇక్కడి ‘శివపార్వతుల’ శ్వాస

తెలంగాణా మొత్తానికి

ఊపిరి పోస్తది

++++

వేములవాడలో శివరాత్రి ఓ పెద్ద పండుగ. అంతకంటే పెద్ద జాతర. దానితో పాటు వేములవాడలో శ్రీ రామనవమి కూడా అంతే పెద్ద పండుగ. అంతే పెద్ద జాతర. ఆ రెండు జాతరలూ నన్నే కాదు నా తోటి వాళ్ళనూ అందరినీ ఎంతో ఆకర్షించేవి. జాతరల నిండా అందం ఆనందం వెళ్లివిరిసేది. సర్కస్ లు మొదలు ఎన్నో ఎన్నెన్నో.. అయితే శ్రీరామనవమి రోజున  ఇక్కడ భక్తులు ఒక భిన్నమయిన సాంప్రదాయాన్ని అవలంభిస్తారు. స్త్రీ పురుష బేధం లేకుండా ఆ రోజు దేవుణ్ణి పెళ్లాడి దేవుని పేర శివపార్వతులుగా జీవితాలు గడిపే ప్రత్యేకమయిన ఆచారం అది. శ్రీరామనవమి రోజున వేలాది మంది స్త్రీ పురుషులు కొత్త బట్టలు ధరించి నుదుటిపై పెద్దబొట్టు. తలపై జీలకర్ర బెల్లం, చేతిలో త్రిశూలం, నుదుటిపై బాసింగాలు ధరించి జోలె పట్టుకుని అక్షింతలు చల్లుకుంటూ దేవునితో తమ వివాహాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు వారి త్రిశూలాల మోతల్తో ఆలయ ప్రాంగణం మాత్రమే కాదు మొత్తం వూరంతా మారు మోగిపోతుంది. ఓ పక్క ఆలయ అధికారులు నిర్వాహకులు శ్రీరామ కళ్యాణం ఘనంగా జరుపుతూ వుంటే శివపార్వతులు తాము దేవుణ్ణి పెళ్ళాడుతూ శ్రీ రాముని పెళ్ళికి తమ తాహతు మేర కట్నలు కూడా చదివిస్తారు. జంగాలుగా పరిగణించబడే వీరశైవులు ఈ శివ పార్వతుల పెళ్లి జరిపిస్తారు. మొదట జంగం వాళ్ళు ధారణ శుద్ది చేస్తారు. స్త్రీ పురుష బేధం లేకుండా చీరలు కట్టించి రాగి మంగళసూత్రం మెడలో కడతారు. చేతిలో త్రిశూలం ఇచ్చి శివుడితో పెళ్లి జరిపిస్తారు. ఆలయ ప్రాంగణంలోనే కాదు వూరువూరంతా జరుపుతారు.  వేలాది లక్షల మందితో ఈ కార్యక్రమమంతా పెద్ద జాతరగా జరుగుతుంది.   

ఈ మొత్తం ఆచారంలో వారి వారి ఆర్థిక స్థితిని బట్టి తమ జీవితాల్లో మామూలుగానే పెళ్లిళ్లు చేసుకుని కాపురాలు చేస్తూ శివపార్వతులుగా వుంటారు. ఆర్థికంగా లేని వాళ్ళు శివపార్వతులుగా భిక్షాటన చేస్తూ గడుపుతారు. ఇదంతా నా బాల్యం నుండి చూస్తూ వస్తున్నాను. అదంతా చాలా చిత్రంగానూ ఆసక్తిగానూ అనిపించేది.విశ్వాసాల మాట అటుంచితే అదొక సాంప్రదాయం. సంస్కృతిలో భాగం. అంతా గొప్పగా అనిపించేది.  డాక్యుమెంటరీల రచన దర్శకత్వం వైపు నా దృష్టి మరలిన తర్వాత ఈ శివపార్వతుల మీద ఫిల్మ్ చేయాలనిపించింది. ఆ ఆచారాన్ని సంస్కృతిని చిత్రబద్దం చేయాలనే ఆలోచన ఉత్సాహం క్రమంగా పెరిగింది. వేములవాడలో జర్నలిస్టుగా పనిచేసిన మిత్రుడు పీ.ఎస్.రవీంద్ర తో ఆలోచించాను బాగుంటుంది గో ఎహెడ్ అన్నాడు. ఇంకేముంది శ్రీరామనవమికి ముందే ఏర్పాట్లు చేయడం మొదలు పెట్టాను. సిరిసిల్లా జర్నలిస్టు మిత్రుడు టీ.వీ.నారాయణ తోడు ఉండనే వున్నాడు. నటుడు కెమెరామెన్ శ్రీ పోల్సాని వేణుగోపాల రావుని సంప్రదించాను. కెమెరా ఎడిటింగ్ కి తాను రెడీ అన్నాడు. ఠాకూర్ రాజేందర్ సింగ్ మాతో కలిశాడు. వేములవాడ జర్నలిస్టు మిత్రుల్నీ కలుపుకున్నాను. జాతర కదా అధికారుల సహకారం కూడా కావాలి. అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆలయ ప్రాంగణంలోని వసతి గృహంలో వుండడానికి ఏర్పాట్లు కూడా చేశాం. అప్పటి ఆలయ ఛైర్మన్ శ్రీ ఆది శ్రీనివాస్ చేతులమీద క్లాప్ కొట్టించి షూట్ ప్రారంభించాం. ఇంకేముంది అనుకున్నట్టుగానే కెమెరా మైకు రిఫ్లెక్టర్లు పట్టుకుని జాతరలో పడ్డాం. ఎన్ని విజువల్సో. శివపార్వతుల పెళ్లి తంతు ఒక వైపు మరో వైపు జతరలో చిలుకలు, బత్తీసలు, పుస్తెలు, మట్టెలు ఒకటేమిటి ఎన్నో లైవ్ గా షూట్ చేశాం. పలువురు శివపార్వతులతో ఇంటర్వ్యూలు. మొత్తంగా రోజంతా విరామం లేకుండా షూట్ తో సరిపోయింది. మాతో పాటు మా అన్వేష్ కూడా వున్నాడు. రవీంద్ర మాత్రం అలిసిపోయి తమ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాడు. ఆ రాత్రి అక్కడే గెస్ట్ హౌస్ లో వుండి ఉదయాన్నే మళ్ళీ షూట్ కి రెడీ. పోచమ్మ బోనాలూ అవీ అన్నీ గొప్ప ఉత్సాహంతో ఫిల్మ్ చేశాం. వరంగల్ వెళ్ళి పోల్సాని ఇంట్లో డబ్బింగ్ ఎడిటింగ్ చేశాం.BRIDES OF LORD SHIVA అని పేరు పెట్టాను. ఫిల్మ్ బాగా వచ్చింది. ఫిల్మ్ ని వివిధ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి పంపించాను. ఆన్లైన్ ఫెస్టివల్స్ తో సహా. స్లొవేనియా లో జరిగిన DAYS OF EHTNOGRAPHIC FILM ఉత్సవానికి ఎంపికయి అక్కడ ప్రదర్శించబడింది. యౌట్యూబ్ లో కూడా మంచి స్పందననే అందుకుంది. ఇంకా అనేక దేశాల ఫెస్టివల్స్ లో పాల్గొంది. తెలంగాణ కు చెందిన ఒక ఆచారాన్ని సంస్కృతిని చిత్రబద్దం చేసిన ఆనందం తృప్తి మిగిలింది.

….

అది ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎదుగుతున్న కాలం. రాజకీయ సాహిత్య సాంస్కృతిక రంగాల్లో ఉద్యమ ఉధృతి చైతన్య ప్రచార కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి. అందులో భాగంగానే కరీంనగర్ కు చెందిన ఓ ఉపాధ్యాయ మిత్రుడు శ్రీ టి.తిరుపతి రావు ఒక వినూత్న విలక్షణమయిన కార్యక్రమాన్ని చేపట్టాడు. అప్పుడప్పుడే ప్రజాల్లోకి చొచ్చుకు వస్తున్న మొబైల్ ఫోన్ దాని లో వున్న SHORT MESSEGE SEVICE ఎస్.ఎం.ఎస్. సౌకర్యాన్ని తెలంగాణా ఉద్యమ చైతన్య ప్రచారానికి వినియోగించుకోవడం మొదలు పెట్టాడు. తెలంగాణా కు సంబధించి రోజూ వేలాది మెస్సెజ్ లు పంపిస్తూ తన వంతు కృషిని కొనసాగిస్తున్నాడు. సరిగ్గా అప్పుడే సిస్కో అంతర్జాతీయ సంస్థ ఒక షార్ట్ ఫిల్మ్ పోటీని ప్రకటించింది. పోటీకి ఇచ్చిన అంశం ఏమిటి అంటే ఎవరయినా దేనికయినా ఒక ఎలెక్ట్రానిక్ గాడ్జెట్ అంటే సెల్.టీవీ,నెట్ లేదా మారేదయినా సాంకేతిక పరికరాన్ని ప్రజోపయోగం కోసం, లేదా సామాజిక ప్రయోజనం కోసం వినియోగిస్తూ వుంటే వాళ్లమీద ఆ పరికరం మీద ఆధారం చేసుకుని ఫిల్మ్ చేయాలి. ఆ ఫిల్మ్          

కేవలం ఆరు నిమిషాల నిడివిలో ఆ షార్ట్ ఫిల్మ్ అయి వుండాలి.అది తెలియగానే నాకు తిరుపతి రావు గారు గుర్తొచ్చారు. ఆయన, ఆయన సెల్ ఫోన్, తెలంగాణ ఉద్యమం  వీటన్నింటినీ జోడించి ఫిల్మ్ చేద్దామనిపించింది. వెంటనే సంప్రదించాను. ఆయన సరేనన్నారు. నేను పోల్సాని వేణు గారిని సంప్రదించాను. నేను ఆలోచన స్క్రిప్ట్ తో రెడీ. యూనిట్  మిత్రులంతా రెడీ. షూటింగ్ మా ఇంట్లోనే. ఒక రోజంతా షూట్ చేశాం. మా ఇందిర, రేలా, అన్వేష్ లో కూడా ఉత్సాహంగా టీలు టిఫిన్స్ ఇచ్చి సహకరించారు. షూటింగ్ తర్వాత వరంగల్ లో ఎడిట్ కామెంటరీ అదీ పూర్తి చేసి సిస్కో వాళ్ళకు అప్లోడ్ చేశాను. అందులో జ్యూరీ సెలెక్షన్ ఒక విభాగం అయితే పోల్ మరొక విభాగం. తెలంగాణా ఉద్యమ నేపధ్యంలో ఆ ఫిల్మ్ కి చాలా సపోర్ట్ వచ్చింది. పోల్ లో విజేతగా నిలబడింది. అంతర్జాతీయ స్థాయిలో సిస్కో వారి అవార్డు తో పాటు క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చారు. అట్లా “LONG BATTLE WITH SHORT MESEGES” పెద్ద విజయాన్నే సాధించింది. ఆ ఫిల్మ్ తెలంగాణ ఉద్యమంతో కలిసి నడిచింది.  కానీ ఉద్యమం ఉద్యమ నాయకులు పాటను, సాహిత్యాన్నీ ఓన్ చేసుకున్నట్టు ఫిల్మ్ ఓన్  చేసుకోలేకపోయింది.అసలు టీవీని ప్రచారాన్ని తప్ప తెలంగాణ ఉద్యమం విజువల్ మీడియా మొత్తాన్ని దాని శక్తిని పరిగణ లోకి తీసుకోలేదు. అవగాహన లేమే ప్రధాన కారణం.

+++

ఇట్లా నా డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్ కొనసాగింది. అది కేవలం హాబీ గానే కాదు నేను బాధ్యతగా చేశాను. ముఖ్యంగా “తెలంగాణ సాహితీ మూర్తులు” సెరీస్ ప్రారంభించి ఇద్దరు సాహితీ మూర్తుల మీద నా శక్తి మేరకు ఫిల్మ్స్ చేశాను. ఆ సెరీస్ ను కొనసాగించెందుకు నా కున్న ఆర్థిక శక్తి సరిపోలేదు. సహకరించే వాళ్లు కూడా పెద్దగా లేకుండా పోయారు. ఎప్పటికయినా ఆ సెరీస్ లో చాలా మంది తెలంగాణ కవులు రచయితల మీద ఫిల్మ్స్ చేసి వుంచాలని ఆశ పడ్డాను. కానీ అది అత్యాశే అయింది. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడింది. సాహిత్య అకాడెమీ లాంటి సంస్థలూ వచ్చాయి. నేను ప్రత్యేకంగా విజ్ఞప్తులు చేశాను. కానీ ఎవరూ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ వైపు దృష్టి పెట్టలేదు. అంతా లక్షలు పెట్టి పెద్ద పెద్ద పుస్తకాల్ని రంగుల్లో వేశారు. తెలంగాణ సినిమా ఉనికికి ఎదుగుదలకు ఎంతో కృషి వైతాళికులు అన్నవాళ్లు కూడా సాహిత్యకారుల డాక్యుమెంటరీ ఫిల్మ్స్ వైపు దృష్టి పెట్టలేదు. ఎంతో మంది సాహితీ వేత్తలు వెళ్లి పోతూనే వున్నారు. కానీ సంస్థలు చేయాల్సిన పనులు వ్యక్తుల వల్ల పూర్తిగా సాధ్యం కావు. అది నా దృష్టిలో పెద్ద వైఫల్యమే. రాజ్యసభ టీవీ, దూరదర్శన్ లాంటి జాతీయ సంస్థలు సాహిత్యానికి సంబందించిడాక్యుమెంటరీలు, కితాబ్, విరాసత్, ముఖాముఖీ లాంటి అనేక కార్యక్రమాల్ని రూపొందించాయి. తెలంగాణ ఆదిశలో నిర్లిప్తంగా వుండి పోయింది. దశ-దిశ లేకుండా పోయాయి.  

తర్వాత నా డాక్యుమెంటరీ నిర్మాణ కార్యక్రమాల్లో ‘మిత్తుల అయ్యవార్లు’, శ్రీభాష్యం డాక్యుమెంట్రీ అసంపూర్ణంగా మిగిలిపోయాయి…

తర్వాత ఫిల్మ్ ఫెస్టివల్స్ లో జ్యూరీ గా వుండడం లాంటివి చేశాను.. రాతలు కొనసాగిస్తూనే వచ్చాను. మిగతా వివరాలతో మళ్ళీ వారం కలుస్తాను…

-వారాల ఆనంద్

9440501281

98= యాదోంకీ బారాత్ +++ వారాల ఆనంద్

Posted on

98= యాదోంకీ బారాత్

+++++ వారాల ఆనంద్

‘నిరంతరం చదువుతూనే వున్నా

మంచి కవిత్వం నాలో ఇంకిపోయింది‘

అట్లే నిరంతరం అర్థవంతమయినసినిమాలు చూస్తూ ప్రదర్శిస్తూ వాటి పైన రాస్తూ  వుండిపోవడంతో ఆ సినిమాల ప్రభావం నాలో ఇమిడిపోయింది. మొదట పూర్తి నిడివి ఫీచర్ ఫిల్మ్స్ చూడ్డంతో పాటు వివిధ ఫిల్మ్ సొసైటీల్లో ప్రదర్శించడం ప్రధాన కార్యక్రమంగా సాగింది. తర్వాత పోరండ్ల, చొప్పదండి, మల్లాపూర్, కొండపూర్ ఇట్లా అనేక గ్రామాల్లోకి వెళ్ళి ‘పతేర్ పాంచాలి’, ‘బైసికిల్ తీవ్స్’, ‘రషోమాన్’, ‘చార్లీ చాప్లిన్’ సినిమాలు ఇట్లా అనేక సినిమాల్ని చూపించాను. గ్రామీణుల స్పందన, స్కూల్స్ లో పిల్లల ప్రతిస్పందన చాలా ఉత్తేజంగా వుండింది. తర్వాత కొన్నేళ్లకు ఫిల్మ్ భవన్ నిర్మాణం జరిగిన తర్వాత నాలుగు జాతీయ షార్ట్ అండ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్స్ , ఫిల్మ్ తెలంగాణా ఉత్సవ నిర్వహణ చాలా ఉత్సాహంగా సాగింది. ఈ క్రమంలో మా ఫిలిం సొసైటీలో నరెడ్ల శ్రీనివాస్, రేణికుంట రాములు, నారదాసు లక్ష్మణ రావు, కె.దామోదర్ రెడ్డి, కోల రాంచంద్రా రెడ్డి లాంటి అనేక మంది మిత్రులు నాతో వున్నారు. చర్చించుకున్నాం, విమర్శించుకున్నాం. మమ్మల్ని మేమే శబ్బాష్ అనుకున్నాం. అవన్నీ అప్పుడు మా అందరిలోనూ పెళ్లుబుకుతున్న ప్రగతిశీల భావాలు దృక్పధాలు స్నేహాలు మమ్మల్ని అట్లా ఒకటిగా కలిపి వుంచాయి. ఎందుకంటే కరీంనగర్ కేంద్రంగా మేమీ పనులు చేస్తున్నప్పుడు గ్రామాలు అట్టుడుకుతున్నాయి. దాడులు ఎంకౌంటర్లు ఒకటేమిటి ఎన్నో ఎన్నెన్నో. మేమేమో సాంస్కృతిక రంగంలో ఏ కొంచెమయినా మంచి చేయాలన్నది మా పాయింట్ ఆఫ్ వ్యూ. ఫిల్మ్ సొసైటీ నేపధ్యంలోనే మిత్రుడు నారదాసు, సురేందర్ లాంటి మరికొందరు మిత్రుల సహకారంతో ‘విముక్తి కోసం’ సినిమా తీశాడు. రాష్ట్ర నంది అవార్డు అందుకున్నాడు. మరో వైపు బి.నరసింగ రావు ఫీచర్ ఫిల్మ్స్ తో పాటు డాక్యుమెంటరీ లు ‘మావూరు’, ‘సిటి’, కె.ఎన్.టి.శాస్త్రి తీసిన డాక్యుమెంటరీలు, ఇంకా గౌతమ్ ఘోష్ లాంటి వాళ్ళు తీసిన గొప్ప డాక్యుమెంటరీలు చూస్తూ చూస్తూ నేనూ డాక్యుమెంటరీ నిర్మాణం వైపు ఆకర్షితుణ్ణి అయ్యాను. అప్పటికే సుప్రసిధ్హ ఫిల్మ్ మగజైన్స్ ‘ సైట్ అండ్ సౌండ్’, ‘సినిమా ఇండియా ఇంటెర్నేషనల్’, ‘సినిమా ఇన్ ఇండియా’, ‘డీప్ ఫోకస్’ లాంటి పత్రికల్ని చదువుతూ వున్నాను. స్క్రీన్ లాంటి పత్రికను క్రమం తప్పకుండా ఫాలో అయ్యేవాన్ని. అట్లా సినిమా సాహిత్యం పైనా ఆసక్తి అవగాహన పెరుగుతూ వచ్చింది. పల్లకి, ఆంధ్ర భూమి తదితర పత్రికల్లో సినిమాల మీద రాయడం అప్పటికే మొదలయింది. వీటన్నింటి నేపధ్యంలో ఫిల్మ్ మేకింగ్ ఆసక్తి వున్నప్పటికీ అప్పటి ఆర్థిక స్థితి, కుటుంబం లాంటి అనేక పరిమితుల వల్ల ఫెచర్ ఫిల్మ్స్ నిర్మాణం వైపు కనీసం కన్నెత్తి చూడలేదు. డాక్యుమెంట్రీ లు మన పరిధిలో వుంటాయి అనిపించి మొదట కరీంనగర్ కు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ భాస్కర్ మాఢేకర్ కోసం ‘లయన్స్ చారిటేబుల్ కంటి ఆసుపత్రి’ మీద ఒక చిన్న ఫిల్మ్ చేశాను. ఆర్టిస్ట్ రాజు కెమెరా వర్క్ చేసి సహకరించాడు. తర్వాత సాహిత్యంతో వున్న అనుబంధం నాకు రచయితల పైన ఫిల్మ్స్ చేయాలనే ఆలోచన వచ్చింది. అప్పటికి తెలంగాణ ఉద్యమం ఆరంభయింది. రచయితల వేదిక ను నందిని సిధ్ధారెడ్డి నేతృత్వంలో ప్రారంభించాం. ఆ నేపధ్యంలో తెలంగాణా సాహితీ మూర్తులు పేర ఒక “డాక్యుమెంటరీ ఫిల్మ్ సెరీస్ ఆన్ తెలంగాణా రైటర్స్” తీయాలని తలపోశాను దానికి సాహితీ మిత్రులు దర్భశయనం శ్రీనివాసాచార్య, నలిమెల భాస్కర్, జూకంటి జగన్నాధం, జర్నలిస్టు మిత్రుడు టీవీ నారాయణ సకరించడానికి ముందుకు వచ్చారు. మొదటి ప్రయత్నంగా కరీంనగర్ ముద్దసాని రాంరెడ్డి గారి పైనా ఫిల్మ్ చేశాను. దాన్ని తెలంగాణ రచయితల వేదిక కరీంనగర్ జిల్లా సభల్లో శ్రీ అల్లం రాజయ్య చేతులమీద ఆవిష్కరించాం.

    తర్వాత ఆదిలాబాద్ సామల సదాశివ పైన ఫిల్మ్ చేయాలని ఆలోచన వచ్చింది. సదాశివ ఓ జ్ఞాపకాల గని ముచ్చట్ల పందిరి, ఓ నడుస్తున్న సాహిత్య చరిత్ర, మరపు రాణి ఓ హిందుస్తానీ గానకచేరి. అయన్ని తడిమేతే చాలు శర పరంపరగా అలవోకగా మాట్లాడుతూ వినే వాళ్ళని ముచ్చట్లతో ముగ్దుల్ని చేసే విశాల ప్రపంచం ఆయనది. ఎలాంటి రెఫెరెన్సులు లేకుండా ఎక్కడెక్కడివో ఎప్పటెప్పటివో అనేక విషయాలు జాలు వారే ప్రవాహం అయన.

అంతటి పెద్దాయన నాకంతకు ముందు వ్యక్తిగతంగా పరిచయం లేదు.అయన రచనలు చదవడం అయన గురించి వినడమే తప్పితే కలిసింది లేదు.
మొట్ట మొదసారి గా కరీంనగర్ లో తెలంగాణా రచయితల వేదిక సభలు వైశ్య భవన్ లో జరిగినప్పుడు వేదిక పైన ఆయన్ని చూడ్డం మొదటిసారి సభా కార్యక్రమం తర్వాత కరీంనగర్ ప్రశాంత్ లాడ్జ్ లో బస చేసిన సదాశివ ను కలవ డానికి నేను నలిమెల భాస్కర్, జూకంటి జగన్నాథం, గండ్ర లక్ష్మణ రావు తదితర మిత్రులం వెళ్ళాము.అదే మొదటి సారి ఆయన్ని దగ్గరగా చూడడం. ఎప్పటిలాగే మౌన ప్రేక్షకుడిగా ఆయన్ని వింటూ కూర్చున్నాను. ఎన్ని మాటలో ముచ్చట్లో…అప్పుడు అయన అన్నారు ‘ ఇప్పుడే రామిరెడ్డిని ఆయన ఇంటికి వెళ్ళి కలిసి వచ్చిన, గీడ మూలక్కుచున్నావన్న వేదన వద్దని చెప్పిన,  అక్కడ వైశ్యభవన్ లో నిలువెత్తుగా నిన్ను ఆవిష్కరించారు నీ కీర్తి శాశ్వతం అయింది పో అని చెప్పి వచ్చిన..’అన్నాడు. నా వైపు తిరిగి మంచి పని చేసినావు. అవును నువ్వు జింబో కు ఏమవుతావు అని అడిగాడు. అయన నాకు మేనమామ అని చెప్పిన. అయితే నారాయణ రావు ఏమవుతడు  అన్నాడు. పెదనాన్న మా పెద్దమ్మ భర్త అని చెప్పిన.
దానికి సదాశివ, నారాయణ రావు తాను కలిసి పని చేసినప్పటి సంగతులు చెప్పాడు.
రెండు గంటలు ఆయనతో కూర్చున్నంక భాస్కర్ తో మెల్లిగా అన్న మన రెండవ సాహితీ మూర్తి సదాశివ గారని. అయన ఎంతో సంతోష పడ్డాడు. మరింకేంది చెబుదామన్నాడు.
నా ప్రతిపాదన సదాశివ ముందుంచాను.ఆదిలాబాద్ వస్తామని చెప్పాను.
‘నా దగ్గర ఏముందయ్యా’ అన్నాడు
‘ఉన్నదేదో ఉన్నట్టు చూపిస్తానని చెప్పాను ‘
మీరు కాదని అనవద్దు అని భాస్కర్ ఒత్తిడి చేసాడు
‘మరయితే రాండ్రి’ అన్నాడు సదాశివ.
రెండు రోజుల తర్వాత నేనూ, నలిమెల భాస్కర్ ఆదిలాబాద్ బయలు దేరాం.
రోజంతా అయన ముచట్లు. అయన ఇంటి పరిసరాలు అన్ని చూస్తు నేను …
చివరిగా అయన అడిగాడు ‘ నా మిద చిత్రం తీస్తే నికేమోస్తుంది ‘
‘ ఏమి రాదన్నాను ప్రతిది ఏదో వస్తుందని చేయం కదా’ అన్నాను.
నవ్వి ఊరుకున్నాడు. మీ ఇష్టం అన్నాడు సదాశివ.‘నేనేమి చేయాలో చెప్పు’ అన్నాడు. యౌనిట్ తో కలిసి వస్తామని చెప్పి బయలు దేరాం.గురూజీ ఆశ్రమాన్ని చూశాం.
ఎంత వద్దన్నా పెద్దాయన బస్సు స్టాండ్ వరకు వచ్చి మమ్మల్ని సాగనంపాడు.
అల మొదలయింది ‘యాది సదాశివ్’ డాకుమెంటరీ.
********************************************
తర్వాత కొన్ని రోజులకు ప్లాన్ చేసుకుని టి.వి, నారాయణ, కొడం సంతోష్ తదితర యూనిట్  తో కలిసి ఆదిలాబాద్ బయలుదేరా. ‘90 ల నుంచీ నాకు అన్నివిధాల సహకరిస్తూ వున్న మిత్రులు సరస్వతి పాపన్న సాదాశివ ఫిల్మ్ కు కూడా ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చారు.ఇక పెద్దమ్మ వాళ్ళ వూరు కిష్టాపూర్ వెళ్ళిన ప్రతిసారీ చిన్నప్పటి నుంచి అద్భుత మైన దృశ్యం గా
మదిలో మిగిలి పోయిన రాయపట్నం వంతెన గోదావరి నది దాని ఆనుకునే వున్న అడవి అన్నింటిని షూట్ చేస్తూ నా యూనిట్ ఆదిలాబాద్ ప్రయాణం సాగింది. టాటా సుమో పైన కూర్చుని మరీ షూట్ చేశాం అదో థ్రిల్.
ఇక అక్కడ సదాశివ ఇంట్లో కెమెరా,  రిఫ్లెక్టర్లు మొత్తం షూటింగ్ వాతావరణం ఏర్పాటు చేశాం.  అదంతా సదాశివలో ఉత్సాహాన్ని నింపాయి.ఇంట్లో అందరిని షూట్ కి రెడీ చేసారు.
సదాశివ గురించి మాట్లాడడానికి వసంత రావు దేశ్పాండే తో సహా అంత సిద్దం అయ్యారు. ఇల్లు, వాతావరణం, ఇంటర్వ్యూలు ముగించుకుని లక్షెట్టిపెట్ లో మా పెద్దనాన్న నారాయణ్ రావు గారి ఇంటర్వ్యూ తర్వాత షూటింగ్ హైదరాబాద్ కి మారింది.
యౌనిట్ తో పాటు ప్రముఖ కవి, ఆత్మీయ మిత్రుడు శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్య , మా అబ్బాయి అన్వేష్ కూడా జతకూడాడు. ఇక్కడ దర్భశయనం కవిగా మిత్రుడిగా అందించిన సహకారం ప్రోత్సాహం మరువలేనిది. ముద్దసాని రామ్ రెడ్డి ఫిల్మ్ కు, సదాశివ ఫిల్మ్ కు కూడా ఆయన నా వెంట హైదరబాద్ దాకా వచ్చి అలసటనూ, ఇబ్బందునీ భరించి నా వెంట వున్నారు. సదాశివ గురించి అయన అభిమానుల మాటల్ని, అయన తిరుగాడిన సుల్తాన్ బజార్ , ఆయన వుంటూ వచ్చిన ఆదర్శ లాడ్జ్ లాంటి అనేక ప్రదేశాల్ని షూట్ చేయాలని బయలు దేరాం. సదాశివను అమితంగా అభిమానించే రచయిత శ్రీ వాడ్రేవు చినవీర భద్రుడు ఫిల్మ్ కోసం సమయం ఇచ్చారు. ఆయన కెమెరా ముందు మాట్లాడుతూ ‘ఉర్దూ సాహిత్యం గజల్లు, దోహాలు లాంటి వాటి గురించి సదాశివ చెప్పిన అంశాల్ని గొప్పగా నెమరు వేసుకున్నాడు. ఇక ఐ.ఏ.ఎస్. అధికారి, రచయిత శ్రీ ఫణి కుమార్ అప్పుడు హైదరాబాద్ లో  ప్రకృతి చికిత్సాలయంలో వుంటే అక్కడికి వెళ్లి పలకరించాము.కొత్తగా రాస్తున్న వారి గురించి సదాశివ పట్టించుకునే విధానాన్ని ఆయన వివరించారు. అప్పటి ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీ కె. రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఎలాంటి రెఫెరెన్సు లు లేకుండా సదాశివ చెప్పే వివరాల్ని ప్రశంసించారు. యాది కాలం రాయించుకున్నప్పటి  సంగతుల్ని గుర్తుచేసుకున్నారు.ఆంధ్ర జ్యోతి లో మిత్రుడు శ్రీ అల్లం నారాయణ ఎంతో ఆప్యాయంగా మాట్లాడాడు. ఆచార్య జయధీర్ తిరుమల్ రావు తెలంగాణాకి లభించిన గొప్ప సాహిత్య భండాగారం సదాశివ అని ఆయనతో తనకున్న సాన్నిత్యాన్ని నెమరు వేసుకున్నారు. తర్వాత చిత్రీకరణ వరంగల్ కు మారింది. ఆచార్య లక్ష్మణ మూర్తి మాట్లాడుతూ ‘అలతి అలతి మాటల్లో సదాశివ చెప్పే అంశాలు ఎంత గొప్పవో’ వివరించారు. ఆచార్య జయశంకర్ మాట్లాడుతూ ‘అతి సామాన్య జీవితం గడిపిన సదాశివ ప్రతిభ అసామాన్యమయినది అన్నారు’. ఇంకా అప్పటి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య కోకాటే తదితరులు కూడా సదాశివ గురించి మాట్లాడారు. అలా సాగిన సదాశివ జీవన చిత్రం లో అయన తిరుగాడిన ఇంటి వాతావరం తో పాటు వరంగల్ బ్రాడ్ వే, కరీంనగర్ ప్రశాంత్ లాడ్జ్ ల వాతావరణం కూడా డాకుమెంటరీ లో చూపించాము.
    ‘యాది సదాశివ’ నిర్మాణ క్రమంలో ఆయనతో గడిపిన సమయాలు చాలా గొప్పవి .   నిజంగా నా జీవితంలో అవి మరచిపోలేని అనుభవాలు. అయన వెలువరించిన అభిప్రాయాలు సువర్ణ అక్షరాలు.’కర్ణాటక సంగీతం లో బహుదారి అని ఒక రాగం వుంది నాది అదే దారి ‘ అంటారు సదాశివ అన్ని దారులూ వచ్చి కలుస్తాయి అందుకే అది బహుదారి.  నన్ను అందరూ కలుస్తారు ఆచార్య లక్ష్మన మూర్తి, ఆచార్య సంపత్కుమార, మహాజాబిన్, యాకూబ్, శివారెడ్డి, దేవిప్రియ ఇలా ఒకరేమిటి అందరు వస్తారు అందుకే నాది బహుదారి అన్నారు సదాశివ.
      నా జీవితంలో నెగెటివ్ గా ఎప్పుడూ ఆలోచించ లేదు ఎవరు చెప్పిందాంట్లో నైనా మంచి ఉందేమోనని ఆలోచించాను. కవిత్వం కండ్లబడ్డప్పుడు ఆనందించకుండా ఉండలేదు. ఎవరే పని చేసిన ఏదో ఒక ప్రతిభ ఉంటేనే చేస్తాడు. దాన్ని నిరాకరిస్తే ఎట్లా? వీలయితే ప్రోత్సహించాలే లేదా ఆనందించాలే కాని నిరాకరించొద్దు.ఇది అయన జీవన విధానం. అలా కలగలసి పోయిన అయన జీవితం సాహిత్యం రెంటిని తడుముతూ చేసిన చిన్న ప్రయత్నం ‘యది సదాశివ’.
     అయన మాటలు, నడక, నివాసం అన్నింటిని దృశ్య మానం చేసే అవకాశం నాకు దొరికింది. నిజంగా తన చుట్టూ వున్న అత్యంత సాదారణ జీవితంలోంచి తెలంగాణా సాంస్కృతిక ముద్ర ఇది, తెలంగాణా అస్తిత్వం ఇది అని చెప్పిన మహానుభావుడు సదాశివ.
     అయన తెలంగాణా కు లభించిన గొప్ప కానుక. అలాంటి కానుకను భావి తరాలకోసం సజీవంగా దృశ్య రూపంలో నిలిపే అవకాశం నాకు కలగడం నాకు గొప్ప ఆనందాన్నిచ్చింది. అట్లా తెలంగాణ సాహితీ మూర్తులు సెరీస్ లో రెండవ ప్రయత్నం ముగిసింది. ఆ ఫిల్మ్ ని ఆ తర్వాత ఆదిలాబాద్ లో జరిగిన తెలంగాణ రచయితల వేదిక సభల్లో ఆవిష్కరించి ప్రదర్శించాం.

ఆ తర్వాత నేను శివపార్వతులు,ఎస్.ఎం.ఎస్. ఫిల్మ్ రూపొందించాను. ఆ వివరాలతో వచ్చే వారం….

***************

9 July 2023  

   -వారాల ఆనంద్

92= యాదోంకీ బారాత్

Posted on

+++++ వారాల ఆనంద్

92= యాదోంకీ బారాత్

+++++ వారాల ఆనంద్

Cinema is the most democratic art.  It uses the most appropriate language for audiences. Film festivals can consolidate and maintain democracy, peace and freedom. Coming together to explore new cultures and celebrate creativity will always be important and film is the perfect medium for that.

సినిమాను ఒక కళ, అన్ని కళల సమ్మిశ్శిత్రం అన్న భావనతో మంచి సినిమాను, కళాత్మక సినిమాను సాధారణ ప్రజానీకానికి దగ్గరగా తీసుకు రావాలనే లక్ష్యం తో మొదలయిన ఫిల్మ్ సొసైటీ ఉద్యమంలో కఫిసో తన పాత్రను విజయవంతంగా నిర్వహిస్తూ వచ్చింది. ఆ క్రమంలో  భాగంగానే ఫిల్మ్ భవన్ నిర్మాణం. ఆ భవనాన్ని సంపూర్ణంగా లక్ష్య సాధన కోసం వినియోగించాలనే అభిలాషతో కేవలం ఫిల్మ్ స్క్ర్రెనింగ్స్ మాత్రమే కాకుండా ఫిల్మ్ఫ్ ఫెస్టివల్స్, ఫిల్మ్ సెమినర్స్, వర్క్ షాప్స్ లాంటివి నిర్వహించాలనుకున్నాం. ఆ దిశలోనే మొట్టమొదటిసారిగా జాతీయస్థాయిలో డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాలని నేను ప్రతిపాదించాను. కఫిసో కార్యవర్గం ఒకే అంది. ఎట్లా చేస్తారో మీ ఇష్టం అన్నారు. ప్రేక్షకులు ఏదో ఒక మంచి సినిమాను చూసి వెళ్లిపోవడం కాకుండా ఎంపిక చేసిన కొన్ని ఉత్తమ సినిమాల్ని ఏకబిగిన కొన్ని రోజులపాటు చూడడంతో పాటు ఆయా సినిమాల దర్శకులు ఇతర బాధ్యులతో కలవడం వారితో ఇంటరాక్షన్ లతో ఎన్నో అంశాలు చర్చల్లోకి వస్తాయి. దాని వల్ల సినిమా, దాని సబ్జెక్ట్ విషయాలతో పాటు ఆసక్తి వున్నంతమేర టెక్నికల్ అంశాలు కూడా ఫెస్టివల్స్ లో చర్చకు వస్తాయి. నేను వ్యక్తిగతంగా 1986 హైదరబాద్ ఫిల్మోత్సవ్ నుంచి హైదరబాద్, కలకత్తా, ముంబై, డిల్లీ లాంటి చోట్ల జరిగిన అనేక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో పాల్గొన్న అనుభవంతో పాటు ఎఫ్.ఎఫ్.ఎస్.ఐ. సమావేశాల్లో  చర్చల్లో భాగం పంచుకున్న అనుభవం కూడా కరీంనగర్ లో జాతీయ స్థాయిలో ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాలనే ఆలోచనకు మూల కారణమయింది. ఫిలింభవన్ లో ఆధునిక ప్రొజెక్షన్ వసతులు కల్పించుకున్నాం. కాబట్టి ఫెస్టివల్ నిర్వహణకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు లేవు. కానీ మెట్రో నగరాలకున్న వసతులు అనుకూలతలు కరిమ్ఙ్గర్ లాంటి చిన్న పట్టణాలకు ఉండవు. పైగా ట్రావెల్లింగ్ సమస్య. దాంతో పాటు పెద్ద దర్శకులు సాంకేతిక నిపుణులు మా కరీంనగర్ కు రావడం అంత సులభం కాదు. అంటే ఆకుండా మెట్రోలకున్న మీడియా ఫోకస్ కూడా మాకు తక్కువే. అయినా నా మాట మీద మా కార్యక్రమ నిర్వహణ మీద నమ్మకం తో పలువురు వచ్చి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. వీటన్నింటి నడుమ ఫిల్మ్ ఫెస్టివల్  కావాల్సింది సినిమాల ఎంపిక. ఫీచర్ ఫిల్మ్స్ తో ఫెస్టివల్ అంటే మన శక్తికి మించినది అవుతుంది కనుక డాక్యుమెంటర్ అండ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాలనుకున్నాం. జాతీయ స్థాయిలో నిర్వహించేది మొట్టమొదటిసారి కనుక పోటీ రహిత ఉత్సవంగా నిర్వాహించాలన్నది ఆలోచన. అది విజయవంతమయితే తర్వాతి కాలంలో కాంపిటీటివ్ ఫెస్టివల్స్ చేయొచ్చు అనుకున్నాం. ఆ క్రమంలో ఏర్పాట్లకు సిధ్ధమయ్యాము. మొదట కావలసింది ఫిల్మ్స్ ఇన్ డిజిటల్ ఫార్మాట్స్. దానికోసం బెంగళూరు సుచిత్ర కు చెందిన శ్రీ నరహరి రావు, హైదరబాద్ ఫిల్మ్ క్లబ్ కార్యదర్శి శ్రీ బి.హెచ్.ఎస్.ఎస్.ప్రకాష్ రెడ్డి లు ఎంతో సహకరించారు. సూచనలు చేశారు. కొన్ని సినిమాల్ని అందించారు. ముంబై SUHDIR NANDGAONKAR నువ్వు ముంబై వస్తే MAMI  ఫెస్టివల్ వాళ్ళని పరిచయం చేసి సహకరిస్తానన్నారు. అట్లే కలకత్తా ప్రేమేంద్ర మజుందార్ కూడా. అంత సమయం లేదు అనుకుని ఫెస్టివల్ కి అవసరమయిన సినిమాల్ని సేకరించే పనిలో పడ్డాను. నిర్వహణ కోసం కాఫీసో నుంచి వివిధ కమిటీల్ని వేశాం. ఫెస్టివల్ ఛైర్మన్ గా కలెక్టర్ ఏం.వి. సత్యనారాయణ గారు, ఫెస్టివల్ డైరెక్టర్ గా నేను, అసోసియేట్గా కోల రాంచంద్రా రెడ్డి, హాస్పిటాలిటీ కన్వీనర్ గా ఏం.ప్రభాకర్, పబ్లిసిటీ కన్వీనర్ గా పొన్నం రవిచంద్ర, స్క్రీనింగ్ కన్వీనర్ గా రఘురాం, సెమినార్ కన్వీనర్ గా టి.దామోదరస్వామి, ఫైనాన్స్ కన్వీనర్ గా రావికంటి మురలి, సలహాదారులుగా నారదాసు లక్ష్మణ రావు, ఎన్.శ్రీనివాస్ లను వేసుకున్నాం.  పని మొదలయింది. అన్నీ అట్టహాసంగా వుండాలి కదా. ఫెస్టివల్ కోసం పోస్టర్ ని ప్రముఖ చిత్రకారుడు శ్రీ అన్నవరం శ్రీనివాస్ చేత వేయించాము. ఆయన గొప్ప చిత్రకారుడే కాకుండా మంచి మిత్రుడు కూడా. పోస్టర్ తో పాటు ఫెస్టివల్ బుక్ కోసం కరీంనగర్ పట్టణానికి ముఖద్వారం అయిన ‘జూబ్లీ కమాన్’ పెయింటింగ్ వేసి ఇచ్చారు. ఈ జూబిలీ కమాన్ ను నిజాం రాజు సింహాసనం అధిష్టించి 25 ఏళ్ళు అంటే సిల్వర్ జూబిలీ అయిన సంధర్భంగా కరీంనగర్  జాగీర్దార్ నిర్మించాడని చెబుతారు. నిజాం కిరీటం కూడా కామాన్ మీద కనిపిస్తుంది. ఇక మా కరీంనగర్ లో వున్న మరో చారిత్రక నిర్మాణం ‘క్లాక్ టవర్’. మా కరీంనగర్ జిల్లా కేంద్రాన్ని అంతకుముందు వరకు వున్న ఎలగందల్ నుంచి ఇప్పటి కరీంనగర్ కు 1905 లో మార్చిన  తర్వాత ఇంగ్లీషు వాళ్ళ పాలనలో ఆ క్లాక్ టవర్ నిర్మించారు. ఇక  ఇప్పుడున్న అన్నపూర్ణ కాంప్లెక్స్ స్థానంలో పాత కాలేక్టరేట్, ఇంకా కలెక్టర్ కాంప్ ఆఫీసు, జైలు, చర్చ్ తదితరాలు  నిర్మించారు. ఇప్పటికీ కమాన్, క్లాక్ టవర్ కరీంనగర్ నగర సింబల్స్ గా నిలిచి వున్నాయి. ఇక ఫెస్టివల్ కోసం రూపొందించిన  పోస్టర్ ని కలెక్టర్ ఏం.వి.సత్యనారాయణ గారి చేత రిలీజ్ చేయించాము. శ్రీ అన్నవరం శ్రీనివాస్ అనంతర కాలంలో నావి పలు కవితా సంకలనాలకు భావస్ఫోరక మయిన ముఖచిత్రాల్ని వేశారు.

 ఇక ఫెస్టివల్ విషయానికి వస్తే అయిదురోజుల ఉత్సవాన్ని ప్లాన్ చేశాం. అప్పటికి 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న కాఫీసో కి ఈ ఫెస్టివల్ సొంత హాలు లో ప్రతిష్టాత్మక మయింది. ఫిల్మ్ ఫెస్టివల్లో దాపు 50 షార్ట్ అండ్ డాక్యుమెంటరీ చిత్రాల్ని ప్రదర్శించాము. ఇందులో ప్రధానంగా ఆనంద్ పట్వర్ధన్ తీసిన ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’, గుజరాత్ మత కల్లోలాల గురించి రాకేశ్ శర్మా తీసిన ‘ఫైనల్ సోల్యూషన్’, ‘రీమిక్స్ ఆఫ్ హుస్సైన్’, బి.నరసింగ రావు తీసిన ‘మావూరు’, ‘ఆకృతి’ లాంటివి ఉత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక ఫీస్టివల్ ను  మొదటి రోజు దర్శకులు ఎడిటర్ శ్రీ బి.లెనిన్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. సభలో అతిథిగా దర్శకులు, ఆత్మీయులు శ్రీ అక్కినేని కుటుంబరావు పాల్గొన్నారు. కఫిసో ఫోటో ప్రదర్శనని అప్పటి మేయర్ శ్రీ డి.శంకర్ ప్రారంభించారు. ఉత్సవంలో భాగంగా ఒక రోజు ‘ఎ ఫోకస్ ఆన్ కరీంనగర్’ అన్న విభాగాన్ని స్థానీయ దృక్పధం తో రూపొందించాము. దాన్లో శ్రీ  పోల్సాని వేణుగోపాల రావు రూపొందించిన ‘మనసున మనసై’, శ్రీ రమేశ్ తీసిన ‘నా తల్లి తెలంగాణ’, శ్రీ కే.ఎన్.టి.శాస్త్రి సిరిసిల్లా చేనేత కార్మికుల ఆత్మహత్యల పైన రూపొందించిన ‘డెత్ లూమ్స్’, పోలీసులు నక్సల్స్ నడుమ జరుగుతున్న హింస దాని పర్యవసానాల పైన రూపొందించిన ‘స్టేట్ ఆఫ్ కిల్లింగ్స్’ లాంటి అనేక ఫిల్మ్స్ ప్రదర్శించాము. ఫెస్టివల్ లో మరో రోజు నిర్వహించిన సెమినార్లో Indian Documentary Cinema- Emerging Trends’ అన్న అంశం పైన ఆసక్తికరమయిన చర్చ జరిగింది. అందులో శ్రీయుతులు హెచ్.ఎన్.నరహరిరావు, కె,ఎన్.టి.శాస్త్రి, సినిమాటోగ్రాఫర్ దర్శకుడు ఎం .వి. రఘు, దర్శకుడు గోపాలకృష్ణ, ప్రకాష్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చలూ, ప్రదర్శించిన సినిమాలు అన్నీ కఫిసో సభ్యుల్ని విశేషంగా ప్రభావితం చేశాయి. ఇక ఫెస్టివల్ ముగింపు రోజు అప్పటి స్థానిక పార్లమెంట్ సభ్యుడు శ్రీ కే.చంద్రశేఖర్ రావు గారిని అతిథిగా పిలిచాము. మిత్రుడు శ్రీ నారదాసు లక్ష్మణ రావు చొరవతో అధి సాధ్యమయింది. అప్పుడు ఎంపీ చంద్రశేఖర్ రావు గారు కరీంనగర్ లో భావన నిర్మాణంలో వున్నారు. ముగింపు రోజు నేనూ లక్ష్మణ్ రావు ఆయన దగ్గరికి వెళ్ళాం. నిర్మాణం పనిని తానే దగ్గర వుండి పర్యవేక్షిస్తున్నారాయన. మాతో పాటు ఫిలిమ్ భవన్ కు వచ్చారు. మొదట హాలు పైన ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను చూశారు. ఆప్పుడు ఆయనపై వున్న క్రేజ్ తో అనేక మంది తోసుకుని వస్తే తానే ‘ఏమయ్యా ఫోటోల్ని చూడనీయండి.. నేనెక్కడికీ పోను..’అంటూ నిలువరించారు. తర్వాత జరిగిన సభలో కళలు, సినిమాలు, తెలంగాణ అన్న అంశాల్నీ జోడించి అద్భుతమయిన ప్రసంగం చేశారు శ్రీ చంద్రశేఖర్ రావు. ఆయన ప్రసంగం తర్వాత అధ్యక్ష్య స్థానంలో వున్న ‘ఈ ప్రసంగం విన్నతర్వాత మిమ్మల్ని కేవలం రాజకీయ నాయకుడు అని ఎవరంటారు సర్’ అన్నాను. ఆయన నవ్వేసి ఊరుకున్నారు. మిత్రుడు నారదాసు లక్ష్మణ రావు, శ్రీనివాస్, నరహరి రావు తదితరులు ప్రసంగించారు. ఎంపీ గారు తన ఒక నెల జీతం కాఫీసోకు ఇస్తామన్నారు, జీవిత సభ్యుడిగా వుంటానన్నారు. తర్వాత అవేమీ జరగలేదు అది వేరే విషయం అనుకోండి.

అట్లా కఫిసో మొదటి జాతీయ స్థాయి  ఫెస్టివల్ విజయవంతంగా ముగిసింది.

 తర్వాత పర్యావరణంలో ప్రధాన మయిన నీరు అంశాన్ని తీసుకుని ఆగస్టులో ఫిలిమ్ భవన్ లో ఒక ప్రత్యేక ఫిలిమ్ ఫెస్టివల్ ఏర్పాటుచేసాము. అప్పటికే బెంగళూరు తదితర కేంద్రాల్లో నిర్వహిస్తూ వచ్చిన “ VOICES FROM WATERS”  INTERNATIONAL FILM FESTIVAL ON WATER’  ఉత్సవాన్ని కరీంనగర్ కు తెచ్చాము. బెంగళూరుకు చెందిన నా మిత్రుడు జార్జ్ కుట్టి, హైదరబాద్ కు చెందిన సరస్వతి కవుల తదితరుల సహకారం తో ఈ ఫెస్టివల్ ఏర్పాటయింది. కుట్టి అప్పటికే ‘DEEP FOCUS’ సినిమా పత్రికకు సంపాదకుడిగా వున్నాడు. అది సినిమా గురించి చాలా సీరియస్ అంశాల్ని గురించి వ్యాసాలు, వ్యాఖ్యల్ని ప్రచుర్ఞ్చెది. చాలా గొప్ప పేరున్న పత్రియకది దానితో పాటు జార్జ్ కుట్టీ కూడా పేరున్నవాడు. ఆ ఫెస్టివల్ సందర్భంగా ఏర్పాట్లు ఘనంగానే చేశాం. పోస్టర్ విడుదల, ఉత్సవ నిర్వహణ లు కాఫీసో మిత్రుల్నే కాకుండా పలువురు పర్యావరణ వేత్తలు,అసంఖ్యాక ప్రేక్షకుల నడుమ ఆ ఉత్సవం పది రోజుల పాటు విజయవంతంగా జరిగింది.  

అప్పుడే ఆ ఉత్సవాల తర్వాత కఫిసో పక్షాన ఫిలింభవన్ లో ‘ఎర్త్’.‘వాటర్’ ,‘ఫైర్’మూడు సినిమాల తో దీపా మెహేతా ఫిలిమ్ ఫెస్టివల్ ని ఏర్పాటు చేశాము.  ఆ సినిమాలకు మంచి  స్పందన వచ్చింది. అయితే ఆ సినిమాల పైన కోపంతో కొన్ని సంస్థలకు చెందిన కొందరు ఫిల్మ్ భవన్ పై దాడి చేశారు. ఫర్నీచర్ పగుల కొట్టి నానా హంగామా చేశారు…అదంతా నేను ప్రత్యక్షంగా ఎదుర్కొన్నాను కనుక అదొక చిత్రమయిన భిన్నమయిన అనుభవం . ఆ రోజు నాకు శ్రీ జగదీశ్వర్ రావు లాంటి  ఒకరిద్దరు మిత్రులు అండగా వుండి నాపై భౌతిక దాడి జరగకుండా చూశారు.

ఆ వివరాలతో మళ్ళీ వారం కలుస్తాను.

-వారాల ఆనంద్                               

వారాల ఆనంద్

Posted on

‘కవిత్వం’

వారాల ఆనంద్

‘కవిత్వం’

+++++

మైదానం లో బాల్యం

@@@

1)

వేసవి సెలవులిచ్చారు

మైదానాల్లో

పువ్వులు విచ్చుకున్నాయి

********************

2)

మైదానంలోకి

అతిథులొచ్చారు

బాల్యం వాసనల ఘుమ ఘుమ

*********************

3)

మైదానాల్లో

పిల్లల వర్కౌట్లు

హోమ్ వర్క్ కి సెలవులొచ్చాయి

**********

4)

మైదానాల్లో

గువ్వలు ఆడుకుంటున్నాయి

స్కూళ్ళ గెట్లకు తాళాలు పడ్డాయి

****************

5)

కేరింతల జోరు

మైదానాల గాలినిండా హోరు

పాపం ‘ సైలెన్స్’ గొంతు మూగబోయింది

*********************

6)

బండి చక్రం లా

మైదానం గిర గిరా గిర గిరా

రన్నింగ్ ట్రాక్ మీద పిల్లలా మజాకా

************

7)

వేసవి కాలం

సూర్యుడికంటే ముందే లేస్తున్నారు

వెళ్ళాల్సింది స్కూలుకు కాదు కదా

**********

😎

స్వరాలూ సరిగమలూ

రాగాలూ అనురాగాలూ

‘బాలసదన్’ నిండా కచేరీలే

**********

9)

తన్నుడు తంతే

బంతి ఆకాశంలోకి ఎగిరింది

పశ్చిమాన సూర్యుడు అస్తమిస్తున్నాడు

**********

10)

వేసవి వేళ

ఆటలున్నాయి పాటలున్నాయి

‘కథల చెట్టు’ అమ్మమ్మే లేదు

**************************

9440501281

Group of happy Gypsy Indian children – desert village, Thar Desert, Rajasthan, India

91=యాదొంకి బారాత్

Posted on

+++ వారాల ఆనంద్

‘ జిందగీ ఎక్ సఫర్ హయ్ సుహానా

యహా కల్ క్యా హో కిస్నే జానా…

హస్తే గాతే జహా సె గుజర్

దునియా కే తు పరవా న కర్..”

రాజేష్ ఖన్నా ను విపరీతంగా అభిమానిస్తున్న కాలం అది. ఆనాటి విజయవంతమయిన  ‘అందాజ్’ లోని ఆ పాట ఇప్పటికీ ఎప్పటికీ మదిలో అట్లా మోగుతూనే వుంది. ‘ఆనంద్’ సినిమాతో రాజేష్ ఖన్నా అంటే ఒక పిచ్చి లాంటి ఫీలింగ్ వుండేది. తర్వాత తర్వాత అది కాస్తా పాటల వైపు బినాకా గీత్ మాలా వైపునకూ మరిలింది. హిందీ సినిమాలూ పాటలూ నా బాల్యాన్నీ, కొంత యవ్వనాన్నీ చుట్టేసుకున్నాయి. ఆక్రమించుకున్నాయి.  క్రమంగా వయసూ  అవగాహన పెరగడంతో పాటు అర్థవంతమయిన సిన్మాల పరిచయం, వాటి వీక్షనాలతో దృష్టి మారి ఫిలిం సొసైటీ ఉద్యమంలోకి, అర్థవంతమయిన సినిమాల వైపు వచ్చేసాను.

2005లో మా కరీంనగర్ ఫిలిం సొసైటీ కి సొంత ‘ఫిలింభవన్’ ఏర్పడిన తర్వాత దాన్ని పూర్తిగా వినియోగంలోకి తేవాలన్నది తపన. కానీ మాకు అన్నివిధాల అండగా వున్న కలెక్టర్ పార్థసారథి గారు బదిలీ అయి వెళ్ళిపోయాక ఒకటి రెండు వారాలు ఎదో తెలియని స్తబ్దత. కొత్త కలెక్టర్ గా శ్రీ ఎం.వి.సత్యనారాయణ వచ్చారు. పార్థసారథి గారు ఉన్నప్పుడే ఒక రోజు సీనియర్ ఐఏఎస్ అధికారి సాంస్కృతిక రంగానికి  హైదరాబాద్ లో అండగా వున్న శ్రీ కే.వి.రామణా చారి కరీంనగర్ కు తన అధికార పర్యటనలో భాగంగా వచ్చారు. కలెక్టరేట్ లో ఆ రోజు సాయంత్రం సమావేశం తర్వాత కలవమని పార్థసారథి గారి నుంచి సమాచారం వచ్చింది.   నేను వెళ్లి కలిసాను. రమణా చారి గారు కూడా ఆదరంగా మాట్లాడారు. మా ఫిలింభవన్ చూడటానికి రండి సర్ అని అడిగాను. ఇవ్వాళ కాదు కాని రేపు ఉదయం వస్తాం. మీ సభ్యులందరిని పిలువు అన్నారు పార్థసారథి గారు. ఇంకేముంది మా ఫిలిం సొసైటీ సభ్యులతో పాటు సాహితీ సంఘాల వారిని, లోక్ సత్తా, వినియోగదారుల మండలి తదితర సంస్థలన్నింటికీ వర్తమానం పంపాము. ఉదయమే కళాభిమానులయిన ఇద్దరు అధికారులు వచ్చారు చిన్న సన్మానం తో పాటు మా సంస్థ వివరాలు చెప్పాను. ఎన్.శ్రీనివాస్ తో పాటు పలువురు మాట్లాడారు. రమణా చారి గారు కూడా అర్థవంతమయిన సినిమా కోసం కృషి చేస్తున్న సంస్థకు సొంత హాలు ఏర్పాటు కావడం తన కెంతో ఆనందంగా వుందని అంటూ పిల్లల కోసం క్రమం తప్పకుండా సృజనాత్మక, ప్రేరణాత్మక కృషి చేయమని సూచించారు. ఆ నాటి చిన్న సభ మా అందరిలో గొప్ప ఉత్సాహాన్ని తెచ్చింది.

ఇక కొత్త కలెక్టర్ గా జాయిన్ అయిన శ్రీ ఎం.వి.సత్యనారాయణ గారిని కలిసే కార్యక్రమం ఒక రోజు పెట్టుకున్నాం. అప్పటికి కరీంనగర్ ఫిలిం సొసైటీలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న  ఉద్యమకారుల్లో అధికమంది శ్రీనివాస్ ప్రేరణ తో వినియోగదారుల మండలి, లోక్ సత్తా సంస్థల్లో  పనిచేస్తూ వచ్చారు. కరీంనగర్ లో సాహిత్యానికి ‘సాహితీ గౌతమి’, మంచి సినిమాలకు ఫిలిం సొసైటీ, సామాజిక అంశాలకు పోరాటాలకు వినియోగదారుల మండలి, లోక్ సత్తా సంస్థలు పర్యాపదాలుగా మారిపోయాయి. ప్రగతిశీలమయిన భావాలతో నిస్వార్థంగా నిజాయితీగా పనిచేస్తారని ఈ సంస్థలకు ప్రజల్లో విశేష ఆదరణ ఏర్పడింది.

నా మట్టుకు నేనయితే  కరీంనగర్ ఫిలిం సొసైటీ కే పూర్తి సమయాన్ని వెచ్చించాను. ఫిలిం ఫెస్టివల్స్, ఫిలింమేకింగ్ కోర్సులు, శిక్షణలు, పిల్లల సినిమాలు ఇవే నా ప్రధాన కార్యక్రమాలయ్యాయి. మరోవైపు సాహిత్యం కవిత్వంతో వున్న అనుబంధం వల్ల ‘సాహితీగౌతమి’ లో మొదటి నుంచీ అదే అనుబంధాన్ని కలిగి వున్నాను. అధ్యక్ష కార్యదర్శులు లాంటి ప్రధాన బాధ్యతల్ని ఎప్పుడూ తీసుకోలేదు కానీ ప్రతి సందర్భంలో సంస్థ తోనే వున్నాను. ఇక లోక్ సత్తా సంస్థ పైన నాకంత సదభిప్రాయం లేదు. జే.పి. కార్యక్రమాల పైన నాకు మొదటి నుండీ అనేక అనేక అనుమానాలు. తెలంగాణాకు వ్యతిరేకమని ఒక రకమయిన కోపం కూడా వుండేది. కానీ కరీంనగర్ లో అంతా మన వాళ్ళే వున్నారని మౌనంగా వుండేవాన్ని. ఇక వినియోగదారుల మండలి విషయం లో నేను 90 లలో ‘ఈనాడు’కు రాస్తున్న కాలంలో ఒక వింత అనుభవం ఎదురయింది. అప్పటి జిల్లా న్యాయమూర్తి గారే జిల్లా వినియోగ దారుల కోర్టుకు కూడా జడ్జ్ గా వుండేవారు. ప్రత్యేక వినియోగదారుల కోర్టులు ఇంకా అప్పటికి రాలేదు. నేను ఆయన్ని కలిసి ఈనాడు కు వారం వారం ప్రజల ప్రశ్నలకు జవాబులు ఇచ్చేటందుకు అంగీకరింప చేసాను. ఆయన కూడా ఉత్సాహపడ్డారు. కొన్ని వారాలు ప్ర.జ శీర్షిక బాగా నడిచింది. ఇంతలో వినియోగదారుల మండలి వాళ్ళు జడ్జి గారు ఇట్లా సమాధానాలు ఇవ్వడం సరికాదని ఆయనకే ఫిర్యాదు చేసారు. దాంతో ఆయన నన్ను పిలిచి ఇక ముందు జవాబులు ఇవ్వలేనని న్నారు. నాకర్థం కాలేదు ఆ శీర్షిక ప్రజల్ని చైతన్యవంతులను చేయడానికే కదా మరి ఈ స్వచ్చంద సంస్థ ఇట్లా ఫిర్యాదు చేయడం ఏమిటని బాధ పడ్డాను. ఒక రకంగా కోపం కూడా వచ్చింది. కానీ అందరూ రోజూ కలిసే వాళ్ళే మిత్రులే. మౌనంగా ఊరుకున్నాను. అప్పటినుండి ఆ సంస్థ పట్ల నాకున్న సదభిప్రాయం పోయింది. కానీ మిత్రులుగా అందరం ఒకటిగానే వున్నాం. విశాలమయిన లక్ష్యాల కోసం కొన్ని ప్రవర్తనల్ని, కొన్ని సమయాల్ని కొన్ని వ్యతిరేక సందర్భాలనీ వదిలేయాలనుకున్నాను. ఆ క్రమంలోనే కలెక్టర్ సత్యనారాయణ గారిని ఫిలిం సొసైటీ, వినియోగదారుల మండలి, లోక్ సత్తా సంస్థల ప్రతినిధులం ఒకరోజు ఉదయాన్నే వెళ్లి  ఆయన్ని కలిసాం. అప్పటికే తనకున్న ఫీడ్ బాక్ తో పాటు మా అందరినీ చూసి ఆయనలో ఉత్సాహం పెల్లుబికింది. మంచికి నేనున్నాను అన్నారు. సంతోషంగా తిరిగి వచ్చాం.

నేనయితే ఫిలిం సొసైటీ విషయాలతో పాటు కలెక్టర్ గారికి మా ఎస్.ఆర్.ఆర్. కాలేజీ విషయాలూ, మా లైబ్రరీ భావన నిర్మాణానికి జరుగుతున్న జాప్యాన్ని గురించీ మరోసారి కలిసి వివరించాను. నేను మీ కాలేజీకి వస్తాను అన్నారాయన. అంతకంటేనా అన్నాను. కాలేజీలో అప్పటికే ప్రిన్సిపాల్ శ్రీ రాంచందర్ రావు పదవీ విరమణ చేసారు. సీనియర్ ఫాకల్టీ మెంబర్ శ్రీ పి.కొండల్ రెడ్డి ప్రిన్సిపాల్ గా పూర్తి అదనపు బాధ్యతలు తీసుకున్నారు. నేను ఆయనకు చెప్పాను మర్నాడు ఉదయం కలెక్టర్ వస్తారని. ఆయన ఎంతో సంతోష పడ్డారు. ఇంజనీరింగ్ అధికారులు వెంటరాగా కలెక్టర్ సత్యనారాయణ గారు కాలేజీకి వచ్చారు. మొదట కాలేజీ ప్రస్తుత లైబ్రరీని చూద్దామన్నారు. లోనికి వచ్చి లైబ్రరీ అంతా కలియ దిరిగారు. అందులో వున్న బుక్స్, రిఫరెన్స్ వసతులు చూసి చాలా సంతోషపడ్డారు. మరింతగా డెవలప్ చేయాలని సూచించారు. ప్రిన్సిపాల్, స్టాఫ్ క్లబ్ కార్యదర్శ్ కె.శంకరాచారి, ఎన్.సి.సి. కాప్టెన్ మధుసూదన్ రెడ్డి, ఎస్.గంగాధర్, ఎం.నారాయణ తదితర అధ్యాపక మిత్రులంతా కలెక్టర్ వెంట వుండి కాలేజీ విశేషాలు వివరించారు. నిర్మాణంలో వున్న కొత్త లైబ్రరీ భవనం చూద్దాం అన్నారు. అందరమూ కాలేజీ ప్రధాన భవనానికి బయట పక్కన నిర్మాణమవుతున్న భవనం లోనికి వెళ్లాం. అక్కడా ఆయన మొక్కుబడిగా కాకుండా అన్ని గదులూ పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారులకు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అక్కడికక్కడే ఆదేశాలిచ్చారు. మర్నాటి నుండీ నిర్మాణం పనులు వేగం పుంజుకున్నాయి. చాలా సంతోష పడ్డాం.  

ఫిలింభవన్ లో ప్రతి సంవత్సరం లాగే కొత్త సంవత్సర సంబరాల్ని 31 డిసెంబర్ 2006 రోజున ఏర్పాటు చేసాం. గౌరవాధ్యక్షులు కలెక్టర్ కూడా వచ్చేసారు. ఆ సదర్భంగా కఫిసో త్వరలో జాతీయ స్థాయిలో షార్ట్ అండ్ డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించాలను కుంటున్నా మని నేను చెప్పాను. తన వంతు పూర్తి సహకారం అందిస్తానని కలెక్టర్ కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ హామీ ఇచ్చారు.

‘IN INDIA THE DACUMENTARY IS LIKE AN OASISI OF REALITY IN THE FEATURE FILM DESERT OF ARTIFICIALITY’ అన్న రిత్విక్ ఘటక్ మాటలని స్పూర్తిగా తీసుకుని మొట్టమొదటి ‘జాతీయ స్థాయి శాతవాహన షార్ట్ అండ్ డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివల్’ నిర్వహణ ఏర్పాట్లల్లో మునిగి పోయాను.

ఇంతలో మా కాలేజీ గ్రంథాలయ భవనం నిర్మాణం పూర్తి అయింది. ప్రిన్సిపాల్ కొండల రెడ్డి గారు మంత్రి శ్రీ ఎం.సత్యనారాయణ గారిని ప్రారంభోత్సవాన్ని గురించి సంప్రదించారు. అప్పటి కేంద్ర మంత్రి శ్రీమతి పురందేశ్వరి గారి ప్రోగ్రాం జిల్లాలో వుంది ఆమెతో ప్రారంభంప చేద్దాం. అన్నారు. రాజు తలుచుకున్నంక దెబ్బలకు కరువా అన్నట్టు. ప్రారంభోత్సవ ఏర్పాట్లు మొదలయ్యాయి. నేను కొత్త భవనంలో వున్న గదులకు పేర్లు పెట్టె పనిలో పడ్డాను. రీడింగ్ రూముకు ‘విశ్వనాథ పఠన మందిరమని’, రెఫెరెన్స్ గదికి పీవీ పేరును, బుక్ స్టాక్ హాల్ కు ‘ఎలగందుల నారాయ’ పేరును రాయించాను. ఇక మొత్తం లైబ్రరీ భవనానికి “శాతవాహన గ్రంధాలయం” అని ఆర్టిస్ట్ తో రాయించాను. గతంలో కాలేజీ ప్రధాన భవనం మొదటి అంతస్తులో హాలుకు ‘కాళోజీ’ పేరును రాయిన్చినట్టుగానే నేనే చొరవతీసుకుని లైబ్రరీ కి కూడా రాయించాను. ప్రిన్సిపాల్స్ కు చెబితే కమిటీలు  తీర్మానాలు అవీ అని రాద్దాంతం చేస్తారని నేనే రాయించేసాను . ప్రిన్సిపాల్స్ నా వెనకాల ఏమనుకున్నారో ఏమో కానీ వాళ్ళ ఇగో లు అవీ పక్కన బెట్టి బాగుంది ఆనంద్ అని మాత్రం అన్నారు. నాలో నేనే నవ్వుకున్నాను. అది కరెక్ట్ కాదు కదా అని తోటి అధ్యాపకులు కొందరు అన్నారు. సరే ఆ పేర్లు కరెక్ట్ కాదు వద్దంటే మలిపించేస్తాను కదా.. అన్నాను. అట్లా కాలేజీ లైబ్రరీకి పేరు నిలబడిపోయింది. ఇంతలో ప్రారంభోత్సవ సమయం రానే వచ్చింది. ఏర్పాట్ల విషయంలో మా లైబ్రరీ సిబ్బంది తో పాటు నాతో స్నేహంగానూ, ఎంతో అభిమానంగానూ వుండే కాలేజీ Electrician శ్రీ నాగరాజు,  Clerk శ్రీ నరేందర్ ఎంతగానో సాయపడ్డారు.

ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి పురందేశ్వరి గారితో పాటు అప్పటి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ శ్రీ సురేష్ రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, తదితరులు అనేక మంది వచ్చారు. రీడింగ్ రూములో  శాతవాహన పుస్తక ప్రదర్శన పేర కరీంనగర్ జిల్లా రచయితల కవుల రచనల్ని, వారి ఫోటోలతో పాటు ప్రదర్శనకు పెట్టాను. ప్రారంభోత్సవ సమయానికి మిత్రుడు కామర్స్ అధ్యాపకుడు శ్రీ బి.రాజమౌళి రిబ్బన్ కట్ చేసే కత్తెర తదితర సామగ్రి తో వున్న ప్లేట్ పట్టుకుని ద్వారం వద్ద నిలబడ్డారు. నేనేమో జనంలో ఎక్కడో వుండి పోయాను. ఇక పుస్తక ప్రదర్శన సమయానికి లోనికి వెళ్లేందుకు యత్నిస్తే శ్రీధర్ బాబు ఏమిటది అంటూ నన్ను నిలువరించారు. అప్పుడు ఏమండీ ఈ హాలు నాదండి నేనిక్కడి భాద్యుడిని అన్నాను. నేను లోనికి వెళ్లి పుస్తకాల గురించి జిల్లా రచయితల గురించి చెప్పాలని నా ప్రయత్నం ఫలించలేదు. కార్యక్రమం ముగించేసి అతిథులు వెళ్లి పోయారు. మేమంతా హమ్మయ్య అంటూ ఊపిరి తీసుకున్నాం.

ఇదిట్లా వుండగా కఫిసో నిర్వహించ తలపెట్టిన మొట్ట మొదటి షార్ట్ అండ్ డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివల్ ఏర్పాట్లల్లో మునిగి పోయాను. బెంగళూరు శ్రీ హెచ్.ఎన్.ఎన్.నరహరి రావు, ముంబై శ్రీ  సుదీర్ నందగావుకర్, కొలకత్తా శ్రీ  ప్రేమేంద్ర మజుందార్, హైదరాబాద్ శ్రీ బి.హెచ్.ఎస్.ఎస్.  ప్రకాష్ రెడ్డి, మధురై శ్రీ ఆర్.ఎస్. రాజన్,చెన్నయి శ్రీ కోదండరామన్ లతో సహా పలు ప్రాంతాల ఫిలిం సొసైటీ మిత్రుల్నీ ఫిలిం మేకర్స్ ని సంప్రదించే పనిలో పడ్డాను. కరీంనగర్ లాంటి మారు మూల ప్రాంతంలో ఫెస్టివల్ అనేసరికి కొందరిలో ఉత్సాహం, మరికొందరిలో నిరాసక్తత రెండూ ఎదురయ్యాయి కానీ మొత్తం మీద మంచే స్పందనే వచ్చింది… ఆ వివరాలతో పాటు మేమునిర్వహించిన INTERNATIONAL FILM FESTIVAL ON WATER విశేషాలతో మళ్ళీ వారం కలుస్తాను…

-వారాల ఆనంద్   

7 May 2023             

69=యాదొంకి బారాత్

Posted on

69=యాదొంకి బారాత్

  • వారాల ఆనంద్

******

కళా సృష్టి అనేది

మనసుకు అంటిన మాలిన్యాన్ని తొలగించి

ప్రతిమను రూపొందించడం లాంటిది

‘కళ’

అంటే కలల లోకంలోంచి వాస్తవ ద్వారం గుండా

విశ్వంలోకి చేసే ప్రయాణమే

అట్లా సాగుతున్న నా ప్రయాణంలో 1999లో రెండు సినిమాల పుస్తకాల ఆవిష్కరణలు  జీవితంలో ప్రధాన ఘట్టాలే కాదు నాకో అపురూపయిన అనుభవాలు కూడా. అదట్లా ఉంచితే వాటికి ముందే విడుదలయిన ‘మానేరు తీరం’ మరెన్నో జ్ఞాపకాల్నీ ఎంతో మంది సాహితీ మిత్రుల్నీ కలిపింది. ‘మానేరు తీరం ’ బాగుందన్న వాళ్ళున్నారు, అదంతా కవిత్వమే నువ్వేదో ఫీచర్ అంటున్నావ్ అని కోప్పడ్డ వాళ్ళూ వున్నారు. కవులంటే కవిత్వమంటే ఏమయినా అయిష్టమా అన్నవాళ్ళూ వున్నారు. అదేమీ లేదండీ బాబూ అని సర్ది చెప్పుకోవడం కూడా జరిగింది. దాంతో పాటు అప్పటికి కొంత మంది మిత్రులవి కొన్ని పుస్తకాలు వెలువరించడం లో నా ప్రమేయం కూడా ఉండడంవల్ల మరికొంత మంది బాగా దగ్గరయ్యారు. అట్లా చెప్పుకోవాల్సిన మిత్రుల్లో డాక్టర్.టి. రాధా కృష్ణమాచార్యులు ఒకరు. తాను క్వాలిఫైడ్ హోమియో డాక్టర్. దాంతో పాటు సాహిత్యం మీద ఆసక్తి మమేకత్వంతో ఉస్మానియాలో ఎం.ఏ. తెలుగు కూడా చేసారు. వరంగల్ వాసి అయిన తాను కరీంనగర్ కు చెందిన లెక్చరర్ సుజాత గారి తో వివాహం అయ్యాక కరీంనగర్ వచ్చి స్థిరపడ్డారు. కరీంనగర్ లో ప్రముఖ సర్జన్ అయిన డాక్టర్ వి. భూంరెడ్డి గారి ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ గా చేసే వారు. నాకు మొదట మిత్రుడు డాక్టర్ కే.సత్యసాగర్ రావు గారి ద్వారా తను పరిచయం. సాహిత్యం ఇదరికీ కామన్  ఇంటరెస్ట్ కనుక బాగా దగ్గర అయ్యాం. మేడం సుజాత గారు కూడా ఆత్మీయంగా వుండేవారు. సో క్రమంతప్పకుండా కలిసేవాళ్ళం. రోడ్డు మీదయినా తన క్లినిక్ లోనయినా గంటలకు గంటలు మాట్లాడేవాళ్ళం. అప్పుడప్పుడూ నలిమెల భాస్కర్, ధర్భశయనం కూడా మాతో చేరేవాళ్ళు.  డాక్టర్.టి. రాధా కృష్ణమాచార్యులు డాక్టర్ భూంరెడ్డి ఆసుపత్రితో పాటు కొంతకాలం స్వయంగా సేయింట్ జాన్స్ స్కూలు వద్ద, మరికొంత కాలం భారత్ టాకీసు వద్ద క్లినిక్ పెట్టారు. సాయంత్రాలు అక్కడ కలిసేవాళ్ళం. సాహిత్యాన్నిగురించీ వైద్యాన్ని గురించీ చర్చల తర్వాత ఆల్ఫా చౌరస్తాలో వున్న ‘ఆనంద్ స్వీట్ హౌస్’ కాఫి తాగేవాళ్ళం ( స్వీట్ హౌస్ నాపేర వుంది కానీ నాది కాదండీ బాబూ). దర్భశయనం కరీంనగర్ ఆంద్ర బాంక్ మెయిన్ బ్రాంచ్ లో పని చేసినంత కాలం ఆయన దగ్గరికి వెళ్ళిన ప్రతి సారీ అదే స్వీట్ హౌస్ లో కాఫీ తప్పనిసరి. వీడేదో మరుగు మందు పెట్టాడు మనకు అనుకునే వాళ్ళం సరదాగా.  

     అప్పుడే డాక్టర్.టి. రాధా కృష్ణమాచార్యులు తాను రాసిన కవితలతో పుస్తక వేద్దామనే ఆలోచన వచ్చింది. ఇంకేముంది మానేరు తీరం ను ఫాలో అయిపోవడమే అన్నారు. అమర్ డీ టీ పీ, హదరాబాద్ ఓం సాయి లో ప్రింటింగ్. బాధ్యత నా మీదే పెట్టాడాయాన. మనకిష్టమే కదా. “మౌనం మాట్లాడింది” కవితా సంకలనం పూర్తి అయింది. ఇక ఆవిష్కరణ పెట్టాలి. ఎవర్ని పిలవాలని ఆలోచించి వరంగల్ నుంచి డాక్టర్ కాత్యాయిని విద్మహే గారిని పిలవాలనుకున్నాం. మీది వరంగల్ కదా వెళ్ళండి అన్నాను.. లేదు నువ్వూ రా అన్నాడాయన, తప్పేదేముంది వెళ్ళాము. ఆమె కరీంనగర్ రావడానికి అంగీకరించింది. సభకు డాక్టర్ గండ్ర లక్ష్మణ్ రావు అధ్యక్షత వహించగా డాక్టర్ వి. భూంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేను ఆడియెన్స్ లో వున్నాను. సభ బాగా జరిగింది. తర్వాత సమీక్షలు అవీ మామూలే. అట్లా డాక్టర్.టి. రాధా కృష్ణమాచార్యులు గారు తన మొదటి పుస్తకం తో సాహిత్య ప్రపంచంలోకి వచ్చారు. తన మౌనం మాట్లాడింది లో రాసిన కవితలో ఇట్లా రాసారు..

జ్ఞాపకాలు

నా జీవన వాహిని జ్ఞాపకాలు

నాకుగాక ఇంకెవరికి ఎరుక

నా గుండె గుడిలో ఒదిగిన అనుభవాలు

నాకుగాక ఇంకెవరికి ఎరుక

నా ఎదలో ఒదిగిన పొదిగిన

సుందర స్వప్నాలు నిత్య సత్యాల్ని

ఎవరు బొమ్మగా గీయగలరు

నేను గాక

నా మదిలి ముసిరినా మురిసిన

చీకటి వెలుగు ఆలోచనలను

ఎవరు పాటగా రాయగలరు

నేను గాక

స్నేహ యాత్ర ఓ పొడరిల్లయింది

జీవన యాత్రలో జీవన్ ధారగా సాగింది

ఒడి దొడుకుల బాటలో బతుకు బండి సాగినా

పడిపోకుండా కుదురుగా నడిపించిన

హితైక  హస్తాలు నేస్తాలు

నాకుగాక ఇంకెవరికి ఎరుక ( డాక్టర్ టి. రాధాకృష్ణమా చార్యులు) 

‘మౌనం మాట్లాడింది’ తర్వాత డాక్టర్ టి. రాధాకృష్ణమా చార్యులు వెలువరించిన ‘ఎదారి దీపం’ సంకలనం ప్రచురణలో కూడా నేను చొరవ తీసుకున్నాను. ఆ పుస్తకం ఆవిష్కరణ కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సభలో ఆయనకు సహాధ్యాయి మిత్రుడు అప్పటి ఆదిలాబాద్ ఎం.పి. డాక్టర్ వేణుగోపాలా చారి ఆవిష్కరించారు.

..

డాక్టర్ల ప్రస్తావన వచ్చింది కనుక ఆ రోజుల్లో అంతకు ముందు కూడా మా కరీంనగర్ లో కొంతమంది ఫిసీశియన్స్, సర్జన్స్ చాలా పాపులర్. వారిలో 70,80 దశకాల్లో ఫిసీశియన్స్ గా డాక్టర్ భాస్కర్ మాడేకర్, డాక్టర్ జగన్నాథ రెడ్డి, డాక్టర్ నాగభూషణం లు దాదాపు తొలి తరం వాళ్ళు. వారిలో మాడేకర్ లయన్స్ క్లబ్ లో బాగా ఉత్సాహంగా కృషి చేసారు. అంతేకాదు ఆయన చొరవ, కృషి తో ‘కరీంనగర్ లయన్స్ చారిటబుల్ కంటి ఆసుపత్రి’ని ఏర్పాటు చేసారు. అదిప్పటికీ వేలాది మందికి కంటి సేవలు అందిస్తోంది. దానిపైన నేనో డాక్యుమెంటరీ కూడా చేసాను. ఇక డాక్టర్ నాగభూషణం గారు అపురూపమయిన వస్తువుల్ని సేకరించి ఒక మ్యూసియమే పెట్టారు. కరెన్సీ, కాయిన్స్ తో పాటు ‘కర్రముక్కల్లో కమనీయ రూపాలు’ పేర అందమయిన కర్రముక్కలతో గొప్ప సృజనాత్మకమయిన సేకరణ చేసి పెట్టారు. ఆ తరం తర్వాత ఫిసీశియన్స్ లో నాకు తెలిసి డాక్టర్ ఏ.లక్ష్మినారాయణ, డాక్టర్ విజయ మోహన్ రెడ్డి, డాక్టర్ రఘురామన్ తదితరులున్నారు. ఇక లేడీ డాక్టర్ల లలో అబిదా బానో, ఖుతీజా ఖాతూన్, ఝాన్సీమణి, డాక్టర్ హైమవతి, శారదావాణి ఇట్లా పలువురు వుండేవాళ్ళు. ఇంకా డాక్టర్ శేషగిరి రావు కంటి వైద్యుడి గానే కాకుండా సంగీత నృత్య అభిమానిగా కరీంనగర్ లో ‘త్యాగరాజ లలిత కళా పరిషత్’ అన్న సంస్థను ప్రారంభించి నడిపారు. డెంటిస్ట్ జగన్నాథ రావు, స్కిన్ స్పెషలిస్ట్ కమల్ లాహోటి ఇట్లా నాకు గుర్తున్నంత వరకు పలువురు డాక్టర్లు విశేషంగా సేవలు అందించారు.

ఇక ఫిలిం సొసైటీ విషయాలకు వస్తే 1999-2000 సంవత్సరాల్లో టి.రాజమౌళి, కోల రామచంద్ర రెడ్డి, సీహెచ్ వేణుగోపాల్, వారాల మహేష్ తదితరులు ప్రధాన బాధ్యతల్ని అంటే అధ్యక్ష కార్యదర్శి పోస్టుల్లో వున్నారు. అప్పుడు మీట్ ద డైరెక్టర్ పేర పలు కార్యక్రామాలని నిర్వహించాం. వాటిల్లో ప్రధానమయినది మీట్ ది డైరెక్టర్ జట్ల వెంకటస్వామి నాయుడు. పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్ విద్యార్థి అయిన జట్ల రూపొందించిన మొట్ట మొదటి సినిమా ‘ప్రత్యూష’.

“ప్రత్యూష”

      ఒక మంచి సినిమా ప్రయత్నం “ప్రత్యూష”. ఒక మంచి ప్రయత్నాలు చేయడానికి ధైర్యం కావాలి. చొరవ కావాలి,  గొప్ప ప్రతిభ వుండాలి అకుంఠిత దీక్షా కావాలి. ఒక్కోసారి అన్నీ వున్నా ప్రయత్నం పూర్తి కాకపోవచ్చు. మరోసారి అచంచలమయిన నిబద్దతతో ప్రయత్నం పూర్తి అయినా చివరికి రావల్సినంత గుర్తింపూ గౌరవమూ దొరక్కపోవచ్చు.  చరిత్రలో స్థానమూ అర్హమయినంత దొరక్క పోవచ్చు. కానీ ఆ ప్రయత్నం వెనకాల వున్నకృషీ దాని ప్రభావమూ చివరంటా ప్రభావం చూపుతూనే వుంటుంది. అలాంటి గొప్ప ప్రయత్నమే “ప్రత్యూష” సినిమా. జట్ల వెంకట స్వామి నాయుడు దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమాకు ఒక గొప్ప నేపధ్యముంది. ఆ ప్రయత్నం వెనకాల కొంతమంది యువకుల దీక్ష పట్టుదల వుంది, ఎక్కడో మారుమూల నిజామాబాద్ జిల్లా లోని ఆర్మూర్, అరసవెల్లి గ్రామాలకు చెందిన సాయిలు, నాగ భూషణం, నాగయ్య తదితరుల బృందం కష్టంగా నిధులు సమకూర్చుకుని ఈ సినిమా నిర్మాణానికి పూనుకున్నారు. తెలంగాణా జిలాల్లో నిజామాబాద్ లో ‘జోగిని’, మెదక్ లో బసివిని, కరీంనగర్లో శివసత్తులు లాంటి మూఢాచారాలున్నాయి. దేవుని పేర స్త్రీలను వూరిపరం చేయడం. వూరి ఆస్తిగా పరిగణించడం వుండేది. అలాంటి జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమ ఫలితమే ఈ ‘ప్రత్యూష’ సినిమా. తెలంగాణా కుత కుత ఉడుకుతున్న కాలంలో 1978లో ఈ సినిమా నిర్మాణం మొదలయింది. అప్పుడే పూనా FTIIలో  చదువుకుని వచ్చిన జట్ల వెంకట స్వామి నాయుడు ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టగా, కవి కే.శివారెడ్డి రచన, శీలా వీర్రాజు కళా రంగ బాధ్యతలు చేపట్టారు.

     వాస్తవిక దృక్పధం తో కళాత్మకంగా రూపొందిన ప్రత్యూష పూర్తి అయింది కాని వాణిజ్యపరంగా విడుదల కాలేదు. అప్పటికే సత్యజిత్ రే, మృనాల్ సేన్ లాంటి దర్శకుల సినిమాలను చూసివున్న సొసైటీ సభ్యులు ప్రత్యూష చూసి తెలుగులో ఇలాంటి సినిమాని ఊహించలేదని గొప్ప ఆశ్చర్యానికి లోనయ్యారు. అలాంటి సినిమాను వేములవాడ, కరీంనగర్ ఫిలిం సోసైతీల్లో అప్పటికే ప్రదర్శించాం. కానీ మీట్ ద డైరెక్టర్ అన్నప్పుడు జాట్ల తీసిన రెండు సిన్మాలు వేయాలనుకుని ప్రత్యూష తో పాటు ఆయన తీసిన రెండవ సినిమా ‘శిశిర  కూడా కరీంనగర్ లో వేశాము. టి.జలజవేని, టి.జయలక్ష్మి లు సంయుక్తంగా నిర్మించిన శిశిర లో మీనాక్షి నాయుడు, లింగ మూర్తి, వినోద్ బాల, బిక్షు ప్రధాన భూమికల్ని పోషించారు. శిశిర సినిమా ప్రధానంగా మహిళా కోణం లో రూపొందించబడింది. స్త్రీకి స్వీయ ఆలోచనలు, స్వంత వ్యక్తిత్వమూ వుండాలని చూపించే క్రమంలో ఈ సినిమా సాగుతుంది. సీమ డబ్బున్న తండ్రిని కాదని ప్రేమించిన కృష్ణ ను పెళ్లాడితే అతను కూడా తన తండ్రి డబ్బు కోసమే తనను ప్రేమించాడని, పెళ్ళాడాడని  తెలుసుకుని డబ్బుకోసం అతను పెట్టె హింసల నుండి తప్పించుకునేందుకు ఆత్మహత్యా యత్నం చేస్తుంది. మిత్రుడు రవి కాపాడుతాడు. ఇద్దరూ కలిసి వున్దామనుకుంటారు. కాని ఆమె తండ్రి ఆమెను బలవంతంగా లాక్కొచ్చి స్వయంవరం ఏర్పాటు చేస్తాడు.. సీమ తనకు ఎలాంటి ఆశలు ఆకాంక్షలు లేకుండా మౌనంగా పరిస్థితులకు లొంగి పోతుంది… స్థూలంగా ఇది కథ. సినిమా తర్వాత మీట్ ద డైరెక్టర్ లో జట్ల అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. తన దృక్కోణాన్ని సవివరంగా చెప్పాడు. అట్లా జట్ల  తన రెండు సినిమాలతో మా కరీంనగర్ ఫిలిం సొసైటీ సభ్యులతో ‘కరచాలనం’ చేసాడు. ఇక మరో కార్యక్రమంలో ‘కొమరం భీం’ సినిమా ప్రదర్శించి ఆ చిత్ర దర్శకుడు అల్లాణి శ్రీధర్, కొమురం భీం పాత్రని పోషించిన భూపాల్ లతో కూడా సమావేశం ఏర్పాటు చేసాం.

ఇదిట్లా సాగుతూ వుండగా అగ్రహారం డిగ్రీ కాలేజీ నుండి కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కాలేజీకి బదిలీ ప్రయత్నాలు ఆరంభించాను. కాని అప్పుడు బదిలీల పైన ప్రభుత్వం బాన్ విధించింది. బదిలీ కావాలంటే సెక్రెటేరియట్ నుంచి ఆర్డర్స్ తెచ్చు కోవాలి. అందుకోసం పెద్ద ప్రయత్నమే చేయాల్సి వచ్చింది. దరఖాస్తును మొదట డైరెక్టర్ కు పెట్టాలి. అక్కడినుంచి దాన్ని  సెక్రెటేరియట్ పంపాలి. నాకు అంతగా ఆ వివరాలుతెలీవు. అప్పుడు మిత్రుడు అల్తాఫ్ ఎంతో సహాయం చెసాడు. అత్మీయ మిత్రుడు పీ.ఎస్.రవీంద్ర అపుడు కరీంనగర్ లో జిల్లా విలేఖరిగా వున్నాడు. కరీంనగర్ ఎం.ఎల్.ఏ. కే.దేవేందర్ రావు గారిని కదిలిస్తే ఫైలు కదిలి ఖాళీగా వున్న కరీంనగర్ కాలేజీకి ఆర్డర్స్ ఇచ్చారు. అమ్మయ్య అనుకున్నాను. నేను చదివిన కాలేజీలో ఉద్యోగం గొప్ప ఉద్వేగాన్ని కలిగించింది… అక్కడే ఉద్యోగ విరమణ దాకా 16సంవత్సరాలు పని చేసాను. నా జీవితంలో ఎస్.ఆర్.ఆర్. కాలేజీ ది విడదీయరాని అనుబంధం.. ఎన్నో గొప్ప అనుభవాలు.. అనుభూతులు.. విజయాలు..

అన్నింటి జ్ఞాపకం చేసుకుంటూ వివరిస్తూ మళ్ళీ వారం కలుస్తాను..

-వారాల ఆనంద్