Month: June 2016

మెరుపు e-book

Posted on Updated on

 http://192.168.1.34:9094/index.html#p=3“>మెరుపు e-book

cover full copy

Advertisements

మన రాష్ట్రం-మన సినిమా

Posted on Updated on

varala-anand

PL.CLICK THE LINK

V6 News channel SPL ARTICLE

 

మన రాష్ట్రం-మన సినిమా

(తెలంగాణ సినిమాకు వూపిరి పోయాలి)


సినిమా అద్భుతమయిన అత్యంత ప్రభావవంతమయిన మాధ్యమం. అన్ని సృజనాత్మక కళారూపాల్లోనూ సినిమా వయసు రీత్యా అతి చిన్నది. కానీ దాని ప్రభావం చాలా విస్తృతమయింది. ముఖ్యంగా మన దేశ ప్రజలకు క్రికెట్, సినిమాలు చాలా అభిమాన విషయాలు. సినిమా మనిషి మనోభావాలపయినా రాజకీయాలపయినా తనదయిన ముద్రను కలిగి వుంది. దేశం మొత్తం మీద హిందీ తర్వాత సంఖ్యా పరంగా అధికంగా సినిమాలు నిర్మిస్తున్న తెలుగు సినిమా రంగం గత ఎనిమిది దశాబ్దాలుగా తెలుగు ప్రజల జీవితాలతో విడదీయరాని  బంధాన్ని కలిగి వుంది.

     అయితే అదే తెలుగు సినిమా మొదట్నుంచి ఒక ప్రాంతానికి ఆ ప్రాంత భాషకు జీవన విధానాలకు మాత్రమే పరిమితమయి పోయింది. విషయపరంగానూ సంభాషణలు, పాటలు ఇలా అన్ని విషయాల్లోనూ సినిమా కేవలం నాలుగు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించి ఇతర ప్రాంతాల సంస్కృతి జీవన విధానాలపయిన ఆధిపత్యం చూపించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా తెలంగాణ ప్రజల భాష, జీవన విధానాల్ని విస్మరించడమే కాకుండా ఒక స్థాయిలో హేళన చేసేదాకా వెళ్లింది.

           అందుకే తెలంగాణ అణచివేత క్రమంలో సాంస్కృతిక అణచివేత బాధ్యతని తెలుగు సినిమా తీసుకుంది. సినిమాల్లో వుపయోగించిన భాషలో తెలంగాణ భాషని హాస్యగాళ్లకు, వీధి రౌడీలకు ఇతర అప్రధాన పాత్రలకు వాడి హీరోలకు ఆంధ్రా భాష వుపయోగించి అసలు తెలంగాణ భాష భాషే కాదన్నట్టు, అది కేవలం క్రింది తరగతుల భాషగా చిత్రించడం జరిగింది. ఆ నాలుగు జిల్లాల భాషా సంస్కృతులే గొప్పవన్న భావనను ప్రచారం చేశాయి.

       దాంతో తెలంగాణ సాధన ఉద్యమంలో తెలుగు సినిమాలోని భాష అణచివేత సాంస్కృతిక నిరాదరణ కూడా ఒక ప్రధానమయిన అంశంగా ముందుకొచ్చింది. వెండితెర పయిన తెలంగాణ భాషను గేలి చేయడాన్ని తెలంగాణ యావత్తు ఖండించింది. హీరో వెంకటేష్ నటించిన ‘లక్ష్మి’లాంటి చిత్రాల్లో తెలంగాణ భాష మాట్లాడిన పాత్రకు ఉత్తమ హాస్య నటి అవార్డు ఇచ్చినందుకు తీవ్రమయిన ఉద్యమాలే చేశారు.

        అంతేకాకుండా తెలుగు సినిమాల్లో తెలంగాణ వారికి సరయిన ప్రాధాన్యత లేకపోవడం, అవకాశాలు ఇవ్వకపోవడం ఆ రంగం ఏదో కొంత మంది చేతిలో వుండడం పట్ల కూడా తెలంగాణ సమాజం తమ నిరసనని తెలిపింది. అన్ని సంవత్సరాల స్వీయ అస్తిత్వ పోరాటంలో తెలుగు సినిమా నటులు దర్శకులు మొత్తంగా సినిమా రంగమంతా ప్రేక్షక పాత్రనే పోషించింది. ఆ మౌనం నిండా తెలంగాణ వ్యతిరేకతనే ధ్వనించింది. ఆ విషయాన్ని తెలంగాణ సమాజం గమనించింది. ఎందరో యువకులు ప్రాణదానాలు చేసినప్పుడు కూడా  తెలుగు సినిమా తన సామాజిక బాధ్యతను గుర్తెరగలేదు. ఏ నైజాం ప్రాంత పంపిణీ రంగం నుంచయితే అత్యధిక ఆర్థిక లాభాల్ని పొందుతున్న తెలుగు సినిమా అక్కడ వ్యాపారాన్నే చూసింది తప్ప ఎప్పుడూ సానుకూలంగా ప్రవర్తించిన దాఖలా లేదు. అద్భుతమయిన పోరాట ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయిం తర్వాత కొంతకాలం సినిమా వాళ్ళు మరింత మౌనాన్ని పాటించారు. అంతేకాదు తెలుగు సినిమా వైజాగ్ కు తరలిపోనుందని చాప కింది నీరు లాగా ప్రచారం మొదలుపెట్టారు. రామానాయుడు, చిరంజీవి లాంటి వాళ్ళు వైజాగ్ లో స్థలాలు కొనడం లాంటివి కూడా చేశారు.

        హైదరాబాద్ నుండి తెలుగు సినిమా పరిశ్రమ తరలివెళ్లరాదనే భావనతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రామగిరి ప్రాంతంలో రెండువేల ఎకరాల్లో ఫిలిమ్ నగర్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించడంతో అప్పటిదాకా వూగిసలాటలో వున్న తెలుగు పరిశ్రమ హైదరాబాదే తమకు లాభసాటి,తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలే వుపయోగకరమనే నిర్ణయానికి వచ్చి క్రమంగా హైదరాబాద్ లో స్థిరపడి పోయెందుకు నిర్ణయించుకుంది. దాంతో తెలుగు సినిమా 90 ఫ్లాపులు 10 విజయాలతో  కొనసాగుతూనే వుంది. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా సినిమా రంగానికి స్నేహహస్తం చాపింది. సినిమాటోగ్రఫీ మంత్రిత్వశాఖని వారికి సన్నిహితంగా వుండే వారికే ఇచ్చి సానుకూలతని చాటుకుంది. వెరసి తెలుగు సినిమా తన వొరవడిలో కొనసాగుతున్నది.

       అటు ప్రభుత్వం కానీ ఇటు సమాజం కానీ కోట్ల డబ్బు వున్న వాళ్ళు సినిమాలు తీస్తారు ఇష్టం వున్న వాళ్ళు చూస్తారు అన్న భావనతో వుండి సినిమా రంగం పట్ల వుదాసీనంగా వుండడం అంత సమంజసం కాదు.

       డబ్బున్న వాళ్ళు స్కూళ్లు పెడతారు ఇష్టమున్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని చేరుస్తారు అని ప్రభుత్వం వూరుకోదు కదా. సిలబస్ విషయంలో, ప్రమాణాల విషయంలో కట్టడి చేస్తుంది. మరి అదే సూత్రం సినిమాకి కూడా వర్తిస్తుంది.

     తెలుగు సినిమా నాలుగయిదు దశాబ్దాలుగా ఆ కాలాల్లో ప్రభుత్వాల నుంచి ఎన్నో రకాలుగా లబ్ధి పొందుతూనే వుంది. ఏ కాలంలో కూడా తన బాధ్యతని మాత్రం నిర్వర్తించలేదు కేవలం వ్యాపారమే ధ్యేయంగా సాగింది.

      తెలుగు సినిమా హైదరాబాద్ లో వుండాలి దాని వ్యాపారం వల్ల రాష్ట్రానికి వుపయోగం అనుకున్నప్పటికీ మరి సృజనాత్మక రంగంలో విశేషమయిన ప్రతిభా పాటవాలున్న తెలంగాణ కళాకారుల అవకాశాలూ, తెలంగాణా అస్థిత్వం మొదలయిన అనేక విషయాల్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం వుంది.

        మొత్తంగా తెలంగాణ సినిమాని రూపొందింపచేసి ప్రోత్సహించాల్సి వుంది. తెలంగాణ రీజినల్ సినిమా రంగాన్ని తీర్చిదిద్దుకోవాల్సి వుంది. ఎట్లయితే ముంబైలో హిందీ సినిమా విస్తృతంగా వున్నప్పటికీ మరాఠీ సినిమా తన వునికిని చాటుకుని నిలబడిందో అదే క్రమంలో తెలంగాణ సినిమా నిలదొక్కుకొనేందుకు కృషి జరగాల్సిన అవసరం వుంది. భోజ్ పురి సినిమా ఇవ్వాళ వ్యాపారపరంగా కూడా స్థిరంగా వుంది. అట్లా తెలంగాణ అస్తిత్వాన్ని చాటుకుంటూ సినిమా రావాల్సి వుంది. 

       ఈ నేపథ్యంలో తెలంగాణ ‘మన రాష్టం-మన భాష’ ‘మన రాష్ట్రం-మన పాలన’ అన్నట్టుగా ‘మన రాష్ట్రం-మన సినిమా’ అనే భావనతో సినిమాను చూడాలి. మనదయిన తెలంగాణ సినిమాను నిర్మించుకోవాల్సి వుంది.

        ఇప్పటికి కేవలం బి.నర్సింగరావు 30 ఏళ్ల క్రితం తీసిన దాసి, అంతకుముందు గౌతమ్ ఘోష్ దర్శకత్వంలో నిర్మించిన మాభూమి, తర్వాత అల్లాణి శ్రీధర్ ఐ.టి.డి.యే. సహకారంతో తీసిన కొమురం భీమ్, తర్వాత శంకర్ తీసిన జై బోలో తెలంగాణ లాంటివి మరికొన్ని సినిమాల్ని తెలంగాణ సినిమాలుగా చెప్పుకుంటున్నాము. కానీ ఇవ్వాళ తెలంగాణలో ఎంతో మంది యువకులు సినిమా నిర్మాణం పట్ల దర్శకత్వ రీతుల పట్ల మక్కువతో వున్నారు. తమ ప్రతిభను చాటుకునేందుకు ప్రయత్నాలు ఆరంభించారు. ముఖ్యంగా షార్ట్ ఫిలిమ్ నిర్మాణంలో విశేషమయిన కృషిని కొనసాగిస్తున్నారు. దాదాపుగా అన్ని ఇంజినీరింగ్ లాంటి ప్రొఫెషనల్ కాలేజీల్లో షార్ట్ ఫిలిమ్ ల నిర్మాణం విస్తారంగా జరుగుతున్నది. వారికి యుట్యూబ్ లాంటి ఆధునిక మాధ్యమాలు గొప్ప సహాయకారిగా వున్నాయి. పలుచోట్ల షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కూడా జరుగుతున్నాయి. అయితే వ్యక్తులుగా వారి కృషి పరిమితమయిందే అవుతుంది.

        తెలంగాణ సినిమా అభివృధ్ధికి తెలంగాణ ప్రభుత్వమే ముందుకు రావాల్సి వుంది. కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సినిమా రంగం పట్ల కూడా కొత్తగా ఆలోచించాల్సి వుంది. తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే ఇతివృత్తాలతో సినిమా నిర్మాణాలకు తోడ్పాటును అందించాల్సి వుంది. నిజానికి ఒక వ్యవస్థలాగా తెలంగాణ సినిమా పరిశ్రమ వేళ్లూనుకొనాల్సి వుంది. అందుకోసం తెలంగాణ సినిమా పాలసీని ఏర్పాటు చేసి స్పష్టమయిన దృక్పథంతో ముందుకు వెళ్లాల్సి వుంది.

       నెహ్రూ కాలం నుంచి జాతీయ చలన చిత్రాభివృద్ధి సంస్థ మంచి సినిమాలకు ఆర్థికంగా ఎట్లయితే ప్రోత్సాహకాలు ఇచ్చి శ్యామ్ బెనెగల్ లాంటి అనేక మంది దర్శకులకు వెన్నుదన్నుగా నిలబడిందో అట్లాగే తెలంగాణాలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సంస్థను ఏర్పాటు చేయాల్సి వుంది. ఇక తెలంగాణ యువతకి సినిమా నిర్మాణ రంగంలో శిక్షణ ఇచ్చేందుకు ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు చేయడం తప్పకుండా జరగాలి.

        కథలపరంగా, భావాలపరంగా ప్రతిభావంతులయిన సృజనకారులకు తెలంగాణలో కొదవలేదు. కానీ సినిమా నిర్మాణపరంగా చూసినప్పుడు సాంకేతికత అవసరమవుతుంది. అందుకోసం తెలంగాణ యువతకు విశ్వవ్యాప్త సినిమాల వొరవడిని అర్థం చేసేందుకు తెలంగాణ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ నిర్వహించాలి. ఇలా తెలంగాణ సినిమా తనదయిన వునికిని చాటుకుని నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం సంస్థాపరమయిన చర్యలు చేపట్టాలి.

      ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్న తెలంగాణ సినిమాకు ఆర్థికంగానూ, ఆలోచనపరంగాను, సాంకేతికంగానూ సంపూర్ణ మద్దతు ఇచ్చినప్పుడే తెలంగాణ సినిమా తనదయిన వ్యక్తిత్వంతో నిలదొక్కుకుంటుంది.

      కొత్త భావనతో సరికొత్త ఆలోచనలతో విశ్వవ్యాప్త ప్రతిష్ఠను ప్రాచుర్యాన్ని పొందే అవకాశం వుంది. లేకుంటే మన రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా పరాయి భావాలతో వున్న సినిమాల్నే చూడాల్సి వుంటుంది. ఖచ్చితంగా “మన రాష్ట్రం- మన సినిమా” రావాల్సి వుంది. అదీ వుద్యమరూపంలో ఎదగాలి అప్పుడే తెలంగాణ విశ్వ సినీ యవనిక పయిన వెలుగులు చిమ్ముతుంది.