K. SATCHIDANDAN

ఆధునిక మళయాళ కవి కే.సచ్చిదానందన్

Posted on

వారాల ఆనంద్

PL CLICK THE LINK FOR THE VIDEO

ఇవాళ మళయాళ కవిత్వంలో ఆధునికతకు పాదులు వేసిన కవుల్లో ముందు వరుసలో వున్న కవి కే.సచ్చిదానందన్. ఆయన మలయాళం లోనే 60 కి పైగా పుస్తకాలు వెలువరించారు. వాటిలో 21 స్వీయ కవితా సంకలనాలు, 20 కి పైగా అనువాద సంకలనాలు, పలు నాటకాలు, వ్యాసాలూ, యాత్రా రచనలు, ఆంగ్లంలో పలు విమర్శనా గ్రంధాలు వెలువరించారు. అంతే కాదు ఆయన సమగ్ర కవితా సంకలనం కూడా వెలువడింది.

ఆధునిక కవిత్వం మరాఠీ లో మర్దేకర్, కన్నడలో ఆడిగ, హిందీలో ముక్తిబోద్ ల తర్వాత చాలా కాలానికి మలయాళంలో 1960ల్లో ఆరంభమయింది. అదునికత ఎన్.వి.కృష్ణా వారియర్ రచనల్లో మొదట ధ్వనించి నప్పటికీ ముఖ్యంగా అయ్యప్ప ఫనిక్కర్, కక్కడ్, అత్తూర్ రవివర్మలతో ఆధునికత విస్తరించిందని చెప్పుకోవచ్చు. వారి రచనల ప్రభావం సచ్చిదానందన్ పైన ఆయన తరం పైన గొప్పగా వుంది అనవచ్చు.

“Poetry as I conceive it is no mere combinatorial game; it rises up from the ocean of the unsayable, tries to say what it cannot stay, to name the nameless and to give a voice to the voiceless” అన్నాడు సచ్చిదానందన్.

కవి అనేవాడికి కవిత్వం మినహా మరే మతమూ ఉండాల్సిన అవసరం లేదంటాడు సచ్చిదా. అంతే కాదు ‘I can be spiritual without being religious’ అనికూడా అన్నాడు

అంతే కాదు కవిత్వమంటే తాజాదనం. తాజాదనం అంటే సృజనాత్మకత, పునరావృతం కాని సృజన. రాసిందే రాయడం చెప్పిందే చెప్పడం కవిత్వం కాదు. కవిత్వం లో సత్యం వుండాలి. కవి అనేవాడు కవిత్వ వాస్థవాన్ని విశ్వసించాలి.

ప్రపంచీకరణ ను నిలువరించడానికి కేవలం కవిత్వం శక్తి చాలదు. కాని సాంస్కృతిక ప్రతిఘటన సాధ్యమవుతుంది. అదనుకు కవులు తమ మాతృభాషలో రాయాలి. ప్రపంచీకరణ ఎ విషయాలనయితే మరుగున పరచాలను కుంటున్నదో ఆ అంశాల పైననే దృష్టి సారించాలి.

ఇవాళ ప్రపంచీకరణ ప్రతి అంశాన్నీ సరుకు గా మారుస్తుంది. వినియోగ వస్తువుగా చూస్తుంది. కవిత్వం దాన్ని వ్యతిరేకించాలి. ఇప్పటికి కేవలం కవిత్వమే ఇంకా వినియోగ సరుకుగా మారలేదు.

కవి ప్రజల్లో ప్రజలతో వుండాలి. ఆలోచించాలి, విశ్లేషించాలి నిరంతరం రాస్తూ వుండాలి. ఎక్కడయితే అణచివేత అరాచకం వుంటుందో గమనింఛి వాటి పైన రాయాలి.

కవిత్వానికి ప్రత్యేకంగా కోడ్ ఉండదు కానీ నీతి వుంటుంది. అదేమిటంటే కవి తనకు తాను నిష్కప టాంగానూ నిజాయితీగానూ వుండాలి.

సచ్చిదానందన్ కవిత్వంలో ఆధునికతతో పాటు,సరళత, సూటిదనం,ప్రతీకాత్మకత,వ్యంగం ముఖ్యంగా కనిపిస్తాయి.ఆయన కవిత్వం నిండా న్యాయం,స్వేచ్చ, ప్రేమ, ప్రకృతి, భాష, మరణం ప్రధాన అంశాలు. సచ్చిదానండకి కేవలం కవిత్వమే కాదు సంగీతం, పెయింటింగ్, సినిమాల పట్ల గొప్ప ఆసక్తి వుంది. వాటిని అధ్యయనం చేసి అనుభూతించే తత్వమూ వుంది. కేరళలో ఫిలిం సొసైటీ ఉద్యమం ఉదృతంగా వున్న 70 లలో అంటే అదూర్ గోపాలక్రిష్ణన్ చిత్రలేఖ ఫిలిం సహకార సంఘం ఏర్పాటు చేసి ‘స్వయంవరం’ రూపొందించి గొప్ప విజయాన్ని సాధించిన కాలం అది. అప్పుడే సచ్చిదానందన్ తాను అధ్యాపకుడిగా పని చేసిన ఇరింజలకుడా లో ఫిల్మ్ సొసైటీ స్థాపించి ఐసెన్ స్టీన్, గోడార్డ్, టార్కోవిస్కి, కురుసోవా, ఆన్జేలోపోలస్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దర్శకుల సినిమాలతో రిట్రోస్పెక్తివ్ లను నిర్వహించాడు.

1946 లో త్రిస్సూర్ ప్రాంతం లోని పుల్లూట్ లో జన్మించిన సచ్చిదానందన్ ఆంగ్ల సాహిత్యం లో కేరళ విశ్వవిద్యాలయంలోనూ, డాక్టరేట్ ను కాలికట్ విశ్వవిద్యాలయం లోనూ పూర్తి చేసారు.సచ్చిదానందన్ మొదటి రచన కవిత్వం పై రాసిన వ్యాస సంకలనం ‘కురుక్షేత్రం’. తన తొలి కవితా సంకలనం ‘అంచు సూర్యన్’(అయిదుగురు సూర్యుళ్ళు)ను 1970 వెలువరించారు. అప్పటినుంచి అవిశ్రాంతంగా రచనలు చేస్తూ ఫనిక్కర్ సూచనల మేరకు అధ్యాపకత్వాన్ని వదిలి ధిల్లీ లో సాహిత్య అకాడెమి పత్రిక ఇండియన్ లిటరేచర్ కు సంపాదకుడిగా చేరిపోయారు అనంతరం అకాడెమి కార్యదర్శిగా పదేళ్ళు పనిచేసారు. ఆ తర్వాత ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్సిటీ లో స్కూల్ అఫ్ ట్రాన్స్లేషన్ లో ఆచార్యుడిగా పనిచేసి పదవీ విరమణ పొందారు.

అనేక భారతీయ భాషా కవులతో పాటు అనేక మంది అంతర్జాతీయ కవుల రచనల్ని మలయాళీ భాషలోకి అనువదించారు. పోలాండ్, ఇటలీ తో సహా పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్న సచ్చిదానందన్ పైన దర్శకుడు బాలూ మీనన్ బయోపిక్ రూపొందించి విడుదల చేసారు.

ఇట్లా కేరళనే కాదు మొత్తంగా దేశం గర్వించదగ్గ కవి సచ్చిదానందన్. సచ్చిదానందన్ కవిత్వం ఇప్పటికే అరబిక్, అస్సామీ,బెంగాలీ, ఇంగ్లిష్, ఫ్రెంచ్,ఇటాలియన్, జర్మన్,గుజరాతీ,మరాఠీ, కన్నడ, తెలుగు, లాత్వియన్, ఉర్దూ భాషల్లోకి అనువదించబడింది.

కే.సచ్చిదానందన్ అందుకున్న పురస్కారాల విషయానికి వస్తే ఒక్క కేరళ సాహిత్యాకాదేమీ నుంచే కవిత్వానికి, వచన రచనకు,అనువాదానికి, నాటకానికి, పర్యాటక రచన లకు వేర్వేరుగా అవార్డులు అందుకున్నారు. కేరళ సాహిత్య అకాడమీ వారి ఫెల్లోశిప్ కూడా అందుకున్నారాయాన. ఇక కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని తన ‘మరన్ను వెచ్చ వస్తుకల్’ కు స్వీకరించారు.

సృజనరంగంలో ఆయన చేసిన కృషి దాదాపు అనితర సాధ్యం అనిపిస్తుంది. ఆయన మలయాళం లో ప్రధానంగా కవిత్వం, వచనం, నాటకాలు, పర్యాటక రచనలు చేసారు. ఆయన రచనలు అనేకం ఇతర భారతీయభాషల్లోకి అనువదించబడ్డాయి.ఆయనా ఇతర భాషలలోని రచనల్ని మలయాళం లోకి అనేకం చేసారు. నేరుగా ఇంగ్లీషులో రాసారు. ఆయన అనేక జాతీయ అంతర్జాతీయ సాహిత్య వేదికల పైన మన దేశానికి ప్రాతినిథ్యం వహించాడు, లండన్,రష్యా, మాన్ట్రియల్, రొట్టార్ డాం, లాటి అమెరికా,లాహోర్లాంటి అనేక చోట్ల తన కవిత్వాన్ని వినిపించారు.

ఆయన రాసిన ‘నేను రాసేటప్పుడు’ WHILE I WRITE లోంచి కొన్ని కవితల అనువాదాలు మీకోసం…..

మూలం : కే.సచ్చిదానందన్

తెలుగు స్వేచ్చానువాదం: వారాల ఆనంద్

++++++++++

‘నడవ’ కారిడార్

————-

చాలాకాలంగా ఈ దారెంబడి

నడుస్తూనే వున్నా

కానీ

నా గదికి చేర లేకపోతున్నా

ఈ దారేమో

భూమధ్య రేఖలా

గుండ్రంగా సాగుతూనే వుంది

నిప్పుల కుంపటి లాంటి ‘సహారా’ను

ఈ పాదాలతో దాటడం కష్టం

గడ్డకట్టిన ఆర్కిటిక్ సముద్రం

ఈతకొట్టడాన్ని అనుమతించదు

నాకు తెలుసు

నా గది ఎక్కడో ఒక చోట వుంది

. . .

ఎప్పుడూ కలవని

ఓ నిజమయిన మిత్రుడు

ఎప్పుడూ రాయని

ఓ నిజమయిన కవిత

ఆ గదిలో నాకోసం ఎదురు చూస్తున్నారు

. . .

ఆ దారెంబడి వెళ్తున్న వాళ్ళని అడిగాను

ఈ దారెటు వెళ్తుందని

పాపం

వాళ్ళకూ తెలియదు

గది తెరవడానికి తమ వద్ద

తాళం చెవులు లేకున్నా

వాళ్ళు కూడా తమ తమ గదులకోసం

వెతుకుతూనే వున్నారు.

————————–

వీడ్కోలు

———

పట్టాల మీద ఆన్చిన

తల

పరుగు పరుగున సమీపిస్తున్న రైలు చేసే

దడ దడ శబ్దాన్ని వింటూ

ఇనుప చక్రాల కింద

తన గొంతు

నలిగిపోక ముందు ఆలపించే

కలలు నిండిన గీతం

మన కవిత్వం

—————————————

నేను రాసేటప్పుడు

===========

నేను దుఖంతో రాస్తాను.

నదులేమైనా పొంగి పొర్లుతాయా ?

లేదు, నా చెక్కిళ్ళు

తడుస్తాయంతే.

నేను ద్వేషం తో రాస్తాను.

భూమేమైనా వణుకుతుందా, కంపిస్తుందా ?

లేదు, నా దంతాలు విరుగుతాయంతే.

నేను కోపంతో రాస్తాను.

అగ్నిపర్వతాలేమైనా బద్దలవుతాయా?

లేదు, నా కళ్ళు ఎరుపెక్కుతాయంతే.

నేను వ్యంగ్యంగా రాస్తాను.

ఆకాశాన రాలుతోన్న ఉల్కలేమైనా తళుక్కుమంటాయా ?

లేదు,నా పెదాలపై

విరుపు కన్పిస్తుందంతే

నేను ప్రేమతో రాస్తాను

నా భుజాలపై పక్షులు గూళ్లు కట్టేస్తాయి

పూలూ పళ్లతో చెట్లు వంగిపోతాయి

పొట్లాడుకుంటున్న మనుషులు పరస్పరం

ఆలింగనం చేసుకుంటారు

స్పటికమంతటి స్వచ్ఛ ప్రవాహంలా

భాష తనెంత లోతైనదో వెల్లడిస్తుంది

నా దుఃఖం, ద్వేషం, కోపం, వ్యంగ్యం —

సమస్తం అర్థాన్ని సంతరించుకుంటాయి

నేనేమో

కెవ్వుమంటాను సిలువ పై నుండి

+++++++++++++++++

బామ్మ

——————–

మా బామ్మకు మనో వైకల్యం

ఆ పిచ్చి ముదిరి మరణానికి దారి తీసింది

పిసినారివాదయినా మా మేన మామ

ఆమెను సామాన్ల గదిలో

గడ్డిలో చుట్టి పెట్టేసాడు

మా బామ్మ పొడిబారి పగిలింది

ఆమె విత్తనాలు

కిటికీ అవతలికి ఎగిరి పడ్డాయి

ఎండా కాసింది, వాన కురిసింది

ఓ విత్తనం ఎదిగి చెట్టైంది

ఆమె కోరిక నన్ను తొలిచి వేస్తున్నది

బంగారు పళ్ళ కోతులను గురించి

కవితలు రాయడానికి

నేనేమయినా సాయం చేయగలనా

++++++++++++++

ఇల్లూ జైలూ

——————-

నువ్వు పొద్దు తిరుగుడు విత్తనాలు తెచ్చావు

నేను పగటి వెలుగు పత్రాన్ని తెచ్చాను

నువ్వు పిడికెడు చంద్ర కాంతిని తెచ్చావు

నేను రాత్రి నృత్యాన్ని తెచ్చాను

నువ్వు పావురం కన్నీళ్లు తెచ్చావు

నేను అడవి కందిరీగ తేనెను తెచ్చాను

నువ్వు స్వర్గం నుంచి ఈకను తెచ్చావు

నేను దేవుని వాక్యాన్ని తెచ్చాను

శ్వేత వర్ణం గలది మన ఇల్లు

పిల్లలేమో నల్లని వారు

వాళ్ళు ఏడ్చారు

నువ్వు భరించ లేదు

వరిధాన్యం కోసం నేను సూర్యుని వైపు ఎగిరాను

ఇప్పుడు నా రెక్కలూ పాటలూ

మబ్బుల్లో బంధించ బడ్డాయి

నా ఏకాంతం ఉరుమై మాట్లాడుతున్నది

నేనేమో మెరుపుల ఆసరాతో మనింటిని వెతుకుతున్నాను

నా పాట నీటి జల్లులా కరిగిపోయి చల్లబడి

మన శ్వేత గృహం పైనా

మనిద్దరి నడుమా వున్న చీకటి శూన్యం పైనా

పడిపోయింది

+++++

గాంధీ మరియు కవిత్వం

ఓ బక్క పలుచని కవిత

ఆ మహానుభావున్ని దర్శిద్దామని

గాంధీ గారి ఆశ్రమాన్ని చేరింది

దూది వడుకుతూ వాడుకుతూ

రాముని ధ్యానం లో నిమగ్నమయి వున్న

ఆయన ద్వారం వద్ద వేచి వున్న

కవితను గమనించ లేదు

తాను భజనను కానందుకు కవిత

సిగ్గుపడుతూ నిలబడింది

తన గొంతును సవరిస్తూ

కవిత చిన్న శబ్దం చేసింది

గాంధీ తన కళ్ళద్దాల పక్క సందుల్లోంచి

నరకాన్ని చూసినట్టు చూసి

‘నువ్వెప్పుడయినా దూది వడి కావా’

అని అడిగాడు

పాకీ వాడి బండి లాగావా

ఎప్పుడయినా ఉదయాన్నే

వంట గది పొగలో నిలబడ్డావా

ఆకలితో అలమటించావా

అని ప్రశ్నించాడు

నేను ఓ అడవిలో

ఓ వేటగాడి నోటిలోంచి పుట్టాను

ఓ బెస్తవాడు నన్ను ప్రేమించాడు

అయినా నాకు గానం చేయడం తప్ప

ఏ పని చేయడమూ రాదు

మొదట నేను రాజాస్థానాల్లో పాడాను

అప్పుడు అందంగా బలంగానే వుండేదాన్ని

కానీ

ఇప్పుడు నేను వీధుల్లో

సగం ఆకలి తో వున్నాను

అంది కవిత

అది మంచిదే

కానీ నువ్వు సంస్కృతం మాట్లాడే

అలవాటు మానుకో

పొలాల్లోకి వెళ్ళు

రైతు కూలీల భాష విను

అన్నాడు గాంధీ నవ్వుతూ

దాంతో కవిత విత్తనంగా మారి

పొలాన్ని చేరింది

భూమిని దుక్కి దున్నే రైతు కోసం

బీడును సస్య శ్యామలం చేసే

చినుకు కోసం

ఎదురు చూస్తున్నది

*****************