Month: December 2018

SIRIAN POEM

Posted on Updated on

ఇరుగు పొరుగు (అనువాద కవిత్వం)
ప్రతి శుక్రవారం
———
సిరియన్ కవిత

సంభాషణ
——-

నా ప్రేమను 
చేతి ఉంగరమనో 
ముంజేతి ఆభరణమనో అనకు

ధైర్యమూ 
తలబిరుసుతనమూ వున్న 
నాప్రేమ 
ఒక ముట్టడి

అది మరణం నుండి 
బయటపడే మార్గాన్ని వెతుకుతుంది

నా ప్రేమను 
చందమామ అనికూడా అనకు

నా ప్రేమ పగిలిన 
ఓ నిప్పురవ్వ 
—— 
సిరియన్ మూలం: నిజార్ ఖబ్బాని 
తెలుగు అనువాదం: వారాల ఆనంద్

—––—————
నిజార్ ఖబ్బాని సిరియన్ కవి 21 మార్చ్ 1923 పుట్టారు, 30 ఏప్రిల్ 1998 న మరణించారు. 100 love letters, poems against law, లాంటి రచనలతో ప్రపంచ ప్రసిద్ధుడు. 30 కి పైగా కవితా సంకలనాలు వెలువడ్డాయి

SIRIAN POEM

Posted on

ఇరుగు పొరుగు (అనువాద కవిత్వం)
ప్రతి శుక్రవారం
———
సిరియన్ కవిత

సంభాషణ
——-

నా ప్రేమను 
చేతి ఉంగరమనో 
ముంజేతి ఆభరణమనో అనకు

ధైర్యమూ 
తలబిరుసుతనమూ వున్న 
నాప్రేమ 
ఒక ముట్టడి

అది మరణం నుండి 
బయటపడే మార్గాన్ని వెతుకుతుంది

నా ప్రేమను 
చందమామ అనికూడా అనకు

నా ప్రేమ పగిలిన 
ఓ నిప్పురవ్వ 
—— 
సిరియన్ మూలం: నిజార్ ఖబ్బాని 
తెలుగు అనువాదం: వారాల ఆనంద్

—––—————
నిజార్ ఖబ్బాని సిరియన్ కవి 21 మార్చ్ 1923 పుట్టారు, 30 ఏప్రిల్ 1998 న మరణించారు. 100 love letters, poems against law, లాంటి రచనలతో ప్రపంచ ప్రసిద్ధుడు. 30 కి పైగా కవితా సంకలనాలు వెలువడ్డాయి

Posted on Updated on

‘ఇరుగు- పొరుగు ( అనువాద కవిత్వం)
ప్రతి శుక్రవారం 
====

నేను రాసేటప్పుడు 
============
మలయాళ కవిత : కె.సచ్చిదానందన్ 
===========

నేను దుఖంతో రాస్తాను.

నదులేమైనా పొంగి పొర్లుతాయా ?

లేదు, నా చెక్కిళ్ళు

తడుస్తాయంతే.

నేను ద్వేషం తో రాస్తాను.

భూమేమైనా వణుకుతుందా, కంపిస్తుందా ?

లేదు, నా దంతాలు విరుగుతాయంతే.

నేను కోపంతో రాస్తాను.

అగ్నిపర్వతాలేమైనా బద్దలవుతాయా?

లేదు, నా కళ్ళు ఎరుపెక్కుతాయంతే.

నేను వ్యంగ్యంగా రాస్తాను.

ఆకాశాన రాలుతోన్న ఉల్కలేమైనా తళుక్కుమంటాయా ?

లేదు,నా పెదాలపై

విరుపు కన్పిస్తుందంతే

నేను ప్రేమతో రాస్తాను

నా భుజాలపై పక్షులు గూళ్లు కట్టేస్తాయి

పూలూ పళ్లతో చెట్లు వంగిపోతాయి

పొట్లాడుకుంటున్న మనుషులు పరస్పరం

ఆలింగనం చేసుకుంటారు

స్పటికమంతటి స్వచ్ఛ ప్రవాహంలా

భాష తనెంత లోతైనదో వెల్లడిస్తుంది

నా దుఃఖం, ద్వేషం, కోపం, వ్యంగ్యం —

సమస్తం అర్థాన్ని సంతరించుకుంటాయి

నేనేమో

కెవ్వుమంటాను

సిలువ పై నుండి
—————————————
ఇంగ్లిష్: కె. సచ్చిదానందన్

తెలుగు: వారాల ఆనంద్

ఫిలిం ఆర్కైవ్ ఆర్టికల్

Posted on

సినిమా చరిత్రను వారసత్వాన్ని పరిరక్షించాలి

= సినిమా ప్రభావంతమయిన దృశ్య మాధ్యమం. తెలుగు సినిమా నిర్మాణ ఇతివృత్తాలో చరిత్ర పట్ల సంస్కృతి పట్ల  ప్రణాళికా బద్దంగా చేయక పోయినప్పటికీ ఆయాకాలాల తెలుగు ప్రజల జీవితాల్ని జీవన విధానాల్నిసినిమా  ‘దృశ్య’ బద్దం చేసిందనే చెప్పుకోవాలే, ఎందుకంటే సినిమా సమాజాన్ని అనుకరిస్తుంది, దశాబ్దాల తెలుగు సినిమాని చూసినప్పుడు అవి ప్రజల్ని, ప్రజలు సినిమాల్ని పరస్పరం ప్రభావితం  చేసుకున్నాయనే విషయం అర్థమవుతుంది. అంతేకాదు అవి ఎంతో  కొంతమేరకు సామాజిక రాజకీయ అంశాలను ప్రతిబింబించాయి పర్యవసానంగానే ఎన్టీ ఆర్ నాయకుడిగా మారి ముఖ్యమంత్రిగా గెలుపొందడం సాధ్యమయింది. మన రాస్త్రం తో సహా మన దేశంలో సినిమా, క్రికెట్ లు రెండూ ప్రజలకు తమ తమ జీవితాల్లో  అంతర్భాగమయిపోయిన అంశాలు. అనేక దశాబ్దాలుగా  ఆ రెండూ భారతీయులను అమి తంగా ప్రభావితం చేస్తున్నాయి. టీవి ఇంటర్నెట్ లాంటి ఆధునిక సాంకేతిక అంశాలు వచ్చింతర్వాత వాటి ప్రభావం మరింతగా పెరిగింది. ఆ రెండూ మన నట్టింట్లోకి వచ్చేసాయి. ప్రజలు రోజులో అనేక గంటల సమయాన్ని క్రికెట్ గురించో సినిమా గురించో చూస్తూనో  మాట్లాడుతూనో వెచ్చిస్తున్నారు.  ముఖ్యంగా సినిమా అన్నివయసుల, అన్నీ వర్గాల ప్రజలకూ చేరికయింది. వారి జీవితాల్లో అంతర్భాగమయిపోయింది.

          అలాంటి గొప్ప ప్రభావవంతమయిన సినిమాల్ని సంఖ్యా పరంగా చూస్తే ప్రపంచంలోని అన్నీ దేశాల్లోకంటే అత్యధిక సినిమాలు నిర్మిస్తున్న దేశంగా మన దేశం నిలుస్తున్నది. అంతేకాదు ‘అధిక సినిమాల్ని అధిక సంఖ్యలో చూస్తున్న’ వారిగా భారతీయులకు పేరున్నది. ఆర్థికంగా చూసినా భారతీయ సినిమా రంగం ప్రపంచంలో మూడవ స్థానం లో వుందనే చెప్పుకోవచ్చు.  

      ఇక దేశంలో నిర్మాణమవుతున్న అన్నీ భాషా సినిమాల గణాంకాల్ని చూస్తే హింది తర్వాత ఎక్కువ సినిమాలు నిర్మాణమవుతున్న సినిమా రంగం టాలీవుడ్ గా పిలువ బడే తెలుగు సినిమానే. ఆర్థికంగా పరంగా చూసినా హిందీ, తమిళం తర్వాత అత్యధిక వసూళ్లు సాధించే సినిమాలు కూడా తెలుగువే. వసూళ్ల పరంగా వ్యాపారాత్మకంగా మెరుగయిన స్థానంలో వున్న తెలుగు సినిమారంగం యొక్క చరిత్రనిర్మాణం పట్ల ఎవరూ పట్టించుకున్న దాఖలాలు కనిపించవు. ఇన్ని దశాబ్దాలుగా నిర్మానమయిన సినిమాల పరిరక్షణ పట్ల కూడా తెలుగు సినిమా రంగం లోని వాళ్ళకు సోయి లేక పోవడం అత్యంత విషాదం. ఫలితంగా అనేక గొప్ప సినిమాలు అందుబాటులో లేకుండా పోయాయి. ఎప్పటికప్పుడు సినిమాలు తీసేసి లాభ నష్టాలు చూసుకొని చేతులు దులిపేసుకోవడం అలవాటయిన  తెలుగు సినిమా ప్రముఖులకు తెలుగు సినిమాకు సంబంధించిన చరిత్ర పట్ల కనీస పట్టింపు లేకుండా పోయింది. ఆయా కాలాల అపురూప సినిమాల్ని పరిరక్షించి వాటి ఆర్కైవ్స్ ఏర్పాటు లాంటి అంశాల పైన దృష్టి పెట్టక పోవడం వల్ల తెలుగు సినిమా అందించిన అపురూప కళాఖండాలు అందుబాటులో లేకుండా పోయాయి. సినిమా రంగం వారి నిర్లక్ష్యం అట్లా వుంటే ఇక ప్రభుత్వాలు కూడా అందుకు భిన్నంగా ఏమీ ప్రవర్తించలేదు . సినిమా వాళ్ళకు స్టూడియోలు కట్టుకోవడానికి, సినిమా హాల్లు కట్టుకోవడానికి గ్రాంట్లు, అప్పులు, సబ్సిడీలు ఇస్తూ వచ్చిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమయినా లేదూ ఇప్పటి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలయినా అపురూప కళాఖండాల భాండాగారాల్నీ(ఫిల్మ్ ఆర్కైవ్స్) ఏర్పాటు చేసే కనీస ప్రయత్నం కూడా చేయలేక పోయాయి. దాంతో ఉత్తమ కళాఖండాలే కాదు తెలుగు వారి ‘దృశ్య చరిత్ర’ కు ఆధారాల్లేకుండా పోయాయి.

     ఇప్పటికీ వ్యక్తులుగా సినిమా రంగం లోని ప్రముఖుల ఉపరితల జీవిత చరిత్రలు మాత్రమే అందుబాటులో వున్నాయి తప్పితే తెలుగు సినిమా రంగ సమగ్ర చరిత్రను నిర్మించుకోలేక పోవడం పెద్ద వైఫల్యమే. ఇవాళ హెచ్,ఏం.రెడ్డి గురించో, పుల్లయ్య గురించో వెతికితే ఆన్లైన్ లో గానీ ఆఫ్ లైన్ లో గాని మనకు అభించే వివరాలు  అతి తక్కువ. అంతే కాదు 1930-40 ప్రాంతంలో నిర్మానమయిన సినిమాల వివరాలు, ఫోటోలు లభించే పరిస్తితి లేదు. ఇక సినిమా ప్రింట్ల సంగతయితే ఏవో కొన్ని మినహా మిగతా వాటిగురించి ఆధారాలే కనిపించవు. అంతేకాదు ప్రముఖ నటులయిన ఎన్టీ రామా రావు, నాగేశవర రావు లాంటి వారివి కూడా సుప్రసిద్దమయిన సినిమా వివరాలే లభిస్తాయి తప్ప వారు నటించిన వందలాది సినిమాల వివరాలు ఫోటోలు లభించవు. అలాంటప్పుడు హరనాథ్, కాంతారావు లాంటి కథానాయకుల సినీ వివరాలు వారి సినిమాల ప్రింట్లు లభించే అవకాశమే లేదు. ఒక సారి ఇంటర్నెట్లోకి వెళ్ళి చూస్తే చాలా తక్కువ ఫోటోలు క్లుప్త వివరాలూ తప్ప సమగ్ర సమాచారం లభించే పరిస్తితి లేదు. ఎవరూ సినిమాల్ని భద్రపరచాలని, సినిమాల వివరాలను రికార్డ్ చేయాలని ఆలోచించకపోవడంతో అవన్నీ కాల గర్భంలో కలిసిపోతున్నాయి. నిర్మాతలు వ్యాపారంగా చూస్తూ ప్రింట్లు తీసుకొని రిలీజ్ చేసుకొని సినిమాలు ఆడితే రంగంలో నిలబడ్డారు లేదా తిరిగి వెళ్ళిపోయారు. పోయిన వారు పోగా సినిమాల్లో నిలబద్దవారు కూడా చారిత్రక దృష్టి లేక పోవడంతో వాటి పరిరక్షణ పట్ల ఉదాసీనంగానే వుండి పోయారు.  కాలం గడుస్తున్నకొద్దీ నిర్మాతలు పోయారు, పంపిణీ వాళ్ళు పోయారు. సినిమాల్ని ప్రాసెస్ చేసిన ల్యాబులూ పోయాయి. సినిమాల ప్రింట్లే కాదు నెగెటివ్ లూ పోయాయి.

         సినిమాల చరిత్రను వాటి  ప్రభావాన్ని చూసినప్పుడు ‘సినిమా దేశానికి, ప్రజలకు ఓ గొప్ప జ్ఞాపకం’ అని చెప్పుకోవాలి. చారిత్రక దర్పణాలుగా ప్రజల జీవన సరళికి ,సంస్కృతికి సినిమాలు అద్దం పడథాయి. ఆయాకాలాల జాన జీవన పరిస్థితికని  అవి  ఎంతో కొంత మేర రికార్డ్ చేస్తాయి.  అంతేకాదు సినిమాలు ప్రజల జీవన విధానాన్ని,ఆహార ఆహార్య పద్దతుల్ని కూడా ప్రభావితం చేస్తాయనడంలో అతిశయోక్తి లేదు. భావి యువతకు దేశ చరిత్రను చూపించాల్సి వచ్చినప్పుడు సినిమాలూ, డాకుమెంటరీ చిత్రాలు గొప్ప ఆధారాలవుతాయి. ఫిల్మ్ రీళ్లల్లో ఉపయోగించే సెల్ల్యులాయిడ్  100 సంవత్సరాలే అయినప్పటికి పెరిగిన సాంకేతికత తో నియబద్ద్మయిన వాతావరణ పరిస్థితుల్లో వాల్టుల్లో వుంచగలిగితే సెల్ల్యులాయిడ్ జీవిత కాలాన్ని పెంచవచ్చు. వర్తమాన కాలం లో మొత్తం డిజిటల్ లోనే స్నిమాల నిర్మాణం కొనసాగుతున్న స్థితిలో పాత సినిమాల్ని రిస్టోర్ చేసి భద్రపరిస్తే అపురూపమయిన కళాసంపదను భావి తరాలకు అందించినట్టు అవుతుంది.

         కేంద్రప్రభుత్వం 1984లో పూనా లో నతిఒనఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ను స్థాపించింది. సినిమా ప్రింట్లను సేకరించడం, భద్రపరచడం, అవసరమయిన అధ్యయనం కోసం పంపిణీ చేయడం ముఖ్య లక్షణాలుగా ఏర్పాటు చేసింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ ఆధీనం లో ఏర్పాటయిన ఆర్కైవ్స్ సినిమా ప్రింట్లతో పాటు పోస్టర్లు,స్టీల్ల్స్, స్లైడ్స్, స్క్రిప్టులు, లాబ్బి కార్డులు, సినిమా పాట్ల పుస్తకాల సేకరణ మొదలు పెట్టింది. ఆర్కైవ్ డైరెక్టర్ గా పి.కె.నాయర్ అద్భుతమయిన సేవలు అందించారు. ప్రపంచ స్థాయిలో సెల్ల్యులాయిడ్ మాన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికీ ఆర్కైవ్స్ లో లక్షా ముప్పై వేలకు పైగా ఫోటోలు, 17000కు పైగా పోస్టర్లు, దాదాపు 12000 పాటల బుక్లెట్స్, 25000 సినిమా గ్రంధాల్ని సేకరించింది. 19ఫిల్మ్ పరిరక్షక వాల్టు ల్లో 2లక్షల ఫిల్మ్ రీళ్లు భద్రపరిచే వసతుల్ని కలిగి వుంది. ఎన్నో అపురూపమయిన పాత సినిమా వివరాలు ఈ ఆర్కైవ్స్ లో భద్రపరచబడి వున్నాయి. నాయర్ పదవీ విరమణతో పాటు ప్రభుత్వ ఉదాసీన పోకడలతో అక్కడ కూడా నిధులకొరత పట్టి పీడిస్తున్నాడనే చెప్పుకోవచ్చు. కానీ ఇటీవల ప్రభుత్వం

చేపట్టిన ‘నేషనల్ ఫిల్మ్ హెరిటేజ్  మిషన్’ కార్యక్రమంలో భాగంగా ప్రాచీన అపురూప సినిమాల సేకరణ, పరిరక్షణ, డిజిటలైజేషన్, పునరుద్దరణ చర్యలకు ప్రాధాన్యతలనిస్తున్నారు. పూనా,ముంబై, హైదరబాద్, గువాహతీ, కోల్కత్త, బెంగళూరు, చెన్నై, తురువంతపురం లల్లో ఆర్కైవ్స్ సమావేశాలు ఏర్పాటు చేసి సినిమా ప్రతినితులతో చర్చించారు. కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇలా పలు చర్యలు జాతీయ స్థాయిలో కొనసాగుతున్నప్పటికీ తెలుగు సినిమాకు సంబంధించి . రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రత్యేక ఫిల్మ్ ఆర్కైవ్స్ ఏర్పాటు చేసి సినిమాల సేకరణ, పరిరక్షణ, డిజిటలైజేషన్, పునరుద్దరణ చర్యలకు పూనుకొంటే మంచిదే. లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చొరవ లేని స్థితిలో దశాబ్దాలుగా సినిమా రంగంలో వుంటూ తరతరాలుగా ఆ రంగంపైననే ఆధారపడి ఎదిగిన వ్యక్తులూ, సంస్థలూ ముందుకొచ్చి తెలుగు సినిమాల పరిరక్షణపట్ల నడుం బిగించాల్సిన అవసరం వుంది. ఉమ్మడిగా తెలుగు ప్రాచీన సినిమాల పరిరక్షణ కోసం  కృషి చేయాల్సివుంది. వ్యాపారాత్మకంగా ఫిల్మ్ స్టూడియోలు,ఫిల్మ్ ఇస్టిట్యూట్ లు ఏర్పాటు చేసినట్టే ఆర్కైవ్స్ ని ఏర్పాటు చేయగలిగితే తమ మాతృ వృత్తికి ఎంతో దోహదం చేసినట్టు అవుతారు.

  లేదా కనీసం నటులు దర్హ్శకులు, నిర్మాతల వారసులైనా వారి తల్లిదండ్రుల సినిమాలు, సినిమాల పోస్టర్లు, పాటల పుస్తకాలు తదితరాలు సేకరించి వాటిని ఉత్తమ క్వాలిటీ లో పునరుధ్ధరించి భద్రపరచాల్సిన అవసరం వుంది. ఫలితంగా సినిమా పరిశోదకులకు, నవతరం యువతకు చరిత్రను అందించినట్టు అవుతుంది. ఇక ప్రింట్లని డిజిటైస్ చేసి అధ్యాయనానికి అందుబాటులో  వుంచితే సమాచార కొరత తీరుతుంది. ఏడాదికోసారి ఇటలీ లోగా పునరుధ్ధరించిన సినిమాలతో ఫిల్మ్ ఫెస్టివల్స్ ఏర్పాటు చేయవచ్చు.

         తెలుగు సినిమా రంగంలోని పెద్దలు, సినిమా రంగంలోని వివిధ సంఘాలూ, నిర్మాతల మాళ్ళు, ఆర్టిస్టుల సంఘాలూ పూనుకొని తెలుగు  ‘ఫిల్మ్ ఆర్కైవ్స్’ ఏర్పాటు చేసి తమ వారసత్వాన్ని, చరిత్రని, గత సంస్కృతిని సినిమాల సేకరణ, పరిరక్షణ, డిజిటలైజేషన్, పునరుద్దరణ చర్యలకు పూనుకోవాలని కోరుకుందాం. ఇప్పటికయినా మేల్కొని తమ చరిత్రను, వారసత్వాన్ని భావితరాలకోసం నిక్షిప్తం చేయాల్సిన అవసరాన్ని గుర్తించి అవసరమయిన చర్యలు చేపట్టాలని ఆశిద్దాం.

DUKHA PUDAMI (POEM)

Posted on

దుఃఖ పుడమి

—————– వారాల ఆనంద్

దుఖానికి లిపి లేదు

మౌనమే దాని అక్షరమాల

దుఖం

శబ్దం లేని సంగీతం

నిశ్శబ్ద హోరు దాని గాత్రం

దుఃఖానికి పేరు లేదు

దానికి నామకరణం చేసిన వారే లేరు

చేయిపటుకుని నడిపించిన వారే లేరు

తనది మాత్రమే కాదు

సాటి మనిషి వేదనకు స్పందించే హృదయమే

దుఃఖ పుడమి

ఇట్లా పుట్టి అట్లా విస్తరిస్తుంది

దుఖం ఎంత ఎగిసి వచ్చినా

కంటి కొసన నిలబడిపోతుంది

పెదాల నడుమ బందీ అవుతుంది

ఊడల్ని దిగేసుకుని ఉండిపోతుంది

. . . . . . . . . . . . ..

బోరున ఏడిస్తే

భారం దిగుతుందంటారు

కానీ

సముద్రపు అలల అంచుల మీది

నూరగ లాగా

బయటపడ్డట్టు కనిపిస్తుంది

కానీ

సముద్ర గర్భంలో సుడులు గిరా గిరా తిరిగినట్టు

దుఃఖం లోనెక్కడో తిరుగుతూనే వుంటుంది

(PUBLISHED IN NAVYA WEEKLY 19-12-18)

‘తుమ్హారి సుళ్లూ'(film review)

Posted on Updated on

‘తుమ్హారి సుళ్లూ’ THUMHARI SULLOO -వారాల ఆనంద్ 

      ‘నా సొంత గొంతుకను రూపొందించుకోవడానికి నాకు చాలా సమయమే పట్టింది, అదిప్పుడు నాకుంది ఇక మౌనంగా వునే ప్రశ్నే లేదు ‘అన్నారు మేడెలిన్ అల్ బ్రైట్. అట్లా సొంత గొంతుకొక్కటే కాదు, సొంత ఆర్థిక సామాజిక సాధికారికత సాధించడానికి మహిళలి ప్రపంచ వ్యాప్తంగా కొట్లాడుతూనే వున్నారు. ఏటికి ఎదిరీదినట్టు నిర్విరామంగా కృషి చేస్తూనే వున్నారు. ఆకాశంలో సగమని ఒక పక్క అంటూనే అనేక ఆంక్షల మధ్య మహిళల జీవితాలను బంధిస్తున్న వర్తమాన సమాజంలో స్త్రీ స్వావలంభన అత్యంత అవసరమయింది, స్త్రీ పురుష బేధం లేకుండా సాటి మనుషులుగా పరిగణించుకునే పరిస్థితులు ఇంకా రావల్సే వుంది. ఈ నేపధ్యంలో కేవలం వటింటికి పరిమితమయి న మహిళలు ఇల్లు దాటి ఉద్యోగం చేసినప్పుడు ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులు, సమాజం స్పందించే తీరు, మగవాళ్ళ నుండి ఎదురయ్యే అనేక అంశాల్ని ఇతివృత్తాలుగా చేసుకొని వివిధ భారతీయ భాషల్లో పలు సినిమాలు వచ్చాయి. ఆయా కాలాలకు అద్దం పట్టాయి. వాటిల్లో ప్రధానమయినవి ‘మహానగర్’,’ఉంబర్థ’ . సత్యజిత్ రే 1963లో  మహానగర్ ను, జబ్బార్ పటేల్ 1982లో ఉంబర్థ రూపొందించారు. అదే ఒరవడిలో 2017లో సురేశ్ త్రివేణి “తుమ్హారీ  సుళ్లు’ రూపొదించారు.  తుమ్హారీ  సుళ్లు ప్రస్తుత కాలమాన పరిస్థితులకు, పెరిగిన సాంకేతికత, ఆధునుక పని పరిస్థితులకు అద్దం పడుతూ సాగుతుంది. ఇందులో సుళ్ళు గా పిలివబడే సులోచనా దూబే పాత్రలో సుప్రసిద్ద నటి విద్యా బాలన్ మంచి నటనను  ప్రదర్శించి అభినందనలు అనేక అవార్డులు అందుకున్నారు. కహానీ స్నిమా తర్వాత విద్యా బాలన్ తుమ్ హారీ  సుళ్లు’ లో పరిణతి పొందిన నటనను ప్రదర్శించారు. ఉన్నత పాఠశాల విద్యనయినా పూర్తి చేయని గృహిణి సులోచన తన సింత కాళ్ళ పైన నిలబడాలని తాను ఏదో సాహించాలని తపన పడుతూవుంటుంది. ఆ క్రమంలో ఒక రేడియో సంస్థలో రాత్రి పూట జాకీ గా పని చేసే ఉద్యోగం లో చేరుతుంది. పర్యవసానంగా ఆమె జీవితంలో జరిగే మార్పులు, కుటుంబ పరంగా, సామాజికంగా తాను ఎదుర్కొన్న పరిస్థితుల్ని ‘తుమ్ హారీ  సుళ్లు’ ఆవిష్కరిస్తుంది. ఒక మామూలు గృహిణి ఆధునిక సాంకేతిక ఆడియో టెక్నిక్ కి అనువుగా తనని తాను మెరుగు పర్చుకోవడం ఒక ఎత్తయితే, రాత్రి షిఫ్ట్ కారణంగా ఎదుర్కొనే సామాజిక కౌటింబిక వ్యతిరేకతను ఎదుర్కొని సొంత కాళ్ళ మీద నిలా బడడమనేది   ‘తుమ్ హారీ  సుళ్లు’  ఇతివృత్తం. గొప్ప ఈజ్ తో రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంశలతో పాటు ఆర్థికంగా కూడా గొప్ప విజయానే సొంతం చేసుకుంది.

‘తుమ్ హారీ  సుళ్లు’  కథాకథన అంశాల విషయానికి వస్తే సుళ్ళూ గా ప్రేమగా పిలువ బడే  సులోచనా దూబే తన భర్త 11 ఏళ్ల కుమారుడితో కలిసి విరార్ లో నివసిస్తూ వుంటుంది. తాను ఎప్పటికయినా సొంత కాళ్ళ మీద నిలబడి మంచు ఉద్యోగం చేయాలన్నదే సుళ్ళూ ఆశ్యంగా వుంటుంది. కానీ కనీసం స్కూల్ ఫైనల్ అయిన పూర్తి చేయని తనకు ఉద్యోగం ఎట్లా అన్నది ఆమె ముందున్న సమస్య. సుళ్ళూ కి వివిధ పోటీల్లో పాల్గొని బఃమతులు గెల్చుకోవడం పరిపాటిగా వుంటుంది. ఆకమంలో ఒక రోజు రేడియో స్టేషన్ వాళ్ళు నిర్వహించిన పోటీలో గెలుస్తుంది. బహుమతిని తెచ్చుకునేందుకు తెడియో స్టేషన్ కు వెళ్ళిన సూళ్ళూకి రేడియో జాకీ ఉద్యోగ ప్రకటన చూసి తానను ఇంటర్వ్యూ చేయమంటుంది కానీ సీనియర్ జాకీ అల్ బెలీ అయిష్టంగానే బాస్ మరియా వద్దకు తీసుకెళ్తుంది. మారియా సుళ్ళూ ను హలో అనే మాటను రొమాంటిక్ గా చెప్పమంటుంది. కానీ కవి పంకజ్ ని చూస్తూ సుళ్ళూ నవ్వుతూ ఇంతర్వ్యూ ను హాస్యంగా తీసుకుంటుంది నవ్వేస్తుంది. చివరికి ఎట్లాగే హలో ను చెప్పేస్తుంది. మరియా తన విసిటింగ్ కార్డ్ ఇచ్చి అది రాత్రి షో కనుక ఆలోచించుకొమ్మంటుంది. మర్నాడు సుళ్ళూ మారియాకు పలు సార్లు ఫోన్ చేస్తుంది కానీ మారియా స్పందించదు. సుళ్ళూ కున్న పట్టుదలను గమనించి మరియా ఆమెకు ఉద్యోగం ఇస్తుంది. కమనీ పిక్ అప్, డ్రాపింగ్ సౌకర్యం ఇస్తుంది. కానీ భర్త తనకు ఉద్యోగం గురించి చెప్పలేదని, రాత్రి షిఫ్ట్ అని, అదికూడా రొమాంటిక్ గా మాట్లాడే ఉద్యోగం కావడంతో మొదట వ్యతిరేకిస్తాడు.కానీ సుళ్ళూ తల్లిదండ్రులు,అక్కలు తీవ్రంగా వ్యతిరేకించి ఉద్యోగం మానేయమంటారు. కానీ భర్త అశోక్ సహకరించడం తో సుళ్ళూ ఉద్యోగం లో కొనసాగుతుంది. మారియా కూడా సుళ్ళూ ప్రతిభను తెలుస్కొని ప్రోత్సహిస్తుంది. ఒక రోజు కొడుకు స్కూల్ నుండి ఫోన్ వస్తుంది వెంటనే రమ్మని. సుళ్ళూ అశోక్ వెళ్తారు. సుళ్ళూ కొడుకు సీడీలు అమ్ముతున్నాడని అది స్కూలు నిబంధనలకు వ్యతిరేకమని అబ్బాయిని సస్పెండ్ చేస్తున్నట్టు చెబుతాడు ప్రిన్సిపాల్. అది కాస్తా కుటుంబంలో వివాదాస్పదమయి సుళ్ళూ ఉద్యోగం చేయడం వల్లే పిల్లాడు అదుపు తప్పుతున్నాడని నౌకరీ మానేయమని ఒత్తిడి తెస్తారు. మరో పక్క అశోక్ తాను పనిచేసే చోట ఇబ్బందులు ఎదుర్కొంటూ వుంటాడు. ఎవరి వొత్తిది ఎట్లున్నా సుళ్ళూ ఉద్యోగం చేయడానికే నిర్ణయించుకొంటుంది. సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా కొడుకు కనిపించడం లేదని ఫోన్ కాల్ వస్తుంది. ఎక్కడ వెతికినా కనిపించాడు ఇంతలో అబ్బాయి రాసిన లేఖ దొరుకుతుంది. తాను తప్పు చేశానని తనవాళ్లే తల్లి ఉద్యోగం మానేయాల్సి వస్తున్నదని అమ్మకు సప్పోర్ట్ చేయమని తండ్రిని ఉత్తరంలో వేడుకొంటాడు. తెల్లారి పోలీసులు అబ్బాయిని తోడ్కొని వచ్చి అప్పగిస్తారు. సుళ్ళూ ఆలోచనలో పడుతుంది. తాను ఇంట్లో వుంది చూస్తే తప్ప కొడుకు బాగు పడదని తలపోస్తుంది. ఆఫీసుకు వెళ్ళి రాజీనామా ఇస్తుంది.  అప్పుడే ఆఫీసు రిసెప్షనిస్టు టిఫిన్ వాలాతో గోదవ్ పడడం చూసి ఆ కాంట్రాక్ట్ తన కిమ్మని మారియాను అడుగుతుంది. తర్వాత సుళ్ళూ అశోక్ టిఫిన్ సర్వీస్ ని, సుళ్ళూ తన వృత్తినీ ఇంటినీ నిర్వహిస్తుంది. అట్లా ‘తుమ్ హారీ  సుళ్లు’ సినిమా స్త్రీ సాధికారికత ను నొక్కి చెబుతుంది. హాస్యం, సేరియస్ తోకూడి  అలరిస్తుంది.  ఈ సినిమా       అమజాన్ ప్రైమ్ లో అందుబాటులో వుంది.

‘తుమ్ హారీ  సుళ్లు’  దర్శకత్వం: సురేష్  త్రివేణి, నటీ నటులు: విద్యా బాలన్, మానవ్ కౌల్, నేహా దుపియా 

‘OKA PAGALU’ poem

Posted on

PUBLISHED in VARTHA DAILY


ఒక పగలు

ఆకాశంలో నిప్పుల కుంపటి బోర్లించినట్టు

వేడిని మోసుకొస్తున్నది వెల్తురు

బయటి ఎండకు

కళ్ళు మిరుమిట్లు గొల్పుతున్నాయి 

‘నీటి పొర’ కూడా లేని గాలిని పీలుస్తూ

శ్వాసేమో తడి లేమిలో కూరుకుపోతున్నది

దేహమేమో

నిలువదు నిలువనీయదు 

నిద్ర రాదు నిమ్మళం వుండదు

అంతా బేచైన్ బేచైన్

బీడుపడ్డట్టు ఒళ్లంతా పొడిపొడి

పచ్చీసో అష్టాచెమ్మో  ఓనగుంటలో

ఆడటానికి మిత్రులు లేరు

కాలానికీ  ‘ఉష్ణోగ్రత’ పెరిగినట్టుంది

పగళ్ళు సుదీర్ఘాలవుతున్నాయి

పడవ ప్రయాణం (poem)

Posted on

‘పడవ ప్రయాణం’
——————-

ఈ యాత్ర చాలా కాలం సాగేట్టుంది 
కాగితప్పడవ మీద ప్రయాణం కదా

అక్షరాల తెరచాప ఆసరాతో 
నడుస్తున్న నడక 
చేరాల్సిన గమ్యం దూరమే 
మార్గమూ కఠినమే

ఆత్మను అరచేతిలో పొదువుకుని 
ఒంటరి లోకాన్ని దాటుకుంటూ 
క్లిష్టమయిన మబ్బుల్నీ సరళమయిన వెన్నెలనీ 
సన్నిహితంగా పొదువుకుని

నడక సాగుతున్నది

మూతలు పడుతున్న కళ్ళతో 
కన్నీటి ధారల్ని వెంటేసుకుని 
అనేకానేక గ్రహాల్ని దాటుకుంటూ 
నక్షత్ర తీరం వైపు సాగుతున్న ఈ యాత్ర అనంతమేమో

భావాల అలల మీద కాలం నిలుస్తుందా 
పడవ తీరం చేరుతుందా

ఇది నా ఒక్కడి ప్రయాణమేనా ఏమో..

—————– వారాల ఆనంద్