Month: March 2017

‘Moonlight’

Posted on

కళాత్మక సజీవ చిత్రణ ‘మూన్ లైట్ ‘- ఆస్కార్ విజేత

-వారాల ఆనంద్

‘చంద్రుడి కాంతిలో నల్ల జాతి పిల్లలు నీలంగా కనిపిస్తారు’ అన్న కవితాత్మక వాక్యం ‘మూన్ లైట్’ సినిమాకి ఊపిరి. వర్తమాన సమాజంలో యువత ఎదుర్కొంటున్న మానసిక శారీరక ఉద్వేగభరిత స్థితికి ఈ సినిమా అద్దం పడుతుంది. యువత అంటే అదీ అమెరికాలోని నల్ల జాతి యువత ఎదుర్కొంటున్న శారీరక, లింగత్వ సమస్యలూ, స్వలింగ సమస్యలూ, ఒంటరితనాలూ అవమానాలూ అన్నీ మూన్ లైట్ లో చాలా గొప్ప గా చిత్రీకరించారు. ఈ సినిమా ఇటీవలే ఉత్తమ సినిమాగా ఆస్కార్ అవార్ద్ అందుకుంది. ఆస్కార్ చరిత్ర లో మొత్తం నల్ల జాతి నటీనటులు నటించిన చిత్రం ఉత్తమ చిత్రం అవార్డు అందుకోవడం ఇది మొదటిసారి. అంతే కాదు మొదటి స్వలింగ సంపర్గ ఇతివృత్తంగా తీసుకుని అతి తక్కువ బాక్స్ ఆఫీస్ వసూళ్లు సాధించి కూడా ఆస్కార్ బరిలో నిలిచి అవార్డు ను అందుకుని మూన్ లైట్ చరిత్ర సృష్టించింది. అంతే కాకుండా ఎడిటింగ్ లో అవార్డ్ గెలుచుకుని జోయ్ మాక్ మిల్లన్ మొదటి నల్ల జాతి కళాకారుడిగానూ, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా అవార్డును అందుకుని అలీ మొదటి ముస్లిం గా చరిత్ర కెక్కారు. అవార్డుల సంగతి ఎలా వున్నా మూన్ లైట్ సినిమా ఇతివృత్త స్వీకరణ లోనూ,చిత్రీకరణలోనూ, నటీ నటుల నటన పరంగానూ అద్భుతమయిన స్థాయిని అందుకుని గొప్ప సినిమా గా నిలిచింది. ఈ సినిమా నిండా జ్ఞాపకాలూ, వాస్తవాలూ, ఒక దాని వెంట ఒకటి ముప్పిరి గొని ప్రేక్షకుల్ని చిత్ర మయిన స్థితికి త్తీసుకెళ్తాయి.

టారేల్ ఆల్విన్ మాక్ కాన్రే రాసిన ఆత్మకథ ను దర్శకుడు బ్యారి జెంకిన్స్ అనుసరించి మూన్ లైట్ నిర్మించాడు. ఆ ఆత్మ కథ పేరే ‘చంద్రుడి కాంతిలో నల్ల జాతి పిల్లలు నీలంగా కనిపిస్తారు’. ఆ ఇతివృఃతాన్ని మోడు విభాగాలుగా చిత్రంలో చూపిస్తాడు దర్శకుడు. లిటిల్,చిరాన్, బ్లాక్ లు మూడూ ఒక దానికొకటి విడిగానూ, కలిసిపోయినట్టుగానూ,  కొన సాగింపుగానూ కనిపిస్తాయి. లిటిల్ బాల్యాన్ని చూపిస్తే, చిరాన్ టీన్ ఏజ్ స్థితిని, బ్లాక్ ఎదిగిన స్థితినీ చూపిస్తాయి. ఈ మూడు స్థాయిల్లో నల్ల జాతీయుడి గానూ, గే గానూ ఆ యువకుడు ఎదుర్కొన్న సంఘటనల్నీ, సమస్యల్నీ అత్యంత వాస్తవంగానూ హృద్యంగానూ దర్శకుడు చిత్రీకరించాడు. మూడు స్థాయిల్లో ముగ్గురు నటులతో నటింపజేసి వాటి మధ్య ఒక సంలీనత సాధించారు.

చిత్ర కథ విషయానికి వస్తే లిటిల్ మియామిలో డ్రగ్ డీలర్ జువాన్కు చిరాన్ దొరుకుతాడు. జువాన్ భార్య తో కాకుండా తన ప్రియురాలితో వుంటాడు. చిరాన్ ని తన తోనే వుండమంటాడు. చిరాన్ తల్లి పవులా డ్రగ్ కు బానిస్ అవుతుంది. తన తల్లి పావులాను చిరాన్ ఏవగించుకుంటాడు.చిరాన్ కు రక రకాల కల లు వస్తాయి. ఇంతలో మిత్రులతో గొడవ పడతాడు. వాళ్ళు బ్లాక్ అనే నిక్ నేమ్ పెడతారు. ఇంతలో తనలో కలుగుతున్న మార్పులు గమనిస్తాడు. ఒక రోజు మిత్రుడు కెవిన్ సముద్రపు ఒడ్డున అతన్ని సంతృప్తి పరుస్తాడు. ఇలా పలు సంఘటనల తర్వాత కిరాన్ ఒక రోజు తన పయిన శారీరకంగా దాడి చేసిన వాడిని కోపంతో కుర్చీ తో బాదేస్తాడు. పోలీసులొచ్చి అరెస్ట్ చేసి జైల్ కు పంపిస్తారు. జైలు జీవితం గడిపిన చిరాన్ శారీరకంగా ఎదిగి మంచి ధృఢమయిన శరీరా కృతి తో బ్లాక్ గా బయటకు వస్తాడు. డ్రగ్స్ కు బానిస అయిన తల్లి అనేక టెలిఫోన్ కాల్స్ చేసింతర్వాత కలవడానికి వెళ్తాడు. తల్లి పశ్చ్తాపాన్ని చూసి ఆమెను క్షమిస్తాడు.

మియామి కి చేరుకున్న బ్లాక్ తన పాత మిత్రుడు కెవిన్ ను కలుస్తాడు. కుక్ గాను, బేరర్ గాను పనిచేస్తున్న కెవిన్ తనకు పెళ్ళయి ఒక కొడుకున్నాడని కానీ భార్య తో పొసగ  లేదని చెబుతాడు. తాను కోరుకున్నట్టుగా జీవితం కొన సాగకున్నా సంతోషంగానే వున్నట్టు చెబుతాడు.

ఆ రోజు సముద్ర తీరం లో కెవిన్ తో తప్ప తాను ఇంతవరకు మరెవరితోనూ ఇంటిమేట్ గా వుండలేదంటాడు బ్లాక్. కెవిన్ బ్లాక్ ని ఓదారుస్తాడు. సముద్ర తీరంలో  తన చిన్న తనాన్ని గుర్తు చేసుకుంటూ బ్లాక్ కెమెరాకు అభిముఖంగా తిరిగి చూస్తుండగా సినిమా ముగుస్తుంది. టూకీగా కథ ఇట్లున్నప్పటికీ లిటిల్,చిరాన్, బ్లాక్ మూడు వయసుల్లో భిన్న స్థాయిలో అతడు ఎదుర్కొన్న మానసిక, శారీరక సంఘర్షణ అతలా కుతలం చేస్తుంది. మానవీయ ఉద్వేగాలకీ, అనుభవాలకూ, సంఘర్షణలకూ దృశ్య రూపమిస్తుందీ సినిమా.

జేమ్స్ లాక్శ్టన్ james laxton కెమెరా పనితనం ఆద్యంతం కట్టి పడేస్తుంది.

‘ నేను ఎన్నో సార్లు ఏడిశాను, మరెన్నో సార్లు కన్నీటి చుక్కలయి రాలాను’  లాంటి సంభాషణలతో కొన్ని చోట్ల మాటలు ఉద్వేగానికి గురిచేస్తాయి.

ఎలాంటి స్టార్ వాల్యూ, గ్రాఫిక్స్, మిరుమిట్లు గొలిపే దృశ్యాలు ఏవీ లేని మూన్ లైట్ కేవలం ఒక జాతి యువకుడు బాల్యం నుంచీ ఎదుర్కొన్న ఒంటరితనాన్నీ, అణచివేతనీ, దుఖాన్నీ అత్యంత వాస్తవికంగా, కళాత్మకంగా ఆయా స్థల కాలాల నేపథ్యంలో దర్శకుడు తీసి నిలబెట్టాడు. కనుకే అందరూ నల్ల వాళ్లయినా, నల్ల వాళ్ళ కథ అయినప్పటికీ విషయానికి విశ్వజనీనత, చిత్రీకరణకి కళాత్మకత, నటులకు సాధికారకత వున్నప్పుడు ఆస్కార్ కు నామినేట్ అవడమే కాదు అత్యుత్తమ చిత్రంగా నిలిచింది. హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ బార్రి జెంకిన్స్

“మూన్ లైట్”

దర్శకుడు: బార్రి జెంకిన్స్ ,

-వారాల ఆనంద్

 

స్వయం కృషి

Posted on Updated on

Passer_moabiticus_Iva_Hristova

(MARCH 20, WORLD SPARROW DAY)

సూర్యుడి కంటే ముందే

ఎవరో పిలిచినట్టనిపిచ్చింది

బాల్కనీ లోకి వెళ్ళాను

అప్పటి దాకా

ముచ్చట్లా డుతూ మురిపెంగా వున్న

పక్షుల జంట

రివ్వున ఎగిరి అటూ ఇటూ తిరిగి

ఎగిరి పోయింది

మనసేక్కడో తడి తడిగా …

రెండు గురిగి బుడ్లు తెచ్చి

బాల్కనీలో వేలాడకట్టాను

గూడు కోసం

తెల్లవారి ఎవరూ పిలవకుండానే 

సూర్యుడికంటే ముందే లేచి

కిటికీలోంచి బయటకు చూశాను

కిల కిల లాడుతూ పక్షులు

వేలాడగట్టిన కుండల  పై

ఊయల వూగు తున్నాయి

మనసంతా హాయి హాయిగా …

ఆడుతూ ఆడుతూ ఎగిరి పోయి

ఆ పక్కనే వేలాడుతున్న

ఎండిన గుమ్మడి కాయకు

రంధ్రం చేస్తూ తమ గూడు తామే

నిర్మించుకుంటున్నాయి

పక్షుల మీద కోపం లేదు

బాధ అంతకంటే లేదు

అవి నా హృదయానికి

మరింత చేరువయ్యాయి 

‘MUDDASANI RAM REDDY’documentary film

Posted on

Friends pl click the following link and watch my documentary film on ‘MUDDASANI RAM REDDY’  a great writer and inspiring personality

https://www.facebook.com/plugins/video.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Faanandvarala1958%2Fvideos%2F10155894708564377%2F&show_text=0&width=400

‘నీల్ బత్తే సన్నాట’ తమిళ్ ‘అమ్మా కరక్కు’

Posted on Updated on

‘నీల్ బత్తే సన్నాట’ తమిళ్ ‘అమ్మా కరక్కు’ 

నిల్ డివైడెడ్ బి సైలెన్స్  అంటే శూన్యాన్ని నిశాబ్దం తో భాగించడం. అంతే కాదు ఉత్తర్ ప్రదేశ్ లో ఎందుకూ పనికిరాని అనే అర్థం కూడా వుంది.

నిజానికి ఈ సినిమా మొదట హిందీలో ఆతర్వాత తమిళం లో నిర్మించబడింది. రెండు చోట్లా విమర్శకుల చేత ప్రశంశల్నీ ఆర్థికంగా విజయాన్నీ అందుకుంది. హిందీలో చూసి తమిళ స్టార్ ధనుష్ ఈ సినిమాని తమిళ్ లో నిర్మించాడు. ఆమిర్ ఖాన్, ధనుష్, ప్రకాష్ రాజ్ లాంటి ప్రముఖ స్టార్ లు ముందుకు వచ్చి అనేక మంచి చిత్రాల్ని నిర్మించడం తో పాటు కొన్నిటిని విడుదలయ్యేందుకు తోడ్పడుతున్నారు ఇది చాలా మంచి పరిణామం. ఆ జ్ఞానం మన తెలుగు వాళ్ళకు ఎప్పుడు వస్తుందో చూడాలి.

కలల్ని కనాలి వాటిని నిజాంచేసుకోవడానికి నిరంతరం కృషి చేయాలి అన్న అబ్దుల్ కలాం మాటల ప్రేరణ తో నిర్మించినట్టుగా నీల్ బత్తే సన్నాట సినిమా కనిపిస్తుంది. తన కూతురు భవిష్యత్తు గొప్పగా వుండాలని కలలుగన్న ఒక తల్లి ఆ కలని సాకారం చేసుకునేందుకు పడే తపన పడ్డ కష్టం ఈ సినిమాకు మూల కథ . ఈ కలని దృశ్యీకరిస్తూనే తల్లీ కూతుర్ల మధ్య వున్న ప్రేమ అనుభందం అంతర్లయగా కనిపిస్తుంది. సినిమా మొత్తం సాఫీగా సాగిపోయి ఫీల్ గుడ్ ఫిల్మ్ గా ముగుస్తుంది.

అశ్వినీ అయ్యర్ తివారీ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా సమాజం లో ఎన్ని ప్రతిభంధకాలు వున్నప్పటికి ఎదగడానికి లక్ష్య నిర్దేశం, అకుంటిత దీక్ష  కావాలని అవి వున్నప్పడు విజయం దాసోహమంటుందని ఈ సినిమా చెపుతుంది.

చాలా అతి సాధారణంగా చిత్రీకరించబడి ఎలాంటి ఆడంబరాలూ లేకుండా అశ్వినీ అయ్యర్ తేసిన ఈ సినిమా పిల్లలు తల్లిదండ్రులూ తప్పకుండా చూడాల్సిన సినిమా.

కథ విషయానికి వస్తే  చందా తన కూతురు ఆపేక్ష(అప్పు) తో వొంటరిగా జీవిస్తూ వుంటుంది. డాక్టర్ దివాన్ ఇంట్లో పని చేయడం తో పాటు పలు అదనపు పనులుకూడా చేస్తుంది. అన్నీ ఆశలూ కూతురు పైననే పెట్టుకున్న చందా కూతురు గొప్పగా చదువుకోవాలని, పెద్ద వుద్యోగం సంపాదించుకుని సంఘంలో పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ వుంటుంది అందుకోసం ఎంతయినా కష్టపడేందుకు సిద్దంగా వుంటుంది. డాక్టరో ఇంజనీరో కావాలనుకుంటుంది. స్కూల్ చదువును అర్ధాంతరంగా మానేసిన చందా ఏమి చదివితే గొప్పవాళ్లవుతారని ఆలోచిస్తూ తాను పని చేసే డాక్టర్ దివాన్ ని అడుగుతుంది. కానీ కూతురు అప్పు ఇలాంటి ఆలోచనలేవీ లేకుండా సరదా వుండాలని టీవి చూడాలని పెద్దయింతర్వాత మహా అంటే మరో ఇంట్లో పనిమనిషిగా చేరాలని తలపోస్తూ చదువును నిర్లక్ష్యం చేస్తూ వుంటుంది. తల్లి మనసును అర్థం చేసుకోదు.

కూతురు ప్రవర్తన చూసి చందా దిగులుపడుతుంది తన వేదననంతా డాక్టర్ దగ్గర వెల్ల బోసుకుంటుంది. ఆప్పుడు దివాన్ ఆలోచించి నువ్వు కూడా స్కూళ్ళో చేరమని సలహా ఇస్తుంది. మొదట సంశయించినా డాక్టర్ సూచన మేరకు చేరడానికి అంగీకరిస్తుంది. దివాన్ పలుకుబడి తో అన్నీ రూల్స్ నుంచి మినహాయించి చందా  పాటశాల లో చేర్చుకుంటాడు హెడ్ మాస్టర్. ఇక అక్కడినుంచి మొదలవుతుంది కథలో వేగం. తల్లి స్కూల్లో చేరడం అప్పుకు ఇష్టం వుండదు. గొడవ చేస్తుంది. తల్లిని  స్కూల్ మానేయమనుటుంది. చందా వినిపించుకోదు. క్లాసులో అప్పు తన కూతురు  అన్న విషయం ఎవ్వరికీ తెలియనట్టు ప్రవర్తిస్తుంది. తోటి విద్యార్థి సహకారం తో లెక్కలు సైన్స్ అంటిన్నీ క్రమంగా నేర్చుకుంటుంది. మంచి మార్కులు రాని అప్పు ఇంట్లో తల్లి తో గొడవ పడుతుంది. ఇద్దరూ ఒప్పందం చేసుకుంటారు. కూతురు పరీక్షల్లో తన కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే తాను బడి మానేస్తానంటుంది. అప్పు బాగా కష్టపడి మంచి మార్కులు సాధించుకుంటుంది. కానీ తల్లి స్కూలు మానడానికే తాను కష్టపడి ఎక్కువ మార్కులు తెచ్చుకున్నానని అనడంతో తల్లి నిర్ఘాంతపోతుంది. దాంతో తల్లి స్కూలు మనడానికి ఇష్టపడదు.

కూతురు తో పోటీగా మరింత కష్టపడి ఎక్కువ సమయం చదువుకే కేటాయిస్తుంది దాంతో తనకున్న చిన్న వుద్యోగం పోగొట్టుకుంటుంది. డాక్టర్ దివాన్ వూరు మారతారు. చందా హతాశురాలవుతుంది.

ఒక రోజు కారు కింద పడ బోతుంది. కిందికి దిగిన డ్రైవర్ ఆమెను మందలిస్తే కార్లోని వ్యక్తి దిగి డ్రైవరును కోప్పడతాడు. అతన్ని చూసి కలెక్టర్ అని తెలుసుకుని అతని ఇంటికి వెళ్తుంది. బయట గోర్ఖాలు లోపలికి అనుమతించరు. కానీ క్రమం తప్పకుండా ప్రయత్నించి కలెక్టర్ లోనికి పిలవడంతో లోనికి వెళ్తుంది. ఎం సహాయం కావాలని కలెక్టర్ అడిగితే ఏమి లేదు కలెక్టర్ కావడానికి ఏం చదవాలి, ఏ కాలేజీలో చేరాలని అడుగుతుంది. యూపీఎస్సీ పరీక్ష్ రాయాలని చెబుతాడు.  ఇక తన కూతురు తప్పకుండా కలెక్టర్ కావాలని కోరుకుంటుంది. దాంతో చిన్న చిన్న పనులు చేయడం ప్రారంభిస్తుంది. తన చదువుకోసం జమ చేసిన డబ్బును అప్పు తానే  రహస్యంగా తీసుకుని తన స్నేహితులతో విందు వినోదాలకు ఖర్చు చేస్తుంది. అది తెలుసుకున్న తల్లి కూతురును నిలదీస్తే నువ్వు ఏ పని చేస్తున్నావో తెలుసు ఎట్లా సంపాదిస్తున్నావో తెలుసు అని వాదనకు దిగుతుంది దాంతో తల్లి ఖిన్ను రాలవుతుంది. విషయం తెలుసుకున్న స్కూలు క్లాస్ మెట్ అప్పు ను తీసుకెళ్లి ఆమె తల్లి ఎట్లా కష్టపడుందో చూపిస్తాడు. ఆమె అప్పు తల్లి అన్న విషయం తామందరికీ తెలుసునని చెబుతాడు. కేవలం అప్పు మంచి కోసం ఆమెను గొప్పగా చదివించడం కోసమే తల్లి కష్టపడుతోందని తెలుసుకుని అప్పు లో పశ్చాత్తాపం కలుగుతుంది. తన తప్పు తెలుసుకుంటుంది. కష్టపడేందుకు బాగా చదివేందుకు నిర్ణయించుకుంటుంది. తల్లి తో ప్రేరణ పొందిన అప్పు ఎదిగి యూపీఎస్సీ పరీక్షలకు అటండ్ అవడంతో సినిమా ప్రతీకాత్మకంగా ముగుస్తుంది.

ఇందులో చందా పాత్రలో తెలుగమ్మాయి స్వర భాస్కర్ అద్భుతంగా నటించింది. అపుగా రియా, ప్రిన్సిపాల్ గా పంకజ్ త్రిపాటి నటన సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది. సరళంగా సాగిన స్క్రీన్ ప్లే, హృద్యంగా జరిగిన చిత్రీకరణ సినిమాను నిల బెట్టాయి.

బిడ్డ కోసం తల్లి కన్న కల దానిని సాకారం చేసుకునేందుకు ఆమె చేసిన కృషి అద్భుతంగా ఆవిష్కృతమయిందీ సినిమాలో.

తల్లిదండ్రులూ పిల్లలూ తప్పకుండా చూడాల్సిన సినిమా .

హిందీ లో ‘నీల్ బత్తే సన్నాట’ తమిళంలో ‘అమ్మా కరక్కు ‘

నీల్ బత్తే సన్నాట’

దర్శకత్వం: అశ్వినీ అయ్యర్ తివారీ, నటీ నటులు: స్వరభాస్కర్, రియా శుక్లా, రత్నా పాఠక్,పంకజ్ తివారీ.

 

 

-వారాల ఆనంద్