VIDEO

SRIBHASHYAM VIJAYASARATHI

Posted on

మిత్రులారా! సాహితీస్రవంతి కార్యక్రమంలో ఈ వారం సంస్కృత కవి పండితుడు శ్రీ శ్రీభాష్యం విజయసారధి గారి గురించి నా PODCAST వినండి. లింక్ క్లిక్ చేసి చూడండి -వారాల ఆనంద్, 9 మార్చ్ 2024

TAL RADIO 50 EPISODES

Posted on

మిత్రులారా! టాల్ రేడియో లో నా ‘సాహితి స్రవంతి’ కార్యక్రమంలో 50 ఎపిసోడ్స్ పూర్తి అయ్యాయి. ఆ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాను. ఎపిసోడ్స్ వివరాలు ఇస్తున్నాను. టాల్ లింక్, నా యూట్యూబ్ లింకిస్తున్నాను.వీలయినప్పుడు క్లిక్ చేయండి. ప్రతిశుక్రవారం రాత్రి 9.30 కి టాల్ లో కొనసాగుతుంది.
-వారాల ఆనంద్
************************
Episode Details
Episode 1 – Gulzar (గుల్జార్)
Episode 2 – Javed Akhthar (జావేద్ అక్తర్)
Episode 3 – Rupi Kour(రూపి కౌర్)
Episode 4 – Faiz Ahmad(ఫైజ్ అహ్మద్)
Episode 5 – K.satchidanandan(కే.సచ్చిదానందన్)
Episode 6 – KUNVAR NARAIN(కున్వర్ నారాయణ్)
Episode 7 – VISHAL BHARADWAJ(విశాల్ బరద్వాజ్)
Episode 8 – Amrutha Pritham(అమృతా ప్రీతం)
Episode 9 – Ravindranath Tagore(రవీంద్రనాథ్ టాగోర్)
Episode 10 – Kahlil Gibran(ఖలీల్ జీబ్రాన్)
Episode 11 – Sahir Ludhianvi(సాహిర్ )
Episode 12 – Padma Sachdev(పద్మాసచ్ దేవ్)
Episode 13 – Girish Karnad(గిరీష్ కర్నాడ్)
Episode 14 – Sugatha Kumari(సుగతా కుమారి)
Episode 15 – DEEPTHI NAVAL(దీప్తి నావల్)
Episode 16 – Bhupen Hajarika(భూపేన్ హజారికా)
Episode 17 – Buddhadev Dasgupta(బుద్దదేవ్ దాస్ గుప్తా)
Episode 18 – Haldhar Naag(హాల్దార్ నాగ్ )
Episode 19 – M.T.Vasudeva Nair( ఎం.టీ.వాసుదేవ్ నాయర్)
Episode 20 – Nilamani Phukan(నీలమణి ఫూకన్)
Episode 21 – SITAKANTH MAHAPATRA(సీతాకాంత్ మహాపాత్ర)
Episode 22 – U.R.Anantha Murthy(యు.ఆర్.అనంత మూర్తి)
Episode 23 – Sankha Ghosh(శంఖా ఘోష్)
Episode 24 – Jayanta Mahapatra(జయంత్ మహాపాత్ర)
Episode 25 – SAYEED AKTHAR MIRZA(సయీద్ అక్తర్ మీర్జా)
Episode 26 – Kanimoli Karunanidhi( కనిమోలి)
Episode 27 – Perumal Murugan(పెరుమాళ్ మురుగన్)
Episode 28 – GOPICHAND NARANG(గోపిచంద్ నారంగ్)
Episode 29 – Vishal Bharadwaj’s – Nude poetry(విశాల్ భరద్వాజ్)
Episode 30 – Vairamuttu – Poet & Cine Lyricist(వైయరముత్తు)
Episode 31 – Manglesh Dabral(మంగలేష్ దబ్రాల్)
Episode 32 – ANILBORO(అనిల్ బోరో)
Episode 33 – Mrinal Sen(మృణాల్ సేన్ )
Episode 34 – Elephant Whisperersఎలిఫంట్ విస్పర్స్)
Episode-35- Bimal Roy(బిమల్ రాయ్)
Episode-36- HRISHIKESH MUKHARJEE(హృషికేశ్ ముఖర్జీ )
Episode-37- BASU CHETTARJEE (బాసు చటర్జీ)
Episode- 38- ODISSA POETRY (ఒడిస్సా కవిత్వం)
Episode-40- ASHOK VAJPEYEE( అశోక్ వాజ్పేయీ)
Episode- 41- ADOOR GOPALAKRISHNAN (అదూర్ గోపాల కృష్ణన్)
Episode- 42- MAJROO SULTHANPURI (మజ్రూహ్ సుల్తాన్ పూరి)
Episode-43- PAIDI JAYRAJ(పైడి జయరాజ్)
Episode-45 – MAMANG DAI (మంగలేష్ దబ్రాల్)
Episode-44- S.D.BURMAN(ఎస్.డీ.బర్మన్)
Episode-45- SHAILENDRA (శైలేంద్ర)
Episode-46- KAVI PRADEEP(కవి ప్రదీప్)
Episode- 47- NEERAJ (నీరజ్)
Episode- 48- HASRATH JAIPURI( హస్రత్ జైపూరి)
Episode-49- KAIFI AZMI (కైఫీ ఆజ్మీ)
Episode-50-SHAKEEL BADAYION(షకీల్ బాదాయీయోన్)
https://www.talradio.org/telugu/
https://www.youtube.com/channel/UCFAU_xz4UKrMXoqUHxo86bA

Posted on

మిత్రులారా! తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏర్పడిన తర్వాత కరీంనగర్ వూరు,భాష, సంస్కృతి, అభివృద్ది తదితర అంశాల పైన “నమస్తే తెలంగాణ’ చేసిన ఇంటర్వూ చూడండి… శ్రీ నాగవర్ధన్ గారికి ధన్యవాదాలు- వారాల ఆనంద్

86= యాదొంకీ బారాత్

Posted on

++++++ వారాల ఆనంద్

86= యాదొంకీ బారాత్

++++++ వారాల ఆనంద్

ఏదయినా ఒక సంస్థకు శాశ్వత చిరునామా ఏర్పడడం, ఆ సంస్థ కార్యక్రమాలకు నీడ,వేదిక రూపొందడం గొప్ప కల సాక్షాత్కారం అవడమే. ఓ పిల్లి ఏడు ఇండ్లు తిరిగి తన సొంత గూటికి చేరినట్టు ఒక స్వచ్చంద సంస్థ స్వంత భవన నిర్మాణానికి పాదులు వేయడం ఆ సంస్థకు దాని నిర్వాహకులకు అమితమయిన ఆనందాన్నిచ్చే సందర్భం. అలాంటి సందర్భమే కరీంనగర్ ఫిలిం సొసైటీ కి వచ్చింది. కలెక్టర్ శ్రీ పార్థసారధి గారు సంపూర్ణంగా సహకరించడానికి హామీ ఇవ్వడమే కాకుండా కార్యనిర్వహణకు పూనుకోవడం తో నేనూ మిగతా కార్యవర్గ సభ్యులు కూడా ఆ నిర్మాణ పనిలో చొరవగా ముందుకొచ్చారు. మొదట దివంగత పండితులుఆత్మీయ మిత్రుడు శ్రీ నమిలకొండ హరిప్రసాద్ నేతృత్వంలో భూమి పూజ జరుపుకుని కార్యరంగంలోకి దూకాం. మొదట ఆర్థికంగా సహకరించమని కరీంనగర్ ప్రజల్ని కళాభిమానుల్ని కోరుతూ ఒక కరపత్రం వేసాము. అందులో కఫిసో చరిత్ర చేసిన కార్యక్రమాల వివరాలతో పాటు అనేక అంశాల్ని జోడించాం. ఇక అప్పటి కార్యవర్గమంతా జీవిత సబ్యులుగా చేరాలని తీర్మానించాం. కఫిసో బై లాస్ మౌలిక నిబంధనల ప్రకారం కఫిసోకు జీవిత సభ్యులే శాశ్వత హక్కు దారులు. భవిష్యత్తులో ఏ కార్యక్రమం జరిగినా వారు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారని నిర్దేశించబడి వుంది. 80 ల్లో శ్రీ అంపశయ్య నవీన్ గారిని సలహాదారుగా ఉండమని కోరినప్పుడు మొక్కుబడి పోస్ట్ తో ఉపయోగంలేదని సలహాదరుకీ కార్యవర్గంలో ఓటు హక్కు ఉండాలని ఆయన సలహా ఇవ్వడంతో అప్పుడే ‘బై లాస్’ ను సవరించి సలహాదారు పోస్టు తో పాటు జీవితసభ్యులే కఫిసో కు మూలాధారమని భవిష్యత్తు హక్కు దారులని పేర్కొంటూ రూల్స్ పెట్టడం జరిగింది. ఆ నిబంధనని కూడా భవన నిర్మాణ సందర్భంగా విస్తృతంగా ప్రచారంచేసాం. కార్యవర్గం జీవిత సభ్యులు కావడానికి వెయ్యి నూట పదహార్లు, బయటి వారు అయిదు వేలు చెల్లిస్తే జీవిత సభ్యత్వమిచ్చి దాతలుగా హాలులో పేర్లు రాసి ఉంచుతామని చెప్పాం. ఇవన్నీ అనుకున్న తర్వాత కరపత్రం తీసుకుని నేనూ, నరేడ్ల శ్రీనివాస్, నారదాసు లక్ష్మణ రావు, కే.దామోదర రెడ్డి మాతో పాటు డాక్టర్ రాజన్న తదితరులం ఒక ఉద్యమంలాగానే రోజూ ఉదయం కలిసి తెలిసిన మిత్రుల దగ్గరికి కఫిసొ అభిమానుల దగ్గరికి వెళ్ళడం ఆరంభించాం. నిజంగా అదొక యజ్ఞం. వూర్లో ఎవరు ఎవరికీ తెలిసినా ఎవరికి స్నేహితుడయినా ఈ టీం వాళ్ళ దగరికి వెళ్లాం. మాకు లభించిన స్పందన ఊహించనిది. ఎందుకంటే అడిగిన వాళ్ళల్లో శ్రీనివాస్, నారదాసు, దామోదర్, రాజన్న అంతా ఒక్కక్కొకరు ఒక్కో రంగం లో నిబద్దత తో వున్నా వారే. గొప్ప ఫేస్ వాల్యు వున్నవాళ్ళే. తిరగడం కొంచెం కష్టమే అయినా నేను కేంద్రకంగా ఆ ఉద్యమం ఆనందంగా రెండు కప్పుల చాయ్ మూడు జేవిత సభ్యత్వాలుగా విజయవంతంగా సాగింది. అవసరమయినప్పుడు డాక్టర్ సాగర్ రావు తో పాటు పలువురు మా వెంట వచ్చారు. మిగతా కార్యవత్గం కూడా అంతే నిబద్దతతో తమవంతు కృషి చేసారు. అదంతా సమిష్టి కృషి ఫలితమే.

అట్లా కఫిసో విజ్ఞప్తి మేరకు ఆ రోజుల్లోనే అంటే పదిహేడేళ్ళ క్రితం మా నారదాసు లక్ష్మణ రావు 25 వేలు ఇవ్వగా, పదివేల రూపాయల చొప్పున ఇచ్చిన ప్రముఖుల్లో గౌరిశెట్టి మునిందర్, కేసరిమల్ కార్వా, వావిలాల భూపతి రెడ్డి, డాక్టర్ పంజాల రాజన్న, సోమారపు వెంకన్న, బి.సత్యనారాయణ, టి.సంతోష్ కుమార్, కే.అనంత రెడ్డి, ఎం.రాజేవ్ శెట్టి, కొరవి వేణుగోపాల్, కసిరెడ్డి రాంరెడ్డి తదితరులున్నారు. ఇక అయిదు వేలు ఇచ్చిన వాళ్ళు అనేక మంది. అట్లా కఫిసో ప్రయత్నం తో మేము కట్టాల్సిన CONTRIBUTION సొమ్ము సమకూరింది. మా వాళ్ళంతా హమ్మయ్య అనుకుంటున్న సమయం లో నేను మెల్లిగా చెప్పాను. ఇంతటితో సరిపోదు కట్టబోయే హాల్లో చైర్స్, సౌండ్ సిస్టం, ఎల్.సి.డి. ప్రొజెక్టర్ కావాలి. అవి లేకుండా హాలు ఉవయోగం లేదు అని. నారదాసు నామీదికి ఒక్క సారిగా నా మీదికి ఎగిరాడు. ముందు నుంచి చెప్పలేదు… మెల్లిగా ఇప్పుడు చెబుతున్నావు అన్నాడు. అన్నీ ఒకేసారి చెబితే భయపడతారని అంటూ నసిగాను. శ్రీనివాస్, దామోదర్ లు నవ్వి ఘనకార్యమే చేసావు. ఇంకా చేసేదేముంది అన్నింటికీ ఎంత కావాలో బడ్జెట్ సిద్దం చేయి మరో రౌండ్ వేద్దాం అన్నారు నవ్వుతూ. వాటికీ సొమ్ము సమకూరింది.

ఇక మరో వైపు నిర్మాణం చురుకుగా సాగుతూ వుంది. పార్థ సారధి గారయితే అనేక సార్లు నిర్మాణాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. అది మాకూ ఇంజనీర్లకు గొప్ప ఉత్సాహకంగా వుండేది. కఫిసో సభ్యులతో పాటు మహిళా డిగ్రీ కళాశాల మిత్రులు డాక్టర్ గండ్ర లక్ష్మణ రావు, డాక్టర్ పి.రాజేశం, చంద్ర ప్రభాకర్ తదితరులు కూడా పలుసార్లు వచ్చేవాళ్ళు. మీడియా నయితే సంపూర్ణంగా మా వెంటే వుంది. వాళ్లకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే.

నిర్మాణానికి ఫిలిం భవన్ గా పేరు పెట్టుకున్నాం. ఇక శాశ్వతంగా ఉండేలా సొసైటీ ఎంబ్లెమ్, KARIMNAGAR FILM SOCIETY AUDITORIUM అని సిమెంట్ తో రాయించాను.

భవన నిర్మాణం పూర్తి అవుతూ వుంటే ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఏర్పాట్లల్లో మేమున్నాం. ముఖ్యంగా నారదాసు లక్ష్మణ రావు, దామోదర్, నేనూ పూనుకున్నానం. ఆడియో సిస్టం కొసం హైదరాబాద్ మోజం జాహీ మార్కెట్ కు వెళ్లాం. హాలో లో వేసే కుర్చీల విషయంలో కూడా అందరం శ్రద్ధ తీసుకున్నాం. ఇక ఎల్.సి.డీ. ప్రొజెక్టర్ ని అమెరికా నుంచి తెప్పించాం.

ఇదంతా ఇట్లా వుంటే ప్రారంభోత్సవం నాటికి ప్రత్యేక సావనీర్ తేవాలని నిర్ణయించాం. డాక్టర్ రావికంటి మురళి కన్వీనర్ గా కమిటీ వేసుకున్నాం. దాంట్లో అంపశయ్య నవీన్, ప్రేమేంద్ర మజుందార్, నారదాసు, రాములు, రావికంటి మురళి,కోలా రామచంద్రా రెడ్డి, టి.రాజమౌళి నేనూ తదితరులం వ్యాసాలు రాసాం. సావనీర్ లో దాతలందరి పేర్లు ఫోటోలు వేయాలనుకున్నాం. మా ఆస్థాన ఫోటోగ్రాఫర్ కృష్ణ దాతలందరి దగ్గరికి వెళ్లి ఫోటోలు తీసాడు. వాటి తోనే అందరికీ ఐ.డీ.కార్డ్స్ కూడా ఇచ్చాం. ప్రారంభోత్సవం నాటికి నేను నా వ్యక్తిగతంగా “KAFISO- A SAGA OF FILM LOVERS” పేర డాక్యుమెంటరీ ఫిలిం తీయాలని పూనుకున్నాను. దానికోసం గోదావరిఖని మిత్రుడు లింగాధర్ కెమెరా వర్క్ చేసాడు. వరంగల్ వెళ్లి నవీన్ ఇంటర్వ్యు తో పాటి కఫిసో విశేషాలు ఫోటోలతో సహా అన్నీ అందులో పొందుపరచాను. అరగంట డాక్యుమెంటరీ లో కలెక్టర్ పార్థసారధి, ఎన్.శ్రీనివాస్, నారదాసు, రాజమౌళి, తదితరుల ఇంటర్వ్యూ లు కూడా చేసాను. ఇక ప్రారంభోత్సవ సభకు ముందే ఒక మంచి రోజున ఉదయమే తన శ్రీమతి తో కలిసి పార్థసారధి గారు పాల్గొని పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇక అప్పటి జిల్లా మంత్రి శ్రీ ఎం.సత్యనారాణ రావు చేతులమీదుగా రిబ్బన్ కట్ చేసి ఫిలిం భవన్ ప్రారంభించాలని నిర్ణయించాం. శిలాఫలకం తో సహా అన్ని ఏర్పాట్లు చేసాం. అతిథులకు దాతలకు కార్యవర్గానికి ఇచ్చేందుకు మేమెంటో ల కోసం వరంగల్ వెళ్లాను అక్కడ దర్భశయనం నేనూ కలిసి వాటిని ఎంపిక చేసాం.

ప్రారంభోత్సవ రోజు రానే వచ్చింది. 2005, నవంబర్ 21 న వైభవంగా నిర్వహించాం. కఫిసో కున్న సొంత 35 ఎం.ఎం, 16 ఎం.ఎం. ప్రోజేక్తర్లతో పాటు ఎల్సీడీ ప్రొజెక్టర్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మంత్రి ఎం.సత్యనారాయణ రావు గారు శిలా ఫలకాన్ని ఆవిష్కరించి, భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పార్థసారధి గారు ప్రొజెక్టర్  గదిని ప్రారంభించారు. ఆనాటి సభకు పార్థసారధి అధ్యక్తత వహించగా ముఖ్య అతిథి మంత్రి సత్యనారాయణ రావు  మాట్లాడుతూ మంచి సినిమాలతో భారతీయ సంప్రదాయాల్ని కాపాడుకోవాలన్నారు. అప్పటి నగర మేయర్ ది.శంకర్, నారదాసు లక్ష్మన రావు, ఎన్.శ్రీనివాస్, కోలా రామచంద్రా రెడ్డి, నేనూ మాట్లాడాం. సభలో సావనీర్ ను మంత్రి ఆవిష్కరించగా, నేను నిర్మించిన డాకుమెంటరీ ని పార్థసారధి విదుల చేసారు. అనంతరం కఫిసో సీనియర్ సభ్యుడు శ్రీ రేణికుంట రాములును కఫిసో ఘనంగా సత్కరించింది. మిత్రుడు టి.దామోదర స్వామి వ్యాఖ్యానంతో సాగిన కార్యక్రమంలో దాతలకు కార్యవర్గానికి జ్ఞాపికలనిచ్చి సత్కరించాం. చివరన ‘kafiso a saga of film lovers’ documentary film ప్రదర్శించాం.

అట్లా కరీంనగర్ ఫిలిం సొసైటీ  సొంత ఆడిటోరియం కల సాకారమయింది. ఆ రోజు కేవలం కరీంనగర్ లోనే కాదు మొత్తం ఉమ్మడి రాష్త్రం లో ఫిలిం క్లబ్స్ కి ఎంతో ఆనందకరమయిన  రోజుగా చరిత్రలో నిలిచి పోయింది.

మంచి కళాత్మక సినిమాల కోసం వాటి ప్రదర్శన, విశ్లేషణ కోసం ‘ఫిలిం భవన్’ తోడుగా నిలబడాలని నేను కన్న కల అట్లా వాస్తవ రూపం దాల్చింది. కేవలం ప్రదర్శనే కాకుండా నవ యువతీ యువకులకు సినిమా నిర్మాణ రంగం లో శిక్షణ ఇచ్చే పని కూడా చేపట్టాలని అనుకున్నాం. ఆ దిశలో కొన్ని సంవత్సరాలు జాతీయ స్థాయిలో షార్ట్ అండ్ డాక్యుమెంటరీ చిత్రోత్సవాలు నిర్వహించాం, ఫిలిం మేకింగ్ లో శిక్షణ కూడా ఇచ్చాం. ఆ వివరాలతో మళ్ళీ కలుస్తాను…

ఇప్పటికి సెలవ్…

-వారాల ఆనంద్          

19 మార్చ్ 20 23                   

77= యాదొంకీ బారాత్

Posted on

++++++ వారాల ఆనంద్

77= యాదొంకీ బారాత్

++++++ వారాల ఆనంద్

కన్నీళ్లు ఎప్పుడయినా  

ఖాళీ అవుతాయా  

దుఖాన్ని తుడిచేసే కన్నీళ్లు

పొడి బట్టలాగా మారి ఆవిరవుతాయా

మనసు లోపలి ’దరి’ తెలేదాక

కన్నీల్లింకి పోతాయా

అంతరంగం వూటలేని బావిలాగా ఎండి పోతుందా

మనిషి ఉహూన్ ఉహూన్ అంటూ నిలుచుండి పోతాడా

ఏమో అనుభవాలు చిన్నవే

జ్ఞాపకాలే దీర్ఘమయినవి 

******

‘తెలంగాణ సాహితీ మూర్తులు ‘ పేర డాక్యుమెంటరీ సిరీస్ తీద్దామని కలలు కంటూ మొదలు పెట్టిన ‘ముద్దసాని రాం రెడ్డి’ డాక్యుమెంటరీ నిర్మాణం గొప్ప ఆనందాన్నీ మంచి అనుభావాన్నీ ఇచ్చింది.

అది అట్లా పూర్తి అవుతూ ఉండగానే తెలంగాణా రచయితల వేదిక కరీంనగర్ జిల్లా సభలు ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు జిల్లా శాఖకు మిత్రులు కవీ డాక్టర్ డింగరి నరహారాచార్య అధ్యక్షులుగా వున్నారు. అప్పటికి కరీంనగర్ లో వున్న పెద్ద విశాలమయిన వైశ్య భవన్ ను వేదిక గా చేసుకుని ఏర్పాట్లు మొదలయ్యాయి. జిల్లాకు సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి కవులు రచయితలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఆనాటి ఒక సెషన్ లో  ముద్దసాని రామి రెడ్డి డాక్యుమెంటరీ ఫిలిం ని ప్రముఖ రచయిత శ్రీ అల్లం రాజయ్య ఆవిష్కరించారు. అనంతరం మొదటి సీడీ కాపీని నా సహచరి ఇందిరకు ఇచ్చారు. ఆ సభలో శ్రీ జయధీర్ తిరుమల రావు తదితరులు వేదిక మీద వున్నారు. తరవాత ఆ జిల్లా మహా సభలోనే డాక్యుమెంటరీ ని ప్రదర్శించాం. అంతా బాగుందన్నారు. కొందరు మంచి ప్రయత్నమన్నారు. వ్యక్తిగా నేను చేసిన ఈ ప్రయత్నం మరింత విస్తృతంగా సంస్థాపరంగా చేయాలన్నారు. సంతోషం వేసింది.

ఆ నాటి సభకు ఆదిలాబాద్ నుండి ప్రముఖ రచయిత శ్రీ సామల సదాశివగారు కూడా వచ్చారు. ఆయనా ఆ ఫిలిం చూసారు.

నిజానికి ఆయన ఓ జ్ఞాపకాల గని, ముచ్చట్ల పందిరి, నడుస్తున్న సాహిత్య చరిత్ర, మరపు రాణి ఓ హిందుస్తానీ గాన కచేరి.

తడిమితే చాలు శరపరంపరగా అలవోకగా మాట్లాడుతూ వినే వాళ్ళని ముచ్చట్ల తో ముగ్దుల్ని చేసే విశాల ప్రపంచం ఆయనది.
ఎలాంటి రెఫెరెన్సు లు లేకుండా ఎక్కడెక్కడివో ఎప్పటెప్పటివో అనేక విషయాలు జాలు వారే ప్రవాహం అయన.
  అంతటి పెద్దాయన నాకంతకు ముందు వ్యక్తిగతంగా పరిచయం లేదు.అయన రచనలు చదవడం అయన గురించి వినడమే తప్పితే కలిసింది లేదు. అట్లా మొట్ట మొదసారిగా కరీంనగర్ లో తెలంగాణా రచయితల వేదిక సభలు వైశ్య భవన్ లో జరిగినప్పుడు వేదిక పైన ఆయన్ని చూడ్డం మొదటి సారి. అప్పటికే దృశ్య మాధ్యమం పైన అమిత మైన అభిమానం, అత్యంత ప్రభావవంతమైన దాని శక్తి పైన విశ్వాశం ఉన్న నేను ‘తెలంగాణా సాహితీ మూర్తులు’ పేర డాకుమెంటరీ సెరీస్ ను నిర్మించాలని ప్రయత్నం ప్రారంబింఛి అందులో భాగంగానే ముద్దసాని రామిరెడ్డి జీవితం సాహిత్యం పైన అరగంట నిడివి గల
జీవన చిత్రాన్ని నాటి వేదిక సభల్లో అల్లం రాజయ్య చేతుల మీదుగా అవిష్కరింఛి వున్నాను. సభా కార్యక్రమం తర్వాత కరీంనగర్ ప్రశాంత్ లాడ్జ్ లో బస చేసిన సదాశివ ను కలవ డానికి నేను డాక్టర్ నలిమెల భాస్కర్, జూకంటి జగన్నాథం, డాక్టర్ గండ్ర లక్ష్మన్ రావు తదితర మిత్రులం వెళ్ళాము.అదే మొదటి సారి ఆయన్ని అంత దగ్గరగా చూడడం ఎప్పటిలాగే మౌన ప్రేక్షకుడిగా ఆయన్ని వింటూ కూర్చున్నాను. ఎన్ని మాటలో ఎన్నెన్ని ముచ్చట్లో  …అప్పుడు అయన అన్నారు ‘ ఇప్పుడే రామిరెడ్డి ని కలిసి వచ్చిన. గీడ మూలక్కుచున్నాను అనే వేదన వద్దే వద్దని చెప్పిన, అక్కడ వైశ్య భవన్ లో నిలువెత్తుగా నిన్ను ఆవిష్కరించారు, నీ కీర్తి శాశ్వతం అయిందిపో అని చెప్పి వచ్చిన అన్నాడు.
నా వైపు తిరిగి మంచి పని చేసినావు. అవును నువ్వు జింబో కు ఏమవుతావు అని అడిగాడు. అయన మా అమ్మ తమ్ముడు  మేనమామ అని చెప్పిన. అయితే నారాయణ్ రావు ఏమవుతడు  అన్నాడు. పెదనాన్న అని చెప్పిన. దానికి తాను, నోముల  నారాయణ రావు  కలిసి పని చేసినప్పటి సంగతులు చెప్పాడు. రెండు గంటలు ఆయనతో కూర్చున్నంక భాస్కర్ తో మెల్లిగా అన్న మన రెండవ సాహితీ మూర్తి సదాశివ గారని. అయన ఎంతో సంతోష పడ్డాడు. మరింకేంది చెబుదా మన్నాడు. నా ప్రతి పాదన  సదాశివ ముందుంచాను. ఆదిలాబాద్ వస్తామని చెప్పాను. ‘నా దగ్గర ఏముందయ్యా’ అన్నాడు.
‘ఉన్నదేదో ఉన్నట్టు చూపిస్తానని చెప్పాను’
మీరు కాదని అనవద్దు అని భాస్కర్ ఒత్తిడి చేసాడు.
‘మరయితే రాండ్రి’   అన్నాడు సదాశివ.
రెండు రోజుల తర్వాత ఆదిలాబాద్ బయలుదేరాం నేను భాస్కర్.
రోజంతా అయన ముచట్లు. అయన ఇంటి పరిసరాలు అన్ని చూస్తు నేను …
చివరిగా అయన అడిగాడు ‘ నా మిద చిత్రం తీస్తే నికేమోస్తుంది ‘
ఏమి రాదన్నాను, ప్రతిదీ ఏదో వస్తుందని చేయం కదా అన్నాను.
నవ్వి ఊరుకున్నాడు. మీ ఇష్టం అన్నాడు సదాశివ. నేనేమి చేయాలో చెప్పు అన్నాడు. యౌనిట్ తో కలిసి వస్తామని చెప్పి బయలు దేరాం.
ఎంత వద్దన్నా పెద్దాయన బస్సు స్టాండ్ వరకు వచ్చి సాగనంపాడు.
అలా మొదలయింది ‘యాది సదాశివ్’ డాకుమెంటరీ.
********************************************
ఆ తర్వాత టి.వి, నారాయణ,కొడం సంతోష్ తదితర యూనిట్ తో కలిసి ఆదిలాబాద్ బయలుదేరా చిన్నపటి నుంచి అద్భుత మైన దృశ్యం గా మదిలో మిగిలి పోయిన రాయపట్నం వంతెన, గోదావరి నది, దాన్ని ఆనుకునే వున్న అడవి అన్నింటిని షూట్ చేస్తూ ఆదిలాబాద్ ప్రయాణం సాగింది. అక్కడ సదాశివ ఇంట్లో కెమెరా  రిఫ్లెక్టర్లు మొత్తం షూటింగ్ వాతావరణం సదాశివ గారిలో ఉత్సాహాన్ని నింపాయి. ఇంట్లో అందరిని షూట్ కి రెడీ చేసారు. సదాశివ గురించి మాట్లాడడానికి వసంత రావు దేశ్పాండే తో సహా అంత సిద్దం అయ్యారు. ఇల్లు, వాతావరణం, ఇంటర్వ్యూలు ముగించుకుని లక్షెట్టిపెట్ లో మా పెదనాన్న శ్రీ నారాయణ్ రావు గారి ఇంటర్వ్యూ తర్వాత షూటింగ్ హైదరాబాద్ కి మారింది. మా యౌనిట్ తో పాటు ప్రముఖ కవి మిత్రుడు దర్భశయనం శ్రీనివాసాచార్య  తోడుగా మాతో బయల్లుదేరాడు. మా అబ్బాయి అన్వేష్ కూడా జత కూడాడు. సదాశివ గురించి అయన అభిమానుల మాటల్ని, అయన తిరుగాడిన సుల్తాన్ బజార్ ,తరచుగా బస చేసిన  ఆదర్శ లాడ్జ్ లాంటి ప్రదేశాల్ని షూట్ చేయాలని బయలు దేరాం. శ్రీ వాడ్రేవు చినవీర భద్రుడు మాట్లాడుతూ ‘ఉర్దూ సాహిత్యం గజల్లు, దోహాలు లాంటి వాటి గురించి  సదాశివ చెప్పిన అంశాల్ని నెమరు వేసుకున్నాడు. శ్రీ ఫణి కుమార్ అప్పుడు ప్రకృతి చికిత్సాలయం లో వుంటే అక్కడికి వెళ్లి పలకరించాము. కొత్తగా రాస్తున్న వారి గురించి సదాశివ పట్టించుకునే విధానాన్ని ఆయన వివరించారు. అప్పటి ఆంధ్రజ్యోతి ఎడిటర్ రామచంద్రమూర్తి గారు  మాట్లాడుతూ ఎలాంటి రెఫెరెన్సులు లేకుండా సదాశివ చెప్పే వివరాల్ని ప్రశంసించారు. యాది ‘కాలం’ రాయించుకున్నప్పటి  సంగతుల్ని గుర్తు చేసుకున్నారు. ఆచార్య జయధీర్ తిరుమల్ రావు తెలంగాణా కి లభించిన గొప్ప భండాగారం అని చెబుతూ సదాశివతో తనకున్న సాన్నిత్యాన్ని నెమరువేసుకున్నారు.  ఈ మధ్యలో ఆంద్ర జ్యోతి ఆఫీసులో మిత్రుడు అల్లం నారాయణ ని కలిశాం. ఆ తర్వాత చిత్రీకరణ వరంగల్ కు మారింది. ఆచార్య లక్ష్మణ మూర్తి మాట్లాడుతూ ‘అలతి అలతి మాటల్లో సదాశివ చెప్పే అంశాలు ఎంత గొప్పవో వివరించారు’ . ఆచార్య జయశంకర్ మాట్లాడుతూ  అతి సామాన్య జీవితం గడిపిన సదాశివ ప్రతిభ అసామాన్య మైనదన్నారు. ఆచార్య కోకాటే సదాశివ తో తనకున్న సాన్నిహిత్యాన్ని చెప్పారు. అలా సాగిన సదాశివ జీవనచిత్రంలో అయన తిరుగాడిన ఇంటి వాతావరం తో పాటు వరంగల్ ‘బ్రాడ్ వే’, కరీంనగర్ ‘ప్రశాంత్ లాడ్జ్’ ల వాతావరణం కూడా డాకుమెంటరీ లో చూపించాము.
    ‘యాది సదాశివ’ నిర్మాణ క్రమంలో ఆయనతో గడిపిన సమయాలు నిజంగా జీవితం లో మరచిపోలేని అనుభవాలు, అయన వెలువరించిన అభిప్రాయాలు సువర్ణ అక్షరాలు.
‘కర్ణాటక సంగీతం లో బహుదారి అని ఒక రాగం వుంది నాది అదే దారి ‘ అంటారు సదాశివ. అన్ని దారులూ వచ్చి కలుస్తాయి అందుకే నన్ను అందరూ కలుస్తారు ఆచార్య లక్ష్మన మూర్తి, ఆచార్య సంపత్కుమార, మహాజబీన్, యాకూబ్, శివారెడ్డి, దేవిప్రియ ఇలా ఒకరేమిటి అందరు వస్తారు అందుకే నాది బహుదారి అన్నారు సదాశివ.
      నాజీవితంలో ఎప్పుడు నెగెటివ్ గా ఆలోచించలేదు ఎవరు చెప్పిందాంట్లో నైనా మంచి ఉందేమో నని ఆలోచించాను. కవిత్వం కండ్లబడ్డప్పుడు ఆనందించకుండా ఉండలేదు. ఎవరే పని చేసిన ఏదో ఒక ప్రతిభ ఉంటేనే చేస్తాడు దాన్ని నిరాకరిస్తే ఎట్లా? వీలయితే ప్రోత్సహించాలే లేదా ఆనందించాలే కాని నిరాకరించొద్దు. ఇది అయన జీవన విధానం. ఇలా కలగలసి పోయిన అయన జీవితం సాహిత్యం రెంటిని తడుముతూ చేసిన చిన్న ప్రయత్నం ‘యది సదాశివ’
     అయన మాటలు, నడక, నివాసం అనింటిని దృశ్య మానం చేసే అవకాశం నాకు దొరికింది. నిజంగా తన చుట్టూ వున్న అత్యంత సాదారణ జీవితంలోంచి తెలంగాణా సాంస్కృతిక ముద్ర ఇది, తెలంగాణా అస్తిత్వం ఇది అని చెప్పిన మహానుభావుడు సదాశివ.
     అయన తెలంగాణాకు లభించిన గొప్ప కానుక. అలాంటి కానుకను భావి తరాలకోసం సజీవంగా నిలిపే అవకాశం నాకు కలగడం గొప్ప ఆనందాన్నిచ్చింది. 

ఆ ఫిలింని ఆ తర్వాత ఆదిలాబాద్ లో జరిగిన  తెలంగాణా రచయితల సభల్లో ఆవిష్కరించి ప్రదర్శించాం. డాక్యుమెంటరీ నిర్మాణ క్రమంలో షూట్ చేసినదంతా చివరి దాకా వుండే అవకాశం వుండదు. అవసరమయిన మేరకు ఎడిట్ చేసి ఫైనల్ వర్షన్ ఉంచుతాం. అట్లా రూపొందిన ఫిలిం లో దర్శకుడిగా చెప్పదలుచుకున్న అంశాలుంటాయి. మొత్తం మీద తెలంగాణా సాహితీ మూర్తులు సిరీస్ లో రెండు ఫిలిమ్స్ మాత్రం చేయగలిగాను. తర్వాత ఆ సిరీస్ ను రచయితల వేదికనో లేదా మరెవరయినా చేపదతారేమోనని చూసాను. కాని కొనసాగలేదు. నాకు కొనసాగించే ఆర్ధిక శక్తి లేకుండా పోయింది. అది కొంత నిరాశే అయినా వ్యక్తిగతంగా నాశక్తి మేరకు నేను చేశాననే సంతృప్తి మాత్రం మిగిలింది. ఆ యిద్దరు మహానుభావుల జీవితం సాహిత్యాలను కొంత మేరకయినా దృశ్య మాధ్యమంలో రెండు దశాబ్దాల క్రితమే నిక్షిప్తం చేసాను. అది చాలు నాకు.

మిగతా మళ్ళీ వారం.. 

-వారాల ఆనంద్

15 జనవరి 2023

77= యాదొంకీ బారాత్

++++++ వారాల ఆనంద్

76- యాదొంకీ బారాత్+++ వారాల ఆనంద్

Posted on

76- యాదొంకీ బారాత్
+++++ వారాల ఆనంద్

విన్నవీ, కన్నవీ, అనుభవించినవీ, అనుభూతి చెందినవీ, ఊహించినవీ, ఆలోచించినవీ అన్నింటినీ ఇతరులతో పంచుకోవాలనుకుంటాను. అది దుఖమయినా, సంతోషమయినా, కోపమయినా, ప్రేమయినా ఏ భావమయినా పంచుకోవాలన్నది మనిషి ప్రాధమిక లక్షణమని నేననుకుంటాను. ఆ క్రమంలోనే మనిషి మాటలని, పాటలని, అనేక కళలనీ ఆవిష్కరించాడు. దాంతో కాలం గడిచిన కొద్దీ మనిషిలో సృజనాత్మకత, వ్యక్తీకరణ పెరుగుతూ విస్తారమవుతూ వచ్చాయి. ఫలితంగా కళల విస్తృతీ పెరిగింది. భావ ప్రసారమూ పెరిగింది.
నా మట్టుకు నాకు తొలి రోజుల్లో అక్షరమే ప్రధాన వ్యక్తీకరణ మాధ్యమం. అది కూడా మాట్లాడడం కాదు రాతనే. అట్లా కొంత కవిత్వం, కొన్ని కథలు, వ్యాసాలూ, వార్తలూ రాయడం అలవాటయింది. అయితే ఫిలిం సొసైటీ లో పనిచేయడం సినిమాలు, టీవీ విస్తృతంగా చూడడం తో నాకు క్రమంగా దృశ్య మాధ్యమం పై ఆసక్తి పెరిగింది. అర్థవంతమయిన సినిమాలు చూడడం అందరికీ చూపించడం, వాటిపైన రాయడం చేస్తూ వచ్చాను. సినిమాల్లో ఫీచర్ ఫిలిమ్స్ తో పాటు డాక్యుమెంటరీలు కూడా ఆసక్తి కలిగించాయి. పీ.వీ.పతి, రిత్విక్ ఘటక్, రే, శ్యాం బెనెగల్, ఆనంద్ పట్వర్ధన్, కే.పి.శశి, సుహాసిని మూలే, రాకేశ్ శర్మ ఇట్లా అనేక మంది తీసిన డాక్యుమెంటరీ సినిమాల్ని చూసిన తర్వాత డాక్యుమెంటరీ సినిమాల ఆవశ్యకత ప్రాధాన్యత నాకు తెలిసి వచ్చింది. అంతే కాదు తెలుగులో బి.నరసింగ రావు రూపొందించిన ‘మావూరు’, ది సిటీ, ఆకృతి లాంటివి కూడా గొప్ప ప్రభావాన్ని కలిగించాయి. చారిత్రక, సామాజిక, రాజాకీయ అంశాల్ని నిక్షిప్తం చేయడానికి డాక్యుమెంటరీలు ప్రభావంతమయిన వేదికలు అన్న విషయం బాగా బోధపడింది. అంతకుముందే మిత్రుడు డాక్టర్ జయధీర్ తిరుమల్ రావు “డాక్యుమెంటరీ సినిమా” అన్న పుస్తకం రాసాడు. అది చదివిన తర్వాత వివిధ దేశాల డాక్యుమెంటరీల స్థితి తెలిసింది. ఇంటర్నెట్ లేని కాలంలో ఆ మేరకు సమాచారాన్ని అందించిన జయధీర్ ను అభినందించాల్సిందే. ఇదంతా ఎందుకు యాది కి వచ్చిందంటే 2002-03 ప్రాంతాల్లో డాక్యుమెంటరీలకు పనిచేయడం, స్వయంగా నిర్మించడం చేసాను. అంతా చూసి నేర్చుకున్న అనుభవమే.
డాక్యుమెంటరీల నిర్మాణంలో మొదటి అనుభవం లయన్స్ చారిటబుల్ ఆసుపత్రి కోసం తీసిన “ A RAY OF HOPE”. తర్వాత అదే సమయానికి ప్రముఖ సినీ విమర్శకుడు, స్క్రిప్ట్ రచయిత శ్రీ కే.ఎన్.టి. శాస్త్రి గారు “PUBLIC SERVICE BROADCASTING TRUST” (PSBT) నుంచి ఆమోదం పొంది సిరిసిల్లా చేనేత కార్మికుల ఆత్మ హత్యల మీద ఒక డాక్యుమెంటరీ ఫిలిం చేయడానికి నిర్ణయించుకున్నారు. కరీంనగర్ అనగానే తనకు నేను గుర్తొచ్చాను. వెంటనే నాకు కాల్ చేసారు. నేను వెంటనే రండి సార్ సిరిసిల్లాకు వెళ్దాం, అక్కడ చాలా మంది మిత్రులున్నారు అన్నాను. ఆ ఫిలింకి ప్రముఖ జర్నలిస్ట్ టంకశాల అశోక్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని చెప్పారు. మర్నాడుదయం తాను, ఫిలిం కెమెరామన్ సన్నీ జోసెఫ్ తో కలిసి కరీంనగర్ వచ్చారు. అంతా బయలుదేరాం. దారిలో చర్చ మొదలయింది. విషయం నాకు వివరించారు. ఈ ఫిలిం ని వేములవాడలో వున్న ఒగ్గు కళాకారుడు మిద్దె రాములు ప్రదర్శన తో ఆరంభిస్తే బాగుంటుంది అన్నాను. మీకు తెలుసా కలుద్దామా అన్నారు. మొదట వేములవాడ తిప్పాపూర్ లో వున్న మిద్దె రాములు గారింటికి వెళ్లాం. నేను విషయం చెప్పాను. పద్మశాలి వాళ్ళ చరిత్ర చెప్పాలి అన్నాను. ఆయన క్షణం ఆలస్యం చేయకుండా “మార్కండేయ పురాణం” ఒగ్గు కథ అందుకున్నారు. ఐదునిమిషాలు ఒగ్గు కథ వినగానే శాస్త్రి గారు త్రిల్ అయ్యారు. వెంటనే మీరు తప్పకుండా సహకరించాలి అన్నారు. మా ఆనంద్ సార్ వచ్చాడు మీరు ఎట్లా అంటే అట్లా.. అన్నాడు. నేనన్నాను ఫిలిం ప్రారంభమే కథ తో వుంటే బాగుంటుంది. చివర మళ్ళీ ఒగ్గు తో ముగిస్తే చాలా బాగుంటుంది ఆలోచించండి అన్నాను. అంగీకరించారు. నాకు చాలా ఇష్టమయిన అగ్రహారం లోవున్న ఆలయం వెనకాల చెట్లలలో షూట్ చేస్తే బాగుంటుంది.. ఇక ముగింపు నాంపెల్లి గుట్ట మీద వున్న బల్లపరుపు బండమీద తీస్తే బాగుంటుంది అన్నాను. అట్లా ఆలోచిస్తూ వేములవాడ నుంచి సిరిసిల్లా చేరుకున్నాం. అక్కడ జర్నలిస్టు మిత్రుడు శ్రీ టీ.వీ.నారాయణ మాకెంతో సహకరించాడు. మొదటి రోజు నుంచి షూట్ అయినన్ని రోజులూ మాతోనే వున్నాడు. సన్నీ జోసెఫ్ చిత్రీకరణ పద్ధతి అవీ నాకు బాగా నచ్చాయి. తర్వాత షెడ్యుల్ వేసుకుని “DEATH LOOMS” అన్న ఆ డాక్యుమెంటరీ ఫిలిం పూర్తి అయింది. అదొక గొప్ప అనుభవం నాకు.
తర్వాత కే.ఎన్.టి. శాస్త్రి గారే మరో ఫిలిం కోసం కరీంనగర్ వచ్చారు. దానికి కూడా నేను సహకరించాను. అది “ STATE OF KILLINGS . నక్సలైట్స్ దాడులు, పోలీసుల ఎన్కౌంటర్లు ఈ రెండూ ఆ రెంటి పైన ఆధారం చేసుకుని ఈ ఫిలిం తీసారు. దాని కోసం మళ్ళీ సిరిసిల్ల జగిత్యాల ప్రాంతాల్లో షూట్ చేసారు. అప్పుడు కరీంనగర్ ఎస్పీ గా వున్న శ్రీ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఇంటర్వ్యు కూడా చేసాం. అట్లా ఆ రెండు డాక్యుమెంటరీల తో కలిసి ప్రయాణం చేసిన అనుభవం నాకెంతో ఉపయోగ పడింది. మేకింగ్ కు సంబంధించి దగ్గరినుండి చూసి ఇన్వాల్వ్ అయ్యే అవకాశం వచ్చింది. అందుకోసం కే.ఎన్.టి. శాస్త్రి గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. కే.ఎన్.టి. శాస్త్రి గారు సురభి డాక్యుమెంటరీ, తిలాదానం, కమ్లి లాంటి ఫీచర్ ఫిలిమ్స్ చేసాడు. ఆయనకు ఫిలిం క్రిటిక్ గా జాతీయ అవార్డు వచ్చింది, సినిమాలకు జాతీయస్థాయిలో అవార్డులు గెలుచుకున్నారు.

ఇట్లా అటు సాహిత్యం తో వున్న అనుబంధం, మరో వైపు సినిమాల నిర్మాణ రంగాలతో వున్న ఇష్టం ప్రవేశాల ఫలితంగా నాలో ఆలోచన మొదలయింది. సాహిత్యానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని జోడించాలని ఆలోచన మొదలయింది. ఫలితంగా సాహిత్య కారులని దృశ్య రూపంలో రికార్డు చేయాలనిపించింది. అప్పుడే తెలంగాణా రచయితల వేదిక ఏర్పాటు చేసుకున్నాం. ఇంకేముంది తెలంగాణా సాహితీ మూర్తులు పేర డాక్యుమెంటరీలు నిర్మించాలనుకున్నాను. నాకున్న పరిమితులు నాకు తెలుసు. ఆర్ధిక సాంకేతిక పరిమితుల పట్లా నాకు స్పష్టత వుంది. అయినా ప్రయత్నం చేయాలనే నిర్ణయించుకున్నాను. మొట్ట మొదట కరీంనగర్ బిడ్డ రచయిత శ్రీ ముద్దసాని రామి రెడ్డి గారిపైన ఫిలిం చేయాలని సప్తగిరి కాలనీలో వున్నఆయన దగ్గరికి వెళ్లి కలిసాను. ముద్దసాని రాంరెడ్డి ‘’ఆగిన కాలానికి చలనాన్ని తెచ్చిన అద్వితీయుడు’. దశాబ్దాల క్రితం కారు ప్రమాదంలో వెన్నెముకకు గాయమయి మంచానికి అతుక్కుపోయారాయన. నడుమునుంచి కింది భాగమంతా స్పర్శ కోల్పోయి మంచం దిగలేని,దాటలేని స్థితిలో వుండిపోయారు. ఆ స్థితిలో కేవలం రచననే తన జీవన విధానంగా మార్చుకున్నాడాయన. జర్నలిజం చదివిన ఆయన కొంతకాలం డీపీ ఆర్ వో గా పని చేసారు. 1967 లో ప్రమాదానికి గురయిన తర్వాత పద్నాలుగు పుస్తకాలు రాసారు. అనేక అనువాదాలు చేసారు. ఆయనకు ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమి అవార్డు తో సహా అనేక పురస్కారాలు వచ్చాయి. లేవలేని స్థితిలో కూడా అంత గొప్ప సృజనాత్మక జీవితాన్ని ఆవిష్కరించిన ఆయన జీవితాన్ని, సృజనని భావితరాల వారికి స్పూర్తిగా చూపించాలని పించింది. ఆయన సురవరం జీవిత చరిత్ర మొదలు అనేక రచనలు, అనుసృజనాలు చేస్తూ వచ్చారు.రాం రెడ్డి గారి వూరు ఊటూరు. ఆయన జీవితాన్నికాన్వాస్ గా తీసుకుని వారి శ్రేమతి గారు మొదలుకుని, ఆయన చిన్ననాటి మిత్రుల ఇంటర్వ్యు లతో డాక్యుమెంటరీ రూపొందించాలని స్క్రిప్ట్ రాసుకున్నాను. అన్నీ సిద్దం చేసుకుని టీవీ నారాయణ సహాయ దర్శకుడిగా, సిరిసిల్ల కొడం సంతోష్ ను కెమెరా వర్క్ కోసం ఎంపిక చేసుకున్నాం. మొట్టమొదటి రోజు షూటింగ్ ప్రారంభోత్సవానికి పెద్దలు సాహితీ వేత్త జువ్వాడి గౌతమ రావు గారిని ఆహ్వానించాను. చాలా తక్కువగా బయటకు వచ్చే ఆయన నా కోరికను కాదనకుండా ఆమోదించారు. వారితో పాటు ఆత్మీయ మిత్రుడు ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఎం. విజయ మోహన్ రెడ్డి గారినీ ఆహ్వానిచాను. ఆయనా నాకు తోడుగా నిలబడ్డాడు. క్లాప్ కేమేరా స్విచ్ ఆన్ ల తరవాత ఆయన పూర్తి ఇంటర్వ్యూ వారి శ్రీమతి ఇంటర్వ్యు లు అన్నీ పూర్తి చేసాము. అదే రోజు ప్రముఖ కవులు శ్రీ దర్భశయనం శ్రేనివాసాచార్య, జూకంటి జగన్నాధం, అనువాదకులు డాక్టర్ నలిమెల భాస్కర్ లు కూడా రామ్ రెడ్డి గురించి ఆయన సృజన గురించి మాట్లాడారు. దర్భశయనం రాంరెడ్డి లోని దీశాలిని ఆవిష్కరించారు. జూకంటి రాంరెడ్డి సాహిత్యవ్యక్తిత్వాన్ని వివరించగా, నలిమెల భాస్కర్ రాం రెడ్డి అనువాదాన్ని ఆలంబనగా చేసుకోవడం తనకు బాగా నచ్చిందన్నారు. తర్వాత రాంరెడ్డి గారి వూరు ఊటూరు వెళ్లి అక్కడ రాంరెడ్డి గడిపిన వాతావరణాన్ని షూట్ చేసాము. ఇక తర్వాతి రోజు షూటింగ్ ను హైదరాబాద్ కు మార్చాం. రాం రెడ్డి గారి సహాధ్యాయి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారిది, రాంరెడ్డి గారి చిన్ననాటి మిత్రుడు సి.ఆనంద రావు గారి అభిప్రాయం తీసుకోవాలన్నది నా ప్లాన్. దానికి మొత్తం యూనిట్ కరీంనగర్ నుంచి బయలు దేరాం. అంతకు ముందే సినారె, ఆనంద రావులతో ఫోన్లో మాట్లాడాను. ఆ షూట్ కి నాకు అత్యంత ఆత్మీయుడయిన కవిమిత్రుడు శ్రీ దర్భశయనం మాతో పాటు బయలు దేరాడు. దాంతో నాకు అమిత మయిన విశ్వాసంవచ్చింది. ఉదయాన్నే సీనారే ఇంటికి వెళ్ళాము. ఆయన ఉత్సాహంగా తనకు రాం రెడ్డి కి వున్న స్నేహాన్ని ఆప్యాయతల్ని భావోద్వేగంగా చెప్పారు. రాంరెడ్డి వాక్చాతుర్యాన్ని చెబుతూనే, సినారె తన మొట్ట మొదటి దీర్ఘకవిత “విశ్వగీతి” ప్రచురణ కోసం రాంరెడ్డి తన సైకిల్ అమ్మి డబ్బిచ్చాడని గొప్పగా చెప్పాడు. ఇక ప్రముఖ హైకోర్టు న్యాయవాది మాజీ మంత్రి శ్రీ సి.ఆనంద రావు ను కలిసాం. జానపద గీతాలు పాడే రాంరెడ్డి ని గురించి ఉత్సాహంగా వివరించాడు. తమ కాలేజీ రోజుల నాటి సంగతుల్నిఉత్సాహంగా మాతో పంచుకున్నాడు. ఇక యూనిట్ మొత్తం టాంక్ బ్యాండ్ పైన కొంచెంసేపు తిరిగి ఉత్సాహంగా వచ్చేసాం. తర్వాత జువ్వాడి గౌతమ రావు రాంరెడ్డి తో తన అనుభవాల్ని మా యూనిట్ తో పంచుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారింటికి ఇద్దరమూ కలిసి వెళ్ళామన్నారు. అప్పుడు విశ్వనాథ స్వయంగా ఫలహారం చేసి పెట్టారని జువ్వాడి గుర్తు చేసుకున్నారు. రాంరెడ్డి ప్రమాదానికి ముందు ఎంత ఉత్సాహంగా చలాకీగా ఉండేవాడో గౌతమ నాస్టాల్జిక్ గా చెప్పుకొచ్చారు.
అట్లా వైకల్యం నుంచి విజయాల దాకా సాగిన రాం రెడ్డి గారి జీవితమూ సాహిత్యాల పైన రూపొందించిన డాక్యుమెంటరీ ‘తెలంగాణ సాహితీ మూర్తులు’ సిరీస్ లో నా మొదటి ప్రయత్నం. ఆ ఫిలింలో జువ్వాడి, సినారె లాంటి వాళ్ళతో టాక్ అండ్ షూట్ ఎంతో రిచ్ అనుభవం. ఈ ఫిలిం పూర్తి చేయడం లో మిత్రులు సరస్వతి, విజయమోహన్ రెడ్డి లాంటి వాళ్ళ సహకారం మరువలేనిది. ఇక షూట్ అండ్ ఎడిట్ పూర్తి చేయడంలో వెంట వుండి దర్భశయనం, టీవీ నారాయణలు ఇచ్చిన ఉత్సాహం ఎంతో బలాన్నిచ్చింది.
అట్లా ఎంతో బాధ్యతతో ఉత్సాహంతో రూపొందించిన ‘ముద్దసాని రాంరెడ్డి’ డాక్యుమెంటరీ ని కరీంనగర్ ‘వైశ్యభవన్’ హాలు లో జరిగిన తెలంగాణ రచయితల వేదిక జిల్లా సభల్లో ప్రముఖ రచయిత శ్రీ అల్లం రాజయ్య ఆవిష్కరించి నా సహచారి ఇందిరకు మొదటి కాపీని అందజేశారు. ఆ వివరాలు మళ్ళీ వారం రాస్తాను..

-వారాల ఆనంద్
08-01-2023

‘సాహిత్య బంజారా’లా తిరుగుతున్నాను’’

Posted on Updated on

వారాల ఆనంద్‌ :పలకరింపు

++++

గుల్జార్‌ కవిత్వ అనువాదానికి 2022 కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం అందుకుంటున్న సందర్భంగా అభినందనలు..

‘నచ్చిన కవిత్వాన్ని వచ్చిన రీతిలో’ అనువదించాలి అనుకున్నాను అంతే. కేంద్ర సాహిత్య అవార్డు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. అవార్డు రావడం గొప్ప ఆనందమే. మనసులో ఆనందంతో పాటు తలపైన భారం కూడా పెరిగినట్టే. గుల్జార్‌ ‘గ్రీన్‌ పోయెమ్స్‌’ సంకలనానికి నా అనువాదం ‘ఆకుపచ్చ కవితలు’ పుస్తకాన్ని జాతీయ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరికి, అకాడెమీ భాధ్యులకు ధన్యవాదాలు.

**గుల్జార్‌ కవి మాత్రమేగాక హిందీ సినిమా రచయిత కూడా కదా. సినీ గీతాల ద్వారా ఆయనవైపు మొదట ఆకర్షితులు అయ్యారా, లేక ఆయన కవిత్వం మొదట చదివారా?

గుల్జార్‌ అంటే నాకు నా కాలేజీ రోజుల నుంచీ అభిమానం. ఆయన్ను మొట్టమొదట ఇష్టపడింది ‘పరిచయ్‌’ సినిమాలో ఆయన రాసిన ‘ముసాఫిర్‌ హూన్‌ యారో..’ అన్న పాటతో.

ఆ తర్వాత రాజేష్‌ ఖన్నా ‘ఆనంద్‌’ సినిమాకు గుల్జార్‌ రాసిన మాటలు నన్నెంతో ఆకట్టుకున్నాయి. అనంతరం ఆయన తీసిన ‘ఖోషిష్‌’ లాంటి సినిమాల్లో కనిపించిన సున్నితత్వం ఆయనకు నన్ను మరింత దగ్గర చేసింది. తర్వాత గుల్జార్‌ కవిత్వం పై దృష్టి పడింది. గ్రీన్‌ పోయెమ్స్‌, సస్పెక్టెడ్‌ పోయెమ్స్‌, నెగ్లెక్టెడ్‌ పోయెమ్స్‌, సెలెక్టెడ్‌ పోయెమ్స్‌, జీరోలైన్‌ ఇట్లా ఆయన రాసిన అనేక సంకలనాలు చదివాను. అంతేకాదు ఆయన చేసిన టాగోర్‌ ‘బాగ్బాన్‌’ అనువాదం కూడా చదివాను. వీటిల్లో ‘గ్రీన్‌ పోయెమ్స్‌’ బాగా నచ్చింది. అందులో ఆయన స్పృశించిన పర్యావరాణ అంశం బాగా హత్తుకుంది. పర్యావరణం అన్న మాట ఎక్కడా అనకుండా చెట్లు, మబ్బులు, నదులు, పర్వతాలు ఇట్లా అనేక అంశాలనూ, వాటికీ మనిషికీ వున్న అనుబంధాన్నీ ఇందులో గుల్జార్‌ సున్నితంగా ఆవిష్కరించాడు. అందుకే ఈ పుస్తకాన్ని ‘ఆకుపచ్చ కవితలు’ పేరిట అనువాదం చేయాలనుకున్నాను.

**‘లయ’ కవితా సంకలనం నుండి నేటి వరకు గత నాలుగు దశాబ్దాల మీ సాహితీ ప్రస్థానం గురించి చెప్పండి?

చిన్నప్పుడు నేను పెద్ద అంతర్ముఖుడ్ని. మాట్లాడడం సరిగ్గా వచ్చీ రాక చాలా పెద్ద కుటుంబంలో ఒంటరిగా గడిపేవాన్ని. కరీంనగర్‌లో నానమ్మ తాతలది మిఠాయి దుకాణం. మా చిన్నప్పుడు మా నాన్న ఉర్దూలో అనేక పుస్తకాలు చదివేవారు. మా ఇంటి దగ్గరలో పుస్తకాలు అద్దెకు ఇచ్చే శ్రీ కృష్ణా బుక్‌ స్టాల్‌ అనే ఓ షాపు వుండేది. చిన్నప్పటినుంచే అందులోంచి డిటెక్టివ్‌ పుస్తకాలు తెచ్చుకుని చదవడంతో నాకు టెక్స్‌ట్‌ పుస్తకాలకు అదనంగా ఇతర పుస్తకాలు చదివే అలవాటయింది. తర్వాత యద్దనపూడి, అరికెపూడి, మాదిరెడ్డి లాంటి మహిళా రచయిత్రుల నవలలు చదివాను. డిగ్రీ అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరిన తర్వాత నా చదివే ఒరవడి మారింది. శ్రీశ్రీ కవిత్వం, చివరకు మిగిలేది, అసమర్థుని జీవయాత్ర, మైదానం, అంపశయ్య లాంటి నవలలు చదవడం మొదలయింది. రాయాలనే కోరికా శురూ అయింది. ఆ కోరికతో మినీ కవిత్వం, చిన్న కథలు రాయడం ఆరంభించాను. అట్లా మొదటి ప్రయత్నంగా అలిశెట్టి ప్రభాకర్‌, వజ్జల శివకుమార్‌, జింబో, పీ.ఎస్‌.రవీంద్ర లతో కలిసి ‘లయ’ మినీ కవితా సంకలం తెచ్చాం. తర్వాత కరీంనగర్‌ ఫిలిం సొసైటీ లో చేరాను. అర్థవంతమయిన సమాంతర సినిమాల వైపు నా దృష్టి మరలింది. సినిమా చాలా ప్రభావ వంతమయిన మాధ్యమమని గొప్ప సినిమాల్ని సామాన్య ప్రజలకు, విద్యార్థుల దగ్గరికి తీసుకెళ్లాలని చూపించాలని ఫిలిం సొసైటీ ఉద్యమంలో ప్రధాన బాధ్యతను తీసుకున్నాను. కానీ సాహిత్య అధ్యయనం మాత్రం నిరంతరం కొనసాగింది. కవిత్వం, కథలు, పిల్లలకోసం కథలు, సినిమాలు, డాక్యుమెంటరీ ఫిలిమ్స్‌ తీయడం, విమర్శ, అనువాదాలు, కొంతకాలం జర్నలిజం ఇట్లా ‘సాహిత్య బంజారా’లా తిరుగుతున్నాను. ఏదో తెలుసుకోవాలననీ, తెలుసుకున్నది తెలియజెప్పాలన్న నా ఈ చిన్న యాత్ర కొనసాగుతూ వున్నది.

** అభ్యుదయం నుండి అనేక వాదాలు చెలరేగినా అన్ని వాదాలు దాటుకుంటూ కవితా వాదాన్ని మాత్రమే నిలబెడుతూ సాగడం లోని మీ నిష్ఠ-నిశ్చయం?

ఆయాకాలాల్లో పెళ్ళుబికిన సామాజిక సంఘర్షణ, సామాజిక మార్పు ప్రతి సృజనకారుడి పైనా వుంటుంది. ప్రతిస్పందన మాత్రం ఆ సృజనకారుడి మానసిక స్థితి, స్వీకరించి ప్రతిస్పందించే లక్షణం మీద ఆధారపడి వుంటుంది. నేను అన్ని వాదాలనీ దగ్గరి నుంచి చూసాను. కలిసి నడిచాను. నేనెప్పుడో రాసుకున్నట్టు ‘‘ఈ సమాజం అచ్చుతప్పులున్న గొప్ప పుస్తకం, ఇప్పుడు కావలసింది తప్పొప్పుల పట్టిక తయారు చేయడం కాదు, ఆ పుస్తకాన్ని పునర్ముద్రించాలి’’ అన్న భావనలోనే వున్నాను.

** ‘ఆకుపచ్చ కవితలు’ అనగానే పర్యావరణకవిత్వం అనుకుంటారు ప్రకృతి పర్యావరణమా.. మానవ మనః ప్రకృతి పర్యావరణమా..?

‘ఆకుపచ్చ కవితలు’తో సహా గుల్జార్‌ సాహిత్యంలో అంతర్లీనంగా ఒక సామాజిక కామెంట్‌ వుంటుంది. ఆయన గొప్ప భావుకుడు. ఆయన రచనల్లో మనిషి, మానవత్వం, ప్రధానంగా కనిపిస్తాయి. ఇక ఆయన భాష, శైలి చాలా సున్నితంగావుండి హృదయానికి హత్తుకునేలా వుంటాయి. ఆయన కవిత్వంలో ఇమేజెస్‌ అద్భుతంగా వుంటాయి. అన్నీ దాదాపుగా మనం రోజూ చూసే, అనుభూతించే అంశాల్లానే అనిపిస్తాయి. కానీ వాటిల్లో ఒక ఫ్రెష్‌నెస్‌ మనల్ని కదిలిస్తుంది. మనసు కదిలిపోతుంది.

‘గగన సీమలో ఆకాశం/ అతుకులు అతుకులుగా విడిపోతున్నది, / ఎన్ని ప్రాంతాల్నుంచి/ ఈ గుడారం విడిపోతున్నదో/ నా కవిత్వంతో రోజంతా ఒక్కో కుట్టూ కుడుతూ/ మెలికల కుట్లేస్తున్నా’ లాంటి సున్నితమయిన భావాల్ని చదివిన తర్వాత ఆయన కవిత్వం నాపై గొప్ప ప్రభావాన్ని కలిగించింది. ఇంకో కవిత:

‘భయపడకు నేనున్నాను

భయపడకు నేనున్నాను

ఆ ఒంటరి ఆకు

చెట్టుకు ధైర్యాన్నిస్తూ

చెబుతూనే వుంది’

ఇలాంటి కవితలు చదివాక అనువదించాలి అనుకున్నాను.

** మీ భవిష్యత్తు ప్రణాళిక ఏమిటి?

చివరంటా చదువుతూ రాస్తూ వుండాలి. దాంతో పాటు ‘గో టు కాలేజెస్‌’ అంటూ కొత్త తరాన్ని చేరాలన్నది నా కోరిక. సాహిత్యం సినిమాలు కేవలం కొన్ని సర్కిల్స్‌ కే పరిమితం కాకుండా కాంపస్‌ల్లోకి వెళ్ళాలన్నది నా ఆశ. గతంలో చాలా కాలేజీల్లో కాంపస్‌ ఫిలిం క్లబ్స్‌ పెట్టాను. అట్లే కవిత్వం క్లబ్స్‌ కూడా రావాలి. ఈ దిశగా కవులు రచయితలూ అందరూ ఆలోచించాలని కోరుకుంటున్నాను

ఇంటర్వ్యూ: గండ్ర లక్ష్మణ రావు