VISUAL BOOK

యాదోంకీ బారాత్ 2- సిరీస్- నంబర్ 12

Posted on

 యాదోంకీ బారాత్

 2- సిరీస్- నంబర్ 12

++++++++++++++++ వారాల ఆనంద్

మొదలయిందేదయినా ముగియకతప్పదు. కొన్ని ఎప్పుడు మొదలయ్యాయో తెలీదు, మరికొన్ని ఎప్పుడు ముగుస్తాయో చెప్పలేం. జీవితాల సంగతి అట్లా వుంచితే ఉద్యోగం విషయం మాత్రం మొదలయినప్పుడే  ముగింపు ఎప్పుడో తెలుస్తుంది. టైర్  అయినా లేకున్నా రిటైర్ అవడం తప్పదు కదా. అలాంటి ముగింపు నా ఉద్యోగ జీవితంలో కూడా వచ్చింది. అప్పటికే నాతో కలిసి పనిచేసినవాళ్లూ, కలిసి నడిచిన వాళ్ళూ రిటైర్ అయి విశ్రాంతి జీవితాల్లోకి వెళ్ళిపోయారు.

“బతుకు ప్రయాణంలో

ఎందరో స్నేహితులు

ఎవరి స్టేషన్లో వాళ్ళు దిగి పోయారు”  

+++

నా ఉద్యోగ జీవితం 2016 లో ముగింపునకు వచ్చింది. 1980 జనవరి నుంచి కాలేజీ గ్రంధాలయ అధికారిగా నా ఉద్యోగజీవితం ఒకింత సాఫీగానే  సాగింది. ఆ లైబ్రెరియన్ ఉద్యోగంలో ఏమి మజా వుంటుంది.                 

చేసేదీ ఏముండదు అని అన్నవాళ్లూ, అనుకున్నవాళ్లూ వున్నారు. లైబ్రెరియన్ అంటే నిద్రపోయేవాడు అని అనుకున్నవాళ్లూ వున్నారు. విద్యాసంవత్సరం మొదట్లో ఏవో కొన్ని పుస్తకాలు పంచి ఏడాది చివర తిరిగి తీసుకోవడమే లైబ్రెరియన్ చేసేపని అని ఎగతాళి చేసిన వాళ్ళూ వున్నారు.                                                 కానీ  నేను మాత్రం నా ఉద్యోగాన్ని కొంత ఆసక్తిగానూ ఎంతో ఉత్సాహంగానూ చేశాను. విద్యార్థులూ పుస్తకాలూ అధ్యాపకులూ వీరందరి నడుమా బుక్స్ ఇవ్వడం పుచ్చుకోవడం మాత్రమే కాకుండా సాహితీ సాంస్కృతిక రంగాల్లో పనిచేస్తూ అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ చైతన్యవంతంగానే గడిపాను. ముఖ్యంగా ఎస్.ఆర్.ఆర్.కాలేజీలోకి వచ్చాక నాకు గొప్ప మైదానమే దొరికింది. కేవలం పుస్తకాలూ విద్యార్థులే కాకుండా వైవిధ్యంగా పనిచేసే గొప్ప అవకాశం నాకా కాలేజీ ఇచ్చింది. దాంతో నేను రంగులరాట్నంలా  గిర గిరా తిరిగాను.          

‘రంగుల రాట్నం’

+++++

సూర్యచంద్రులు

కళ్లు మూస్తూ తెరుస్తూనే వున్నారు

నేనేమో కాలాన్ని భుజానేసుకుని

‘రంగులరాట్నం’లా గిర గిరా తిరుగుతున్నా

++++++++++++ అని  రాసుకునే అవకాశం వచ్చింది.

అయితే ముగింపు సంవత్సరానికి వచ్చేసరికి ముగించాల్సిన పనులు, అప్పగించాల్సిన బాధ్యతలు అనేకం ఒక్కసారిగా ముప్పిరిగొన్నాయి. అప్పటికే  రెండేళ్లుగా అనారోగ్యం, మందుల నడుమ చక్కర్లు కొడుతున్నవాన్ని. ఆ క్రమంలో నా సహోద్యోగులూ సహచరులూ స్నేహితులూ అందించిన సహకారం ఎనలేనిది.అప్పుడు నా చార్జ్ లో చాలా అంశాలున్నాయి. కేవలం లైబ్రరీ  విషయానికే వస్తే ప్రధాన గ్రంధాలయంలోని వేలాది పుస్తకాలు, యుజీసీ విభాగం, బుక్  బాంక్, రెఫెరెన్స్ విభాగం, శాతవాహన విభాగం పేర నేను సేకరించిన కరీంనగర్ జిల్లా కవులూ రచయితల పుస్తకాలు, నేనే మొదలెట్టి నడిపిన జర్నలిజం కోర్సు, ఫిల్మ్ మేకింగ్ కోర్సు, మిత్రుడు బయోటెక్నాలజీ శాఖ రీడర్  డాక్టర్ ఎస్.మాధవ రావు గారు ప్రిన్సిపాల్ గా బదిలీ అయి వెళుతూ ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ  స్టడీ సెంటర్ బాధ్యతలు అప్పగించగా వున్న బాధ్యత, మెరిట్ విద్యార్థులకు ఇచ్చే గోల్డ్ మెడల్ విభాగం ఇట్లా అనేక బాధ్యతల్ని వివిధ అధ్యాపకులకు లెక్కలు చూపించి మరీ అప్పగించాలి. అదంతా పెద్ద పని. నాకు మొదటి నుంచీ ఎంతయినా పని చేయడం ఇష్టమే కానీ చార్జ్ అప్పగించడమంటేనే ఎక్కడ్లేని బద్దకం. అదో పెద్ద రోదన. కానీ తప్పదు. ఈ  చార్జ్ ఏర్పాట్లు జరుగుతుండగానే ఆ 2016 లో ముగిసే జర్నలిజం కోర్సు సర్టిఫికెట్ల పంపిణీ పూర్తి చేయాలి. అప్పుడు ప్రిన్సిపాల్ శ్రీ నితిన్ సంపూర్ణంగా సహకరించాడు. ఆరు మాసాల జర్నలిజం కోర్సు కేవలం నా చొరవతోటే మొదలయింది. పదమూడు బ్యాచులు అత్యంత విజయవంతంగా నడిచాయి.అప్పటి విద్యార్థులు అనేకమంది ఇవ్వాళ  ప్రధాన స్రవంతి జర్నలిజంలో వున్నారు. 13వ బ్యాచ్ ముగింపు సభ నా సర్వీసులో చివరిది కనుక ఎంతో ఉత్సాహంగా ఆడంబరంగా జరిగింది  ఆనాటి సభలో నితిన్, లెక్చరర్ మిత్రులు శ్రీయుతులు సుబ్బరామిరెడ్డి, డాక్టర్ ఎస్.మనోహరాచారి,  వై.సత్యనారాయణ, సత్యప్రకాశ్ లు ఎంతో ఆసక్తిగా పాలు పంచుకున్నారు. తర్వాత జర్నలిజం కోర్సు పట్ల ఎంతో ఆసక్తిగా పనిచేసిన సుబ్బరామి రెడ్డి గారికి కోర్సు చార్జ్    అప్పగించాను.ఇక ఇగ్నో స్టడీ సెంటర్ ను యూనివర్సిటీ  ఎత్తేయడంతో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, కంప్యూటర్స్ మొదలయినవన్నీ యూనివర్సిటీ కి పంపించేశాను.  

కాలేజీలో ఇదంతా ఇట్లా జరుగుతుండగానే ప్రముఖ కవి డాక్టర్ గండ్ర లక్ష్మణరావు గారు తమ తండ్రి గారు కీ.శే.గండ్ర  హనుమంత రావు గారు పేరుమీద ఇచ్చే ‘గండ్ర హనుమంత రావు స్మారక సాహితీ పురస్కారం                                                                                        ’ నాకు ప్రకటించారు. కరీంనగర్ జిల్లా కేంద్ర  గ్రంధాలయంలో జరిగిన సభకు డాక్టర్ నందిని సిధారెడ్డి, దేశపతి  శ్రీనివాస్, వఝల శివకుమార్ లు అతిథులుగా హాజరయ్యారు. ఆ పురస్కారం నాకో గొప్ప గుర్తింపుగా ఫీలయ్యాను.

ఇదిట్లా వుండగానే జగిత్యాల లో సాంస్కృతిక రంగంలో విశేష కృషి చేస్తున్న శ్రీ గుండేటి రాజు ఫోన్ చేశాడు. తమ వూరివాడు గొప్ప కవీ ఫోటోగ్రాఫర్ అలిశెట్టి ప్రభాకర్ పేరున రాష్ట్ర స్థాయి పురస్కారం             ఇవ్వాలనుకుంటున్నాం, ఆ మొదటి అవార్డును నాకు ఇవాలనుకుంటున్నట్టు చెప్పాడు.  అలిశెట్టి ప్రభాకర్   పెరు వినగానే ఎన్నెన్ని జ్నాపకాలు.ఎన్నెన్ని అనుభూతులు. అలిశెట్టిని మొట్టమొదట కలిసింది జగిత్యాల లోనే. నేనూ మిత్రుడు డి.వెంకటేశ్వర్ రావు ఇద్దరమూ ప్రత్యేకంగా వచ్చి కలిశాం. తర్వాత కలిసి లయ కవితా సంకలనం వేశాం,కరీంనగర్లో శిల్పి స్టూడియో, హైదరాబాద్ లో చిత్రలేఖ స్టూడియో ఇట్లా ఒకటనేమిటి ఎన్నో ఏళ్ల అనుబంధం.నేను ‘నవ్యచిత్ర వైతాళికులు’ సినిమా వ్యాసాలు రాయడంలోనూ అవి ‘పల్లకి’ పత్రికలో  రావడంలోనూ అలిశెట్టి సాహచర్యం ఎంతగానో తోడ్పడింది.నువ్వు కవిత్వం రాయడం లేదు కదా నీ కిష్టమయిన సమాంతర సినిమాల మీద వ్యాసాలు రాయి అని నన్ను సిద్ధం చేసింది ఒకరకంగా అలిశెట్టి ప్రభాకరే. నాకు అప్పటికే ఏమయినా రాయాలి అన్న కోరిక వున్నప్పటికీ రాసేలా చేసింది ప్రభాకరే. అలాంటి అలిశెట్టి పేరుమీద ఇవ్వ తలపెట్టిన అవార్డు నాకు ఇస్తాననడం, అదీ జగిత్యాలలో కావడంతో ఇష్టంగా  అంగీకరించాను. నేనూ ఇందిరా బయలుదేరాం.  ఏం.ఎల్.ఏ.శ్రీ టి.జీవన్ రెడ్డి గుండేటి రాజు తదితరులు పాల్గొన్నారు. సభ ఎంతో అభిమానంగా జరిగింది. ఆ సభకు నా పాత మిత్రుడు వెంకటేశ్వర్ రావు కూడా రావడం చాలా సంతోషాన్నిచ్చింది. సభ తర్వాత వెంకటేష్  ఇంటికి వెళ్ళాం.అట్లా ఆనాటి జగిత్యాల సభ పూర్హ్తి అయింది. ఇక  కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ లో అప్పుడే ఇరానియన్ ఫిల్మ్ ఫెల్మ్ ఫెస్టివల్ నిర్వహించారు. నేనూ నరెడ్ల శ్రీనివాస్ మాట్లాడాము. నేను ఇరానియన్ సినిమా అక్కడి దర్శకులు వాళ్ళ కళాత్మకత, ముఖ్యంగా పిల్లలకోసం వాళ్ళ సినిమాలు తదితర అంశాల మీద మాట్లాడాను. ఆ ఫెస్టివల్ లో చాలా మంచి పాకేజ్ ఆఫ్ ఫిల్మ్స్ వచ్చాయి. ఫెడరేషన్ వాళ్ళు పంపిణీ చేశారు.

ఇక ఫిల్మ్ భవన్  లోనే ప్రముఖ జర్నలిస్టు హైదరబాద్ ఫిల్మ్ క్లబ్ కమిటీ మెంబర్ కంబాలపల్లి కృష్ణ రాసిన పుస్తక పరిచయ సభ అనిర్వహించారు.అందులో కూడా పుస్తకం గురించి  వివరంగా మాట్లాడాను. 

ఇక ఎస్.ఆర్.ఆర్.కాలేజీ లో నా ఉద్యోగం రోజులు దగ్గర పడ్డాయి.అప్పుడు ఒక ఆలోచన వచ్చింది.ఇన్ని దశాబ్దాలుగా నేను కొన్నవి, సాహితీ మిత్రులు ఇచ్చినవి, నేను సేకరించినవి 2000 పుస్తకాల్ని కాలేజీ  గ్రంధాలయానికి  ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ప్రిన్సిపాల్ నితిన్ కి చెబితే ఫ్రీగా ఇస్తానంటే వద్దంటానా అన్నాడు.వాటన్నింటి లిస్టు రాసి ఒక పూట కార్యక్రమం ఏర్పాటు చేశాను. కాలేజీ పూర్వ ప్రిన్సిపాల్ బి.రాంచందర్ రావు గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాం.ఆయన ఎంతో ఆదారంగా వచ్చారు.ప్రత్యేక విభాగంలో ఆ పుస్తకాల్ని వుంచుతామని నితిన్ ప్రకటించారు. దాదాపు లక్ష రూపాయల విలువ  కలిగిన ఆ పుస్తకాల ప్రదానం చాలా  తృప్తిని ఇచ్చింది. ఇక ఉద్యోగ విరమణ తేదీకి  ముందే లైబ్రరీ చార్జ్ కూడా ఎవరికయినా ఇవ్వాలన్నారు.నితిన్ ఉర్దూ మేడమ్ ఇస్రత్  సుల్తానా  గారికి ఆ బాధ్యత  అప్పగించారు.ఏవో కొన్ని చూసి పూర్తి స్థాయి గ్రంధాలయ అధికారి రాగానే పూర్తి చేస్తామనే హామీ మీద ఆ తతంగం ముగిసింది. కొంత డబ్బు డిపాజిట్ కూడా చేశాను.

ఇక మా కాలేజీలో అధ్యాపకుల పదవీ విరమణ సభకు కొన్ని పద్దతులు ఏర్పాటయి వున్నాయి. కామర్స్ అధ్యాపకుడు ఆనంద రావు, ప్రిన్సిపాల్ మురలి, యాద కిషన్, పీడీ లక్ష్మీరాజం లాంటి వాళ్ళు ఆ ఆనవాయితీని కొనసాగించారు. అవేమిటంటే కాలేజీలో పెద్ద విందు ఏర్పాటు చేయడం,స్టాఫ్ క్లబ్ సన్మాన విరమణ సభ నిర్వహించడం.కానీ   నేను మా ఇంట్లో వీడ్కోలు విందు ఏర్పాటు చేసి అందరినీ  పిలిచాను. దాదాపు అందరూ వచ్చారు. స్టాఫ్ క్లబ్ నిర్వహణలో సింపుల్ గా జరగాలని కోరుకున్నాను.అట్లే జరిగింది. విరమణ సభ అనగానే అందరూ ఇంద్రుడూ చంద్రుడూ అని పొగడడం అదీ  ఎందుకో నాకిష్టం కాలేదు.అయినా సభలో నా అభీష్టం మేరకు మిత్రులంతా ఆదరంగా క్లుప్తంగా మాట్లాడారు. తర్వాత ఫిల్మ్ భవన్ లో సాహితీ  గౌతమి ఫిల్మ్ సొసైటీ తదితర సంస్థల  నిర్వహణలో కూడా సభ పెట్టారు.

అట్లా  నా 36ఏళ్ల  ఉద్యోగ జీవితం విజయవంతంగా ముగిసింది.

మిగతా వివరాలతో మళ్ళీవారం కలుస్తాను.

సెలవు                                                                                                                                                                           -వారాల ఆనంద్

14 ఏప్రిల్ 2024                                                                                 

                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                        

అరుణాచల్ ప్రదేశ్ సాహిత్యం – మమంగ్ దాయి

Posted on Updated on

+++++++++ వారాల ఆనంద్
ఇవ్వాళ మన దేశం మొత్తం మీద గొప్ప కవిత్వమేకాదు మొత్తంగా గొప్ప సాహిత్యం ఈశాన్య రాష్ట్రాలనుంచే వస్తున్నది. అక్కడి ప్రజల సంఘర్షణ ఆ సాహిత్యంలో సజీవంగా వికసిస్తున్నది. 7 సిస్టర్స్ గా పిలువబడే ఈశాన్య రాష్ట్రాల్లో హిమాలయాల ఒడిలో నెలకొని ఉన్న అరుణాచల్ ప్రదేశ్ భారత దేశపు ఊయయించే సూర్యుడు. అక్కడి డాంగ్ గ్రామమే దేశం మొత్తం మీద తొలి సూర్యోదయాన్ని చూస్తుంది. ఆ రాష్ట్రానికే దేశమ్మోత్తం మీద అతి ధీర్ఘమయిన అంతర్జాతీయ సరిహద్దు వుంది. అక్కడి ప్రజలు ‘ఆది’, ‘ఆక’, ‘అప్తాని’ లాంటి 90 కంటే ఎక్కువ భాషలు మాట్లాడతారు ఆ రాష్ట్రంలో 26 ప్రధాన తెగలు మరియు వందల ఉప తెగలు ఉన్నాయి. కానీ ఈ బహుళత్వం మధ్య, అన్ని సంఘాలలో ఒక సాధారణ లక్షణం ఉంది, వారు గొప్ప కథకులు.

వారి స్వంత అధీకృత స్క్రిప్ట్ లేకుండా, వారు వారి జ్ఞాపకాలలో వారి కాలపు కథలను భద్రపరిచారు. మౌఖికంగా వారు ఆయా భాషల్ని వ్యాప్తి చేశారు. తరువాతి తరాలకు అందించారు. అక్కడి ప్రజలు కీర్తనలల్ని బాగా ప్రదర్శిస్తారు. తమ కుటుంబ సామాజిక మావేశాలలోకథల్ని కథలు చెప్పడాన్ని బాగా బాగా ఇష్టపడతారు.
అరుణాచల ప్రదేశ్ సాహిత్యం గురించి మాట్లాడేటప్పుడు కేవలం మౌఖికమే కాకుండా లిఖిత సాహిత్యాన్ని కూడా చర్చించాలి.
మౌఖిక సాహిత్యం ప్రధానంగా జానపద సాహిత్యం యొక్క అభివ్యక్తి. అందులో ప్రధానంగా పురాణాల కథలు, వాటిలోని సూక్తులు, కథనాలు. కథలు ప్రధాన అంశాలుగా వుంటాయి. వాటితో పాటు జంతువులు, విశ్వం మరియు మానవ నమ్మకాలు, ఆచారాల కథలు కూడా మనకు కనిపిస్తాయి. లిఖిత సాహిత్యంలో కవిత్వం, నాటకం, చిన్న కథలు ప్రధాన పాత్ర పోషిస్తాయి మౌఖిక సాహిత్యంతో సృజనాత్మకత ప్రధానమయింది. కాగా మౌఖిక లిఖిత సాహిత్యాల నడుమ విడదీయరాని మౌళిక సంబంధం ఉంది.
ఇరవయ్యవ శతాబ్దంలో అరుణాచల్ ప్రదేశ్‌కు లిఖిత సాహిత్యం మొదలయిందని చెప్పాలి. మారుతున్న సామాజిక ఆర్థ్క స్థితులు అంతేకాకుండా ఆధునిక విద్య అందుబాటులోకి రావడం వల్ల అక్కడి వాళ్ళల్లో సరికొత్త భావనాత్మకత తో పాటు నవ్య సృజనాత్మకత ఆరంభమైంది. ముఖ్యంగా ఆంగ్ల, విద్య విదేశీ సంస్కృతుల ప్రభావం వల్ల కళాత్మక సృజన పెరిగిందనే చెప్పాలి. 1947 తర్వాత తగాంగ్ టాకీ, లుమ్మర్ దాయి, YD థోంగ్చి, రించిన్ నోర్బు మొయిబా, సమురు లుంచాంగ్ మరియు కెన్సమ్ కెంగ్లాం వంటి రచయితల రచనలు వెలువడ్డాయి. అరుణాచలానికి చెందిన మొదటి తరం సాహిత్య ప్రముఖులు వీరే. లుమ్మర్ దాయ్ యొక్క తొలి నవల ఫారోర్ క్సీలే క్సీలే (1961) బహుశా ఒక అరుణాచలి రాసిన అరుణాచల్ ప్రదేశ్ యొక్క మొదటి నవలగా పరిగణించబడుతుంది. తమదయిన
స్క్రిప్ట్ లేకపోవడంతో, ఆ కాలంలోని రచయితలు తమ భావాలను వ్యక్తీకరించడంలో గణనీయమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ రోజుల్లో, పాఠశాలల్లో అస్సామీ బోధనా మాధ్యమం కావడం తో చాలామంది అస్సామీని తమ రచనా భాషగా ఎంచుకున్నారు. స్వీయ భాషాపరమైన అడ్డంకిని దాటి, ఈ మొదటి తరం రచయితలు, వారి బహుముఖ మరియు విశిష్టమైన కథలతో, అరుణాచల్ ప్రదేశ్‌లో సాహిత్యంలో ముఖ్యమైన భాగం పంచుకున్నారు. సరికొత్త పాదులు వేశారు.
అప్పటి వారి రచనలు సామాజిక వాస్తవికతకు ప్రతిబింబాలు. వారు తరచుగా తమ రచనలకు జానపద సాహిత్యాన్ని మూలంగా చూసేవారు. వారు వక్తృత్వం, పురాణం, జానపద నమ్మకం మరియు ఆచారాల నుండి ప్రత్యేకమైన ప్రేరణను పొందారు. ఇది వారి రచనలలో వ్యక్తీకరణలో స్పష్టంగా కనిపిస్తుంది. థోంగ్చి, సోనమ్‌లో, బ్రోక్పాతమ రచనల్లో సమాజంలోని సంప్రదాయాల్ని ఆచారాలను అన్వేషిస్తారు. మమంగ్ డై తన నవలలు పహరోర్ క్సీలే జిలే, మోన్ అరు మోన్, పృథివీర్ హన్హిలో ఆది జానపద జీవితానికి సంబంధించిన నైతికతను చాటుకున్నారు.
అరుణాచల్ ప్రదేశ్ లో పాఠశాలల్లో క్రమంగా ఇంగ్లీషు, హిందీ భాషలను ప్రవేశపెట్టారు. అస్సామీ స్థానంలో ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు పెరిగారు. ప్రధాన మాధ్యమంగా ఇంగ్లీషు, హిందీ భాషా భాషలు స్థానం పొందాయి. తత్ఫలితంగా అస్సామీలో వ్రాసే వారు పాఠకులతో డిస్‌కనెక్ట్‌గా భావించడం ప్రారంభించారు. అస్సామీ రాయడం తగ్గిపోయింది
తర్వాత చదువు పెరగడం తో ప్రజలు వారి చరిత్రను సంస్కృతిని గురించి మరింత ఉత్సుకతతో చ్ఫూపించడం ఆరంభమయింది. 1978లో అరుణాచల్ ప్రదేశ్ లో మత స్వేచ్ఛ చట్టం ఆమోదించబడింది. దేశీయ సంస్కృతి విశ్వాసాల పరిరక్షణ, ప్రచారం పట్ల ఆసక్తి పెరిగింది. కృషీ ఆరంభమైంది. ఫలితంగా రచనల్లో అక్కడి సమస్యల్ని రాయడం మొదలయింది. అక్కడి రచయితలలో తుంపక్ ఈటే, ఒసాంగ్ ఎరింగ్, బని డాగ్గెన్, ఎన్. ఎన్. ఒసిక్, ఎల్ ఖిమ్‌హర్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు.
అరుణాచల్‌లో ఇంగ్లీషు మరియు హిందీ భాషలను ప్రవేశపెట్టినప్పటి నుండి కొత్త తరం రచయితలు ఆవిర్భవించారు. జుమ్సీ సిరామ్ రాసిన ఏ-అలుక్ (1993) అన్న నవల ఈ రాష్ట్రానికి చెందిన ఒక స్వదేశీ రచయిత హిందీలో రాసిన మొదటి నవలగా వినుతికెక్కింది. యుమ్లామ్ తానా యొక్క ది మ్యాన్ అండ్ ది టైగర్ (1999) మరియు మమంగ్ దాయి యొక్క ‘ది లెజెండ్ ఆఫ్ పెన్సమ్ (2006)’ ఇంగ్లీష్ హిందీ సాహిత్య ప్రపంచంలో అరుణాచల రచయితల స్థానాన్నినిలబెట్టాయి. వీరి రచనలు రాష్ట్ర సరిహద్దులు దాటి అరుణాచలి రచనలను దేశవ్యాప్తంగా తీసుకెళ్లడంలో ఎంతగానో సహాయపడ్డాయి.
మమంగ్ దై ‘ది లెజెండ్స్ ఆఫ్ పెన్సామ్ అండ్ బ్లాక్ హిల్స్‌’ లో అరుణాచల్ ప్రదేశ్ యొక్క పూర్వ-చారిత్రక గతాన్ని తిరిగి సృష్టించింది.
ఇప్పుడు అక్కడి సమకాలీన సమాజం కూడా ప్రపంచీకరణ ప్రభావంతో కొట్టుమిట్టాడుతోంది, దాంతో సంస్కృతి, సంప్రదాయాలు వాటిలోని అన్ని అంశాలు నాటకీయ మార్పులకు గురయ్యాయి. ఒక రకమైన కొత్త సాంస్కృతిక వాతావరణం ఏర్పడింది. కవులూ రచయితలూ సామాజిక అసమానతల్ని ప్రశ్నించడం ప్రారంభించారు, పురాతన ఆచారాల్ని, సంప్రదాయాలను విడిచిపెట్టడం ప్రారంభించారు. ప్రపంచీకరణ ప్రభావం అరుణాచల్ ప్రదేశ్ యొక్క సాహిత్య సృజనల్లో మార్పును తెచ్చింది. అరుణాచల్ క్రమంగా మౌఖిక సాహిత్యం మరచిపోయే స్థితికి చేరుకోవడం ప్రారంభించింది. ఉదృతమవుతున్న ప్రపంచీకరణ ప్రభావానికీ అక్కడి సంప్రదాయానికి నడుమ వున్న ఘర్షణ సమకాలీన రచనలలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే గుర్తింపు సంక్షోభం identity crisis, నోస్టాల్జియా nostalgia సామాజిక సమస్యల యొక్క ఘర్షణ వారి రచనల ఇతివృత్తాలలో ప్రతిబింబిస్తుంది.
“ఈ వేసవి”లో మమంగ్ దై
‘విలపిస్తున్నాను
మా వేటలో మేము నాశనం చేసిన అందం
జీవితం కోసం మా వేటలో.
… సీతాకోక చిలుకలను క్షమించమని వేడుకుంటున్నాను’, అంటుంది

యుమ్లాం తమ గుర్తింపు సంక్షోభం సమస్యను ఈ విధంగా ప్రస్తావిస్తుంది:
‘ఈ భౌగోళిక పటం
మా భూములు,
అటవీ హక్కుల గురించి ఏమీ మాట్లాడలేదు..’ అంటారు
ఇటీవలి సంవత్సరాలలో అనేకమంది యువకులు, విద్యావంతులైన రచయితలు సాహిత్యరంగంలో తమ స్థానాన్ని పదిలం చేసుకున్నారు. వారు తమదయిన కొత్త శైలి,, కళా ప్రక్రియలతో ప్రయోగాలు చేస్తున్నారు. అది గత తరం రచయితలకు భిన్నమయిన ధోరణి. వారి రిఫ్రెష్ కథలు వారి ప్రత్యేకమైన స్వభావాలతో, వారు ప్రపంచ సాహిత్య రంగంలో తమను తాము నిలబెట్టుకుంటున్నారు.
తాయ్ టాగుంగ్ తన డ్రామా, లాపియాలో ఉద్దేశపూర్వకంగానే అరుణాచలి హిందీని ఉపయోగించాడు. ఇది అరుణాచల్ ప్రదేశ్‌లో మాట్లాడే హిందీపై భాషావేత్తల దృష్టిని తీసుకువచ్చింది. గుమ్లాట్ మైయో యొక్క త్రయం వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ కాలేజీ క్యాంపస్ నవల. డై యొక్క స్టుపిడ్ మన్మథుడిని చిక్ లైట్ అని వర్ణించవచ్చు.
ఇటీవలి కాలంలో ఇక్కడి సాహిత్యంలో వున్న కొన్ని ముఖ్యమైన పేర్లు Takop Zirdo, Tony Koyu మరియు Yabin Zirdo.
అరుణాచల్ ప్రదేశ్‌లో హిందీ సాహిత్య పురోగతికి గణనీయమైన కృషి చేసిన వారిలో తారో సింధిక్, జమునా బిని మరియు జోరామ్ యాలం వంటి అనేకమంది వున్నారు.
మునుపటి తరం నుండి వచ్చిన వారైనా, లేదా ఇటీవలి వారైనా, అరుణాచల్‌లో వెలువడే సృజనాత్మక రచనల్లో పౌరాణిక జానపద కథల యొక్క ప్రభావం, దాని కొనసాగింపు కనిపిస్తుంది. మమంగ్ దాయి యొక్క సంకలనం ది బామ్ ఆఫ్ టైమ్, రివర్ పోయమ్స్, తానాస్ మ్యాన్ అండ్ ది టైగర్ అండ్ విండ్ కూడా సింగ్స్ మరియు LW బాపు యొక్క ఖండూమాస్ కర్స్ సాంప్రదాయ సాహిత్యం మరియు సృజనాత్మకత యొక్క సమ్మేళనంగా చూడొచ్చు.

అరుణాచల్ ప్రదేశ్‌లో ఆధునిక సృజనాత్మక సాహిత్యం 20వ శతాబ్దం మధ్యలోనే మొదలయిందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కొంతమంది ప్రతిభావంతులయిన రచయితలతో ఇది వేయి రేకులుగా విచ్చుకుంటోంది.
… మమంగ్ దాయి…
గత 13 ఏళ్లుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టాటా లిటరేచర్ లైవ్ ఈనెల 25 నుంచి తన 14 వ సంచికను నిర్వహిస్తున్నది. అందులో ఈశాన్య రాస్త్రమయిన అరుంచల్ ప్రదేశ్ కు చెందిన గొప్ప కవి రచయిత్రి మామంగ్ దాయిని ప్రధానంగా ఈ యేటి ఆస్థాన కవిగా ఎంపిక చేసి గౌరవిస్తున్నారు. మామంగ్ దాయి ఎంపిక సమంజసమయిందే కాదు, అభినందనీయమయింది.
మమంగ్ దై కవి మరియు నవలా రచయిత. ఆమె ఈశాన్య భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో నివసిస్తున్నారు. ఇప్పటికీ ఆమె ఒక కవితా సంకలనం, ‘నది కవితలు’వెలువరించారు. ఆమె తర్వాతి రచన, మిడ్‌సమ్మర్-సర్వైవల్ లిరిక్స్, ఆమె ఆది భాషలోనూ ఆంగ్లంలోనూ రాస్తుంది.తాను మొదట ఐ.ఏ.ఎస్.కు ఎంపికయి జర్నలిస్టు గానూ, రచయిత్రిగానూ వుండడానికీష్టపడి ఐ ఏ ఎస్ ను వదిలేసింది.
మామంగ్ దాయి ది టెలిగ్రాఫ్, హిందుస్థాన్ టైమ్స్ మరియు ది సెంటినెల్‌తో సహా వివిధ వార్తాపత్రికలకు కరస్పాండెంట్‌గా ఉన్నారు. టెలివిజన్ మరియు రేడియోలకు కూడా విరివిగా రాశారు. రెండు నవలలతో పాటు, యువ పాఠకుల కోసం ఆమె వచన కవితలు కథలు రాసింది. ఆమె నాన్-ఫిక్షన్ రచన, అరుణాచల్ ప్రదేశ్: ది హిడెన్ ల్యాండ్, 2003లో స్టేట్ వెరియర్ ఎల్విన్ అవార్డును అందుకుంది. ఆమె ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ లిటరరీ సొసైటీకి జనరల్ సెక్రటరీగా, నార్త్ ఈస్ట్ రైటర్స్ ఫోరమ్ సభ్యురాలు మామంగ్ డయి యొక్క కవితా ప్రపంచం నది, అడవి మరియు పర్వతాలలో ఒకటి, ఆమె తన మూలాల్ని తాని నివసించిన స్వస్థలాన్ని తన రచనల్లో ప్రతిబింబింపజేసి వాటిని సృజనాత్మకంగా సజీవం చేశారు. ఇక్కడ ప్రకృతి రహస్యమైనది, పురాణాలతో పచ్చగా ఉంటుంది, పవిత్రమైన జ్ఞాపకశక్తితో దట్టమైనది. ప్రతిచోటా మాయాజాలం ఉంది:
లిల్లీస్ “హృదయ స్పందనలో నావిగేట్ చేసే విధంగా . . . “చల్లని వెదురు,/ సూర్యకాంతిలో పునరుద్ధరించబడిన” నిశ్శబ్దంగా, పర్వతాల యొక్క “మాటలు లేని ఉత్సాహం”లో, కత్తి చేపలా పైకి దూసుకుపోతున్నాయి. “నదికి ఆత్మ ఉంది” అంటారామె.
ఆమె కవిత్వంచాలా సరళంగా వుంటుంది.

అరుణాచల్ ప్రదేశ్ సాహిత్యం – మమంగ్ దాయి

104=యాదోంకీ బారాత్ +++++ వారాల ఆనంద్

Posted on Updated on

104=యాదోంకీ బారాత్

+++++++++ వారాల ఆనంద్

प्यार का पहला खत लिखने में वक़्त तो लगता है
नए परिंदो को उड़ने में वक़्त तो लगता है

Hastimal  Hasti ఎంత గొప్పగా రాశాడు అంతే గొప్పగా జగ్జీత్ సింగ్ పాడాడు. నిజమే మొదటి ప్రేమ లేఖ రాయడానికి సమయం పడుతుంది, కొత్త పావురాలు ఎగరడానికీ సమయం పడుతుంది…  ఏదీ ఉన్న పలంగా జరగదు. ఆకాశంలోంచి ఊడిపడదు. కృషి దీక్షలతో పాటు కొంత సమయం కూడా కావాలి. సృజనాత్మక రంగంలో రచయితలయినా కవులయినా సినిమా దర్శకులయినా అంతే క్షణంలో మంత్రించినట్టు ఏదీ జరిగిపోదు. కృషి, కృషి తో పాటు సరయిన వేదిక, సరిపడినంత సమయం తీసుకున్నప్పుడే విజయాలు లభిస్తాయి. దానికి ఎంతో సహనం కావాలి. అకుంఠిత దీక్షా కావాలి.  

+++

దృశ్య శ్రవణ మాధ్యమమయిన సినిమాను రూపొందించడంతో పాటు దాని ప్రదర్శనకు సరయిన వేదికలు కావాలి. ఆ వేదికల్లో నాకు తెలిసి అర్థవంతమయిన సినిమా వేదికలు ఫిల్మ్ సొసైటీలు. మేము ఫిల్మ్ సొసైటీ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు అలాంటి అర్థవంతమయిన జాతీయ అంతర్జాతీయ సినిమాల్ని ఎక్కువమంది ప్రేక్షకులకు చూపించాలన్నదే లక్ష్యం. అదీ ఆయా సినిమాలు అందుబాటులో లేని గ్రామాల్లో పట్టణాల్లో జాతీయ అంతర్జాతీయ సినిమాల ప్రదర్శనను ప్రధాన కార్యక్రమంగా తీసుకున్నాము. ఆ క్రమంలో నెలకు ఒకటి లేదా రెండు సినిమాల్ని ఆదివారాల్లో ఉదయం 8గంటల షోగా వేసేవాళ్లం. నిజానికి సినిమాలకు ప్రేక్షకుల మదిలో ఆలోచనల్లో గొప్ప మార్పు తీసుకురాగల శక్తి ఉంది. అవి మూకీ చలన చిత్రాల నుండి నేటి అల్ట్రా టెక్నికల్ వ్యాపార  సినిమాల వరకు చాలా దూరం ఎదుగుతూ వచ్చాయి. ప్రేక్షకుల్లో సినిమాలపై ప్రేమను, ఆయా సినిమాల్లో నటీనటులు, సాంకేతిక నిపుణులు, సంగీతకారులు మరియు దర్శకులు చేసే కృషిని విస్మరించడం చాలా కష్టం. సినిమాకి కెప్టెన్‌ దర్శకుడే . ఆతని బాధ్యత అమితమయింది, అయితే దర్శకునికి ఇతరుల సహకారం కూడా కీలకమే.

 “మాస్ కమ్యూనికేషన్ కోసం అన్ని ఆవిష్కరణలలో, సినిమాలు ఇప్పటికీ విశ్వవ్యాప్తంగా అర్థం చేసుకోగల భాషలో మాట్లాడతాయి” అని వాల్ట్ డిస్నీ ఒక చోట అన్నాడు.

భాష తెలియకపోయినా, భావోద్వేగాలతో కూడిన సినిమాలు అనుకున్న సందేశాన్ని అందిస్థాయి. అలాంటి గొప్ప సినిమాల్ని కేవలం నెలకోసారి చూడ్డం వల్ల ప్రేక్షకుల్ని అంతగా ప్రభావితం చేయలేమన్నది క్రమంగా మా కర్థమయింది. దాంతో ఒక సెషన్ ఆఫ్ ఫిల్మ్స్ వేయాలని అనుకున్నాం. అట్లా కొన్ని సినిమాల్ని ఒక ప్యాకేజీలాగా ప్రదర్శించడాన్నే ఫెస్టివల్ ఆఫ్ సినిమా లేదా ఫిల్మ్ ఫెస్టివల్ అంటారు. మన కేంద్ర ప్రభుత్వం మొదట్లో ఒక ఏడాది పోటీ రహిత ‘ఫిల్మోత్సవ్’ని, మరొక ఏడాది పోటీ ఉత్సవం భారత అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ని నిర్వహించేది. ఫిల్మ్ ఫెస్టివల్ ఢిల్లీ లోనూ, ఫిల్మోత్సవ్ ఇతర కేంద్రాల్లో లోనూ నిర్వహించేది. మేము కూడా ఫిల్మ్ సొసైటీల్లో 80,90 దశాబ్దాల్లో పోటీ రహిత ఫెస్టివల్స్ నిర్వహించేవాళ్లం. వాటిల్లో సత్యజిత్ రే ఫిల్మ్ ఫెస్టివల్, శ్యాంబెనెగల్ ఫెస్టివల్, స్మితా పాటిల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇట్లా ఎన్నో ఎన్నెన్నో నిర్వహించాం. అయితే కఫీసో కు సొంత ఆడిటోరియమ్ ‘ఫిల్మ్ భవన్’ ఏర్పడిన తర్వాత జాతీయ స్థాయిలో పోటీ ‘షార్ట్ అండ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్స్’ నిర్వహించడం ఆరంభించాం. ఆ పోటీలకు న్యాయనిర్ణేతల్ని ఎంపిక చేయడం కూడా ముఖ్యమయింది. ఆ క్రమంలో కఫిసో ఉత్సవాలల్లో శ్రీయుతులు కాకరాల, అక్కినేని కుటుంబ రావు, ఎం. వి.రఘు, సునీల్ కుమార్ రెడ్డి, చల్లా శ్రీనివాస్, కె.పి.అశోక్ కుమార్, పెద్దింటి అశోక్ కుమార్, బండారు ప్రవీణ్ ఇట్లా అనేకమంది సినిమా ప్రముఖులు జ్యూఊరీలో వుండి న్యాయనిర్ణయం చేశారు. దేశవ్యాప్తంగా షార్ట్ అండ్ డాక్యుమెంటరీ చిత్రాలు నిర్మించిన ఔత్సాహికులయిన ఫిల్మ్ మేకర్స్ సినిమాల్ని ప్రదర్శించాం, ఉత్తమ మయిన వాటికి బహుమతులిచ్చాం. అంటే ఒక ఫిల్మ్ మేకర్ సినిమా తీస్తే వ్యాపారాత్మకంగా విడుదల చేయడం ఒక వైపు, మరోవైపి ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడడం మరో వైపు వేదికలు వుండేవి.

ఇట్లా అనేక ఫెస్టివల్స్ నిర్వహణ ఆలోచన స్థాయినుండి చివరిదాకా నిర్వహణా వాధ్యతల్ని పోషించిన నాకు కూడా పలు జాతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలల్లో జ్యూరీ గా వుండే అవకాశం వచ్చింది. వాటిల్లో నాతో  పాటు పలువురు లబ్ ప్రతిష్టులయిన ప్రముఖులు భాగం పంచుకున్నారు. ఆ దశలో కేరళలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో మరో ఇద్దరు అంతర్జాతీయ సినీ ప్రముఖులతో పాటు నేనూ అధికారిక న్యాయ నిర్ణేతగా పనిచేశాను. ఫిల్మ్ క్రిటిక్ గా నాకా అవకాశం వచ్చింది. అప్పటికి నేను సమాంతర సినిమాల పైన విరివిగా వ్యాసాలు రాయడంతో పాటు పలు తెలుగులో పుస్తకాలు కూడా వెలువరించాను. పలు అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్స్ లో పాల్గొనడం కొన్ని వ్యాసాల్ని ఇంగ్లీష్ లో కూడా రాయడం తో FIPRESCI (అంతర్జాతీయ ఫిలిమ్ క్రిటిక్స్ సంఘం) లో సభ్యత్వం ఇచ్చారు. దానికి ప్రధానంగా హెచ్. ఎన్. నరహరి రావు చొరవ తీసుకున్నారు. సభ్యత్వం రావడంతో ప్రపంచ వ్యాప్తంగా వున్న ఫిల్మ్ క్రిటిక్స్ తో పరిచయాలు వారి రచనలు చదివే అవకాశం కలిగింది. అదొక గొప్ప సినిమా చైతన్యం. అదే సంధర్భంగా 12వ కేరళ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో జ్యూరీ సభ్యుడిగా పాల్గొనే అవకాశం వచ్చింది. వారం పాటు ట్రివేండ్రంలో వుండి అంతర్జాతీయంగా వచ్చిన సినిమాల్ని చూడడమే కాదు వాటిలో ఉత్తమమయిన వాటిని ఎంపిక చేసే అవకాశం అది. మా ఫిప్రెస్కీ జ్యూరీ లో బ్రిటన్ నుంచి షీలా జాన్సన్, టర్కీ నుంచి కున్యెట్ సెబోనేయన్ వున్నారు. అక్కడ వున్న వారం రోజులూ ఆ ఇద్దరూ కూడా ఎంతో స్నేహంగా వున్నారు. మొదట ఫెస్టివల్ డైరెక్టర్ శ్రీ కె.ఆర్.మోహనన్ నుంచి లెటర్ వచ్చినప్పుడు ఎంత ఆనందం వేసిందో చెప్పలేను. అప్పటి దాకా ఫిలిమ్ ఫెస్టివల్స్ లో పాల్గొనడం, నా పుస్తకాల ఆవిష్కరణ వాటిల్లో జరగడం సంతోషంగా వుండేది. శ్రీ ప్రకాష్ రెడ్డి లాంటి పలువురు ఫెడరేషన్ మిత్రుల సాహచర్యం ఎంతో ఆనందంగా వుండేది. ఇప్పుడు కేరళ ఫెస్టివల్ లో జ్యూరీ గా వుండడం గొప్ప ఉత్సాహమే కదా. నిర్వాహకులు మొత్తం ఫెస్టివల్ని చాలా మంచి ప్లానింగ్ తో నిర్వహించారు. జ్యూరీ స్క్రీనింగ్స్ కూడా ప్రత్యేకం. ఇక కేరళ ప్రేక్షకుల గురించి చెప్పే పనిలేదు. అక్కడ అనేక దశాబ్దాలుగా వున్న ఫిలిమ్ సొసైటీ ఉద్యమం  చైతన్య వంతులయిన  ప్రేక్షకుల్ని తయారు చేసిందనే చెప్పాలి. అధిక శాతం ప్రేక్షకులకు అంతర్జాతీయ సినిమాలతో పరిచయమే కాదు గట్టి విశ్లేషణాత్మక అవగాహన కూడా వుందనిపించింది వాళ్ళతో మాట్లాడినపుడల్లా. మా జ్యూరీ కి రెండు విభాగాల్లో ఎంపిక భాధ్యతల్ని ఇచ్చారు. ఒకటి అంతర్జాతీయ విభాగం, రెండవది మలయాళ విభాగం. వీటిల్లో ఉత్తమ సినిమాల్ని ఎంపిక చేసే భాధ్యత మాది. మా జ్యూరీలో చాలా ఆరోగ్యకరమయిన చర్చలు జరిగాయి. ఏకగ్రీవంగా శ్యాంప్రసాద్ దర్శకత్వం వహించిన ‘సీ వితిన్’ సినిమాను ఉత్తమ చిత్రంగా ఎంపిక చేశాం. ఇక అంతర్జాతీయ విభాగంలో 14 సినిమాల్ని చూశాం. వాటిల్లోంచి పోర్చుగీస్ కు చెందిన ‘స్లీప్ వాకింగ్ లాండ్’ సినిమాను ఎంపిక చేశాం. ఆ సినిమా ప్రధానంగా మొజాంబిక్ లో సుధీర్గంగా సాగిన సివిల్ వార్ ప్రతిఫలనాల్ని చూపించింది. విశాలమయిన కాన్వాస్  పైన రూపొందించిన సినిమా అది. సంక్లిష్టమయిన విషయాన్ని గొప్పగా తీశారు. పైగా ఆ సినిమా మీరా క్యూటో రాసిన నవల ఆధారంగా తీశారు. అన్నీ వివరంగా గుర్తు లేవు కానీ ఫెస్టివల్ లో అవార్డు సినిమాలే కాకుండా పోటీ కొచ్చిన సినిమాల్లో పలు సినిమాలు చాలా బాగున్నాయి. ఇంకా ఫెస్టివల్ లో భాగంగా నిర్వహించిన సెమినార్స్, ఓపెన్ ఫోరం లాంటివి ఉత్తేజకరంగా ఫ్రేక్షకుల నుంచి పూర్తి స్పందనతో జరిగాయి. ఒక సెమినార్లో అదూర్ గోపాలకృష్ణన్ తో మాట్లాడే అవకాశం కలిగింది. అప్పుడు ఆయన తీసిన కొత్త సినిమా గురించి నేను కొంత మాట్లాడితే ‘వై డోంట్ యు రైట్’ అన్నారాయన. కళాత్మక సినిమాకు చిరునామాగా మారిన ఆయనతో మాట్లాడ్డం చాలా ఉత్సాహాన్నిచ్చింది.

ఆ తర్వాత అనకాపల్లి ఫిల్మ్ సొసైటీ నిర్వహించిన ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ లో పాల్గొన్నాను. అప్పటి జ్యూరీలో సుప్రసిద్ద రచయిత నటులు శ్రీ గొల్లపూడి మారుతీ రావు, దర్శకుడు సునిల్ కుమార్ రెడ్డి లు కూడా వున్నారు ఎంతో ఉత్సాహంగా జరిగింది. మారుతీ రావు గారి తో మాట్లాడ్డం గొప్ప అనుభవం. సునీల్ కుమార్ రెడ్డి గారయితే మిత్రులు అయిపోయారు.  

అదే క్రమంలో రాష్ట్ర నంది అవార్డు జ్యూరీ లో రెండు సంవత్సరాలు సభ్యుడిగా వున్నాను. 2008 లో ఒకసారి, రెండవ సారి 2010లో. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంది అవార్డుల్ని 1964 లో ప్రారంభించారు. ఒక కమిటీ వేసి ఉత్తమమయిన మూడు చిత్రాలకు స్వర్ణ, రజత, కాంస్య నందుల్ని బహుమతులుగాయిచ్చేవారు. మొట్టమొదటి నంది అవార్డుల ఉత్సవం హైదరబాద్ రవీంద్రభారతిలో జరిగింది. 1977 నుంచి అవార్డు గ్రహీతలకు ఇచ్చే నగదును పెంచారు. తర్వాత ఉత్తమ నటీ నటులకు, బాలలచిత్రాలకు, నటీనటులకు, దర్శకులకు, డాక్యుమెంటరీలకు, జాతీయ సమైక్యత కు అవార్డులుయివ్వడం ఆరంభించారు. ఆ తర్వాత ఇంకా రఘుపతి వెంకయ్య అవార్డు, ఎన్టీఆర్ అవార్డు ఇట్లా పలు అవార్డుల్ని ఆరంభించారు. అలాంటి నంది అవార్డుల ఎంపిక కమిటీలో రెండు సార్లు నేను సభ్యుడిగా వున్నాను. జ్యూరీ ఎంపిక ఎఫ్. డీ.సీ. మేనజింగ్ డైరక్టర్ వుండిన శ్రీ సి.పార్థసారధి గారి ద్వారా జరిగింది. ఆ రెండు సార్లూ పోటీకి వచ్చిన అన్ని సినిమాల్ని చూడడం ఒక హింసే. ఎందుకంటే మెజారిటీ సినిమాలు వ్యాపార దృక్పధం తో కృతకంగా తీసినవే. వున్నవాటిల్లోంచి ఉత్తమమయినవి ఎంపిక చేయడం జ్యూరీ బాధ్యత. మొత్తం మీద అయింది అనిపించాం. ఉత్తమసినిమా పుస్తకం, విమర్శకుడు అవార్డును కూడా ఎంపిక చేశాం. ఆ రెండేళ్ళు ఉత్సవాన్ని హైదరబాద్ పబ్లిక్ గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు. అప్పటి మంత్రుల చేతుల మీదుగా జ్యూరీ సభ్యులకు కూడా సన్మానాలు నందులు ఇచ్చారు.

….

ఇక నాకు చాలా సంతోషాన్నిచ్చిన ఫిల్మ్ ఫెస్టివల్ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం. హైదరాబాద్ల్ 2017 లో జరిగింది. దానికి జ్యూరీ సభ్యులుగా అయిదుగురు తెలుగువాళ్లను ఎంపిక చేశారు. అందులో నాతోపాటు , ప్రముఖ సినీ నటి అక్కినేని అమల, నిర్మాత పద్మిని నాగులపల్లి, జర్నలిస్టు ఉమా మహేశ్వర రావు, ప్రభాకర్ జైనీ వున్నాం.

నిజానికి ఈ బాలల చిత్రోత్సవాలు మన దేశంలో 1950లో ప్రారంభమయ్యాయి. అప్పటి ప్రధాని నెహ్రూ ఆలోచన, లభించిన ప్రోత్సాహం చాలా గొప్పది. పిల్లల సినిమాలకోసం బాలల చిత్రసమితి ఏర్పాటయింది. ఆ సంస్థ ఇప్పటిదాకా 300 కు పైగా బాలల సినిమాల్ని నిర్మించింది.కానీ వాటి పంపిణీ సరిగ్గా లేక దాదాపు అవన్నీ అట్లా మూలకు పడి వున్నాయి. బాంబేలో నిర్వహించే ఈ ఉత్సవాల్ని తర్వాతి కాలంలో హైదరబాద్ శాశ్వత వేదిక గా నిర్ణయించారు. దానికి భూమినిస్తామని మన ప్రభుత్వం హామీ ఇచ్చింది, సబ్సిడీలు అన్నారు ఇంకా చాలా హామీలిచ్చారు. కానీ అవేమీ కార్యరూపం దాల్చలేదు దాంతో బాలల చిత్రోత్సవాలు మూలకు పడ్డాయి. హైదరాబాద్ లో జరిగిన ఉత్సవాలు మాత్రం చాలా గొప్పగా జరిగాయి. మేమందరం చేసిన ప్రయత్నాల ఫలితంగా రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాల్లోకూడా పిల్లలచిత్రాల్ని ప్రదర్శించారు. అట్లా అక్కినేని అతెలంగాణా రాస్త్రం ఏర్పడ్డాక ఏమయినా జరుగుతుందేమో నాని ఆశించాను. ఒకసారి కె.టీ.ఆర్. తో కూడా మాట్లాడాను. కానీ ఆయన ఆ బాధ్యతను మరొక సలహాదారుకి అప్పగించారు.మొత్తం మీద ఫలితం శూన్యం. అమల గారితో  కలిసి పోటీకి వచ్చిన సినిమాల్ని చూడడం సరదాగానే అనిపించింది.

ఆ తఃరవాత కూడా పలు ఫెస్టివల్స్ లో జ్యూరీ గాపాల్గొన్నాను. కానీ వందకోట్ల సినిమా, పాన్ ఇండియన్ సినిమా లాంటి భావజాలంతో సినిమాలు రూపొందుతున్న వర్తమాన కాలంలో చలన చిత్రోత్సవాలు లాంటి భావనకు ఉనికే లేకుండా పోయింది.మన రాష్ట్రంలో నంది అవార్డులకే దిక్కులేని స్థితి. చాలా వాటితో పాటు అర్థవంతమయిన సినిమా స్థితీ అంతే…  

ఇప్పటికీ సెలవు…

-వారాల ఆనంద్ 22 అక్టోబర్ 2023               

104=యాదోంకీ బారాత్ 
+++++++++ వారాల ఆనంద్

103=యాదోంకీ బారాత్-వారాల ఆనంద్

Posted on

103=యాదోంకీ బారాత్

++++        

 ‘నిబద్దతతో, దీక్షతో పని చేస్తూ పోతూ వుంటే కీర్తి, పురస్కారాలు నీడలా నీ వెంట నడుస్తాయి, లేక నువ్వే కీర్తి, పురస్కారాల వెంట పరిగెడితే అవి నీకందకుండా నీడలాగా నీ ముందు పరుగెడుతూనే వుంటాయి’ అని నేననుకుంటాను. 

కానీ  ‘The reward for work well done is the opportunity to do more ’ అని అన్నారో మహానుభావుడు.

ఏది ఏమయినా మంచి పనికి లభించే ఒక చిన్న ప్రోత్సాహం సహకారం ఎవరికయినా ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. స్పూర్తినిస్తుంది. మరింతగా పనిచేసే దృక్పధాన్ని పెంపొందిస్తుంది.

అభిమానంతో కూడిన అభినందన ఎంతో ఆనందాన్నిస్తుంది. నిజం చెప్పాలంటే పనిచేసేవాడికి పనే పెద్ద ఉత్సాహం. అదే పెద్ద ఆత్మ తృప్తి.

అవార్డులూ ప్రోత్సాహకాలే కాదు పరిచయాలూ, సాన్నిహిత్యాలూ కూడా జీవితంలో ఎంతో ప్రభావాన్నీ సంతోషాల్నీ కలిగిస్తాయి. నేను కాలేజీ లైబ్రెరియన్ గా ఒక వైపు పని చేస్తూనే నా కున్న ఆసక్తి మేరకు ఆయాకాలాల్లో పత్రికలకు రాశాను. సాహిత్య సంఘాలల్లో ముందుండి పని చేశాను, ఫిల్మ్ సొసైటీ కార్యక్రమాల్ని ఉద్యమంగా తీసుకుని నడపాను. ఈ క్రమంలో కళాత్మక, సృజనాత్మక రంగాల్లో పనిచేస్తున్నప్పుడు ఆసక్తి అభిమానం వున్న వాళ్ళని సమీకరించడంతో పాటు ఆయా కార్యక్రమాల కోసం అనేకమంది ఉన్నత స్థాయిలో వున్న వాళ్ళతో పరిచయాలూ అవసరమయ్యాయి. వాళ్ళ సహకారాలూ ఆశించాల్సి వచ్చింది. ఆ దిశలో ముఖ్యంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్స్ తో సాన్నిహిత్యం తప్పనిసరి అయింది. కఫిసో లాంటి సంస్థలకు కలెక్టర్లే గౌరవ అధ్యక్షులుగా వుండడంతో వారిని కలవడం చర్చించడం మామూలయిపోయింది. పలువురితో స్నేహంకూడా ఏర్పడింది. అయితే ఒక్కటి మాత్రం జరిగింది అది నేను కావాలనే చేసింది. ఇన్నేళ్లల్లో ఏ ఒక్క ఏం.ఎల్.ఏ తో కానీ ఎంపీ తో కానీ వ్యక్తిగతంగా పరిచయాలు చేసుకోలేదు, పెంచుకోలేదు. వాళ్ళను కలవాల్సివచ్చినప్పుడు మిత్రులు నరెడ్ల శ్రీనివాస్, నారదాసు లక్ష్మణ రావు, దామోదర్ రెడ్డి, గండ్ర లక్ష్మణ రావు లాంటి వాళ్ళను ముందుంచాను. ఈనాడు, సుప్రభాతం, మాభూమి లాంటి పత్రికల్లో ఫ్రీలాన్సర్ గా వార్తలు, వార్తా కథనాలూ, వ్యాసాలూ విరివిగా రాసినప్పటికీ ఎప్పుడూ రాజకీయ నాయకులతో కలిసింది లేదు. నేనెవరో, ఆ రాసిందెవరో కూడా వాళ్ళకు తెలిసేది కాదు. బాగా లో ప్రొఫైల్ తో పాటు డిస్టాన్స్ మెయిన్ టైన్ చేశాను.

  ఇక కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ నిర్వహణ సంధర్భాల్లో నాకు మొట్టమొదట పరిచయం అయింది కలెక్టర్ కె.చంద్రశేఖర్. వేములవాడ ఫిల్మ్ సొసైటీ కోసం నేనూ శ్రీ నగుబోతు ప్రభాకర్ వచ్చి కలిశాం. కఫిసో ఫిల్మ్ అప్రిషియేషన్ కోర్సు అప్పుడు ఆయన ఎంతో సహకరించారు. అందులో నరెడ్ల శ్రీనివాస్ ది ప్రధాన భూమిక. తర్వాత కలెక్టర్ శ్రీ కె.ఆర్.పరమహంస. ఆయనతో పరిచయం కలిగింది పోరండ్ల లో గ్రామీణ ఫిల్మ్ ఫెస్టివల్ జరిపినప్పుడు. గ్రామీణ చలన చిత్రోత్సవం ఆలోచన నాది. కర్ణాటక లోని హెగ్గోడు లో జరిగిన ప్రయోగం చదివి తెలుసుకుని మనమూ చేద్దామని అన్నది నేను. నాతో పాటు శ్రీనివాస్, పోరండ్లకు చెందిన ఆత్మీయుడు కె.దామోదర్ రెడ్డి, శ్రీ డి.నరసింహారావు, నారదాసు లక్ష్మణ రావు, నారాయణ రెడ్డి మొదలయిన వాళ్ళం ముందుండి నడిపాము. కలెక్టర్ కె.ఆర్. పరమమహంస గారే మొదట కలెక్టరేట్ ముందు కఫిసో భవనానికి శంఖుస్థాపన చేశాడు. కానీ అది ముందుకు సాగలేదు. ఆ తర్వాత నాకు బాగా క్లోజ్ అయింది శ్రీ టి.ఎస్.అప్పారావు. ఆయన నాకు గ్రామీణ బాలల చిత్రోత్సవానికి వాహనం, ప్రొజెక్టర్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఆయన్ని ప్రారంభోత్సవానికి రమ్మంటే “చూడు ఆనంద్ మాతో సిన్సియర్ గా అయ్యే పని తీసుకోవాలి. మాకూ రావాలనే వుంటుంది కానీ సాధ్యం కాదు.  ప్రతిసారీ వెంట రావాలి అనుకోవద్దు..యు గో అహేడ్” అన్నారు. తర్వాత కలెక్టర్ సీ.బీ.ఎస్. వెంకటరమణ గారితో కొంత వివాదం జరిగింది. కఫిసో భవన స్థలం విషయంలో పని జరగడం లేదని ఆలస్యం అవుతున్నదని  ఈనాడులో రాశాను. మర్నాడు ఆయన్ను కలిస్తే వార్తల వల్ల ఏమీ కాదండీ, నేనూ వార్తలు రాయించగలను అన్నాడు. నాక్కొంచెం భాదేసింది. అయితే నా మట్టుకు నాకు బాగా స్నేహితుడి స్థాయిలో దగ్గరయిన వారు కలెక్టర్ శ్రీ భన్వర్ లాల్. ఫిల్మ్ సొసైటీ, ప్రెస్ క్లబ్ లాంటి అనేక సంస్థలకు స్థలాల్ని ఇచ్చి ప్రోత్సహించిన వాడాయన. అంతే కాదు అప్పుడే జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమం ‘అక్షర ఉజ్వల’ రావడం తో మేము ఆయనకు బాగా దగ్గరయ్యాం.  అక్షర ఉజ్వల పత్రికకు సంపాదకవర్గ సభ్యుడిగా వుండి భన్వర్ లాల్ తరఫున నేనే సంపాదకీయాలు రాశాను. నా డిప్యుటేషన్ విషయంలో ప్రిన్సిపాల్ ని పిలిచి తిట్టాడు కూడా. అలాంటి ఆయనకున్న సూటిదనం నీతివంతమయిన లక్షణాలవల్ల అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ని తక్కువ సమయంలోనే బదిలీ చేసింది. ఇదేమిటి ఇంత త్వరగా అని  నేనంటే ‘ద గేమ్ ఈస్ ఓవర్’ అన్నాడాయన. తర్వాత వచ్చిన కలెక్టర్ సుమితా దావ్ర గారు కూడా చాలా అభిమానంగా వున్నారు. తన కూతుర్ని తీసుకుని బాలల చిత్రోత్సవాలకి ఉదయం 8 గంటలకే సినిమాలకు వచ్చేవారు. సుమితా దావ్రా గారి నేతృత్వంలోనే రెండు మూడేళ్లు శాతవాహన కళోత్సవాలు జరిగాయి కఫిసో ఓపెన్ థియేటర్ నిర్వహించము. అప్పుడే జిల్లా జాయింట్ కలెక్టర్ గా వున్న దానకిషోర్ గారు కూడా మంచి స్నేహంగా వున్నారు. ఆయన కూడా వైజాగ్ లో లైబ్రరీ సైన్స్ చదివారు. అది కూడా మామాధ్య స్నేహానికి ఒక కారణం. ఆతర్వాత జిల్లాకు వచ్చిన సి.పార్టసారధి గారు చాలా సన్నిహితంగా వున్నారు. ఆయన సహకారంతోనే కఫిసో కు ఫిల్మ్ భవన్ నిర్మాణం, మా కాలేజీకి కొత్త లైబ్రరీ భవనం సాధించగలిగాను. కళలపట్ల, కలాల పట్ల, సినిమా పట్ల ఆయనకున్న ఇష్టాన్ని నేను బాగా ఎక్స్పాయిట్ చేయగలిగాను. నేనే కాదు ఆయన జిల్లాలోని కవులకు కళాకారులకు బాగా దగ్గరయ్యారు. ‘ లైబ్రరీ భవనానికి ముఖ్యమంత్రి గారి తో శంఖుస్థాపన వెయిద్దాం, సీఎం ప్రామిస్ కింద పని ఆగదు ఏమంటావు, వేయించుకుంటావా అన్నారాయన. ఆయన ఉన్నప్పుడే ఫిల్మ్ భవన్ పూర్తి అయింది కానీ లైబ్రరీ భవనం విషయంలో ఆ ఆతర్వాత వచ్చిన కలెక్టర్ ఎంవీ సత్యనారాయణ కూడా నాతో నిలబడ్డారు. ఆ తర్వాత కొంత కాలానికి జిల్లాకు కలెక్టర్ గా వచ్చిన సర్ఫ్ రాజ్ అహ్మద్ గారితో నాకున్నది స్వల్ప పరిచయమే అయినప్పటికీ నా గుల్జార్ అనువాద కవితా సంకలనం ‘ఆకుపచ్చ కవితలు’ ఆయనే ప్రచురించారు. ఆవిష్కరణ సభలో ‘సార్ జనం క్రిక్కిరిసి లేరు’ అని నేనంటే ‘సాహిత్య సభల్లో ఇంతకంటే ఎక్కువ ఆశించకూడదు’ అన్నారు మెల్లిగా’ . ఆ పుస్తకానికే నాకు కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం వచ్చింది. అనేక దశాబ్దాలపాటు ఎంతోమంది కలెక్టర్స్ తో సాన్నిహిత్యమున్నప్పటికీ ఆకుపచ్చ కవితలు విషయంలో సర్ఫ్రాజ్ గారిని తప్ప మరెవరినీ నా వ్యక్తిగత అవసరాల కోసం ఏమీ అడగలేదు. వివిధ కాలేజీలకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు కూడా మౌనంగా వెళ్లిపోయాను తప్ప కలెక్టర్స్ సహకారం తీసుకోలేదు. కలెక్టర్స్ విషయంలో అనేక సమయాల్లో అధికారిక హంగామానే చూస్తాం కానీ నేను వాళ్ళల్లో కూడా కళా సాహిత్యాలల్లో అభినివేశం, ఆసక్తి వున్నవాళ్లు ఎందరినో చూశాను.

ఇక సాహితీ రంగంలో మాకు కొంతసన్నిహితంగా వున్న వారు శ్రీ ఐ.వి.సుబ్బారావు. డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారికి జ్ఞానపీఠ్ అవార్డు వచ్చినప్పుడు డాక్టర్ గోపు లింగారెడ్డి, డాక్టర్ బి.దామోదర్ రావు, నరెడ్ల శ్రీనివాస్, గంద్ర లక్ష్మణ్ రావు, నేనూ కలిసి వెళ్ళి సుబ్బారావు గారిని కలిశాం. సినారె గారికి పెద్ద సన్మానం చేద్దామని వుంది మీ సహకారం కావాలన్నాము. దానికి ఆయన నవ్వుతూ స్పందించి ఎంత పెద్దగా చేసినా సన్మానం ఒక్క రోజుతో ముగుస్తుంది, వారి పేరిట ఏదయినా శాశ్వతంగా వుండేది చేయండి నేను మీతో వుంటాను అన్నారు. దాని ఫలితంగానే జిల్లాలో సాహితీ గౌతమి, సినారె అవార్డు వచ్చాయి.

++++

ఇదంతా ఇట్లా వుంటే వివిధ సంధర్భాల్లో జిల్లా స్థాయిలో ప్రశంసా పత్రాలు, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గ్రాంధాలయాధికారిగా, ఉత్తమ విల్మ్ సొసైటీ కార్యకర్తగా బహుమతులు అందుకున్నాను. అవి ఒకరకంగా ప్రోత్సాహకరమయినవే.

మొట్టమొదటిసారిగా జిల్లా స్థాయిలో శాతవాహన కాళోత్సవాలల్లో కృషికి సుమితా దావ్రా గారినుంచి సన్మానం అందుకున్నాను. తర్వాత జిల్లా స్థాయిలో సి.పార్థసారధి, నీతూ ప్రసాద్, సందీప్ కుమార్ సుల్తానియా గార్లు కలెక్టర్స్ గా వున్నప్పుడు స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా ప్రశంసా పత్రాల్ని అందుకున్నాను. ఒక సారయితే చేయి విరిగి కట్టుతో వెళ్ళి అందుకున్నాను.

ఇక కమీషనర్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్ గా సునీత గారున్నప్పుడు  రాష్ట్రస్థాయిలో ఉత్తమ లెక్చరర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అవార్డును అందుకున్నాను. అప్పుడు ఎస్.ఆర్.ఆర్. కాలేజీకి ఉమ్మడి రాస్త్ర స్థాయిలో పలు అవార్డులు దక్కాయి. ప్రిన్సిపాల్గా డాక్టర్ కె.మురళి గారికి కూడా బహుమతి వచ్చింది.

ఇక ఫిల్మ్ సొసైటీ కి చేసిన కృషికి గాను ఐ.ఎస్.కె.దేవరాయలు అవార్డును అందుకున్నాను. మా కఫిసో దక్షిణ భారత స్థాయిలో రెండు సార్లు ఉత్తమ ఫిల్మ్ సొసైటీ గా అవార్డును అందుకుంది,

అట్లా నాకు గుర్తున్నంత వరకు జిల్లా కలెక్టర్స్ నా సాహిత్య, కళా, సినిమా ప్రస్థానాల్లో ఎంతగానో సహకరించారు. వారి రుణం తీర్చుకోలేను. వారందరికీ నేను గుర్తున్నానో లేదో తెలీదు.వారంతా ఇప్పుడు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో తెలీదు, వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.  

ఈ వారానికి సెలవ్…

-వారాల ఆనంద్

15 అక్టోబర్ 2023            

103=యాదోంకీ బారాత్

101=యాదోంకీ బారాత్

Posted on

101=యాదోంకీ బారాత్

+++++= వారాల ఆనంద్

“When people ask me if I went to film school, I tell them, ‘no, I went to films” అన్నాడు ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు Quentin Tarantino. అయినప్పటికీ చలన చిత్ర నిర్మాణమన్నది కేవలం కళే కాదు సైన్స్ కూడా. సినిమా దర్శకుడు తనకున్న ఎన్నో ఆలోచనల్ని భావాల్నీ తెరపైకి మలచాలంటే ఎన్నో శాస్త్ర సాంకేతికాంశాల్ని వినియోగించాల్సి వుంటుంది. దానికోసం శిక్షణ అవగాహన ముఖ్యం. అంతేకాదు ఒక మంచి సినిమా తీయాలంటే స్క్రిప్ట్ , స్క్రిప్ట్ , స్క్రిప్ట్ అనే మూడు అంశాలు తప్పనిసరి అంటాడు అల్గ్ఫ్రెడ్ హిచ్ కాక్. అంటే సినిమా రూపొందించడానికి మిగతా అన్నీ అంశాల కంటే కూడా ముఖ్యమయింది ప్రధానమయింది స్క్రిప్ట్ అన్నమాట. ఆ స్క్రిప్ట్ రాయడానికి దర్శకుడు తప్పనిసరిగా చదవాలి.. చదవాలి..చదవాలి READ, READ AND READ అంతే చదవకపోతే దర్శకుడు కావడం సాధ్యమే కాదు.

నా మట్టుకు నేను ఫిల్మ్ సొసైటీ ప్రదర్శనల్లో అనేక సినిమాలు చూసిన తర్వాత ఫిల్మ్స్ కు  సంబధించి, ఫిల్మ్ మేకింగ్ కు సంబంధించి నా తర్వాతి తరానికి పరిచయం,శిక్షణ కల్పించాలనుకున్నాను. నాకున్న అనేక పరిమితుల మేరకు పూర్తి స్థాయిలో సినిమా రంగంలోకి వెళ్ళే స్థితి లేదు కనుక యువకులకయినా ఆ రంగం పట్ల కనీస అవగాహన కలిగించాలనుకున్నాను. మంచి సినిమాల్ని చూడండి, ప్రపంచాన్ని అర్థం చేసుకోండీ. ఆసక్తి వుంటే ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోండి అని విద్యార్థులకు యువకులకు చెప్పేవాన్ని. కాలేజీల్లో ఓ పక్క కాంపస్ ఫిల్మ్ క్లబ్స్ ఏర్పాటు చేస్తూనే ఫిల్మ్ మేకింగ్ వర్క్ శాప్స్ నిర్వహించడం మొదలు  పెట్టాను, మా కాలేజీలో ఏకంగా ఆర్నెల్ల ఫిల్మ్ మేకింగ్ కోర్స్ నే ప్రారంభించాను. అప్పుడు ప్రిసీపాల్స్ గా వున్న మిత్రులు డాక్టర్ మధుసూధన్ రెడ్డి, డాక్టర్ మురళి ఎంతగానో సహకరించారు.

అట్లా మా కాలేజీలో మొదలు పెట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ క్లబ్ నుంచి ఫిల్మ్ మేకింగ్ కోర్స్ ప్రారంభించాను. అప్పటి శాతవాహన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఇక్బాల్ లాంఛనంగా ప్రారభోత్సవం చేశారు. ప్రిన్సిపాల్ మధుసూధన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రముఖ తెలుగు ఫిల్మ్ క్రిటిక్ శ్రీ చల్లా శ్రీనివాస్ అతిథిగా వచ్చి పిల్లలకు సినిమా మీద సినీ విమర్శమీద ముఖ్యంగా తెలంగా సినిమా గురించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు. తర్వాత అప్పుడు కరీంనగర్ డిఐజి గా వున్న అధికారికి ఫిల్మ్ మేకింగ్ పట్ల ఆసక్తి వుందని తెలిసి తనని క్లాస్ కి పిలిచాను. ఆయన స్వతహాగా కొన్ని షార్ట్ ఫిల్మ్ చేసి వున్నాడని తెలిసి చాలా సంతోషం కలిగింది. అనుభవాలతో కూడిన ఆయన క్లాస్ కూడా పిల్లలను బాగా ఆకట్టుకుంది. ఇక సుప్రసిద్ద రచయిత దర్శకుడు శ్రీ అక్కినేని కుటుంబ రావు, ఎడిటర్ లెనిన్ తదితరులు వచ్చి కోర్సులో క్లాసులు చెప్పారు. కుటుంబరావు గారు అందించిన ప్రోత్సాహం సహకారం ఎన్నటికీ నేనూ, మా కాలేజీలోని అప్పటి విద్యార్థులూ మర్చిపోలేము. చిత్ర నిర్మాణానికి చెందిన అనేక విషయాల్ని ఆయన సోదాహరణంగా వివరించారు. కోర్సుల్లో స్క్రిప్ట్ రచన కెమెరా పనితనం, ఎడిటింగ్ తదితర విషయాల గురించి ప్రాథమిక విషయాల్ని చెప్పాం.

కోర్సు అట్లా నడుస్తూ వుండగానే మాకొక ఆలోచన వచ్చింది. ప్రత్యేకంగా ఓ రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహిస్తే ఎట్లా వుంటుంది అని. ఇంకేముంది దానికి ‘మేక్ అప్ టు పాక్ అప్’ (MAKE UP TO PACK UP) అని పేరు పెట్టాం. ఆసక్తి వున్న పిల్లలకు దృశ్యభాష, దృశ్యచిత్రీకరణ, స్క్రిప్ట్ రచన,ఎడిటింగ్ తదితర అంశాల పైన వర్క్ షాప్ లో చెప్పాలనుకున్నాం. ముఖ్యంగా తెలంగాణ జిల్లాలనుంచి యువతను ఆహ్వానించాలి వారికి ప్రధానంగా అవగాహన కల్పించాలనుకున్నది లక్ష్యం. నా పిలుపును అందుకుని నిజామాబాద్, హైదరబాద్, సిద్దిపేట్, గంభీరావుపేట్, మంచిర్యాల తదితర ప్రాంతాల నుంచి యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మా కాలేజీ సత్యజిత్ రే ఫిల్మ్ క్లబ్ తో పాటు ‘గామా’ ఫిల్మ్ సంస్థ కూడా సహకరించింది. మొదటి రోజు శాతవాహన విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య వీరారెడ్డి అతిథిగా పాల్గొన్నారు. కరీంనగర్ కేంద్రంగా ఫిల్మ్ రంగంలో యువత ఎదగాలని ఆయన మా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మురలి ఆశించారు. వర్క్ షాప్ ను ప్రారంభించిన నా మిత్రుడు దర్శకుడు శ్రీ సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తన మొదటి సినిమాలు వైఫల్యం చెందాయని అయినా పట్టు వదలక ముందుకు సాగితేనే ‘సొంత వూరు’, ‘గంగ పుత్రులు’ లాంటి అవార్డు సినిమాల్ని తీయగలిగానని చెబుతూ ఫిల్మ్ దర్శకత్వం గురించి వివరంగా చర్చించారు. ఇక మొదటి సెస్సన్ లో ‘కుంకుమ రేఖ’ సీరియల్ దర్శకుడు శ్రీ హరిచరణ్ రావు, రెండవ సెస్సన్ లో సీనియర్ దర్శకుడు శ్రీ వీ.వీ.రాజు సినిమాల్లోని 24 ఫ్రేమ్స్ కు చెందిన అనేక అంశాల్ని వివరించారు. ఫిల్మ్ ఎడిటర్ రవీంద్ర బాబు ఫిల్మ్ ఎడిటింగ్ ఆవిర్భావం నుండి వర్తమాన స్థితి వరకు వివరించారు. కలరింగ్, గ్రాఫిక్స్ గురించి కూడా చెప్పారు. వర్క్ షాప్ రెండవ రోజు హోప్, కలవరమాయే మదిలో లాంటి సినిమాల్ని తీసిన దర్శకుడు శ్రీ సతీష్ కాసెట్టి ఫిల్మ్ కాన్సెప్ట్ నుంచి మొదలు ఫైనల్ ప్రాడక్ట్ దాకా జరిగే సాంకేతిక అంశాల గురించి స్పెల్ బౌండ్  ప్రేసెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాతి సెస్సన్ లో ప్రముఖ జర్నలిస్ట్ ఫిల్మ్ క్రిటిక్ శ్రీ జగన్ మాట్లాడుతూ ఫిల్మ్ ఫెస్టివల్స్ వాటి ప్రాముఖ్యత గురించి చెప్పగా, నింగీ నెలా నిర్మాత చావా సుధారాణి ఆత్మవిశ్వాసం తోనే గొప్ప సినిమాలు నిర్మించవచ్చని అన్నారు. ఇక ముగింపు సమావేశంలో నంది అవార్డును అందుకున్న మా మిత్రుడు ‘విముక్తి కోసం’ సినిమా నిర్మాత శ్రీ నారదాసు లక్ష్మణ రావు సినిమా అత్యంత శక్తివంతమయిన మాధ్యమం అన్నారు. అట్లా మా కాలేజీ క్లబ్ నిర్వహించిన రెండు రోజుల కార్యక్రమంలో పాల్గొని యువతే యువకులు గొప్ప దృశ్య చైతన్యంతో వెనుదిరిగారు. మా ఎస్.ఆర్.ఆర్. కాలేజీ గొప్ప వేదికగా నిలిచినందుకు మా ప్రిన్సిపాల్, అధ్యాపకులు సిబ్బంది ఎంతో సంతోష పడ్డారు.

++++

ఆ తర్వాత నేను నిర్వహించిన ఫిల్మ్ వర్క్ శాప్  శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి లో యువ మిత్రుడు శ్రీకాకులానికి చెందిన గుడ్ల సంతోష్ కుమార్ సహకారంతో సాధ్యమయింది. 2011 ఆగస్ట్ ఆరరు, ఏడు తేదీల్లో నిర్వహించిన ఈ వర్క్ షాప్ నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. విజయ గర్వాన్ని కూడా అందించిందనే చెప్పుకోవాలి. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని మారు మూల జిల్లా అయిన శ్రీకాకుళం ‘టెక్కలి’ లోని ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మానేజ్మెంట్ లో ఈ కార్యక్రమం నిర్వహించాము. ఆ కాలేజీలోని కాంపస్ ఫిల్మ్ క్లబ్ సహకారంతో జరిగింది. కాలేజీ డైరెక్టర్ శ్రీ నాగేశ్వర్ రావు పూర్తిగా సహకరించారు. ఆర్థికంగానూ హార్దికంగానూ. కేవలం ఆదిత్య కాలేజీ నుంచే కాకుండా కాకినాడ, విజయవాడ, విశాఖ లాంటి పలుచోట్ల కు చెందిన వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్నుంచీ  సుమారు 120 మండి విద్యార్థినీ విద్యార్థులు ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు.FEDERATION OF FILM SOCIETIES కు అప్పుడు నేను కార్యదర్శిగా వున్నాను. ఎఫ్.ఎఫ్.ఎస్.ఐ. తన వంతు పూర్తిసహకారాన్ని అందించింది. నా విజ్ఞప్తిని ఆమోదించి పలువురు సినీప్రముఖులు ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు. హైదరబాద్ ఫిల్మ్ క్లబ్ కార్యదర్శి శ్రీ ప్రకాష్ రెడ్డి మొత్తం కో ఆర్డినేట్ చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆదిత్య కాలేజీ డైరెక్టర్ నాగేశ్వర్ రావు అధ్యక్షత వహించగా సుప్రసిద్ద దర్శకుడు శ్రీ రేలంగి నరసింహా రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రేలంగి గారు తన సినిమా దర్శకత్వ అనుభవాల్ని సోదాహరణంగా వివరించారు. వర్క్ షాప్ రిసోర్స్ పర్సన్స్ గా సినిమాటోగ్రాఫర్ శ్రీ ఎం.వీ.రఘు, ‘అంకుశం’ దర్శకుడు శ్రీ సి.ఉమామహేశ్వర్ రావు, రచయిత శ్రీ కె.ఎల్.ప్రసాద్, దర్శకుడు ప్రవీణ్ బండారు, బిహెచ్ ఎస్.ఎస్. ప్రకాష్ రెడ్డి గార్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. రెండు రోజుల ఈ వర్క్ షాప్ లో కాలేజీ డైరెక్టర్ శ్రీ నాగేశ్వర్ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. రెండవ రోజు తమ ఇంట్లో మా అందరికీ బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేసి ఎంతో ఆప్యాయంగా వున్నారు. రిసోర్స్ పర్సన్స్ అంతా స్క్రిప్ట్, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం తదితర అంశాల గురించి చైతన్యవంతమయిన ప్రసంగాలు చేశారు. నేనేమో నా ఫిల్మ్ ప్రేసెంటేషన్ ఇచ్చాను. మిత్రులంతా హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి టెక్కలి దాకా వచ్చి రెండు రోజులాపాటు ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థినీ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ప్రశ్నల్ని సంధిస్తూ మమేకమయి పోయారు.

అట్లా విద్యార్థులు యువకులకోసం నేను నిర్వహించిన వర్క్ షాప్ లు నాకో ఎంతో నేర్పించాయి. ఎందుకంటే ORGANISATION IS AN EXPERIENCE, AND EXPERIENCE IS GREAT LEARNING. I WANT TO BE A LEARNER ALWAYS ..

మిగతా వివరాలతో మళ్ళీ కలుస్తాను

-వారాల ఆనంద్

6 ఆగస్ట్ 2023                 

99= యాదోంకీ బారాత్

Posted on Updated on

99= యాదోంకీ బారాత్

+++++ వారాల ఆనంద్

వేములవాడ

మా అమ్మను కన్న వూరు ననుకన్న పేగు

మా అమ్మనే కాదు మా నాన్న మూలాల్ని, మా వారాల వంశాన్ని కన్న వూరది. 

మిఠాయోళ్ళ జోరు ఛిలుకల పేరు, బత్తీసలదండ ఆ వూరో గొప్ప జ్ఞాపకాల ఊరేగింపు. నిజానికి మా మిఠాయి సత్తెమ్మ కుటుంబం వేములవాడ నుంచి కరీంనగర్ కు తరలి వచ్చింది.

అలాంటి

వేములవాడకు తెలంగాణా మొత్తం కదిలొచ్చి

తడి బట్టలతో ప్రదక్షిణలు చేసి పోతది.  

 ఈ ఊర్ల కొచ్చిన ముత్తయిదువల

చెంపల మీద పసుపు పచ్చని గులాబీలు వికసిస్తయి.

నొసల్ల మీద ఎర్రటి సూర్యుళ్ళు మెరుస్తరు. అందుకే ఆ వూరన్నా ఆ పేరన్నా నాకెంతో ఇష్టం.   ఆ వూరు నా పుట్టుకలోనే కాదు నా సృజనాత్మక జీవన గమనంలో గట్టి పునాదులు వేసింది. చిన్నప్పటినుండీ అక్కడి గుడి, జాతర నా అనుభవంలోనూ జ్ఞాపకాల్లోనూ సజీవంగా పెనవేసుకుపోయింది. వేములవాడ శైవ క్షేత్రమయినప్పటికి 

“ఇదేమి చిత్రమో అక్కడ రాముని లగ్గంనాడు

శివున్ని పెళ్లి జేసుకుంటరు

అడ్డ బొట్టూ నిలువు బొట్టు అంతా సమానమే”

ఇక్కడి ‘శివపార్వతుల’ శ్వాస

తెలంగాణా మొత్తానికి

ఊపిరి పోస్తది

++++

వేములవాడలో శివరాత్రి ఓ పెద్ద పండుగ. అంతకంటే పెద్ద జాతర. దానితో పాటు వేములవాడలో శ్రీ రామనవమి కూడా అంతే పెద్ద పండుగ. అంతే పెద్ద జాతర. ఆ రెండు జాతరలూ నన్నే కాదు నా తోటి వాళ్ళనూ అందరినీ ఎంతో ఆకర్షించేవి. జాతరల నిండా అందం ఆనందం వెళ్లివిరిసేది. సర్కస్ లు మొదలు ఎన్నో ఎన్నెన్నో.. అయితే శ్రీరామనవమి రోజున  ఇక్కడ భక్తులు ఒక భిన్నమయిన సాంప్రదాయాన్ని అవలంభిస్తారు. స్త్రీ పురుష బేధం లేకుండా ఆ రోజు దేవుణ్ణి పెళ్లాడి దేవుని పేర శివపార్వతులుగా జీవితాలు గడిపే ప్రత్యేకమయిన ఆచారం అది. శ్రీరామనవమి రోజున వేలాది మంది స్త్రీ పురుషులు కొత్త బట్టలు ధరించి నుదుటిపై పెద్దబొట్టు. తలపై జీలకర్ర బెల్లం, చేతిలో త్రిశూలం, నుదుటిపై బాసింగాలు ధరించి జోలె పట్టుకుని అక్షింతలు చల్లుకుంటూ దేవునితో తమ వివాహాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు వారి త్రిశూలాల మోతల్తో ఆలయ ప్రాంగణం మాత్రమే కాదు మొత్తం వూరంతా మారు మోగిపోతుంది. ఓ పక్క ఆలయ అధికారులు నిర్వాహకులు శ్రీరామ కళ్యాణం ఘనంగా జరుపుతూ వుంటే శివపార్వతులు తాము దేవుణ్ణి పెళ్ళాడుతూ శ్రీ రాముని పెళ్ళికి తమ తాహతు మేర కట్నలు కూడా చదివిస్తారు. జంగాలుగా పరిగణించబడే వీరశైవులు ఈ శివ పార్వతుల పెళ్లి జరిపిస్తారు. మొదట జంగం వాళ్ళు ధారణ శుద్ది చేస్తారు. స్త్రీ పురుష బేధం లేకుండా చీరలు కట్టించి రాగి మంగళసూత్రం మెడలో కడతారు. చేతిలో త్రిశూలం ఇచ్చి శివుడితో పెళ్లి జరిపిస్తారు. ఆలయ ప్రాంగణంలోనే కాదు వూరువూరంతా జరుపుతారు.  వేలాది లక్షల మందితో ఈ కార్యక్రమమంతా పెద్ద జాతరగా జరుగుతుంది.   

ఈ మొత్తం ఆచారంలో వారి వారి ఆర్థిక స్థితిని బట్టి తమ జీవితాల్లో మామూలుగానే పెళ్లిళ్లు చేసుకుని కాపురాలు చేస్తూ శివపార్వతులుగా వుంటారు. ఆర్థికంగా లేని వాళ్ళు శివపార్వతులుగా భిక్షాటన చేస్తూ గడుపుతారు. ఇదంతా నా బాల్యం నుండి చూస్తూ వస్తున్నాను. అదంతా చాలా చిత్రంగానూ ఆసక్తిగానూ అనిపించేది.విశ్వాసాల మాట అటుంచితే అదొక సాంప్రదాయం. సంస్కృతిలో భాగం. అంతా గొప్పగా అనిపించేది.  డాక్యుమెంటరీల రచన దర్శకత్వం వైపు నా దృష్టి మరలిన తర్వాత ఈ శివపార్వతుల మీద ఫిల్మ్ చేయాలనిపించింది. ఆ ఆచారాన్ని సంస్కృతిని చిత్రబద్దం చేయాలనే ఆలోచన ఉత్సాహం క్రమంగా పెరిగింది. వేములవాడలో జర్నలిస్టుగా పనిచేసిన మిత్రుడు పీ.ఎస్.రవీంద్ర తో ఆలోచించాను బాగుంటుంది గో ఎహెడ్ అన్నాడు. ఇంకేముంది శ్రీరామనవమికి ముందే ఏర్పాట్లు చేయడం మొదలు పెట్టాను. సిరిసిల్లా జర్నలిస్టు మిత్రుడు టీ.వీ.నారాయణ తోడు ఉండనే వున్నాడు. నటుడు కెమెరామెన్ శ్రీ పోల్సాని వేణుగోపాల రావుని సంప్రదించాను. కెమెరా ఎడిటింగ్ కి తాను రెడీ అన్నాడు. ఠాకూర్ రాజేందర్ సింగ్ మాతో కలిశాడు. వేములవాడ జర్నలిస్టు మిత్రుల్నీ కలుపుకున్నాను. జాతర కదా అధికారుల సహకారం కూడా కావాలి. అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆలయ ప్రాంగణంలోని వసతి గృహంలో వుండడానికి ఏర్పాట్లు కూడా చేశాం. అప్పటి ఆలయ ఛైర్మన్ శ్రీ ఆది శ్రీనివాస్ చేతులమీద క్లాప్ కొట్టించి షూట్ ప్రారంభించాం. ఇంకేముంది అనుకున్నట్టుగానే కెమెరా మైకు రిఫ్లెక్టర్లు పట్టుకుని జాతరలో పడ్డాం. ఎన్ని విజువల్సో. శివపార్వతుల పెళ్లి తంతు ఒక వైపు మరో వైపు జతరలో చిలుకలు, బత్తీసలు, పుస్తెలు, మట్టెలు ఒకటేమిటి ఎన్నో లైవ్ గా షూట్ చేశాం. పలువురు శివపార్వతులతో ఇంటర్వ్యూలు. మొత్తంగా రోజంతా విరామం లేకుండా షూట్ తో సరిపోయింది. మాతో పాటు మా అన్వేష్ కూడా వున్నాడు. రవీంద్ర మాత్రం అలిసిపోయి తమ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాడు. ఆ రాత్రి అక్కడే గెస్ట్ హౌస్ లో వుండి ఉదయాన్నే మళ్ళీ షూట్ కి రెడీ. పోచమ్మ బోనాలూ అవీ అన్నీ గొప్ప ఉత్సాహంతో ఫిల్మ్ చేశాం. వరంగల్ వెళ్ళి పోల్సాని ఇంట్లో డబ్బింగ్ ఎడిటింగ్ చేశాం.BRIDES OF LORD SHIVA అని పేరు పెట్టాను. ఫిల్మ్ బాగా వచ్చింది. ఫిల్మ్ ని వివిధ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి పంపించాను. ఆన్లైన్ ఫెస్టివల్స్ తో సహా. స్లొవేనియా లో జరిగిన DAYS OF EHTNOGRAPHIC FILM ఉత్సవానికి ఎంపికయి అక్కడ ప్రదర్శించబడింది. యౌట్యూబ్ లో కూడా మంచి స్పందననే అందుకుంది. ఇంకా అనేక దేశాల ఫెస్టివల్స్ లో పాల్గొంది. తెలంగాణ కు చెందిన ఒక ఆచారాన్ని సంస్కృతిని చిత్రబద్దం చేసిన ఆనందం తృప్తి మిగిలింది.

….

అది ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎదుగుతున్న కాలం. రాజకీయ సాహిత్య సాంస్కృతిక రంగాల్లో ఉద్యమ ఉధృతి చైతన్య ప్రచార కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి. అందులో భాగంగానే కరీంనగర్ కు చెందిన ఓ ఉపాధ్యాయ మిత్రుడు శ్రీ టి.తిరుపతి రావు ఒక వినూత్న విలక్షణమయిన కార్యక్రమాన్ని చేపట్టాడు. అప్పుడప్పుడే ప్రజాల్లోకి చొచ్చుకు వస్తున్న మొబైల్ ఫోన్ దాని లో వున్న SHORT MESSEGE SEVICE ఎస్.ఎం.ఎస్. సౌకర్యాన్ని తెలంగాణా ఉద్యమ చైతన్య ప్రచారానికి వినియోగించుకోవడం మొదలు పెట్టాడు. తెలంగాణా కు సంబధించి రోజూ వేలాది మెస్సెజ్ లు పంపిస్తూ తన వంతు కృషిని కొనసాగిస్తున్నాడు. సరిగ్గా అప్పుడే సిస్కో అంతర్జాతీయ సంస్థ ఒక షార్ట్ ఫిల్మ్ పోటీని ప్రకటించింది. పోటీకి ఇచ్చిన అంశం ఏమిటి అంటే ఎవరయినా దేనికయినా ఒక ఎలెక్ట్రానిక్ గాడ్జెట్ అంటే సెల్.టీవీ,నెట్ లేదా మారేదయినా సాంకేతిక పరికరాన్ని ప్రజోపయోగం కోసం, లేదా సామాజిక ప్రయోజనం కోసం వినియోగిస్తూ వుంటే వాళ్లమీద ఆ పరికరం మీద ఆధారం చేసుకుని ఫిల్మ్ చేయాలి. ఆ ఫిల్మ్          

కేవలం ఆరు నిమిషాల నిడివిలో ఆ షార్ట్ ఫిల్మ్ అయి వుండాలి.అది తెలియగానే నాకు తిరుపతి రావు గారు గుర్తొచ్చారు. ఆయన, ఆయన సెల్ ఫోన్, తెలంగాణ ఉద్యమం  వీటన్నింటినీ జోడించి ఫిల్మ్ చేద్దామనిపించింది. వెంటనే సంప్రదించాను. ఆయన సరేనన్నారు. నేను పోల్సాని వేణు గారిని సంప్రదించాను. నేను ఆలోచన స్క్రిప్ట్ తో రెడీ. యూనిట్  మిత్రులంతా రెడీ. షూటింగ్ మా ఇంట్లోనే. ఒక రోజంతా షూట్ చేశాం. మా ఇందిర, రేలా, అన్వేష్ లో కూడా ఉత్సాహంగా టీలు టిఫిన్స్ ఇచ్చి సహకరించారు. షూటింగ్ తర్వాత వరంగల్ లో ఎడిట్ కామెంటరీ అదీ పూర్తి చేసి సిస్కో వాళ్ళకు అప్లోడ్ చేశాను. అందులో జ్యూరీ సెలెక్షన్ ఒక విభాగం అయితే పోల్ మరొక విభాగం. తెలంగాణా ఉద్యమ నేపధ్యంలో ఆ ఫిల్మ్ కి చాలా సపోర్ట్ వచ్చింది. పోల్ లో విజేతగా నిలబడింది. అంతర్జాతీయ స్థాయిలో సిస్కో వారి అవార్డు తో పాటు క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చారు. అట్లా “LONG BATTLE WITH SHORT MESEGES” పెద్ద విజయాన్నే సాధించింది. ఆ ఫిల్మ్ తెలంగాణ ఉద్యమంతో కలిసి నడిచింది.  కానీ ఉద్యమం ఉద్యమ నాయకులు పాటను, సాహిత్యాన్నీ ఓన్ చేసుకున్నట్టు ఫిల్మ్ ఓన్  చేసుకోలేకపోయింది.అసలు టీవీని ప్రచారాన్ని తప్ప తెలంగాణ ఉద్యమం విజువల్ మీడియా మొత్తాన్ని దాని శక్తిని పరిగణ లోకి తీసుకోలేదు. అవగాహన లేమే ప్రధాన కారణం.

+++

ఇట్లా నా డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్ కొనసాగింది. అది కేవలం హాబీ గానే కాదు నేను బాధ్యతగా చేశాను. ముఖ్యంగా “తెలంగాణ సాహితీ మూర్తులు” సెరీస్ ప్రారంభించి ఇద్దరు సాహితీ మూర్తుల మీద నా శక్తి మేరకు ఫిల్మ్స్ చేశాను. ఆ సెరీస్ ను కొనసాగించెందుకు నా కున్న ఆర్థిక శక్తి సరిపోలేదు. సహకరించే వాళ్లు కూడా పెద్దగా లేకుండా పోయారు. ఎప్పటికయినా ఆ సెరీస్ లో చాలా మంది తెలంగాణ కవులు రచయితల మీద ఫిల్మ్స్ చేసి వుంచాలని ఆశ పడ్డాను. కానీ అది అత్యాశే అయింది. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడింది. సాహిత్య అకాడెమీ లాంటి సంస్థలూ వచ్చాయి. నేను ప్రత్యేకంగా విజ్ఞప్తులు చేశాను. కానీ ఎవరూ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ వైపు దృష్టి పెట్టలేదు. అంతా లక్షలు పెట్టి పెద్ద పెద్ద పుస్తకాల్ని రంగుల్లో వేశారు. తెలంగాణ సినిమా ఉనికికి ఎదుగుదలకు ఎంతో కృషి వైతాళికులు అన్నవాళ్లు కూడా సాహిత్యకారుల డాక్యుమెంటరీ ఫిల్మ్స్ వైపు దృష్టి పెట్టలేదు. ఎంతో మంది సాహితీ వేత్తలు వెళ్లి పోతూనే వున్నారు. కానీ సంస్థలు చేయాల్సిన పనులు వ్యక్తుల వల్ల పూర్తిగా సాధ్యం కావు. అది నా దృష్టిలో పెద్ద వైఫల్యమే. రాజ్యసభ టీవీ, దూరదర్శన్ లాంటి జాతీయ సంస్థలు సాహిత్యానికి సంబందించిడాక్యుమెంటరీలు, కితాబ్, విరాసత్, ముఖాముఖీ లాంటి అనేక కార్యక్రమాల్ని రూపొందించాయి. తెలంగాణ ఆదిశలో నిర్లిప్తంగా వుండి పోయింది. దశ-దిశ లేకుండా పోయాయి.  

తర్వాత నా డాక్యుమెంటరీ నిర్మాణ కార్యక్రమాల్లో ‘మిత్తుల అయ్యవార్లు’, శ్రీభాష్యం డాక్యుమెంట్రీ అసంపూర్ణంగా మిగిలిపోయాయి…

తర్వాత ఫిల్మ్ ఫెస్టివల్స్ లో జ్యూరీ గా వుండడం లాంటివి చేశాను.. రాతలు కొనసాగిస్తూనే వచ్చాను. మిగతా వివరాలతో మళ్ళీ వారం కలుస్తాను…

-వారాల ఆనంద్

9440501281

సొంత వూరు’ పై డాక్టర్ టి.రాధాకృష్ణమాచార్య

Posted on

మిత్రులారా! నా కవితా సంకలనం ‘సొంత వూరు’ పైన డాక్టర్ టి.రాధాకృష్ణమాచార్య సమీక్షా వ్యాసం రాసారు, వారికి సంపాదకులకు ధన్యవాదాలు.

సొంత వూరు' పైన డాక్టర్ టి.రాధాకృష్ణమాచార్య

95= యాదోంకీ బారాత్

Posted on

++++++ వారాల ఆనంద్

95= యాదోంకీ బారాత్

++++++ వారాల ఆనంద్

‘నాలోని లోపాలూ బలాలూ నా స్వంతమే

రైలు పట్టాల్లాంటి వాటి పైననే 

నా బతుకు బండి ప్రయాణం’

అట్లా ప్రయాణం సాగుతూనే వుంది, గడిచిన ప్రయాణంలో ఎంతో మంది తోడు నడిచారు.కొందరు నిలబడిపోయారు. మరికొందరు కూలబడిపోయారు, మిగిలింది కొంత చరిత్ర,, కొంత అనుభవం, మరికొంత ప్రయాణం.

ఆ క్రమంలో   

జ్ఞాపకాల్ని సజీవంగా ఉంచడం ఎంత కష్టం,
గతం లేని భవిష్యత్తు లేదు. అందుకే ఈ జ్ఞాపకాల వూరేగింపు.

ఆ వూరేగింపు ఒక్కోసారి క్షణకాలం నిలబడిపోయి తిరిగి ఆరంభవుతున్నది.   

నిజానికి

‘గమ్యం తెలియకుండానే  ప్రయాణం మొదలవుతుంది,

ప్రయాణం సాగుతూ ఉంటే

దారులు అవే తెరుచుకుంటాయి.

….

ఆ క్రమంలో నా జీవనయానం లో ముఖ్యమయిన భాగాన్ని ఆక్రమించింది ఫిల్మ్ సొసైటీ ఉద్యమమే. ఫిలిమ్ భవన్ నిర్మాణం తర్వాత మొదటి రెండు జాతీయ స్థాయి డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్ ఫెస్టివల్స్ విజయవంతమయ్యాక ఇక పోటీ ఉత్సవాలు నిర్వహించాలనుకున్నాం. దానికి ఏర్పాట్లు చేయడం మొదలు పెట్టాం. ఇంతలో మా కఫిసో కార్యవర్గం లో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. కొంత కొత్త నీరు రావాల్సిన అవసరం వుందని నేను భావించాను. అందుకోసం ఇద్దరిని కొత్తగా కార్యవర్గం లోకి సభ్యులుగా తీసుకున్నాం. మా టి.రాజమౌళి అంటూనే వున్నారు ‘ఆనంద్ సార్ కొత్త వాళ్ళు అంటున్నారు జాగ్రత్తగా ఆలోచించండి. కఫిసో లక్ష్యాలు, మీ కమిటెడ్ పని తీరుకు సరిపోతారో లేదో చూడండి అని’. కానీ నేనెందుకో ఆయన సూచనల్ని అంతగా పట్టించుకోలేదు. కొత్త రక్తం, కళాకారులు కావాలి అన్నాను. పేర్లెందుకు కానీ ఆ ఇద్దరి కారణంగానే అనంతర కాలంలో అనేక మార్పులు జరిగి కఫిసో తన దారి మార్చుకుంది. నేను తప్పుకోవాల్సి వచ్చింది. నా కొత్త దారి నేను వేసుకుని ముందుకు సాగాను.’జీవన్ చల్నే కా నామ్ చల్తే రహే సుభహో శ్యామ్’ కదా.

అదంతా అట్లా వుంచితే మూడవ జాతీయ షార్ట్ అండ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఎంట్రీల్ని ఆహ్వానించాము.బహుమతులు అందుకున్న సినిమాలకు  ‘పాలపిట్ట’ పేర అవార్డులు ఇవ్వాలని నిర్ణయించాము. మొదట ఇండియన్ రొల్లర్ అవార్డ్స్ అనుకున్నాం. కానీ పాలపిట్ట సరయిందని వచ్చిన సూచనల్ని ఆమోదించాము. ఫెస్టివల్ ని NSDFF, KARIMNAGAR అని పిలిచాం. ఉత్సవాన్ని 2009 ఫిబ్రవరీ 19-20 తేదీల్లో నిర్వహించాలనుకున్నాం. పోస్టర్ తయారు చేయించాము. మా మిత్రుడు ఆస్థాన చిత్రకారుడు అయిన శ్రీ అన్నవరం శ్రీనివాస్ దాన్నిరూపొందించగా కఫిసో సలహాదారు శ్రీ నారదాసు లక్ష్మణ రావు చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఫిల్మ్ భవన్ లో జరిగిన ఆనాటి సభలో కోల రాంచంద్రా రెడ్డి, ప్రభాకర్, టీటీ రావు తదితరులు హాజరయ్యారు.

ఈ చిత్రోత్సవానికి మొత్తం 41 సినిమాలు ఎంట్రీలుగా వచ్చాయి. వాటిల్లో 7 తెలుగుతో పాటు అయిదు చొప్పున ఇంగ్లీష్, మలయాళం, హిందీ, బెంగాలీ భాషలవి, కాగా మూడు మూకీలు, రెండేసి కన్నడ,తమిళం,జార్ఖండ్ భాషలవి, రాజస్థానీ, జపనీస్, అస్సామీ వి ఒక్కొక్కటి చొప్పున వచ్చాయి. వీటిల్లో దాదాపు అన్నింటికీ వాయిస్ ఓవర్ లేదా సబ్ టైటిల్స్ ఇచ్చారు. ఈ ఉత్సవంలో న్యాయ నిర్ణేతలుగా నా ఆహ్వానం మేరకు సుప్రసిద్ద రచయిత, సినీ దర్శకుడు శ్రీ అక్కినేని కుటుంబరావు, రాకేశ్ అంబటి, డాక్టర్ టి.దామోదరస్వామి వ్యవహరించారు. వారు ముగ్గురూ ఎంట్రీ సినిమాల్ని చూసి చర్చించి విజేతల్నినిర్ణయించారు. ఇందులో ముఖ్యంగా జ్యూరీ అధ్యక్షుడిగా వున్న శ్రీ కుటుంబరావు గారు ప్రధాన భూమికను పోషించారు.జ్యూరీ మేమిస్తానన్న అవార్డులే కాకుండా మమ్మల్ని ఒప్పించి మొత్తం ఎనిమిది అవార్డుల్ని ప్రకటించారు. ముగింపు సభలో కుటుంబరావు గారు విజేతలయిన సినిమాల  గురించే కాకుండా మొత్తం సినిమా అంటే ఏమిటి మంచి సినిమాలు ఎట్లావుండాలి, డాక్యుమెంటరీ ల లక్ష్యాలేమిటి అన్న అనేక అంశాల మీదా సాధికారక ప్రసంగం చేశారు. పాల్గొన్న కఫిసో సభ్యులు పోటీకి వచ్చిన ఫిల్మ్ దర్శకులు గొప్ప ప్రేరణ పొందారు. విజేతల్లో సుమా జోసెఫ్ తీసిన ‘ ఐ వాంట్ మీ ఫాదర్ బాక్, యాదవన్ చంద్రన్ మల్లికా సారాభాయి లు సంయుక్తంగా రూపొందించిన ‘సోల్ వాయిస్ సోలో వాయిస్’, రాజా దండపాణి దర్శకత్వం వహించిన ‘లెవెల్ క్రాసింగ్’, మేఘనాథ్, బిజూ బొప్పాలు తీసిన ‘ఐరన్ ఈస్ హాట్’ లు బహుమతులు గెలుచుకోగా, మెరిట్ సర్టిఫికెట్స్ పొందిన వాటిల్లో ‘బియాన్ద్ డ హారిజన్’, జయరాజ్ తీసిన ‘నాదమృదంగం’, పోల్సాని వేణుగోపాలరావు తీసిన ‘ఇదీ నాజీవితం’. అట్లా మొత్తంగా మూడవ జాతీయ చిత్రోత్సవం వైభవంగా సాగింది. అందరమూ ఎంతగానో సంతృప్తి పొందాము.

….

మూడవ చిత్రోత్సవానికి ముందే నవంబర్ 8,9 తేదీల్లో ఫిల్మ్ సొసైటీ నిర్వహకుల కోసం రెండు రోజుల రెసిడెన్షియల్ వర్క్ షాప్ నిర్వహించాం. దానికి ముంబై కి చెందిన ఆసియన్ ఫిలిమ్ ఫౌండేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా అందించిన సహకారం గొప్పది. అందులో ముఖ్యంగా సంస్థలతో పాటు వ్యక్తులుగా ముంబై కి చెందిన సుధీర్ నంద్గాంవకర్, బెంగళూరుకు చెందిన హెచ్.ఎన్.నరహరి రావు, హైదరాబాద్ కు చెందిన బి.హెచ్.ఎస్.ఎస్.ప్రకాష్ రెడ్డి గార్ల సహకారం చొరవ ఎంతగానో ప్రశంసనీయమయింది. ఈ వర్క్ షాప్ ముఖ్యంగా ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో పని చేస్తున్న ఫిలిమ్ సొసైటీ ల్లోని కార్యకర్తల్లో అవగాహన పెంపొందడానికి, భావాల పరస్పర ప్రసారానికి, చైతన్యం పెంపొందడానికి ఏర్పాటు చేశాం. మన దేశంలో

అప్పటికి ఫిల్మ్ సొసైటీ లది దశాబ్దాల చరిత్ర. సత్యజిత్ రే దీపధారుడిగా 1959 లో ఫెడరేషన్ ఏర్పాటయింది. మొదట అందులో కేవలం 7 సొసైటీలు మాత్రం వుండేవి.అనంతర కాలంలో అనేక మంది ఉత్సావంతుల కృషి ఫలితంగా 2007 నాటికి దేశవ్యాప్తంగా నాకు తెలిసి 300 కు పైగా ఫిల్మ్ సొసైటీలు ఏర్పాటయ్యాయి.ఫిల్మ్ సొసైటీల ఉద్యమాన్ని జాతీయ సాంస్కృతిక నిర్మాణంలో భాగంగా గుర్తించిన భారత ప్రభుత్వం వాటిని ఆర్థికంగానూ హార్దికంగానూ ప్రోత్సహించింది. సినిమాల విషయంలో 80ల్లో వచ్చిన రంగుల టీవీలు, తర్వాత వచ్చిన సీడీ, డీవీడీ లు పెద్ద ప్రభావాణ్ణే చూపాయి. ఫలితంగా ఫిల్మ్ సొసైటీ ఉద్యమం కూడా ఆటుపోట్లకు గురయింది. ఆ నేపధ్యంలో ఫెడరేషన్ కరీంనగర్, కోయంబత్తూర్, మైసూరు లల్లో ఆయా ప్రాంత  ఫిల్మ్ సొసైటీల కార్యకర్తలు ప్రేరణాత్మక శిక్షణ ఇచ్చేందుకు ఈ వర్క్ షాప్స్ ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యంగా కొత్తగా సొసైటీల్ని స్థాపించడం, ఉత్తమ సినిమాల ఎంపిక, వాటి ప్రదర్శన, చర్చలు, సెమినార్స్, ఫిల్మ్ కోర్సుల నిర్వహణ, అప్రిసియేషన్ కోర్సుల ఏర్పాటు మొదలయిన అనేక అంశాల పైన ప్రేరణాత్మక ఉపన్యాసాలు ప్రేసెంటేషన్స్ నిర్వహించారు. ఈ రెండు రోజుల కార్యశాలలో కరీంనగర్, వరంగల్, సిరిసిల్లా, మంచిర్యాల తోపాటు రాష్ట్రం లోని అనేక ప్రాంతాల నుండి కార్యకర్తలు వచ్చి పాల్గొన్నారు. ఈ వర్క్ షాప్ లో ఏం.వి.రఘు, జార్జ్ కుట్టి, ఆర్.మణి తదితరులు పాల్గొన్నారు. ఆ కార్యశాల గొప్ప ఉత్సాహ భరితంగా సాగింది. ఇందులో మా కఫిసో నుండి కోల రాంచంద్రా రెడ్డి, మాటేటి ప్రభాకర్, డాక్టర్ రావికంటి మురళి, రఘురాం తదితరులు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.

కఫిసో లో ప్రారంభమయిన ఆ కార్యశాలల పరంపర అనేక కాలేజీ కాంపస్ లల్లో కాంపస్ ఫిల్మ్ క్లబ్స్ ఏర్పాటు చేసిన సందర్భంగా నేను రాష్ట్రవ్యాప్తంగా తిరిగి నిర్వహించాను. ఆ వివరాలన్నీ క్రమంగా రాస్తాను.

ఇప్పటికీ సెలవు…

-వారాల ఆనంద్

18 జూన్ 2023       

శతవంతాల మాస్టర్ ఫిలిం మేకర్ ‘మృణాల్ సేన్’

Posted on

శతవంతాల మాస్టర్ ఫిలిం మేకర్ ‘మృణాల్ సేన్’

(14 మే నుంచి ఆయన శతవంతాల సంవత్సరం )

-వారాల ఆనంద్

      భారతీయ నవ్య సినిమా ప్రపంచానికి ఆధునికతను, ప్రగతి శీల భావనలను, సామాజిక  వ్యాఖానాన్ని జోడించి ఆవిష్కరించిమ సినీ వైతాళికుడు మృణాల్ సేన్. తన సినీ జీవిత మొదటి రోజుల్లో ఆయన సామాజిక వాస్తవవాద దృక్పథం తోనూ, అనంతర కాలంలో  అంతర్ముఖీనుడై తనదై న ఆధునిక సినిమా భాష్యం తో సినిమాలు తీసి లెజెండరీ ఫిలిం మేకర్ గా నిలిచాడు. తన సినిమాల్లో  సెల్ల్యులాయిడ్ పైన తన తాత్వికతను ఆవిష్కరించిన వాడు సేన్. కలకత్తా నగరం భాతీయ సినిమా రంగానికి అందించిన ముగ్గురు  ఫిలిం మేకేర్స్ గురించి ఆలోచనరాగానే ట్రయాలజీ లాగా రిత్విక్ ఘటక్, సత్యజిత్ రే మృణాల్ సేన్ స్పురణకు వస్తారు. అయితే ముగ్గురూ తమ తమ పాయింట్ ఆఫ్ వ్యూ లో సినిమాలు తీసి తమదయిన కిరస్మరణీయమయిన ‘సంతకాన్ని’ ఇండెలిబుల్ సిగ్నేచర్ ని లిఖించి పోయారు.

మే 14 మృణాల్ సేన్ నూరవ జయంతి. ఆయన ఇప్పుడు మానమధ్య లేకున్నా తన సృజనాత్మక జీవితంతో మన మధ్యే వున్న ‘నూరేళ్ళ యువకుడు’ ఆయన.

మృణాల్ సెన్ Sir Charles Chaplin, Sergei Eisenstein, Vittorio De Sica and Jean Luc Godard.లాంటి దర్శకుల సినిమాల తో ప్రభావితుడయిన వాడు. అంతే కాదు  Akira Kurosawa సినిమాల్ని కూడా అమితంగా అభిమానించేవాడు.

 ‘ కొత్త భావనలు, కొత్త ఆలోచనలు కలిగించడానికి,  వాటిని అభివృద్ది పరిచి వాటి ద్వారా కళాత్మక ఆనందం పంచడానికి సినిమా కృషి చేయాలి. అంతే తప్ప కేవలం సాంకేతిక మాయాజాలంతో మాజిక్కులు సృష్టించడం సినిమా పని కాదు’ అని విశ్వసించిన వాడు ఆయన. తన నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానం లో మృణాల్ సెన్  ౩౦కి పైగా సినిమాలు రూపొందించాడు. తన తొలి నాళ్ళల్లో ఆయన తీసిన ఇంటర్వ్యూ, కలకత్తా 71, పదాతిక్ సినిమాల ట్రైయాలజీ తో ఆయన ప్రగతిశీల రాజకీయ భావాలు కలిగిన  దర్శకుడిగా నిలబడ్డాడు. వామపక్ష భావాల్ని  అభిమానించిన మృణాల్ సెన్ కి కలకత్తా యే చిరునామా. అక్కడి వీధుల్ని, మనుషుల్నీ, వారి తత్వాల్నీ పరిశీలించడమే కాదు వారిలో మమేకమయి దృశ్యాల్ని చిత్రబద్దం చేశారు. మృలాల్ దా  అని అందరూ ఆప్యాయంగా పిలుచుకునే మృణాల్ సెన్ సహచరి గీత సెన్ గొప్ప నటి.  

    మృణాల్ సెన్  1923  మే 14 న తూర్పు బెంగాల్ (ప్ర స్తుతం బంగ్లాదేశ్) లోని ఫరీద్పూర్ లో జన్మించాడు. తన ఇంటర్ విద్య పూర్తి చేసుకొని కలకత్తా చేరుకున్నాడు. మృణాల్ సేన్ తన యవ్వన దశలోనే స్పానిష్ సివిల్ వార్, ఫాసిస్ట్ వ్యతిరేక పోరాటాల తో అమితంగా  ప్రభావితుడయ్యాడు.  సేన్ ఎస్ ఎఫ్ ఐ సంస్థలో కార్యకర్తగా పనిచేసాడు. తన కార్యరంగాన్ని పూర్తిగా ఇండియన్ పీపుల్స్ థియేటర్ తో పెన వేసుకున్నాడు. అక్కడే పరిచయమయిన గీతా ను ప్రేమించి పెళ్లి  చేసుకున్నాడు.

    డిగ్రీ చదువు పూర్తి అయిం తర్వాత సేన్ ఆర్ధిక స్థితి దయనీయంగా ఉండేది. రోజూ తన సమయాన్ని అధిక శాతం ఇంపీరియల్ లైబ్రరీలో గడుపుతూ సినిమా కు సంబంధించన అనేక పుస్తకాలు చదవడం తో పాటు చార్లీ చాప్లిన్ పైన ఒక పుస్తకం కూడా రాసాడు. 1947 రే, చిదాదాండ్ దాస్ గుప్తా, నిమాయ్ ఘోష్ ల తో కలిసి కలకత్తా ఫిల్మ్ సొసైటీ ఏర్పాటు చేసి దాని వెలుగున అనేక గొప్ప సినిమాల్ని చూశాడు. ప్రపంచాసినిమా తో పరిచయం అవగాహన ఫిల్మ్ సొసైటీ తోనే కలిగింది. పారడైస్ కేఫ్లో ఘటక్ రే తదితరులతో పాటు సినిమా చర్చల్లో పాల్గొనే వాడు. 1952 దేశంలో మొట్టమొదటి సారి జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో రషోమాన్, ఓపెన్ సిటీ, బైసికిల్ తీఫ్ లాంటి సినిమాలు చూసి తన దృక్పధానికి పదును పెట్టుకున్నాడు మృణాల్  సేన్. 1956 తన మొదటి సినిమా ‘రాత్ భూరు’ రూపొందించాడు. తన మొదటి ప్రయత్నాన్ని విఫల ప్రయత్నం గానే మృణాల్  సేన్ భావించినప్పటికి తర్వాత సేన్ ‘నీల్ ఆకాశార్ నీచే’ రూపోనించాడు.  చైనా యువకుడికి బెంగాల్ యువతికి నడుమ జరిగిన ప్రేమ అనుబంధాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమా నిర్మించాడు. ప్రధాని  నెహ్రూ ఆ  సినిమాను గొప్ప సినిమా గా అభినందించాడు. తర్వాతి కాలం లో చైనా యుద్ధ సమయంలో ఆ  సినిమాను నిషేదించారు.   

‘బైసే శ్రావణ్’ మృణాల్ సేన్ తీసిన మూడవ సినిమా. వెనిస్, లండన్ తదితర ఫెస్టివల్స్ లో ప్రశంసల్ని అందుకుంది ఆ సినిమా.

 ఆ తర్వాతి కాలంలో ఫ్రెంచ్ మాస్టర్స్ ప్రభావం తో మృణాల్ సేన్ సినిమా నిర్మాణ సరళి లో  పెద్ద మార్పు వచ్చింది. వివరణాత్మక ధోరణి నుండి వైదొలిగి తనదయిన క్లాసిక్ ధోరణికి మారిపోయాడు. తర్వాత ఉన్నత వర్గాల పైన పేరడీ గా సేన్ 1965 లో ‘ ఆకాష్ కుసుం’ సినిమా నిర్మించాడు. తర్వాత ఒడియా భాషలో సేన్ ‘ మథిర మనిష’ సినిమా తీసాడు.

       1969 లో మృణాల్ సేన్ ‘ భువన శోం’ రూపొందించాడు. అది మృణాల్ సిగ్నేచర్ ఫిలిం గా మిగిలిపోయింది. ఉత్పల్ దత్ , సుహాసిని మూలే లు ప్రధాన పాత్రల్ని ధరించిన ఈ సినిమా ప్రముఖ రచయిత బలాయి చంద్ ముఖోపాధ్యాయ్  రాసిన చిన్న కథ ఆధారంగా నిర్మించబడింది. గ్రామీణ నగరాల నడుమ ఉండే అంతరాల్ని, మోనో టానీ , ఒంటరితనం తదితర అనేక అంశాల్ని ఆవిష్కరించిన హిందీ సినిమా అది. భారతీయ నవ్య సినిమా చరిత్రలో భువన శోం ది  గొప్ప స్థానం.  అందులో సెన్ ప్రధానంగా వ్యంగ్యాన్ని ప్రధానంగా వాడుకుని సమాజం లోని డొల్ల తనాన్ని చూపించాడు. ఈ సినిమా సెన్ సేనిమాల్లోకెల్ల ఆర్థికంగా గొప్ప విజయ వంతమయిన సినిమా. అంతే కాదు ఈ సినిమాకు మరో ప్రత్యేకతకూడా వుంది ‘సాత్ హిందూస్థానీ’తో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించాముందే అమితాబ్ బచ్చన్ ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పాడు. కేవలం 300 రూపాయల పారితోషకమ్ తో ఈ సినిమాకు అమితాబ్ డబ్బింగ్ చెప్పాడు. ఇదిప్పుడు ఎంతో ఆసక్తికరంగా వుంటుంది.

ఆ తర్వాత మృనాల్ సేన్ తన రాజకీయ విశ్వాసాల బహిరంగ ప్రకరణలు గా చెప్పుకొనే కలకత్తా ట్రిలోజీ సినిమాలు వచ్చాయి. అప్పటి కలకత్తా నగరంలో పెల్లుబికిన రాజకీయ అంతర్మధన స్థితులు, ఉడికిపోతున్న సామాజిక స్థితిగతుల్ని ఈ మూడు సినిమాలు గొప్పగా ప్రతిభావంతంగా చూపించాయి. మొదట 197౦ లో ‘ ఇంటర్వ్యు’ వచ్చింది. 72 లో ‘ కలకత్తా 71 ‘ ,  73 లో ‘ పదాతిక్ ‘ లు వచ్చాయి. ఈ మూడు సినిమాలు కమ్యునిస్టు పార్టీలో వచ్చిన విభజన, ఎగిసిన నక్సలైట్ ఉద్యమం నేపధ్యంలో రూపొందాయి. అత్యంత విశ్లేషనాత్మకంగా నిర్మాణమయిన ఈ సినిమాలు ఆనాటి పరిస్థితులను ఆవిష్కరించాయి.

తర్వాత సేన్  74   లో ‘కోరస్’ సినిమా తీసాడు అది జాతీయ స్థాయిలో ఉత్తమ సినిమా గా అవార్డును గెలుచుకొంది.

1976 లో మృణాల్ సేన్ తీసిన ‘ మృగయా’ 1930 ల నాటి స్థితిగతుల పైన తీసిన సినిమా. అడవిలో మనుషుల్ని చంపుతూ వున్నా మృగాల్ని చంపితే ఓ యువకునికి బహుమతిచ్చిన వారే మనుషుల్ని పీక్కు తింటున్న మానవ మృగాన్ని చంపితే ఉరి శిక్ష వేస్తారెండదుకని ప్రశ్నిస్తాడు సేన్. కె. రాజేశ్వర్ రావు నిర్మించిన ఈ సినిమాకు ఒడియా రచయిత భగవతీ చరణ్ పాణిగ్రాహి రచించిన నవల మూలం. ఈ సినిమా చొసిన తర్వాత నేను అత్యంత ఆశ్చర్యానికి గురయ్యాను. ఇది  సరిగ్గా ప్రసిద్ధ తెలుగు కథా రచయిత కాళీపట్నం రామారావు మాస్టారి ‘యజ్ఞం’ కథను గుర్తుకు తెస్తుంది. మిథున్ చక్రవర్తి మొట్ట మొదటిసారిగా నటించిన  ఈ సిన్మాకు ఆయనకు ఉత్తమ నటుడి అవార్డు కూడా వచ్చింది.

ఈ సినిమా తో నాకో గొప్ప సరదా అనుభవం కూడా వుంది. 1982-83 ప్రాంతం లో వేములవాడలో ఫిలిమ్ సొసైటీనడిపిస్తున్న కాలంలో మృగయా బుక్ చేశాం, అప్పుడు సికిందరాబాద్ నుండి బస్ లో ప్రింట్ రావాలి. ఆదివారం ఉదయం షో వేయాలి. టాకీసు ఫిలిమ్ ఆపరేటర్కి శనివారం ప్రింట్ వస్తుందని చెప్పాం. రాత్రి 9 గంటలకు వచ్చే సూపర్ ఎక్స్ ప్రెస్ కోసం ఎదురు చూసి ప్రింట్ ను టాకీసుకు పంపించేసి ఇంటికి వెళ్ళాం. మర్నాడు ఉదయమే ఆపరేటర్ ఫోన్ మీరు చెప్పిన సినిమారాలేదు. వేరేదేదో మేరీ గాయ్  వచ్చింది అన్నాడు. మాకు ఒకటే  కంగారూ. ఆఘ మేఘాల మీద నేనూ రవీంద్ర వెళ్ళాం. బాక్స్ మీద ఇంగ్లీషులో MRIGAYA అని వుంది. ఆపరేటర్ కు వచ్చిన ఇంగ్లీష్ తో పుట్టిన కంగారూ అది. సరదా సంఘటన. కలకత్తా ఫెస్టివల్ లో ఒకాసారి మృణాల్ సేన్ ను కలిసి నమస్కారం పెట్టుకున్నాను. మరోసారి హైదరబాద్ ఫెస్టివల్ లో ‘నవ్యచిత్ర వైతాళికులు’ పుస్తకం ఇస్తే తెలుగులో వుంది కదా అని నన్ను అభినందించారు. అవీ సేన్ ను కలిసిన సందర్భాలు.    

 ఇక తెలుగులో మృణాల్ సేన్ ‘ ఒక ఊరి కథ’ తీసాడు. మున్షి ప్రేమ చంద్ కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు తిక్కవరపు పట్టాభి రాం రెడ్డి నిర్మాత.

తర్వాత సేన్ ‘ఏక దిన్ ప్రతిదిన్’ , ‘ అకాలేర్ సంధానే’, ‘చల చిత్ర’, ‘ఖరీజ్’, ‘ఖండహార్’ తదితర సినిమాల్ని తీసాడు. ఇక ఫ్రెంచ్ ప్రభుత్వ సహకారం తో ఆయన తీసిన ‘జెనెసిస్’ రాజస్థాన్  ఎడారుల్లో నిర్మితమయి వినూత్న సినిమా గా పేరొందింది. ఇక బెర్లిన్ గోడ పగులగొట్టడం, తూర్పు యూరప్ దేశాల్లో కమ్యునిజం విఫలం చెందడం తదితర నేపధ్యాలతో సేన్ తీసిన సినిమా ‘మహా పృథ్వీ’. కలకత్తాలోని ఒక మధ్యతరగతి కుటుంబ నేపధ్యంలోంచి అంతర్జాతీయ రాజకీయాల్ని సేన్ చర్చిస్తాడు. తర్వాత తన 76   ఏళ్ల వయసులో సేన్ ‘ అంతరీన్’ సినిమా తీసాడు.

తన మొత్తం సినిమా  కారీర్ లో 27 ఫీచర్ ఫిలిమ్స్, 13 ఎపిసోడ్స్ టివి సీరియల్ తీసిన మృణాల్ సేన్ ప్రపంచ వ్యాప్తంగా సినిమాకు సంబంధించి భారతీయ ప్రగతి శీల సంతకం. ఎన్నో ఫిలిం ఫెస్టివల్స్ లో ఆయన సినిమాలు ప్రదర్శించబడి అవార్డులు అందుకున్నాయి. దేశంలో కూడా జాతీయ స్థాయిలో ఆయన సినిమాలు తమ ప్రత్యేకతను చాటుకున్నాయి. ఫిలిం సొసైటీ ఉద్యమంలో కూడా ఆయన కృషి గొప్పది.

    ఈ సంవత్సరం మృణాల్ సేన్ శతజయంతి సంవత్సరంగా ప్రపంచంలోని మంచి సినిమా అభిమానులంతా నిర్వహించుకుంటున్నారు.

భారతీయ సినిమాకు సంబంధించి ఆయన ఓ లివింగ్ లెజెండ్ అయిన

మృణాల్ దా ని ఆయన సినిమాల్ని మరోసారి గుర్తు చేసుకుందాం.  

-వారాల ఆనంద్

శతవంతాల మాస్టర్ ఫిలిం మేకర్ ‘మృణాల్ సేన్’