Month: March 2024

‘జ్ఞానం’ కవిత

Posted on

మిత్రులారా! ఈ రోజు ‘నమస్తే తెలంగాణ’ లో అచ్చయిన కవిత చదవండి- ఆనంద్

‘జ్ఞానం’
+++++ వారాల ఆనంద్

ఈ మనిషినెక్కడో చూసాను
చిరపరిచితమయిన ముఖమే
బస్టాండ్లో, మెట్రోలో, ఫుట్ పాత్ పైనా చూసాను
పాతబజార్ గల్లీల్లో లైబ్రరీ పుస్తకాల నడుమా చూసాను

చాలా దగ్గరగానూ దూరంగానూ
దట్టమయిన అడవిలో, విశాల మైదానంలో చూసాను

సురసుర మండే ఎండలో చిటపట కురిసే వానలో
గజ గజ వణికే చలిలో
తడుస్తూనో ముడుచుకునో ఉసూరుమంటూనో వుంటే చూసాను

కానీ మబ్బులు కమ్మిన చంద్రుడిలా
పొగమంచు కమ్ముకున్న రహదారిలా
రూపం స్పష్టంగా కనిపించడం లేదు
ఆ ముఖం అందమయిందా కురూపా

చూసిన మనిషే తెలిసిన ముఖమే
ఎటూ పాలుపోక ఊరంతా తిరిగీ తిరిగీ
ఉసూరుమంటూ ఇల్లు చేరాను
ఎవరతను?
మెదట్లో పురుగు తొలుస్తూనే వుంది

అకస్మాత్తుగా నిలువుటద్దంలోకి చూసాను
అరె నేను చూసిన ముఖమీదే
చిరపరిచితమయిన మనిషితనే

నన్ను నేను తెలుసుకున్నా
నాలాంటివాళ్లూ అర్థమయ్యారు

పొరలు పొరలుగా తెరలుగా
‘జ్ఞానం’ వికసించింది

******************** 24-03-2024

YADONKI BARATH 2-series,Bo-11

Posted on

యాదోంకీ బారాత్

 2- సిరీస్- నంబర్ 11 

++++++++++++++++ వారాల ఆనంద్

జీవితం సరళరేఖ కాదు. తిన్నగా సాగడానికి. జీవితం నునుపయిన రహదారీ కాదు సాఫీగా నడవడానికి.  అనేక వంకరలు, వంపులు మలుపులు అనివార్యం. వాటన్నింటినీ దాటుకుంటూ మెలకువతో ముందుకు పయనించడమే జీవితం.

ఆ ప్రయాణానికి “ఎంట్రీ-ఎగ్జిట్” రెండూ వుంటాయి. మాతృగర్భంలోంచి మొదలయిన బతుకు ప్రవేశం(ఎంట్రీ) ఉత్సాహంగా ఆశలతో కలల్తో షురూ అవుతుంది. కానీ నిష్క్రమణే (ఎగ్జిట్) ఎవరిది ఎట్లా వుంటుందో ఏమిటో ఎవరమూ ఊహించలేం. ఎంట్రీ ఎగ్జిట్ లు రెండూ బాగుండాలనుకుంటాం. ఎవరమయినా ఎగ్జిట్ సంతోషంగా వుండాలనీ ఆశిస్తాం.

అది జీవితానికే కాదు బతుకులో ఏ ఉద్యోగానికయినా, వృత్తికయినా, మరే పనికయినా అంతే. ఎంట్రీ ఎగ్జిట్ అత్యంత ప్రధానమయినవి.

 నా ఉద్యోగ జీవితం ఎంట్రీ కొంత ఇష్టాయిష్టాల మధ్య 1980లో మొదలయింది. అనేక మలుపులతో 36 ఏళ్ళు గడిచాక 2016లో ఉద్యోగవిరమణ ఎగ్జిట్ సంవత్సరంలోకి చేరాను. అప్పటికి ఆ ప్రయాణం వివిధ కాలేజీల్లో అనేక మలుపులతో సాగిగింది. కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలోకి 2000 సంవత్సరంలో ఎంట్రీ జరిగి పదహారేళ్లు కొనసాగింది. అదే కాలేజీలో డిగ్రీ చదివిన పూర్వ విద్యార్థిగా ఎంతో ఉద్వేగంగా ఆ ప్రయాణం మొదలయింది. గ్రంధాలయ నూతన భవన నిర్మాణంలోనూ, అభివృద్దిలోనూ, విద్యార్థుల బహుముఖీన ఎదుగుదలకూ కొంత కృషి చేశాననే తృప్తి తోనే కాలేజీ ప్రయాణం సాగింది. మొత్తంగా ఇటు కాలేజీలో అటు బయటా సృజనాత్మక, సామాజిక రంగాల్లో పని చేయడానికి కాలేజీ, కాలేజీ మిత్రులూ నా వెన్నంటి వున్నారు. చేయిపట్టుకు  ముందుకు నడిపించారు.    

ఆ నడకలో ఓ ‘మెరుపు’ మెరిసింది. నాలోనూ మెరిసింది. ఉత్తర తెలంగాణా సాహిత్య ప్రపంచంలోనూ మెరిసింది. ఒక రోజు హైదరాబాద్ నుంచి ఆంధ్రభూమి సంపాదకులు శ్రీ ఏం.వి.ఆర్.శాస్త్రి, కవి మిత్రుడు ఆచార్య జయధీర్ తిరుమల రావు, నిజాం వెంకటేశంలు మేమంతా వస్తున్నాము. కరీంనగర్ లో కవులు రచయితలతో ఒక సమావేశం ఏర్పాటు చేయండి అన్నారు. అది నాతో ఎందుకన్నారో నాకు తెలీదు. శాస్త్రి గారికి నాకు అంతకు ముందు పరిచయమే లేదు. నా పేరు ఎవరు చెప్పారబ్బా అని ఆలోచించాను. బహుశా జింబో అని వుంటాడు. ఏది ఎట్లా అయితేనేం. మా ఫిల్మ్ భవన్ లో ఒక సమావేశం ఏర్పాటు చేశాను. సాహితీ మిత్రులందరికీ సమాచారం ఇచ్చాను. ఎంతమంది స్పందిస్తారో తెలీదు. ఎంతమంది వస్తారో ఊహించలేను. చూద్దాం అనుకున్నాను. సమావేశం సమయానికల్లా అనేక మంది  పెద్దలు, కవులు రచయితలు వచ్చారు. సమావేశంలో ఎం.వీ.ఆర్.శాస్త్రి గారు మాట్లాడుతూ ఆంధ్రభూమి జిల్లా ఎడిషన్లో వారం వారం రెండు పేజీలు సాహిత్యానికి కేటాయిస్తున్నామన్నారు. అంతే కాదు ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన సాహిత్యకారుల రచనలకు అందులో చోటు ఇవ్వాలనుకుంటున్నా మన్నారు. ఏమయినా సూచనలు ఇవ్వమన్నారు. డాక్టర్ గండ్ర లక్ష్మణ రావుతో సహా పలువురు మాట్లాడారు. జయధీర్ తిరుమల్ రావు, నిజాం వెంకటేశం గార్లు కూడా మాట్లాడారు. చివరన ఈ సాహిత్య పేజీకి ‘మెరుపు’ అని పేరు పెడుతున్నామన్నారు. ఆ పేజీకి వారాల ఆనంద్ బాధ్యుడుగా వ్యవహరిస్తారని ప్రకటించారు. నాకు కొంత ఆశ్చర్యం, మరికొంత ఆనందం. బాధ్యత తీసుకుంటారుగా అన్నారు శాస్త్రి గారు నేను సరే నన్నారు. దానికి సంభందించిన వివరాలు మాట్లాడదామన్నారు. సాహితీ మిత్రులంతా ఉత్తర తెలంగాణా సాహిత్యానికి ఒక వేదిక లభించినందుకు సంతోపడ్డారు. నాకయితే ఉత్సాహంగానే వుంది. అప్పుడు కరీంనగర్లో ఆంధ్రభూమి ఆఫీసు మా కాలేజీ గేటుకి సరిగ్గా ముందే వుంది. అంతేకాదు దాన్లో డీటీపీ ఆపరేటర్ చంద్రమౌళి గతంలో మా తో ఈనాడు లో పనిచేస్నవాడే. అంతా ఒకే అనుకున్నాం. నెక్స్ట్ వీక్ స్టార్ట్ అంటూ హైదరాబాద్ నుంచి వచ్చినవాళ్లు బయలుదేరారు. ఆంధ్రభూమిలో ప్రకటించారు. నేను వ్యక్తిగతంగా ఉత్తర తెలంగాణ జిల్లాల సాహిత్యకారులను సంప్రదించాను. అంతా ఉత్సాహం చూపించారు. అనేక వారాలు విజయవంతంగా సాగింది. తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న కాలమది. దాంతో నేను ఉత్తర తెలంగాణ జిల్లాల కవులు రచయితల ఇంటర్వ్యూ లు ప్లాన్ చేశాను. అందరినీ సంప్రదించి ప్రశ్నలు పంపాను.చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వారం వారం వేశాను. కవితలు,కథలు, సమీక్షలు ఓహ్ అన్ని కాలమ్స్ కొనసాగాయి. ఆ ఇంటర్వ్యూ లను “మెరుపు” పేర పుస్తకంగా తెచ్చాను. ఆ ఇంటర్వ్యూల్లో జింబో, దర్భశయనం, నలిమెల భాస్కర్, చొప్పకట్ల చంద్రమౌళి, అంపశయ్య నవీన్, తుమ్మేటి, వఝల శివకుమార్ తదితర అనేక మందితో చేసిన ‘ముఖా ముఖి’ ఇంటర్వ్యూలు ప్రచురించాను. దానికి 23 ఏప్రిల్ 2016 రోజున ఫిల్మ్ భవన్ లో ఆవిష్కరణ. సాహితీ గౌతమి నిర్వహణ. ఆవిష్కర్తగా కరీంనగర్ లో కలెక్టర్ గా పనిచేసి ఫిల్మ్ భవన్ నిర్మాణం లోనూ, కాలేజీ గ్రంధాలయ భావన నిర్మాణంలోనూ నాకు ఎంతగానో సహకరించిన మంచి మనిషి శ్రీ సి.పార్థసారధి గారిని పిలిచాను. ఆయన ఎంతో ఉత్సాహంగా రావడానికి అంగీకరించాడు. వచ్చారు కూడా. కె.ఎస్. అనంతాచార్య అధ్యక్షతన సభ చాలా ఆసక్తిగా ఆనందంగా జరిగింది. నాకు మెరుపు కోసం ఇంటర్వ్యూలు ఇచ్చిన పలువురు కవులు రచయితలు పాల్గొన్నారు. కవి మిత్రులు శ్రీ వఝల శివకుమార్, జింబో, నలిమెల భాస్కర్, దాస్యం సేనాధిపతి వేదిక మీద వుండి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ‘మెరుపు’ ఆవశ్యకతను ప్రాధాన్యతను గురించి మాట్లాడారు. ఉత్తర తెలంగాణాలో సాహితీ వేత్తలు తెలంగాణ గురించి ఎట్లా ఆలోచిస్తున్నారు, ఎట్లా స్పందిస్తున్నారు అనే విషయాల్ని ఆనాటి సభ విస్తృతంగా చర్చింది. సభలో శ్రీ నమిలకొండ హరిప్రసాద్, డాక్టర్ గండ్ర లక్ష్మణ రావు, పీ.ఎస్., తోట రమేశ్, మచ్చ హరిదాస్, డాక్టర్ రామకృష్ణ,. అన్నవరం దేవేందర్, ఎం.సరస్వతి, నవీన, ఇందిర, రేల తదితరులు పాల్గొన్నారు. పార్థసారధి గారు సాహితీ వేత్తలందరికి మెరుపు పుస్తకాన్ని అందజేశారు.

ఇదంతా ఇట్లా వుండగా అంతకు ముందే నా ‘మనిషి లోపల’ కవితా సంకలనం లోని కవితల్ని మిత్రురాలు బొడ్ల అనురాధ ఇంగ్లీష్ లోకి అనువదించడం ఆరంభించారు. అనురాధ గారు మాకు అత్యంత ఆత్మీయ స్నేహితులు. కరీంనగర్ లో ప్రముఖ విద్యావేత్త కీ.శే.నాగభూషణం గారు మొట్టమొదటి ట్యుటోరియల్ ఏర్పాటు చేసిన విద్యావేత్త. 70ల్లో ఎస్వీటీసీ నోట్స్ అంటే కరీంనగర్ విద్యార్థుల్లో గొప్ప ఆదరణ. వారి కూతురు అనురాధ. తన జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. హై స్కూలు చదువు తర్వాత వివాహమై ఇద్దరు పిల్లల తర్వాత వూహించని ఒంటరి జీవితంలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత దాంతో జీవితం ముగిసిందని ఆమె అనుకోలేదు. పోరాటమే తన జీవితం అనుకుంది. కాలానికి ఎదురొడ్డింది. తన కాళ్లమీద తాను నిలబడి ఉన్నత చదువులు కొనసాగించింది. ఎదురుదెబ్బలు తనకు ఎలాంటి ఆటంకం కావని ఆమె నిరూపించారు. కొంత కాలం మాల్దీవ్స్ కు కూడా వెళ్ళి అక్కడ పనిచేశారు. ఇంగ్లీష్ లో మంచి పట్టు సాధించారు. తనతో మాకున్న దశాబ్దాల స్నేహం, అభిమానంవల్ల ఆమె నా కవితల్ని ఇష్టంగా చదివింది. తనకు నచ్చిన ఆ కవితల్నిఅందంగా అర్థవంతంగా ఇంగ్లీషులోకి అనువదించే పని పెట్టుకుంది. చాలా గొప్ప అనువాదం చేశారామె. ఆ అనువాదాలతో ‘సిగ్నేచర్ ఆఫ్ లవ్’ పేర పుస్తకం తెచ్చాను. పుస్తకం ఆవిష్కరణల విషయంలో మిత్రుడు ఎన్.బి.టి. తెలుగు సంపాదకుడు డాక్టర్ పత్తిపాక మోహన్ సహకరించారు. ఆ సమయంలో తాను హైదరబాద్ లో లేకున్నా ఉస్మానియా కాంపస్లో వున్న తమ ఆఫీసులోని హాలులో ఆవిష్కరణ ఏర్పాట్లు చేశారు. ఆవిష్కరణకు ఆత్మీయ మిత్రుడు నారదాసు లక్ష్మణ రావు ని పిలిచాను. ఆయనకుతోడు డాక్టర్ నందిని సిద్దారెడ్డి, దర్భశయనం శ్రీనివాసాచార్య తదితరులు హాజరయ్యారు. కవిత్వం గురించి సిద్దారెడ్డి, అనువాదం గురించి దర్భశయనం మాట్లాడారు. అనువాదంలో అనురాధ చూపించిన పరిపక్వతని ఆయన సోధాహరణంగా చెప్పారు. ఇంగ్లీష్ పుస్తకానికి న్యాయం చేయడానికి దర్భశయనం సరయిన వాడని సిధారెడ్డి అన్నారు. ఆ తర్వాత ‘సూర్య’ దిన పత్రికలో మిత్రుడు టీవీ9 వొడ్నాల చంద్రమౌళి మంచి సమీక్ష చేశారు. 1990ల నుంచి పరిచయమూ స్నేహమూ వున్న చంద్రమౌళి చాలా సంవత్సరాలు ఈనాడులో సబ్ ఎడిటర్ గా పని చేసారు. వయసులో నాకంటే చాలా చిన్న వాడే అయినా ఇద్దరి నడుమా దగ్గరి స్నేహం అల్లుకుపోయింది. భావుకుడు ప్రగతిశీలవాది అయిన చంద్రమౌళి సిగ్నేచర్ ఆఫ్ లవ్ గురించి రాస్తూ ‘సమాజం పైన కవి వారాల ఆనంద్ చేసిన ప్రేమ సంతకమిది. మనసు నిండా ప్రేమను నింపుకున్న కవి తన కవిత్వం నిండా ప్రేమను నింపడం సహజమే. ఆ ప్రేమ మనుషులపట్ల, సమాజం పట్ల,మనుషుల మనుగడకు ఆధారభూతమయిన భూమి గాలి నీరు పట్ల కనిపిస్తాయి. వారాల ఆనంద్ జీవితం నిండా కవిత్వం కనిపిస్తుంది’ అని రాశాడు. రోజూ కలిస్తేనే స్నేహాలు నిలుస్తాయా… ఎప్పుడో ఒకసారి కలిసే చంద్రమౌళి తో స్నేహం గత మూడు దశాబ్దాలకు పైగా కొనసాగడం లో ఆయన చూపించే ఆప్యాయత ప్రధాన కారణం. ఈనాడు తర్వాత తాను ఎలెక్ట్రానిక్ మీడియాకు వెళ్ళాడు.

ఇక సమీక్షలకు పంపించే క్రమంలో సిగ్నేచర్ ఆఫ్ లవ్ ని ఇండియన్ లిటరేచర్ కు కూడా పంపాను. అక్కడ ఆ పుస్తకాన్ని చూసిన తమిళ కవి, ప్రముఖ అనువాదకుడు చంద్ర మనోహరన్ ఒకరోజు ఫోన్ చేసారు. మీ పుస్తకాన్ని తమిళం లోకి తేవచ్చా అని అడిగాడు. నేను వెంటనే చాలా సంతోషం అన్నాను. తానే దాన్ని తమిళం లోకి అనువదించారు. కేంద్ర సాహిత్య అకాడెమికి అనేక అనువాదాలు చేసిన చంద్ర మనోహరన్ స్వచ్చందంగా ‘అన్బిన్ కైచాంది’ పేర వెలువరించారు.  ఆ అనువాద సంకలనాన్ని తమిళనాడుకు చెందిన ‘ఆర్ట్ లిటరరీ క్లబ్’ ఆవిష్కరించింది. ఆనాటి కార్యక్రమానికి నేను వెల్ల లేదు కానీ ఆ సభలో సంస్థ కార్యదర్శి బి. ఆర్. నటరాజన్,డాక్టర్ సురేష్,డాక్టర్ మీనా సుందర్,డైరెక్టర్ మని, అన్వాదకుడు చంద్రమనోహరన్ పాల్గొన్నారు. ముక్కూ మొహం తెలీని  నేను రాసిన నా కవిత్వాన్ని తమిళంలోకి అనువదించి ప్రచురించిన చంద్ర మనోహరన్ కి ఎంతని ఏమని కృతజ్ఞతలు చెప్పను. ధన్యవాదాలు అంటూ నమస్కరించడం తప్ప.

2016 నాటి మరిన్ని వివరాలతో మళ్ళీ కలుస్తాను..

+++++

వారాల ఆనంద్

24 మార్చ్ 2024   

POEM

Posted on

మిత్రులారా! Pl click the link and read my poem, tq
వారాల ఆనంద్ కవిత :  నా కన్నీ గుర్తే.. https://telugu.asianetnews.com/literature/varala-anand-poems-poetry-krj-sak2qg

CHUKKALA MUGGU ‘POEM’

Posted on

Friends, pl click the link below to read my poem published today in sanchika online magazine, thanks to the editor- anand Anand Varala
https://sanchika.com/chukkala-muggula-va-poem/

యాదోంకీ బారాత్ సిరీస్-2 నంబర్-10

Posted on Updated on

యాదోంకీ బారాత్

సిరీస్-2 నంబర్-10

+++++++++++ వారాల ఆనంద్

ఒక్కోసారి నిలిచిపోవడం/ కాల్రెక్కలు కుదేసినట్టు కూలబడిపోవడం/

మంచిదేనేమో…..

మనిషిదేముంది ఆకులు రాలిన చెట్టులాంటివాడు

ఎండిన మోట బావిలాంటి వాడు మళ్ళీ చిగురిస్తాడు

ఊటలోంచి ఎగిసిపడ్డ తేటనీరులా ఉప్పెన అవుతాడు

ఒక్కోసారి నిలిచిపోవడంలోంచే

ఉవ్వెత్తున ఎగిసిపడటానికి సత్తువ వొస్తుంది 

తలెత్తుక తిరగడానికి ప్రాణమొస్తుంది

…….

బతుకు పరుగులో స్పీడ్ బ్రేకర్ అనుకున్నదాన్ని దాటేశాను. నిజానికి అది దాటగానే రహదారిలో ఓ మలుపు ఎదురయింది. మూల తిరిగి మలుపులోకి ఒకింత ఉత్సాహంగానే తిరిగాను. సమయం లేదు అన్న భావనేదో లోన ఎక్కడో నాకు తెలీకుండానే పని చేసిందేమో. మనిషిగా భౌతికంగా అనేక పరిమితులకు లోబడినప్పటికీ చిత్రంగా నా సృజనాత్మక పరుగు వేగం పెరిగింది. రాతలు, ప్రచురణలు, కాలేజీలో ఆక్టివిటీస్ కొనసాగుతూనే వచ్చాయి. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు ఎన్నారై ల సహకారంతో ఏర్పాటు చేసిన ‘ప్రతిభాపురస్కారాల ప్రదానం’ మా స్టాఫ్ సహకారంతో కొనసాగించాము. ఒక కార్యక్రమానికి కరీంనగర్ శాసనసభ్యుడు శ్రీ గంగుల కమలాకర్ అతిథిగా వచ్చారు. అప్పటికి ప్రిన్సిపాళ్లుగా డాక్టర్ మురలి, డాక్టర్ మధుసూదన్ రెడ్డి లు ఉద్యోగ విరమణ చేశారు. మిత్రుడు భౌతిక శాస్త్ర విభాగం ఇంచార్జ్ శ్రీ పి.నితిన్ ప్రిన్సిపాల్ గా అదనపు బాధ్యతల్ని నిర్వహిస్తున్నాడు. నితిన్ నేనూ గతంలో ఒకసారి హైదరబాద్ లోని ఉర్దూ విశ్వవిద్యాలయంలో మూడు వారాల పాటు రిఫ్రెషర్ కోర్సు చేశాము. రూమ్ మేట్స్ గా వున్నాం. ఆయన అత్యంత నిబద్దత కలిగిన వాడు. ఉద్యోగ బాధ్యతల్లో గానీ తన జీవన సరళి లో కానీ తాను విశ్వసించిన దాన్ని తూచా తప్పకుండా పాటించే వ్యక్తిత్వం ఆయనది. అట్లా ఆయన కాలేజీ బాధ్యతల్ని నిర్వహిస్తున్నప్పుడే పలు కార్యక్రమాలు నిర్వహించాము. ప్రతిభాపురస్కారాల్లో భాగంగా ఒక మెడల్, సర్టిఫికేట్, అయిదు వేల నగదు ఇచ్చేవారం. మొదట అది బయట టెన్త్ క్లాస్ వాళ్ళకు ప్రారంభించి మా కాలేజీకి తెచ్చాను. ఇక నా ఉద్యోగ విరమణకు ముందు లైబ్రరీ సైన్స్ కి సంబంధించి ఒక కార్యక్రమం చేయాలనుకున్నాం. మిత్రుడు శ్రీ చేగొని రవి కుమార్ చాలా ఆక్టివ్ గా వున్నాడు. ఆయన ఒక ప్రతిపాదన తెచ్చాడు‘COLLECTION DEVELOPMENT IN OPEN ACCESS ERA’అన్న అంశం మీద రాష్ట్ర స్థాయిలో సెమినార్ నిర్వహించాలనుకున్నాం. దానికి ప్రధానంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం లైబ్రరీ సైన్స్ ప్రొఫెస్సర్ డాక్టర్ లక్ష్మణ రావు గారిని ప్రధాన వక్తగా పిలిచాము. ఆయన నాకు బి.ఎల్.ఐ.ఎస్సీ. ఏం.ఎల్.ఐ.ఎస్సీ రెండు కోర్సుల్లో టీచర్. కాటలాగింగ్, ఇన్ఫర్మేషన్ సైన్స్ లల్లో ప్రభావవంతంగా బోధించారు. ఆ రోజుల్లో ఏ.ఏ.ఎన్.రాజు, వేణుగోపాల్, సుదర్శన్ రావు, విశ్వమోహన్ లు ఆచార్యులుగా వుండేవారు. మా కాలేజీలో అంతకు ముందెప్పుడో నిర్వహించిన రెండు జాతీయ స్థాయి సెమినార్స్ కి కూడా శ్రీ లక్ష్మణ రావు నాకు మార్గ నిర్దేశకత్వం చేశారు. అట్లా నా రిటైర్మెంట్ కి రోజులు దగ్గరపడ్డప్పటికీ ఆరోగ్య షరతులకు జాగ్రత్తలకు లోబడి ఉత్సాహంగానే అన్ని  కార్యక్రమాల్ని నిర్వహించాను. మిత్రులు ఏర్పాటు చేసిన వాటిలో క్రమం తప్పకుండా పాలు పంచుకుంటూనే వున్నాను. అదట్లా వుండగానే 2016 మార్చ్ లో హైదరబాద్ గ్లోబల్ ఆసుపత్రి నిర్వహణలో గ్లోబల్ కిడ్నీ సప్పోర్ట్ గ్రూప్ ఏర్పాటు చేశారు. నా నెఫ్రాలజీ డాక్టర్ గందే శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటయిన గ్రూప్లో ఉత్సాహంగా పాలు పంచుకున్నాను. కరెంనగర్ లోని ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేశాం. మా ఫిల్మ్ భవన్ నిర్మాణం కాక ముందు తెలంగాణ రచయితల వేదిక ఏర్పాటుతో పాటు నా ‘సినీ సుమాలు’,’24ఫ్రేమ్స్’ పుస్తకాల ఆవిష్కరణ లాంటి అనేక సమావేశాలకు ప్రెస్ క్లబ్ ప్రధాన వేదికగా వుండేది. జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో నిర్మాణ మయి అందరికీ అందుబాటులో వున్న వేదిక ప్రెస్ భవన్. ప్రెస్ భవన్ అనగానే జీవగడ్డ విజయ్ కుమార్ గుర్తొస్తాడు.  

ఇక మా కుటుంబం విషయానికి వస్తే రేల తన సాఫ్ట్ వేర్ ఉద్యోగం క్రమబద్దంగా చేస్తూనే వుంది. ఇందిర ఎజెండా ప్రధానంగా నేనూ నా ఆరోగ్యం. అంతేకాదు ఎన్నో జాగ్రత్తలు. నిలబడితే కూర్చుంటే హెచ్చరికలు చేస్తూ నియంత్రించడం. ఎందుకంటే మనం అంత సులువయిన వాళ్ళం కాదు కదా. చెట్టు దాకా వెళ్లమంటే చెట్టు ఎక్కేసే రకం. ఆ ఏమయితదిలే అనుకునే మనస్తత్వం. ఇందిరే క్షణక్షణం కట్టె పట్టుకోకుండానే హెచ్చరికలు చేస్తూ వచ్చింది. ఇక మా అబ్బాయి అన్వేష్. హైదరబాద్ లో యింటర్ తర్వాత ఎంట్రన్స్ రాసి తిరువనంతపురం లో వున్న ఐ.ఐ.ఎస్.టి.INDIAN INSTITUTE OF SPACE SCIENCE AND TECHNALAGY లో సీటు తెచ్చుకుని ఏవియానిక్స్ లో చేరాడు. నాలుగేళ్ల చదువు పూర్తి అయిన తర్వాత నేను హాస్పిటల్ లోవుండగానే నాన్నా నేను వచ్చేస్తున్నా అన్నాడు ఫోన్లో. సరే రా అన్నాను. అముంది లాగేజీ తో పాటు దిగిపోయాడు. ఏమయింది అంటే నాకా 9-5 జాబ్ ఇష్టం లేదు నేను క్రియేటివ్ రంగంలోకి వెళ్తాను అన్నాడు. ఇందిర మిగతా అంతా కంగారు పడ్డారు. నేను క్షణం ఆలోచించకుండా ఎవరయినా తన కిష్టం అయిన పనిలోనే సంతోషంగా వుంటారు. మనిషికి కావలసింది సుఖం కాదు సంతోషం అన్నాను. అప్పుడే నానిగాడి మీద ఇట్లా రాసుకున్నాను

“ఇన్నాళ్లూ వాడు నాకార్థం కాలే/ అవును ఎవరయినా ఎందుకు అర్థం అవుతారు/ మనం ప్రయత్నిస్తే కదా/ గుండెల మీద పడుకున్ననాడూ, చిటికేన వేలు పట్టుకుని నడిచిననాడూ/       

జబ్బకు సంచీ వేసుకుని స్కూలుకు వెళ్ళిన నాడూ/ ముద్దు మురిపాల ముచ్చట్లే కదా/ ఆనాడు మనకేం అర్థం అవుతాడు… పరీక్షలూ మార్కులూ సీట్లూ ఈ గొడవలో పడ్డప్పుడూ వాడు నాకార్థం కాలే/ కానీ ఇప్పుడు

‘అంతరిక్షం నుంచి సృజన వైపు వాడి ప్రయాణం/

సారీ రా నానీ నువ్వు అర్థం కాలేదనుకున్నా /కానీ నేనే నిన్నర్థం చేసుకోలేదు

నా కలలూ నీ కలలూ ప్రోది చేసుకుని/ విశ్వంలోకి దూసుకెళ్లు

నిన్ను అందరూ అర్థం చేసుకుంటారు’ (మనిషి లోపల)

అన్వేష్ మొదట డ్రాయింగ్,పెయింటింగ్ తర్వాత ఎనిమేషన్ ఇట్లా దృశ్య మాధ్యమంలోనే కాలు మోపాడు. ఏనిమేషన్ లో మిత్రుడు కళ్యాణం శ్రీనివాస్ తో కొంతకాలం నడిచాడు. కానీ వాడి దృష్టి అంతా ‘మూవింగ్ ఇమేజెశ్’ పైనే. కెమెరా పట్టుకుని తిరగడం. మొదట స్టిల్ ఫోటోస్. సిరిసిల్లా వెళ్ళి మిత్రుడు జర్నలిస్ట్ టీ.వీ.నారాయణ తో కలిసి తిరిగి నేత కార్మికులు నేత పని పరిశ్రమల పైన ఒక సిరీస్ తీశాడు. తర్వాత ‘తెలంగాణ పట్నం’. దాని గురించి నేనూ ఇందిర చెప్పగానే మా దగ్గరి ఫామిలీ మిత్రులు లావణ్య రాజయ్య సార్ వాళ్ళ వూరు గంగాధరలో పట్నం పండుగ బాగా చేస్తారని అనగానే రేల అన్వేష్ లు ఇద్దరూ వెంటనే అక్కడికి వెళ్లారు.  పట్నం ఉత్సవాన్ని మొత్తం కలర్ ఫుల్ గా షూట్ చేశాడు. చాలా బాగా వచ్చింది. ఎడిటింగ్ మ్యూజిక్ చేశాక అన్వేష్ పైన నా నమ్మకం రెట్టింపు అయింది. ఇదిలా వుండగానే నాకు అత్యంత దగ్గరి మిత్రుడూ సుప్రసిద్ద కవీ శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్య పైన ఒక డాక్యుమెంటరీ తీస్తే బాగుంటుంది అన్నాను. సరే వెళ్దాం అన్నాడు అన్వేష్. నేను అమెరికా వెళ్తున్నాను ఈలోగా చేయగలిగితే చాలా బాగుంటుంది అన్నాడు దర్భశయనం. నేనూ ఇందిర అన్వేష్ హనుమకొండ వెళ్ళాం. నిజానికి కవిత్వం రాయడం ఎంతో కవిత్వ పఠనం అంతకంటే గొప్ప కళ. అందులో ప్రతిబావంతుడు దర్భశయనం. ఇంకేముంది కాకతీయ విశ్వవిద్యాలయం ఆవరణలోనూ, తర్వాత రామప్ప కూ వెళ్ళి షూట్ చేశాము. రామప్పకూ నేనూ ఇందిరా అన్వేష్, ధర్భశయనం లతో పాటు ఆయన సతీమణి కమల గారు కూడా వచ్చారు. అట్లా షూట్ పూర్తి చేసుకుని ఎడిటింగ్ కూడా చేశాడు అన్వేష్. తర్వాత 8 నవంబర్ 2015 న కరీంనగర్ ఫిల్మ్ భవన్ లో ఆవిష్కరణ చేశాము. మా మిత్రుడు కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి ఆవిష్కరించారు. దాస్యం సేనాధిపతి,ముజాఫ్ఫర్ తదితరులు హాజరయ్యారు. ఆనాటి కార్యక్రమానికి మిత్రులు ఏం.గంగాధర్, అన్నవరం దేవేందర్,పొన్నం, ఆర్.వెంకటేశ్వర్ రావు తదితర మిత్రులు అనేక మంది పాల్గొన్నారు. అట్లా ఆనాటి కార్యక్రమం విజయవంతంగా జరిగింది. డాక్యుమెంటరీ ప్రొజెక్షన్ కూడా వేశాం. పట్నం, బతుకే ఒక కళ లతో అన్వేష్ ఫిల్మ్ మేకింగ్ మొదలయింది. ఆ తర్వాత హైదరబాద్ లో రవీంద్ర భారతిలో జరిగిన తెలంగాణ బతుకమ్మ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అన్వేష్ తీసిన పట్నం డాక్యుమెంటరీ కూడా ప్రదర్శించారు.

ఇక తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ లో తెలంగాణ సాహితీ సాంస్కృతిక లఘు చిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఫిల్మ్ భవన్లో జరిగిన ఆ కార్యక్రమంలో ముద్దసాని రామిరెడ్డి, యాది సదాశివ, శివపార్వతులు, పట్నం ఫిల్మ్స్ ని ప్రదర్శించారు. ఆనాటి కార్యక్రమానికి డాక్టర్ కె.రామకృష్ణ అధ్యక్షత వహించగా, కామారెడ్డి శంకర్, డాక్టర్ గండ్ర లక్ష్మణ రావు తదితరులు హాజరయ్యారు. అదే కార్యక్రమంలో తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కి ఒక వేదికను కూడా ఏర్పాటు చేసాము.‘యవనిక’ పేర ఏర్పాటయిన ఆ వేదిక ద్వారా తెలంగాణ షార్ట్ ఫిల్మ్స్ ని సేకరించాలని, ఫిల్మ్ మేకర్స్ ని ఒకే వేదిక మీదికి తేవాలని ఆలోచన చేశాం. తర్వాతి కాలంలో యవనిక ఏదో కొంత కృషి చేసినప్పటికీ అనుకున్న రీతిలో కొనసాగించలేక పోయాం. నేనేమో యవనిక పేర సమాంత సినిమాల పైన సమీక్షలు, పరిచయాలు చేసి నా యూ ట్యూబ్ చానల్ Aksharala Thera By Varala Anand లో ప్రెసెంట్ చేశాను.

అన్వేష్ డాక్యుమెంటరీల ప్రస్థానం ఆ విధంగా మొదలయింది. కానీ సినిమాటోగ్రఫీ లో గొప్ప ఇన్సిట్యూట్ లో చదవితే కానీ ఫలితం వుండదన్నాను. దానికోసం అన్వేష్ మొదట హైదరబాద్ లోని శ్రీ వాణి గారి కాలేజీలో ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, కోల్కట్టా లోని సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ప్రవేశానికి ఎంట్రన్స్ రాశాడు. రెండింటిలోనూ ప్రథముడిగా నిలిచి సీటు పొందాడు. మిత్రుల సూచన మేరకు కోల్కట్టా లో చేరాడు. ఆ వివరాలు మళ్ళీ రాస్తాను.

ఇక నా ‘మనిషి లోపల’ కవితా సంకలనాన్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేసే పనిని ఆత్మీయురాలు బొడ్ల అనురాధ చేపట్టారు. విజయవంతంగా SIGNATURE OF LOVE పేర పుస్తకం తెచ్చారు. ఆవివరాలతో మళ్ళీ వారం కలుస్తాను…

+++++++++

వారాల ఆనంద్

17 మార్చ్ 2024          

గానుగ యంత్రం+కేహ్రీ సింగ్ మధుకర్ ( డోగ్రీ కవిత)

Posted on

గానుగ యంత్రం
++++++++++ కేహ్రీ సింగ్ మధుకర్ ( డోగ్రీ కవిత)

గానుగ యంత్రం గర గరలాడుతూ పని చేస్తుంది
ఎద్దు దాని వెనకాలే క్రమం తప్పకుండా స్థిరంగా నడుస్తుంది
గుండ్రంగా నెలలూ ఏడాదులూ లెక్కించకుండా
జీవితకాల ప్రయాణాన్ని కొనసాగిస్తుంది
మెడలో గంటలు గణగణ మంటాయి
కంభాన్ని లాగుతూ విత్తనాల్ని నలగ్గొట్టుతూ నూనె తీస్తుంది

కొరడాని గట్టిగా ఝలిపించినప్పుడు
దేహం గాయాల పాలవుతుంది
కంటి రెప్పలు మూతబడతాయి
మెదడు మొద్దుబారిపోతుంది
అయినా అది అన్ని కాలాల్లోనూ నడుస్తుంది
వేగాన్ని పెంచమంటూ చిన్నాపెద్దా
తిట్టే తిట్లను భరించడం తప్ప
నిస్సహాయ చట్రానికి బంధీ అయిన దానికి
వేరే దారి లేదు

వెలకొద్ది మైళ్ళు నడుస్తుంది
అయినా వున్నచోటే వుంటుంది
వ్యాపారి నూనెను అంగట్లో అమ్ముకుంటాడు
ఎద్దుకు ఆ వ్యవహారంలో ఎలాంటి పాత్రా లేదు

ఒకరు రాత్రీ పగలూ కష్టపడితే
మరొకరు ఆనందం పొందుతారు
ఒకరు చెమటోడిస్తే
మరొకడు లబ్ది పొందుతాడు

అంతేకాదా
ఒకరిది దుఖమయితే నూనె మరొకరిది
ఈ ప్రపంచమే ఒక గానుగ యంత్రం
అది అట్లాగే నడుస్తుంది
మనిషిని ఎద్దులా మార్చేసి
మట్టి పొరల్లో కొర్చేశారు
++++++
ఆంగ్లానువాదం: కేహ్రీ సింగ్ మధుకర్
తెలుగు: వారాల ఆనంద్
******************************
11 March 2024

గానుగ యంత్రం
++++++++++ కేహ్రీ సింగ్ మధుకర్ ( డోగ్రీ కవిత)

YADONKI BARATH 2 SERIES,No-9

Posted on

యాదోంకీ బారాత్

2 సిరీస్- నంబర్- 9  

+++++++++++++++ వారాల ఆనంద్

ఎందుకయినా మంచిది/ కనురెప్పలు తెరిచే వుంచాలి/ ప్రకృతి ఏ అందమయిన దృశ్యాన్నో\

నీ కంటిలో వేసి పోవచ్చు/పోతూ పోతూ ఓ తుంటరి మబ్బు తునక/ఇంధ్రధనుస్సుని సాక్షాత్కరింప చేయొచ్చు

ఎందుకయినా మంచిది/ పిడికిలి తెరిచే వుంచాలి/ఎవరయినా చేతిలో చెయ్యేసి/

స్నేహ హస్తం కలిపేసి పోవచ్చు/ నడుస్తూ నడుస్తూ మనిషనేవాడు/ఓ ఆలింగనం ఇచ్చి పోవచ్చు

ఎందుకయినా మంచిది/ హృదయం తెరిచే వుంచాలి/ మనసుగల ఏ మనిషో/ తలుపు తట్టకుండానే పలకరిచి పోవచ్చు/ కదుల్తూ కదుల్తూ  ఆత్మగలవాడు/ ప్రేమ సంతకం చేసిపోవచ్చు         

ఈ కవిత నా ‘మనిషి లోపల’ కవితా సంకలనంలో రాసుకున్నాను. అవును ఎవరమయినా మనసు ఆంటెన్నాను తెరిచి వుంచితే మంచిది. కానీ ఇవ్వాళ ఆన్టెన్నా ల కాలం పోయింది. ఇప్పుడంతా చుట్టూరా అలుముకుని పరుచుకున్న ‘వై వై’.  దానికి కూడా మన లోపలి రిసీవర్ సిద్దంగా వుండాలి. అప్పుడే దేన్ననయినా స్వీకరించేందుకు మనం సిద్దంగా వుంటాం. ఓపెన్ నెస్ ని అందిపుచ్చుకుని ఈ మొత్తం సాంకేతికత సంక్లిష్టతల నేపధ్యంలో నేను నా రొటీన్ కార్యక్రమాలల్లో చేరిపోయాను. కాలేజీలో ఆక్టివ్ గా వుంటూనే సినిమాల మీద ముఖ్యంగా తెలంగాణ సినిమాల మీద వ్యాసాలు రాయడం విస్తృత పరిచాను. నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో రాస్తూ పోయాను. ఇక నా ఆరోగ్యం కొంత మెరుగు పడింది. అయినప్పటికీ ఎప్పటికప్పుడు క్రెయాటిన్ లాంటి అనేక పరీక్షలు చేయించుకుంటూనే నెఫ్రాలజిస్ట్ ను కలవడం తప్పలేదు. నా మట్టుకు నాకు డాక్టర్ గందే శ్రీధర్ హైదరాబాద్ నుండి ప్రతి బుధవారం కరీంనగర్ కు విజిటింగ్ రావడం ఎంతో ఉపయోగపడింది. లేకుంటే ప్రతి సారీ హైదరబాద్ వెళ్లాల్సిన పని బడేది. డాక్టర్ శ్రీధర్ సివిల్ ఆసుపత్రి రోడ్డులోని న్యూ శ్రీనివాస మెడికల్స్ ఆవరణలోని క్లినిక్ కి వస్తాడు. జిల్లాలోని అనేక మందికి ఆయన సేవలు ఎంతో ఉపయోగకరంగా వుంటాయి. ఇక కరీంనగర్లో  వైద్య సదుపాయాల పరిస్తితి చూస్తే అప్పటిదాకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఫిజిషియన్స్, సర్జన్స్ అందుబాటులో వుండేవాళ్లు. కానీ ఎప్పుడయితే ‘ప్రతిమ’,’ చలిమెడ ఆనందరావు’ పేర్లతో రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయో అప్పటినుండి అత్యున్నత స్థాయి డీ.ఎం. లు అందుబాటులోకి వచ్చారు. దాదాపు అన్నీ విభాగాల్లో యువ వైద్యులు వచ్చారు. కొంత ఖర్చయినా ఉత్తమ వైద్య సేవలు లభించడంతో ఒకరకంగా మంచే జరిగింది.

అట్లా నేను వారం వారం వైద్య పరీక్షలు నెలకో సారి డాక్టర్ విజిట్ కి వెళ్ళడం సాగుతూనే వుంది. పరిస్తితి మెరుగ్గా వుండడంతో రాయడం, కార్యక్రమాల నిర్వహణ కొనసాగిస్తూనే వచ్చాను. కాలేజీలో ప్రిన్సిపాల్ డాక్టర్ మధుసూధన్ రెడ్డి కూడా ఆక్టివ్ గా వుండడంతో అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. అందులో నాకు గుర్తున్నంత వరకు తెలంగాణ సినిమా ఎదగాలని, అది తన స్వీయ గొంతుకతో పలకాలని తపిస్తూ అనేక సూచనలు చేస్తూ వ్యాసాలు రాశాను. అదే సమయంలో కాలేజీలో 26 మే 2015 రోజున ‘తెలంగాణ సినిమా దశ దిశ’ పేర సదస్సు నిర్వహించాను. దానికి మేయర్ శ్రీ రవీందర్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవగా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. విద్యార్థుల్లో సినిమా చైతన్యం పెరిగేందుకు దోహదం చేసింది. ఆ తర్వాతి కాలంలో ‘తెలంగాణ సినిమా-దశ దిశ’ పేర పూర్తి స్థాయి పుస్తకమే తెచ్చాను. ఇక మా కాలేజీలోనే ‘తెలంగాణ కళ-పేరిణి నృత్యం’ మీద పక్షం రోజుల పాటు వర్క్ షాప్ నిర్వహించాము. దానికి మా కొలీగ్ శ్రీమతి ఎలిజబెత్ రాణి పూర్తిగా సహకరించారు. విద్యార్థినీ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పేరిణి మీద మా అబ్బాయి అన్వేష్ మంచి ఫోటో షూట్ చేశాడు. డాక్యుమెంటరీ కూడా ప్లాన్ చేశాం కానీ పేరిణి లో ప్రముఖుడయిన ఓ కళాకారుడి అభ్యంతరాలు వాద వివాదాల నడుమ ఆ డాక్యుమెంటరీ ప్రయత్నం నిలిచిపోయింది. నేనూ అన్వేష్ బాగా నిరుత్సాహపడ్డాం. ఇట్లా పలు కార్యక్రమాల్లో బిజీ వుంటూ అత్యంత మామూలుగా వున్నాను.అప్పుడే ప్రముఖ తెలంగాణ సినీ కథానాయకుడు టి.ఎల్.కాంతారావు జయంతి ఉత్సవాన్ని16 నవంబర్ 2015 రోజున

 శ్రీ సి.వి.ఎల్.నరసింహా రావు నిర్వహిస్తే హైదరాబాద్ వెళ్ళి వచ్చాం. సభ బాగా జరిగింది. సీవీల్ గారి దీక్ష చాలా గొప్పది.

….

ఇదంతా ఇట్లా జరుగుతుండగానే మళ్ళీ ఒకసారి అనారోగ్య బాంబు పేలింది. ఒక ఆదివారం రోజున నా పెదవి కింద కట్ అయిన విషయం గమనించిన ఇందిర అదేమిటి అంది. ఏదో షేవింగ్ లో కట్ అయివుంటుంది అని తేలిగ్గా తీసేశాను. అది కాస్తా మర్నాటికి ముక్కు పక్కకు చేరింది. ఇందిర కంగారు పడింది. నీకన్నీ అనుమానాలే అంటూ బుధవారం డాక్టర్ దగ్గరికి వెళ్దాం లే అన్నాను. అనుకున్నట్టుగానే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఏమిటి ఆనంద్ ఎట్లా వున్నారు అని ఆయన అడుగుతూ వుండగానే ఇందిర కట్ అయిన విషయం చెప్పింది. ఆయన అదేమీ వినకుండానే సీరియస్ గా ఫేస్ మాస్క్ తీయించి మొత్తం ముక్కు పక్కనుంచి ముఖమంతా పరిశీలించారు. ఆనంద్ మీరు వెంటనే హైదరాబాద్ బయలుదేరండి. నేను హాస్పిటల్ కి ఫోన్ చేస్తాను వెంటనే అడ్మిట్ కండి అన్నాడు. నాకేటూ పాలు పోలేదు. ఏమయింది సార్ అన్నాను. నేను చెబుతున్నాను కదా వెంటనే బయలుదేరండి అన్నారాయన. మేము బయటకొచ్చి అప్పటికి సాయంత్రం ఆరు దాటుతున్నది అప్పటికప్పుడు వెల్లడమెట్లా అనుకున్నాం. మెడికల్ షాప్ ముందు కూర్చుని కొంత సేపు తర్జన భర్జన పడ్డాం. ఇందిరకు ఒకటే కంగారు ఆందోళన. మళ్ళీ లోనికి వెళ్ళి డాక్టర్ణి కలిసి రేపుదయం వస్తామన్నాము. అదేమీ నాకు తెలీదు మీరు రేపుదయం 5 గంటలక్ల్లా అడ్మిట్ కావాలి మరి అన్నాడు. ఇంటికి వచ్చి ఏవో కొన్ని సర్దుకుని అర్ధరాత్రి బయలుదేరాము. గ్లోబల్ లో అడ్మిట్ అయ్యాను. వెంట వెంటనే రక్త పరీక్షలు అవీ చేశారు. అడిగితే బ్లడ్ బాంబే పంపిస్తున్నాం. రిపోర్ట్ రావడానికి రెండు రోజులు పట్టొచ్చు అన్నాడు టెక్నీసియన్. కొంత సేపటికి డాక్టర్ శ్రీధర్, డాక్టర్ రమాశంకర్, డాక్టర్ రఘు అంతా వచ్చేశారు. ఆనంద్ రిపోర్ట్ రావడం లేట్ అవుతుంది ట్రీట్మెంట్ మొదలు పెడుతున్నాం అన్నారు. అసలు ఇంతకూ ఏమయింది సార్ అని అడిగాను. ఏమీ లేదు సీరియస్ వైరల్ ఇన్ఫెక్షన్ వుంది. అయిదు రోజుల పాటు అయిదు ఇంజెక్షన్స్ ఇస్తాం. ఒక్కొక్కటి డ్రాప్ బై డ్రాప్ 7 గంటలు తీసుకుంటుంది. ఒక్కో ఇంజెక్షన్ ముప్పై అయిదు వేలు వుంటుంది అన్నారు. డబ్బు సరే విషయం అంత ప్రమాదకరమా అన్నాను. అవును అన్నారు. రిపోర్ట్ కోసం వేచి చూసే సమయం కూడా లేదు ట్రీట్ మెంట్ మొదలు పెడుతున్నాం అన్నారు శ్రీధర్. నేను బదులిచ్చే లోపలే మీరేట్లా అనుకుంటే అట్లా చేయండి సర్ అంది ఇందిర. ఐవీ ఇంజెక్షన్ మొదలయింది. ఐసీయు లో వుంచారు. టోటల్ కంటోల్డ్ వాతావరణం. అప్పుడు డాక్టర్ రమాశంకర్ వచ్చి పక్కన కూర్చుని ఆనంద్ గారు ఇది మీ ట్రాన్స్ ప్లాంట్ కంటే సీరియస్ స్థితి. బయటకేమీ కనిపించదు కానీ ప్రమాదం. మీరు వెంటనే కరీంనగర్ లో శ్రీధర్ ని కలవడం మంచిది అయింది. ఆయన కూడా వెంటనే స్పందించాడు. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వుండాలి. అయిదు ఇంజెక్షన్స్ తర్వాత మీ ఇమ్యూనిటీ, ఎనర్జీ మొత్తం జెరో కి వస్తుంది. కొద్ది రోజులు కదలడం కూడా కష్టం అవుతుంది. మీకు మీరు కప్ పట్టుకుని టీ తాగలేరు, షర్ట్ కూడా వేసుకోలేరు. ఆ స్థితిలో చాలా జాగ్రత్తగా వుండాలి. ప్రోటీస్ డోస్, సప్లిమెంట్స్ ఇస్తాం కానీ సమయం పడుతుంది అన్నారు. అప్పటికి కానీ మాకు అసలు స్థితి అర్థం కాలేదు. ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ అప్పుడు కూడా ఇందిర కళ్ళల్లో నీళ్ళు చూడలేదు. కానీ ఇప్పుడు కళ్ళు వొత్తుకోవడం గమనించాను. ఏమీ కాదు లేవోయి అంటున్నాను నేను. బాంబే రిపోర్ట్ శ్రీధర్ గారు వూహించినట్టే వచ్చింది. అప్పటికే ట్రీట్మెంట్ మొదలయింది. మూడో రోజుకి మెడిసినల్ ప్రభావం మొదలయింది. నాలో బలహీనత పుంజుకుంది. క్రమంగా సత్తువ కోల్పోసాగాను. మాట బాగానే వుంది. ఇందిరనే తినిపించడంతో సహా అన్నీ పనుల్లో సాయం చేయసాగింది. బాప్ రే. హింస అంటే ఇది కదా అనిపించింది. నా పరిస్తితి గమనించిన ఇందిర డాక్టర్ శ్రీధర్ తో మాట్లాడుతూ ఇంకా ఎవరయినా సీనియర్. మీ ప్రొఫెసర్స్ ని సంప్రదించండి అంది. మీరెక్కడికయినా వెళ్ళండి నేను మాట్లాడతాను అన్నారు శ్రీధర్. లేదు లేదు మిమ్మల్నే నమ్ముకున్నాను, నాకట్లా అనిపించింది అంది ఇందిర. మర్నాడుదయమే ఓ సీనియర్ నేప్రాలజీ ప్రొఫెసర్ ని పిలిపించారు. ఆయన చూసి ఎవ్రీ థింగ్ ఇస్ ఆన్ గుడ్ లైన్స్ అని వెళ్లారు. ఇన్ని ట్రాన్స్ ప్లాంట్స్ చూసాము మీది పెక్యులియర్ అన్నారు. అవును మరి ఆనంద్ అంటే మజాకా  పెక్యులియరే మరి అని నేనూ ఇందిరా నవ్వుకున్నాము. డాక్టర్స్ చర్చించుకుని ఏవో నిర్ణయాలు తీసుకున్నారు. 

హైదరబాద్ ఆసుపత్రిలో వుండడం ఏదో ఒకరోజు మాత్రమే అనుకున్నాం. వెంట బట్టలు అవీ ఏమీ లేవు. ఖైరతాబాద్ లో మంజు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇందిర వాషింగ్ పని ముగించుకు వచ్చింది. అయిదు రోజుల మెడికల్ డోసేజీ అయిపోయాక డాక్టర్స్ అన్ని పరీక్షలు చేసి ఒకే కరీంనగర్ వెళ్లమన్నారు. కానీ మూడు నెలలు సెలవు పెట్టండి. ఇంట్లోంచి బయటకు పోవద్దు. సాధ్యమయినంత మేర ఎవరినీ దగ్గరకు రానివ్వవద్దు అన్నారు. క్రమంగా కోలుకుంటారు అని కూడా అన్నారు. దాదాపు స్టేచ్చర్ పైననే బయటకు వచ్చి కారులో కరీంనగర్ చేరుకున్నాం. ఏముందిక 100 శాతం రెస్ట్. కదలడం కష్టం. ఆ కాలం ఎట్లా గడిచిందో ఇప్పుడు వూహించుకుంటే భయమేస్తుంది. న్యూస్ పేపర్ చదవలేను, స్వంతంగా స్నానం చేయలేను, నా కిష్టమయిన టీ నాకు నేను తాగలేను అబ్బో అదంతా పెద్ద నరకం. భరించాం తప్పదు కదా. మొత్తం మీద ఆ ఇన్ఫెక్షన్ ఎట్లా సోకిందో తెలీదు కానీ సరయిన సమయానికి శ్రీధర్ గారిని కలవడం ఆయన వెంటనే స్పందించి, రోగ నిర్ధారణ చేయడంతో బయటపడ్డాను.  

మిగతా వివరాలతో మళ్ళీ వారం…

-వారాల ఆనంద్

10 మార్చ్ 2024

SRIBHASHYAM VIJAYASARATHI

Posted on

మిత్రులారా! సాహితీస్రవంతి కార్యక్రమంలో ఈ వారం సంస్కృత కవి పండితుడు శ్రీ శ్రీభాష్యం విజయసారధి గారి గురించి నా PODCAST వినండి. లింక్ క్లిక్ చేసి చూడండి -వారాల ఆనంద్, 9 మార్చ్ 2024

YADONKI BARATH, 2nd SEREES No.8

Posted on

యాదోంకీ బారాత్

సెరీస్-2, నం.8

+++++++++++++++ వారాల ఆనంద్

సంతోషం అగ్గిపుల్లలా సర్రున వెలిగి ఆరిపోతుంది

దుఃఖం ఆగరొత్తీలా కాల్తూ మనల్నీ మన పరిసరాల్నీ

చాలాసేపు అంటిపెట్టుకునే వుంటుంది.

…….

దుఃఖ వ్యక్తీకరణ మాధ్యమం కేవలం కన్నీళ్లు కాదు, నా మట్టుకు నాకు కవిత్వం కూడా. అందుకే 2013-2014 సంవత్సరాల సంక్షోభ కాలంలో కవిత్వం నాకు పెద్ద అవుట్ లెట్ అయింది.

చికిత్స విజయవంతమయి నిలకడయిన ఆరోగ్య స్థితి లో కరీంనగర్ చేరుకున్న నేను యధావిధిగా కాలేజీ బాధ్యతలు కొనసాగించసాగాను. ఆ స్థితిలో మా ఎస్.ఆర్.ఆర్.కాలేజీ మిత్రులు చూపిన అభిమానం అందించిన సహకారం గొప్పది. అప్పుడే నేను ఆగస్ట్ 2014 లో ‘మానేరు గల గల’, ‘బంగారు తెలంగాణా లో చలన చిత్రం’ పుస్తకాల్ని తెచ్చాను.

దాని తర్వాత వెంటనే కవిత్వ పుస్తకమూ తేవాలనిపించింది. ఆ విషయం చెప్పగానే మిత్రుడు అనంతాచార్య ఇంత వెంటనేనా సార్ అన్నాడు “సమయం లేదు మిత్రమా” అని సినిమా ఫక్కీలో సమాధానం ఇచ్చాను ఇద్దరమూ బిగ్గరగా నవ్వుకున్నాం.

 ఇంకేముంది రాసిన కవితల్ని ఒక చోట చేర్చి అమర్ కిచ్చాను డీటీపీ చేయమని. మరో వైపు ఆత్మీయ మిత్రుడు ప్రముఖ కవి దర్భశయనం శ్రీనివాసాచార్యను ముందు మాట రాయండి సార్ అని కోరాను. ఆయన మరోక్షణం ఆలోచించకుండా నేను రాయకుంటే ఎట్లా అన్నాడు. ఆయనతో నా తొలి పరిచయం 1998 నాటిది. తాను కరీంనగర్ ఆంధ్రా బ్యాంక్ లో చేరినప్పటిది. అప్పటినుండీ మా రెండు కుటుంబాలూ స్నేహంగా ఆత్మీయంగా కలిసిపోయాయి. 1998లో నేను నా ‘మానేరు తీరం’ ప్రచురించాను. దాని ఆవిష్కరణ సభ కరీంనగర్ నెహ్రూ యువ కేంద్ర హాలు లో జరిగింది. సమైఖ్య సాహితి సంస్థ ఆధ్వర్యంలో కె.ఎస్.అనంతాచార్య, మాడిశెట్టి గోపాల్ నిర్వహించారు. ఆనాటి సభలో మిత్రులు నలిమెల భాస్కర్ అధ్యక్షులు, దర్భశయనం ముఖ్య అతిథి. నా రచన మీద ఆ రోజు దర్భశయనం చాలా గొప్పగా స్నేహంగా సాధికారికంగా మాట్లాడారు. వివరంగా విశ్లేషణాత్మకంగా ఆయన చేసిన ప్రసంగం నాకో పెద్ద ప్రేరణ. సభ తర్వాత హాలు చిన్నదయిపోయింది సర్ అని అనంతా చార్య అంటే జీవగడ్డ విజయకుమార్ ‘చారీ నిర్వాహకులుగా మీరు ఆనంద్ ను తక్కువ అంచనా వేశారు’ అన్నాడు. అంతా నవ్వుకున్నాం. ఆ తర్వాత ‘నవ్యచిత్ర వైతాళికులు’, ‘సినీ సుమాలు’, ‘24 ఫ్రేమ్స్’ ఇట్లా నా సమాంతర సినిమా పుస్తకాల మీద జరిగిన సభలల్లో దర్భశయనం విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు. మా ఇద్దరి నడుమా అంతటి దగ్గరితనం అభిమానం పెనవేసుకున్నాయి.

ఆ చనువుతో అడగ్గానే ’మనిషి లోపల’ కవిత్వానికి మనిషిలోపలి చింతన పేరుతో ముందు మాట రాశారు. రాయడమంటే అట్లా ఇట్లాకాదు. నన్నూ, అప్పటి నా స్థితినీ, నా కవిత్వాన్నీ కలగలిపి వడబోసి ఆవిష్కరిస్తూ రాశారాయన.

“ఒక సంక్లిష్ట సందర్భానికి ఆనంద్ ఇచ్చిన అక్షర రూపమీ సంపుటి. దుఃఖమూ కవిత్వమూ కవలలని తాను తెలుసుకున్నాడు. అనుభవంతో తాత్విక స్థాయికెళ్లి దుఃఖపు జీర లేకుండా ఏదయినా ఆనందమెలా అవుతుంది అని వ్యాఖనించాడు ఆనంద్. ఈ సంపుటిలో దుఃఖం కనిపించినంతగా మారే మాటా కన్పించదు.‘ధైర్యం’ అనే భావం పలికినంతగా మరే భావం పలకలేదు” అన్నాడు దర్భశయనం శ్రీనివాసాచార్య. అట్లా ఆయన ముందుమాటతో నా మనిషి లోపల సిద్దమయింది. ఈ సారి ఆవిష్కరణ హైదరబాద్ లో చేయాలనుకున్నాను. అనుకూలమయిన హాలు దొరికితే సరే అనుకున్నాము. జింబో ఎమెస్కో బుక్స్ వారి హాలు ఏర్పాటు చేశాడు. 16 నవంబర్ 2014 న సభకు సిద్దమయ్యాము. ఆవిష్కర్త గా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు శ్రీ కె.వి.రమణా చారి గారిని, విశిష్ట అతిథులుగా మిత్రుడు అల్లం నారాయణ, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్, ఆత్మీయ అతిథిగా దర్భశయనం శ్రీనివాసాచార్య, అధ్యక్షుడుగా జింబో లను ఆహ్వానించాను. సభ నిర్వహణ భాధ్యతల్ని ఆత్మీయ మిత్రుడు వఝల శివకుమార్ కి అప్పగించాను. రెండు రోజుల ముందు నమస్తే తెలంగాణ పత్రిక నుండి కాల్. మీ పుస్తకం ముందుమాట ను మాకు పంపండి ఆదివారం సంచికలో వేస్తామని. ఆ రెస్పాన్స్ ఊహించనిది. సరే డీటీపీ పంపాను. నమస్తే తెలంగాణలో 14న  రానే వచ్చింది. సభ కోసం నేనూ ఇందిరా ఉదయాన్నే బయలుదేరాం. అతిథులందరూ సమయానికి వచ్చేశారు. రమణా చారి గారు వస్తూనే ఆనంద్ నేనీ మీటింగ్ అని కాదు కేవలం  మీ ఇద్దరినీ ఇందిరనూ నిన్నూ చూద్దామని వచ్చాను అన్నారు. సభకు ఆత్మీయులు నందిని సిధారెడ్డి, ప్రొఫెసర్ మనోహర్ రావు, ప్రొఫెసర్ ఉషాదేవి. నిజాం వెంకటేశం, అయోధ్యా రెడ్డి, వఝల శారద, హిమజ, పవన్, నందిగం కృష్ణారావు, మహంతి, కోడూరి విజయ్ కుమార్, నిజామాబాద్ ఫిల్మ్ క్లబ్ నుంచి పెద్దాయన రామస్వామి కవి సూర్యప్రకాశ్  ఇంకా తమ్ముడు అర్జున్,ఉష లతో సహా అనేక మంది హాజరయ్యారు. రఘోత్తమ్ రెడ్డి రాలేదు. ఏమయింది అని అడిగితే పుస్తకంలో నేనున్నాను కదా అన్నారు. సభ ఫోటోల్ని వీడియో ని రేల తన కెమెరాలో బంధించింది. తర్వాత అంతా నారాయణగుడా తాజ్ లో లంచ్ అదీ పూర్తి చేసి. హమ్మయ్య అనుకుని కరీంనగర్ బయలు దేరాము. ఒకటి రెండు రోజులు అలసట తేర్చుకుని ‘మనిషి లోపల’ పుస్తకాన్ని మిత్రులకూ సమీక్షలకూ పంపించడం మొదలు పెట్టాను. క్రమం తప్పకుండా కాలేజీకి వెళ్తూనే వున్నాను.

ఇంతలో ఒక రోజు మధ్యాహ్నం లంచ్ తర్వాత లైబ్రరీలో సిస్టమ్ ముందు కూర్చున్నాను. ఫోన్ మోగింది. ఎవరా అనుకుంటూ లిఫ్ట్ చేశాను. ఆనంద్ అన్నారెవరో ఆపక్కనుంచి. ఏమరుపాటుగా వున్ననేమో గొంతు ఎక్కడో తగులుతోంది. దీపం వెలగలేదు. నేను వరవర రావుని అన్నారు. ఒక్కసారిగా మనసు స్విచ్ ఆఫ్ అండ్ ఆన్…ఆశ్చర్యం ఆనందం. సార్ సార్ అన్నాను. ఎట్లున్నవ్ బాగున్నావా అన్నారాయన. బాగున్నాను సర్ అన్న. ఇప్పుడే నీ మనిషి లోపల చదివి, కదిలిపోయాం ఇద్దరమూ అన్నారాయన. నేనేదో అనే లోపలే కూర్మానాథ్ తెచ్చి ఇచ్చాడు ఆయనకు పంపావట కదా అన్నారు. నా ఆనందానికి హద్దే లేదు. మరికొంత సేపు మాట్లాడారు. ఆసుపత్రి ఆపరేషన్ తదితర వివరాలడిగారు. ఎక్కడున్నావు అంటే కాలేజీలో అన్నాను. ఇందిరకు థాంక్స్ చెప్పు అని ఫోన్ పెట్టేశారు. సార్ నా కవిత్వం చదవడమే కాకుండా బాగుంది అనడం ఓహ్! నేను మళ్ళీ నా లైబ్రరీలోకి యధా స్థితి లోకి రావడానికి చాలా సమయమే పట్టింది. ఒక లెజెండరీ పొయెట్, నేను బాగా అభినించే వారు నన్ను పలకరించడం నా కవిత్వాన్ని గురించి మాట్లాడ్డం ఎంత ఆనందాన్నిచ్చిందో మాటల్లో చెప్పలేను. రాయడానికి భాష చాలదు. ఇంటికెళ్ళిన తర్వాత ఇందిరకు చెబితే తన సంతోషానికీ అవధుల్లేవు.

ఇదిట్లా వుంటే మర్నాడు మరో కాల్ అది కూడా వూహించనిదే. ‘ఆనంద్.. నేను నవీన్ ని’ అన్నారు ఆపక్క నుంచి, గొంతు గుర్తుపట్టాను అంశయ్య నవీన్ గారు. నమస్తే సార్. ఆనంద్ ఎట్లా వున్నావు విషయం ఎవరూ చెప్పలేదు, నాకు తెలీదు, నీ పుస్తకం వచ్చింది. చదివేశాను మూవ్ అయ్యాను. గొప్పగా రాసావు. అంత సంక్షోభంలో అట్లా నిబ్బరంగా వుండి రాయడం నిజంగా మూవ్ అయ్యాను. దర్భశయనం ముందు మాట కర్టైన్ రైజర్. నిన్ను బాగా పట్టుకున్నాడాయన అన్నారు నవీన్.‘అంపశయ్య’ తోనూ కఫిసో స్థాపకుడిగానూ ఆయనంటే ఎంతో అభిమానం నాకు. ఈ రెండు ఫోన్ కాల్స్ నన్ను నిలువనీయలేదు.

ఇదంతా ఇట్లా వుండగానే కరీంనగర్ లో నాకు ఆత్మీయ సాహిత్య మిత్రుడు గండ్ర లక్ష్మణ రావు ఒక ప్రతిపాదన తెచ్చాడు. మనిషిలోపల పైన సభ పెడదామని. మీరు అవసరమంటే పెడదాం సార్ అన్నాను. సభ ‘సాహితి గౌతమి’ నిర్వహిస్తుంది అన్నారు. ఆయనే శ్రీ నాళేశ్వరం శంకరం ని పిలిచాడు. ఉస్మానియా కాంపస్ కాలం నుంచి నాకు దగ్గరి మిత్రుడయిన శంకరం నాకే కాదు అందరికీ మిత్రుడే. అజాత శత్రువు.  హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చారు. ఫిల్మ్ భవన్ లో సభ విజయవంతంగా జరిగింది.

ఇదంతా ఇట్లా వుండగానే నిజామాబాద్ క్లాసికల్ ఫిల్మ్ సొసైటి బాధ్యుడు మేకా రామ స్వామి గారు ఫోన్ చేశారు. ఎట్లా వున్నారు? నిజామాబాద్ 14 డిసెంబర్ నా వందేళ్ల సినిమా పండుగ చేస్తున్నాం మీరూ ఇందిర గారు రావాలి అన్నారు. నేను సమాధానం చెప్పేలోగానే ఏ కొంచెం మీ ఆరోగ్యం తప్పకుండా రావాలి అన్నారు. అంతా పెద్దాయన పిలిస్తే కాదని ఎట్లా అనడం సరే అన్నాను. ఆనాటి సభలో అమృతలత గారితో సహా పలువురు పాల్గొన్నారు. సభ సంతోషంగా జరిగింది. అందరికీ ధన్యవాదాలు చెప్పి బయలుదేరాము.

అట్లా తిరగడం పట్ల మిత్రులు వద్దంటూ అభ్యతర పెడుతూనే వున్నారు. కానీ తీరిగిన కాలు కదా నిలువలేకపోతోంది అంటూ సమాధానం చెప్పాను. వారం వారం కరీంనగర్ సందర్శించే మా డాక్టర్ గందే శ్రీధర్ గారిని క్రమం తప్పకుండా కలుస్తూనే వున్నాను.

ఇంకోవైపు మనిషి లోపల పుస్తకం పై సమీక్షలూ రావడం మొదలయ్యాయి ఆ వివరాలతో మళ్ళీ వారం కలుస్తాను

సెలవ్

==== వారాల ఆనంద్

03 మార్చ్ 2024