Month: August 2021

యాదోంకీ బారాత్   =5వేములవాడ: ‘లయ’ ఓ మినీ కవితా ప్రవాహం

Posted on

యాదోంకీ బారాత్   =5

వేములవాడ: ‘లయ’ ఓ మినీ కవితా ప్రవాహం

============== వారాల ఆనంద్

   70 వ దశకం చివర 80వ దశకం తొలి రోజుల్లో తెలుగు సాహిత్య ప్రపంచంలో మినీ కవిత ఓ ఉప్పెన. దాదాపు ఆనాటి యువకవులంతా మినీ కవితా రచనలో మునిగిపోయారు. మరో వైపు కందుర్తి లాంటి వాళ్ళు మినీ కవితని అంగీకరించలేదు. అనేక వాదాలూ వివాదాలూ నెలకొన్నాయి. ఆ నేపధ్యంలో వేములవాడ పోయెట్రీ ఫోరం నుంచి వెలువడిన అయిదుగురు యువ కవుల సంకలనం ‘లయ’ (‘RHYTHM’). అందులో జింబో, వఝల శివ కుమార్, పి.ఎస్.రవీంద్ర, అలిశెట్టి ప్రభాకర్, వారాల ఆనంద్ రాసిన మినీ కవితలున్నాయి. అప్పుడు లయకు మంచి స్పందనే వచ్చింది. ప్రస్తుతం నా దగ్గర లేవు గానీ మంచి సమీక్షలూ వచ్చాయి. అట్లా లయ ఈ అయిదుగురు కవులకూ గొప్ప లాంచింగ్ పాడ్ అనే చెప్పుకోవచ్చు.

+++++++++++++++++++

“కవిత్వం మన జీవన విధానానికీ, జీవిత సంఘర్శనలకీ ప్రతిస్పందన”

“ఎక్కడ సమస్యలుంటాయో అక్కడ సంఘర్శన వుంటుంది, అక్కడ కవిత్వమూ వుంటుంది, ఆ సంఘర్షణలకు “లయ”గా ఈ సంకలనం మీ ముందుకు తెస్తున్నాం”  అని ప్రకటించి ఈ సంకలనాన్ని తెచ్చాము. నిజానికి ఇది ఒక పరిణామ క్రమంలో జరిగింది. అప్పటికి అంటే 1978 ముందు వేములవాడలో నటరాజ కళానికేతన్ పేర ఒక సాహితీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో అనేక సాహితీ కార్యక్రమాలు నిర్వహించారు. అందులో నేనూ సెలవుల్లో వచ్చినప్పుడు పాల్గొన్నప్పటికీ కరీంనగర్లో వుండే వాడిగా దాదాపు ఔట్ సైడర్ పాత్రనే పోషించాను. విలక్షణంగా జరిగిన ఆ కార్యక్రమాలు ఇంకా వివరంగా రికార్డ్ కావల్సే వుంది.

        ఇక 1978 నేనూ జింబో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరడం తను లా లోనూ, నేను ఆర్ట్స్ కాలేజీలో లైబ్రరీ సైన్సు లోనూ చేరడం, అక్కడ OSMANIA WRITERS CIRCLE తో సాహా అనేక మంది మిత్రుల సహచర్యం మాకో కొత్త ప్రపంచాన్ని చూపింది. మా ఆలోచనా అవగాహానా విస్తృతి అనూహ్యంగా పెరిగింది(OSMANIA  విశేషాలు మరిసారి రాస్తాను). మిత్రులందరినీ కలుపుకుని   ఆనేపధ్యంలో రాసిన మినీ కవితలతో సంకలనం తేవాలి అని ఆలోచించాము. నేను అప్పటికే కోర్సు పూర్తి చేసి మొదట మంథని లో తర్వాత ఏప్రిల్ 1980లో సిరిసిల్ల జునియర్ కాలేజీ చేరిపోయాను. రవీంద్ర ఫోటో స్టూడియో ఏర్పాట్లల్లో, శివకుమార్ పై చదువులకు జబల్పూర్ వెళ్ళే ప్రయత్నాల్లోనూ వున్నారు. జింబో భరత్ భూషణ్ తీసిన ఫోటో, శేఖర్ తో లెటర్స్ రాయించి పుస్తకానికి కవర్ పేజీ ప్రింట్ చేయించాడు. ఇక ఇన్నర్ పేజీలకోసం భాద్యత నేను తీసుకుని సిరిసిల్లా లోని ఒక ప్రెస్ లో అచ్చు. బైండింగ్ పనులు చూసాను. అట్లా లయ వెలుగులోకి వచ్చింది. అప్పటికే కరీంనగర్లో శిల్పి స్టూడియోతో మాకు సన్నిహితుడయిన అలిశెట్టి లయలో భాగస్వామ్యానికి  అంగీకరించాడు. అట్లాగే మిత్ర్హుడు జూకంటి జగన్నాధం కూడా మొదట లయతో వున్నాడు.     

    అప్పుడు మొదలయిన కవుల్లోంచి అలిశెట్టి సెలవంటూ లోకం నుంచి వెళ్ళిపోగా ఇప్పటికీ జింబో, వఝల శివకుమార్ , పి.ఎస్. రవీంద్ర, వారాల ఆనంద్ సృజనాత్మక రంగంలో వుండడం, అందరూ దాదాపు అప్పటి అదే ఉత్సాహం కలిగి వుండడం నాకెంతో సంతోషంగా వుంది.

లయలోని కొన్ని కవితల్ని ఇక్కడ ఇస్తున్నాను 1980ల నాటి ఈ మినీ కవితల్ని చదవండి

“బతుకు”           

నే చచ్చిపోతాననే కదూ

నీ బాధ

పిచ్చివాడా

ఈ వ్యవస్థలో మనం బతికింది

తొమ్మిది మాసాలే”

-జింబో

———-

వేదనా గీతం

——-

మాకు మీలా సేఫ్టీ లాకర్లల్లో

వసంతాల్ని బంధించడం చేత కాదు

వ్యధల్ని గుండెల్లో బంధించుకోవడం తప్ప

మాకు వెన్నెల్లో రమించడం తెలీదు

సూర్యుడిలో వెన్నెల్ని కోరుకోవడం తప్ప

ఊహా విహాసయంలో గంధర్వ

విపంచి వినిపించదు

పేగుల తీగల వేదనా సహిత గీతం తప్ప

కారణం

మీరు మా చెమటని

మేం మా ఆకల్నీ తిని బతుకుతాం

-వఝల శివకుమార్

———

“రాత్రి చనిపోయింది”

వర్షం భోరున ఏడుస్తోంది

అప్పుడే వెళ్ళిపోయాడు చంద్రుడు

నాకేమిటని

గాలి వీస్తోంది

నేనున్నాని

సూర్యుడు తొంగి చూస్తున్నాడు

మబ్బుల తెర అడ్డం వస్తుంది

నేను అప్పుడే లేచి చూసాను

చనిపోయింది ఎవరా అని

ఆలోచిస్తే తెలిసింది

చనిపోయింది రాత్రేనని

-పి.ఎస్.రవీంద్ర

————–

“రీప్రింట్”

ఈ సమాజం

అచ్చు తప్పులున్న

ఓ గొప్ప పుస్తకం

ఇప్పుడు కావాల్సింది

తప్పొప్పుల పట్టిక

తయారు చేయడం కాదు

ఆ పుస్తకాన్ని

సమూలంగా

పునర్ ముద్రించడం జరగాలి

-వారాల ఆనంద్

——————–

“ఉనికి”

అలా

సమాధిలా

అంగుళం మేరకన్నా

కదలకుండా పడి వుంటే ఎలా

కొనాళ్ళు పోతే

నీ మీద నానా గడ్డీ మొలిచి

నీ ఉనికే నీకు తెలిసి చావదు

-అలిశెట్టి ప్రభాకర్

=================

అట్లా లయ కవితా సంకలనం నా యాదిలోనూ తెలుగు కవితా ప్రపంచంలోనూ మిగిలిపోయింది.

++++

అయితే లయ కవితా సంకలనం వస్తున్న తరుణంలో జరిగిన ఓ పరిణామాన్ని నేనిక్కడ గుర్తు చేసుకోకుండా ఉండలేక పోతున్నాను. ఇది నా భావోద్వేగమే కాదు చారిత్రకంగా రికార్డ్ కావాల్సిన అంశంగా భావించి రాస్తునాను. ఎవరిమీదా కోపం కానీ వ్యతిరేకత కానీ నాకులేవు,ఇతర లయ మిత్రులకూ లేక పోవడం సృజనాత్మక సంస్కారంగా నేను భావిస్తున్నాను.

లయ సంకలనం లో ఎవరెవరి కవితలు ఉండాలి అని చర్చ జరుగుతున్నప్పుడు దాదాపు చివరి దశలో అనుకుంటాను జూకంటి జగన్నాధం  ఒక ప్రస్తావన తెచ్చాడు అదేమంటే అల్లం నారాయణ అండర్ గ్రౌండ్ లో ఉన్నప్పటికీ ఆయన రాసిన గొప్ప కవిత్వాన్ని లయలో చేర్చాలన్నది ఆ ప్రతిపాదన. నారాయణ పట్ల ఆయన కవిత్వం పట్ల మిగతా అందరికీ ఇష్టమే అభిమానమే కానీ ఆ ప్రతిపాదనను అంగీకరించలేదు. ఉద్యమ కవిత్వానికి మిగతా వాళ్ళం  రాస్తున్న కవిత్వానికే రూపంలో కానీ ఇతరత్రా కానీ కుదరదు. కనుక చేర్చడం సమంజసం కాదని అన్నాము. దానితో ఏకీభవించని జూకంటి లయ నుంచి తాను కూడా వైదొలుగుతానన్నాడు.  దాంతో అప్పటికే కవర్ పేజీ వెనకాల అచ్చయిన పేర్లల్లోంచి జూకంటి పేరును తీసేయాల్సి వచ్చింది. అందుకు అందరం బాధపడ్డం. కానీ ఎవరి అభిప్రాయాన్నయినా  గౌరవించాలి కదా.

కానీ ఇందాకే చెప్పినట్టు లయ తర్వాత కూడా ఎప్పుడూ అందరమూ స్నేహంగానే వున్నాం. ఎవరెన్ని పుస్తకాలు రాసినా, ఎన్ని అవార్డులు తీసుకున్నా ఎంతగా ఎదిగినా ఇప్పటికీ కూడా అంతా ఆప్యాయంగానే వుంటాం.

ఇదీ మా లయ.

=================================31 జూలై 2021