Month: February 2023

Posted on

“ఏ దౌలత్ భి లేలో
ఏ చాహత్ భి లేలో
భలే చీన్ లో
ముజ్సే మేరి జవానీ
మగర్ ముజ్కో లౌటాదో
బచ్పన్ కా సావన్
వో కాగజ్ కే కష్టి
వో బారిష్ కా పానీ..”అన్నాడు కవి సుదర్శన్ ఫకీర్..
మిత్రులారా నిన్నటి సాయంత్రం పిల్లలతో వారి ఉత్సవంలో గడిచింది.. వాళ్ళతో నాలుగు మాటలు మాట్లాడ్డం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. పిల్లలెప్పుడూ గొప్ప టానిక్ నిస్తారు..
కరీంనగర్ ఆల్ఫోర్స్ చైర్మన్ శ్రీ నరేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు

83=యాదొంకీ బారాత్

Posted on

++++++++ వారాల ఆనంద్

జీవనయానంలో ఎన్నోదారులు, ఎన్నో ప్రయాణాలు. గమ్యం చేరడానికి నిరంతర శ్రమ. ఆ శ్రమలో అలసట ఆనందం, అందలం, అవమానం అన్నీ వుంటాయి. ఆ క్రమంలో మనం అందరమూ ఒకే దారి కాకుండా ఎవరి ఆసక్తిమేరకు వాళ్ళం పలు రంగాల్లో కృషి చేస్తాం. కొందరు ఒకే ఒక్క దారి ఎంచుకుంటే మరికొందరు భిన్నమయిన సృజనాత్మక దారుల్లో పయనిస్తూ వుంటారు. ఆ దారులన్నీ ఒక దానిపై మరోటి ప్రభావితం చూపుతూ వుంటాయి.

….

అట్లా నా జీవితంలో ఇప్పటిదాకా నేను ఎంచుకుని బంజారాలాగా నడిచిన దారులన్నీ ఒక దానికొకటి సహకరించాయి. బలాన్నిచ్చాయి. బలగాన్నిచ్చాయి. ఎంతగానో  ప్రోత్సహించాయి. అది ఆయా రంగాల్లో నాతో సహచరులుగా వున్న మిత్రుల గొప్పదనమే. అయితే వారిలో కొందరు కొంతకాలం అత్యంత దగ్గరగా వున్నారు, మరికొంత కాలం కొంత దూర దూరంగా వున్నారు. ఎవరెప్పుడు ఎట్లావున్నా అంతా నా వాళ్ళే అనుకుంటాను. కలిసిరాని విషయాల్లో కలవలేకున్నా కలిసొచ్చే వాటిల్లో కలిసి ఉండాలనుకుంటాను.

…..

అదంతా అట్లా వుంటే ఎస్.ఆర్.ఆర్. కాలేజీకి నాక్ గుర్తింపు వచ్చాక కాలేజీలో పనులు ఒక గాడిన పడ్డాయి. ఇక నా ప్రవృత్తి జీవితం ఫిలిం సోసటీ ఉద్యమంలో చురుకుగా ఉండడంతో పాటు మంచి సినిమాల ప్రదర్శన, వాటిపై చర్చలు, వ్యాసాలూ రాయడంతో పాటు పిల్లల కోసం ఏదయినా ప్రత్యేకంగా చేయాలన్నది నా తపన. అప్పటికి కరీంనగర్ ఫిలిం సొసైటీ అనేక సంవత్సరాలుగా బాలల చలన చిత్రోత్సవాల్ని నిర్వహిస్తూ వస్తున్నది. ఆ సినిమాల ప్రదర్శనల్లో బాలలు పాల్గొని, వాళ్ళు చూపే ఆసక్తి ఉత్సాహం నాకు వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చేది. ఇంకా ఏమైనా చేయాలన్న తపన ఆలోచన శురూ అయింది. పిల్లలకోసం ప్రత్యేకంగా ఫిలిం క్లబ్స్ పెడితే ఎట్లా వుంటుంది అనిపించింది. దాన్ని మా కఫిసో బాధ్యుడు ఉత్తమ ఉపాధ్యాయుడు  శ్రీ టి.రాజమౌళి చాలా బాగుంటుంది ఆనంద్ సర్. మనవాళ్ళు చాలా మంది టీచర్లుగా వున్నారు.ఆయా స్కూల్స్ లో మొదట ఆరంభిద్దాం అన్నాడు. కోలా రామచంద్రారెడ్డి, రఘురాం, లక్ష్మన్ కుమార్ లు కూడా ఎంతో ఆసక్తి చూపారు. ఇంకేముంది ‘చలో స్కూల్స్’.

వాటితో పాటు పిల్లలకు సినిమాను ఎట్లా చూడాలి, ఏవి మంచి సినిమాలు లాంటి అనేక విషయాలు చెప్పేందుకు FILM APPREDIATION COURSE FOR CHILDREN కార్యక్రమాన్ని చేపట్టాం. అందుకోసం సుప్రసిద్ధ రచయిత సినీ దర్శకుడు శ్రీ అక్కినేని కుటుంబరావు గారిని వోల్గా గారిని సంప్రదించాను.  అక్కినేని కుటుంబరావు గారు అప్పటికే పిల్లలకోసం ‘భద్రం కొడుకో’, ‘పాతనగరంలో పసివాడు’ లాంటి అద్భతమయిన సినిమాలు తీసారు. నాకు అత్యంత సన్నిహితులయిన వాళ్ళిద్దరూ అటు సాహిత్యం తో పాటు సినిమాల పైనా పంచి పట్టు వున్నవాళ్ళు. సృజనాత్మక రంగంలో పిల్లలకోసం విశేషంగా కృషి చేసారు. ఆ ఇద్దరినీ పిల్లల కోసం మేము చేపట్టిన FILM APPREDIATION COURSE FOR CHILDREN ను ప్రారంభించడానికి ఆహ్వానించగానే ఉత్సాహంగా వచ్చారు. ఆ కార్యక్రమాన్ని ఆరంభించి పిల్లల కోసం రూపొందిన సినిమాలు వాటి ప్రభావాలు తదితర అనేక విషయాల్ని వివరించారు. ఆ తర్వాత పిల్లల కోసం అప్పుడు మేము ఏర్పాటు చేసిన ఫిలిం క్లబ్స్ ని కూడా ప్రారంభించారు. ఆ కార్యక్రమాల్లో కలెక్టర్ శ్రీ సి.పార్థసారధి కూడా ఉత్సాహంగా పాలు పంచుకున్నారు. చామన్ పల్లి మొదలు అనేక స్కూల్స్ లో బాలల ఫిలిం క్లబ్స్ ఏర్పాటు చేసాం. అంతే కాదు కోర్సులో భాగంగా పిల్లలకోసం ఉపన్యాసాలు, వాళ్ళతో సినిమాల మీద వ్యాసాలూ రాయించాం. అది రాజమౌళి తదితరుల సహకారంతో కొన్నాళ్ళు విశేషంగా కొనసాగింది. ఇక తెలుగు సినిమా రంగంలో పిల్లల గురించి పిల్లల సినిమాల గురించి ఆలోచించి పలు విజయవంతమయిన సినిమాల్ని తీసిన దర్శకుడు అక్కినేని కుటుంబ రావు గారు. నంది అవార్డుతో పాటు అంతర్జాతీయంగా కైరో, గోల్డెన్ ఎలిఫెంట్ ఫెస్టివల్స్ లో గౌరవాలు పొందారు. వోల్గా గారు, కుటుంబ రావు గారు ఇద్దరూ ఆ తర్వాతి కాలం లో కూడా సినిమాకు సంబదించి అనేక కార్యక్రమాల్లో నాకు అండగా నిలబడ్డారు. తమ విలువయిన సమయాన్ని కఫిసో కోసం మా కాలేజీ కోసం ఇచ్చారు. వారికి నేనెంతో రుణపడి వున్నాను.

ఇక ఈ సందర్భంగా మిత్రుడు టి.రాజమౌళి బాగా గుర్తుకొస్తున్నాడు. అర్దాంతరంగా ఆకస్మికంగా మమ్మలనందరినీ వదిలి వెళ్లిపోయారాయన. నిబద్దత కలిగిన ఉపాద్యాయుడే కాకుండా సామాజిక బాధ్యత కలిగిన పోరుడిగా ఎంతో కృషి చేసిన ఉత్సాహవంతుడు. ఫిలిం సొసైటీ, వినియోగదారుల మండలి, లోక్ సత్తా ఇట్లా అనేక సంస్థల్లో నిస్వార్థంగా కృషి చేసారు. అంతేకాదు నిర్మొహమాటంగా తన అభిప్రాయాల్ని చెప్పేవాడు. చాలా శాష్ట్రీయంగా ఆలోచించేవాడు. సూటిగా మాట్లాడి కొంత ఇబ్బందినీ ఎదుర్కొన్నాడు. ఉత్సవ విగ్రహాల్లా వుండడం ఆయనకు ఇష్టంగా వుండేది కాదు. ప్రగతిశీల భావాలతో స్థిరంగా ఉండేవాడు. అంత మంచి మనిషిని కోల్పోవడం కరీంనగర్ లో అనేక సామాజిక ఉద్యమాలకు తీరని లోటు ఏర్పడింది. ఆయనకు నా హృదయపూర్వక నివాళులు.

……

అప్పుడే నా వ్యక్తిగత జీవితంలో అనేక పనులు ముందుకొచ్చాయి. అమ్మాయి రేల తొమ్మిదో క్లాసుకి, అన్వేష్ ఏడుకి వచ్చారు. మరోవైపు నా రచనారంగంలో అప్పటి వరకు ‘నవ్యచిత్ర వైతాళికులు’, ‘బాలల చిత్రాలు’, ‘సినీసుమాలు’ మొదలయిన పుస్తకాలతో సమాంతర సినిమాకు సంబంధించి కొంత పని జరిగింది. ఇక అప్పటిదాకా వివిధ పత్రికల్లో రాస్తూ వచ్చిన వ్యాసాల్ని ఒక చోట చేర్చి పుస్తకం తేవాలని ఆలోచన వచ్చింది. మొదట కొంచెం అయిష్టంగానే అయినా అప్పటి మిత్రుడు మానేర్ టైమ్స్ పత్రిక సంపాదకుడు పొన్నం రవిచంద్ర ఉత్సాహం కలిగించడంతో వ్యాసాలన్నీ ఒక చోటుకి చేర్చి చూస్తే ఫర్వాలేదు పుస్తకం వేయొచ్చు అనిపించింది. ఇంకేముంది పద ముందుకు. కంపోజింగ్ అమర్ చేసాడు. ‘24 ఫ్రేమ్స్’ అని పేరు  పెట్టాను. ఫిలిం ఫౌండేషన్ పేర పబ్లిష్ చేసాను. నా తమ్ముళ్ళు అర్జున్ అమర్ లకు ప్రేమతో అంకితంగా ఇచ్చాను. ఆ పుస్తకంలో ‘దృశ్య కావ్యాలయిన సాహితీ సుమాలు’, ‘చరిత్రను స్పృశించిన చలన చిత్రం’, ‘రాజకీయ చిత్రాలు’, ‘భారతీయ సినిమాల్లో స్త్రీ’, ‘తెగులు పట్టిన తెలుగు సినిమా’ లాంటి పలు వ్యాసాల్ని ఒక చోట కూర్చి ‘24 ఫ్రేమ్స్’ పుస్తకం పబ్లిష్ చేసాను. ఇక దాని రిలీజ్. సరిగ్గా అప్పుడే మిత్రుడు శ్రీ సుద్దాల అశోక్ తేజ కు జాతీయ పురస్కారం వచ్చింది. మానేర్ టైమ్స్ ఆధ్వర్యంలో 24 ఫ్రేమ్స్ ఆవిష్కరణ, అశోక్ కు సన్మానం ఏర్పాటు చేసారు. కరీంనగర్ ప్రెస్ భవన్ లో సభ జరిగింది. కవి మిత్రులు దర్భశయనం నా పుస్తకం మీద బాగా మాట్లాడారు. జర్నలిస్ట్ శ్రీ దేవులపల్లి అమర్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. అప్పుడు హిందు పత్రికలో పనిచేస్తున్న శ్రీ కే.శ్రీనివాస్ రెడ్డి కూడా సభకు హాజరయ్యారు. సభ బాగా జరిగింది. తర్వాత 24 ఫ్రేమ్స్ కి పాఠకులనుంచి విమర్శకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.వివిధ పత్రికల్లో వెండితెరకు దర్పణం అని, సునిశిత విశ్లేషణ అనీ విమర్శకులు రాసారు. అట్లా ఆ పుస్తకం నన్ను మరో మెట్టు ఎక్కేలా చేసింది.

ఇక మా ఇంటి విషయాల దగ్గరికి వచ్చేసరికి ఇంట్లో జరిగిన అనేక అనివార్యమయిన సంఘటనలతో నేనూ ఇందిర వావిలాల పల్లి, గణేష్ నగర్ ఇట్లా పలు ప్రాంతాల్లో అద్దె ఇండ్లల్లో వేరుగా ఉంటూ వచ్చాం. నేనయితే మంకమ్మతోట లోని మాఇంటికి క్రమం తప్పకుండా వెళ్ళడం చేసేవాన్ని. దాన్ని ఇందిర ఎప్పుడూ అభ్యంతర పెట్టలేదు. దాదాపు అన్ని విషయాల్లో నేను ఇన్వాల్వ్ అవుతూ వచ్చాను. పెద్ద తమ్ముడు అర్జున్ తన ఎం.సి.ఏ. పూర్తి చేసుకుని అమెరికా వెళ్ళాడు. అమర్ కి డిటిపి నేర్పించి మొదట వార్తలో ఆపరేటర్ గా జాయిన్ చేసాను. వాళ్ళు పోస్టింగ్ సిరిసిల్లా లో వేసారు. కొంతకాలం అక్కడే పనిచేసాడు. కరీంనగర్ లో కొత్తగా  ప్రారంభమయిన ఆంద్రజ్యోతి దిన పత్రిక లో ఎడిషన్ ఇంచార్జ్ గా వున్న మిత్రుడు కృష్ణ సహకారంతో ఆంద్ర జ్యోతిలో చేర్చాను. అట్లా స్థిరపడిపోయాడు. నాన్న కు నేను చెప్పడం ఆరంభించాను. వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలిక అని. మొదట ఇంటి పైన ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణం చేయాలని. నాన్న సరే నన్నాడు. మేకల నర్సయ్య మేస్త్రి గా ఆ పని పూర్తి అయింది. ఇక పెళ్లి. పెద్దవాడు అమెరికాలో వున్నాడు అయినా చిన్న వాడికి పెళ్లి చేయాలని నేను పట్టుబట్టాను. అమెరికా నుంచి రాగానే పెద్దోడి పెళ్లి అన్నాను. ఇంట్లో ఆడవాళ్ళు ఎవరూ లేరు. నేనూ ఇందిర అక్కడికి వెళ్తే కాని పెళ్ళిళ్ళు అయ్యేలా లేవు. నాన్న మనసులో ఏముందో తెలీదు. ఇందిర పైన కోపం పోయిందా లేదా అర్థం కాదు. ఇక్కడ నేనో ట్రిక్ ప్లే చేసాను. నాన్నా ఇందిర వస్తానని అంటోంది మీరేమంటారు అన్నాను.. నాదేముంది వస్తే వద్దంటానా? అన్నాడు. ఇందిరకు చెప్పాను నాన్న నిన్ను రమ్మన్నాడు అని ‘మామయ్య రమ్మంటే నాదేముంది పదండి ‘అంది. హమ్మయ్య అనుకున్నాను. మంగారి రామచంద్రం మామయ్యా అమర్ కి ఒక సంబంధం తెచ్చాడు. కరీంనగర్ మంకమ్మ తోటలోనే అమ్మాయి వాళ్ళ బాబాయి వాళ్ళింట్లో పెళ్లి చూపులు. మేము మాతో పాటు ఆత్మీయ మిత్రుడు పీ.ఎస్.రవీంద్ర ను కూడా రమ్మన్నాను. అమ్మాయి నచ్చింది. సిరిసిల్లా లో వాళ్ళింటికి వెళ్లాం అక్కడ కవి మిత్రుడు జూకంటి జగన్నాధం మాతో వచ్చాడు. మొత్తం మీద సిరిసిల్లాలో అమర్-శ్రీలత ల వివాహం బాగా జరిగింది.

ఇక అమెరికా నుంచి అర్జున్ రాగానే పెళ్లి అనుకున్నాం. సాహిత్య పరంగానూ వేములవాడ వాస్తవ్యుడి గానూ సంస్కృత పండితుడు కవి శ్రీ నమిలకొండ హరిప్రసాద్  ఆత్మీయుడు మిత్రుడు. అన్ని రకాలుగా నాకు మార్గనిర్దేశం చేసినవాడు. దాదాపు అన్ని విషయాల్నీ ఆయనతో సంప్రదించే వాణ్ని. ఆయన ఆలోచనతో ఇచ్చిన సూచనలు నాకూ ఇందిరకూ శిరోదార్యమయ్యాయి. అర్జున్ పెళ్లి విషయం ముందుకు వచ్చేసరికి మా పెద్దనాన్న కొడుకు మహేశన్న, వదిన నవీన ఒక సంబంధం తో ముందుకువచ్చారు. వదిన, మేమిద్దరం, గుణ చిన్నమ్మ బొల్లారం లో అమ్మాయిని కలిసాం. వీడియో కాల్స్ లో అర్జున్-ఉష చూసుకున్నారు, మాట్లాడుకున్నారు. అంతా సరే ననుకున్నాం. ఇంతలో ఉష వాళ్ళ అమ్మగారికి తీవ్ర అనారోగ్యం. తర్వాత ఆమె వెళ్ళిపోయారు. హరిప్రసాద్ సలహా మేరకు కొంత  సమయం తీసుకుని పెళ్లి జరిపించాం. అంతా బాగానే జరిగింది. నాన్న హమ్మయ్య అనుకున్నారు. తన సంతానం అందరికీ వివాహాలు అయ్యాయి స్థిర పడ్డట్టే అనుకుని ఊపిరి పీల్చున్నారు.

ఇదంతా ఇట్లా వుండగా ఒకరోజు ఒక పెళ్లికి ఇందిర నేనూ వెళ్లాం. అక్కడ శ్రీనివాస్ కలిసాడు. ఇందిరతో మాట్లాడుతూ ఎక్కడున్నారు అన్నాడు. ఏముంది బ్యాంకు కాలనీ అంది. నన్ను చూసి ఇంకా కిరాయి ఇంట్లోనేనా బలుపా అన్నాడు. ఇల్లు పూర్తిచేసుకోవచ్చు కదా అన్నాడు. ‘బలుపుంది’ కానీ ‘డబ్బులే లేవు’ అన్నాను. ఆయన నవ్వి రేపు బ్యాంకు కు రా…. అన్నాడు. మర్నాడు నేను వెళ్లాను. మానకొండూరు బ్యాంకు లో లోన్ వుంది కదా అది కట్టేసి ఇక్కడ కరీంనగర్ లో తీసుకో అన్నాడు. భలే చెబుతావు సర్. లోన్ కట్టడానికి పైసలు కావాలి కదా అన్నాను. ఇక్కడ తీసుకో, వెళ్లి అక్కడ కట్టేసి డాక్యుమెంట్స్ తెచ్చి ఇక్కడ ఇచ్చేయి అన్నాడు. నేను థ్రిల్ అయ్యాను. వెంటనే మిత్రుడు జర్నలిస్ట్ పి.ఎస్.రవీంద్ర ను రమ్మన్నాను. బ్యాంకు నుంచి డబ్బు తీసుకుని ఇద్దరమూ మానకొండూరు వెళ్లి లోన్ కట్టేసి డాక్యుమెంట్స్ ఇక్కడ ఇచ్చేశాను. ఇక్కడ లోన్ సాంక్షన్ అయింది.

ఇంకేముంది హనుమాన్ నగర్ లో పైన ఫస్ట్ ఫ్లోర్ పని ప్రారంభం. మేకల నర్సయ్య మేస్త్రి,, శంకరయ్య కార్పెంటర్ లు. హరి ప్రసాద్, యాద కిషన్ లు సలహాదార్లు. కడప పెట్టాలి అన్నారు. సరిగ్గా అదే సమయానికి మా పెదనాన్న వెంకటస్వామి గారి శ్రీమతి శారద ఆకస్మికంగా మృతి చెందారు. వారాల వాళ్ళింట్లో ఒక విషాదం. పాలివాండ్లు కనుక కడప పెట్టడానికి లేదు. ఎట్లా ఆలోచనలో పడ్డాం. దీనికి ఇంత ఆలోచన ఎందుకు నేను, మేస్త్రి, కార్పెంటర్ లము కడప నిలబెడతాం. మీరు పిల్లలు అట్లా చూస్తూ నిలబడండి హరిప్రసాద్ అన్నాడు. సరే నన్నాం. ఎట్లాంటి ఆటంకం లేకుండా పని ఆరంభం అయింది.

ఇంటి విషయాల్లో మరో ముఖ్యమయిన పని మొదలయింది…

మిగతా మళ్ళీ వారం

-వారాల ఆనంద్                        

అర్థవంతమయిన సినిమా ‘హిందీ మీడియం’ -వారాల ఆనంద్

Posted on

      మాతృ భాష, మాతృ మూర్తి, మాతృ దేశం మానవ జీవితం లో గోప్ప భావనలు. వాటి గురించి అందరూ భావనత్మకమయిన అనుభందాన్ని కలిగివుంటారు.అంతేకాదు

మాతృభాషలో చదివిన చదువులు నాణ్యమైన మయినవని విద్యనేర్చుకోవడానికి మాతృభాష మూలమని యునెస్కో అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు అనేక ఏళ్లుగా చెబుతున్నాయి. విద్యాబోధన లో అది చాలా కీలకమైన విషయం. ముఖ్యంగా పాఠశాల స్థాయిలో మాతృభాష ఎంతో అవసరం.పిల్లలు తమని తాము వ్యక్తం చేసుకునేందుకు కూడా మాతృభాష ఎంతో దోహదం చేస్తుంది. మాతృభాషా మాధ్యమంలో విద్య పిల్లలను చిన్నప్పటి నుంచీ తమచుట్టూ ఉన్న సమాజంతో కలిసిమెలిసి పెరిగేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇది పరస్పర అవగాహనకూ పనికొస్తుంది, చుట్టూ ఉన్నవారి పట్ల బాధ్యతను గుర్తుచేస్తుంది. అమ్మ భాషలో పొందుపరిచిన సాంస్కృతిక సామాజిక సమతా వారసత్వ సంపదను సంరక్షించడంలో సహాయపడుతుంది. భారత రాజ్యాంగంలోని 350ఏ అధికరణం పిల్లలకు ప్రాథమిక స్థాయిలో మాతృభాషా మాధ్యమంలో బోధించడానికి కావలసిన సదుపాయాలను కల్పించవలసినదిగా రాష్ట్రాలకు సూచిస్తోంది.కానీ దాదాపుగా అన్ని ప్రభుత్వాలూ దానిని అమలు చేయడం లేదు పైగా మాతృభాషను పాఠశాల విద్యామాధ్యమం నుంచి తొలగించి ఆ స్థానంలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం ఒక చారిత్రక తప్పిదం. అయితే ఆంగ్లాన్ని రుద్దేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు తోడు ఆంగ్లానికి అనుకూలంగా జరుగుతున్న ప్రచారాలు తల్లిదండ్రుల్ని కూడా ఆంగ్ల వ్యామోహం వైపునకు నెట్టి వేస్తున్నది.

దానికి తోడు  ప్రపంచీకరణ నేపధ్యంలో మారిన పరిస్థితులు, పెరిగిన అనారోగ్యక్రమయిన పోటీ పరిస్థితుల్లో విద్య విషయంలో దాదాపు అందరూ ఆంగ్ల మాద్యం వైపునకే మొగ్గు చూపుతున్నారు. నిజానికి యునెస్కో

సహా అనేక విద్యా విషయ మేధావులు పరిశోదనలు చెబుతున్న దాని ప్రకారం విద్య ముఖ్యంగా పాఠశాల స్థాయి విద్య మాతృ భాషలో అందించగలిగినప్పుడే విద్యార్థులు సహజంగా ఎదుగుతారని, నేర్చుకుంటారని నిరూపితమయింది. కాని పోటీ తత్వంతో పాటు తల్లిదండ్రుల్లో పెరిగిన ఆశలు అంచనాల నేపధ్యంలో తమ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్ళల్లో, ఇంగ్లీష్ మాధ్యంమంలో చదివించాలనే ఆశలు ప్రబలంగా కనిపిస్తున్నాయి. అట్లా చదివించడానికి తల్లీ దండ్రులు ఎంత దూరమయిన  పోవడానికి, తప్పులు చేయడానికీ సిద్ధపడడం మనం  చూస్తున్నాం.

అట్లా అత్యాశతో తమ కూతురును ధిల్లీ గ్రామర్ స్కూల్లో చదివించాలని ప్రయత్నించిన ఓ జంట కథే ‘హిందీ మీడియం’. చాలా వాస్తవిక దృష్టి కోణంలోంచి అత్యంత సహజమయిన వాతావరణంలో నిర్మించబడ్డ ‘హిందీ మీడియం’ సినిమాను సాకేత్ చౌదరి తన దర్శకత్వ ప్రతిభతో విలక్షణమయిన సినిమాగా రూపొందించాడు. అతి స్వల్ప నిర్మాణ వ్యయంతో నిర్మించిన ఈ సినిమా ఆర్థికంగా కూడా విజయవంతమయింది. ఇక ఇందులో ప్రధాన పాత్ర పోషించిన ఇర్ఫాన్ ఖాన్ తన అద్భుత నటనతో సినిమాకు గొప్ప బలాన్ని తీసుకొచ్చారు. తన భార్య ఆశల మేరకు కూతురిని పెద్ద స్కూల్లో చదివించడానికి అతను పడ్డ యమయాతన హాస్యాన్ని పంచుతూనే విద్యావ్యవస్థ, పేరెంట్స్ అత్యాశ, మానవీయ విలువల ఆవిష్కరణగా సినిమా సాగుతుంది. అన్ని అవస్థలు పడి పనికిరాని రోబోలను తయారుచేసే వ్యాపార స్కూల్స్ కంటే సృజనాత్మక విలువల్ని పంచె మాతృభాష లో నడిచే ప్రభుత్వ స్కూళ్ళు మంచిదనే వాస్తవాన్ని ఆవిష్కరిస్తూ సినిమా పాజిటివ్ నోట్ తో ముగుస్తుంది. హిందీ మీడియం సినిమా వర్తమాన పరిస్థితుల్ని గొప్పగా ఆవిష్కరిస్తుంది.

    సినిమా కథాంశానికి వస్తే ఢిల్లీలో మంచి వ్యాపారవేత్త అయిన రాజ్ బాత్ర తన శ్రీమతి మితా, కూతురు పియా తో కలిసి నివసిస్తూ ఉంటాడు. రాజ్ , మితా లు ఇద్దరూ హిందీ మీడియం లోనే చదివి వుండడం వల్ల తన కూతురు పెద్ద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవాలని తల్లీ మీతా కోరుకుంటుంది. ఆమేరకు భర్తపైన తీవ్రమయిన వొత్తిడి తెస్తుంది. ఢిల్లీ గ్రామర్ స్కూల్లో చేర్పించాలని అనుకుంటారు. మూడు కిలోమీటర్ల లోపు  నివ సించేవారికే సీట్ ఇస్తామని చెప్పడంతో తమ ఇల్లుని స్కూలు దగ్గరికి మార్చుకుంటారు. ప్రవేశాల విషయంలో తల్లీ దండ్రులకు కూడా ఇంటర్వూ ఉంటుందని తెలిసి ఇద్దరూ శిక్షణ తీసుకుంటారు. కాని రాజ్ బాత్ర ఇంటర్వ్యు లో విఫలం చెందుతాడు. కాని విద్యా హక్కు చట్టం కింద తమ కూతురుకు ప్రవేశం దొరకొచ్చని తెలుసుకొని బీదవారిగా కనిపించడానికి గాను ఒక బస్తీలో కాపురముంటారు. ప్రవేశానికి దరఖాస్తు చేసుకుంటారు. బస్తీలో పక్కింటి శ్యాం ప్రకాష్ కుటుంబం అన్ని విధాల వారికి  సహకరిస్తారు. చివరగా వెరిఫికేషన్ కోసం స్కూల్ నుండి వచ్చిన టీచర్ ముందు వాళ్ళ ఆర్ధిక స్థితి బయటపడే స్థితి వస్తుంది. కాని శ్యాం ప్రకాష్ వారి పక్షాన వాదించి కాపాడుతాడు. పియా అడ్మిషన్ ను ఓకే చెబుతూ 24౦౦౦/ ఇతర ఫీజులకింద చెల్లించమని చెబుతారు. ఆ రాత్రి తన డెబిట్ కార్డ్ తో ఏ టి ఎం నుంచి డబ్బు డ్రా చేస్తున్న రాజ్ బాత్ర ను చూసి శ్యాం ప్రకాష్ దొంగిలిస్తున్నాడేమో ననుకుని లాక్కోస్తాడు. ఎదురుగా వస్తున్న వాన్ కింద పడి తగిలిన దెబ్బలకు పరిహారంగా డబ్బులు వసూలు చేసి రాజ్ కిస్తాడు శ్యాం ప్రకాష్. పియా అడ్మిషన్ పూర్తి అవుతుంది. కాని శ్యాం ప్రకాష్ కొడుక్కి అడ్మిషన్ దొరకదు. ఇక రాజ్ మీతా లు తమ స్వంత విహార్ ఇంటికి మారిపోతారు. శ్యాం ప్రకాష్ కొడుకు మోహన్ చదువుతున్న స్కూలుకు వెళ్ళిన రాజ్ మీతా లు అక్కడి స్థితి చూసి కదిలిపోతారు. తామెవరో చెప్పకుండా ఆ స్కూలుకు అన్ని వసతులు కల్పిస్తారు. మోహన్ చదువులో వస్తున్న మార్పుకు సంతోషించిన శ్యాం ప్రకాష్ సహకరిస్తున్న దాతల వివరాలు ప్రిన్సిపాల్ నుంచి తీసుకొని ధన్యవాదాలు చెప్పడానికి వసంత విహార్ కు వెళ్తాడు. అక్కడ రాజ్ బాత్రను చూసి ఖిన్నుడవుతాడు. గ్రామ్మార్ స్కూల్లో మోసం గురించి చెప్పాలని వెళ్తాడు కాని అక్కడ పియా ను చూసి మనసు మార్చుకుంటాడు. అడ్మిషన్ కోసం తాము చేసిన మోసం గురించి రాజ్ బాత్ర తీవ్ర మనస్తాపానికి గురయి స్కూలుకు వెళ్లి అడ్మిషన్ కాన్సిల్ చేయమంటాడు. కాని ప్రిన్సిపాల్ వినదు. అయినా రాజ్ మితా లు తమ కూతుర్ని తీసుకొని ప్రభుత్వ స్కూలుకు వెళ్లి అడ్మిషన్ తీసుకొంటారు. ప్రభుత్వ స్కూల్లనే మెరుగు పరుచుకొని తమ కూతురికి మంచి అర్థవంతమయిన విద్యనూ అందించాలని తలపోస్తారు. అట్లా తమ ఇంగ్లీష్ మీడియం వ్యామోహం నుండి బయటపడి హిందీ మీడియం లో తమ కూతుర్ని చేర్పిస్తారు. అట్లా ఒక వాస్తవాన్ని అత్యంత వాస్తవికంగా హిందీ మీడియం సినిమాలో చూపిస్తాడు దర్శకుడు. ఇర్ఫాన్ ఖాన్, సబా ఖమర్ ల నటన చాలా బాగుంటుంది. వాస్తవికంగా సాగుతుంది. సినిమాలో ఆద్యంతం హాస్యం వెళ్లి విరిసి ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది. కేవలం 23 కోట్లతో నిర్మించబడ్డ హిందీ మీడియం సినిమా 336 కోట్లకు పైగా వసూలు చేసిందన్నారు.

 ఇవాల్టి తల్లిదండ్రులంతా చూడాల్సిన సినిమా                                     

-వారాల ఆనంద్