వారాల ఆనంద్ కవిత్వం

పుస్తకం లాంటి మనిషి

Posted on

పుస్తకం లాంటి మనిషి  

++++++++++++ వారాల ఆనంద్

దశాబ్దాలపాటు కళ్ళారా చూస్తూ

వాటి మధ్యే బతికానేమో

పుస్తకాల్ని

దూరంగా అద్దాల బీరువాలో చూసినా

దగ్గరగా నా రీడింగ్ టేబుల్ పై చూసినా

ఆత్మీయుణ్ణీ అయినవాణ్ణీ చూసినట్టుంటుంది

చూసీ చూడగానే కరచాలనం చేయాలనిపిస్తుంది

మునివేళ్ళను పెదాలపై అద్దుకుని మెల్లిగా

పేజీ తర్వాత పేజీ తిప్పేయాలనిపిస్తుంది

అప్పుడు

కొన్నింటితో స్నేహం కుదుర్తుంది

కొన్నింటికి నేను స్నేహితుడినయిపోతాను

కొన్ని పుస్తకాలు హృదయాన్ని కదిలిస్తే

మరికొన్ని నులిపెడతాయి

నేను కరిగి నీరయిపోతాను

కొన్ని నవ్విస్తే,

మరికొన్ని ఏడిపిస్తాయి

కొన్ని ఆలోచనల్ని రేకెత్తిస్తే

ఇంకొన్ని ఆవేశాన్ని రగిలిస్తాయి

నేనేమో పిడికిలి బిగించి ఊగిపోతాను

మొత్తంగా పుస్తకాలు నాలో భాగమవుతాయి

నేను వాటిలో లీనమవుతాను

అయినా పుటలు పుటలుగా పొరలు పొరలుగా

నన్ను తెరిచి తరిచి చూసే పుస్తకం కోసం

పుస్తకం లాంటి మనిషికోసం వెతుకుతూనే వున్నా..

*****************

24 ఏప్రిల్ 2024 WORLD BOOK DAY

“ప్రజాస్వామ్యం” ++++వారాల ఆనంద్

Posted on

“ప్రజాస్వామ్యం”

++++ వారాల ఆనంద్

ఓటు హక్కున్న మనుషులు

నడుస్తున్న కరెన్సీ అయిపోయినప్పుడు

పలుకుతున్న మాటలన్నీ

జమా ఖర్చులే

సర్వత్రా

నేను నాదీ నాకు అనేవే   

ఉఛ్వాస నిశ్వాసలై ఊరేగినప్పుడు                                                                                                                                                    

“ప్రజల చేత, ప్రజలయొక్క, ప్రజలకొరకు”

అన్న భావన సలసల కాగే స్వార్థపు జడిలో  

ఆవిరై అదృశ్యమైపోక

నాకోసమో నీకోసమో మిగులుతుందా

ఎన్నికల మైదానంలో

కూటమి, ఫిరాయింపు, బంధుప్రీతి  

మూడురంగుల జెండాగా తలెత్తుకు   

రెప రెప లాడుతూ వుంటే

కొంగ్రొత్త ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది

ప్రజలే ప్రేక్షకులై బిక్కమొహమేసుకుని

ప్రేక్షకుల్లా అచేతనంగా నిలబడిపోతారు 

*********************                                                                                                                                                                                                                                                                                          

చార్లీ చాప్లిన్

Posted on

చార్లీ చాప్లిన్

++++++++ వారాల ఆనంద్

హాస్యం వారధిగా
దుఖాన్ని
దృశ్య మానం చేశావు

చిత్రంగా
హాస్యం సమస్త లోకానికి చేరింది

దుఖం మాత్రం నీలో నిలిచిపోయింది

************************************
( చార్లీ చాప్లిన్ జయంతి నేడు )

16 ఏప్రిల్ 2024

చార్లీ చాప్లిన్

పెద్ద సమయం పట్టదు++++++ వారాల ఆనంద్

Posted on

FRIENDS,READ MY POEM PUBLISHED IN NAVATELANGANA TODAY,Tq

పెద్ద సమయం పట్టదు

+++++++++++++++ వారాల ఆనంద్

అంతా కనిపిస్తూనే వుంటారు

అందరూ వినిపిస్తూనే వుంటారు

కానీ

కలిసివుండటానికీ కలిసిపోవడానికీ అందరినడుమా అడ్డంగా   

కళ్ళముందే మొలుస్తున్న గోడలు

ఎవరికి వారు నిర్మించుకుంటున్న దడీలు

భ్రమాలోకపు గడీలు

తవ్వి తలకెత్తుకుంటున్న కందకాలు

చుట్టూరా ఖాళీలు కొలతలకందని దూరాలు

ఎవరి లెక్క వారిది ఎవరి కుహరం వాళ్ళది

నేనే

ఇన్నాళ్లూ ఇన్నేళ్లూ కాళ్ళరిగేలా కలియదిరిగాను

ప్రవాహంలా పరుగులుపెట్టాను

ప్రయాణ కాలంలో అనేక దశలు దిశలు

అలసట వొచ్చినప్పుడల్లా

‘అల్లమురబ్బా’ నోట్లో వేసుకుని

పైత్యాన్ని వదిలించుకున్నాను

ఇవ్వాళ

ఖాళీల్ని పూరించడానికి మౌనాన్ని శబ్దమయం చేయడానికి  

కొత్త పదాల్ని పదబంధాల్నీ నేర్చుకుంటున్నాను

బంధాలకు కొత్త రూపునూ

అనుబంధాలకు నవ్యదారుల్నీ రూపొందిస్తున్నాను

మబ్బుల అంతరాయాల్ని తొలగిస్తూ

అస్తమయం కానీ జీవితాన్ని అవలోకిస్తూ 

మనుషుల సమూహంలోకి

మమతల జాతరలోకి

నడక సాగిస్తున్నాను  

అస్తమయం తర్వాత

సూర్యోదయానికి పెద్ద సమయం పట్టదు

కొంచెం ఓపికుండాలి

ఒకింత విశ్వాసముండాలి

ఎంతయినా అందరమూ మనుషులమే కదా!

****************** 9440501281

15 APRIL 2024

బతుకు సమీకరణం కాదు-వారాల ఆనంద్

Posted on

Friends,pl read my poem published today 15 April 2024  in Andhra Prabha daily, Tq

బతుకు సమీకరణం కాదు

++++++++++++ వారాల ఆనంద్

జీవితం నడుస్తున్నాదా

పరుగెడుతున్నదా చతికిలబడ్డదా

ఓ క్షణం వెనక్కి చూస్తూ

వేగం పుంజుకుంటున్నదా

వెనక్కు చూస్తూ చూస్తూ వెన్ను చూపిస్తున్నదా!

నిటారుగా నిలబడిందా

వంగుతూ లేస్తూ

అంబాడుతూ లేస్తూ

అవతలితీరంకేసి చూస్తున్నాదా

ఏమో అద్దంలో ప్రతిబింబాన్ని చూసినట్టు

నా బతుకు నాకూ

నీ బతుకు నీకూ తెలియాలి

లేదూ కెమెరా కన్నేసుకు చూసే

నీ ముందరి వాడికి తెలియాలి

అయినా బతుకు

ఏ సూత్రమో రసాయన సమీకరణమో అయితే

దానంత విసుగయిందీ అసహజమయిందేదీ లేదు

నిజానికి  

ఫ్లై ఓవర్ లాంటి ఎత్తుపళ్లాలతో 

మెలికలు తిరిగే మలుపుల్తో  

యాదేచ్చగా అర్థవంతంగా సాగేదే జీవితం

************ 9440501281        

యాదోంకీ బారాత్ 2- సిరీస్- నంబర్ 12

Posted on

 యాదోంకీ బారాత్

 2- సిరీస్- నంబర్ 12

++++++++++++++++ వారాల ఆనంద్

మొదలయిందేదయినా ముగియకతప్పదు. కొన్ని ఎప్పుడు మొదలయ్యాయో తెలీదు, మరికొన్ని ఎప్పుడు ముగుస్తాయో చెప్పలేం. జీవితాల సంగతి అట్లా వుంచితే ఉద్యోగం విషయం మాత్రం మొదలయినప్పుడే  ముగింపు ఎప్పుడో తెలుస్తుంది. టైర్  అయినా లేకున్నా రిటైర్ అవడం తప్పదు కదా. అలాంటి ముగింపు నా ఉద్యోగ జీవితంలో కూడా వచ్చింది. అప్పటికే నాతో కలిసి పనిచేసినవాళ్లూ, కలిసి నడిచిన వాళ్ళూ రిటైర్ అయి విశ్రాంతి జీవితాల్లోకి వెళ్ళిపోయారు.

“బతుకు ప్రయాణంలో

ఎందరో స్నేహితులు

ఎవరి స్టేషన్లో వాళ్ళు దిగి పోయారు”  

+++

నా ఉద్యోగ జీవితం 2016 లో ముగింపునకు వచ్చింది. 1980 జనవరి నుంచి కాలేజీ గ్రంధాలయ అధికారిగా నా ఉద్యోగజీవితం ఒకింత సాఫీగానే  సాగింది. ఆ లైబ్రెరియన్ ఉద్యోగంలో ఏమి మజా వుంటుంది.                 

చేసేదీ ఏముండదు అని అన్నవాళ్లూ, అనుకున్నవాళ్లూ వున్నారు. లైబ్రెరియన్ అంటే నిద్రపోయేవాడు అని అనుకున్నవాళ్లూ వున్నారు. విద్యాసంవత్సరం మొదట్లో ఏవో కొన్ని పుస్తకాలు పంచి ఏడాది చివర తిరిగి తీసుకోవడమే లైబ్రెరియన్ చేసేపని అని ఎగతాళి చేసిన వాళ్ళూ వున్నారు.                                                 కానీ  నేను మాత్రం నా ఉద్యోగాన్ని కొంత ఆసక్తిగానూ ఎంతో ఉత్సాహంగానూ చేశాను. విద్యార్థులూ పుస్తకాలూ అధ్యాపకులూ వీరందరి నడుమా బుక్స్ ఇవ్వడం పుచ్చుకోవడం మాత్రమే కాకుండా సాహితీ సాంస్కృతిక రంగాల్లో పనిచేస్తూ అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ చైతన్యవంతంగానే గడిపాను. ముఖ్యంగా ఎస్.ఆర్.ఆర్.కాలేజీలోకి వచ్చాక నాకు గొప్ప మైదానమే దొరికింది. కేవలం పుస్తకాలూ విద్యార్థులే కాకుండా వైవిధ్యంగా పనిచేసే గొప్ప అవకాశం నాకా కాలేజీ ఇచ్చింది. దాంతో నేను రంగులరాట్నంలా  గిర గిరా తిరిగాను.          

‘రంగుల రాట్నం’

+++++

సూర్యచంద్రులు

కళ్లు మూస్తూ తెరుస్తూనే వున్నారు

నేనేమో కాలాన్ని భుజానేసుకుని

‘రంగులరాట్నం’లా గిర గిరా తిరుగుతున్నా

++++++++++++ అని  రాసుకునే అవకాశం వచ్చింది.

అయితే ముగింపు సంవత్సరానికి వచ్చేసరికి ముగించాల్సిన పనులు, అప్పగించాల్సిన బాధ్యతలు అనేకం ఒక్కసారిగా ముప్పిరిగొన్నాయి. అప్పటికే  రెండేళ్లుగా అనారోగ్యం, మందుల నడుమ చక్కర్లు కొడుతున్నవాన్ని. ఆ క్రమంలో నా సహోద్యోగులూ సహచరులూ స్నేహితులూ అందించిన సహకారం ఎనలేనిది.అప్పుడు నా చార్జ్ లో చాలా అంశాలున్నాయి. కేవలం లైబ్రరీ  విషయానికే వస్తే ప్రధాన గ్రంధాలయంలోని వేలాది పుస్తకాలు, యుజీసీ విభాగం, బుక్  బాంక్, రెఫెరెన్స్ విభాగం, శాతవాహన విభాగం పేర నేను సేకరించిన కరీంనగర్ జిల్లా కవులూ రచయితల పుస్తకాలు, నేనే మొదలెట్టి నడిపిన జర్నలిజం కోర్సు, ఫిల్మ్ మేకింగ్ కోర్సు, మిత్రుడు బయోటెక్నాలజీ శాఖ రీడర్  డాక్టర్ ఎస్.మాధవ రావు గారు ప్రిన్సిపాల్ గా బదిలీ అయి వెళుతూ ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ  స్టడీ సెంటర్ బాధ్యతలు అప్పగించగా వున్న బాధ్యత, మెరిట్ విద్యార్థులకు ఇచ్చే గోల్డ్ మెడల్ విభాగం ఇట్లా అనేక బాధ్యతల్ని వివిధ అధ్యాపకులకు లెక్కలు చూపించి మరీ అప్పగించాలి. అదంతా పెద్ద పని. నాకు మొదటి నుంచీ ఎంతయినా పని చేయడం ఇష్టమే కానీ చార్జ్ అప్పగించడమంటేనే ఎక్కడ్లేని బద్దకం. అదో పెద్ద రోదన. కానీ తప్పదు. ఈ  చార్జ్ ఏర్పాట్లు జరుగుతుండగానే ఆ 2016 లో ముగిసే జర్నలిజం కోర్సు సర్టిఫికెట్ల పంపిణీ పూర్తి చేయాలి. అప్పుడు ప్రిన్సిపాల్ శ్రీ నితిన్ సంపూర్ణంగా సహకరించాడు. ఆరు మాసాల జర్నలిజం కోర్సు కేవలం నా చొరవతోటే మొదలయింది. పదమూడు బ్యాచులు అత్యంత విజయవంతంగా నడిచాయి.అప్పటి విద్యార్థులు అనేకమంది ఇవ్వాళ  ప్రధాన స్రవంతి జర్నలిజంలో వున్నారు. 13వ బ్యాచ్ ముగింపు సభ నా సర్వీసులో చివరిది కనుక ఎంతో ఉత్సాహంగా ఆడంబరంగా జరిగింది  ఆనాటి సభలో నితిన్, లెక్చరర్ మిత్రులు శ్రీయుతులు సుబ్బరామిరెడ్డి, డాక్టర్ ఎస్.మనోహరాచారి,  వై.సత్యనారాయణ, సత్యప్రకాశ్ లు ఎంతో ఆసక్తిగా పాలు పంచుకున్నారు. తర్వాత జర్నలిజం కోర్సు పట్ల ఎంతో ఆసక్తిగా పనిచేసిన సుబ్బరామి రెడ్డి గారికి కోర్సు చార్జ్    అప్పగించాను.ఇక ఇగ్నో స్టడీ సెంటర్ ను యూనివర్సిటీ  ఎత్తేయడంతో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, కంప్యూటర్స్ మొదలయినవన్నీ యూనివర్సిటీ కి పంపించేశాను.  

కాలేజీలో ఇదంతా ఇట్లా జరుగుతుండగానే ప్రముఖ కవి డాక్టర్ గండ్ర లక్ష్మణరావు గారు తమ తండ్రి గారు కీ.శే.గండ్ర  హనుమంత రావు గారు పేరుమీద ఇచ్చే ‘గండ్ర హనుమంత రావు స్మారక సాహితీ పురస్కారం                                                                                        ’ నాకు ప్రకటించారు. కరీంనగర్ జిల్లా కేంద్ర  గ్రంధాలయంలో జరిగిన సభకు డాక్టర్ నందిని సిధారెడ్డి, దేశపతి  శ్రీనివాస్, వఝల శివకుమార్ లు అతిథులుగా హాజరయ్యారు. ఆ పురస్కారం నాకో గొప్ప గుర్తింపుగా ఫీలయ్యాను.

ఇదిట్లా వుండగానే జగిత్యాల లో సాంస్కృతిక రంగంలో విశేష కృషి చేస్తున్న శ్రీ గుండేటి రాజు ఫోన్ చేశాడు. తమ వూరివాడు గొప్ప కవీ ఫోటోగ్రాఫర్ అలిశెట్టి ప్రభాకర్ పేరున రాష్ట్ర స్థాయి పురస్కారం             ఇవ్వాలనుకుంటున్నాం, ఆ మొదటి అవార్డును నాకు ఇవాలనుకుంటున్నట్టు చెప్పాడు.  అలిశెట్టి ప్రభాకర్   పెరు వినగానే ఎన్నెన్ని జ్నాపకాలు.ఎన్నెన్ని అనుభూతులు. అలిశెట్టిని మొట్టమొదట కలిసింది జగిత్యాల లోనే. నేనూ మిత్రుడు డి.వెంకటేశ్వర్ రావు ఇద్దరమూ ప్రత్యేకంగా వచ్చి కలిశాం. తర్వాత కలిసి లయ కవితా సంకలనం వేశాం,కరీంనగర్లో శిల్పి స్టూడియో, హైదరాబాద్ లో చిత్రలేఖ స్టూడియో ఇట్లా ఒకటనేమిటి ఎన్నో ఏళ్ల అనుబంధం.నేను ‘నవ్యచిత్ర వైతాళికులు’ సినిమా వ్యాసాలు రాయడంలోనూ అవి ‘పల్లకి’ పత్రికలో  రావడంలోనూ అలిశెట్టి సాహచర్యం ఎంతగానో తోడ్పడింది.నువ్వు కవిత్వం రాయడం లేదు కదా నీ కిష్టమయిన సమాంతర సినిమాల మీద వ్యాసాలు రాయి అని నన్ను సిద్ధం చేసింది ఒకరకంగా అలిశెట్టి ప్రభాకరే. నాకు అప్పటికే ఏమయినా రాయాలి అన్న కోరిక వున్నప్పటికీ రాసేలా చేసింది ప్రభాకరే. అలాంటి అలిశెట్టి పేరుమీద ఇవ్వ తలపెట్టిన అవార్డు నాకు ఇస్తాననడం, అదీ జగిత్యాలలో కావడంతో ఇష్టంగా  అంగీకరించాను. నేనూ ఇందిరా బయలుదేరాం.  ఏం.ఎల్.ఏ.శ్రీ టి.జీవన్ రెడ్డి గుండేటి రాజు తదితరులు పాల్గొన్నారు. సభ ఎంతో అభిమానంగా జరిగింది. ఆ సభకు నా పాత మిత్రుడు వెంకటేశ్వర్ రావు కూడా రావడం చాలా సంతోషాన్నిచ్చింది. సభ తర్వాత వెంకటేష్  ఇంటికి వెళ్ళాం.అట్లా ఆనాటి జగిత్యాల సభ పూర్హ్తి అయింది. ఇక  కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ లో అప్పుడే ఇరానియన్ ఫిల్మ్ ఫెల్మ్ ఫెస్టివల్ నిర్వహించారు. నేనూ నరెడ్ల శ్రీనివాస్ మాట్లాడాము. నేను ఇరానియన్ సినిమా అక్కడి దర్శకులు వాళ్ళ కళాత్మకత, ముఖ్యంగా పిల్లలకోసం వాళ్ళ సినిమాలు తదితర అంశాల మీద మాట్లాడాను. ఆ ఫెస్టివల్ లో చాలా మంచి పాకేజ్ ఆఫ్ ఫిల్మ్స్ వచ్చాయి. ఫెడరేషన్ వాళ్ళు పంపిణీ చేశారు.

ఇక ఫిల్మ్ భవన్  లోనే ప్రముఖ జర్నలిస్టు హైదరబాద్ ఫిల్మ్ క్లబ్ కమిటీ మెంబర్ కంబాలపల్లి కృష్ణ రాసిన పుస్తక పరిచయ సభ అనిర్వహించారు.అందులో కూడా పుస్తకం గురించి  వివరంగా మాట్లాడాను. 

ఇక ఎస్.ఆర్.ఆర్.కాలేజీ లో నా ఉద్యోగం రోజులు దగ్గర పడ్డాయి.అప్పుడు ఒక ఆలోచన వచ్చింది.ఇన్ని దశాబ్దాలుగా నేను కొన్నవి, సాహితీ మిత్రులు ఇచ్చినవి, నేను సేకరించినవి 2000 పుస్తకాల్ని కాలేజీ  గ్రంధాలయానికి  ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ప్రిన్సిపాల్ నితిన్ కి చెబితే ఫ్రీగా ఇస్తానంటే వద్దంటానా అన్నాడు.వాటన్నింటి లిస్టు రాసి ఒక పూట కార్యక్రమం ఏర్పాటు చేశాను. కాలేజీ పూర్వ ప్రిన్సిపాల్ బి.రాంచందర్ రావు గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాం.ఆయన ఎంతో ఆదారంగా వచ్చారు.ప్రత్యేక విభాగంలో ఆ పుస్తకాల్ని వుంచుతామని నితిన్ ప్రకటించారు. దాదాపు లక్ష రూపాయల విలువ  కలిగిన ఆ పుస్తకాల ప్రదానం చాలా  తృప్తిని ఇచ్చింది. ఇక ఉద్యోగ విరమణ తేదీకి  ముందే లైబ్రరీ చార్జ్ కూడా ఎవరికయినా ఇవ్వాలన్నారు.నితిన్ ఉర్దూ మేడమ్ ఇస్రత్  సుల్తానా  గారికి ఆ బాధ్యత  అప్పగించారు.ఏవో కొన్ని చూసి పూర్తి స్థాయి గ్రంధాలయ అధికారి రాగానే పూర్తి చేస్తామనే హామీ మీద ఆ తతంగం ముగిసింది. కొంత డబ్బు డిపాజిట్ కూడా చేశాను.

ఇక మా కాలేజీలో అధ్యాపకుల పదవీ విరమణ సభకు కొన్ని పద్దతులు ఏర్పాటయి వున్నాయి. కామర్స్ అధ్యాపకుడు ఆనంద రావు, ప్రిన్సిపాల్ మురలి, యాద కిషన్, పీడీ లక్ష్మీరాజం లాంటి వాళ్ళు ఆ ఆనవాయితీని కొనసాగించారు. అవేమిటంటే కాలేజీలో పెద్ద విందు ఏర్పాటు చేయడం,స్టాఫ్ క్లబ్ సన్మాన విరమణ సభ నిర్వహించడం.కానీ   నేను మా ఇంట్లో వీడ్కోలు విందు ఏర్పాటు చేసి అందరినీ  పిలిచాను. దాదాపు అందరూ వచ్చారు. స్టాఫ్ క్లబ్ నిర్వహణలో సింపుల్ గా జరగాలని కోరుకున్నాను.అట్లే జరిగింది. విరమణ సభ అనగానే అందరూ ఇంద్రుడూ చంద్రుడూ అని పొగడడం అదీ  ఎందుకో నాకిష్టం కాలేదు.అయినా సభలో నా అభీష్టం మేరకు మిత్రులంతా ఆదరంగా క్లుప్తంగా మాట్లాడారు. తర్వాత ఫిల్మ్ భవన్ లో సాహితీ  గౌతమి ఫిల్మ్ సొసైటీ తదితర సంస్థల  నిర్వహణలో కూడా సభ పెట్టారు.

అట్లా  నా 36ఏళ్ల  ఉద్యోగ జీవితం విజయవంతంగా ముగిసింది.

మిగతా వివరాలతో మళ్ళీవారం కలుస్తాను.

సెలవు                                                                                                                                                                           -వారాల ఆనంద్

14 ఏప్రిల్ 2024                                                                                 

                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                        

Posted on

ఏమి జంతువది
+++++++++++++++

ఏమి జంతువది
దాని ఆకలిఎంతకూతీరదు
అసలే తృప్తిచెందదు

దాని పొట్ట పరిమాణాన్ని అదే కొలవలేకున్నది

ఎంత ఆహారం కావాల్నో దానికకే తెలవదు

ఆ సర్వభక్షకుడి పేరేమిటి
భూమి ఇండ్లు వంతెనలు
చెరువులు కుంటలు చెట్లు
నదుల రెండు తీరాలు
అది వేటినీ వదల్లేదు

ఎంతకూ తృప్తి చెందని ఆకలితో వున్న
ఆ జంతువేమీటది

ఎల్లవేళలా ఆకలితోనే వుంటుంది
వార్తా పత్రికల్ని టీవీ ఛానళ్ళనీ
వారిపొలాల్ని పర్వతాల్నీ తోటల్నీ
ప్రజల కలల్నీ
చిరునవ్వుతో మింగేస్తుంది

దాని కుటుంబం మొత్తం
ఆకలితో దొర్లుతుంది

ఏమి జంతువది
ఎంతకూ తృప్తి చెందని ఆకలి దానిది
దాని కడుపులోని ఆకలి దానికే అర్థంకాదు

ప్రమాదకరమయిన దాని ఆకలి అంతం కావాలనీ

దాని కడుపులో వున్న మంట చల్లారాలనీ

అందరూ దాని కోసం ప్రార్థించండి

ఓ నిట్టూర్పు విడిచి
ఇక అందరూ ఉపశమనం పొందనీ
++++
అస్సామీ మూలం & ఆంగ్లానువాదం – నీలిమ్ కుమార్
తెలుగు – వారాల ఆనంద్


‘జ్ఞానం’ కవిత

Posted on

మిత్రులారా! ఈ రోజు ‘నమస్తే తెలంగాణ’ లో అచ్చయిన కవిత చదవండి- ఆనంద్

‘జ్ఞానం’
+++++ వారాల ఆనంద్

ఈ మనిషినెక్కడో చూసాను
చిరపరిచితమయిన ముఖమే
బస్టాండ్లో, మెట్రోలో, ఫుట్ పాత్ పైనా చూసాను
పాతబజార్ గల్లీల్లో లైబ్రరీ పుస్తకాల నడుమా చూసాను

చాలా దగ్గరగానూ దూరంగానూ
దట్టమయిన అడవిలో, విశాల మైదానంలో చూసాను

సురసుర మండే ఎండలో చిటపట కురిసే వానలో
గజ గజ వణికే చలిలో
తడుస్తూనో ముడుచుకునో ఉసూరుమంటూనో వుంటే చూసాను

కానీ మబ్బులు కమ్మిన చంద్రుడిలా
పొగమంచు కమ్ముకున్న రహదారిలా
రూపం స్పష్టంగా కనిపించడం లేదు
ఆ ముఖం అందమయిందా కురూపా

చూసిన మనిషే తెలిసిన ముఖమే
ఎటూ పాలుపోక ఊరంతా తిరిగీ తిరిగీ
ఉసూరుమంటూ ఇల్లు చేరాను
ఎవరతను?
మెదట్లో పురుగు తొలుస్తూనే వుంది

అకస్మాత్తుగా నిలువుటద్దంలోకి చూసాను
అరె నేను చూసిన ముఖమీదే
చిరపరిచితమయిన మనిషితనే

నన్ను నేను తెలుసుకున్నా
నాలాంటివాళ్లూ అర్థమయ్యారు

పొరలు పొరలుగా తెరలుగా
‘జ్ఞానం’ వికసించింది

******************** 24-03-2024